గోదావరి సీమపై ముళ్ళపూడి సంతకం | Today Mullapudi Venkata Ramana 88th Birthday | Sakshi
Sakshi News home page

గోదావరి సీమపై ముళ్ళపూడి సంతకం

Published Fri, Jun 28 2019 12:34 PM | Last Updated on Fri, Jun 28 2019 12:44 PM

Today Mullapudi Venkata Ramana 88th Birthday - Sakshi

ముళ్లపూడి వెంకటరమణ

ముళ్లపూడి వెంకటరమణ.. ఈ పేరు తెలియని ఆంధ్రుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఈ పేరు స్ఫురణకు వచ్చిన వెంటనే బుడుగు గుర్తొస్తాడు.. ఆ వెంటనే ఆయన కలం నుంచి జనించిన పాత్రలు ఇంకొన్ని కళ్లముందు కదలాడతాయి. ఆ పాత్రల నైజాలు గుర్తొచ్చి పెదవులపై చిరునవ్వు కదలాడని పాఠకులు ఉండరనేది నిర్వివాదాంశం.

సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పు గోదావరి) : ముళ్లపూడి వెంకటరమణ 1931లో ధవళేశ్వరంలో జన్మించారు. ఊహ తెలిసీ తెలియని వయసులోనే తండ్రిని కోల్పోయారాయన. ధవళేశ్వరం ఆనకట్టలో తండ్రి క్యాష్‌ కీపర్‌. తండ్రి గతించాక, ఉదరపోషణార్థం తల్లి ధవళేశ్వరం నుంచి మద్రాసు మహానగరానికి మకాం మార్చారు. అక్కడ ఒక ఇంటిలో మెట్ల కింద చిన్న గదిలో అద్దెకు నివాసం ఏర్పాటుచేసుకున్నారు. తల్లి విస్తరాకులు (అడ్డాకులు) కుట్టి కిరాణా దుకాణానికి అమ్మిన రోజులు, ప్రింటింగ్‌ ప్రెస్‌లో కంపోజింగ్‌ చేసిన రోజులు ఉన్నాయి. ‘మా అమ్మ నాకు జన్మరీత్యా అమ్మ. జీవితం రీత్యా ఫ్రెండు, గురువు, భయం లేకుండా బతకడం నేర్పిన గురువు, తెచ్చుటలో కన్నా, ఇచ్చుటలో ఉన్నహాయిని చూపిన దైవం’ అని తన స్వీయచరిత్ర కోతికొమ్మచ్చిలో రాసుకున్నారు రమణ. మద్రాసు వెళ్లాక, మధ్యలో రెండేళ్లు రాజమహేంద్రవరం, ఇన్నీసుపేటలోని వీరేశలింగం ఆస్తిక పాఠశాలలో సెకెండ్‌ ఫారం, థర్డు ఫారం (ఆధునిక పరిభాషలో 7, 8 తరగతులు) చదివినా, తుది శ్వాస వదిలేవరకు ముళ్లపూడి కావేరి నీళ్లనే సేవించారు.

అయితే, ఆయన ధ్యాస, శ్వాస, యాస గోదావరి మాండలికమే. ఆయన రచనల్లో కనిపించే బుడుగు, సీగాన పెసూనాంబ, రెండు జెళ్లసీత, అప్పారావు, లావుపాటి పక్కింటి పిన్నిగారి మొగుడు (అంటే మొగుడు లావని కాదు, పిన్నగారే లావు).. అందరూ గోదావరి మాండలికమే మాట్లాడారు. సినిమాల్లో ఆమ్యామ్యా రామలింగాలు, ‘తీతా’లు (తీసేసిన తాసిల్దార్లు) అచ్చంగా ఇక్కడి మనుషులే! గోదావరి ‘మా ఫిలిం స్టూడియో’ అని ప్రకటించుకున్న ముళ్లపూడి నేస్తం బాపుతో కలసి తీసిన సినిమాలు అన్నీ ఆ గోదారమ్మ ఒడిలోనే పురుడు పోసుకున్నాయి. సినీ రచన చేయడానికి గోదావరిపై లాంచి మాట్లాడుకుని, భద్రాద్రి రాముడి దర్శనం చేసుకోవడానికి వెడుతూ ఆ రచన పూర్తి చేసేవారు.

పాత్రికేయుడిగా ఉద్యోగపర్వం ప్రారంభం
ఎస్సెస్సెల్సీ వరకు చదివిన రమణ నాటి అగ్రశ్రేణి పత్రిక ఆంధ్రపత్రికలో సబ్‌ ఎడిటర్‌గా ఉద్యోగరంగ ప్రవేశం చేశారు. ఆయనలో రచయిత అదే సమయంలో కన్ను తెరిచాడు. వందలాది కథలు, రాజకీయ భేతాళ పంచవింశతి లాంటి రాజకీయ వ్యంగ్యాస్త్రాల రచనలు, విక్రమార్కుడి మార్కు సింహాసనం వంటి సినీరంగ ధోరణులపై విసుర్లు, ఋణానందలహరితో అప్పారావు పాత్రను పరిచయం చేయడం, చిచ్చరపిడుగులాంటి బుడుగు రచన.. అన్నీ ఈ దశలోనే జరిగాయి.

సినీరంగానికి మలుపు..
ఆంధ్రపత్రికలో సినిమా వార్తలు రాస్తున్న సమయంలో రమణ సమీక్షలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. అక్కినేని వంటి అగ్రనటులు, ఆత్రేయ వంటి రచయితలు, నాగిరెడ్డి చక్రపాణి వంటి నిర్మాతలు రమణ సినీ సమీక్షలను ఆసక్తికరంగా చదివేవారు. సినీ నిర్మాత డీబీ నారాయణ తాను తీస్తున్న దాగుడు మూతలు సినిమాకు రచన చేయమని ముళ్లపూడిని కోరారు. చాలాకాలం తప్పించుకు తిరిగిన రమణ ఎట్టకేలకు అంగీకరించారు. అయితే, దాగుడుమూతలు షూటింగ్‌ కారణాంతరాల వల్ల లేటు కావడంతో, డూండీ ఎన్టీ రామారావుతో నిర్మించిన రక్త సంబంధం ఆయనకు మొదటి సినీ రచన అయింది. రెండో సినిమా కూడా ఎనీఆ్టర్‌ నటించిన గుడిగంటలు, మూడో సినిమా అక్కినేని నటించిన క్లాసిక్‌ మూగమనసులు.. మూడూ సూపర్‌ హిట్‌ సినిమాలే కావడంతో రమణ సినీ జీవితం ఊపందుకుంది. సొంతంగా సినిమాలు కూడా నిర్మించారు.

సాక్షి, బంగారుపిచుక, బుద్ధిమంతుడు, అందాలరాముడు, గోరంతదీపం, ముత్యాలముగ్గు, సీతాకల్యాణం, సంపూర్ణ రామాయణం, పెళ్ళి పుస్తకం.. కొన్ని హిట్లు మరికొన్ని ఫట్లు అయినా, రెంటినీ సమానంగా భావించే స్థితప్రజ్ఞుడు ఆయన.. నాటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు కోరికపై విద్యార్థులకు వీడియో పాఠాలు తీశారు. రామాయణాన్ని అమితంగా ప్రేమించే రమణ చివరి రచన కూడా శ్రీరామరాజ్యం కావడం, ఆయన జీవితకాల నేస్తం బాపు తుది క్షణంలో ఆయన పక్కనే ఉండడం చెప్పుకో తగ్గ అంశాలు. 2011 ఫిబ్రవరి 24న చెన్నయ్‌లో రమణ కన్ను మూశారు. పుట్టిన గడ్డతో రమణ చివరివరకు ఎందరో ప్రముఖులతో అనుబంధాలు పంచుకున్నారు. మచ్చుకు కొందరి అంతరంగాలు పరికిద్దామా.. ముళ్లపూడి వెంకట రమణ చదువుకున్న పాఠశాలలో, ఆయన 88వ జయంత్యుత్సవం శుక్రవారం ఉదయం 10 గంటలకు కళాగౌతమి, తెలుగు సారస్వత పరిషత్‌ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతుంది. 

ఈనాటికీ బాపు, రమణల కుటుంబాలతో అనుబంధాలు
‘హాస్యమందు అరుణ– అందె వేసిన కరుణ–బుడుగు వెంకట రమణ–ఓ కూనలమ్మా! అని ఆరుద్ర రమణని గురించి తన కవితలో పేర్కొన్నారు. బాపు, రమణలతో నాకు పరిచయం కలగడం, వారి కుటుంబాలతో నేటికీ సంబంధ బాంధవ్యాలు ఉండడం నా అదృష్టంగా భావిస్తాను. ఓ సారి ఆయన పుట్టినరోజుకు శుభాకాంక్షలు గీసి పంపితే, ఆయన జవాబు రాస్తూ, బాపు సంతకం కూడా ఆయనే చేసి, ఆథరైజ్డు ఫోర్జరీ అని రాశారు! అన్నట్టు ఋణానందలహరిలో ఆయన కథానాయకుడి పేరు (అప్పారావు), నా పేరు ఒక్కటే కావడం ఆదో విచిత్రం!
– ఎంవీ అప్పారావు (సురేఖ) కార్టూనిస్టు



నన్ను ‘కందుల హాయీ’ అనే వారు.
బాపు అనారోగ్యానికి వైద్య నిమిత్తం ముళ్లపూడి రాజమహేంద్రవరం వచ్చారు. ఆయనకు సుమారు రెండు దశాబ్దాలుగా షుగరు వ్యాధి ఉండేది. సహవైద్యులు నా పేరు సూచించారు. మా ఇద్దరి మధ్య కేవలం డాక్టరు, పేషంట్ల సంబంధంగా ఉండేది కాదు. నాకు ఆయన పుస్తకాలు పంపేవారు. ఫోనులో తరచూ మాట్లాడుకునేవాళ్లం. ఓ సారి నా మీద ఇలా కవిత రాసి పంపారు..
‘మందొద్దంటూ చాల, ప–సందులు మింగించి, నన్ను సరిజేసి, తిరిగీ మందును పసందును చేసిన కందుల ‘శ్రీహాయిగార్కి’ వందన శతముల్‌’   – రమణ (మే 2006)
ఎప్పుడైనా విమానాశ్రయానికి ఆయన్ను తీసుకురావడానికి వెడితే, ఆయన ఓ మూల కుర్చీలో కూర్చుని ఉండేవారు. బాపులాగా నాకు కూడా ‘జనగండం’ ఉందని చమత్కరించేవారు.
– డాక్టర్‌ కందుల సాయి,  డయాబెటిక్‌ కేర్, రాజమహేంద్రవరం

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

బాపు, రమణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement