bapu
-
సహజంగా కనిపించే అవకాశం దక్కింది: బ్రహ్మాజీ
‘‘బాపు’ చాలా యునిక్ కాన్సెప్ట్. రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంటుంది. అప్పుల బాధతో నా పాత్ర ఆత్మహత్యకి ప్రయత్నించినప్పుడు ఏమవుతుంది? అనేది ఈ సినిమాలో చూడాలి. ఈ చిత్రం ఫైనల్ కాపీ చూశాను... చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది’’ అని బ్రహ్మాజీ అన్నారు. దయా దర్శకత్వంలో బ్రహ్మాజీ, ఆమని, ‘బలగం’ సుధాకర్ రెడ్డి, ధన్యా బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బాపు’.రాజు, సీహెచ్ భానుప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ– ‘‘రెండేళ్ల క్రితం దయా ‘బాపు’ కథ చెప్పారు. పాయింట్ చాలా కొత్తగా, నా పాత్ర వైవిధ్యంగా ఉండటంతో పాటు సహజంగా కనిపించే అవకాశం ఉండటంతో ఒప్పుకున్నాను. అయితే బడ్జెట్‌పై చర్చ జరుగుతున్నప్పుడు.. నాకు పారితోషికం వద్దు... విడుదల తర్వాత లాభాలు వస్తే ఇవ్వమని నిర్మాతలకు చెప్పాను. నా తర్వాత ఇతర నటీనటులు కూడా పారితోషికం తగ్గించడం, లొకేషన్లో క్యారవ్యాన్స్ వాడకుండా చిత్రీకరణ జరిపిన ఊర్లో (కరీంనగర్) ఉంటూ సర్దుకుపోవడంతో ఈ మూవీ పూర్తి చేశాం.కథపై ఇష్టం, సినిమాపై నమ్మకంతోనే ఇది సాధ్యపడింది. ఆమనిగారు సహజ నటి. ‘బాపు’ టైటిల్ రోల్లో సుధాకర్ రెడ్డిగారి పాత్రతో ఆడియన్స్ చాలా కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలోని రెండు పాటలు బాగా పాపులర్ అయ్యాయి. డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటిగారికి మా సినిమా చాలా నచ్చింది. ఇక ‘సూపర్ డీలక్స్’ సినిమాలో విజయ్ సేతుపతిగారు చేసినటువంటి పాత్ర చేయాలన్నది నా కల. ప్రస్తుతం చిరంజీవిగారి ‘విశ్వంభర’లో ఓ పాత్ర చేశాను. సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’తో పాటు తరుణ్ భాస్కర్, రాజ్ తరుణ్ వంటి వారి సినిమాల్లో నటిస్తున్నాను’’ అని తెలిపారు. -
బాపు ట్రైలర్ సినిమాపై ఆసక్తి కలిగించింది – నాగ్ అశ్విన్
‘‘బాపు’ ట్రైలర్ చాలా బాగుంది. ఈ చిత్రంపై క్యూరియాసిటీ కలిగించింది. సినిమా టాక్ బాగుంటే మన తెలుగు ఆడియన్స్ సెకండ్ డే నుంచి హౌస్‌ఫుల్ చేస్తారు. ఇది చాలా మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’ అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నారు. బ్రహ్మాజీ లీడ్ రోల్లో దయా దర్శకత్వం వహించిన చిత్రం ‘బాపు’. ఆమని, ‘బలగం’ సుధాకర్ రెడ్డి, అవసరాల శ్రీనివాస్, ధన్యా బాలకృష్ణ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. రాజు, సీహెచ్ భానుప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ రేపు విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, చందు మొండేటి, బుచ్చిబాబు సాన, హీరో సత్యదేవ్, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘ఈ మూవీ ట్రైలర్లో రా ఎమోషన్ కనిపిస్తోంది’’ అన్నారు. ‘‘పెద్ద సినిమా, చిన్న సినిమా అని ఉండదు. మంచి సినిమా ఏదైనా పెద్ద చిత్రమే’’ అని చందు మొండేటి చె΄్పారు. ‘‘ఈ సినిమాని దయాగారు చాలా బాగా తీశారు’’ అన్నారు బుచ్చిబాబు సానా. ‘‘ఈ చిత్రంలో మంచి పాత్ర చేశాను’’ అని బ్రహ్మాజీ తెలిపారు. ‘‘కిస్మత్’ తర్వాత ‘బాపు’ నా రెండో సినిమా’’ అన్నారు భానుప్రసాద్ రెడ్డి. ‘‘మా సినిమాని ప్రేక్షకులు పెద్ద హిట్ చేయాలి’’ అని పేర్కొన్నారు దయా. -
నాన్నా.. చరణ్ సినిమాకు అలా అడగాల్సిన పనిలేదు: బుచ్చిబాబు
ఉప్పెన(2021) సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు(Buchi Babu Sana). తొలి సినిమాతోనే రూ.100 కోట్లుకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించాడు. అయితే ఈ సినిమా రిలీజై నాలుగేళ్లు అవుతున్నా.. బుచ్చిబాబు నుంచి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్(Ram Charan)తో సినిమా చేస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. రామ్ చరణ్ కెరీర్లో ఇది 16వ సినిమా(RC16). ఇటీవల విడుదలైన గేమ్ ఛేంజర్ చిత్రం డిజాస్టర్ కావడంతో మెగా ఫ్యాన్స్ అంతా బుచ్చి బాబు సినిమాపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. తమ హీరోకి ఎలాగైనా బ్లాక్ బస్టర్ అందించాలని కోరుతున్నారు. ఫ్యాన్స్ ఊహించినదానికంటే ఎక్కువ హిట్టే అందిస్తానని చెబుతున్నాడు బుచ్చిబాబు. తాజాగా ఓ ఈవెంట్ రామ్ చరణ్ సినిమాపై బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.బ్రహ్మాజీ ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘బాపు’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన బుచ్చిబాబు మాట్లాడుతూ..‘మా నాన్న రైతు. చాలా కష్టపడి మమ్మల్ని పెంచాడు. వ్యవసాయం గురించి మా నాన్న నాతో ఓ మాట చెప్పాడు. ‘పేకాట ఆడితే డబ్బులు మనకో లేదా పక్కోడికో వస్తాయిరా..కానీ వ్యవసాయం చేస్తే ఎవడికి వస్తాయో తెలియదు..అంతా పోతాయి’ అని అనేవాడు. నిజంగానే ఏడాదంతా కష్టపడితే ఏకరం మీద రైతుకు మిగిలేది కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే. ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది’ అని బుచ్చిబాబు అన్నారు. అలాగే తన నాన్న గురించి మాట్లాడుతూ..‘ఉప్పెన రిలీజ్ సమయంలో మా నాన్న థియేటర్ బయటే నిలబడి ‘సినిమా బాగుందా’ అని వచ్చిన వారందరినీ అడిగేవాడట. ఆయన సినిమా కూడా చూడకుండా థియేటర్‌కు వచ్చిన వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆయన మా నుంచి బౌతికంగా దూరమై ఏడాది అవుతోంది. ప్రస్తుతం నేను చరణ్‌తో తీస్తున్న సినిమా బాగుందా అని ఎవరినీ అడగాల్సిన పని లేదు నాన్నా.. అది కచ్చతంగా హిట్ అవుతుంది’ అని బుచ్చిబాబు ఎమోషనల్‌గా చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. -
బాపు అరుదైన సినిమా: రానా దగ్గుబాటి
రెగ్యులర్‌కి భిన్నంగా ఉండే ‘బాపు’లాంటి సినిమాలు రావడం చాలా అరుదు. ఒక సంస్కృతిని చూపించే ఇలాంటి చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకుల్లా నేను కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’’ అని హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati ) అన్నారు. బ్రహ్మాజీ(Brahmaji) లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘బాపు’(Bapu). దయా దర్శకత్వంలో కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రాజు, సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది.హైదరాబాద్‌లో నిర్వహించిన ‘బాపు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి రానా దగ్గుబాటి, నటుడు తిరువీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరువీర్ మాట్లాడుతూ– ‘‘బాపు’ ట్రైలర్లో మట్టివాసన కనిపించింది. దయాగారు చాలా మంచి సినిమా తీశారు’’ అన్నారు. ‘‘మన కుటుంబంలోని పాత్రలు ఈ సినిమాలో కనిపిస్తాయి.ఈ మూవీని అందరం ్రపోత్సహిద్దాం’’ అని దర్శక–నిర్మాత ‘మధుర’ శ్రీధర్ పేర్కొన్నారు. ‘‘బాపు’ మంచి కంటెంట్ ఉన్న సినిమా. ఈ చిత్రానికి మంచి పేరు రావాలి’’ అన్నారు బ్రహ్మాజీ. ‘‘మా చిత్రాన్ని అందరూ థియేటర్స్‌లో చూడాలి’’ అని దయా కోరారు. ‘‘నా కెరీర్లో చాలా ప్రత్యేకమైన సినిమా ‘బాపు’’ అన్నారు సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్. -
బ్రహ్మాజీ 'బాపు' ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
బాపులాంటి మూవీని సపోర్ట్ చేయాలి: విశ్వక్ సేన్
‘‘బాపు’ టీజర్(Bapu teaser) చాలా బాగుంది. నిజాయతీగా తీసిన సినిమా ఇది... మంచి విజయం సాధిస్తుంది. ఇలాంటి చిత్రం సక్సెస్ అయితేనే మేకర్స్‌కు ఉత్సాహం వస్తుంది. అలాగే ఇలాంటి సినిమాలు చేయాలనుకునే మిగతావాళ్లకు కూడా ధైర్యం వస్తుంది’’ అన్నారు హీరో విశ్వక్ సేన్(vishwaksen). బ్రహ్మాజీ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘బాపు’. ‘ఎ ఫాదర్స్ సూసైడ్ స్టోరీ’ అనేది ట్యాగ్‌లైన్. ‘బలగం’ సుధాకర్ రెడ్డి, ఆమని, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.దయ దర్శకత్వంలో రాజు, సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు విశ్వక్ సేన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మధుర ఆడియో ద్వారా ఈ సినిమాను విడుదల చేస్తున్న నిర్మాత ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాలకు ప్రేక్షకులు రావడంలేదని చాలామంది అన్నారు.కానీ, ‘పెళ్లి చూపులు, కేరాఫ్ కంచెరపాలెం’ సినిమాలకు ఎలా వచ్చారో... ‘బాపు’కి కూడా అలానే వస్తారనే గట్టి నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు. ‘‘టీజర్‌ని మించి సినిమా చాలా బాగుంటుంది’’ అని చెప్పారు దయ. ‘‘ఒక డిఫరెంట్ స్టోరీతో యూనిట్ అంతా మంచి సినిమా చేశాం’’ అన్నారు బ్రహ్మాజీ. -
Bapu: బాపుయగుట దుష్కరమ్ము సుమ్ము
‘నేనయితే కింద సంతకం లేకపోయినా సరే! బాపు బొమ్మని గుర్తుపడతాను’ అని కొంతమంది అమాయకంగా అమాయకమై పోతుంటారు. అలా అవనవసరం లేదు. రేఖ పండిన చిత్రకారులకి సంతకం అవసరం లేదు. వారి బొమ్మే సంతకం అవుతుంది. మరి బాపు గొప్పతనమంతా సంతకంలో కాక మరెక్కడుంది అని మీరెవరైనా అడిగితే నేను ఇలా చెబుతాను. అనగనగా అనేక కథలు మన సాహిత్యానికి ఉన్నాయి. ఒకానొక బంగారు కాలంలో ఆ కథలన్నిటికీ అరచేయంత కొలత దగ్గరి నుండి, రెండు పేజీల వరకు వ్యాపించిన డబుల్ డమ్మీ ఇలస్ట్రేషన్లను బాపు బొమ్మలు కట్టేరు. తన క్రియేటివిటీతో సమకాలీన తెలుగు సాహిత్యాన్ని అమరం చేశారు. కన్యాశుల్కంలో గిరీశం వెంకటేశాన్ని అడుగుతాడు ‘ఏమి వాయ్! క్రియేషన్ అనగానేమీ?’ దానికి వెంకటేశం ఏమి చెప్పాడో మీ అందరికీ తెలిసిందే. ఈ రోజు మాత్రం నేను చెప్పేది వినండి. క్రియేషన్ అనగా తెల్లని కాగితంపై మూడు అక్షరాల నల్లని అచ్చుగా మాత్రమే ఉండిన గిరీశం అనే ఒక పేరుకి ‘ఇదిగో ఇంత ఎత్తు, ఇది నుదురు, ఇలా పంచె అని కట్టి, చేతిలో చుట్ట పెట్టి మన మెవ్వరమూ ఎప్పటికీ ఊహించలేని ఒక ఊహకు రూపం ఇచ్చి మనకు పరిచయం చేయడమన్నది బాపు చేసిన క్రియేషన్. గిరీశం కానీ, మధురవాణి కానీ, సౌజన్యరావు పంతులు కానీ, బుచ్చమ్మ కానీ ఇలా ఉంటారు అని ఆ గురజాడ అప్పారావు తమ పుస్తకంలో ఎక్కడా వర్ణన చేయలేదు. కానీ బాపు వారందరికీ ఒక రంగూ, ఒక రూపం, ఒక లక్షణం, ఒక ధోరణి, ఒక రీతి ఇచ్చి వారిని బొమ్మలుగా మలిచి మనకు మప్పారు. ఒకసారి బాపు బొమ్మల్లో వారిని చూశాక... వారు అలా కాక మరి ఇంకోలా ఉండటానికి మన ఇమాజినేషన్లో కుదరదు. బాపు బొమ్మ అంటే ఒక సంతకం కాదు. పేరు కాదు. కాసింత కాగితం, కలం మాత్రమే కలిసి దిద్దిన కల్పన కాదు. అంత కాక మరెంత? అనడిగితే, అదీ చెబుతా. తొంబైల నాటి తరం మాది. మేము చదువుకున్న కథా సాహిత్యమంతా కొకు కథా సంపుటాలు, శ్రీపాద కథా సంపుటాలు, రావిశాస్త్రి కథా సంపు టాలు. మా తరానికి ఆ కథలు తొలినాళ్లల్లో అచ్చ యిన ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, యువ, జ్యోతి లాంటి అనేకానేక పుస్తక పుటలు తిరగేయడం కుదరలేదు. తరవాత్తరువాత ఆ పాత పుస్తకాలు, అందులో వాటికి వేసిన బొమ్మలు చూసే అవకాశం దొరికినపుడు, ఒకోసారి ఇంటర్నెట్లో పైన కథ పేరు కూడా లేని చాలా బాపు బొమ్మలను చూసినపుడు... నా కళ్ళకు కనపడింది బొమ్మ కాదు అచ్చంగా కథలే. చలపతి, దాసూ పూర్వాశ్రమంలో సహధ్యాయులు, వారిద్దరి మధ్య పెద్ద స్నేహమేం ఏర్పడలేదు. చదువుల అనంతరం ఎన్నో ఏళ్ళ తరువాత అనుకోకుండా చలపతికి దాసు కనపడతాడు. చలపతికి పెళ్ళి కావాల్సిన రాజ్యం అనే చెల్లెలు ఉంది. చలపతి దాసూని ఇంటికి ఆహ్వానిస్తాడు. ఇంట్లో చలపతి, అతని భార్య, వారి ఇద్దరు పిల్లలు, రాజ్యం ఉంటారు. అ చదువుకున్న మధ్యతరగతి ఇల్లు, ఈ దంపతులు, ఆ పిల్లలు, వంటగదిలోంచి రెండు లోటాలతో కాఫీ తెస్తున్న రాజ్యం, కుర్చీలో కూచుని బుగ్గన సొట్టతో నవ్వుతున్న దాసు. ఈ బొమ్మని, వీటితో పాటూ అదే కథకు బాపు చిత్రించిన మరికొన్ని బొమ్మలని చూసిన నాకు ఒక్కసారిగా ఆ కథ మొత్తం నోటికి తగిలింది. బొమ్మ బొమ్మలో వెంకమ్మ, భాగ్యమ్మ, గోపీ, సత్యం అనే అందరినీ గుర్తు పట్టగలిగాను. ఈ కథే కాదు. బాపు వేసిన ఎన్నో బొమ్మల్లో ఆ కథలనూ, అందులోని మనుష్యులనూ గుర్తుపట్టి థ్రిల్లవుతూ వారిని చేయి పట్టి ఊపి షేక్ హాండ్ ఇచ్చిన అనుభవాలు నాకు కొల్లలు. (చదవండి: ఆత్మ గలవాడి కథ.. ఆయన మరణం కూడా చడీ చప్పుడు లేకుండా..) దీనిని మించిన మరో అద్భుత సంఘటనను మీకు చెబుతా. భారత దేశానికి గాలిబ్ కవితా, తాజమహలూ మరవరాని అందాలు అని ఒక మహానుభావుడు అన్నాడుట. మరి గాలిబ్ కవితకు ఏమిటి అందం? ఏ చేతులది చందం? అని వెదుక్కుంటూ బంగారం వంటి కవి దాశరథి, గొప్ప పబ్లిషర్ ఎంఎన్ రావు బాపును కలిశారు, ఆయనకు గాలిబ్ గీతాల అనువాదం ఇచ్చారు. వాటన్నిటికీ బాపు బొమ్మలు వేశారు. ఆ తరువాత ఆ పుస్తకం సాధించిన ఘన కీర్తి, తెలుగు వారి హృదయాలలో సంపాదించుకున్న సుస్థిర యశస్సు అందరికీ తెలిసినదే. అయితే చాలా మందికి తెలియని ఒక గొప్ప విషయం, బాపు బొమ్మకే అందిన అందలం ఏమిటంటే, దాశరథి గాలిబ్ గీతాల తెలుగు అనువాదం పుచ్చుకుని ఒక్క తెలుగు అక్షరం కూడా ఎరుగని ఎక్కడెక్కడి ఉర్దూ కవులూ కేవలం బాపు బొమ్మల్ని చూసి గాలిబ్ ఉరుదూ మూలం చదివేవారుట. ఇంతకూ చెప్పదలుచుకున్నదేమిటంటే... ‘ప్రతిది సులభముగా సాధ్యపడదు లెమ్ము, మరియొకడు బాపుయగుట ఎంతో దుష్కరమ్ము సుమ్ము.’ – అన్వర్ (డిసెంబర్ 16న బాపు జయంతి; తెలుగు యూనివర్సిటీలో బాపు–రమణ పురస్కారాల ప్రదానం) -
గాంధీజీ భక్తురాలు మీరాబెన్
మీరాబెన్ భారతీయురాలు కారు. ఆమె పేరు కూడా మీరాబెన్ కాదు. ఆమె అసలు పేరు మెడిలియన్ స్లేడ్. బ్రిటన్ దేశస్థురాలు. బ్రిటిష్ సైన్యాధిపతి సర్. ఎడ్మిరల్ స్లేడ్ కుమార్తె. మహాత్మాగాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై భారత స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీతో కలిసి పనిచేయడానికి తన దేశాన్ని, ఇంటిని వదిలి వచ్చిన మానవతావాది. ఆమె పేరు మార్చింది గాంధీజీనే! శ్రీకృష్ణపరమాత్ముని భక్తురాలైన మీరాబాయ్ పేరునే ఆయన ఆమెకు పెట్టారు. మీరాబాయ్ క్రమంగా మీరాబెన్ అయ్యారు. ఆమె 1925 నవంబరు 7న భారతదేశంలో అడుగు పెట్టారు. ఆరోజు మహదేవ్ దేశాయ్, వల్లభాయ్ పటేల్, స్వామీ ఆనంద్ ఆమెకు ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఆ తర్వాత మీరాబెన్ 34 ఏళ్లు పాటు భారతదేశంలోనే ఉండిపోయారు. హిందీ నేర్చుకున్నారు. 1931లో లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీ, ఇతర ప్రముఖులతో పాటు మీరాబెన్ కూడా హాజరయ్యారు. లండన్ నుండి వచ్చాక, ఇండియాలో తిరిగి ప్రారంభమైన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. ఫలితంగా 1932–33లో జైలు జీవితం గడిపారు. అనంతర కాలంలో మీరాబెన్ గాంధీతో పాటు 1942 నుండి 1944 వరకూ పుణేలోని ఆగాఖాన్ ప్యాలెస్‌లో నిర్భంధంలో ఉన్నారు. ఆ జైల్లోనే ఆమె మహాదేవ్ దేశాయ్, కస్తూరీబాయ్ మరణాలు చూసి చలించిపోయారు. అంతేకాదు. ఆ రోజుల్లో జరిగిన ప్రతి సన్నివేశాన్నీ కళ్లారా చూసిన ప్రత్యక్షసాక్షి మీరాయే. చివరికి గాంధీజీ అంతిమ యాత్రలో కూడా మీరా సాక్షీభూతురాలై నిలిచారు. ఆగాఖాన్ ప్యాలెస్ నుండి విడుదలయిన తర్వాత గాంధీజీ అనుమతితో మీరాబెన్ రూర్కీలో కిసాన్ ఆశ్రమాన్ని స్థాపించారు. ఈ ఆశ్రమ నిర్మాణానికి గ్రామీణులు పెద్ద ఎత్తున స్థలాన్ని సమకూర్చారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఋషికేశ్‌లో పశులోక్ ఆశ్రమాన్ని స్థాపించి, ఆ ప్రాంతానికి బాపూ గ్రామ్ అనే పేరుని పెట్టారు. అలాగే 1952లో భిలాంగనలో గోపాల్ ఆశ్రమం కూడా స్థాపించారు. ఆ ఆశ్రమంలోనే గడుపుతూ పాల సరఫరా, వ్యవసాయంలో పరిశోధనలు చేస్తుండేవారు. అలాగే ఒకొక్కసారి కశ్మీర్ వెళ్లి కొంతకాలం గడిపి వచ్చేవారు. ఆ రోజుల్లోనే ‘సమ్‌థింగ్ రాంగ్ ఇన్ ది హిమాలయ’ అనే పుస్తకాన్ని కూడా ప్రచురించారు. మనదేశానికి ఇంత సేవచేసిన మీరాబెన్ 1959లో తిరిగి ఇంగ్లండ్ వెళ్లిపోయారు. 1960లో ఆస్ట్రేలియాలో, తర్వాత 22 ఏళ్ల పాటు వియన్నాలో గడిపారు. 1982లో మరణించారు. భారత ప్రభుత్వం 1981లో మీరాబెన్‌ను భారతీయ పౌరురాలుగా పరిగణించి, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పద్మవిభూషణ్ అవార్డుతో గౌరవించింది. (చదవండి: మహోజ్వల భారతి: నూరేళ్ల రావి చెట్టు) -
అది మనందరి బాధ్యత – పాటల రచయిత తైదల బాపు
‘‘ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. నా బర్త్‌డే సందర్భంగా నా మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు మంచిర్యాల జిల్లాలో 2022 మొక్కలు నాటుతున్నందుకు హ్యాపీ’’ అని పాటల రచయిత తైదల బాపు అన్నారు. నేడు తన బర్త్ డే సందర్భంగా తైదల బాపు మాట్లాడుతూ– ‘‘విద్యార్థి దశ నుంచే పాటలు రాసేవాణ్ణి. 1998లో హైదరాబాద్‌కు వచ్చి ‘వందేమాతరం’ శ్రీనివాస్‌గారికి నా పాటలు వినిపిస్తే, బాగున్నాయన్నారు. (చదవండి: దుబాయ్‌కు వెళ్లిన మహేశ్ బాబు.. అందుకోసమేనా ?) దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డిగారి ‘6 టీన్స్’ చిత్రంతో గాయకుడిగా పరిచయమయ్యాను. ఆ తర్వాత ‘గర్ల్‌ఫ్రెండ్’, ‘ఇదే నా మొదటి ప్రేమలేఖ’, ‘అధినేత’, ‘ఆచారి అమెరికా యాత్ర’ ఇలా దాదాపు 236 సినిమాల్లో 500లకి పైగా పాటలు రాశాను. 2019లో ‘జాతీయ కళారత్న’ అవార్డును అందుకున్నాను. రచయితల సంఘం రజతోత్సవంలో చిరంజీవి, రాఘవేంద్రరావుగార్ల చేతులమీదుగా విశిష్ట రచనా పురస్కారం అందుకున్నాను. రాబోయే రోజుల్లో ప్రొడక్షన్లోకి అడుగుపెట్టాలనుకుంటున్నాను’’ అన్నారు. -
చక్కని బొమ్మల చుక్కాని
ప్రపంచంలోని తెలుగువారు ఏమూలన ఉన్నా ఇది బాపు గారి బొమ్మ అనేలా గర్వంగా చెప్పుకొనేలా సంతకం అక్కరలేని విలక్షణమైన శైలి కలిగిన చిత్రకారులు మన బాపుగారు. కార్టూనిస్టుగా, చిత్రకారుడిగా, దర్శకుడిగా పదహారణాల తెలుగుదనానికి రూపునిచ్చిన బాపు 1933, డిసెంబరు 15న వేణుగోపాలరావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సమీపంలోని కంతేరు గ్రామం ఆయన స్వస్థలం. అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. జాతీయోద్యమ రోజుల్లో జన్మించిన వారి అబ్బాయిని, మహాత్ముడి స్ఫూర్తితో తల్లి తండ్రులు ‘బాపు’ అని ముద్దుగా పిలుచుకొనేవారు. బాపు, రమణ రెండు పదాలు తెలుగువారికి విడదీయలేని జంట పదాలు. 1945లో చిన్నారుల కొరకు ముద్రించే బాల పత్రికలో ముళ్లపూడి రమణ తొలి రచన ‘అమ్మ మాట వినకపోతే’, బాపు తొలి చిత్రం ‘వెన్న చిలుకుతున్న బాలిక’ రెండూ అచ్చయ్యాయి. అలా మొదలైన వారి రాత–గీత, బంధం–స్నేహం, దేహాలే వేరు ప్రాణం ఒక్కటే అనేలా దశాబ్దాలపాటు కొనసాగింది. 1945 నుండి బాపు చిత్రాలను, వ్యంగ్యచిత్రాలను, పుస్తకాల, పత్రికల ముఖచిత్రాలను, కథలకు బొమ్మలను లెక్కకుమించి వేశారు. ఆయన సుమారు లక్షా యాభై వేలకు పైగా చిత్రాలు వేయగా అందులో నేడు 75 వేల బొమ్మలు మాత్రమే మనుగడలో ఉన్నాయి. ఆయన చేతిరాతే ఒక ఫాంట్‌గా రూపుదిద్దుకోవడం విశేషం. ఇతిహాసాల నుండి రోజు వారి జీవితాల వరకూ ఆయన బొమ్మల్లో అనువణువునా ప్రతిఫలించే తెలుగు సంస్కృతులు, తెలుగు సంప్రదాయాలు, తెలుగు జీవితాలు, తెలుగు సౌందర్యాలే వారికి తెలుగుపై ఉన్న మమకారానికి నిదర్శనాలు. కాబోయే కోడలు బాపు బొమ్మలా ఉండాలని కోరుకొని అత్తామామలుండరు అనేలా ఆయన బొమ్మలు ప్రతి తెలుగువారింట్లో దర్శనమిస్తూనే ఉంటాయి. తన సినీ రంగప్రవేశం 1967లో సాక్షితో మొదలై 2011లో శ్రీ రామరాజ్యం వరకూ తెలుగు, తమిళం, హిందీ బాషల్లో మొత్తం 51 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన వెండి తెరపై మరపురాని వైవిధ్యమైన దృశ్య కావ్యాలను సృష్టించారు. అందులో బాపు సృష్ఠించిన అద్భుత దృశ్యకావ్యం సంపూర్ణ రామాయణం, మరో అద్భుత చిత్ర కావ్యం ముత్యాల ముగ్గు. ఆరు నంది అవార్డులు, మూడు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, ఏపీ ప్రభుత్వంచే రఘుపతి వెంకయ్య జీవిత సాఫల్య పురస్కారంతో పాటు ‘పద్మశ్రీ’ పురస్కారం కూడా పొందారు. ప్రాణ స్నేహితుడు ముళ్లపూడి వెంకటరమణ 2011లో, ఆ తర్వాత సతీమణి భాగ్యవతి మరణించిన దిగులుతో బాపు 2014, ఆగస్టు 31న చెన్నైలో గుండెపోటుతో మరణించారు. ఆయన మన మధ్య లేకపోయినా యువచిత్రకారులను, ఎందరో కళాప్రియులకు అయన బొమ్మలు ఎప్పటికి గిలిగింతలు పెడుతూనే ఉన్నాయి. – రేగుళ్ళ మల్లికార్జునరావు, సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ -
బాపు బొమ్మ
-
ఆ రోజుల్లో మరో జతగాడు, రాతగాడు రమణ..
బాపు! ఈ పేరు చందమామ పుస్తకాన్ని గుండెలకు అదుముకుని చదువు తున్నప్పుడు విన్న పేరు. అసలుపేరు తెలియని చిన్నతనం. ఈలోగా ‘బుడు గ్గాడు’ ఎక్కడినుంచో ఊడిపడ్డాడు ‘హాచ్చరంగా’. ఇక ఏ పిల్లని చూసినా సీగాన పెసూనాంబే! బుడుగు బొమ్మ చూసి పెద్ద ఇన్స్పిరేషనొచ్చి మా నాన్న నాక్కూడా బద్దెల నిక్కరు కుట్టించాడు. ముత్యాల కోవలా ‘ఉండాల్రోయ్ చేతిరాత’ అని మాష్టారంటే– ఛత్ ఏం బావుంటుందని, అప్పుడే పత్రికల్లో అలవోకగా కనబడుతున్న బాపు రాత చూసి స్కూల్లో పోజుకొట్టడానికి ప్రాక్టీసు చేయడం మొదలెట్టాను. అలా నా చిన్న జీవితంలోకి, బుల్లి బుర్రల్లోకి దూరిపోయాడు బాపు. ఆ రోజుల్లో మరో జతగాడు, రాతగాడు రమణ, బాపుల సినిమా ‘బాలరాజు కథ’ వెండితెరమీదకొచ్చింది. మహాబలిపురం పాటని పాడుతూ మాస్టర్ ప్రభాకర్‌లా యాక్షన్ చేసే కుర్రాళ్ళు ఎక్కడ చూసినా. అందులో మనం కూడా! ఆ చిత్రంతో మనసులో ‘సినిమా కథల చిత్రాల బాపు’ తిష్టవేశాడు. అప్పటికే సాక్షి నామ సంవత్సరం వచ్చిందట నా బందుల నిక్కరు గుడ్డ ‘కుంచెం’గా ఉన్నప్పుడు. మరోటేమో ‘బుడ్డిమంతుడు’ అని మత్తుగా చెప్పాడు, కేసులు కేసులు తాగే మా ఏలేటిపాడు చెన్నకేశు మావయ్య. కాస్త వయసొచ్చాకా మనకేసి చూసీచూడక పెద్దజడతో విసురుగా కదిలే ఏ పిల్లని చూసినా బాపూ బొమ్మే అనిపించేసి, గుండె కోసేసేవు కదయ్యా ‘కుంచె కొడవలితో’ అని లబలబ లాడేవాళ్ళం. కొందరైతే బాçపూ బొమ్మలాంటి అమ్మాయినే పెళ్ళాడాలని ఒట్టేసుకుని బజ్జుంటే, ఆనక కలలో కనబడి ఫక్కున నవ్వి మాయమై పోయేవారు. పక్కింటి పిన్నిగారి ‘వణికిన చిన్న గీతలాంటి’ తలుపుచాటునున్న మొగుడుని చూసినప్పుడల్లా హమ్మ! ఎలా గీశావు తెలుగు మొగుడి నుదుటి రాత అనిపించేదంటే నమ్మండి. సరసొత్తోడండి! గుండెల్లో రమణీయ రాముణ్ణి, తెరమీద సీతారావుణ్ణి రంగుల చిత్ర కల్పన చేయడం ఆయనకే చెల్లు, అది తెలుగువారి ఆనందపు ‘హరివిల్లు’. ‘తీతా’ అని రమణ అంటే, ‘సీత’ని బాపు కంటే... ఇద్దరూ చూసింది రాముణ్ణే! ఒకరు అందాల జనతా రాముడైతే, మరొకరు జనరంజక మనోభిరాముడని తెలుసుకోడానికి కాలేజి క్లాసులెగ్గొట్టి చూసొచ్చాం. నేడు పోయి రేపు రమ్ము అనగానే జనం అచ్చం మన రాములోరు ఇలాగే మాట్లాడతారంట అని గుండెల్లో దాచుకున్న రామబంటులయ్యారు, సంపూర్ణ రామాయణం చూసిన భక్తితో. ఇదిలా ఉండగా ‘అలో వలో’మనే కాంట్రాక్టరు లాంటి పంచెకట్టు గోదారి జిల్లా ‘ఇలనిజాన్ని’ నిజమనిపించేశారు ఇద్దరు సావాసగాళ్ళు. తెలుగోళ్ళు ‘ఓలు’ మొత్తం చూసి తెలుగుదనం అంటే ఇదేరా బాబు అని ఎగిరిగంతేశారు. సీతాకల్యాణంలో సీత (జయప్రద) కళ్లు, రాముడి అందం చూసిన లండన్, చికాగో, బెర్లిన్, డెన్వర్ ప్రేక్షకులు మైమరిచిపోయారు. గంగావతరణాన్ని చూసి ఆనందపు గంగలో మనకన్నా కాస్త ఎక్కువగా తానమాడారు. శ్యామసుందరులందరికీ ధైర్యమనే ‘గోరంతదీపం’ వెలిగించి, రంగులద్దేవాడికి నలుపైనా, తెలుపైనా ఒకటే ప్రేమ అంటావు కదయ్యా బాపు! కొత్తగా పెళ్ళయిన వాళ్ళకి ‘పెళ్లి పుస్తకాన్ని’ బహుమతిగా ఇచ్చావు. అవసరమైతే సంసారాన్ని ‘మిష్టర్ పెళ్లాం’లా సరిదిద్దుకోవాలని చెప్పావు. తెలుగు వాకిళ్ళముందు ముగ్గు, గోదారి, గూటి పడవ, రాములోరు, విశాలమైన కళ్ళతో ఆరణాల తెలుగు ఆడపిల్ల, మధుపర్కాలు, ఏవి కనబడ్డా నువ్వే గుర్తొస్తావు. మా అదృష్టం కొద్దీ ఇక్కడ పుట్టావయ్యా. నీ గీతల్లో దేవుళ్ళందరిని చూసి రోజూ పొద్దున్నే దణ్ణం పెట్టుకునే మహద్భాగ్యాన్ని మా నుదుట గీసిన గీతాచార్యుడివి నువ్వేనయ్యా సత్తెపెమాణకంగా సత్తిరాజు లక్ష్మీ నారాయణా! (నేడు బాపు జయంతి సందర్భంగా) - చాగంటి ప్రసాద్ మొబైల్ : 90002 06163 -
ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి హనుమాన్కు పరమ భక్తుడు అన్న విషయం తెలిసిందే. ఆంజనేయస్వామికి మరో పేరైన చిరంజీవిని తన స్క్రీన్ పేరుగా మార్చుకొని ఏ స్థాయికి ఎదిగారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే నేడు హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షాలు తెలిపారు. అంతేకాకుండా ఆంజనేయస్వామితో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ‘ఈ రోజు హనుమజ్జయంతి. ఆంజనేయస్వామి తో నాకు చాలా అనుబంధం ఉంది...చిన్నప్పటి నుంచి...1962 లో నాకు ఓ లాటరి లో ఈ బొమ్మ వచ్చింది..అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది..ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్. కారణం ఏంటో తెలుసా?.. ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు, "ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయి" అన్నారు. అప్పటి నా ఫోటో’ ‘కొన్ని దశాబ్దాల తరవాత, 2002 లో, బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు నాకు ఇష్టమైన ఆంజనేయస్వామిని చిత్రించి పంపుతాను అన్నారు. నేను అది పాలరాతి మీద చేయించి పూజ గదిలో పెట్టుకున్నాను. ఈ బొమ్మ నాకు ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా?.. బాపు గారు చెప్పిన మాట "ఏంటోనండి ...బొమ్మని గీస్తుంటే మీ పోలికలే వచ్చాయండి ...అలానే ఉంచేసాను ...మార్చలేదు " అన్నారు. చిత్రకారుల ఊహలో స్వామివారి పోలికలు నాకు ఉండటం చిత్రమే. అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు. ఇవ్వాల్టి తారీఖుతో కూడా నాకు అనుబంధం ఉంది’ అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఈ రోజు హనుమజ్జయంతి. ఆంజనేయస్వామి తో నాకు చాలా అనుబంధం ఉంది...చిన్నప్పటి నుంచి...1962 లో నాకు ఓ లాటరి లో ఈ బొమ్మ వచ్చింది..అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది..ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్. కారణం ఏంటో తెలుసా?...to be continued pic.twitter.com/TdVKjg05nS — Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020 ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు, "ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయి" అన్నారు. అప్పటి నా ఫోటో.. ..to be continued pic.twitter.com/HnpRnezH8E — Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020 బాపు గారు చెప్పిన మాట "ఏంటోనండి ...బొమ్మని గీస్తుంటే మీ పోలికలే వచ్చాయండి ...అలానే ఉంచేసాను ...మార్చలేదు " అన్నారు. చిత్రకారుల ఊహలో స్వామివారి పోలికలు నాకు ఉండటం చిత్రమే. అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు. ఇవ్వాల్టి తారీఖుతో కూడా నాకు అనుబంధం ఉంది...#8thApril ...to be continued. pic.twitter.com/m3J6S1ZEMs — Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020 కొన్ని దశాబ్దాల తరవాత, 2002 లో, బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు నాకు ఇష్టమైన ఆంజనేయస్వామిని చిత్రించి పంపుతాను అన్నారు. నేను అది పాలరాతి మీద reproduce చేయించి పూజ గదిలో పెట్టుకున్నాను. ఈ బొమ్మ నాకు ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా …? pic.twitter.com/A2lqoazwcJ — Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020 చదవండి: పెద్దాయన సన్ గ్లాసెస్ వెతకండ్రా రియల్ 'హీరో'ల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఇడ్లీ కంటే పచ్చడి బాగుంది!
బాపు–రమణ అంటే ఒకే మాట, ఒకే పాట, ఒకే ఆత్మ! ఆ చక్కని చిక్కని స్నేహంలో నుంచి బాపు గురించి ముళ్లపూడి వెంకటరమణ చెప్పిన కొన్ని ముచ్చట్లు ఆయన మాటల్లోనే... వాళ్ల (బాపు) అమ్మగారికి పెద్ద మిస్టరీ అదే! ‘‘ఇరవై నాలుగు గంటలూ మీలో మీరు మాట్లాడుకోవడం బోర్ కొట్టదా? అసలు ఏం మాట్లాడుకుంటారు? మాట్లాడుకోవడానికి ఏం ఉంటాయి?’’ అని అడిగేవారు. మాట్లాడుకోవడమే ఒక ఎంజాయ్మెంట్. సినిమాలు కూడా ఈ కబుర్ల ముందు దిగదుడుపే. ‘ఇది చదివాను’ ‘అది చదివాను’ ‘ ఆ సంగీతం బాగుంది’ ‘ఆ సినిమా బాగుంది’ ‘ఆ ఆర్టిస్ట్ ఏదో బాగా చేశాడు’ ‘ఈ జోక్ బాగుంది’....ఇలా అనంతంగా తెల్లవార్లూ నాలుగింటి వరకు చెప్పుకుంటూ ఉండేవాళ్లం. అయిదో క్లాసు కలిసే చదువుకున్నాం. కలిసే ఆడుకున్నాం. ‘బాలానందం’ రేడియో వచ్చినప్పుడు రోజూ కలుసుకునేవాళ్లం. అప్పుడు నేను కథలు రాస్తూ ఉండేవాడిని. ఆయన బొమ్మలు వేస్తుండేవాడు. ‘‘వెధవల్లారా! ఈ కథలు, బొమ్మలు కూడు పెడతాయా? చదువుకోండి’’ అని తిట్టేవారు బాపు నాన్నగారు. అందువల్ల ఇంట్లో ఛాన్సు లేదు కాబట్టి రోడ్డు మీద దీపస్తంభం దగ్గర నిల్చొని నేను కథ చదివితే అది విని వెళ్లిపోయేవాడు బాపు. మరునాడు బొమ్మేసుకొస్తే ఆ దీపస్తంభం దగ్గరే చూసేవాడిని. అది పట్టుకొని నేను ఏదో ఒక పేపర్ ఆఫీస్‌కు వెళ్లి చూపించుకునేవాడిని. అయిదు రూపాయలు ఇచ్చేవారు. ఒకసారి విద్వాన్ విశ్వంగారు ‘ఇడ్లీ కన్నా పచ్చడి బావుంది’ అన్నారు! ∙∙ ఆరోజుల్లో ఒక అమ్మాయి ఉండేది. ఆమె కుచ్చిళ్లను రోడ్డుకీడ్చుకుంటూ నడుస్తుండేది. అదో అందం! ఆ అమ్మాయికి పెద్ద జడ ఉండేది. ఆ జడని చూస్తూ బొమ్మలు వేసేవాడు బాపు. ∙∙ మేము సరదాగా పోట్లాడుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ‘పెళ్లి పుస్తకం’ సినిమా టైమ్‌లో అయితే రెండు నెలలు మాట్లాడుకోలేదు. మాట్లాడుకోక పోయినా సరే, నేను డైలాగులు రాసేవాడిని, ఆయన తీసేవాడు. రిజల్ట్ ఏమిటంటే పదమూడు వేలు ఉండాల్సిన సినిమా ఇరవై వేలు షూటు చేయాల్సి వచ్చింది. ఇంకెప్పుడు పోట్లాడుకోవద్దని లెంపలేసుకున్నాం ‘నాదే తప్పు’ అని నేను, అతనిదే తప్పు అని అతను అనుకున్నాము. నిజానికి రబ్బరుస్టాంప్లా ఉంటే లైఫే లేదు. అభిప్రాయ భేదాలు, కొట్లాట ఉంటేనే మజా ఉంటుంది. -
గోదావరి సీమపై ముళ్ళపూడి సంతకం
ముళ్లపూడి వెంకటరమణ.. ఈ పేరు తెలియని ఆంధ్రుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఈ పేరు స్ఫురణకు వచ్చిన వెంటనే బుడుగు గుర్తొస్తాడు.. ఆ వెంటనే ఆయన కలం నుంచి జనించిన పాత్రలు ఇంకొన్ని కళ్లముందు కదలాడతాయి. ఆ పాత్రల నైజాలు గుర్తొచ్చి పెదవులపై చిరునవ్వు కదలాడని పాఠకులు ఉండరనేది నిర్వివాదాంశం. సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పు గోదావరి) : ముళ్లపూడి వెంకటరమణ 1931లో ధవళేశ్వరంలో జన్మించారు. ఊహ తెలిసీ తెలియని వయసులోనే తండ్రిని కోల్పోయారాయన. ధవళేశ్వరం ఆనకట్టలో తండ్రి క్యాష్ కీపర్. తండ్రి గతించాక, ఉదరపోషణార్థం తల్లి ధవళేశ్వరం నుంచి మద్రాసు మహానగరానికి మకాం మార్చారు. అక్కడ ఒక ఇంటిలో మెట్ల కింద చిన్న గదిలో అద్దెకు నివాసం ఏర్పాటుచేసుకున్నారు. తల్లి విస్తరాకులు (అడ్డాకులు) కుట్టి కిరాణా దుకాణానికి అమ్మిన రోజులు, ప్రింటింగ్ ప్రెస్‌లో కంపోజింగ్ చేసిన రోజులు ఉన్నాయి. ‘మా అమ్మ నాకు జన్మరీత్యా అమ్మ. జీవితం రీత్యా ఫ్రెండు, గురువు, భయం లేకుండా బతకడం నేర్పిన గురువు, తెచ్చుటలో కన్నా, ఇచ్చుటలో ఉన్నహాయిని చూపిన దైవం’ అని తన స్వీయచరిత్ర కోతికొమ్మచ్చిలో రాసుకున్నారు రమణ. మద్రాసు వెళ్లాక, మధ్యలో రెండేళ్లు రాజమహేంద్రవరం, ఇన్నీసుపేటలోని వీరేశలింగం ఆస్తిక పాఠశాలలో సెకెండ్ ఫారం, థర్డు ఫారం (ఆధునిక పరిభాషలో 7, 8 తరగతులు) చదివినా, తుది శ్వాస వదిలేవరకు ముళ్లపూడి కావేరి నీళ్లనే సేవించారు. అయితే, ఆయన ధ్యాస, శ్వాస, యాస గోదావరి మాండలికమే. ఆయన రచనల్లో కనిపించే బుడుగు, సీగాన పెసూనాంబ, రెండు జెళ్లసీత, అప్పారావు, లావుపాటి పక్కింటి పిన్నిగారి మొగుడు (అంటే మొగుడు లావని కాదు, పిన్నగారే లావు).. అందరూ గోదావరి మాండలికమే మాట్లాడారు. సినిమాల్లో ఆమ్యామ్యా రామలింగాలు, ‘తీతా’లు (తీసేసిన తాసిల్దార్లు) అచ్చంగా ఇక్కడి మనుషులే! గోదావరి ‘మా ఫిలిం స్టూడియో’ అని ప్రకటించుకున్న ముళ్లపూడి నేస్తం బాపుతో కలసి తీసిన సినిమాలు అన్నీ ఆ గోదారమ్మ ఒడిలోనే పురుడు పోసుకున్నాయి. సినీ రచన చేయడానికి గోదావరిపై లాంచి మాట్లాడుకుని, భద్రాద్రి రాముడి దర్శనం చేసుకోవడానికి వెడుతూ ఆ రచన పూర్తి చేసేవారు. పాత్రికేయుడిగా ఉద్యోగపర్వం ప్రారంభం ఎస్సెస్సెల్సీ వరకు చదివిన రమణ నాటి అగ్రశ్రేణి పత్రిక ఆంధ్రపత్రికలో సబ్ ఎడిటర్‌గా ఉద్యోగరంగ ప్రవేశం చేశారు. ఆయనలో రచయిత అదే సమయంలో కన్ను తెరిచాడు. వందలాది కథలు, రాజకీయ భేతాళ పంచవింశతి లాంటి రాజకీయ వ్యంగ్యాస్త్రాల రచనలు, విక్రమార్కుడి మార్కు సింహాసనం వంటి సినీరంగ ధోరణులపై విసుర్లు, ఋణానందలహరితో అప్పారావు పాత్రను పరిచయం చేయడం, చిచ్చరపిడుగులాంటి బుడుగు రచన.. అన్నీ ఈ దశలోనే జరిగాయి. సినీరంగానికి మలుపు.. ఆంధ్రపత్రికలో సినిమా వార్తలు రాస్తున్న సమయంలో రమణ సమీక్షలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. అక్కినేని వంటి అగ్రనటులు, ఆత్రేయ వంటి రచయితలు, నాగిరెడ్డి చక్రపాణి వంటి నిర్మాతలు రమణ సినీ సమీక్షలను ఆసక్తికరంగా చదివేవారు. సినీ నిర్మాత డీబీ నారాయణ తాను తీస్తున్న దాగుడు మూతలు సినిమాకు రచన చేయమని ముళ్లపూడిని కోరారు. చాలాకాలం తప్పించుకు తిరిగిన రమణ ఎట్టకేలకు అంగీకరించారు. అయితే, దాగుడుమూతలు షూటింగ్ కారణాంతరాల వల్ల లేటు కావడంతో, డూండీ ఎన్టీ రామారావుతో నిర్మించిన రక్త సంబంధం ఆయనకు మొదటి సినీ రచన అయింది. రెండో సినిమా కూడా ఎనీఆ్టర్ నటించిన గుడిగంటలు, మూడో సినిమా అక్కినేని నటించిన క్లాసిక్ మూగమనసులు.. మూడూ సూపర్ హిట్ సినిమాలే కావడంతో రమణ సినీ జీవితం ఊపందుకుంది. సొంతంగా సినిమాలు కూడా నిర్మించారు. సాక్షి, బంగారుపిచుక, బుద్ధిమంతుడు, అందాలరాముడు, గోరంతదీపం, ముత్యాలముగ్గు, సీతాకల్యాణం, సంపూర్ణ రామాయణం, పెళ్ళి పుస్తకం.. కొన్ని హిట్లు మరికొన్ని ఫట్లు అయినా, రెంటినీ సమానంగా భావించే స్థితప్రజ్ఞుడు ఆయన.. నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కోరికపై విద్యార్థులకు వీడియో పాఠాలు తీశారు. రామాయణాన్ని అమితంగా ప్రేమించే రమణ చివరి రచన కూడా శ్రీరామరాజ్యం కావడం, ఆయన జీవితకాల నేస్తం బాపు తుది క్షణంలో ఆయన పక్కనే ఉండడం చెప్పుకో తగ్గ అంశాలు. 2011 ఫిబ్రవరి 24న చెన్నయ్‌లో రమణ కన్ను మూశారు. పుట్టిన గడ్డతో రమణ చివరివరకు ఎందరో ప్రముఖులతో అనుబంధాలు పంచుకున్నారు. మచ్చుకు కొందరి అంతరంగాలు పరికిద్దామా.. ముళ్లపూడి వెంకట రమణ చదువుకున్న పాఠశాలలో, ఆయన 88వ జయంత్యుత్సవం శుక్రవారం ఉదయం 10 గంటలకు కళాగౌతమి, తెలుగు సారస్వత పరిషత్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈనాటికీ బాపు, రమణల కుటుంబాలతో అనుబంధాలు ‘హాస్యమందు అరుణ– అందె వేసిన కరుణ–బుడుగు వెంకట రమణ–ఓ కూనలమ్మా! అని ఆరుద్ర రమణని గురించి తన కవితలో పేర్కొన్నారు. బాపు, రమణలతో నాకు పరిచయం కలగడం, వారి కుటుంబాలతో నేటికీ సంబంధ బాంధవ్యాలు ఉండడం నా అదృష్టంగా భావిస్తాను. ఓ సారి ఆయన పుట్టినరోజుకు శుభాకాంక్షలు గీసి పంపితే, ఆయన జవాబు రాస్తూ, బాపు సంతకం కూడా ఆయనే చేసి, ఆథరైజ్డు ఫోర్జరీ అని రాశారు! అన్నట్టు ఋణానందలహరిలో ఆయన కథానాయకుడి పేరు (అప్పారావు), నా పేరు ఒక్కటే కావడం ఆదో విచిత్రం! – ఎంవీ అప్పారావు (సురేఖ) కార్టూనిస్టు నన్ను ‘కందుల హాయీ’ అనే వారు. బాపు అనారోగ్యానికి వైద్య నిమిత్తం ముళ్లపూడి రాజమహేంద్రవరం వచ్చారు. ఆయనకు సుమారు రెండు దశాబ్దాలుగా షుగరు వ్యాధి ఉండేది. సహవైద్యులు నా పేరు సూచించారు. మా ఇద్దరి మధ్య కేవలం డాక్టరు, పేషంట్ల సంబంధంగా ఉండేది కాదు. నాకు ఆయన పుస్తకాలు పంపేవారు. ఫోనులో తరచూ మాట్లాడుకునేవాళ్లం. ఓ సారి నా మీద ఇలా కవిత రాసి పంపారు.. ‘మందొద్దంటూ చాల, ప–సందులు మింగించి, నన్ను సరిజేసి, తిరిగీ మందును పసందును చేసిన కందుల ‘శ్రీహాయిగార్కి’ వందన శతముల్’ – రమణ (మే 2006) ఎప్పుడైనా విమానాశ్రయానికి ఆయన్ను తీసుకురావడానికి వెడితే, ఆయన ఓ మూల కుర్చీలో కూర్చుని ఉండేవారు. బాపులాగా నాకు కూడా ‘జనగండం’ ఉందని చమత్కరించేవారు. – డాక్టర్ కందుల సాయి, డయాబెటిక్ కేర్, రాజమహేంద్రవరం -
రెండు బాపులు
డాక్టర్ వివేకానందమూర్తి లండన్‌లో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తారు. ఆయన యాక్టరు, రైటరు, మిమిక్రీ ఆర్టిస్టు కూడా. ఆయనంటే బాపు రమణలకు ‘పిచ్చిష్టం’. ఆయనోసారి మద్రాసులో ఓ హోటల్లో దిగి బాపుగారికి ఫోన్ చేసి, ‘‘రాత్రి తొమ్మిది పది మధ్యలో మిమ్మల్ని చూడ్డానికి వస్తా! ఏడింటికి ఓ పార్టీ ఉంది’’ అన్నారు. ‘‘ఎందుకండీ అంత రాత్రివేళ... పార్టీ తర్వాత? రేపు రావచ్చు కదా!’’ అన్నారు బాపు. ‘‘లేదండీ, రావాల్సిందే. మిమ్మల్ని ఇవ్వాళ చూడాల్సిందే’’ అన్నారు ‘వివేకం’ ఖండితంగా. ‘‘కాదండీ.. రేపు ఉదయం...’’ ‘‘లేదండీ మీ ఇంటికి దారి చెప్పండి. పార్టీ కాగానే వచ్చి వాల్తా!’’ ‘‘సరే అయితే. అడయార్ వైపు వస్తూంటే రెండు బ్రిడ్జీలు వస్తాయి. ఏదో ఒక బ్రిడ్జి క్రాస్ చెయ్యండి. తర్వాత రెండు లెఫ్ట్‌లు వస్తాయి. ఏదో ఒక లెఫ్ట్ తీసుకోండి. ముందుకొస్తే రెండు గుడిగోపురాలు కనిపిస్తాయి. అవి దాటగానే రెండు లైటు స్తంభాలూ, రెండు పచ్చగేట్లూ కనిపిస్తాయి. ఏదో ఒక గేటులోంచి ఏదో ఒక ఇంట్లోకి రండి! అక్కడ మీ కోసం రెండు బాపులు ఎదురుచూస్తూ ఉంటాయి!’’ అని ఫోన్ పెట్టేశారు బాపు. (ఆగస్టు 31బాపు వర్ధంతి) -సౌజన్యం: శ్రీ ఛానెల్ (మీకు ఇలాంటి మరమరాలు తెలిస్తే మాకు రాయండి.) -
మా బాపు...
గ్రీటింగ్ కార్డు, వెడ్డింగ్ కార్డు, క్యాలెండర్, పుస్తకాలు, కాఫీ కప్పులు... సర్వం బాపు మయం...ఏ స్తోత్రం చదివినా బాపు బొమ్మే... ఏ పుస్తకం తీసినా బాపు కవర్పేజీయే...సినిమాలు తీసి, బొమ్మలు వేసిన బాపు కుటుంబ సభ్యులతో ఎలా ఉంటారని వారి పిల్లలను అడిగితే...కుమార్తె భానుమతి, కుమారులు వేణుగోపాల్, వెంకటరమణ తమ అనుభవాలను పంచుకున్నారు. నాన్న కోసం తాండ్ర తెస్తే, దాన్ని చాకుతో ముక్కలుగా కట్ చేసి అందరికీ పెట్టి, తాను చిన్న ముక్క మాత్రమే తినేవారు. సమోసాను కూడా కట్ చేసేవారు. ఏ వస్తువునూ డబ్బాలో దాచే అలవాటు లేదు. నాన్నకి బామ్మ చేసే స్వజ్జప్పాలంటే చాలా ఇష్టం. అందుకే బామ్మ వేడివేడిగా నాన్నకి, మామకి పెట్టమనేది నాన్నగారికి ఫలానా పాట ఇష్టం... అంటూ నిర్దిష్టంగా లేదు. ప్రతి పాటలోను అందంగా ఉన్న అంశం గురించి మాట్లాడేవారు. అయితే అప్పుడప్పుడు ‘బంగారు పిచిక’ చిత్రంలోని ‘పో... పోపో... నిదురపో...’ పాటలోని పదాల గురించి, సన్నగా వినిపించే సంగీతం గురించి మాత్రం మాట్లాడుతుండేవారు. ‘నాన్న ఎప్పుడూ బొమ్మలు వేసుకుంటూ, చదువుకుంటూ ఉండేవారు. నాన్నని డిస్టర్బ్ చేయొద్దని అమ్మ చెబుతుండేది. చెన్నైలో షూటింగ్ ఉంటే మాత్రం, షూటింగ్ అయిపోయాక మాతోనే గడిపేవారు. రాజమండ్రి లాంటి ప్రదేశాల్లో షూటింగ్ జరుగుతుంటే మా కుటుంబం, మామ (ముళ్లపూడి వెంకటరమణ) కుటుంబం అందరం కలిసి వెళ్లేవాళ్లం. ‘ఎప్పుడూ అందరూ కలిసి ఉండాలి, విడిపోకూడదు’ అని చెప్పేవారు నాన్న. ఇప్పటికీ అత్త (ముళ్లపూడి వెంకటరమణ భార్య శ్రీదేవి) మా కోసం ఇక్కడే ఉండిపోయింది’ అంటారు బాపు కుమార్తె భానుమతి. మామ (ముళ్లపూడి వెంకటరమణ), అమ్మ (భాగ్యవతి), ఒకరి తరవాత ఒకరు వెంటవెంటనే పోవడంతో, నాన్న తట్టుకోలేకపోయారు. నాన్న చాలా ఎమోషనల్ పర్సన్. అమ్మ పోయినప్పుడు ఎవరైనా పలకరించడానికి వస్తే, ‘నన్ను కాసేపు వదిలేయండి’ అని లోపలకు వెళ్లిపోయి, ఒంటరిగా కూర్చున్నారు. దాంతో చాలామందికి నాన్న మీద కోపం కూడా వచ్చింది... అంటూ నాన్నగారు బాధ పడిన సంఘటనలు గుర్తుచేశారు చిన్న కుమారుడు వెంకటరమణ. నాన్న మా ఎవ్వరి బొమ్మలు వెయ్యలేదు. ఒక్కోసారి మమ్మల్ని పిలిచి చెయ్యి ఇలా పెట్టు, కాలు అటు పెట్టు, కర్ర పట్టుకో అంటూ పోశ్చర్లు మాత్రం పెట్టించి, బొమ్మలు వేసేవారు. ఉత్తరం చదువుతూ కూర్చున్న అమ్మాయి బొమ్మ మొట్టమొదటిసారి వేసినప్పుడు అమ్మే మోడలింగ్. రెండోసారి అదే బొమ్మ నాన్న నన్ను కూర్చోబెట్టి వేశారు. బొమ్మ అంతా అయ్యాక నా పోజ్ మాత్రమే వేశారని అర్థమైంది. ఆడపిల్లలు బాగా చదువుకుని, బోల్డ్‌గా ఉండాలి, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడాలి అనేవారు. తెలుగు వచ్చినవాళ్లు వచ్చీరాని ఇంగ్లీషులో మాట్లాడితే నాన్నకి చాలా కోపం వచ్చేది’ అంటూ తండ్రి తాలూకు తీపి జ్ఞాపకాలను వివరించారు భానుమతి. ‘ఎవరైనా ఫలానా టైమ్‌కి ఇంటికి వస్తామంటే ఆ టైమ్‌కి రెడీ అయిపోయేవారు. వాళ్లు ఆ టైమ్‌కి రాకపోతే చాలా అసహనంగా ఉండేవారు. నాన్న చాలా సెన్సిటివ్. తనతో మాట్లాడేవారి గొంతులో కొంచెం తేడా వచ్చినా చాలా బాధపడేవారు’ అని తండ్రిని గుర్తు చేసుకున్నారు వేణుగోపాల్.‘‘ఇంట్లో ఏ శుభకార్యం జరుగుతున్నా, మేమందరం హడావుడి పడేవాళ్లం. నాన్న, మామ మాత్రం తెల్లటి ఇస్త్రీ బట్టలు కట్టుకుని, కాసేపు అందరితో సరదాగా గడిపి, వెంటనే మేడమీదకు వెళ్లిపోయి, పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ఉండేవారు’’ అంటూ బాపురమణలను స్మరించుకున్నారు చిన్నకుమారుడు వెంకటరమణ. ‘‘సినిమాలలో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఇంట్లో ఎవ్వరికీ తెలియనిచ్చేవారు కాదు. నాన్న, మామ వారిలో వారు చర్చించుకునేవారు.’’ అంటూ తండ్రి పడిన అంతర్మనధనం గుర్తు చేసుకున్నారు వేణుగోపాల్.‘‘మాకు బంగారం కొనాలన్నా, డబ్బులు ఇవ్వాలన్నా అన్నీ అమ్మే చూసేది. లౌకిక విషయాల మీద వారికి ఆసక్తి ఉండేది కాదు. అలాగే చాలామంది, నాన్నగారికి ‘రాముడు సాక్షాత్కరించాడా’ అని అడుగుతుంటారు. ‘తాను వేసే బొమ్మలకు తనకు రాముడు కనిపించాడని’ నాన్న ఎన్నడూ నాటకీయంగా మాట్లాడేవారు కాదు. కాని ఆ రాముడు కనిపించకుండా ఇన్ని బొమ్మలు వేయగలరా అని మేం అనుకుంటాం’’ అంటూ తండ్రి వేసిన వేలకొలదీ రాముడి బొమ్మలను తలుచుకుంటూ చెప్పారు కుమార్తె భానుమతి.‘‘నాన్నకి కులాలు మతాలు అంటే అస్సలు ఇష్టం లేదు. మేం ఫలానా కులం వాళ్లం అనే ఆలోచనే నాన్నకి లేదు. అందరూ మనుషులే. అందరం సమానమే అనే భావనతో పెంచారు మమ్మల్ని’’ అన్నారు వేణుగోపాల్. – డా. వైజయంతి ‘నాన్న చిత్రకారుడిగా చాలా బిజీగా ఉన్నప్పటికీ, ఎండాకాలం సెలవుల్లో మధ్యాహ్నం సమయంలో పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని రామాయణం కొన్ని వందలసార్లు చెప్పారు. ఇంట్లోనే 16ఎం.ఎం ప్రొజెక్టర్‌తో గోడ మీద స్క్రీన్ ఏర్పాటుచేసి సినిమాలు వేసి చూపించేవారు. – పెద్ద కుమారుడువేణుగోపాల్ మా చిన్నతనంలో పమేరియన్ కుక్కపిల్లను పెంచుకున్నాం. దానికి టిన్టిన్ అని కామిక్ పేరు పెట్టారు. అప్పుడప్పుడు ఆ కుక్క పిల్ల బొమ్మలు వేసేవారు. టిన్టిన్ చచ్చిపోయినప్పుడు, పిల్లలందరం బాగా ఏడవడం చూసి, ఇక ఎన్నడూ ఇంట్లో పెట్స్‌ని పెంచొద్దు అన్నారు. మేం ఏడిస్తే బహుశః ఆయనకి బాధ అనిపించి ఉంటుంది. – చిన్న కుమారుడువెంకటరమణ -
బాపూగారు బాగా ప్రోత్సహించారు
‘‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో బౌద్ధ సన్యాసి ధర్మనందనుడుగా, ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ చిత్రంలో విలన్‌గా నటించా. ఈ సంక్రాంతికి విడుదలైన ఆ రెండు చిత్రాలు నటుడిగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. చాలామంది అభినందిస్తున్నారు’’ అని నటుడు సునీల్ కుమార్ చెప్పారు. పాత్రికేయుల సమావేశంలో సునీల్ కుమార్ మాట్లాడుతూ – ‘‘మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో పుట్టి పెరిగిన నేను నటుడిగా రాణించాలనుకున్నాను. ఎన్నో ప్రయత్నాలు చేశాను. అప్పుడే దర్శకుడు బాపూగారిని కలిశాను. ఆయన ‘భాగవతం’ సీరియల్లో నన్ను రాముడు, కృష్ణుడు పాత్రలిచ్చి, ప్రోత్సహించారు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో ‘రాధాగోపాలం’, ‘సుందరకాండ’ సినిమాల్లో నటించాను. నాకు యాక్సిడెంట్ కావడంతో సినిమాలకు గ్యాప్ వచ్చింది. ధర్మనందనుడు పాత్రకు మేకప్ సెట్ కాకపోవడంతో గుండు కొట్టుకుంటావా అని క్రిష్ అడగడంతో ఓకే అన్నా. సినిమాలో నా పాత్ర చూస్తుంటే హ్యాపీగా అనిపించింది. బాలకృష్ణ, హేమమాలినిగార్లతో నటించడం మరచిపోలేని అనుభూతి’’ అన్నారు. -
ప్రమాదవశాత్తూ కార్మికుడి మృతి
మందమర్రి మండలంలోని కేకేవన్ గనిలో ప్రమాదవశాత్తూ ఓ కార్మికుడు మృతిచెందాడు. మ్యాన్ రైడింగ్ మీద నుంచి పడి జంగంపల్లి బాపు(56) అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. రెండు రోజుల క్రితమే గోలేటి నుంచి మందమర్రి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కొంటె బొమ్మల 'బాపు'.. గుండె ఊయలలూపు
కొంటెబొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండె ఊయలలూపు ఓ కూనలమ్మా..! తెలుగు వెండితెర మీద తెలుగు దనాన్ని ఒలికించిన దిగ్దర్శకుడు బాపు గురించి ఆరుద్ర చెప్పిన మాటలివి. వెండితెరకు వయ్యారాన్ని నేర్పిన బాపు భౌతికంగా దూరమైనా.. ఆయన గీసిన బొమ్మలు, తీసిన సినిమాలు ఎప్పటికీ ఆయన్ని మనతోనే ఉండేలా చేశాయి. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా ఒక్కసారి ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుందాం. బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. ఆయన 1933 డిసెంబర్ 15న పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పుట్టారు. ఆంద్ర పత్రికలో కార్టూనిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన బాపు తరువాత దర్శకుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. రామాయణసారం లేకుండా బాపు సినిమాలే లేవు. రామాయణ, మహాభారతాల్ని ఆధునీకరించి తెరకెక్కించారు బాపు. ఆ రెండు మహాకావ్యాల్ని అణువణువునా జీర్ణించుకుని.. ప్రతి కథనీ ఆ కోణం నుంచే చూశారు.. తీశారు. అందుకే రామాయణంలోని ఘట్టాలను సినిమాలుగా తెరకెక్కించిన బాపు. ఆయన తెరకెక్కించిన సాంఘిక చిత్రాల్లోనూ రామాయణ సారాన్నే చూపించారు. తనని తాను రాముని బంటుగా చిత్రీకరించుకున్నారు కూడా. అది రాముడిపై బాపు భక్తి. కళాత్మక దర్శకుడు బాపుని ఎన్నో అవార్డులు వరించాయి. మదర్ థెరిసా చేతులమీదుగా రఘుపతి వెంకయ్య స్మారక పురస్కారాన్ని అందుకున్నారు. ఆరు నంది అవార్డులతో పాటు, ఎన్నో గౌరవ సత్కారాల్ని పొందారు. సినిమాలోనే కాదు, భక్తిరసం తొణికిసలాడే అనేక బొమ్మలు బాపు చేతిలో ఊపిరిపోసుకున్నాయి. స్క్రిప్ట్ తోపాటే అన్ని ఫ్రేముల్నీ బొమ్మలుగా గీసుకుంటారు బాపు. అందుకే ప్రతి షాట్ సెల్యులాయిడ్‌పై బొమ్మగీసినట్టు అందంగా ఒదిగిపోతుంది. ఆణిముత్యాల్లాంటి సినిమాలను తీసిన బాపు.. ఎవరి దగ్గరా పనిచేయలేదు. కేవలం కథా బలమే ఆయన సినిమాలను విజయపథంలో నడిపించింది. బాపు గురించి మాట్లాడుకుంటూ రమణ గురించి చెప్పకపోతే అది పూర్తవదు. వారిద్దరూ ఒకే ఆత్మకు రెండు రూపాలు, ఒకే భావాన్ని పలికే రెండు పదాలు. బాపు దృష్టి అయితే రమణ దాని భావం. బాపు చిత్రం అయితే రమణ దాని పలుకు. అందుకే వీరిద్దరి వెండితెర ప్రయాణమే కాదు.. జీవనయానం కూడా కలిసికట్టుగానే సాగింది. అందుకేనేమో.. రమణ మరణించిన తరువాత ఎక్కువ కాలం బాపు మనలేకపోయాడు. ఆత్మ లేని దేహంగా ఉండలేక రమణను కలుసుకోవడానికి 2013 ఆగస్టు 31న శాశ్వతంగా వెళ్లిపోయారు. -
బాపురే
-
అజరామర చిత్రాల్ని సెల్యులాయిడ్‌పై చెక్కిన శిల్పి
-
గోదారి గట్టున బాపు, రమణ
ప్రఖ్యాత సినీ దర్శకుడు, చిత్రకారుడు దివంగత బాపు(సత్తిరాజు లక్ష్మీనారాయణ), ఆయన మిత్రుడు, ప్రముఖ రచయిత ముళ్లపూడి వెంకటరమణ విగ్రహాలను మంగళవారం సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. రాజమండ్రిలోని గోదావరి గట్టుపై శ్రీ ఉమా మార్కండేయేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు. - రాజమండ్రి -
మూవీ ముచ్చట్లు - బాపు
-
వారంతా చిరంజీవులే!
గత సంవత్సర కాలంగా సినీ ప్రముఖులు అనేక మంది ఎన్నడు లేని విధంగా వరుసగా అసువులు బాయడం బాధాకరమైన విషయం. చిత్రపరిశ్రమ దిగ్ధంతులు ఒక్కొక్కరు అర్ధాంతరంగా, సహజంగా, అసహజంగా తెరమరుగవుతున్నారు. దీంతో సినీ అభిమానులు తమ ఆప్తులను కోల్పోయినట్లు విచారంలో మునుగుతున్నారు. మహా నటీనటులు అంజలిదేవి, అక్కినేని నాగేశ్వరరావు, దర్శకులు, రచయిత వి.బి.రాజేంద్రప్రసాద్, బాపు, బాలచందర్, గణేశ్ పాత్రో, యువ కథానాయకుడు ఉదయ్‌కిరణ్, క్యారెక్టర్ యాక్టర్ పి.జె.శర్మ, శ్రీహరి, ఆహుతి ప్రసాద్, తెలంగాణ శకుంతల, సంగీత దర్శకుడు, గాయకుడు చక్రి, ప్రేక్షకులను తమ హాస్య సంభాషణ, నటనలతో ఉర్రూతలూగించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్, ఎం.ఎస్.నారాయణ లాంటి తమకు తామే సాటైన హాస్యనటులు ఈ భూప్రపంచం నుండి, సినిమాలోకం నుండి జారిపోవడం అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. ఈ నేపథ్యంలో మన కళాకారులందరికీ ఒక విన్నపం. వారు ఆరోగ్యాన్ని అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ జన్మలన్నీ అపురూపమైనవి. ఆ జిలుగుల ప్రపంచంలో ఈ విషయాన్ని చాలామంది విస్మరిస్తున్నారు. ఇకనైనా నటీనటులు ఆరోగ్యం కోసం జాగ్రత్త పడాలి. భౌతికంగా కనిపించకపోయినా వారు తీసిన సినిమాలు, చూపిన ప్రతిభ, అందించిన సంగీతం, నేడు మనకు కనిపించకపోయినా ఆయా చిత్రాలలో లీనమై చేసిన పాత్రలు ఎన్నటికీ జీవించే ఉంటాయి. ఎన్ని తరాలు గడిచినా కళ్లముందు కదలాడుతూనే ఉంటాయి. ఆ రకంగా వారు ఎప్పుడూ చిరంజీవులే. వారి కుటుంబాలకు మా ప్రగాఢ సంతాపం. - జి.వి. రత్నాకర్‌రావు వరంగల్ -
బాపురే...
శ్రీరాముడి వేషంలో కనిపిస్తున్న ఈ బాపు చిత్రం వెనక... ఓ హనుమంతుని కుంచె దాగుంది. చిత్రంతో పాటు కథ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఆ కథ పేరు.. ‘బాపు’ని కొలిచే ముచ్చట కనరే!! కథేమిటంటారా! ‘‘బాపుగారు ఏదో పనిపై తన గది విడిచి బయటికి వెళ్లినపుడు...గదిలోని బొమ్మలన్నీ కుంచెతో తన గోడు వెళ్లబోసుకున్నాయి. ఆ మహానుభావుడు తిరిగి గదికి చేరుకునేలోపు మా మనసెరిగి ఓ చిత్రం గీయమా...అంటూ మొరపెట్టుకున్నాయి. టేబుల్‌పై పరచిన తెల్లకాగితంపై కుంచె కదలడం మొదలుపెట్టింది. రాముడి వేషంలో బాపుగారి దివ్యస్వరూపం...చుట్టూ ఆ బొమ్మలకొలువుతో చిత్రం ముగిసింది’’ కథ...బాగుంది. చిత్రం అంతకన్నా గొప్పగా ఉంది. ఇంతకీ ఈ ఆలోచన వచ్చిందెవరికీ...ఆచరణకు నోచుకున్నదెన్నడూ అంటారా? ఆయన భక్తుల్లో ఒకరైన కూచి సాయిశంకర్ని పలకరిస్తే విషయాలన్నీ వివరంగా చెబుతారు. ‘సీతమ్మ పెళ్లి చిత్రం రీరికార్డింగ్ సమయంలో నేను బాపుగారి దర్శనం చేసుకున్నాను. ఐదవ ఏట నుంచే కుంచెతో ‘బొమ్మ’లాట ఆడుకున్న నేను బాపుగారికి వీరాభిమానిని. ఆ అభిమానంతోనే నేను ఇంటర్లో ఉండగా ‘బాపుని కొలిచే ముచ్చట కనరే!!’ కథతో పాటు దానికి సంబంధించిన చిత్రాలను గీశాను. అమలాపురంలో ఇంటర్ పూర్తయ్యాక ఫైనార్ట్స్ చదవడం కోసం మద్రాసుకెళ్లాను. బాపుగారికి నా కథ, చిత్రాలు చూపించాను. రాముడి వేషంలోఉన్న తన బొమ్మని చూసి చిన్నగా నవ్వుకున్నారు. ‘మద్రాసు దేనికొచ్చావు’ అన్నారు. ఫైనార్ట్స్ చదవడం కోసం అన్నాను. ‘అక్కర్లేదు.. ఈ బ్రష్‌కి ఆ అవసరం లేద’న్నారు. అని ఊరుకోలేదు...ఫైనార్ట్స్లోని చాలా ముఖ్యమైన అంశం ‘లైన్ ఆఫ్ యాక్షన్’పై ప్రత్యేకంగా పాఠం కూడా చెప్పారు. ఆ మాట మరువను... బాపుగారు నాకు పాఠం చెప్పేటప్పుడు ఒక మాట చెప్పారు ‘బ్రష్ స్ట్రోక్ ఎలాగుండాలంటే.. వేడన్నంమీద వెన్నముద్ద ఎలా కరిగి ప్రవహిస్తుందో...బ్రష్ స్ట్రోక్ బొమ్మమీద అలా వెళ్లాలి’ అని. ఎంత సహజంగా చెప్పారో చూడండి. ఈ ఒక్కముక్క అర్థం చేసుకోడానికి ఫైనార్ట్స్ని పదిసార్లు చదవాల్సి ఉంటుందేమో! నేను అప్పుడప్పడు కథలు రాసేవాడ్ని. ఒకసారి ఒక పత్రికకు నా కథను పంపాను. ఉత్తమకథకు బాపుగారు బొమ్మ వేస్తారని చెప్పారు. నేను కోరుకున్నట్టుగానే నా కథే ఎంపికైంది. బాపుగారు బొమ్మ కూడా వేశారు. ‘జంజమోముల స్వామి’ అనే ఆ కథకు బాపుగారు వేసిన బొమ్మ నా మనసు నింపేసింది. ఆ బొమ్మలో చిన్నికృష్ణుడికి మీసాలుంటాయి. అప్పటి నుంచి నా కథ పేరు ‘మీసాల కృష్ణుడి కథ’ అయిపోయింది. బాపుగారు భౌతికంగా మనకు దూరమైన క్షణాన ఆయనతో నాకున్న ఈ చిన్నిపాటి జ్ఞాపకాలు నా కడుపు నింపేశాయి. ఆయన లేరన్న విషయం గుండెను పిండేసినా, ఈ అనుభవాలనే అవార్డులుగా భావిస్తూ, ఒకింత గర్వంగా ఫీలవుతుంటాను. ఆయన ఆదర్శం... ప్రతి ఒక్క కళాకారుడు స్టేజి ఎక్కుతాడు ఒక్క చిత్రకారుడు తప్ప. అందుకే నేను పెయింటింగ్‌లో లైఫ్షోలపై దృష్టి పెట్టాను. స్టేజిపై ఒక పక్క అన్నమాచార్యుల కీర్తనలు పాడుతుంటే నేను అక్కడే లైవ్‌షోలో పెయింటింగ్స్ వేసి చూపిస్తానన్నమాట. ఈ కళకు అమెరికాలోని ‘తానా’ సభలు చక్కని వేదికగా మారాయి. దాదాపు పదేళ్లనుంచి నేను ఈ లైవ్‌షోలు ఇస్తున్నాను. టీటీడీ వారికి కూడా ఇలాంటి షోలు చేస్తుంటాను. నేను కోరుకున్న కళ నాకు ఎంతటి గుర్తింపు తెచ్చిపెట్టినా బాపుగారితో నాకున్న అనుబంధం...ఆయనపై నేను వేసిన చిత్రాలే నాకు ప్రత్యేక గుర్తింపుని తెచ్చిపెట్టాయి’’ - భువనేశ్వరి -
నరసాపురంలో బాపు కాంస్య విగ్రహావిష్కరణ
ప.గో: బాపు స్మృతి చిహ్నం ప్రపంచంలోనే మొదటిగా నరసాపురంలో గోదావరి చెంతన రూపుదిద్దుకుంది. తెలుగువాళ్ల గీతను మార్చిన నిశబ్ద గీతాకారుడి కీర్తిని భవిష్యత్ తరాలు స్మరించుకునేలా బాపు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు పల్లె రఘునాథ రెడ్డి, పీతల సుజాత, మాణిక్యాలరావు బాపు విగ్రహాన్ని ఆవిష్కరించిన వారిలో ఉన్నారు. చిత్రకారుడిగా, రసరమ్య దృశ్య కావ్యాలను వెండి తెరపై తనదైన శైలిని ఆవిష్కరించిన దర్శకుడిగా, హాస్యర్షిగా ప్రపంచ గుర్తింపు పొందిన బాపు జ్ఞాపకం ఆయన పురిటిగడ్డలో ఇక పదిలమనే చెప్పవచ్చు. -
కార్టూన్లు కాలానికి సాక్ష్యాలు
కార్టూన్లు కదిలే బొమ్మలు కార్టూన్లు మదిలో బొమ్మలు కార్టూన్లు పలికే కొమ్మలు కార్టూన్లు కదిలే రెమ్మలు కార్టూన్లు కదిలించే అమ్మలు కార్టూన్లు చేయందించే తమ్ముళ్లు కార్టూన్లు నడక నేర్పే నాన్నలు కార్టూన్లు కళ్లు తెరిపించే భార్యలు కార్టూన్లు కాలానికి సాక్ష్యాలు కార్టూన్లు వెన్నుతట్టే మిత్రులు కార్టూన్లు కంటిలో ఒత్తులు కార్టూన్లు ప్రజల చురకత్తులు కార్టూన్లు కారుచీకట్లో దివిటీలు కార్టూన్లు మండుటెండల్లో మంచుకొండలు కార్టూన్లు నిద్రలేపే కొక్కొరోకోళ్లు కార్టూన్లు జడివానలో మెరుపులు కార్టూనిస్టులు ప్రగతిరథ చక్రాలు కార్టూనిస్టులు సమాజ ఉచ్చ్వాశ నిశ్వాసాలు కార్టూనిస్టులు జాతి జవసత్వాలు కార్టూనిస్టులు నిత్య సత్యాన్వేషులు. (నేడు ప్రముఖ చిత్రకారుడు బాపు జయంతి. ఈ సందర్భంగా ఈ గీతం ఆయనకు అంకితం) - డా॥కూటికుప్పల సూర్యారావు విశాఖపట్నం -
నరసాపురంలో బాపు స్మృతి చిహ్నం
బాపు (సత్తిరాజు లక్ష్మీనారాయణ) పేరు చెప్పగానే తెలుగు అక్షరం పులకిస్తుంది.. తెలుగు బొమ్మ తల ఎగరేస్తుంది.. తెలుగు గీత సంతోషంతో ఉప్పొంగుతుంది.. గోదారమ్మ అలలు, అలలుగా ఎగసి పడుతుంది.. చిత్రకారుడిగా, రసరమ్య దృశ్య కావ్యాలను వెండి తెరపై తనదైన శైలిని ఆవిష్కరించిన దర్శకుడిగా, హాస్యర్షిగా ప్రపంచ గుర్తింపు పొందిన బాపు జ్ఞాపకం ఆయన పురిటిగడ్డ నరసాపురంలో ఇక పదిలమనే చెప్పవచ్చు. బాపు స్మృతి చిహ్నం ప్రపంచంలోనే మొదటిగా నరసాపురంలో గోదావరి చెంతన రూపుదిద్దుకుంది. తెలుగువాళ్ల గీతను మార్చిన నిశబ్ద గీతాకారుడి కీర్తిని భవిష్యత్ తరాలు స్మరించుకునేలా బాపు విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన జయంతి సందర్భంగా సోమవారం విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ మహత్తర ఘట్టం కోసం ‘పశ్చిమ’ ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. నరసాపురంలో ప్రాథమిక విద్య బాపు 1933 డిశంబర్ 15న నరసాపురంలో ఆయన అమ్మమ్మ ఇంట్లో వెంకట వేణుగోపాలరావు, సూరమ్మ దంపతులకు జన్మించారు. బాల్యంలో కొద్దికాలం ఆయన ఇక్కడే పెరిగారు. తండ్రి మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 1939-40లో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బాపును మద్రాసు నుంచి నరసాపురం తీసుకువచ్చారు. ఆ సమయంలో రెండేళ్లపాటు నరసాపురంలో టేలర్ హైస్కూల్లో బాపు ప్రాథమిక విద్యను అభ్యసించారు. అనంతరం బాపు కుటుంబం మద్రాసు చేరుకుంది. అక్కడ న్యాయశాస్త్రం (లా) చదివిన బాపు కొద్దికాలం తండ్రితోపాటు న్యాయవాద వృత్తిని కొనసాగించారు. గోదావరి అంటే ప్రాణం గోదారమ్మ ఒడిలో పెరగడం వల్ల ఆయనకు గోదావరి యాస, భాష, హోయలు అంటే ఎంతో ఇష్టం. ఆయన చాలా చిత్రాలను గోదావరి కథాంశం, బ్రాక్డ్రాప్తోనే తెరకెక్కించారు.39 సినిమాలకు దర్శకత్వం వహించగా వాటిలో 30 వరకు గోదావరి ప్రధానంశంగా సాగినవి కావడం విశేషం. గోదావరి అందాలను జగద్విదితం చేయడంతో పాటు పశ్చిమగోదావరి జిల్లా సోయగాలను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ప్రచారం ఇష్టముండదు బాపు పలుమార్లు జిల్లాకు, నరసాపురానికి వచ్చారు. ప్రచారంపై ఆసక్తి చూపని ఆయన ఎవర్నీ కలిసేవారు కాదని, సభలు, సమావేశాలు, సత్కారాలకు ఆహ్వానించినా ఆసక్తి చూపేవారు కాదని బాపు మేనల్లుడు, న్యాయవాది నిడమోలు రామచంద్రరావు అన్నారు. కొద్ది మంది మిత్రుల బాగోగులను ఆరా తీసేవారని చెప్పారు. ఇష్టమైన వృత్తిని, ప్రవృత్తిని ఎంచుకుని ముందుకు వెళ్లాలని బాపు సూచించేవారని అన్నారు. బాపు సినిమాల్లో కథానాయకులే ప్రధాన భూమికలు. మహిళా పక్షపాతిగా ముద్రపడిన బాపు విగ్రహాన్ని ఓ మహిళ తీర్చిదిద్దడం విశేషం. తాడేపల్లిగూడేనికి చెందిన ప్రముఖ శిల్పి దేవికారాణి వడయార్ బాపు కాంస్య విగ్రహాన్ని త యారుచేశారు. ఐదో పద్ముడు నరసాపురానికి చెందిన ప్రముఖుల్లో ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాలను అందుకున్న వ్యక్తుల్లో బాపు అయిదవవారు. ఈసీఐఎల్ వ్యవస్థాపకుడు అయ్యగారి సాంబశివరావు (ఏఎస్ రావు) పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. మహిళా పునర్వివాహాలకోసం పాటుపడిన అద్దేపల్లి సర్విశెట్టి, ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్‌గా పనిచేసిన డాక్టర్ ఎంఎన్ రావు పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారం పొందగా గతేడాది బాపును పద్మశ్రీ అవార్డు వరించింది. అధికారికంగా వేడుకలు నరసాపురం లలితాంబ ఘాట్ వద్ద బాపు విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం 10 గంటలకు విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారు. కెనడాలో ఉంటున్న బాపు పెద్ద కుమారుడు వేణుగోపాల్, హైదరాబాద్‌లో ఉంటున్న చిన్నకుమారుడు ప్రత్యేక ఆహ్వానితులు కాగా.. ప్రభుత్వం నుంచి పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. సినీ రంగ ప్రముఖులు రానున్నట్టు తెలిసింది. బాపు విగ్రహ ఏర్పాటుకు తానా విశేషంగా కృషిచేసింది. తానా అధ్యక్షుడు నన్నపనేని మోహన్, ప్రతినిధులు కోమటి జయరామ్, వేమన సతీష్ రూ.5 లక్షలు విరాళంగా అందజేశారు. మరో రూ.5 లక్షలను ఎంపీ తోట సీతారామలక్ష్మి నిధుల నుంచి మంజూరు చేశారు. బాపు జయంతి వేడుక, విగ్రహావిష్కరణ ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఉత్తర్వులు ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఇది అద్భుతం నరసాపురంలో బాపు విగ్రహం నెలకొల్పడం అద్భుతమైన విషయం. బాపు ప్రపంచస్థాయి మనిషి. ఆయన పుట్టినచోట, ఆయన నిత్యం ప్రేమించిన గోదావరి తీరంలో విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయం. తెలుగు భాష ఉన్నంత కాలం తెలుగు ప్రజల గుండెల్లో బాపు, ఆయన లిపి, బొమ్మలు పదిలంగా ఉంటాయి. ఏటా బాపు జయంతి వేడుకలను నిర్వహించాలి. - రెడ్డప్ప ధవేజీ ఆయన ప్రత్యేకత ఎవరికీ రాదు ప్రపంచంలో ఎందరో చిత్రకారులు ఉన్నారు. వారిలో బాపు ప్రత్యేకమైన వారు. తనపేరుపై ప్రత్యేక లిపిని సృష్టించిన గొప్ప మనిషి ఆయన. ఎందరో చిత్రకారులకు బాపు ఆదర్శనీయులు. ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందించదగ్గ విషయం. బాపు జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారంగా నిర్వహించడం అభినందనీయం. - విజయ్‌కుమార్, ప్రపంచ తెలుగు చిత్రకారుల సంఘం ఉపాధ్యక్షుడు చిత్రసీమ పులకిస్తోంది బాపు పేరు చెప్పగానే తెలుగు చిత్రసీమ పులకిస్తోంది. ఆయన స్క్రిప్టు ఆయన బొమ్మలాగే ఉంటుందని చెబుతుంటారు. యువ దర్శకులు, మాలాంటి యువ కళాకారులకు ఆయన జీవితం ఓ పాఠ్య గ్రంథం. నరసాపురంలో గోదావరి తీరంలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పడం విశేషం. అదీ మొదటిసారిగా బాపు విగ్రహం ఇక్కడ పెట్టడం మరీ విశేషం. - చేగొండి అనంత శ్రీరామ్, సినీ గేయ రచయిత గర్వం లేని మనిషి బాపు చాలాసార్లు ఇక్కడకు వచ్చారు. ఆయనలో ఎప్పుడూ గర్వాన్ని, దర్పాన్ని చూడలేదు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉండేవారు. ఇక్కడే టేలర్ హైస్కూల్లో కొంతకాలం చదువుకున్నారు. బాపు బాల్య స్నేహితుల్లో చాలా మంది మరణించారు. కొద్దిమంది ఇప్పటికీ ఉన్నారు. నరసాపురంలో ఆయన విగ్రహం పెట్టడం అభినందనీయం. - నిడమోలు రామచంద్రరావు, బాపు మేనల్లుడు -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - బాపు
-
బాపు,రమణ ధనుస్సు బాణాలు
‘‘బాపు-రమణ ఒకరికొకరు... ఎలాగంటే, ధనుస్సు బాణంలాగా ఒకరి గెలుపు కోసం ఒకరు కృషి చేశారు. కష్ట సుఖాలు పంచుకుంటూ స్నేహానికే వన్నె తెచ్చారు. చిత్రకారుడు, రచయితగా వృత్తిని స్వీకరించిన ఈ ఇద్దరు మిత్రులూ జీవితాంతం కలిసి నడిచారు. వీరిద్దరి కలయికతో సాక్షి చిత్రం తెరకెక్కింది. అయితే వీరిద్దరికీ బ్రేక్ ఇచ్చింది మాత్రం అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వచ్చిన బుద్ధిమంతుడు చిత్రమే.’’ చెన్నై, సాక్షి ప్రతినిధి:విభిన్న కళాకారులైన బాపు, రమణ ధనుస్సు బాణాలవలె ఒకరి గెలుపు కోసం ఒకరుగా నిలిచారని ప్రముఖ కథకులు, పాత్రికేయులు శ్రీరమణ (హైదరాబాద్) అభివర్ణించారు. తరతరాల తెలుగు కవిత ధారావాహిక 57వ ప్రసంగ కార్యక్రమాన్ని వేద విజ్ఞాన వేదిక, ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్తంగా ఆదివారం నిర్వహించారు. చెన్నై ఆస్కా హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో ‘బాపు రమణ సినిమాలు- సాహిత్యం’ అనే అంశంపై ఆయన ప్రసంగిస్తూ, ఒకరు చిత్రకారుడు, మరొకరు రచయిత ఎవరి అభిరుచులు వారివిగా ఉన్నా భిన్నత్వంలో ఏకత్వంలా జీవితాంతం కలిసి నడిచారన్నారు. గురజాడను అనుక్షణం తలచుకునే వారిద్దరూ కలిసి అద్భుతమైన పాత్ర లు సృష్టించారని చెప్పారు. రమణ సృష్టించిన పాత్రలే ఆయనను గుర్తుంచుకునేలా చేశాయన్నారు. ఫిలాసఫీతో సృష్టించిన అప్పారావు, బుడుగు పాత్రలు నేటికీ సజీవంగా నిలిచిపోయాయని చెప్పారు. తెలుగు సినిమా పరిశ్రమలో ముత్యాల ముగ్గు ఒక చరిత్రగా మిగిలడం బాపు-రమణల ప్రతిభకు తార్కాణమన్నారు. ఆరు దశాబ్దాల స్నేహంతో వారి సినిమాలు ఒక బ్రాండ్‌గా నిలిచిపోయాయని తెలిపారు. సినిమా రివ్యూ జర్నలిస్టుగా నిర్మొహమాటంగా విమర్శలు రాసిన రమణను సినిమా పరి శ్రమ ఆహ్వానిస్తే తొలుత నిరాకరించారని చెప్పారు. ఎందుకంటే తనచేత విమర్శలకు గురైన వారు ప్రతీకారం తీర్చుకుంటారేమోనని వెనకడుగు వేశారన్నారు. ఒక యాడ్ ఏజన్సీలో ఆర్ట్ డెరైక్టర్ అరుున బాపు, రమణతో కలిసి సినిమా తీద్దామన్న నిర్ణయంతో సాక్షి చిత్రం వచ్చిందన్నారు. చిత్రకల్పన బ్యానర్‌పై అక్కినేని నాగేశ్వరరావు ద్విపాత్రాభినయంలో తీసిన బుద్దిమంతుడు సినిమాతో వారిద్దరికీ బ్రేక్ వచ్చిందని తెలిపారు. సంగీతం, రచనలపై వారిద్దరికీ ఉన్న పట్టు, చక్కటి సినిమా టీమ్, డబ్బులు ఎగవేయరు అనే మంచిపేరును పరిశ్రమలో సంపాదించుకున్నారని తెలిపారు. 60 ఏళ్లుగా సెలబ్రటీలుగా నిలిచారు, తుది శ్వాస వరకు అలాగే నిలిచారని అన్నారు. తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన జంట బాపూ-రమణ అన్నారు. కష్టసుఖాలు పంచుకుంటూ స్నేహానికి నిర్వచనంగా నిలిచారని అన్నారు. దివంగత బాపు సోదరుడు శంకరనారాయణ, కుమారుడు వెంకటరమణ, కుమార్తె భానుమతి, కోడలు భారతి ఈ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వక్త శ్రీరమణను ఆస్కా మాజీ అధ్యక్షుడు ఈఎస్ రెడ్డి చేతుల మీదుగా వేదవిజ్ఞాన వేదిక అధ్యక్ష కార్యదర్శులు జేకే రెడ్డి, కందనూరు మధు సత్కరించారు. నగరానికి చెందిన తెలుగు కుటుం బాల వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
మా రాంబాబు గాడి ‘భశుం’ కాపురం!
నవ్వింత మా రాంబాబుగాడికి కాస్త స్టైల్‌గా, హీరోలా, షాన్ ఔర్ షౌకత్‌తో జీవించాలని కోరిక. అదేం చిత్రమోగానీ... వాడేదైనా సినిమాటిగ్గా చేయబోతే చాలు... అది డ్రమటిగ్గా ఫెయిలవుతుంటుంది. బాపూగారి ఫేమస్ కార్టూన్ ఒకటుంది. ‘భశుం’ కార్డ్ పడ్డ తర్వాత ‘ఇంత అవక తవక కంగాళీ చిత్రం చూళ్లేదండీ’ అనుకుంటూ ప్రేక్షకులు హాల్లోంచి బయటకొస్తూ ఉంటారు. ఆ ‘భశుం’ కార్డు పడటానికి ముందు జరిగిందంతా మా రాంబాబుగాడి సినిమాయేనని వాడి అనుమానం. భావుకుల భాషలో చెప్పాలంటే... ఒక ఆహ్లాద భానూదయ తొలికాంతుల వేళ. చలిగిలిగింతలు పెట్టే లేత పవనాల హేల. ధారగా కురుస్తున్న తుషారబిందువుల మాల! అయితే... మా రాంబాబుగాడి భాషలో క్రూడ్‌గా చెప్పాలంటే మంచు కురుస్తూ, చలి గజ్జున వణికిస్తున్న సమయంలో ఆ మంచుగాల్లో లారీల పొగ కాలుష్యం కాస్తా కాక్‌టెయిల్‌లా కలసిన టైము. నెత్తి మీద ముసుగేసుకున్నట్లుగా ఉండే ట్రాక్ సూట్‌తో (పై ముసుగును హుడ్ అంటారట) సినిమా హీరోలా జాగింగ్‌కు బయల్దేరాడు మన రాంబాబు. తల చుట్టూ ఉన్న హుడ్డులోని గుడ్లు తేలేశాడు. ఆరోగ్యం మాట ఎలా ఉన్నా అలర్జీతో ఆయాసంలో మునిగి ఆసుపత్రిలో తేలాడు. ప్రతివాడూ ప్రత్యూష పవనాలు బాగుంటాయంటాడు. కానీ ఇదేంట్రా... మనకు ఆ అందాలేమీ కనపడలేదు సరికదా... అనారోగ్యం మిగిలి, మందులు మింగాల్సి వచ్చింది అంటూ బాధపడ్డాడు. వాడి జాతకమే అంత. పరుగులోనే కాదు... పాణిగ్రహణంలోనూ అదే జరిగింది. పేరులోనే ‘గ్రహణం’ అనే మాట ఉన్న తర్వాత అలా జరగకుండా ఎలా ఉంటుంది? అందునా రాంబాబుకీ?! ఈ లోకంలో ఎవడైనా సరే... తన ప్రియురాలిని ప్రేమిస్తే... అదృష్టవంతుడైతే ఓకే అంటుంది. కాకపోతే కుదర్దు అనేస్తుంది. అదేమిటోగానీ... మన రాంబాబుగాడు ఎలాంటి ప్రపోజలూ పంపకముందే ఓ అమ్మాయి అతడి దగ్గరకు వచ్చి... ‘‘సారీ రాంబాబూ... కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల నేను నిన్ను ప్రేమించడం కుదర్దు. నా అశక్తతకు నన్ను మన్నించు’’ అనేసింది. అప్పట్నుంచి మనవాడికి అమ్మాయిలంటే చెడ్డ మంట. నేను ప్రపోజ్ చేస్తే నువ్వీమాట అనడం ఓ పద్ధతి. కానీ అలాంటిదేమీ లేకుండానే ఇదేమిటంటూ మండిపడ్డాడు మనవాడు. ఇది జరిగాక ఓ ముగ్గురు నలుగురు అమ్మాయిలు మనవాడికి తమ ప్రేమ ప్రపోజల్స్ పంపారు. కానీ అమ్మాయిలంటే ఉన్న మంట కొద్దీ మనవాడు వాళ్లందర్నీ కసికసిగా రిజెక్ట్ చేసేశాడు. ఈ లోపుగా మరో అమ్మాయి (ఈమె ఐదోది) నుంచి కూడా లవ్ ప్రపోజల్ వచ్చింది. అదేం మూడ్‌లో ఉన్నాడోగానీ... ఈసారి ఓకే చెప్పాడు. మనవాడు ఓకే చెప్పినప్పట్నుంచీ ఆ అమ్మాయి అన్యమనస్కంగా మారిపోయింది. చిరాకూ పరాకులతో చిర్రుబుర్రులాడింది. ఈ అల్లకల్లోలాల మధ్యనే వాళ్ల పెళ్లయిపోయింది. పెళ్లయితే అయ్యింది గానీ... దంపతుల మధ్య రోజూ గిల్లికజ్జాలే. ఏదో ఒక విషయంపై అగ్గిఫైరింగులే. ప్రేమపెళ్లే కదా ఇలా ఎందుకు జరుగుతోందని బంధువర్గమంతా ఆశ్చర్యపడ్డారు. ఎట్టకేలకు చాలా అనునయించి విషయం రాబట్టాడు మన రాంబాబు. సదరు ప్రేమిక చెప్పిన జవాబేమిటంటే... ‘‘ఆ రోజుల్లో మీరు రిజెక్ట్ చేసిన నలుగురు అమ్మాయిలకూ మంచి సంబంధాలు వచ్చాయి. ఒకరికి ఐఏఎస్ సెలక్టయినవాడితో పెళ్లి కాగా... మరొక అమ్మాయికి ఫారిన్ సంబంధం కుదిరింది. ఇంకో అమ్మాయికి ఐఆర్ఎస్తో ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్మెంట్లో రాష్ట్రస్థాయి అధికారి! దాంతో మన వీధిలోని అమ్మాయిల్లో ఒక రూమర్ పాకింది. మీకు ప్రపోజ్ చేసి, మీతో రిజెక్ట్ చేయించుకుంటే చాలు... ఆ అమ్మాయికి మంచి సంబంధం కుదురుతుందనే గుసగుసలు బయల్దేరాయి. ఈ సెంటిమెంట్ టాక్‌తో నేనూ ప్రభావితమై... ఎలాగూ రిజెక్ట్ చేయకపోతారా అని మీకు ప్రపోజ్ చేశాను. మీరు అవునన్నారు కాబట్టి నేను కాదనలేను. నేనే ప్రపోజ్ చేసినా, మీ మీద మనసు లేదు కాబట్టి అవుననలేను. అందుకే మన కాపురం ఇలా ఏడ్చింది’’ అంటూ విషయం బయట పెట్టింది. ఎంత సినిమాటిగ్గా జీవించాలనుకుంటాడో అంత డ్రమటిగ్గా మారిపోవడం వాడి జీవిత ప్రత్యేకత. ఈలోపు రాంబాబు గాడికీ కాస్త గౌరవప్రదమైన ఉద్యోగమే వచ్చి, దాంట్లో చేరిపోయాడు. అది జరిగాక కాస్త కౌన్సెలింగ్ ఇవ్వడంలో దిట్టలైన కొందరు మహిళామణులు బయల్దేరి... ‘రాంబాబు గాడికి ప్రపోజ్ చేస్తే, మంచి సంబంధం కుదురుతుందనే సెంటిమెంట్ మళ్లీ వర్కవుట్ అయ్యింది. నీ అదృష్టం బాగుంది కాబట్టే వాడికి మంచి జాబ్ వచ్చింది. లేదంటే వాడిలాంటి రెటమతం గాడికి అలాంటి ఉద్యోగమా?’’ అంటూ వాడి భార్యామణిని అందరూ సమాధానపరచారు. దాంతో తన రాతా బాగుండబట్టే రాంబాబుకు జాబు దక్కిందనీ, దాంతో తన అదృష్టమూ చక్కబడిందనే తృప్తితో కలహం సద్దుమణిగించి, కాపురం మొదలుపెట్టింది వాడి సతీమణి. ఇవన్నీ వాడికీ తెలుసుకాబట్టే... ఎప్పుడైనా పెళ్లాంతో కాస్త గొడవ మొదలవ్వగానే... ‘భశుం’ అంటూ బయటికి జారిపోయి, సద్దుమణిగాక ఇంట్లోకి దూరిపోయి... ఇలా ఇంట్లోకీ, బయటకీ షటిల్ సర్వీసు చేస్తుంటాడు. - యాసీన్ -
వుడయార్ శిల్పశాలలో బాపు విగ్రహాలు
కొత్తపేట: విఖ్యాత చిత్రకారుడు, ప్రముఖ సినీ దర్శకుడు స్వర్గీయ బాపు కాంస్య విగ్రహాలు తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలోని వుడయార్ శిల్పశాలలో రూపుదిద్దుకోనున్నా యి. చెన్నై తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో చెన్నై నగరంలోని ఓ ప్రధాన కూడలిలో, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజమండ్రి, నరసాపురంలలో గోదావరి ఒడ్డున ఏర్పాటు చేసేందుకు మూడు విగ్రహాలను తయారు చేయనున్నట్టు ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్ శనివారం విలేకరులకు చెప్పారు. ఏడున్నర అడుగుల ఎత్తు విగ్రహాలను రూపొందించనున్నానని, ప్రస్తుతం నమూనా విగ్రహాలను తయారు చేస్తున్నానని తెలిపారు. త్వరలో కాంస్య విగ్రహాల నిర్మాణం పూర్తి చేస్తానన్నారు. బాపుతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని, ఆయన కాంస్య విగ్రహాలు తయారు చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. -
చిత్రకారుడు కాదు... చరిత్రకారుడు
బాపు పేరిట ఆర్ట్ గ్యాలరీ డా.వరప్రసాద్ రెడ్డి ప్రకటన నాంపల్లి: బాపు కేవలం చిత్రకారుడు మాత్రమే కాదని...చరిత్రకారుడని పారిశ్రామికవేత్త పద్మభూషణ్ డాక్టర్ కె.ఐ.వరప్రసాద్ రెడ్డి శ్లాఘించారు. గురువారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో బాపు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డాక్టర్ కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ బాపు పేరిట ఆర్ట్ గ్యాలరీ నిర్మాణానికి నిర్ణయించినట్లు ప్రకటించారు. ప్రభుత్వం సాయం చేసినా, చేయకపోయినా సాహితీవేత్తలందరం కలిసి ఆర్ట్ గ్యాలరీని నిర్మిస్తామని వెల్లడించారు. కొంటె చిత్రాలు, చలన చిత్రాలను రాబోయే తరాలకు అందించినప్పుడే ఆయనకు నిజమైన అశ్రునివాళి అవుతుందన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి మోహన్ కందా మాట్లాడుతూ తెలుగు భాషకు బాపు కొత్త రూపం తెచ్చారని కీర్తించారు. ఆర్ట్ గ్యాలరీ నిర్మాణానికి తన వంతుసాయం అందిస్తానన్నారు. సినీ నటుడు రావి కొండలరావు మాట్లాడుతూ బాపుతో సాన్నిహిత్యం లభించినందుకు తన జీవితం ధన్యమైందని చెప్పారు. ఇప్పటి వరకు దేవతామూర్తుల చిత్రాలను కార్టూన్లుగా వేసిన వారు ప్రపంచంలో ఎవ్వరూ లేరని తెలిపారు. సాహితీవేత్త జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ చిత్రకారుడిగా బాపు లెజెండ్ అన్నారు. డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ బాపు నిర్యాణ సభను చలోక్తులు, చమత్కారాలతో జరుపుకోవడం విశేషమన్నారు. నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ బాపును తలచుకొని నవ్వుకుంటుంటే ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత శ్రీ రమణ, సన్‌షైన్ ఆస్పత్రి (సికింద్రాబాద్) ఎం.డి.డాక్టర్ గురువారెడ్డి, కార్డియాలజిస్ట్ మన్నెం గోపీచంద్, కార్టూనిస్ట్‌లు సుధామ, ఎస్వీ రామారావు, రచయిత ఎంబీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
'బాపు నా గురువు'
తనను నటుడిగా మలచిన ఘనత ప్రముఖ దర్శకుడు బాపుదేనని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ అన్నారు. 1980లో ఆయన దర్శకత్వంలో వహించిన 'వంశవృక్షం' చిత్రం ద్వారా తాను తెరంగ్రేటం చేసిన సంగతి అనిల్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. చిత్రాలలో ఏ విధంగా నటించాలి అనేది బాపు నుంచి తాను నేర్చుకున్నానని చెప్పారు. అందుకే బాపు తనకు గురువని ... ఓ విధంగా చెప్పాలంటే బాపు నాకు మెంటర్ అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రఖ్యాత దర్శకులతో నటించానని... అయితే బాపు దర్శకత్వంలో నటించడం తన అదృష్టమన్నారు. బాపు విభిన్న శైలిలో చిత్రాలను తెరకెక్కిస్తారని అనిల్ ఈ సందర్బంగా ప్రశంసించారు. వంశవృక్షంలోనే కాకుండా బాపు హిందీలో తీసిన 'వోహ్ సాత్ దిన్' చిత్రంలో కూడా నటించానన్నారు. ఆయన దర్శకత్వం ప్రత్యేక శైలిలో ఉంటుందని గుర్తు చేశారు. బాపు మరణంతో దేశం మంచి దర్శకుడ్ని కోల్పోయిందని అన్నారు. -
బాపు జ్ఞాపకాలలో...
ఆయన గీత తెలుగువారి జాతి సంపద. కళారంగంలో చేతులు తిరిగిన కళాకారులకు ఆయనే ‘గీత’కారుడు. తెలుగునాట చాలామంది చిత్రకారులు ఆయనకు ఏకలవ్య శిష్యులు. ఆయనతో కొందరిది సన్నిహిత సంబంధం. మరికొందరిది ఆత్మీయానుబంధం. బాపు గీత గోడ మీద అందమైన బొమ్మ అయినట్లే, ఆయనా ఇప్పుడు తెలుగువారి మనసుల్లో అందమైన జ్ఞాపకంగా మిగిలారు. ఆయన సన్నిహితులు, శిష్యులు, అభిమానులు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వద్ద చేరారు. ఈ సందర్భంగా ‘సిటీప్లస్’తో వారు తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. సీనియర్ ఆర్టిస్టులు గోపి, మోహన్, శంకర్, లేపాక్షి, రవికిషోర్, ఆనంద్, రచయితలు శ్రీరమణ, రమణమూర్తి, శివాజీ తదితర ప్రముఖులు బాపుతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. యంగ్‌స్టర్స్‌ని ఎంకరేజ్ చేసేవారు... బాపు తర్వాత అంతటి ఆర్టిస్టుగా పేరున్న గోపి మాట్లాడుతూ.. ‘బాపుని చాలాసార్లు కలిశాను. 1977లో అనుకుంటా. సీతాకళ్యాణం సినిమా షూటింగ్ సమయంలో మద్రాస్‌లోని విజయా స్టూడియోలో కలుసుకున్నప్పుడు ‘మీరు ఏది గీస్తే అది బొమ్మ అండీ.. వెనక్కు తిరిగి చూడకండి’ అని చెప్పారు. యంగ్‌స్టర్స్‌ని అంతలా ఎంకరేజ్ చేసేవారాయన. మేమంతా బాపుని గురువుగా భావించి ఎదిగిన వాళ్లమే. చివరకు అదెలా అయిందంటే, ఒకానొక సందర్భంలో ఆయన నన్ను తన గురువుగా చెప్పారు. వాత్సల్యానికి అది ఎక్స్ట్రీమ్ లెవల్’ అంటూ బాపుతో తన అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. పక్కనే ఉన్న రవికాంత్‌రెడ్డి అందుకుని ‘పదిహేనేళ్ల కిందట విరసం వాళ్లు వేసిన ఓ పుస్తకంలో మోహన్‌గారితో పాటు నేనూ కొన్ని క్యారికేచర్స్ వేశాను. వాటిలో బాపుగారి క్యారికేచర్ కూడా ఉంది. కొన్నాళ్లకు బాపు హైదరాబాద్ వచ్చారు. ఆయన బసచేసే మయూరి గెస్ట్‌హౌస్ ఏరియాలోనే మేం ఉండేవాళ్లం. ఓ రోజు మిట్టమధ్యాహ్నం మా అపార్ట్మెంట్కొచ్చారు. లిఫ్ట్ లేదు. మెట్లమీది నుంచే థర్డ్‌ఫ్లోర్‌లో ఉన్న మా ఫ్లాట్‌కి వచ్చారు. ‘బాబూ.. నువ్వు బొమ్మలు వేసిన పుస్తకం చూశాను. చాలా బాగా వేస్తున్నావు. కీపిటప్’ అని చెప్పి వెళ్లిపోయారు’ అని గుర్తు చేసుకున్నారు. ఆర్టిస్ట్ లేపాక్షి మాట్లాడుతూ, ‘బాపుగారి కార్టూన్స్ ఇమిటేట్ చేయాలని చాలా ట్రై చేశా. నావల్ల కాలేదు. ఆయన కార్టూన్స్‌ని ఇమిటేట్ చేయడానికి ఓ స్థాయి ఉండాలనిపించి వదిలేశా. నాకు ఇన్స్పిరేషన్ మాత్రం ఆయనే’ అని బాపు నైపుణ్యాన్ని కొనియాడారు. బాపు లేని లోటు లోటే... ‘బాపుగారిని ఇష్టపడని వాళ్లుంటారా?’ అంటూ బాపుని తలచుకున్నారు శ్రీరమణ. ‘తమిళ ఆర్టిస్ట్ గోపుల్గారికి బాపు అంటే భలే ఇష్టం. వీళ్లిద్దరూ కలసి ఒక అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలో పనిచేసేవారు. అప్పట్లో బాపుగారు హయ్యెస్ట్ పెయిడ్ ఆర్ట్ డెరైక్టర్. నెలకు రెండువేల ఐదువందల రూపాయల జీతం. ఫియట్ కారు.. అలాంటి ఉద్యోగం బోర్ కొడుతోందని మానేశారు. ‘మీరూ మానేసి సొంతంగా పెట్టుకోండి’ అని గోపుల్గారికీ సలహా ఇచ్చారట. ఆ సలహాతోనే గోపుల్గారు ‘యాడ్వేవ్’ పెట్టారు. బాపుగారు సినిమా వైపు వచ్చారు. అలాంటి బాపు లేని లోటు లోటే’ అని శ్రీరమణ అంటుండగా, ‘మీకు ఆయన రాసిన ఉత్తరం గురించి చెప్పండి’ అని కార్టూనిస్ట్ శంకర్ అడిగారు. ఉత్తరమేంటి అని అడిగిన ఇతర మిత్రుల కోసం శంకర్ తానే చెప్పడం ప్రారంభించారు. ‘ఈ మధ్య శంకర్ వేసిన బొమ్మలను గమనిస్తున్నా. అంతర్జాతీయ స్థాయిలో చాలా బాగుంటున్నాయి.. ఇంకాస్త శ్రద్ధపెడితే ఇంకా అందంగా వస్తాయి. ఆయన వేసిన ఎమ్మెస్ సుబ్బులక్ష్మి క్యారికేచర్ బాగుంది. కింది లిప్ ఇంకాస్త మెరుగ్గా వేసి ఉండాల్సింది. ఈ విషయం శంకర్‌తో అనకండి నొచ్చుకుంటాడేమో.. నేను పంపే ఈ జిరాక్స్‌లు అతనికివ్వండి’ అని ఉత్తరంతో పాటు ఫారిన్ పుస్తకాలకు సంబంధించిన కొన్ని జిరాక్స్‌లు పంపించారు. ఆ ఉత్తరం ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది’ అని చెప్పారు. ‘బాపు’రే పదునాల్గు భువనభాండముల్.. ‘నేను 1967లో ఎస్సెల్సీలో ఉన్నప్పుడు ఒకసారి మద్రాసు వెళ్లాను. అన్నయ్యతో కలసి బాపుగారి ఇంటికి వెళ్లాను. అప్పుడే ఫస్ట్‌టైమ్ బాపుగారి ఒరిజినల్స్ చూడటం. మనిషంత ఎత్తులో ఉన్న ఆ బొమ్మలను చూస్తే పదునాల్గు భువనభాండములను చూసిన అనుభూతి’ అని గుర్తుచేసుకున్నారు రచయిత, చిత్రకారుడు శివాజీ. బాపు దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేసిన గాంధీ మాట్లాడుతూ ‘వీళ్లందరికీ బాపు ప్రశంసలు ఉంటే, నాకు తిట్లెక్కువ. నేను డెరైక్టర్‌గా చేసిన ‘సారీ.. నాకు పెళ్లయింది’ అడల్ట్ సినిమా అని చాలా సమీక్షలు వచ్చాయి. ఈ విషయం తెలిసిన బాపు ‘డబ్బులే కావాలనుకుంటే ఏ పనైనా చేసుకోవచ్చు. ఇంకోసారి ఇలాంటి సినిమాలు తీయొద్దు’ అన్నారు అని చెప్పారు. బాపు దగ్గర కోడెరైక్టర్‌గా పనిచేసిన ఆర్టిస్ట్ రాంపా మాట్లాడుతూ ‘ఎమినెంట్ కార్టూనిస్ట్స్ ఆఫ్ ఇండియా’ డాక్యుమెంటరీకి నేను కోడెరైక్టర్ని. బాపుగారు డెరైక్టర్. ‘మీరిలా కూర్చోవద్దు.. ఇలా కూర్చోండి’ అని చెబితే ‘అలాగేనండి తప్పకుండా.. మీరు చెప్పినట్టే చేస్తాను’ అనేవారు ఎంతో వినయంగా’ అంటూ బాపుని తలచుకున్నారు. ఆర్టిస్ట్ రవికిషోర్ మాట్లాడుతూ.. ‘ఒకసారి ఆయనకు నా ఫొటోలు పంపిస్తూ, ‘ఇవి డ్రైబ్రష్లో ఒకటి, కలర్లో ఒకటి స్కెచ్‌వేసి పంపగలరు. ధైర్యం చేసి రాస్తున్నాను. ఏమీ అనుకోవద్దు’ అని ఉత్తరం రాశాను. ఆయన నేను కోరినట్టే రెండు స్కెచెస్ పంపించి, ‘కిషోర్‌గారు మీ స్కెచ్‌లు వేసి పంపిస్తున్నాను. నచ్చితే ఉంచుకోండి. నచ్చకపోతే మళ్లీ వేసిస్తా’ అని ఫోన్ చేశారు’ అంటూ బాపుతో తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. రచయిత రమణమూర్తి మాట్లాడుతూ ‘బాపు భాగవతం సీరియల్‌కి పాడిన వారిలో మా అమ్మాయీ ఉంది. పాటను సీరియల్లో లిప్ మూమెంట్‌కు అనుగుణంగా పాడించుకున్నారు. కొంచెం కష్టమైన ప్రక్రియ. అయిపోయాక ‘నిన్ను చాలా కష్టపెట్టానమ్మా’ అన్నారు మా అమ్మాయితో. మా అమ్మాయి ఆయనను ఆటోగ్రాఫ్ అడిగితే, ‘మీరు గాయకులు.. పెద్దవాళ్లు. మేం చిన్నవాళ్లమమ్మా.. అంటూనే ఆటోగ్రాఫ్ ఇచ్చారు’ అని తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఆర్టిస్ట్ మోహన్ మాట్లాడుతూ ‘బాపు సినిమాలకు, బొమ్మలకు అమెరికా, ఆస్ట్రేలియాల్లో అభిమానులు ఉన్నారు. అయినా ఆయనకు రావాల్సినంత గుర్తింపు రాలేదు’ అని నిర్వేదం వ్యక్తం చేశారు. -
కోనసీమలో బాపు కళావేదిక
►బాపు చిత్రాలతో మ్యూజియం ఏర్పాటుకు సన్నాహాలు ►చిత్రకళాపరిషత్ అధ్యక్షుడు ‘కొరసాల’ అమలాపురం టౌన్ : ప్రసిద్ధ చిత్రకారుడు బాపు గీసిన అపురూప చిత్రాలను చిరస్మరణీయంగా నిలిపేందుకు కోనసీమ చిత్ర కళాపరిషత్ సన్నాహాలు చేపట్టింది. చిత్ర కళాపరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరసాల సీతారామస్వామి పాతికేళ్లుగా అమలాపురంలో జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పదివేల వినాయక చిత్రాలను విభిన్న రూపాల్లో గీసిన ప్రముఖ చిత్రకారుడు సీతారామస్వామికి బొమ్మల బ్రహ్మ బాపుతో 45 ఏళ్ల అనుబంధం ఉంది. కోనసీమ చిత్ర కళా పరిషత్ ఏటా జనవరిలో నిర్వహించే జాతీయ ఉత్సవాలకు వచ్చే జనవరితో 25 ఏళ్లు నిండుతున్నాయి. 2015 జనవరి మూడో వారంలో చిత్ర కళాపరిషత్ రజతోత్సవాలు నిర్వహిస్తారు. దీనికి చిత్రలేఖనంలో తన గురుతుల్యుడైన బాపును సీతారామస్వామి ముఖ్యఅతిథిగా ఆహ్వానించగా అందుకు ఆయన అంగీకారం కూడా తెలిపారు. అయితే ఇంతలో బాపు అంతిమశ్వాస విడవడంతో రజతోత్సవాల నిర్వహణకు తీరని లోటు ఏర్పడింది. ఈ నేపథ్యంలో బాపుతో తనకున్న అనుబంధం సాక్షిగా ఆయన గీసిన పలు కళాఖండాలను కోనసీమలో సజీవంగా పదిలపరచాలని సీతారామస్వామి నిర్ణయించారు. అమలాపురంలో తన నివాసం లోని సృష్టి కళానిలయంలో గురువారం జరిగిన బాపు సంతాప సభలో సీతారామస్వామి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. బాపు పేరిట శాశ్వత గురుతులు సీతారామస్వామి ఇంటి ఆవరణలో సంతాపసభ నిర్వహించిన స్థలంలోనే బాపు కళా వేదిక ఏర్పాటు చేయనున్నారు. అలాగే తన ఆర్ట్ గ్యాలరీలోని ఓ గదిలో బాపు చిత్రాలతో ప్రదర్శనశాల కూడా నెలకొల్పుతున్నారు. 2015 జనవరిలో అమలాపురం చిత్ర కళాపరిషత్ రజతోత్సవాలు జరిగే వేదికకు బాపు కళాపీఠం అని పేరుపెడుతున్నట్టు ప్రకటించారు. అలాగే బాపు పేరిట ఓ ప్రముఖ చిత్రకారుడికి జీవన సాఫల్య పురస్కారం అందిస్తామని ప్రకటించారు. ఇదే సందర్భంలో కోనసీమలో 25 వేల మంది విద్యార్థులకు 25 చోట్ల బాపు పేరిట చిత్రలేఖన పోటీలు జరుగుతాయన్నారు. వీరిలో 100 మంది ఉత్తమ చిత్రకారులకు బాపు స్మారక అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. పోటీలు నిర్వహించే 25 కేంద్రాల్లో కూడా బాపు బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తామన్నారు. సీతారామస్వామి తొలి గురువు బాపు: కోనసీమ చిత్రకళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరసాల తన తొలిగురువుగా బాపును పేర్కొంటారు. వారిద్దరికీ 45 ఏళ్ల అనుబంధం ఉంది. హైదరాబాద్‌లో సీతారామస్వామి చిత్రకళా ప్రదర్శనలను బాపు తిలకించిన సందర్భాలూ ఉన్నాయి. బాపుపై తన ఎనలేని అభిమానానికి గుర్తుగా 43 ఏళ్ల కిందటే తన కుమారుడికి సీతారామస్వామి బాపు అని పేరుపెట్టారు. అంతేకాదు.. తన మనుమడికి సైతం ధృవబాపు అని పేరు పెట్టారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న సీతారామస్వామి కుమారుడు బాపు గతంలో హైదరాబాద్‌లో నివసించేవారు. అప్పట్లో వారింటికి బాపు అనేకసార్లు వచ్చేవారని, ఎన్నో ఆత్మీయ సందర్భాలు తమ మధ్య ఉన్నాయని సీతారామస్వామి ‘సాక్షి’కి వివరించారు. -
ఫిలించాంబర్ లో బాపు సంతాప సభ
-
బాపు అంతిమ యాత్ర
-
అశ్రునయనాలతో బాపుకు వీడ్కోలు
చెన్నై బిసెంట్‌నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు రోశయ్య, సినీ తదితర ప్రముఖుల నివాళి చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు బాపుకు అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలి కారు. అనారోగ్యంతో ఆదివారం తుది శ్వాస విడిచిన బాపు అంత్యక్రియలు మంగళవారం చెన్నై బిసెంట్ నగర్‌లోని శ్మశానవాటికలో జరిగాయి. చెన్నై అడయార్‌లోని స్వగృహంలో బాపు పార్ధివదేహాన్ని మూడు రోజులుగా తెలుగు చలన చిత్రరంగ ప్రముఖులు, బాపు అభిమానులు పెద్ద సం ఖ్యలో దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య వచ్చి బాపుకి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలుగు వారి హృదయాలలో చెరగని ముద్ర వేసిన మహానుభా వుడు బాపు అని ఆయన కొనియాడారు. తెలుగుజాతి ఒక ప్రజ్ఞాశాలిని కోల్పోయిందని చెప్పారు. బాపు మళ్లీ జన్మించాలని, తెలుగుజాతికి వెలుగు లు తేవాలని ఆకాంక్షించారు. బాపు ప్రతి భారతీ యుడి మదిలో కొలువై ఉన్నారని ఆంధ్రప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. బాపు మరణం మనకు దుర్దినమని అన్నారు. భారతదేశంలోనే బాపు వంటి దర్శకులు మరెవ్వరూ లేరని, ఆయన ప్రతిభకు మరెవ్వరూ సాటిరారని నటుడు మోహన్‌బాబు అన్నారు. భారత దేశ జాతీయ పతాకానికి ఎంతటి గంభీరత ఉందో అంతటి గంభీరతను మూర్తీభవించుకున్న వ్యక్తి బాపు అని సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అన్నారు. బాపు కళాతృష్ణ కలిగిన ఒక మహర్షి అని చెప్పారు. స్నేహానికి ప్రతీకలైన బాపు రమణల్లోని ఐదు అక్షరాలు పంచాక్షరీ మంత్రంతో సమానమని అన్నారు. బాపు, రమణ చిత్రాలు తెలుగు సంస్కృతికి ప్రతిబింబాలని గాయకుడు మనో అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా ఆ రాష్ట్ర సమాచార, ప్రసార మంత్రి పల్లె రఘునాథరెడ్డి వచ్చి బాపు భౌతికకాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బాపు రమణల ప్రతిభను భావి తరాలకు తెలియజేసేలా ఏపీ ప్రభుత్వం వారి జయంతి ఉత్సవాలను నిర్వహిస్తుందని అన్నారు. బాపు, రమణల ప్రతిభను పాఠ్యాంశాలుగా చేరుస్తామన్నారు. కొత్త రాజధానిలో నిర్మించే కళాక్షేత్రానికి బాపు, రమణల పేరు పెడతామన్నారు. తెలుగు తెరకు బాపు అందించిన సేవలను జాతి ఎన్నటికీ మరువదని చెప్పారు. పలువురు సినీ ప్రముఖులతో పాటు బాలీవుడ్ హీరో అనిల్‌కపూర్, నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. పార్ధివదేహాన్ని మోసిన బాలు బంధువులు, అభిమానులతోపాటు ఎస్పీ బాలు కూడా బాపు భౌతికకాయాన్ని ఇంట్లోంచి మోసుకుంటూ వచ్చి అంబులెన్సులో ఎక్కించారు. శ్మశానవాటికలో ఉద్విగ్న వాతావరణం మధ్య బాపు కుమారులు వేణుగోపాల్, వెంకటరమణ అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. -
బాపుకు కన్నీటి వీడ్కోలు
తమిళ సినిమా : స్థానిక అడయార్, ఆర్యపురంలోని గ్రీన్‌వేస్ ప్రాంతం విషాదవదనంతో మూగబోయింది. ఒక ప్రాంతం కాదు ఒక రాష్ట్రం కాదు, పలు రాష్ట్రాలకు చెందిన వారి మనసుకు కలిగే ఈ మౌన బాధ అంతా ఒకే ఒక్క వ్యక్తి కోసం అంటే ఆయనెంత ఘనుడో అర్థం చేసుకోవచ్చు. బాపు అనే రెండక్షరాల పేరు గల ఆయనెంత ధన్య జీవి. సినీ వినీలాకాశంలో బాపు ఒక వ్యక్తి కాదు శక్తి అని ప్రముఖలే కీర్తించారు. బాపు దర్శకుడిగా ఎంత ఖ్యాతి చెందారో, చిత్ర కళాకారుడిగా అంత విఖ్యాతి గాంచారు. తెలుగు జాతి మనసుల్లో బాపు పేరు మరపుండదు. మరుపులేదు ఆయన బొమ్మకు చెరుపు ఉండదు. బాపు కళాత్మకంలో విశ్వవ్యాప్తం. బాపు అనే పదం చారిత్రాత్మకం. ఇదే జగమెరిగిన సత్యం. బాపు భౌతిక కాయానికి అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంట సమయంలో స్థానిక బీసెంట్ నగర్లో గల శ్మశాన వాటికలో సంప్రదాయ బద్దంగా జరిగాయి. అంతకు ముందు ఆయన ఇంటి వద్ద వేదపండితులు శాస్త్రోక్తంగా పెద్ద కుమారుడు వేణుగోపాల్ చేత కర్మకాండ కార్యక్రమాన్ని నిర్వహించారు. కడ వరకు ఇంటి వాకిలి వరకు భార్య, కాటి వరకు పిల్లలు కడవరకు ఎవరో అంటారు. ఇది నగ్న సత్యం. ప్రాణంపోయిన కట్టెను కాటికి మోసుకుపోవడానికి నా అన్నవాళ్లను నలుగురిని సంపాదించుకోవాలంటారు. ఈ విషయంలో బాపు నిజంగా అదృష్టవంతులే. ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ కళాకారులు ఎంతో మంది బాపు అంత్యక్రియల సమయంలో దగ్గరున్నారు. వందలాది మంది బాధాతప్త మనసులతో బాపు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర మంత్రి వర్యులు రఘునాధ్ రెడ్డి, మండలి బుద్ద ప్రసాద్, ప్రముఖ హిందీ నటుడు అనిల్‌కపూర్, ఆయన సోదరుడు నటి శ్రీదేవి భర్త, నిర్మాత బోనికపూర్, గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తదితరులు బాపు అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించడం విశేషం. గవర్నర్ రోశయ్య, నటుడు మోహన్ బాబు, గాయకుడు నాగూర్ బాబు మొదలగు పలువురు బాపు భౌతిక కాయానికి నివాళులర్పించారు. బాపుతో 38 ఏళ్ల అనుబంధం బాపు మృతి మంగళవారం సంతాపం వ్యక్తం చేసిన వారిలో సంగీత దర్శకులు మాదవపెద్ది సురేష్. తన అనుభవాలను పంచుకున్నారు. బాపుతో నాకు 38 ఏళ్ల అనుబంధం ఉంది. మనవూరి పాండవులు చిత్రానికి కె.వి.మహాదేవన్ సంగీతం అందించారు. అప్పుడు ఆయన వద్ద కీబోర్డు ప్లేయర్‌గా పని చేశాను. అప్పటి నుంచే బాపుతో నా అనుబంధం మొదలయ్యింది. బాపు ఒక ఎన్సైక్లోపీడియా బాపు ఒక ఎన్సైక్లోపీడియా అని నటుడు రామినీడు కీర్తించారు. ఆయన సాక్షి చిత్రం నుంచి అన్ని చిత్రాలు చూశాను. బాపు చివరి చిత్రం శ్రీరామరాజ్యంలో నటించే అవకాశం రావడం నా అదృష్టం అన్నారు రామినీడు. బాపుకు ఏకలవ్య శిష్యుడిని బాపుకు నేను ఏకలవ్య శిష్యుడినని ప్రముఖ దర్శకుడు వంశీ అన్నారు. 1979లోనే ఆయన పరిచయ భాగ్యం కలిగింది. దర్శకుడిగా నేనీ స్థాయిలో ఉన్నానంటే ఆయన చలవే. స్నేహానికి నిర్వచనం బాపు, రమణ ప్రేమకు, స్నేహానికి సరైన నిర్వచనం ఉండదు. అలాంటిది స్నేహానికి అసలు, సిసలు నిర్వచనం బాపు, రమణలని ప్రముఖ గీత రచయిత భువనచంద్ర వ్యాఖ్యానించారు. లక్షా 50 వేలకు పైగా చిత్ర లేఖనాలు గీసిన చిత్ర కళాకారుడు బాపు. ఊహల్లో ఉన్న భగవంతుడిని మన కళ్లముందు ప్రత్యక్షపరచిన ఘనత బాపుదే. బాపు ఒక లెజెండ్ బాపు గురించి చెప్పే వయసు నాకు లేదు, అంత స్థాయికి కాదు. అందరు అంటున్నట్టుగా బాపు ఒక లెజెండ్. ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. శ్రీరామరాజ్యంలో బాల హనుమంతుడిగా బాపు నన్ను తీర్చిదిద్దారు. ఆ చిత్రం నా కెరీర్లో ఒక మైలు రాయి. బాపు దర్శకత్వం వహించిన సుందరకాండలో నటించాను. శ్రీ వెంకటేశ్వర వైభవం సీరియల్లో అయితే ఏకంగా వామననుడిగా, శ్రీకృష్ణుడిగా, విష్ణుమూర్తి మూడు అవతారాల్లో నన్ను చూపించారు అని అన్నారు బాల నటుడు పవన్ శ్రీరామ్. బాపు గారి చివరి చిత్రం శ్రీరామరాజ్యంలో లవుడుగా నటించే భాగ్యం నాకు దక్కిందని గౌరవ్ అన్నాడు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంతాపం హైదరాబాద్‌కు చెందిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రి ఎంప్లాయిస్ ఫెడరేషన్ బాపు మృతికి సంతాపాన్ని వ్యక్తం చేసింది. తెలుగు గీతకు, రాతకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ప్రఖ్యాత సినీ దర్శకులు బాపు మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆ ఫెడరేషన్ సభ్యులు అన్నారు. తెలుగు చలన చిత్ర దర్శకులసంఘం (హైదరాబాద్) బాపు మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. బాపు అంటే పిచ్చి అభిమానం బాపు అన్న ఆయన రాత శైలి అంటే పిచ్చి అభిమానం. ఆ పిచ్చితోనే చెన్నైకి వచ్చేశాను అంటున్నారు ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్, చిత్రకారుడు అంకయ్య. నా గురువు గంగాధర్ వద్ద పని చేస్తున్న సమయంలోనే బాపు పరిచయ భాగ్యం కలిగింది. చాలా మందికి తెలియని విషయం బాపు గొప్ప పబ్లిసిటీ డిజైనర్ అన్నది. తొలి రోజుల్లో మూగమనసులు, తేనెమనసులు, ఆత్మగౌరవం, సుమంగళి, ఆదుర్తి సుబ్బారావుగారి చిత్రాలకు పబ్లిసిటీ డిజైనర్‌గా పని చేశారు బాపు. చెన్నై తెలుగు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రామారావు బాపుకు నివాళులర్పించారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహాత్ముడు బాపు అని కీర్తించారు. అందానికి అందం అద్దిన శిల్పి తెలుగు అక్షరానికి ఒయ్యారాలు నేర్పి, గీతల బొమ్మలు అందచందాలను తీర్చిదిద్ది చలన చిత్రానికి కళాత్మక దృష్టిని ప్రసాధించిన చిత్ర, విచిత్ర శిల్పి బాపు. ఆరు పదుల కాలం వెదజల్లిన తెలుగుదనంతో మరో నూరేళ్ళ కాలం ఆ వెలుగు పంటలు పండించనున్న ప్రతిభాశాలి. ఆయన కిదే నా నివాళి - డాక్టర్ కాసల నాగభూషణం. -
బాపు అంత్యక్రియలు పూర్తి
-
బాపుకు శద్దాంజలి ఘటించిన ప్రముఖులు
-
బాపు మరణంతో మూగబోయిన భధ్రాద్రి
-
'మరో రూపంలో మళ్లీ జన్మించి వెలుగునివ్వాలి'
-
'మరో రూపంలో మళ్లీ జన్మించి వెలుగునివ్వాలి'
చెన్నై : బాపూ భౌతికకాయానికి తమిళనాడు గవర్నర్ రోశయ్య మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ తెలుగువారి సత్తా ప్రపంచానికి చాటిన ఘనత బాపూదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకున్నట్లు తెలిపారు. తెలుగు సినిమా రంగంలో బాపూ చెరగని ముద్ర వేశారని, ఆయన మరో రూపంలో మళ్లీ జన్మించి తెలుగు జాతికి వెలుగునివ్వాలన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్....బాపూకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాపూతో గల అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలుగువారి గుండెల్లో బాపూ గూడు కట్టుకున్నారని, బుడుగు చదవిని వారు ఉండరని ఆయన అన్నారు. బాపూ మృతితో తెలుగువారిలో ఓ అంగం పోయినట్లు ఉందని మండలి బుద్దప్రసాద్ అన్నారు. నటుడు మోహన్ బాబు, గాయకుడు మనో కూడా బాపూకు నివాళులు అర్పించారు. -
నేడు చెన్నై అడయార్‌లో బాపు అంత్యక్రియలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: వృద్ధాప్య అనారోగ్య కారణాలతో ఆదివారం చెన్నైలో కన్నుమూసిన ప్రముఖ సినీ దర్శకుడు, చిత్రకారుడు బాపు (సత్తిరాజు లక్ష్మీనారాయణ) అంత్యక్రియలు మంగళవారం జరగనున్నాయి. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. చివరి ఘడియల్లో ఆయన ఏకైక కుమార్తె భానుమతి, రెండో కుమారుడు వెంకటరమణ బాపు చెంతనే ఉన్నారు. బాపు మరణానికి సరిగ్గా రెండు రోజుల కిందటే ఆయన పెద్దకుమారుడు వేణుగోపాల్ జపాన్ వెళ్లారు. సోమవారం ఆయన చెన్నై చేరుకోగానే అంత్యక్రియలు నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. తండ్రి మరణవార్త తెలుసుకున్న వెంటనే తిరుగు ప్రయాణమైన వేణుగోపాల్ సోమవారం అర్ధరాత్రి చెన్నైకి చేరుకున్నారు. పెద్దకుమారుని రాక ఆలస్యం కావడంతో అంత్యక్రియలను మంగళవారానికి వాయిదావేశారు. చెన్నై అడయార్‌లోని బాపు ఇంటికి సమీపంలోని బీసెంట్‌నగర్ శ్మశాన వాటికలో మంగళవారం మధ్యాహ్నం బాపు పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బాపుకు కడసారి నివాళులర్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రులు పల్లె రఘునాథరెడ్డి హాజరు కానున్నారు. తరలివచ్చిన తెలుగు చిత్రసీమ... తమ అభిమాన బాపు కడసారి చూపుకోసం తెలుగు చిత్రసీమ సోమవారం తరలివచ్చింది. అశ్రు నయనాలతో వచ్చిన నటీనటుల ఆవేదనతో బాపు గృహం శోకసంద్రమైంది. తెల్లని సాధారణ పంచె, బనీను పోలిన తెల్లని చొక్కా ధరించి నిశ్శబ్దంగా తన పనిలో తాను నిమగ్నమై ఉండే బాపు అదే నిశ్శబ్దాన్ని కొనసాగిస్తున్నట్లుగా హాలు మధ్యలో ఐస్‌బాక్స్‌లో పార్థివదేహంగా కనిపించారు. నందమూరి బాలకృష్ణ, సినీ నేపధ్య గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం, దర్శకుడు శేఖర్ కమ్ముల సుమారు రెండు గంటల పాటు విషణ్ణవదనాలతో బాపు పార్థివదేహం వద్దనే కూర్చుండిపోయారు. పెళ్లిపుస్తకం చిత్రం ద్వారా బాపు బొమ్మగా పరిచయం అయిన సినీనటి దివ్యవాణి ఆయన భౌతికకాయం వద్ద, మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యూరు. భూమన నివాళులు బాపు మరణంతో.. ప్రపంచం గర్వించదగిన వ్యక్తిని తెలుగు జాతి కోల్పోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి నివాళులర్పించారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రతినిధిగా భూమన సోమవారం చెన్నై చేరుకుని బాపు భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు భాషకు, సంస్కృతికి వన్నెలద్దిన వ్యక్తి బాపు అని కీర్తించారు. ఆయనలో అద్భుత మానవతావాది ఉన్నారని అన్నారు. -
బాపు చిరంజీవి
ప్రఖ్యాత దర్శకుడు బాపు భౌతికంగా లేకపోయినా ఆయన కళాత్మక రూపాలు చిరంజీవిగా నిలిచిపోతాయి. బాపు చిత్రాలు చిరస్మరణీయంగాను, చిత్ర లేఖనాలు చిరస్మరణీయంగాను, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగాను ఉంటాయి. రామాయాణాన్ని పలు విధాలుగా సాంఘిక కథలుగా మలచి చిత్రాలుగా రూపొందించిన ఘనత బాపుకే దక్కుతుంది. నిరాడంబరుడు, నిగర్వి, సౌమ్యుడు, నిష్ణాతుడు అయిన బాపుకు పొగడ్తలంటే ఇష్టముండదు. అయినా ఆయన్ని పొగడని నోరుండదు. అలాంటి బాపు ఇప్పుడు మనముందు లేకపోవడం అత్యంత బాధాకరం. బాపు మృతికి పలువురు చిత్ర ప్రముఖులు, రాజకీయ నాయకులు, కళాకారులంటూ పలువురు అశ్రు నివాళులర్పించారు. వీరిలో చిరంజీవి, బాలకృష్ణ, దర్శకుడు కె.రాఘవేంద్రరావు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సింగీతం శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. పాఠ్యాంశంగా సీతా కల్యాణం బాపులేరన్న విషయాన్ని తెలుసుకోవడానికి చాలా రోజులు పడుతుందని ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అన్నారు. ఆయనేమన్నారంటే.......నా తొలిచిత్రం నీతి నిజాయితీని ప్రత్యేకంగా చూసి చక్రపాణికి ఫోన్ చేసి సినిమా చాలా బాగుందని చెప్పారు. ఆ విషయం నాకు చెప్పలేదేమిటంటే నీ చిత్రం గురించి నీకు చెబుతామా? ఇతరులకు చెబుతాం గానీ అని అన్నారు. అంత గొప్ప వ్యక్తి బాపు. ఆయనతో 55 ఏళ్ల మైత్రి నాది. బాపు నాకొక పుస్తకం పోస్ట్ ద్వారా పంపారు. ఆ కవరుపై నా పేరు అందంగా రాశారు. నాకది చాలా నచ్చింది. వెంటనే బాపుకు ఫోన్ చేసి ఆ కవరుపై అడ్రసు రాసిన అక్షరాలు మీవేనా అని అడిగాను. నావేనన్నారు. ఆ అక్షరాలతో కూడిన నా పేరును నా లెటర్పేడ్పై వేయించుకోవడానికి మీ అనుమతి కావాలన్నాను. వెంటనే ఆయన మళ్లీ మీ పేరు రాసి పంపుతానని చెప్పి మరుసటి రోజే పంపారు. నా లెటర్ ప్యాడ్‌పై ఇప్పటికీ ఆయన రాసిన అక్షరాలలోనే నా పేరు ఉంటుంది. మరో విషయం బాపు దర్శకత్వం వహించిన సీతాకల్యాణం చిత్రం లండన్‌లోని కేంబ్రిడ్జి ఫిలిం ఇన్స్టిట్యూట్లో పాఠ్యాంశంగా కొనసాగుతోందని సింగీతం శ్రీనివాసరావు తెలిపారు. కళామతల్లి ముద్దు బిడ్డను కోల్పోయాం ప్రముఖ సంగీత దర్శకుడు విద్యాసాగర్ బాపు భౌతిక కా యానికి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ బాపులాంటి కళామతల్లి ముద్దు బిడ్డను కోల్పోయామన్నారు. తెలుగు జాతికిది తీరని లోటు. బాపుకు సంగీత జ్ఞానం మెం డు. ముఖ్యంగా వెస్ట్ మ్యూజిక్‌లో పట్టు ఎక్కువ. హిందుస్థానీ గజల్స్‌ను, మెలోడీ సంగీతాన్ని బాగా ఎంజాయ్ చేస్తా రు. సుందరకాండ చిత్రానికి బాపుతో కలిసి పని చేసే అదృష్టం నాకు లభించింది. ఆ సమయంలో పలు సలహాలిచ్చేవారు. నా సూచనలను పరిగణనలోకి తీసుకునేవారు. ఆయనతో పనిచేయడం చాలా మంచి అనుభవం. అలాంటి బాపు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నామన్నారు. బాపులేని లోటును ఎవరూ భర్తీ చేయలేరు యలమంచిలి శ్రీరామరాజ్యం చిత్ర నిర్మాత యలమంచిలి సాయిబాబా బాపు భౌతిక కాయానికి నివాళులర్పించారు. బాపు మరణం రాష్ట్రానికి తీరని లోటు. బాపు నాకిష్టమయిన దర్శకుడు. శ్రీరామరాజ్యాన్ని చిత్రాన్ని నాకు ప్రసాదించి బాపు,రమణలు వెళ్లిపోయారు. ఎవర్నీ నొప్పించని గుణం ఉందని యలమంచిలి చెప్పారు. బాపు ఒక్కరే ఉత్తమ దర్శకులు చాలా మంది ఉన్నారు. అయితే బాపులేని లోటును మళ్లీ ఆయన మరో జన్మఎత్తి తీరాల్సి ఉంటుంది. బాపు ఆయన తొలి చిత్రం సాక్షితో నన్ను పబ్లిసిటీ డిజైనర్‌గా పరిచయం చేసి నా భవిష్యత్‌కు బాట వేశారు. అప్పటి నుంచి ఆయన సొంత చిత్రాలన్నింటికీ నేనే డిజైనర్‌గా పని చేశాను. బాపు, రమణలు తరచు మా ఇంటికి వచ్చి ముచ్చటించేవారు. నేను రాసిన సినిమా పోస్టల్ పుస్తకానికి తొలి పలుకులు రాస్తూ కళల మాంత్రికుడిగా బిరుదిచ్చారంటూ ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా చూసేవారు బాపు ముత్యాల ముగ్గులో సీతగా జీవించిన సంగీత కంటతడిపెట్టారు. నన్ను బాపు తన కుటుంబ సభ్యురాలిగా చూసుకునేవారు. షూటింగ్లో నటిననే భావనే ఉండేదికాదు. వందల సినిమాలు చేసినా నన్నిప్పటికీ బాపు బొమ్మగానే పిలుస్తారు. బాపులాంటి దర్శకుడి చిత్రంలో మళ్లీ నటిస్తానన్నది సందేహమే. అసలు ముత్యాల ముగ్గు చిత్రంలో నటించే అవకాశం రావడమే అదృష్టం. మేకప్ లేకుండా సహజ సిద్ధంగా సీత పాత్రలో నటించే నటి కోసం బాపు అన్వేషిస్తున్నారని తెలిసి ఒక ఫొటో గ్రాఫర్ ద్వారా నా ఫొటోలు ఆయనకు పంపించాను. నేను ఆ పాత్రకు నప్పుతానని ఎంపిక చేశారు అని నటి సంగీత తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తండ్రిలా ఆదరించారు పెళ్లి పుస్తకం ఫేమ్ దివ్యవాణి బాపు పార్థివ దేహం వద్ద కన్నీరుమున్నీరయ్యూరు. నన్ను తండ్రిలా ఆదరించారు. షూటింగ్లో కూడా అమ్మాయి అనే పిలిచేవారు. అలాంటి బాపు తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో జీవించే ఉంటారు. పెళ్లి పుస్తకం చేసేటప్పుడు నా వయసు 17 ఏళ్లే. బాపు చెప్పినట్లు చేశాను. ఆయన వేసిన బొమ్మతో ఒక్క శాతం కనిపించినా చాలు అంత పేరు వస్తుంది. నిరాడంబరత అంటే ఏమిటో బాపు నుంచే నేర్చుకున్నాను అన్నారు నటి దివ్యవాణి. ఆ అదృష్టం నాకు దక్కింది బాపు దర్శకత్వంలో రాంబంటు చిత్రంలో నటించే గొప్ప అదృష్టం నాకు దక్కిందని నటి ఈశ్వరిరావు అన్నారు. ఇప్పటికీ రాంబంటు నాయకి బాపు బొమ్మ అనే నన్ను పిలుస్తారని అలాంటి మహానుభావుడు లేని లోటు ఎవరు తీర్చలేనిది అన్నారు నటి ఈశ్వరిరావు. బాపు చిత్రాలు కళాఖండాలు బాపు చిత్రాలు అద్భుత కళాఖండాలుగా నిలిచిపోతాయని నటుడు భానుచందర్ పేర్కొన్నారు. బాపు దర్శకత్వంలో మూడు చిత్రాలు చేశాను. అందులోనూ మనవూరి పాండవులు ఒకటి. ఆ చిత్రానికి నా గురువు బాలుమహేంద్ర ఛాయాగ్రహణం అందించారు. బాపు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని ఆయన నాకు చెప్పేవారు. బాపు దర్శకత్వంలో పని చేస్తుంటే అసలు పని చేసినట్లే ఉండదన్నారు. నటుడు భానుచందర్. ఆయనకంటే తెలిసిన వారుండరు 50 ఏళ్ల క్రితం ముంబయిలో బాపును తొలిసారిగా కలిశానని ప్రముఖ సాహితీ వేత్త, విమర్శకుడు వి.ఎ.కె.రంగారావు తెలిపారు. ఆయన బావమరిది ద్వారా పరిచయం అయ్యింది. నాకు తెలిసి హిందుస్థానీ సంగీతంలో బాపుకు తెలిసినంత ఎవరికీ తెలియదన్నారు. బాపు ప్రస్తానాన్ని మరొకరు అందుకోవడం కష్టం శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ తరపున 2005లో బాపుకు కళాప్రపూర్ణ బిరుదును నా చేతుల మీదగా అందించడం సంతోషంగా ఉందని ఆ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ఆచార్య ప్రతాప్‌రెడ్డి తెలిపారు. అందాలరాముడు, సీతాకల్యాణం అద్భుత సినీ కావ్యాలెన్నో చూసి నేనాయన అభిమానినయ్యాను. అలాగే ఎన్నో కళా చిత్రాలకు ప్రాణం పోసిన ఆయన కుంచె ఆగిపోవడం ఆవేదనకు గురిచేసింది. బాపు ప్రస్థానాన్ని మరొకరు అందుకోవడం కష్టం అని అన్నారు. ఇంకా నటుడు శరత్‌బాబు, సి.ఎం.కె.రెడ్డి, ఎస్పీబీ చరణ్, కార్టూనిస్టు జయదేవ్, నృత్యదర్శకుడు శీను, నటి ప్రభ, రాజ్యలక్ష్మి, రచయిత భారవి వంటి ప్రముఖులు బాపుకు నివాళులర్పించారు. -
బాపు క్లోజప్పులపై ఆ ప్రభావం!
ఆకాశం కారుస్తున్న కన్నీటితో భాగ్యనగరం అప్పటికే తడిసి ముద్దవుతోంది. అల్పపీడన ప్రభావమే కాదు, ఉరుము లేని పిడుగులా ఆదివారం సాయంత్రం అంతకు కొద్ది సేపటి క్రితమే హఠాత్తుగా మీద పడ్డ బాపు అస్తమయ వార్తతో తెలుగు జాతి విషాదంలో మునిగిపోయింది. బాపు - రమణలకు ఆత్మీయుడూ, వారి చివరి మజిలీలో సన్నిహిత సహయాత్రికుడూ అయిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు గుండెలు పిండే బాధ గొంతుకు అడ్డం పడుతోంది. మబ్బులు కమ్మేసిన ఆ సుదీర్ఘ... కాళరాత్రి... త్రివిక్రమ్ తన గుండె గది తలుపులు తెరిచారు. జాతి రత్నాన్ని పోగొట్టుకున్న తీరని బాధలోనూ ఓపిక కూడదీసుకొని, మాట రాని మౌనాన్ని అతి కష్టం మీద ఛేదించారు. కనీసం కలసి ఫోటో తీయించుకోవాలన్న ఆలోచనైనా రానందుకు చింతిస్తూనే, బాపు-రమణల మీద తన భక్తిని మనసు జ్ఞాపకాల చిత్రాలలో నుంచి వెలికి తీశారు. ముగిసిన ఓ శకానికి త్రివిక్రమ్ అర్పించిన అక్షర నివాళి... ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం... ఏదైనా అనుకొంటే, వెంటనే చేసేయాలి. అంతేతప్ప ఆలస్యం అస్సలు కూడదు. ఇవాళ కాలం నేర్పిన కొత్త పాఠం ఇది. బాపు గారికి అనారోగ్యంగా ఉందని తెలిసినప్పటి నుంచి స్వయంగా వెళ్ళి కలవాలని అనుకుంటూ వచ్చా. తీరా వెళ్ళి కలవక ముందే ఆయన కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితం ఈ దుర్వార్త తెలియగానే, ఒక్కసారిగా డీలా పడిపోయా. బాపు లాంటి గొప్పవ్యక్తి ఇక లేరు అనగానే నాకు ఏడుపొచ్చేసింది. (గొంతు జీరబోగా...) ఆరు నెలలుగా బాపు గారు ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కీమోథెరపీ చేయించుకుంటున్నారు. దాంతో బలహీనపడ్డారు. ఇవాళ ఆయన మరణంతో తెలుగు చలనచిత్ర, చిత్రకళా రంగాలకు సంబంధించి ఒక శకం ముగిసింది. పుట్టిన ప్రతి ఒక్కరికీ మరణం సహజమని తెలిసినప్పటికీ బాపు - రమణల లాంటి వ్యక్తులు వంద ఏళ్ళు కాదు... నూట పాతికేళ్ళు బతకాలనీ, ఆ చేతి వేళ్ళు ఇంకా రాయాలనీ, మరిన్ని బొమ్మలు గీయాలనీ మన లాంటి అభిమానులం కోరుకుంటాం. ఎందుకంటే, వాళ్ళు మనకిచ్చిన తీపి జ్ఞాపకాలు అలాంటివి. వాళ్ళున్నది మా ఇంటి పైనే! బాపు - రమణలతో నా తొలి పరిచయం వాళ్ళ ‘రాధాగోపాళం’ చిత్రం కన్నా చాలా ముందు నుంచే! అప్పటికి నేను దర్శకుడిగా ‘అతడు’ చిత్ర సన్నాహాల్లో ఉన్నాను. వాళ్ళు ‘శ్రీభాగవతం’ సీరియల్ తీస్తున్నారు. ‘రాధాగోపాళం’ టైమ్‌లో వాళ్ళకు సన్నిహితుడినయ్యా. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో హైదరాబాద్‌లో మా అపార్ట్‌మెంట్స్‌లోనే నాలుగో అంతస్తులో అద్దె ఇంట్లో బాపు - రమణలు ఉన్నారు. వాళ్ళ షూటింగయ్యాక సాయంత్రాల్లో వారానికి రెండుసార్లయినా కబుర్లాడుకొనేవాళ్ళం. వాళ్ళు ఏదైనా చెబుతుంటే, చెవి ఒగ్గి వినేవాణ్ణి. అలా ఎన్నో సంగతులు తెలుసుకున్నా, నేర్చుకున్నా. అందరూ రమణ గారు బాగా మాట్లాడతారు, బాపు గారు పెద్దగా మాట్లాడరని అంటారు. కానీ, నా విషయంలో అది నిజం కాదు. విచిత్రంగా బాపు గారు, నేను ఎక్కువ మాట్లాడుకొనేవాళ్ళం. ఇప్పుడాలోచిస్తే, అలా కుదరడం చిత్రమనిపిస్తుంటుంది. బాపు క్లోజప్పులపై ఆ ప్రభావం! నాకూ, ఆయనకూ ఉమ్మడి చర్చనీయాంశం - సినిమా. అలా కూర్చొని ఎన్నేసి గంటలు మాట్లాడుకొనేవాళ్ళమో! ఎక్కువగా అంతర్జాతీయ సినిమా గురించే మా సంభాషణ సాగేది. సినిమాల్లో, సంగీతంలో ఆయన అభిరుచి లోతైనది. ప్రాథమికంగా యూరోపియన్ సినిమా, ఇరానియన్ సినిమా బాగా ఇష్టం. ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ది వెస్ట్’, ‘ఫర్ ఎ ఫ్యూ డాలర్స్ మోర్’ లాంటి చిత్రాలు తీసిన సెర్జియో లియోన్ ఆయనకు బాగా ఇష్టమైన దర్శకుడు. క్లోజప్ షాట్లు, బోల్డ్ క్లోజప్ల విషయంలో అతని ప్రభావం తన మీద ఉందేమో అనేవారు. కానీ, నన్నడిగితే ఆ దర్శకుడు ఎక్కువగా యాక్షన్‌లో అలాంటివి చేశారు. బాపు గారు ప్రాథమికంగా రొమాన్స్ సన్నివేశాల్లో ఆ పద్ధతి వాడారు. అదీ చాలా కళాత్మకంగా ఉంటుంది. మూకీ చిత్ర యుగానికి చెందిన అమెరికన్ నటుడు జార్జ్ కూపర్ సినిమాలంటే ఆయనకు తెగ ఇష్టం. అలాగే, పాశ్చాత్య సంగీతజ్ఞుడు ఎనియో మొరికోన్ చేసిన నేపథ్య సంగీతం గురించి, ఆయన చేసిన ఆల్బమ్స్ గురించి ఎప్పుడూ చెబుతుండేవారు. ‘అవి వినండి. ఆ సంగీతంలో మీకు ఎన్నో కథలు దొరుకుతాయి’ అనేవారు. ఎందరో ఫిల్మ్ మేకర్లు, సంగీత దర్శకులు, సినిమాటోగ్రాఫర్ల పేర్లు ఆయన నోట్లో నానుతుండేవి. డెరైక్షన్‌కు సంబంధించిన రచనలు, గొప్ప సినిమాల స్క్రీన్‌ప్లేలు - ఇలా బాపు గారు నాకు చాలా పుస్తకాలిచ్చారు. చిన్న చిన్న కాగితాల మీద నోట్స్ లాంటి ఉత్తరాలు రాసేవారు. పచ్చళ్ళు పంపేవారు. అటు ఆయన... ఇటు మేము... ఏడ్చేశాం! ‘శ్రీరామరాజ్యం’ చిత్రం విడుదల తరువాత అంత గొప్ప చిత్రం చూసి, ఉండబట్టలేక రాత్రి 12 గంటల వేళ ఫోన్ చేశాను. నిర్మాత సాయిబాబు గారు తీసి, బాపు గారికి ఫోన్ అందించారు. సినిమాలో ఏవేం బాగా నచ్చాయో చెబుతూ, నేను, నా శ్రీమతి ఇటుపక్క ఫోన్లో నిజంగా ఏడ్చేశాం. అటుపక్కన బాపు గారూ ఫోన్లోనే ఏడ్చేశారు. ‘నాదేమీ లేదు. అంతా ఆ రాముడు, ఆ వెంకట్రావ్ (ముళ్ళపూడి వెంకట రమణ గారి అసలు పేరు. ఆయనను వెంకట్రావ్ అనే బాపు పిలిచేవారు)ల దయ’ అని పదే పదే తలుచుకున్నారు. రమణతో ఆయన స్నేహం అది. ఆయనకున్న గొప్ప సంస్కారం అది. నా గొంతు పూడుకుపోయింది. మాట రాలేదు. అది నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. ‘శ్రీరామరాజ్యం’ తప్పకుండా చూడమని హీరో పవన్ కల్యాణ్‌కు చెప్పాను. ఒకరోజు రాత్రి 11 నుంచి ఒకటిన్నర దాకా ప్రసాద్ ల్యాబ్‌లో ప్రత్యేక ప్రదర్శన చూశారు కల్యాణ్. చూసి, చలించిపోయి, నాతో అరగంట మాట్లాడారు. ఆ వెంటనే రాత్రి 2 గంటలకు ప్రెస్ కెమేరాల ముందుకొచ్చి తన అనుభూతిని పంచుకున్నారు. ఆయనది అంతర్జాతీయ స్థాయి దర్శకుడిగా తొలి సినిమాగా ‘సాక్షి’ లాంటి ఆఫ్-బీట్ సినిమాను ఎవరైనా తీస్తారా? ఆ రోజు నుంచి చివరి దాకా బాపు - రమణలు వెండితెరపై చేసిన సాహసాలు అన్నీ ఇన్నీ కావు. ఏయన్నార్ ఉచ్చస్థితిలో ఉండగా ఆయన పాత్రకు హీరోయిన్ లేకుండా, భార్య పోయి, బిడ్డ ఉన్న పూజారి పాత్రను ‘బుద్ధిమంతుడు’లో చేయించడం మరో సాహసం. ఆ చిత్రంలో గొప్ప ఫిలాసఫీ ఉంది. చివరలో భిన్నమైన ఆలోచనాధోరణులున్న హీరో పాత్రలు రెండూ నెగ్గినట్లు కన్విన్సింగ్‌గా చెప్పడానికి ధైర్యం కావాలి. సినిమాలన్నీ సాదాసీదాగా, ఒకే పద్ధతిలో లీనియర్‌గా ఉండే రోజుల్లో, అలా అనేక కోణాలున్న సినిమాను, పైకి కనిపించేదే కాకుండా, లోలోపల ఎన్నో భావాలు పొదిగిన సినిమాలు చేయడం కష్టం. ఆ సాహసం ఆయన చేశారు. అలాగే, పూర్తి కామెడీ సినిమాలు లేని ఆ రోజుల్లోనే ‘బంగారు పిచిక’ తీశారు. ఆయన సాహసించిన నలభై ఏళ్ళ తరువాత ఇప్పుడు ఆ ట్రెండ్ చిత్రాలు జోరందుకున్నాయి. ‘ముత్యాల ముగ్గు’ చూస్తే, అప్పటి దాకా వచ్చిన తెలుగు చిత్రాలకు పూర్తి భిన్నంగా, ఆఫ్-బీట్‌గా నేపథ్య సంగీతం ఉంటుంది. భార్యాభర్తలిద్దరి దాంపత్య ఘట్టాన్ని కేవలం మాండలిన్ బిట్‌తో నడిపితే, వారిద్దరూ విడిపోయే సీన్‌ను రీరికార్డింగ్ లేకుండా చేశారు. బాపు షాట్ కంపోజిషన్, మేకింగ్, విజువలైజేషన్, నేపథ్య సంగీతం - అన్నీ అంతర్జాతీయ స్థాయివే. నా దృష్టిలో ఆయన తెలుగు గడ్డకే పరిమితమైపోయిన అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ మేకర్. అంతర్జాతీయ సినిమాలు చూసిన వ్యక్తిగా ఇది ఘంటాపథంగా చెబుతున్నా. ఒక్క మాటలో రేపటి సినిమాను... నిన్ననే ఆలోచించి... ఇవాళే తీసేసిన... దిగ్దర్శకుడు బాపు గారు. కాలాని కన్నా ముందస్తు ఆలోచనలున్న క్రియేటర్. ఇప్పటికీ నాకు ఎప్పుడు మనసు బాగా లేకపోయినా, బాపుగారి ‘బుద్ధిమంతుడు’, ‘అందాల రాముడు’ చూస్తా. తక్షణమే పాజిటివ్ ఎనర్జీనిచ్చే చిత్రాలవి. ఇక, ‘మన ఊరి పాండవులు’లో బాలూ మహేంద్ర, బాపుల విజువల్ జీనియస్ చూడవచ్చు. అభిరుచి గల మంచి సినిమాకూ, కమర్షియల్ హిట్టయ్యే సినిమాకూ మధ్య బంధం వేసి, ఆ రెంటినీ కలగలిపిన అద్భుతమైన వ్యక్తులు బాపు-రమణ. వాళ్ళకు తెలిసిందల్లా హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తూ పోవడమే. హిట్టయితే ఆ డబ్బులు సినిమాలోనే పెట్టారు. ఫ్లాపైతే, ఆ అప్పులు తీర్చడానికి మరో సినిమా తీశారు. వాళ్ళు సంపాదించిన దాని కన్నా పోగొట్టుకున్నదే ఎక్కువ. చిరస్మరణీయమైన సినిమాలు మిగిల్చారు. చేస్తున్న పనిని ఆస్వాదిస్తూ, దానినే దైవంగా చేసుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఆయనలా పని చేస్తేనా... నన్నడిగితే బాపు చాలా గొప్ప థింకర్ కూడా! ఆయన భావవ్యక్తీకరణలో, గీసిన బొమ్మలో, తీసిన సినిమాలో అది స్పష్టంగా తెలుస్తుంటుంది. ఆయన తన శక్తిని మాటలతో వృథా చేసేవారు కాదు. చేస్తున్న పనిలోనే దాన్ని క్రమబద్ధీకరించి, వినియోగించేవారు. అలాగే, ఒక వ్యక్తిగా, కళాకారుడిగా బాపు గారు ఎంతో క్రమశిక్షణ ఉన్న వ్యక్తి. ఆయన చేసినంత కఠోర పరిశ్రమ ఎవరూ చేయలేరు. లేకపోతే, పుస్తకాల ముఖచిత్రాలు, కార్టూన్లు, కథలకు బొమ్మలు, క్యారికేచర్లు - ఇలా ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఏకంగా ఒకటిన్నర లక్షల పైగా బొమ్మలు వేయడం సాధ్యమా చెప్పండి. ఇంకా యాడ్ ఏజెన్సీల్లో క్రియేటివ్ హెడ్‌గా వేసినవి, స్క్రిప్టు స్టోరీబోర్డుకు వేసుకున్న బొమ్మల లాంటివి లెక్కలోకి తీసుకోకుండానే అన్ని బొమ్మలయ్యాయంటే ఆశ్చర్యం. బొమ్మలేయడాన్ని పనిగా అనుకోలేదు. ఎవరో రాసిన నవలకు ముఖచిత్రం వేయడం కూడా ఆ వంకతో తాను ఆ కథ చదవవచ్చనే! అది చదివి, దాని మీద తన అభిప్రాయాన్నీ, సమీక్షనూ మాటలతో కాదు, బొమ్మతో చెప్పేసేవారు. అది ఆయన గొప్పతనం. బాపు గారు అసలు సిసలు కళాకారుడు. ఎంతో జీనియస్. లుంగీ కట్టుకొని, లాల్చీ వేసుకొని, ప్యాడ్, కుంచెలు పెట్టుకొని, కింద కూర్చొని, ఎదురుగా డీవీడీ ప్లేయర్లో సినిమా పెట్టుకొనో, పక్కనే సంగీతం వింటూనో బొమ్మలు వేసుకొనేవారు. చేయి నొప్పి పుడితే, కాసేపు ఆపి, సినిమా చూసేవారు. సినిమా బోర్ కొడితే, అది పాజ్ చేసి, బొమ్మలు వేసుకొనేవారు. ఇలా రోజూ 16 గంటలకు పైగా పనిచేయడం, పడుకోవడం! మళ్ళీ పొద్దున్నే లేవగానే అదే పని! ఎవరికో ఏదో నిరూపించడానికి కాక, మనస్ఫూర్తిగా పనిని అంతగా ఆస్వాదిస్తూ, ఆనందంగా చేస్తే శ్రమే తెలియదు. ఆయనలో కనీసం పది శాతమైనా మనం పని చేస్తే చాలు... ఎంచుకున్న రంగంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతాం. పక్కా తెలుగువాడు జీవితమంతా మద్రాసులో గడిపిన బాపుగారు పక్కా తెలుగువాడు. ఆయన కట్టుబొట్టు, ఆహారవ్యవహారాలు, ఇష్ట పడే రుచులు, మాట్లాడే మాట, రాసే రాత, గీసే గీత - అన్నీ తెలుగు వాతావరణానికి ప్రతిబింబాలే. ప్రపంచం మొత్తం తిరిగినా, పల్లెటూరు తెలుగువాడు ఎలా ఉంటాడో అలాగే, సింపుల్‌గా బతికారు. స్టీలు గ్లాసులో కాఫీ తాగడం నుంచి కింద కూర్చొని పని చేసుకోవడం దాకా - తాను ఏ వాతావరణం నుంచి వచ్చాడో ఆ వాతావరణాన్ని వదిలిపెట్టలేదు. అదే ఆయన సృజనలో ప్రతిఫలించింది. ఒక్క ముక్కలో - ఆయన నేల మీదే నిల్చొని, గాలిపటం ఎగరేశారు. దాన్ని ప్రపంచం మొత్తం చూపించారు. అదీ ఆయన ప్రత్యేకత. అరుదైన వ్యక్తులు, వ్యక్తిత్వాలు వ్యక్తులుగా కూడా వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు. అలాంటి వ్యక్తులు సినీ రంగంలో అరుదు. ఎదుటివారి వల్ల వాళ్ళు మోసపోయారే తప్ప, వాళ్ళు ఎవరినీ మోసం చేయలేదు. ప్రతిభతో పాటు అరుదైన వ్యక్తిత్వం వారి సొంతం. ఆ రెండింటి సమ్మేళనం కాబట్టే, జయాపజయాలను పట్టించుకోకుండా, నమ్మిన విలువలకే జీవితాంతం కట్టుబడగలిగారు. చివరి వరకు ఆ స్థాయిని కొనసాగించారు. ఇవాళ సినీ, సాహిత్య, కళా రంగాలతో పాటు సామాన్య తెలుగు సమాజంలోనూ వారికి ఇంత గౌరవ ప్రతిష్ఠలు దక్కడానికి కారణం అదే! స్నేహమంటే బాపు - రమణలంటారు. ‘ఒక రంగంలో సృజనాత్మకంగా అత్యున్నత శిఖరాలకు వెళ్ళిన ఇద్దరు మనుషులు 66 ఏళ్ళ పైగా ఏ గొడవా లేకుండా కలిసి బతికారు, కలిసి నడిచారు, కలసికట్టుగా తమ రంగంలో కృషి చేశార’ని చెబితే చాలు... ఇక వాళ్ళ స్నేహం గురించి మనం ప్రత్యేకించి ఏమీ చెప్పనక్కర లేదు. ఒకసారి నేను ఉండబట్టలేక, ‘మీరిద్దరి మధ్య ఎప్పుడూ అభిప్రాయ భేదాలు రాలేదా’ అని అడిగేశా. ‘ఎందుకు రావు! కథా చర్చల్లోనో, మరొకచోటో ఏదో అభిప్రాయ భేదం వస్తుంది. వాదించుకుంటాం. మళ్ళీ మామూలైపోతాం’ అన్నారు. వాళ్ళెప్పుడూ తమ జీవితాన్ని సంక్లిష్టం చేసుకోలేదు. సాదాసీదాగా గడిపేశారు. వాళ్ళలా సింపుల్‌గా బతకడం మనకేమో కాంప్లికేటెడ్ అయిపోతోంది! అలా బతకడం అంత సులభం కాదు! బాపు - రమణల స్నేహం, సాన్నిహిత్యం ఎంతంటే, రమణ గారు పోయాక బతకడం ఇష్టలేక బాపుగారు వెళ్ళిపోయారని నాకు అనిపిస్తోంది. బాపు గారు గుర్తొచ్చినప్పుడల్లా ఆయనలా హార్డ్‌వర్క్ చేయాలని స్ఫూర్తి కలుగుతుంటుంది. ఇక, రమణ గారి పేరు చెప్పగానే ఆయనంత గొప్పగా రాయాలనుకుంటా. ఎవరెస్ట్ అంటే ఎవరైనా ఎక్కాలనే అనుకుంటారు కదా! నేనూ అంతే! వాళ్ళు ఎప్పుడూ మాట్లాడలేదు, ఉపన్యాసాలివ్వలేదు. నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళలాగా భేషజం లేకుండా మామూలు వాళ్ళలా బతకడం అంత సులభం కాదు. అయినా సరే, అలా ఉండేందుకు ప్రయత్నించడం, వాళ్ళ సినిమాలు చూసి ఆనందించడమే మనమిచ్చే ఘనమైన నివాళి. అంత గొప్పవాళ్ళ జీవితంలోని చివరి రోజుల్లో కొన్ని క్షణాలైనా వారితో కలసి గడపడం నా జీవితకాలపు అదృష్టం. ఆ అదృష్టం మరింత కాలం కొనసాగకుండా, అంతలోనే ఆ మహానుభావులు భౌతికంగా దూరమైనందుకు ఇవాళ ఆగకుండా ఏడుపొచ్చేస్తోంది. ఇంతకాలం జాతి మొత్తాన్నీ నవ్వించిన బాపు గారూ! రమణ గారూ! మీకిది న్యాయమా సార్? - సంభాషణ: రెంటాల జయదేవ బాపు మార్కు సెటైర్లు ఆహార విహారాల్లో కూడా బాపు -రమణలది మంచి అభిరుచి. ఏదైనా మితంగా, హితంగా ఉండేది. బాపు గారు చాలా తక్కువ తినేవారు. కాకపోతే, వాటిల్లోకి పప్పు, కూర, పచ్చడి అన్నీ ఉండాలి. అంత చక్కటి రాయల్ టేస్ట్. బాపు గారిలో హాస్యప్రియత్వానికి ఎన్నో ఉదాహరణలు. నటుడు బ్రహ్మానందం గారి బలవంతంతో వాళ్ళింటికి బాపు గారు ఒకసారి భోజనానికి వెళ్ళారు. ఆయనకు స్వయంగా వడ్డించాలని బ్రహ్మానందం గారి కోరిక. బాపు గారు సరేనన్నారు. ఆయన తింటుంటే, ‘ఇంకొంచెం తినండి’ అంటూ మరింత వడ్డించబోయారు బ్రహ్మానందం. ‘బాగుందని చెప్పాలంటే, ఇంకొంచెం తినాలాండీ!’ అని బాపు వ్యాఖ్యానించారు. ఒకటే నవ్వు. కొత్తల్లో ఒకసారి నేను ‘అతడు’ కథ చెబుతుంటే, రెండు మూడు సీన్లు విన్నాక ఆయన, ‘శ్రీనివాస్ గారూ! షాట్లు చెప్పకండి. కథ చెప్పండి’ అన్నారు. ‘నా బలహీనతను క్షమించి, భరించండి’ అని నేను సిగ్గుపడుతూ అన్నాను. ఇలా మా మధ్య చతురోక్తులు చాలా నడిచేవి. అది ప్రభుత్వం ఆయన మీద వేసిన అతి పెద్ద కార్టూన్! బతికుండగా ఎవరినీ గౌరవించాల్సినంతగా గౌరవించకపోవడమనేది ప్రాథమికంగా మన తెలుగువాళ్ళకున్న దౌర్భాగ్యం. ఇప్పటికి మూడున్నర దశాబ్దాల క్రితమే ‘సీతా కల్యాణం’లో గంగావతరణ ఘట్టం కోసం ఒకే నెగటివ్ మీద ఏకంగా 27 ఎక్స్పోజర్లు చేసిన తెలివైన టెక్నీషియన్ బాపు. చుక్క నీళ్ళు లేకుండా కేవలం చాక్‌పీస్ పొడితో, గంగానది ఉత్తుంగ తరంగంలా కిందకు దూకుతున్న అనుభూతి తెరపై కల్పించిన జీనియస్. తెలుగు భాషకు తన రాతతో ఒక ప్రత్యేకమైన ఫాంట్ అందించారు. ఆడపిల్ల అంటే, బాపు బొమ్మలా అందంగా ఉండాలన్న నిర్వచనానికి కారణమయ్యారు. ఇవాళ ‘ప్రీ-విజ్’ అని అందరూ చెబుతున్న స్టోరీ బోర్డ్ కాన్సెప్ట్‌ను ఉత్తరాదిన సత్యజిత్ రే, దక్షిణాదిన బాపు ఏనాడో చేశారు. పిల్లల కోసం బాపు-రమణలు ఉచితంగా వీడియో పాఠాలు తీసి ఇచ్చారు. పత్రికల్లో, ప్రకటన రంగంలో, పుస్తక ప్రచురణ రంగంలో, సినిమాల్లో - ఇలా అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేశారు. ఇక, వ్యక్తిగతంగానూ ఎంతోమందికి ఆదర్శమయ్యారు. అలాంటి వాళ్ళను కూడా ప్రభుత్వం గుర్తించకపోతే, ఇంకేం చేస్తే గుర్తిస్తారో? భారతీయ సినిమాకూ, ప్రపంచ సినిమాకూ, తెలుగు చిత్రకళా రంగానికీ ఇంత సేవ చేసిన వారికి కనీసం ‘పద్మవిభూషణ్’ అన్నా ఇవ్వాలి కదా! కానీ, ఇన్నేళ్ళ తరువాత, రమణ గారు కూడా గతించాక, గత ఏడాది బాపు గారికి ఉత్తి ‘పద్మశ్రీ’ ఇచ్చారు. నా దృష్టిలో బాపు గారిపై ప్రభుత్వం వాళ్ళు చేసిన అతి పెద్ద కార్టూన్ అది! -
బాపు పార్ధీవ దేహానికి చిరంజీవి నివాళి
-
'తోడు లేకుండా ఉండలేనని పిలిచినట్లున్నారు'
చెన్నై : బాపూ లేరన్న విషయాన్ని జీర్చించుకోలేక పోతున్నానని సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఆయన సోమవారం బాపూ భౌతికకాయన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ భావోద్వేగాన్ని ఆపుకోలేక కంటతడి పెట్టారు. బాపూ అభిమానులు కాని తెలుగువారు ఎవ్వరూ లేరన్నారు. తెలుగుదనాన్ని, తెలుగు సంప్రదాయాన్ని బాపూ పదిలపరిచారని బాలకృష్ణ అన్నారు. తోడు లేకుండా ఉండలేనని రమణ పిలిచినట్లు ఉన్నారని... అందుకే బాపూ వెళ్లిపోయారని బాలయ్య అన్నారు. బాపూలాంటివారికి మరణం లేదని ఆయన పేర్కొన్నారు. బాపూ సినిమా, చిత్రకళ తెలుగుదనానికి ప్రతీకగా ఆయన కొనియాడారు. ఆయన బొమ్మలేని తెలుగు లోగిలి కనిపించదన్నారు. శ్రీరామరాజ్యం సినిమాలో నటించటం తన అదృష్టమని బాలకృష్ణ అన్నారు. బాపూ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా బాపూకు పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, నటి దివ్యవాణి, రాజ్యలక్ష్మి, శేఖర్ కమ్మల, భానుచందర్ తదితరులు అంజలి ఘటించారు. -
రామభక్త హనుమాన్.. మన బాపు!
ప్రఖ్యాత కార్టూనిస్టు, చిత్రకారుడు, దర్శకుడు, రచయిత అయిన సత్తిరాజు లక్ష్మీనారాయణ.. అదే మన బాపు గారికి శ్రీరాముడన్నా, ఆంజనేయుడన్నా ఎక్కడలేని భక్తి ప్రపత్తులున్నాయి. ఈ విషయం పలు సందర్భాలలో తేటతెల్లం అయ్యింది. తాను గీసిన ఒకానొక పెయింటింగ్‌లో కూడా శ్రీరాముడు సీతమ్మ వారికి పర్ణశాలలో ఉన్నప్పుడు కుంచెతో పారాణి దిద్దుతున్నట్లు బాపు చూపించారు. అందులోనూ.. ఆంజనేయుడి వేషంలో తాను స్వయంగా ఉన్నట్లు చూపించుకుంటూ తానే స్వయంగా రంగులను శ్రీరాముడికి అందిస్తున్నట్లుగా అందులో చిత్రీకరించారు. 'ఆది చిత్రకారుడైన మా గురువుగారు' అంటూ.. శ్రీరాముడిని తన గురువుగాను, ఆది చిత్రకారుడి గాను ప్రస్తావించారు. ఇక తాను రాసిన 'రామాయణ విషవృక్షం' పుస్తకానికి కవర్ పేజీ బొమ్మ వేయాల్సిందిగా ప్రముఖ రచయిత్రి ముప్పాళ్ల రంగనాయకమ్మ బాపు గారిని కోరుతూ.. ముందస్తుగానే ఒక చెక్కు కూడా పంపించారట. అయితే, ఆ చెక్కు వెనకాల 'రామ.. రామ' అని రాసి బాపు గారు తిప్పి పంపారట. ఈ విషయాన్ని స్వయంగా రంగనాయకమ్మే చెప్పుకొన్నారు కూడా. ఇలా రామభక్తి విషయంలో బాపు ఎలాంటి తరుణంలోనూ వెనుకాడలేదు. -
'బాపుకు జీవితాంతం రుణపడి ఉంటాను'
-
'మరణం లేని మహామనిషి బాపు'
హైదరాబాద్: ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్టు, దర్శకుడు బాపు మరణంతో తెలుగుజాతి యావత్తు ఒక ఆణిముత్యాన్ని కోల్పోయిందని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బాపు మరణంపై శాసనసభలో సోమవారం సంతాపం తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... మరణం లేని మహామనిషి బాపు అన్నారు. ఆయన మరణంతో తెలుగుజాతి మంచి వ్యక్తిని కోల్పోయిందన్నారు. బాపు గీత, రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయని కీర్తించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. -
'మరణం లేని మహామనిషి బాపు'
-
గోదావరి తీరంలో బాపు-రమణల విగ్రహాలు
హైదరాబాద్ : శాసనసభ్యుల సూచన మేరకు గోదావరి తీరంలో బాపు, ముళ్లపూడి రమణల విగ్రహాలను పక్కపక్కనే ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కార్టూనిస్టుగా, చిత్రకారుడిగా, చిత్ర దర్శకుడిగా చెరగని ముద్రవేసిన బాపూకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సోమవారం ఘనంగా నివాళులు అర్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సభలో బాపూ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బాపు మృతి తెలుగు సినిమాకు తీరని లోటు అని చంద్రబాబు అన్నారు. తెలుగు అమ్మాయి అంటే ఇలా ఉండాలి అని చూపించిన ఘటన బాపూదన్నారు. తెలుగుతో పాటు 51 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారని చంద్రబాబు అన్నారు. చిత్రసీమలో బాపూది ఓ ప్రత్యేక స్థానం అని ఆయన కొనియాడారు. ఇక బాపు అద్భుతమైన దర్శకుడని, ఆయన నుంచి తనకు ఒకసారి పిలుపు వచ్చిందని.. వెంటనే తాను పరుగున వెళ్లి వెంటనే అంగీకరించానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా తెలిపారు. ఆయన తన పాత్రను చాలా అద్భుతంగా తీర్చి దిద్దారని, అలాంటి మహనీయుడు ఇప్పుడు లేరంటే మాట్లడటానికి గొంతు కూడా రావట్లేదని ఆమె అన్నారు. -
బాపూకు ప్రముఖుల ఘన నివాళి
చెన్నై : తెలుగు ప్రజల మనసులపై తన బొమ్మలతో, సినిమాలతో చెరగని సంతకం చేసిన ప్రఖ్యాత చిత్రకారుడు, దర్శకుడు బాపు నివాసం శోకసంద్రంగా మారింది. చివరిచూపు చూసుకునేందుకు పలువురు ప్రముఖులు, అభిమానులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య....బాపు మృతికి సంతాపం తెలిపారు. మరోవైపు సీనియర్ నటుడు శరత్ బాబు ఈరోజు ఉదయం బాపు భౌతికకాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. కాగా బాపూ అంత్యక్రియలు మంగళవారం బీసెంట్ నగర్ స్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు ఆయన చిన్న కుమారుడు వెంకట రమణ తెలిపారు. అలాగే విదేశాల్లో ఉన్న బాపూ పెద్ద కుమారుడు వేణు గోపాల్ ఈరోజు రాత్రికి చెన్నై చేరుకుంటారు. -
నిబ్బు కోసం డబ్బింగ్
బాపుగారు కలవమన్నారని శ్రీరమణగారి కబురు. ధైర్యం కోసం ఇద్దరు మిత్రులు పాండు, శ్రీరాంతో కలసి వెళ్లా. ప్రేమగా పలకరించారు. పెద్ద పుస్తకాల కట్ట చేతిలో పెట్టారు. ‘ఉదయం లేవగానే ఇందులోని బొమ్మల్ని కళ్లకద్దుకుని ఇలాగే, ఇదే సైజులో కాపీ చేయండి. వీరు మహా చిత్రకారులు. చాలా గొప్ప స్కూల్ ఇది’ అన్నారు. అంతేనా... ‘పుస్తకం ఇచ్చాడు కదా అని పని అయిపోయిందనుకున్నారేమో! ఇప్పుడు హైదరాబాద్‌లో డబ్బింగ్ పని మీద ఉన్నా. చాలాకాలం ఇక్కడే ఉంటా. ప్రతివారం మీరు ప్రాక్టీస్ చేసిన బొమ్మలు నాకు వచ్చి చూపించాలి’ అని పదమూడో ఎక్కం అప్పచెప్పమన్న మేస్టారుగారిలా బెదిరించారు. అది బాపుగారితో దాదాపు నా తొలి పరిచయం. నా సీనియర్ కార్టూనిస్టులు బెదిరించినట్లుగా ఆయన కోపంగా, చిరాగ్గా, నిరాసక్తంగా, మౌనిగా ఏం లేరు. తరువాత్తరువాతి మా అనుబంధంలో ఆయన దగ్గర ప్రేమ, కరుణ, వాత్సల్యం తప్ప మరేం చూడలేదు. అలా బొమ్మల పుస్తకం దగ్గర్నుంచి మా కబుర్లు మంచి పేపరు, పెన్సిల్, బ్రష్, ఇంకుల పైనుంచి డిప్పింగ్ నిబ్స్పైకి మళ్లాయి. ‘మద్రాసులో ఆ పెరుమాళ్ చెట్టి దగ్గర దొరికేవండీ మంచి నిబ్బులు... ఇప్పుడు అక్కడా లేవు. ఉన్న పాతవే తాయిలంలా చూసి చూసి వాడుకోవాల్సి వస్తోంద’ని నిట్టూర్చినంత పని చేశారు. నేను చూడ్డానికి అలా కనబడతాను కానీ, ఒక్క హైదరాబాద్‌లోనే కాదు ఢిల్లీ, బొంబాయి, కలకత్తా చివరకు పూణేలో కూడా ఏయే నిబ్బులు ఏయే సందుల్లో దొరుకుతాయో ఇట్టే చెప్పే మనిషిని నేను. నేను నోరు విప్పక ముందే నా వెంట నా జ్ఞానాన్నంతా నా దగ్గర కొట్టేసిన పాండు ముందుకు ఉరికి ‘ఏం లేదు సార్.. ముందు అఫ్జల్‌గంజ్‌లో బస్ దిగి నయాపూల్ పైనుంచి చార్మినార్ వెళ్లే దారిలో ఛత్తాబజార్ దాటిన తర్వాత రెండు ట్రాఫిక్ సిగ్నళ్లు దాటాక మచిలీ కమాన్ వస్తుంది. కమాన్‌కు ఆనుకుని ఒక ముసలావిడ తమలపాకులు అమ్ముతుంటుంది. ఆ కమాన్ పక్కనే ఉన్న హోటల్ షాదాన్. దాన్నుంచి మూడో కొట్టు ఒకటి చాలా చిన్నది, మురికిది. అందులో మెల్లకన్ను అబ్బాయి ఒకడు.. వాడి దగ్గర ఉన్నాయి చూడండి సార్ అబ్బబ్బబ్బా..! ఏం నిబ్బులు.. ఎన్ని నిబ్బులు..!’ పాండు చెప్పేదేమిటంటే అంతటి బాపుగారు అఫ్జల్‌గంజ్‌కు ఏ బస్సు వెళుతుందో కనుక్కుని, అది ఎక్కి సీట్ దొరక్కపోతే వీలైతే ఫుట్‌బోర్డింగ్ లాంటిది చేసి, ఆపై నడక అదీ నడిచి.. గూట్లో మాంత్రికుడి ప్రాణాలు సాధించినట్లు ఆ నిబ్బులు సాధించుకోవాలని.. ఆయన మాత్రం అదంతా చేసేద్దామన్నంత ఇదిగా వింటున్నారు. ఖర్మ! నేను కలగజేసుకుని, ఫర్వాలేదు సార్.. మీకు కావాల్సిన నిబ్బులు నేను తెచ్చిపెడతానని హామీ ఇచ్చా. బాపుగారు.. ‘అలా కాదులెండి. నేనూ వస్తాను. ఇద్దరం కలిసే వెళదాం. మీరు చిన్న హెల్ప్ చేయండి చాలు. నాకు ఉర్దూ రాదు. లిప్ మూమెంట్ ఇస్తా. మీరు డబ్బింగ్ చెబితే చాలు’ అన్నారు. ఇక నవ్వులే నవ్వులు... బాపుగారిని వెంటబెట్టుకుని చార్మినార్ వెళ్లింది లేదు. ఇక ఆ అవకాశమూ లేదు. - అన్వర్ (ఆర్టిస్ట్) -
బాపుగారికి ఓసారి లవ్‌లెటర్ రాశా!
బాపు గారిని నేను మొట్టమొదటిసారి కలిసింది హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో. మా అమ్మా నాన్నలతో నేను చెన్నై వెళుతున్నాను. బాపుగారు కూడా ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నారు. ఆయనను చూడగానే, దగ్గరికెళ్లి పలకరించాను. కట్ చేస్తే.. పది రోజుల తర్వాత బాపుగారి ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. ‘‘బాపుగారు ‘సుందరకాండ’ సినిమా తీయనున్నారు. మిమ్మల్నే హీరోయిన్గా అనుకుంటున్నారు’’ అన్నది ఆ ఫోన్ సారాంశం. ఒక రకమైన ఉద్వేగంతో బాపుగారిని కలిశాను. ఆ సినిమాకు నన్ను ఎంపిక చేశారు. షూటింగ్ మొదలుపెట్టాక అతి తక్కువ సమయంలోనే బాపు గారికి దగ్గరయ్యాను. మేమిద్దరం మంచి స్నేహితుల్లా మెలిగేవాళ్లం. ఆ చిత్రం షూటింగ్ బొబ్బిలిలో జరిగినప్పుడు, మా అందరికీ ఓ హోటల్లో బస ఏర్పాటు చేశారు. బాపు గారు మాత్రం మరో హోటల్లో బస చేశారు. ఆ హోటల్ విషయంలో ఆయనకేదో సెంటిమెంట్ ఉందట. బాపుగారు ఎక్కడ ఉంటే నేనూ అక్కడే అంటూ, నాకు కూడా ఆ హోటల్లో ఓ గది బుక్ చేయమన్నాను. కానీ, ఆ హోటల్ అంత బాగుండదని చెప్పారు. అయినా ఫరవాలేదంటూ.. నేనూ ఆ హోటల్‌కు మారిపోయాను. బాపుగారి ఎదురు గదిలో దిగాను. అప్పుడాయన నా దగ్గరకు వచ్చి ‘నా కోసం నువ్వీ హోటల్‌కు వచ్చావ్ కదా!’ అంటూ, ‘ఒక్క అరగంట వెయిట్ చెయ్’ అని నా గది మొత్తం శుభ్రం చేయించారు. కొత్త దుప్పట్లు, దిండు గలీబులు వేయించారు. బాత్రూమ్ శుభ్రం చేయించారు. కొత్త బక్కెట్, మగ్ తెప్పించారు. రూమ్ స్ప్రేతో ఆ గదంతా ఘుమఘుమలాడేలా చేశారు. అక్కడ దోమలు ఎక్కువగా ఉండటంతో నా మంచానికి దోమ తెర ఫిక్స్ చేయించారు. ఇదంతా బాపు గారి గొప్పతనానికి నిదర్శనం. బాపు గారు నన్ను ‘చామ్’ అని పిలిచేవారు. ఆ పిలుపు నాకు కొత్తగా ఉండేది. ‘మీరేమో చాలా ట్రెడిషనల్... కానీ, నన్ను వెస్ట్రన్ స్టయిల్లో పిలుస్తున్నారు. కారణం ఏంటి?’ అని అడిగితే... నవ్వేసి ఊరుకునేవారు. ఆయన అలా పిలవడం నాకు చాలా హాయిగా ఉండేది. సుందరకాండ’ షూటింగ్ సమయంలో వర్షాకాలం. ఆ వాతావరణం పడక నాకు విపరీతంంగా జ్వరం వచ్చింది. దాంతో పాటు దగ్గు కూడా! మరునాడు షూటింగ్‌కు రాలేనని అందరూ అనుకున్నారు. ఆ రోజు షూటింగ్ పూర్తి చేసి, నేను రూమ్‌కు వచ్చి దుప్పటి ముసుగుపెట్టి పడుకున్నాను. కొంతసేపటికి మా తలుపు ఎవరో తట్టారు. నా అసిస్టెంట్ తీస్తే, బాపు గారు ఉన్నారు. ‘లోపలికి రావచ్చా..’ అని అడిగారు. ‘రండి సార్’ అన్నాను. ఆయన అసిస్టెంట్ అనుకుంటా.. ఓ క్యారేజీ తీసుకొచ్చాడు. నా రూమ్‌లో కూర్చుని బాపు గారూ భోజనం చేస్తారేమో అనుకున్నాను. ఆయన క్యారేజ్ ఓపెన్ చేసి, ప్లేటులో అన్నం వడ్డించి, ఆవకాయ పచ్చడి వేసి కలపడం మొదలుపెట్టారు. నాకు ఆవకాయ అన్నం అంటే మహా ఇష్టం. మేమిద్దరం స్నేహితుల్లా ఉండేవాళ్లం అని చెప్పాను కదా! అందుకని నా ఆహారపుటలవాట్లు బాపుగారికి బాగా తెలుసు. ఆయన అన్నం కలుపుతుంటే ‘ఎవరి కోసం..’ అనడిగాను. ‘నీ కోసమే’ అన్నారు. ‘నా కోసమే అయితే సరిగ్గా కలపండి’ అన్నాను నవ్వుతూ. అన్నం కలిపి, నాకు తినిపించారు. ‘బాగా కలిపారు’ అని తిన్నాను. మరునాడు జ్వరం హుష్‌కాకి. షూటింగ్‌కు వెళ్లిపోయాను. ఆ చిత్రం షూటింగ్ నాకు మిగిల్చిన అనుభూతి అంతా ఇంతా కాదు. సినిమా విడుదలై, మేము ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా బాపు గారితో సినిమా చేశాననే సంతృప్తి మిగిలింది. ఆ షూటింగ్ పూర్తయిన తర్వాత ఓ గొప్ప వ్యక్తికి దూరం అయ్యామనే ఫీలింగ్ కలిగింది. బాపు గారు మొబైల్ ఫోన్ వాడరు. ల్యాండ్ లైన్ మాత్రమే. ఇ-మెయిల్స్‌కు కూడా దూరం. అందుకే, నా ఫీలింగ్స్ అన్నీ ఎనిమిది పేజీ ఉత్తరంలా రాశా. అది ‘లవ్ లెటర్’ అనుకోండి.. వేరే ఏదైనా అనుకోండి. ‘సుందరకాండ’ సమయంలో మేమిద్దరం మాట్లాడుకున్న మాటలు, గడిపిన క్షణాలు.. తద్వారా నేను పొందిన అనుభూతిని ఆ ఉత్తరంలో రాశాను. ఆ ఉత్తరంతో పాటు ‘కోనియాక్’ బాటిల్ పంపించాను. ఆయనకు ఆ మద్యం ఇష్టం. చెన్నయ్‌లో నా ఫ్రెండ్ ద్వారా ఆ లెటర్, బాటిల్ పంపించాను. ఆ ఉత్తరం చదివి, బాపు గారు నాకు ఫోన్ చేస్తారని ఎదురు చూసేదాన్ని. అటు నుంచి స్పందన రాకపోవడంతో నా అంతట నేనే ఫోన్ చేశాను. బాపు గారు తీశారు. ‘ఉత్తరం చదివారా’ అనడిగాను. దానికాయన... ‘నువ్వు ఏ విషయాన్నయినా నిర్మొహమాటంగా చెప్పేస్తావ్. ‘సుందరకాండ’ పోయింది కదా! తిడుతూ రాశావేమోనని, ఆ ఉత్తరం చదవలేదు. దేవుడి దగ్గర పెట్టేశా’ అన్నారు. హాయిగా నవ్వేశాను. ‘ముందా ఉత్తరంలో ఏముందో చూడండి. మీ మీద ఉన్న అభిమానానికి అక్షరరూపమిచ్చా’ అన్నాను. ఈ ఏడాది జనవరిలో దుబాయ్‌లో బాపు గారిని కలిశాను. ‘నువ్వు రాసిన ఉత్తరం ఇంకా నా దగ్గరే ఉంది’ అని చెప్పారు. ఐదారేళ్ల తర్వాత ఆ ఉత్తరం గురించి ఆయన ప్రస్తావించడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ప్రతి ఏడాదీ నా పుట్టినరోజు నాడు తప్పకుండా బాపు గారికి ఫోన్ చేస్తాను. ‘ఇవాళ నా బర్త్‌డే. మీకు గుర్తుండదని నాకు తెలుసు. అందుకే, నేనే ఫోన్ చేశాను. నన్ను ఆశీర్వదించండి’ అని అడిగి మరీ, ఆయన ఆశీస్సులు పొందేదాన్ని. ఇక ఆ అదృష్టం నాకు లేదు. అయితే, ఆయన ఎక్కడ ఉన్నా దీవిస్తారనే నమ్మకం ఉంది. బాపు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా... -
అవుట్డోర్ ‘సాక్షి’గా...
బాపు తీసిన తొలి బొమ్మ బొమ్మలతో సున్నితమైన హావభావాలను పలికింపజేయడమే కాదు, ఒక రచయిత పుంఖాను పుంఖాలుగా రాసే కథలోని ఆంతర్యం మొత్తాన్ని ఒక్క బొమ్మతో చెప్పేసే బాపు... రెండున్నర గంటల కథను తెరపై రక్తికట్టించలేడా? కచ్చితంగా రక్తికట్టించగలడు. బాపుపై ముళ్లపూడి వెంకటరమణకి ఉన్న ఆపారమైన నమ్మకం అది. ఆ నమ్మకమే ‘సాక్షి’ నిర్మాణానికి కారణమైంది. బాపుకి కేరీ కూపర్ నటించిన ‘హై నూన్’ సినిమా అంటే ఇష్టం. రెండున్నర గంటల్లో జరిగే కథ అది. తన సినిమాను అలాగే చేద్దామనుకున్నారు బాపు. అందుకు తగ్గట్టే ముళ్లపూడి ‘సాక్షి’ స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ స్క్రిప్టులో పాటలుండవ్. అప్పటికే నవయుగ పంపిణీదారులు కొన్ని సినిమాల వల్ల నష్టపోయి ఉన్నారు. వారి వద్దకెళ్లి ‘సాక్షి’ కథ వినిపించారు ముళ్లపూడి. ‘మూగమనసులు’ రచయితగా ముళ్లపూడి అంటే నవయుగావారికి వల్లమాలిన ప్రేమ. ‘మీరు కొత్తవారితో సినిమా చేద్దామంటున్నారు. సంతోషం. సినిమా అంతా అవుట్డ్డోర్లోనే అంటున్నారు. ఇంకా సంతోషం. కానీ... పాటల్లేకుండా సినిమా అంటున్నారు. అది మాత్రం బాలేదు. మన ప్రేక్షకులకు పాటలు చాలా ముఖ్యం’ అని ముళ్లపూడికి నచ్చజెప్పారు. పంపిణీదారుల సహకారం లేకుండా సినిమా పూర్తి చేయలేం కాబట్టి... పాటలు, నృత్యాలు... ఇలా అన్నీ కలిసొచ్చేట్లుగా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేశారు ముళ్లపూడి. దాంతో నవయుగ వారి భరోసా లభించింది. ి సనిమా సెట్స్‌కి వెళ్లింది. షూటింగ్‌కి వారం రోజుల ముందు ఆదుర్తి దగ్గర సహాయదర్శకుడైన కబీర్దాస్... బాపుని కూర్చోబెట్టి, లాంగ్ షాట్స్, మిడ్లాంగ్ షాట్స్, క్లోజ్ షాట్స్, సజషన్ షాట్స్ ఇవన్నీ... ఎలా తీయాలో సూచించారు. ‘అమ్మ కడుపు చల్లగా’ పాటతో చిత్రీకరణ స్టార్ట్. సాయంత్రానికలా పాటను పూర్తి చేసేశారు బాపు. ఆయన షాట్స్ పెట్టిన తీరు చూసి కెమెరామేన్ సెల్వరాజ్ విస్తుపోయారు. భవిష్యత్‌లో బాపు దేశం గర్వించదగ్గ దర్శకుడు అవుతాడని జోస్యం చెప్పారు. ఇక ‘సాక్షి’ కథ విషయానికొస్తే... హంతకుడు చంపుతాడేమోనని ప్రాణభయంతో వణికిపోతున్న కథానాయకుడికి హంతుకుని చెల్లెలైన కథానాయికే భరోసా ఇస్తుంది. హీరోని పెళ్లాడుతుంది. తర్వాత ఏం జరిగిందనేది కథ. సినిమా ఆద్యంతం కోనసీమలోని పులిదిండి అనే గ్రామంలో తీశారు బాపు. కృష్ణకు ఇది రెండో సినిమా. విజయనిర్మల కూడా ‘రంగులరాట్నం’ తర్వాత నటించిన సినిమా ఇదే. విజయలలిత, సాక్షి రంగారావు, కనకదుర్గ, జగ్గారావులకు ఇదే తొలి సినిమా. కేవలం రెండున్నర లక్షల్లోనే సినిమాను పూర్తి చేశారు బాపు. సినిమా కూడా మంచి లాభాలే వచ్చాయి. అవార్డులను కూడా కైవసం చేసుకుంది. -
హిందీ సినిమా సంగీతం గురించి బాపుగారి పరిజ్ఞానం అపారం
వి.ఎ.కె. రంగారావు (సుప్రసిద్ధ సినీ, సంగీత, కళా విమర్శకుడు - గ్రామ్‌ఫోన్ రికార్డుల సేకర్త) బాపు - రమణలతో నా అనుబంధం ఈ నాటిది కాదు. కొన్ని దశాబ్దాల క్రితం నాటి పరిచయం, ఆపైన స్నేహం, అత్యంత సాన్నిహిత్యం మాది. ‘బాపు గొప్ప దర్శకుడు, ఆయన చేతి కుంచెది గొప్ప రేఖ’ లాంటివి నేను చెప్పనక్కర లేదు. అది సూర్యుడికి దివిటీ పట్టడం లాంటిది. ఆభరణాలకూ బాపు డిజైన్లు! నా వ్యక్తిగత అనుభవాల విషయానికి వస్తే, నాకు గురుతుల్యులైన రచయిత మల్లాది రామకృష్ణశాస్త్రి గారితో నాకు పరిచయం కలిగించింది బాపు - రమణలే! ఆ రోజుల్లో ‘ఆంధ్రపత్రిక’ సచిత్రవారపత్రికలో పాటలపై నేను రాసిన ‘సరాగమాల’కు మల్లాది వారితో పేరు పెట్టించింది - రమణ అయితే, దానికి బొమ్మ వేసింది బాపు. ఆయన గీసే బొమ్మ, వేసే డిజైన్ ప్రత్యేకం. అవి నాకు ఎంత ఇష్టమంటే, ఆయన ఎంత సింపుల్ అంటే, నాకు లెటర్‌హెడ్స్, విజిటింగ్ కార్డులు కూడా ఆయనే డిజైన్ చేసి ఇచ్చారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే - ఉంగరాలు, నా కూతురు వరసైన ఒక అమ్మాయి పెళ్ళికి చేతి కంకణం, మెడలో వేసుకొనే పతకం వగైరా కూడా ఆయనే డిజైన్ చేశారు. సినిమాల సంగతికొస్తే - తొలితరం తెలుగు చిత్రాలైన ‘మాలపిల్ల’, ‘రైతుబిడ్డ’ల్లో కనిపించిన మన తెలుగుదనం, మన తెలుగు వాతావరణం క్రమేణా అంతరించిపోయాయి. మళ్ళీ ఆ పరిమళాన్నీ, వాతావరణాన్నీ తన సినిమాల్లోని తెలుగుదనం ద్వారా తెరపైకి తెచ్చారు బాపు - రమణ. ‘సాక్షి’ సినిమాతో ప్రారంభించి, తరువాత ఎన్నో చిత్రాల్లో దాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఇక, వాళ్ళిద్దరి ద్వారా నాకు కలిగిన సన్నిహిత పరిచయాలూ అనేకం. అక్కినేని నాగేశ్వరరావుతో, గాయకుడు పి.బి. శ్రీనివాస్‌తో, బెంగుళూరుకు చెందిన సుప్రసిద్ధ డిస్ట్రిబ్యూటర్ ఎం. భక్తవత్సలతో సాన్నిహిత్యం వారిద్దరి చలవే. ఇవన్నీ బాపు -రమణలు నాకు మిగిల్చిపోయిన బరువు - బంగారాలు. అపార సంగీత జ్ఞానం: హిందీ సినిమా సంగీతం బాపుకు తెలిసినంత తెలిసినవారు మరెవ్వరూ నాకు తెలియదు. ఆయనకు సంగీతమంటే ఎంత పిచ్చి ప్రేమంటే, స్వయంగా మా ఇంటికి వచ్చిన నా దగ్గరున్న అపురూపమైన రికార్డుల్లో నుంచి కొన్ని వందల హిందీ పాటలను తన స్పూల్ టేప్రికార్డర్పై రికార్డు చేసుకున్నారు. అవి వినీ వినీ, చివరకు వాటి గురించి నాకు కూడా తెలియని ఎన్నో విషయాలు చెప్పేవారు. ఒక్క సినిమా పాటలే కాదు... గజల్స్ గురించి, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం గురించి ఆయన పరిజ్ఞానం అపారం. వాటి గురించి అంత తెలిసినవారు మరొకరు నాకు తారసపడలేదు. ఆయనకు మెహదీ హసన్ గజల్స్ అన్నా, బడే గులామ్ అలీఖాన్ హిందుస్థానీ గానమన్నా ఎంతో ఇష్టం. ఇంకా ఎంతోమంది ఆయన అభిమాన గాయనీ గాయకులు. బాపు - రమణల పాటల్లో కూడా మన తెలుగుదనం, మన సంస్కృతి సంప్రదాయం వినిపిస్తాయి, కనిపిస్తాయి. ఆయన సినిమా సంగీతం తయారవుతున్నప్పుడు ఒక్కసారీ నేను పక్కన లేను. కానీ, మంచి మాట ఎవరు చెప్పినా వినేవారు. పేరు గుర్తు లేదు కానీ ఒక సినిమా విషయంలో నన్ను బాపు -రమణలు సంప్రతించారు. మువ్వనల్లూరు సభాపతయ్య రాసిన పదం ‘మంచి దినము నేడే...’ అన్నది ఆ సినిమాలో పెట్టాలనుకున్నారు. ఆ మాటే నాకు చెప్పారు. కానీ, అది మరీ నింపాదిగా ఉంటుందనీ, దాని బదులు ‘కృష్ణం కలయ సఖీ సుందరం...’ అనే తరంగం పెడితే బాగుంటుందనీ చెప్పాను. అదే సినిమాలో వాడారు. అభిప్రాయాన్ని గౌరవించే స్నేహశీలత: వ్యక్తిగతంగా బాపు ఎంతోమందికి ఎన్నో సాయాలు చేశారు. ఆ జాబితా పెద్దది. ఎప్పుడు బాపు-రమణల దగ్గరకు వెళ్ళినా, వాళ్ళ సినిమాల గురించో, రచనల గురించో మాట వస్తే, నా అభిప్రాయం నిర్మొహమాటంగా చెప్పేవాణ్ణి. దాన్ని వాళ్ళు సహృదయంతో తీసుకొనేవారు. నేను బాగుందని చెప్పినా, బాగా లేదని చెప్పినా బాపు చిరునవ్వు నవ్వేసేవారు. వారిద్దరి పక్షాన రమణే స్పందించేవారు. ఒకసారి బాపు -రమణలతో నాకు పెద్ద గొడవే అయ్యింది. ‘బుల్లెట్’ సినిమాలో అనుకుంటా... శంకరంబాడి సుందరాచారి ‘మా తెలుగుతల్లికి...’ రచన వాడారు. అందులో ‘అమరావతీ గుహల’ అనే వాక్యాన్ని ‘అమరావతీ నగర’ అని మార్చి, పాడించారు. గతించిన కవి రాసిన మాటలో, పాటలో మనం మార్పులు చేయకూడదని నా వాదన. బాపు నవ్వేసి, ఆ మాట రమణతో చెప్పమన్నారు. అప్పట్లో వారితో కలసి పనిచేసిన మరో రచయిత శ్రీరమణ చేసిన మార్పు అది. ఆ మార్పును సమర్థిస్తూ, ఆయన తన వాదన వినిపించారు. నేను సంతృప్తి చెందకపోయినా, ఇంత వాదన జరిగినా, మా స్నేహానికీ, సాన్నిహిత్యానికీ అది అడ్డు కాలేదు. అది వారి సంస్కారం. బొమ్మలే బంగారం బాపు బొమ్మల విషయానికి వస్తే, ‘ఆంధ్రపత్రిక’లో నేను ‘సరాగమాల’ రాస్తున్న రోజుల్లో కథలకు బాపు వేసే బొమ్మలు మిగిలిన పత్రికల్లో వచ్చే బొమ్మలకు చాలా భిన్నంగా, చాలా సంక్లిష్టంగా ఉండేవి. క్రమంగా ఆయన బొమ్మలన్నీ సులభతరం అయ్యాయి. ఒకప్పుడు 44 గీతలతో బొమ్మ వేసిన ఆయన చివరకు 4 గీతలతో బొమ్మ వేసే దశకు పరిణమించారు. ఆయన వేసే బొమ్మల పర్స్పెక్టివ్ కూడా డిఫరెంట్‌గా ఉండేది. అది ఆ తరువాత ఆయన సినిమాలు తీసినప్పుడు అందులోనూ ప్రతిఫలించింది. ఊరకే నటీనటుల ముఖం చూపించకుండా, పక్కనే ఉండే ఆకు, తీగలతో సహా క్లోజప్‌లో చూపే ఫ్రేమింగ్ అందుకు ఉదాహరణ. పుస్తకాలకు ఆయన వేసే బొమ్మలు ఎంత గొప్పగా ఉండేవంటే, విజయవాడలో ‘నవోదయ పబ్లిషర్స్’ రామ్మోహనరావు ప్రచురణలు ప్రారంభించాక, ఆ పుస్తకాల ముఖచిత్రాలన్నీ ఆయనవే. పుస్తకం బొమ్మ చూసి అద్భుతం అని కొనుక్కొని, తీరా పుస్తకం అంత గొప్పగా లేని అనుభవాలూ నాకు చాలానే ఉన్నాయి. ‘బొమ్మ బాగుంది కానీ, పుస్తకం అంత లేదండీ’ అంటే బాపు నవ్వేసేవారు. ఆయన బొమ్మల గొప్పదనం అది. పూవులతో పాటు నార తలకెక్కుతుంది. బాపు - రమణల వల్ల నాకూ అలాంటి అదృష్టం పట్టింది. నేను ప్రచురించిన ‘జనార్దనాష్టకం’ పుస్తకానికి బాపు వేసిన బొమ్మలు శృంగార పరాకాష్ఠతతో నన్ను ధన్యుణ్ణి చేశాయి. ఆ తరువాత నేను పరిచయం చేసిన శ్రీలక్ష్మణ యతీంద్రుల కోరికపై వారి ‘రసధుని’ (‘తిరుప్పావై’కి తెనిగింపు) పుస్తకానికి బాపు వేసిన బొమ్మలు మరో అద్భుతం. అవి ఆండాళ్ అంతరంగం నుండి దొంగిలించినవే - నిస్సందేహంగా! ఇటు బాపు గారు, అటు లక్ష్మణ యతీంద్రులు - వారిద్దరూ ఆ తిరుమల వెళ్ళే దారిలో నన్నొక మెట్టును చేశారు. నా జీవితాన్ని ధన్యం కావించారు. రికార్డుల పైనా...: ఆ రోజుల్లో ఎల్పీ రికార్డులకు ఆ సంస్థల ఆర్టిస్టులు వేస్తే అంత బాగుండేవి కావు. అదే బాపు వేస్తే, ఆ రికార్డులకొక స్థాయి, హోదా వచ్చేవి. అప్పట్లో కొలంబియా వారికీ, గ్రామ్‌ఫోన్ కంపెనీ వారికి నేను సంకలనం చేసిన అనేక ఎల్పీ రికార్డుల కవర్ మీద బాపు బొమ్మ, కవర్ వెనుక ‘స్లీవ్ నోట్స్’ నాది ఉండేవి. అన్నమయ్య కీర్తనలపై వచ్చిన తొలి ఎల్పీ రికార్డుకు బాలమురళీకృష్ణ పాట, బాపు వేసిన తిరుమల ‘బంగారు వాకిలి’ బొమ్మ, నా నోట్స్ - ఇప్పటికీ ఒక తీపి జ్ఞాపకం. అలాగే, తెలుగులో వచ్చిన మొట్టమొదటి ఎల్పీ ‘శ్రీకృష్ణ శ్శరణం మమ’కు ఆయన వేసిన గోపికా వస్త్రాపహరణం బొమ్మ, ఎస్పీబీ పాడిన వెంకటేశ్వర గద్యకు వేసిన చిత్రం, ‘రామదాసు కీర్తనలు’ ఎల్పీ, సినిమా పాటలతో చేసిన ‘శ్రీరామ నామం - శ్రీకృష్ణ గానం’ - ఇవన్నీ ఇప్పటికీ చిత్రకళా ప్రియులకూ, సంగీతాభిమానులకూ పండగ. ఎల్వీ ప్రసాద్ హిందీలో తీసిన తొలిచిత్రం ‘శారద’ (సి. రామచంద్ర సంగీతం) ఎల్పీకి మళ్ళీ బాపు బొమ్మే. బాపు గారు చనిపోయాక, చిత్రకళ ఉండదా అంటే ఎందుకుండదు! హాస్యప్రియత్వం: ఆయన చిత్రాల్లో ‘సంపూర్ణ రామాయణం’, ‘సీతాకల్యాణం’ లాంటి గొప్ప చిత్రాలు చాలానే ఉన్నాయి. అవీ అందరూ చెప్పేవే. కానీ, నాకు చాలా నచ్చిన సినిమా - ‘గోరంత దీపం’. అలాగే, ‘వంశవృక్షం’ చాలా గొప్ప సినిమా. అంత గొప్ప సినిమాయే - ‘భక్త కన్నప్ప’. బాపు - రమణల హాస్యం ఎంత గొప్పదంటే,వాళ్లు నా మీద, నా గ్రామ్‌ఫోన్ రికార్డుల పిచ్చిమీద సరదాగా ఎన్నో కార్టూన్లు వేశారు. అలాగే వాళ్ళ సినిమా ప్రివ్యూ చూసి నేను బయటకు వస్తుంటే, రమణ గారు ‘ఈ సినిమా మీకు నచ్చలేదుగా’ అని అడిగేవారు. ‘నచ్చలేద’ని అంటే, ‘హమ్మయ్య.. ఇక ఫరవాలేదు. సినిమా బాగా ఆడుతుంది’ అనేవారు. నా అభిరుచి, మాస్ ప్రేక్షకుల అభిరుచికి భిన్నంగా ఉంటుందని అంత సున్నితంగా హాస్యభరితంగా చెప్పడం వాళ్ళకే చెల్లింది. నాకు మిగిల్చిపోయిన ఎన్నెన్నో తీపి జ్ఞాపకాలకు ఆ జంటకు కృతజ్ఞుణ్ణి. రవివర్మ చనిపోతే చిత్రకళ లేకుండా పోయిందా? లేదు కదా! బాపు గారి చిత్రకళాప్రభావం కూడా ఇంకో వందేళ్ళు తరువాతి చిత్రకారులపై ఉంటుంది. అది పైకి తెలిసేటట్లు కనిపించకపోయినా, తరువాతి తరాల వారి బొమ్మల్లో అంతర్లీనంగా ప్రతిఫలిస్తుంది. సంభాషణ: రెంటాల జయదేవ -
బాపు గీసిన తొలి బొమ్మ
-
రమణగారు లేని జీవితం కష్టంగా ఉందండీ!
బాపుగారి చివరి ఇంటర్వ్యు సరిగ్గా 200 రోజుల క్రితం... ఉదయం పదకొండు గంటల వేళప్పుడు - చెన్నైలో బాపుగారింట్లో... ఆయన ఇంటర్వ్యూకోసం దర్శకుడు వీఎన్ ఆదిత్య, నేను (సినిమా డెస్క్‌హెడ్ పులగం చిన్నారాయణ), ఫొటోగ్రాఫర్ శివ చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈలోగా ఒక చేదువార్త... బాపు గారికి నీరసంగా ఉందట. ఇప్పుడేం మాట్లాడరట.. ముగ్గురం నీరసపడిపోయాం. ఏం చేయాలో తెలియని అయోమయ స్థితి. కనీసం ఆయనను కలిసి అయినా వెళదామని అలానే కూర్చుండిపోయాం.. మా అదృష్టం బాగుంది. బాపు గారు కరిగిపోయారు. లోపలకు రమ్మన్నారు. చాలా నీరసంగా కనబడ్డారాయన. మాటలు మొదలయ్యాక... చాలా హుషారు ఆయనలో. చిన్న పిల్లాడై పోయారు. చిత్రాలు... చిత్ర పటాలు... చిత్రాతిచిత్రమైన సంఘటనలు... గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌లు... మనసులో తగిలించుకున్న జ్ఞాపకాల చిత్తరువులు... పలు రకాల పుస్తకాలు.. బోలెడన్ని గ్రామ్‌ఫోన్ రికార్డులు... ఆయన బొమ్మలేసే చోటు.. రంగులేసే కుంచె... ఆ పక్కనే ఆయనకు కావాల్సిన స్వరాలందించే పాతకాలపు టేప్‌రికార్డర్... బాపు గారితో అలా... అలా... లీనమైపోయాం. రెండున్నర గంటలు... బాపు గారితో గడపడమంటే, మా మనసు ముంగిట్లో ముత్యాలముగ్గు వేసుకున్నంత ఆనందం. ఈ ఇంటర్వ్యూ మా జీవితంలో గ్రేటెస్ట్ మెమొరీ. కానీ... అదే ఆయన లాస్ట్ ఇంటర్వ్యూ అవుతుందని అనుకోలేదు. మనసు నిండా విషాద మేఘాలు కమ్ముకున్న ఈ వేళ... ఒక్కసారి ఆయన జ్ఞాపకాలలోకి... మాటలలోకి... మీకు ఈ చిత్రకళ ఎలా అబ్బింది? బాపు: మా నాన్నగారు కూడా బొమ్మలు వేసేవారు. ఆయన అడ్వకేట్ అయినా హాబీగా బొమ్మలు వేసేవారు. అయితే ఇది కూడూ గుడ్డా పెట్టేది కాదని ఆయన అభిప్రాయం. నిజంగానే ఆ రోజుల్లో ఆర్టిస్టుగా బతకడం కష్టం. అందుకే నన్ను ‘లా’ చదివించారు. లా పూర్తయ్యాక, ఎప్పుడైనా కోర్టులో వాదించారా? అస్సల్లేదు. అప్పుడప్పుడు కోర్టుకి వెళ్లా. బీఎల్ డిగ్రీ రావడానికి ఎన్రోల్ కావాలి కదా. స్నేహితుల దగ్గర నల్లకోటు అరువు తీసుకుని వెళ్లాను. ఇంతకూ మీరు వెళ్లింది ఏ కోర్టు? నేను పుట్టి పెరిగిందంతా చెన్నై కదా. అక్కడ కోర్టుకే వెళ్లా. మా నాన్నగారు కూడా అక్కడే అడ్వకేట్‌గా పనిచేశారు. తమిళంలో ఓ ఫేమస్ ఆర్టిస్ట్‌కు మీరు ఏకలవ్య శిష్యుడట? ఆయన పేరు గోపులుగారు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడు నాకు ఇష్టమైన ఆర్టిస్టులు అందరి దగ్గరికీ వెళ్తుండేవాణ్ణి. శని, ఆదివారాలు అదే పని నాకు. గోపులుగారింటికి ఆదివారాలు వెళ్లి, ఆయన బొమ్మలు వేస్తుంటే చూసేవాణ్ణి. నేనంటే చాలా ప్రేమ ఆయనకు. అప్పట్లో ఆయన ‘ఆనంద వికటన్’ మేగజైన్లో పనిచేసేవారు. మీరు బొమ్మలు గీసే పద్ధతి ఎలా ఉంటుంది? (వెంటనే ఆయన తన గదిలోకి తీసుకెళ్లి తను కూర్చుని బొమ్మలు గీసే ప్లేస్ చూపించారు). ఇక్కడే నేల మీద బాసింపట్టు వేసుకుని బొమ్మలు వేస్తుంటాను. మొదట్నుంచీ ఇదే అలవాటు. టేబుల్, కుర్చీ వాడను. ఏ ఆర్ట్‌కైనా మూడ్ ప్రధానం కదా. మరి మీకు ఏ టైమ్‌లో మూడ్ ఉంటుంది. నాకు మ్యూజిక్ ఉంటే చాలు. మూడ్‌తో పనిలేదు. ఏ టైమ్ అయినా, అర్ధరాత్రయినా సరే మ్యూజిక్ వింటూ బొమ్మలేసుకునే పని చేసేవాణ్ణి. ఇలా బొమ్మల మధ్యనే పడుకుని నిద్రపోయిన సందర్భాలు కోకొల్లలు. ఇప్పుడు ఓపిక లేదు. కూర్చుంటే లేవలేను. మీ రూమ్‌లో హిందీ మ్యూజిక్ డెరైక్టర్ సి. రామచంద్ర ఫొటో పెట్టుకున్నారు..? చాలా మంచి మ్యూజిక్ డెరైక్టరాయన. ‘అనార్కలి’ చేయడానికి ఆయన మద్రాసు వచ్చినప్పుడు కలిశాను. నా క్లోజ్‌ఫ్రెండ్ వి.ఎ.కె. రంగారావుగారు ఆయనకు వీరాభిమాని. సి. రామచంద్రగారి పాటల వల్ల నాకు ఇంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. నాకు నలుగురితో కలిసి మాట్లాడటమంటే భయం. జలగండంలా నాకు ‘జన’గండం ఉన్నట్టుంది. రామచంద్ర పాట అంటే ఇష్టమని చెప్పగానే, అయిదు నిమిషాల్లో నాకు ఫ్రెండ్స్ అయిన వాళ్లు చాలామంది ఉన్నారు. మీరు వినేది గ్రామ్‌ఫోన్ రికార్డులా? ఆడియో క్యాసెట్లా? మొదట్లో గ్రామ్‌ఫోన్ రికార్డులే వినేవాణ్ణి. తర్వాత క్యాసెట్లు. ఇప్పుడు సీడీలు. మీ దగ్గర బ్రహ్మాండమైన మ్యూజిక్ కలెక్షన్ ఉందట? మెహదీహాసన్, బడే గులాం అలీఖాన్‌ల మ్యూజిక్ కలెక్షన్ మొత్తం ఉంది. వాళ్ల గజల్స్ అంటే నాకు ప్రాణం. గజల్స్ అనే కన్నా, వాళ్ల వాయిస్సే నాకిష్టం. ఎన్నిసార్లు విన్నా తనివి తీరని వాయిస్సులు వాళ్లవి. నాకు ఉర్దూ పెద్దగా రాదు. అయినా వారి వాయిస్‌ల వల్ల ఆ పాటలు బాగా ఎంజాయ్ చేశాను. 1978లో మెహదీహాసన్‌ని కలిశాను. ఓ బొమ్మవేసి ఇచ్చి సంతకం పెట్టమన్నాను. ‘‘హార్మోనియం పెట్టె... సగం బొమ్మే గీశావ్. మొత్తం గీసి తీసుకురా. అప్పుడు పెడతాను’’ అన్నారు. పెద్దవాళ్లకు వాళ్ల కళంటే అంత అభిమానం. బడే గులాం అలీఖాన్‌ను కలవలేకపోయాను. ఆయన కచ్చేరీలకు నన్ను పీబీ శ్రీనివాస్ తీసుకు వెళ్లేవారు. సినిమాలు బాగా చూస్తారా? రెగ్యులర్‌గా చూస్తా. అయితే అన్నీ వీడియోల్లోనే. నేను సినిమా బఫ్‌ని. రోజుకి పది దాకా వీడియోలు చూడగలను. వీడియోలు లేని రోజుల్లో మద్రాసులో మూడు రిలీజ్‌లుండేవి. మూడు పూట్లా మూడు రిలీజ్లు చూసేసేవాణ్ణి. సినిమా సినిమాకీ మధ్య ఒక టీ తాగి, బిస్కెట్లు తినేవాళ్లం. సినిమాలు తీయడానికి మీకు ఇన్స్పిరేషన్..? చిన్నప్పట్నుంచీ సినిమాలంటే చాలా ఇష్టం. మద్రాసులో హాలీవుడ్ సినిమాలన్నీ విడుదలయ్యేవి. అన్నిటికీ నేలక్లాసుకి వెళ్లిపోయేవాళ్లం. మీరు మౌత్ ఆర్గాన్ బాగా వాయించేవారట? కాలేజీ రోజుల్లో బాగా వాయించేవాణ్ణి. ‘మూగమనసులు’ పోస్టర్ మీరే డిజైన్ చేశారు కదా? అవును. రమణగారు ఆ సినిమాకి వర్క్ చేశారు కదా. సినిమాలో ఉన్నదాన్నే ఎలివేట్ చేస్తూ పడవ, పంగలి కర్ర, ముద్దబంతి పువ్వు ఆర్ట్‌గా వేశాను. మీ తొలి సినిమా ‘సాక్షి’కి మీరు పబ్లిసిటీ డిజైన్ చేసుకోకుండా ఈశ్వర్‌తో చేయించారెందుకని? ఈశ్వర్ పోస్టర్స్ ఇష్టపడి ‘సాక్షి’కి తనతో వేయించాను. ‘బంగారు పిచిక’లో యద్దనపూడి సులోచనారాణిగారిని కథానాయికగా తీసుకోవాలనుకున్నారట..? హీరోయిన్గా కాదు. ఆ సినిమాలో ఓ చోట హీరోకి గొప్పింటి సంబంధాలు తీసుకు వస్తుంది తల్లి. అక్కడ ఓ పెళ్లికూతురి వేషం యద్దనపూడి గారితో చేయించాలనుకున్నాం. ఆవిడ కూడా ఒప్పుకున్నారు. కానీ చేయించడం కుదర్లేదు. మీ ప్రతి సినిమాకూ స్టోరీబోర్డ్ వేసుకుంటారు. ఆ ఆలోచన ఎందుకొచ్చింది? నాకు బొమ్మలేయడం వచ్చు కాబట్టి, కన్వీనియంట్‌గా ఉంటుందని స్టోరీ బోర్డ్ వేసుకుంటుంటాను. హాలీవుడ్లో దాదాపుగా అందరూ స్టోరీబోర్డ్ ఫాలో అవుతుంటారు. హైదరాబాద్‌లో కూడా స్టోరీబోర్డ్ వేసే ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. అది ప్యూర్లీ పర్సనల్. బయటివాళ్లకు అర్థం కావు. ఆర్టిస్టులు కూడా చూద్దామని తీసుకుని అర్థంకాక ఇచ్చేసేవారు. మీ తొలి సినిమా ‘సాక్షి’ నుంచి స్టోరీబోర్డ్ ఫాలో అయ్యారా? అవును. నేను హోమ్‌వర్క్ ఎక్కువ చేసేవాణ్ణి. మీ స్టోరీబోర్డ్ ఫాలో అయితే ఎవరైనా ఫొటోగ్రఫీ చేసేయొచ్చునంటారు. లెన్స్ రేంజ్‌లు కూడా డీటెల్డ్‌గా రాస్తారట? అబ్బే అదేం లేదండి. ఎవరి పని వాళ్లదే. మీ సినిమాలకు గొప్ప గొప్ప బాలీవుడ్ కెమెరామేన్లు పనిచేశారు కదా! బాబా ఆజ్మీ, ఇషాన్ ఆర్యలాంటి వాళ్లు పనిచేశారు. వాళ్లతో మీకెలా పరిచయం? వాళ్ల సినిమాలు చూశాను. హిందీ సినిమా ‘గరమ్ హవా’కు ఇషాన్ ఆర్య వర్క్ చూసి, ఆయన ఎక్కడుంటారో కనుక్కుని మాట్లాడాను. ‘ముత్యాల ముగ్గు’ ఆయనకు తొలి తెలుగు సినిమా. దానికి ఆయనకు నేషనల్ అవార్డు వచ్చింది. స్నేహం, గోరంత దీపం, తూర్పు వెళ్లే రైలు సినిమాలకు నాతో పనిచేశారు. ఆయన అసిస్టెంటే బాబా ఆజ్మీ. నటి షబనా ఆజ్మీ తమ్ముడాయన. కైఫీ ఆజ్మీగారబ్బాయ్. రాజాధిరాజు, వంశవృక్షం, రాధా కల్యాణం, త్యాగయ్య, పెళ్లీడు పిల్లలు తదితర సినిమాలకు వర్క్ చేశారు. ‘సంపూర్ణ రామాయణం’ సినిమాకి ట్రిక్ వర్క్ అంతా రవికాంత్ నగాయిచ్‌గారు చూసుకున్నారు. మీరు షాట్ ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టేవారా? అలా మాట వినకపోతే నాతో పని చేయడం కష్టం. ఆర్టిస్టులకి మీరు యాక్ట్ చేసి చూపిస్తారా? చూపించాలి కదండీ. లేకపోతే వాళ్లకు ఎక్స్‌ప్రెషన్సూ అవీ ఎలా తెలుస్తాయండీ. సినిమా మొత్తం మనకు తెలుస్తుంది. వాళ్లు ఎక్కడనుంచో ఇక్కడకు వస్తారు. మనం చెప్పకపోతే వాళ్లకు ఎలా తెలుస్తుంది? మీ సినిమాల్లో ‘సీతమ్మ పెళ్లి’ ప్రత్యేకంగా అనిపిస్తుంది... చాలా మంచి కథ అది. మహేంద్రన్‌గారని తమిళంలో నాకిష్టమైన దర్శకుడు చేసిన ‘నిండు కొయిరాన్’ని తెలుగులో నేను చేశాను. తమిళంలో రజనీకాంత్ చేసిన పాత్రని తెలుగులో మోహన్‌బాబుతో చేయించాం. అందరూ మీ బొమ్మలు వాడుతుంటారు. మీరేమో ‘సీతాకల్యాణం’లో ఓ పాటలో మీ బొమ్మలు కాకుండా వేరే చిత్రకారుని బొమ్మలు వాడినట్టున్నారు? పిలకా నరసింహమూర్తిగారని మా గురువుగారు. ఆయనతో దశావతారాలు బొమ్మలు వేయించాను. మీ సినిమాల్లో ఎక్కడో ఒక చోట పుస్తకాలు కనిపిస్తూ ఉంటాయి ఎందుకని? ఐజన్‌బర్గ్ గారని గాడ్‌ఫాదర్ ఉండేవారు. ఫోర్డ్ ఫౌండేషన్‌వాళ్లు పెట్టిన సదరన్ లాంగ్వేజ్ బుక్ ట్రస్ట్‌కి ఆయన హెడ్. ఆయన చెప్పేవారు... సినిమాలో ఎక్కడో ఒకచోట పుస్తకం చూపించమని. వంటగదిలో సీన్ అయినా సరే. ఇల్లాలు పిల్లాడికి పాలు పట్టిస్తున్నా ఓ చేత్తో పుస్తకం ఉన్నట్టు చూపించమనేవారు. అందరూ పుస్తకాలు చదవాలనేది ఆయన అభిలాష. ‘సాక్షి’ సినిమాని ఇప్పుడు కూడా రీమేక్ చేయొచ్చునా? చాలామంది స్క్రీన్‌ప్లే అది. స్క్రీన్‌ప్లే వైజ్ గొప్పదే కానీ, పర్సనల్‌గా నా వర్క్ నాకు అంత గొప్పగా అనిపించదు. తమిళంలో ఏమైనా చేశారా? ఓకే ఒక్క సినిమా చేశాను. ‘ఇన్సాఫ్ కే తరాజ్’ని తెలుగులోనూ, తమిళంలోనూ చేశాం. మీ సినిమాలకు నెగిటివ్ ఎక్స్పోజర్ కూడా చాలా తక్కువనుకుంటాను? అవునండీ. సినిమా నిడివికి మూడు రెట్లు ఎక్స్పోజర్ ఉండేది. ఎందుకంటే రమణగారు స్క్రిప్ట్ రాసి ఇస్తే, నేను స్టోరీబోర్డ్ వేసేసేవాణ్ణి. అక్కడే చాలామట్టుకు ఎడిటింగ్ అయిపోతుంది. ఓ హిందీ సినిమాని ఒకే సెట్లో రెండు చోట్ల ఊటీలోనూ, ముంబైలో తీసేశాం. కాల్షీట్లు ఇబ్బంది వల్ల. అదంతా స్టోరీబోర్డ్ వల్ల సాధ్యపడింది. రమణగారికి ఏయన్నార్ క్లోజ్ అయితే, మీకు ఎన్టీఆర్‌తో సాన్నిహిత్యం ఉండేదా? అదేం లేదండి. నాకెవ్వరితోనూ ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది కాదు. ఎన్టీఆర్‌తో రెండు సినిమాలు చేశాను. పిల్లల కోసం ప్రభుత్వం తరఫున ఓ ప్రాజెక్ట్ చేయిస్తే చేశాను. అదంతా రమణగారి చలవవల్లే. అన్నీ తెలిసి కూడా మౌనంగా ఉండటం చాలా కష్టం. మీది మొదట్నుంచీ అదే పద్ధతి. కానీ ఏమీ లేకపోయినా డాంబికాలు పలికేవారిని చూస్తే ఏమనిపిస్తుంది? ఇంకొకళ్ల గురించి జడ్జ్ చేయడం కష్టం. తప్పు కదా..? ఈ గోడ మీద మీ బొమ్మలు కాకుండా పెద్ద పెద్ద పెయింటింగ్స్ ఏంటండీ? ఇవన్నీ ఓల్డ్‌మాస్టర్ పెయింటింగ్స్. ‘సీతా కల్యాణం’ టైమ్‌లో లండన్ వెళ్లినపుడు గూటాల కృష్ణమూర్తి గారితో వెళ్లి ఈ పెయింటింగ్స్ కొన్నా. నా ఇంకో ఫ్రెండ్ శ్రీరమణగారు ఇవన్నీ లామినేట్ చేసి పెట్టారు. 1978 నాటి బొమ్మలివి. చిత్రకళలో వచ్చే మార్పుల్ని గమనించడం కోసం ఇంటర్నెట్‌ని ఫాలో అవుతుంటారా? నాకస్సలు కంప్యూటర్ ఆపరేట్ చేయడం తెలీదు. ఎప్పటికప్పుడు పుస్తకాలు రిఫర్ చేస్తుంటాను. అప్పట్లో సెంట్రల్ స్టేషన్ దగ్గర్లో మూర్ మార్కెట్ ఉండేది. అక్కడ చిత్రకళకు, సంబంధించి ఫారిన్ బుక్స్ దొరికేవి. ఆల్మోస్ట్ ఆల్ అదే నాకు స్కూలులాంటిది. ప్రతివారం ఆ మార్కెట్‌కి వెళ్తుండేవాణ్ణి. లేకపోతే లైబ్రరీకి వెళ్లి బుక్స్ రిఫర్ చేస్తుండేవాణ్ణి. నా చిన్నప్పుడు ‘బాల’ అనే చిల్డ్రన్ మేగజైన్ ఉండేది. ‘రేడియో అన్నయ్య’ న్యాపతి రాఘవరావు గారిది. అందులో బొమ్మలేసేవాణ్ణి. ఆయనే ఎంకరేజ్ చేసేవారు. పుస్తకాల షాపుకి తీసుకెళ్లి ‘నీకు కావాల్సినవి కొనుక్కోవయ్యా’ అనేవారు. షీట్స్, రంగులు అన్నీనూ. ఇంటర్నేషనల్ లెవెల్లో మీ పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ ఏమైనా పెట్టారా? చాలా పెట్టారండీ. అమెరికా, లండన్. ‘సీతాకల్యాణం’ టైమ్‌లో నేను కూడా లండన్ వెళ్లాను. మంచి ఆర్టిస్ట్ కావాలంటే ఏం చేయాలండీ? లోపల ఉండాలండీ. నేచురల్‌గా ఇంట్రస్ట్ ఉంటే ప్రాక్టీస్... ప్రాక్టీస్... ప్రాక్టీస్... చేస్తూనే ఉండాలి. అబ్దుల్ కరీం ఖాన్ అని గొప్ప క్లాసికల్ సింగర్ ఉండేవారు. చేతిలో పొన్ను కర్ర. దానికి వెండి పిడి. ఒకాయన ఎవరో మూడు నెలలు సెలవు పెట్టి వస్తాను... సంగీతం నేర్పించమన్నాడట. దానికాయన తన పొన్నుకర్రని చూపించి దీన్ని ఫ్యాక్టరీలో మెషిన్ మీద అయిదు నిమిషాల్లో తయారు చేస్తారు. కానీ నా అరచేయి కింద 30 ఏళ్లుగా ఉంది. అందుకే ఇంత నునుపు తేలింది. సంగీతం మూడు నెలల్లో నేర్చుకుంటే రాదు అన్నారట. అందుకే నిరంతరం అదే పనిలో ఉండాలి. వర్తమానంలో చిత్రకళ గురించి మీ అభిప్రాయం? అద్భుతంగా ఉంది. ఎప్పటికప్పుడు మారుతూ వస్తోంది. పాతవే మంచివి అనుకోవడం పొరపాటు. ప్రస్తుతం మీకు నచ్చిన చిత్రకారుడెవరు? (నవ్వుతూ) నాకు జుట్టు లేదు కానీ, ఇంతమంది చిత్రకారులున్నారు. నిజంగా వేలల్లో ఉన్నారు. మనవళ్లూ మనవరాళ్లలో ఎవ్వరికైనా మీ ఆర్ట్ అబ్బిందా? నా రెండో అబ్బాయి కూతురు బొమ్మలు వేస్తుంది. దానికి 8 ఏళ్లు. మా అమ్మాయి కూడా బొమ్మలు వేస్తుంది. తను ఏదో గ్రాఫిక్స్ కంపెనీలో పనిచేస్తోంది. బొమ్మలు వేయడం నేర్పమని పిల్లలు అడగరా? (నవ్వేస్తూ) నాకు వస్తే కదా... వాళ్లకు నేర్పేది. నేను నిరంతర విద్యార్థిని. నేర్చుకుంటూనే ఉంటాను. ఇప్పుడు మీకు కాలక్షేపం ఏంటి? ఓపిక ఉంటే బొమ్మలు వేయడం. లేకపోతే పుస్తకాలు చదవడం. మొదట్నుంచీ పుస్తకాలు ఎక్కువ చదివేవాణ్ణి. రమణగారి స్క్రిప్టు లేకుండా మీరు రెండు సినిమాలు చేసినట్టున్నారు? లేదండీ. ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ నాటకం ఆధారంగా తీసిన సినిమా కదా. పద్యాలు ఉంటాయని గబ్బిట వెంకట్రావ్‌గారితో స్క్రిప్ట్ చేయించాం. రమణగారి ఇది లేనిదే నేను ఏ సినిమా తీయలేదు. ‘రామాంజనేయ యుద్ధం’కు రమణగారి కంట్రిబ్యూషన్ ఇన్‌డెరైక్ట్‌గా ఉంది. రమణగారు రాసిపెట్టుకున్న సినిమా స్క్రిప్టులు ఇంకేమైనా ఉన్నాయాండీ? లేవండీ. కొన్ని కొన్ని స్టోరీ ఐడియాలుండేవి. చేద్దామని ఫుల్‌ఫ్లెడ్జ్‌డ్‌గా ఏ స్క్రిప్టూ పెట్టుకోలేదు. ఐడియా నచ్చితే అప్పటికప్పుడు స్క్రిప్టు తయారు చేసుకునేవాళ్లం. డబ్బు ఎంత గొప్ప స్నేహితులనైనా విడదీస్తుందంటారు. మీరిద్దరూ తీసిన సినిమా ఫ్లాప్ అయితే ఏం ఇబ్బంది ఎదురు కాలేదా? అంతా రమణగారే చూసుకునేవారు. ఈ ఇల్లు ఆయన కట్టించిందే. ఎన్టీఆర్‌గారి స్కూలు పాఠాల ప్రాజెక్ట్ తర్వాత ఇది, పక్కన మా అమ్మాయి ఇల్లు, వెనుక రమణగారిల్లు కట్టుకున్నాం. రమణగారు ఇల్లు అమ్మేశాక, ఈ ఇంట్లోనే పైన ఉండేవారు. వెనుక ఇంట్లో ఏడాదో, రెండేళ్లో ఉన్నారంతే. ‘‘ఎప్పుడూ కలిసుండేవాళ్లం ఇలా వెనక్కు వెళ్లాను. అందుకే అమ్మేశాను’’ అని జోక్ చేసేవారు రమణ. చిన్నప్పట్నుంచీ తను మా ఇంట్లోనే ఉండేవాడు. మా అమ్మగారు తనను పెద్దబ్బాయ్ అని పిలిచేది. రమణగారు ఉండి ఉంటే... ఇంకో సినిమా చేసేవారా? చేసేవాణ్ణి. ‘శ్రీరామరాజ్యం’ తర్వాత ఏమైనా అనుకున్నారా? ‘శ్రీరామరాజ్యం’ జరుగుతుంటేనే పోయారాయన. స్క్రిప్ట్ ముందే రాసేస్తారు కనుక ఇబ్బంది అనిపించలేదు. రమణగారితో మీ లాస్ట్ వర్డ్? రాత్రి రెండింటికి వాళ్లావిడ పిలిచింది. నన్ను పైకి రమ్మంటున్నారని. జస్ట్ టూ మినిట్స్. అనాయాస మరణం. ఊపిరి అందలేదు. రమణగారు లేని లైఫ్ ఎలా ఉందండీ? చాలా కష్టంగా ఉందండీ (అంటుండగానే ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి). అప్పటి నుంచీ నాకు ఓపిక పోయింది. - సంభాషణ: వి.ఎన్. ఆదిత్య, పులగం చిన్నారాయణ -
మహా మనీషి బాపు..
సినీ, సాహిత్య రంగాల్లోనేగాక యావత్ తెలుగుజాతి గర్వించదగిన వ్యక్తి బాపు. తెలుగు భాషలో బాపు బొమ్మకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రపంచంలోని తెలుగు జాతి కంతటికీ తెలుసు. ఆలోచనల్లో ఎంతో గొప్పగా ఉండే బాపు నిజజీవితంలో మాత్రం చాలా సామాన్యంగా ఉండేవారు. స్నేహానికి పర్యాయపదంగా జీవించారు. సినీ దర్శకునిగా, చిత్రకారునిగా, కార్టూనిస్టుగా, డిజైనర్‌గా బాపు చేసిన సేవలు అసామాన్యం. బాపు బొమ్మ, బాపు అక్షరాలు, బాపు సినిమాలు, బాపు కార్టూన్లు దేనికదే ఓ మహా కావ్యం. తెలుగువాడిగా పుట్టి ప్రపంచవ్యాప్తంగా తన గీత(బొమ్మ) ద్వారా పరిచయమైన బాపు మహోన్నత వ్యక్తిత్వం కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగుజాతి, భారతదేశం ఓ మహానుభావుడిని, ఓ మహా మనీషిని కోల్పోయింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. -వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బాపు మరణం తెలుగువారందరికీ మహా విషాదం. బాపు మృతితో తెలుగు నేల చిన్నబోయింది. తెలుగుదనం మసకబారింది. ఒక శకం ముగిసినట్లయింది. నా రెండో సినిమాగా ‘మనవూరి పాండవులు’ బాపు దర్శకత్వంలో నటించడం వల్లనే ఒక నటుడిగా నన్ను నేను తీర్చిదిద్దుకోగలిగాను. - చిరంజీవి, నటుడు, రాజ్యసభ సభ్యుడు స్నేహం అనే పదంలో ఒక అక్షరం బాపు, మరో అక్షరం రమణ. స్నేహానికి అర్థం బాపు- రమణ. తెలుగు సాహితీలోకానికి వారు చేసిన సేవ అజరామరం. తెలుగు భాష ఉన్నంత కాలం బాపు పేరు ఉంటుంది. సాహితీ లోకంలో ఎంత ఎత్తుకు ఎదిగినా నిరాడంబరతను ఆభరణంగా ధరించిన బాపు మృతి చెందిన రోజు అత్యంత విషాదకరం. బాపు మృతి సాహితీవేత్తలకు, వ్యక్తిగతంగా నాకు తీరని ఆవేదన. కె.వి.రమణాచారి (తెలంగాణ ప్రభుత్వ సలహాదారు) ఆత్మీయుడిని కోల్పోయాం.. బాపు మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఓ గొప్ప ఆత్మీయుడిని కోల్పోయాను. అందాల రాముడు, సీతా కళ్యాణం, సంపూర్ణ రామాయణం, ముత్యాల ముగ్గు, భక్తకన్నప్ప చిత్రాల్లో బాపు నాతో రాయించిన గీతాలు ఎంతో ప్రజాదరణ పొందాయి - సి.నారాయణరెడ్డి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత బాపు మృతి తీరని లోటు. బాపు తీసిన చిత్రాల్లో 90 శాతం సినిమాలకు ఆయనతో కలిసి పనిచేశాను. నా తొలి పాట బాపు జన్మదినమైన డిసెంబర్ 15న రికార్డయింది. ఇది జీవితంలో మరచిపోలేని ఘట్టం. బాపు దగ్గరకు రానిచ్చే అతి కొద్ది మందిలో నేనూ ఒకడిని. జూలైలో ఆయన వద్దకు వెళ్లాను. ఆ సమయంలో ఆయనకు ఇష్టమైన కొన్ని పాటలను పాడి వినిపించాను. అదే నేను చివరిసారిగా బాపుని కలిసింది. జనాబ్ మెహదీ హసన్ అన్నా, ఆయన ఘజల్స్ అన్నా బాపుకి అమితమైన ఇష్టం. - ఎస్పీ బాల సుబ్రమణ్యం, గాయకుడు తెలుగు జాతి, సినీ పరిశ్రమ ఓ మహోన్నత వ్యక్తిని కోల్పోయాయి. బాపు తెలుగువాడిగా పుట్టడం తెలుగుజాతి చేసుకున్న అదృష్టం. ఆయన మరణంతో కన్నీరు పెట్టని తెలుగు వారుండరు. - పరుచూరి వెంకటేశ్వరరావు, సినీరచయిత ‘రాజాధిరాజు’ సినిమాకోసం బాపుతో కలసి పనిచేశా. గొప్ప కళాహృదయమున్న ఆయనతో కలసి పనిచేయడం మరపురాని అనుభూతిని మిగిల్చింది. ఆయన మరణం బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. - విజయచందర్, వైఎస్సార్సీపీ ప్రచార విభాగం కన్వీనర్ తెలుగు చిత్రానికి, చలన చిత్రానికి అపరబ్రహ్మగా బాపు ప్రాణప్రతిష్ట చేశారు. తన చిరకాల మిత్రుడు రమణను కలుసుకునేందుకే మనందరినీ వదిలివెళ్లారు. ప్రపంచం మెచ్చిన చలనచిత్రాలతో బాపు దర్శక దిగ్గజంగా చిరస్థాయిగా నిలిచిపోతారు. - పరకాల ప్రభాకర్, ఏపీ కమ్యూనికేషన్స్ సలహాదారు -
సాహితీలోకానికి తీరని లోటు
సాక్షి, హైదరాబాద్: బాపు మృతి తీరనిలోటు. తెలుగు సినీ దర్శకునిగా, చిత్రకారునిగా, రచయితగా సాహిత్యానికి చేసిన సేవ మరువలేనిది. ఆయన మృతితో తెలుగు సాహితీలోకానికి భర్తీ చేయలేని నష్టం కలిగింది. - గవర్నర్ నరసింహన్ దర్శకుడిగా, చిత్రకారుడిగా, రచయితగా బాపు సినీ, కళా, సాహిత్య రంగాలకు ఎంతో సేవ చేశారు. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది. బాపు మరణం తెలుగు ప్రజలకు, సినీరంగానికి, సాహిత్యలోకానికి తీరని లోటు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.. - కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి బాపు గీత, బాపు రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. ఆయన ఇకలేరని తెలియడం ఎంతో ఆవేదన కలిగిస్తోంది. తెలుగు జాతి ఉన్నంత వరకు బాపు కార్టూన్లు, పుస్తకాలపై ముద్రించిన ముఖచిత్రాలు సజీవంగా నిలబడతాయి. తెలుగుతనం ఉట్టిపడేలా చలనచిత్రాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి. బాపు మృతి చిత్రకారులకు, సినీ రంగానికి తీరనిలోటు. - చంద్రబాబునాయుడు, ఏపీ సీఎం బాపు మృతి అత్యంత బాధాకరం. తెలుగు భాషకు, సినీ పరిశ్రమకు ఆయన లేని లోటు పూడ్చలేనిది అంటూ బాపు కుటుంబసభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు. పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ అధ్యక్షుడు ‘‘బహుముఖ కళానైపుణ్యంతో తెలుగు ప్రజలకు కొత్త వెలుగు తెచ్చిన బాపుకు సాటి రాగల వ్యక్తి మరొకరు లేరు’’ - కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు కె.నారాయణ తదితరులు బాపు మృతి పట్ల సంతాపం ప్రకటించారు. -
దిగంతాలకు తెలుగు సంతకం
ఆకాశంలో సూర్యుడు మర్డర్ చేసినట్టుగా లేడు... కన్నీటి ముద్దలా ఉన్నాడు. ముత్యమంతా పసుపు... ముఖమెంతొ చాయ... కూనిరాగం మూగబోయింది. సగటు ఇల్లాలి గొంతు దుఃఖంతో రుద్ధమైంది. పట్టీల పాదాల ఆడపిల్లలందరూ చిన్నబుచ్చుకుని పక్కకు తప్పుకున్నారు. బుడుగు అల్లరి ఆపేశాడు... సీగాన పెసూనాంబ నోటికి తాళం పడింది. ఇంతకాలం నవ్వించిన తెలుగు వ్యంగ్య రేఖా పాత్రలన్నీ తండ్రి కనిపించని పిల్లల్లా కేర్కేర్మని ఏడుస్తున్నాయి. రామయ్య దర్పం, సీతమ్మ చిర్నవ్వు క్షణమాత్రం చెదిరి వదనాలు విషణ్ణమయ్యాయి. బాపు మరి లేరు. కుదురుగా బలిష్టంగా ఉండే ఆయన బొటనవేలు, చూపుడు వేలు మధ్య ఆ కుంచె మరి లేదు. తెలుగు అందం మరి లేదు. తెలుగు హాస్యం మరి లేదు. పాశ్చాత్య ప్రపంచాన్ని తన వైపు లాగిన రామాయణ, భారత, భాగవతాల తెలుగు రేఖా సౌరభం మరి లేదు. తెలుగుదనంతో నిండిన ఆ సినిమా మరి లేదు. తెలుగు స్నేహానికి తార్కాణంగా నిలిచిన ఆ జోడి మరి లేదు. 50 ఏళ్ల చలనచిత్రకారుడు బాపు... 65 ఏళ్ల చిత్రకారుడు బాపు... 81 ఏళ్ల చరిత్రకారుడు బాపు ఇక మనకు లేరు. సాక్షి ప్రతినిధులు: సుప్రసిద్ధ దర్శకుడు, చిత్రకారుడు, కార్టూనిస్టు బాపు (81) ఆదివారం కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతూ సాయంత్రం 4.45 గంటలకు తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా వృద్ధాప్య కారణాలతో ఇంటిపట్టునే ఉంటున్న బాపు మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురై ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. రాత్రి 7.30 గంటలకు బాపు భౌతికకాయాన్ని చెన్నై అడయారులోని ఆయన స్వగృహానికి తీసుకువచ్చారు. బాపు మరణవార్త నగరంలో వేగంగా వ్యాపించడంతో పలువురు ప్రముఖులు ఇంటికి చేరుకుని ఆయనకు నివాళులర్పించారు. బాపు భార్య భాగీరథి గత ఏడాది ఏప్రిల్ 24న కన్నుమూశారు. ఆయనకు కుమార్తె భానుమతి, కుమారులు వేణుగోపాల్, వెంకటరమణ ఉన్నారు. బాపు పెద్ద కుమారుడు వేణుగోపాల్ ఈ నెల 29న జపాన్‌కు వెళ్లారు. తండ్రి మరణవార్త తెలుసుకున్న ఆయన సోమవారం చెన్నై చేరుకుంటారని తెలిసింది. హైదరాబాద్ నుంచి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరుకానున్నారు. సోమవారం సాయంత్రం చెన్నైలో అంత్యక్రియలు జరగనున్నాయి. చిత్రకారుడు బాపు పదిహేనేళ్ల వయసులోనే బాపు కుంచె చేతబూనారు. బాలానంద సంఘం నుంచి బాలపత్రికలో బాపు బొమ్మల కథ మొదలయ్యింది. నవ యవ్వన దశలోనే కవర్ డిజైన్లు, కామిక్సు, కార్టూన్లు గీయడం మొదలుపెట్టారు. బాపు బొమ్మల్లో ఆడతనం, జాణతనం, కన్నెతనం, గడుసుతనం మద్రాసు మేధావుల్ని విస్తుపోయేలా చేసింది. ‘ఎవరయ్యా ఈ ఆర్టిస్టూ’ అంటూ కనురెప్పలెగరేసేలా చేసింది. అప్పట్నుంచి బాపు బొమ్మలు కూడా వారికి దీటుగా మాట్లాడటం, వెక్కిరించడం, ఎగతాళి చేయడం, ముక్కున వేలేసుకోవడం నేర్చాయి. ఇలస్ట్రేటర్‌గా, కార్టూనిస్ట్‌గా, పెయింటర్‌గా, డిజైనర్‌గా... బాపుది అద్వితీయ ప్రస్థానం. వాలుజడను విసురుతూ.. చారడేసి కళ్ళు, కోటేరు ముక్కుతో వయ్యారాలు ఒలకబోసే బాపు బొమ్మ తెలుగువారి ఆస్తి. అడపాదడపా బాపు బొమ్మను స్మరించకుండా మన సినీ గేయ రచయితలు కూడా ఉండలేరు. బాపు ఆగమనంతో సినిమా వాల్‌పోస్టర్ల రూపు రేఖలు మారిపోయాయి. ఈ అద్వితీయ ప్రతిభే ఆయన్ను తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన చిత్రకారునిగా నిలబెట్టింది. బాపు కుంచె నుంచి జాలువారిన తిరుమల శ్రీవారి చిత్రాలు, అన్నమయ్య నాట్య విన్యాసాలు తిరుమల భక్తులను నేటికీ తన్మయానికి గురి చేస్తుంటాయి. వెండితెరపై బాపు అద్భుతాలు ‘సాక్షి’ తర్వాత బాపు వెండితెర అద్భుతం అంటే ‘బుద్ధిమంతుడు’ (1969) సినిమానే చెప్పుకోవాలి. నాస్తికునిగా, ఆస్తికునిగా రెండు విభిన్న పాత్రల్లో అక్కినేనిని చూపించి శభాష్ అనిపించారు బాపు. ఫాంటసీలో ఇదొక వినూత్న ప్రయత్నం. ఇప్పటికీ ఈ సినిమా కొత్తగానే ఉంటుంది. ఇక అప్పటివరకూ వచ్చిన పౌరాణికాలు ఒక ఎత్తు, బాపూ ‘సంపూర్ణ రామాయణం’(1971) ఒక ఎత్తు. శోభన్‌బాబుని రామునిగా చేసి బాపు తీసిన ఈ సినిమా ఓ క్లాసిక్. వాల్మీకి రామాయణాన్ని ఇంత మధురంగా తీర్చిదిద్దిన సినిమా ఇప్పటికీ లేదంటే అతిశయోక్తికాదు. 1973లో అక్కినేనితో చేసిన ‘అందాల రాముడు’ సినిమా అయితే.. ఓ అందమైన గోదారి ప్రయాణమే. శ్రీరాముడంటే బాపు-రమణలకు మహాభక్తి. ఎంత భక్తంటే.. రాముడే తమను నడిపిస్తున్నాడనుకునేంత. ఆ భక్తినంతా క్రోడీకరించి వారు తీసిన సినిమా ‘శ్రీరామాంజనేయ యుద్ధం’. వెండితెరపై రాముడిగా అప్పటికే చెరగని స్థానాన్ని సంపాదించుకున్న ఎన్టీఆర్.. బాపు దృక్కోణంలో రాముడిగా శోభతో వెలిగిపోయారు. ఈ కల్పిత కథను జనరంజకంగా మలిచి, శభాష్ అనిపించుకున్నారు బాపు. బాపు ‘ముత్యాలముగ్గు’ సాంఘిక చిత్రాల్లో ఓ ట్రెండ్ సెట్టర్. 1975లో ‘ముత్యాలముగ్గు’ తెలుగు సినిమా గమనాన్ని మార్చేసింది. ముళ్లపూడి వెంకటరమణ అయితే.. సంభాషణలతో చెలరేగిపోయారు. రావుగోపాలరావు అనే నటుడు దశాబ్దంన్నర పాటు తిరుగులేని విలన్‌గా తెలుగుతెరను ఏలారంటే కారణం ‘ముత్యాలముగ్గు’. రామాయణాన్ని సోషలైజ్ చేసి తీసిన సినిమా ఇది. ‘సీతా కల్యాణం’(1976) చిత్రంలో తెలుగు తెరపై సాంకేతిక విప్లవం సృష్టించారు బాపు. లండన్, షికాగో ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించిన చిత్రమిది. అలాగే లండన్‌లోని ఆర్కైవ్స్‌లో ఈ చిత్రాన్ని భద్రపరిచారు. ఈ సినిమా చూసిన దర్శకుడు కె.బాలచందర్ ఢిల్లీలోని ఓ అవార్డు ఫంక్షన్లో బాపుని కలిసి.. ‘నేను గుడికి వెళ్లను. దేవుణ్ణి నమ్మను. కానీ... నీ ‘సీతాకల్యాణం’ చూశాక.. ఆ దృశ్యాలే నా కళ్లలో మెదులుతున్నాయి’ అన్నారు పారవశ్యంతో. వెండితెరకు కన్నప్ప.. ధూర్జటి ‘కాళహస్తి మహత్యం’(1976) కావ్యానికి బాపు ఇచ్చిన వెండితెర రూపం ‘భక్త కన్నప్ప’. కృష్ణంరాజుని కన్నప్పగా, బాలయ్యను పరమశివునిగా చూపిస్తూ ఆయన తీసిన ఈ కావ్యం ఇప్పటికీ ప్రేక్షకుల్ని తన్మయానికి గురి చేస్తుంది. సామాజిక దృక్పథంతో కూడిన కథాంశంతో బాపు తీసిన సినిమా ‘మనవూరి పాండవులు’(1978). చిరంజీవి తొలి శతదినోత్సవ చిత్రమిదే. బాపూలోని విప్లవభావాలకూ ఈ సినిమా అద్దం పడుతుంది. ఇంకా గోరంత దీపం, తూర్పువెళ్లే రైలు, వంశవృక్షం, బైబిల్ కథాంశంతో తీసిన ‘రాజాధిరాజు’, త్యాగయ్య, రాధాకల్యాణం, మంత్రిగారి వియ్యంకుడు, జాకీ, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్లాం, శ్రీరామరాజ్యం... ఇలా ఎన్నో అద్భుతాలు బాపు సృజన నుంచి జాలువారాయి. పదికి పైగా హిందీ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు బాపు. ఎక్కడ చూసినా ఆయన అక్షరాలే.. అక్షరాలు గుండ్రంగానే ఉండాలా? అలాగైతే పాత అక్షరాలనే కంపోజ్ చేసుకోవచ్చుగా అంటూ ముద్రణ రంగంలోని పాత చింతకాయ విధానాలపై ఉద్యమించారు బాపు. ఇక బాపు ఫ్రీస్టయిల్ అక్షరాలు ముద్రణ రంగంలో పోటెత్తాయి. సినిమా పోస్టర్లు, సైన్ బోర్డులు, పత్రిక శీర్షికలు ఇలా ప్రతి వాటిపై బాపు అక్షరాలే. ఈ సాఫ్ట్వేర్ యుగంలో కూడా బాపు బ్రష్, బాపు నిబ్ అంటూ పలు రకాల లిపులు అక్షర చరిత్రలో సంచలనాలు సృష్టిస్తున్నాయి. తెలుగునాట ఏ శుభకార్యం జరిగినా సదరు శుభలేఖలపై ఉండే బాపు అక్షరాలే తెలుగువారికి శుభాక్షితలు. ముళ్లపూడితో స్నేహం బాపు-రమణ.. వీరిద్దరి శరీరాలే వేరు. ఆత్మలు ఒక్కటే. బాపు విజయాల్లో సగభాగం రమణకు ఇవ్వాల్సిందే. ముళ్లపూడి చివరి శ్వాస విడిచే వరుకూ బాపూ చేయి విడువలేదు. బాపు గీత, ముళ్లపూడి రాత జీవ నదుల్లా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. ముళ్లపూడి మరణం బాపుని మానసికంగా కుంగదీసింది. అప్పట్నుంచే ఆయన ఆనారోగ్యానికి గురయ్యారు. ఈరోజు బాపు మన మధ్య లేకపోవడం యావత్ భారతావనికే తీరని లోటు. చలన చిత్రకారుడు.. బాపుకు మొదట్నుంచీ సినిమాల పిచ్చి. వచ్చిన ప్రతి సినిమానూ చూసేవారు. నచ్చితే మళ్లీ మళ్లీ చూసేవారు. చూసొచ్చిన తర్వాత మిత్రులతో ‘నేనైతే.. ఇలా తీసేవాణ్ణి’ అంటూ చర్చాగోష్టి పెట్టేవారు. చిత్రకారుడైన తనకు ఎప్పటికైనా చలనచిత్రకారుడు కూడా కావాలని ఆకాంక్ష. ఆ కోరికను ప్రాణమిత్రుడైన ముళ్లపూడి వెంకటరమణ తీర్చేశారు. అప్పటికే రమణ స్టార్ రైటర్. రక్తసంబంధం, మూగ మనసులు, దాగుడు మూతలు, గుడిగంటలు లాంటి సిల్వర్‌జూబ్లీ చిత్రాలకు రచనలు చేసిన అనుభవం ఆయనది. పైగా బాపు ప్రతిభ బాగా తెలిసిన వ్యక్తి. అందుకే బాపు ‘డెరైక్షన్’ అనగానే రమణ ‘యాక్షన్’ అనేశారు. 1967లో కేవలం రెండున్నర లక్షల ఖర్చుతో ‘సాక్షి’ సినిమాను తీసేశారు బాపు. బొమ్మలు గీసుకునేవాడికి సినిమాలేంటి? అని వెటకారం చేసిన వారే ముక్కున వేలేసుకున్నారు. ఇక అప్పట్నుంచి ‘శ్రీరామరాజ్యం’ వరకూ 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు బాపు. తెలుగుదనానికి బ్రాండ్ అంబాసిడర్ 1977లో ‘స్నేహం’ సినిమా ద్వారా బాపూరమణలు నన్ను తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేశారు. 14 ఏళ్ల తర్వాత మళ్లీ రమణగారు నాముందు ప్రత్యక్షమయ్యారు. ‘పెళ్లిపుస్తకం’ సినిమా తీశారు. ఇవాళ ఏ తెలుగువారి ఇంట పెళ్లి జరిగినా ఇందులోని శ్రీరస్తు.. శుభమస్తు.. పాట మోగాల్సిందే కదా. వారే మళ్లీ మిస్టర్ పెళ్లాం చేశారు. మధ్యతరగతి లలిత శృంగారాన్ని చూపిన సినిమాగా అదెలా నిలిచిపోయిందో మనందిరికీ తెలుసు. వీటన్నింటికన్నా బాపూగారిని మనం తలుచుకోవాల్సింది ఆయన బొమ్మలని, వాటిలోని తెలుగుదనాన్ని. ఆయన తెలుగుదనానికి బ్రాండ్ అంబాసిడర్. - నటుడు రాజేంద్రప్రసాద్ వెండితెర అమరశిల్పి జక్కన్న కళాత్మక చిత్రాలకు పెట్టింది పేరు బాపుగారు. ఆయన తీసిన ప్రతి చిత్రమూ సకుటుంబ సమేతంగా చూడదగ్గవే. ప్రతి ఫ్రేమ్‌ను అందంగా ఆవిష్కరించిన వెండితెర అమరశిల్పి జక్కన్న బాపుగారు. అసలు రమణగారు పోయినప్పుడే బాపూగారు మానసికంగా చనిపోయారు. ఇప్పుడు భౌతికంగా దూరమయ్యారు. తెలుగు సినిమా తెర మీద ఆయన ముద్ర ప్రగాఢమైనది. అందమైన అమ్మాయి కనిపిస్తే బాపు బొమ్మ అనడం మన తెలుగువారికి పరిపాటి అయ్యింది. ఆయన మరణం తీరని లోటు. - దర్శకుడు దాసరి నారాయణరావు తొలి కథానాయికను.. దర్శకునిగా ‘సాక్షి’ ఆయనకు తొలి సినిమా. ఆ విధంగా బాపూగారి తొలి కథానాయికను నేను కావడం నాకెప్పటికీ ఆనందంగా ఉంటుంది. నేను దర్శకురాల్ని కావడానికి కారణం బాపూగారే. సినిమా గురించి ఏ సందేహం అడిగినా విసుక్కోకుండా చెప్పేవారు. ‘సాక్షి’ చిత్రం ద్వారానే నాకు కృష్ఱగారితో పరిచయం ఏర్పడింది. బాపూగారి దయవల్ల కృష్ణగారు నా జీవితంలోకి వచ్చారు. ఏడాది క్రితం ఆయన్ను ఓ ఫంక్షన్లో కలిశాను. కానీ, ఇంత త్వరగా మనకు దూరమవుతారని ఊహించలేదు. - నటి, దర్శకురాలు విజయనిర్మల బొమ్మల దర్శకులను చూడలేదు నా తొలి చిత్రం ‘తేనె మనసులు’కి రమణగారే కథ రాశారు. ఆ చిత్రం లొకేషన్‌కి రమణగారు, బాపూగారు అప్పుడప్పుడు వస్తుండేవారు. నేను హీరోగా బాపు గారు తీసిన ‘సాక్షి’ సినిమాను 17, 18 రోజుల్లోనే పూర్తి చేసేశారు. ప్రతి సీన్ తీసే ముందు బొమ్మలు గీసి, కెమెరామేన్‌కి చూపించి ‘ఈ షాట్ నాకిలా రావాలి’ అని చెప్పేవారు బాపూగారు. నేనిప్పటివరకు 300కు పైగా సినిమాల్లో నటించాను. కానీ, అలా బొమ్మలు గీసి, ఆ ప్రకారమే సీన్స్ రావాలని చెప్పిన దర్శకులను చూడలేదు. అంతటి మహా దర్శకుణ్ణి కోల్పోవడం దురదృష్టం. - సూపర్‌స్టార్ కృష్ణ ఆ ఘనత బాపూగారిదే: మోహన్‌బాబు వాలు జడ, సొగసు కళ్లు.. ఇంత అందంగా ఉండాలని చూపించిన కుంచె ఆయనది. కంప్యూటర్ గ్రాఫిక్స్ అందుబాటులో లేని రోజుల్లోనే ‘సీతమ్మ పెళ్లి’ చిత్రంలో సీతాదేవి భూమి నుంచి పైకి వచ్చే సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించిన బాపు ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి మహోన్నత వ్యక్తి తన స్నేహితుడు రమణగారితో ‘మోహన్‌బాబు చాలా బాగా నటించాడు’ అనడం నా జీవితంలో మర్చిపోలేని అభినందన. అది ఆయనకే సాధ్యం: బాలకృష్ణ పౌరాణిక చిత్రాలు కనుమరుగవుతున్న రోజుల్లో బాపూగారు నాతో ‘శ్రీరామరాజ్యం’ చిత్రం తీశారు. నన్ను శ్రీరాముడిగా మలిచిన తీరు, ‘శ్రీరామరాజ్యం’ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన వైనం ఒక్క బాపూగారికే సాధ్యం. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో బాపూగారితో ఉన్న ప్రతి క్షణం ఓ తీపి గుర్తు. -
బాపూ.. మీరు లేరా!
బాపూ మృతికి విశాఖ దిగ్భ్రాంతి నగరంతో ఆయనకు విడదీయరాని అనుబంధం ప్రముఖుల సంతాపం విశాఖపట్నం : ప్రఖ్యాత చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు మృతి విశాఖ వాసులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఎక్కడ ఉన్నా నగరంలోని సాహితీ ప్రియులతో సత్సంబంధాలు కొనసాగిస్తుంటారు. విశాఖ వాసులు రాసే సాహిత్యంపై ఆయనకు మక్కువ ఎక్కువ. అందుకే ఇక్కడి కవులు రాసే పుస్తకాలను ఆయన క్రమం తప్పకుండా చదువుతారు. అనేక పుస్తకాలకు ఆయన ముందు మాట రాశారు. బాపు గీసిన నవరసాల బొమ్మలు మద్దిల పాలెం కళాభారతి ఆడిటోరియంలో ఆయన గౌరవార్థం నేటికీ దర్శనమిస్తాయి. ప్రముఖ సినీనటుడు నూతన ప్రసాద్ వీటిని కళాభారతికి అందజేశారు. ఆంధ్రా యూనివర్సిటీ 1991లో కళాప్రపూర్ణ బిరుదుతో పాటు గౌరవ డాక్టరేట్ ఇచ్చి బాపూను సత్కరించింది. అప్పుడాయన ఏయూలోని రంజనీ అతిథి గృహంలో బస చేశారు. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు విశాఖలో ఆయన బస చేసినా అది సొంత పర్యటనలు కావడంతో ఎవరికీ తెలియజేయలేదు. చివరిగా ఆయన దర్శకత్వం వహించిన శ్రీరామరాజ్యం చిత్రంలో కొంతభాగాన్ని ఇక్కడ చిత్రీకరించారు. తీరని లోటు సినీ లోకానికి బాపు లేని లోటు తీరనిది. సినిమాల్లో అన్ని రసాలతో రక్తికట్టించే అపర దర్శకునిగా కీర్తినార్జించారు. ఆరు సార్లు నంది అవార్డు అందుకుని విశ్వ విఖ్యాత దర్శక మహ ర్షి అనే బిరుదు పొందారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. -గంటా శ్రీనివాసరావు, విద్యా శాఖ మంత్రి బాపూ చిత్రాలు అజరామరం తెలుగుదనానికి ప్రతీకగా నిలచిన బాపు ఆకస్మిక అస్తమయం విశాఖ సాహితీలోకాన్ని నివ్వెరపరచింది. వారు గీసిన రేఖా చిత్రాలు, దస్తూరి నభూతో నభవిష్యత్. భక్త కన్నప్ప, సంపూర్ణ రామాయణం, మన ఊరి పాండవులు తదితర సినిమాలు తెలుగు చిత్రసీమలో తిరుగులేని కళాకండాలు. భౌతికంగా ఆయన లేకపోయినా ఆయన తీసిన, గీసిన చిత్రాలు అజరామరమైనవి. -ఆచార్య కె. మలయవాసిని, అధ్యక్షురాలు, విశాఖ సాహితీ అనితర సాధ్యుడు బాపు హఠాన్మరణం తెలుగుజాతికి తీరనిలోటు. చిత్రకారునిగా, చలన చిత్ర దర్శకునిగా, ఆయన చూపిన వైవిధ్యం అనితర సాధ్యం. బాపు బొమ్మ తెలుగింటి ముద్దుగుమ్మ...తెలుగు వాకిట పూచిన కొమ్మ. తెలుగు జాతికి-సంస్కృతికి తన ప్రతిభతో సరికొత్త వన్నెలద్ది భువి నుంచి అమరలోకానికి ఏగిన ఆ మహనీయునితో అన్నమయ్య సంకీర్తనల పుణ్యమాని చక్కటి అనుబంధం ఉంది. ఆ మహనీయుని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ... -వెంకట్ గరికపాటి, తాళ్లపాక పద సాహిత్య విశ్లేషకుడు ప్రపంచ సాహిత్య కళలకు లోటు బాపు మృతి ప్రపంచ సాహిత్య, కళా, సినీ రంగాలకు తీరనిలోటు. నేను రాసిన దాలప్ప తీర్థం అనే పుస్తకానికి బొమ్మ వేయాలని కోరుతూ లేఖ రాస్తే రెండు రోజుల్లోనే ఆ బొమ్మ వేసి పంపించారు. సాహితీకారులను ప్రోత్సహించే మహా మనిషి లేడని నమ్మలేకపోతున్నా. ఆ మహనీయుని కుటుంబానికి ప్రగాడ సంతాపం తెలియజేస్తున్నా. -డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు -
తూగోజీ - పగోజీ
For East is East and West is West and the twain shall never meetఅన్నాడు రుడ్యార్డ్ కిప్లింగ్ దొరగారు ఢంకా బజాయించి. ఈస్టీస్టే ఎస్టెస్టే అన్నాడు కృష్ణ కృష్ణావతారం సినిమాలో.. కాని భిన్నధ్రువాలు ఆకర్షించుకుంటాయి అని సూదంటురాళ్ళ శాస్త్రం ఘోషిస్తోంది. రైలు పట్టాలు కలవ్వు - సమానాంతరంగా వెళ్లాయి కాని అడంగి (గమ్యం) ఒక్కటే. ఆ రెండూ అలా వుంటేనే గమ్యం చేరగలం. అలాగే కాడిఎడ్లు - కలవ్వు కాని కలిసి నడుస్తాయి. అదీ చమత్కారం. రమణది తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం. బాపు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం (కంతేరు). ఆ రెండు పట్టాలూ చెట్టాపట్టాలేసుకుని నడవడం పరుగెత్తడం మొదలై 66 ఏళ్ళయింది. తూర్పుప్పడమరలు కలవ్వని కదూ అనుకుంటున్నారు! దక్షిణ భారతదేశం దక్షిణం చివర కన్యాకుమారి వుంది. అక్కడ పౌర్ణమినాడు అస్తమించే సూర్యబింబం, ఉదయించే చంద్రబింబం ఒకేసారి పక్కపక్కనే కనిపిస్తాయి. ఆలుమగలయినా ఆప్తమిత్రులయినా అన్నదమ్ములయినా చిరకాల బాంధవ్యాన్ని నిలబెట్టి నడిపే సూత్రం - భరించడం. ఒకరి సుగుణాలు నచ్చినప్పుడు ప్రేమించడం సహజం, మామూలే. కాని నచ్చని గుణాలు కనిపించినప్పుడు వాటిని సహించడం, భరించడం అదే ప్రత్యేకత... ఇక్కడ ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి. మనకి నచ్చని గుణాలన్నీ చెడ్డవి అనుకోవడం చాలా పెద్ద తప్పు. అది తెలుసుకుంటే స్నేహదీపం అఖండంగా వెలుగుతుంది. అతనికి ప్రథమ కోపం. తిక్క దూకుడు. ముందర అపార్థం చేసుకుని ఆనక అర్థం చేసుకోవడం. అతను అపార్థసారథి అయితే నేను అప్పార్థసారథిని. అంటే అప్పులతో - ఋణానుబంధాలతో బంధాలను గట్టిపరచుకునేవాడిని. నిజానికి ఎవడి సొమ్ము వాడు ఖర్చుపెట్టుకుని అప్పు చేయకుండా బతికేస్తూ వుంటే జీవితం డల్‌గా, చెరువులో నీరులా కదలకుండా పడివుంటుంది. అదే అప్పులుచేస్తూ, మస్కాలిస్తూ తీరుస్తూవుంటే - తిట్లూ, కొట్లాటలూ సందడితో బతుకు సెలయేరులా పరుగులు పెడుతుంది. జలపాతంలా ఉరుకుతుంది. బాపుకి అప్పులివ్వడం తప్ప అడగడం తెలీదు. నాకు అప్పు చేయడం తప్ప ఇవ్వడం తెలీదు. ఈ మధ్య కొంచెం డబ్బుచేశాక... వద్దులెండి. బాపు రోజుకి 16-18 గంటలు పనిచేస్తాడు. నేను 16-18 గంటలు పడుకుంటాను. అదేమిటి అంటే ఆలోచిస్తున్నాను అంటాను. 1942లో మేము మెడ్రాసు పిఎస్ హైస్కూలులో, అయిదు ఆరు క్లాసులు కలిసి చదువుకున్నాం. హైకోర్టు జడ్జి చేసిన చింతగుంట రాఘవరావు గారి అబ్బాయి - మల్లికార్జున్ (ఇతనూ హైకోర్టు రిజిస్ట్రారు చేశాడు) - పుట్టు జీనియస్ అల్లాడి నరేంద్ర, కర్రావారి అబ్బాయి రమణి, హైకోర్టు జడ్జిగా చేసిన పెనుమెత్స శ్రీరామరాజూలాంటివాళ్ళు క్లాసుమేట్లు. టిన్టిన్ కథలలో కెప్టెన్ హడాక్ వుంటాడు. బ్లిస్టరింగ్ బార్నకిల్స్ అంటూ మొదలుపెట్టి తిట్లదండకం చదువుతుంటాడు. తెలుగు టీచరు దొండపండు రామ్మూర్తి గారు కూడా - అలాగే - ఆనాడే - అలాంటి తిట్లు చదివేవారు. ఇడ్డియట్ - బఫూన్ - స్కౌండ్రల్ - దున్నపోతు - పందికొక్కు - రికామీ గొడ్డు అంటూ గొణుగుతూనే వుండేవాడు. సత్తిరాజువారి సత్రంలాంటి ఇంటిలో ఒక రాజూ రాణీ - అయిదుగురు పిల్లలూ (అందులో ఒక్క ఆడపిల్ల) ఏడుగురు అత్తగార్లు - అయిదుగురు పిల్లలు స్నేహితులు, నాలాంటి ఆస్థాన ఫ్రెండ్సు - వీళ్ళుకాక ఇద్దరు ముగ్గురు కోర్టుపక్షులూ వుండేవాళ్ళు. కలవారి కూతురు, మరో కలవారి కోడలూ అయిన సూర్యకాంతమ్మగారు అంత సంపద వుండి కూడా అందరికీ సేవచేస్తూ చారన్నమే పరమాన్నంగా, గడపే తలగడగా, తిన్నవాళ్ల త్రేనుపులే తన ఊపిరిగా సంసారం నడిపేవారు. బాపు తండ్రి వేణుగోపాలరావుగారు నిజానికి కోపాలరావుగారు. కాని చాలా మంచివారు. ఆయనకి ఆస్తమా బాధ. ఒక డాక్టరు-ఆర్సెనిక్ గోల్డ్ ఇంజక్షన్ ఇవ్వడంతో-అది వికటించి బాధ వ్రతరమయిపోయింది. ఆ బాధ పిల్లలు చూడటం ఇష్టంలేక వారిని కోపంతో తిట్లతో భయపెట్టి దూరంగా వుంచేవారు. అయినా బాపూ నేనూ రాత్రివేళ మేడమీద గదిలో నేలమీద పడుకుని చెవులు నేలకి ఆన్చి, ఆయన మూలుగులు విని బాధపడుతుండేవాళ్లం. క్యాలెండరు దేవుడికి దండాలు పెట్టేవాళ్లం. అంత బాధలోనూ సిగరెట్లు కాల్చి అగరొత్తులు వెలిగించేవాళ్లం.... అదే కోతి కొమ్మచ్చి ...అంటే! (కోతి కొమ్మచ్చి బాపూరమణీయం మొదటి భాగంనుంచి) ఆ మేరుపర్వతం ముందు.. కార్టూనిస్టుగా నా పయనం 1959లో మొదలైంది. ఆ యేడు ఆంధ్రపత్రిక వారపత్రికలో నా తొలి కార్టూన్ అచ్చయింది. అయితే బాపుగారితో నా పరిచయం 1976లో కానీ సాధ్యపడలేదు. అప్పుడు కూడా ఒకవైపు మనసులో భయపడుతూనే ధైర్యం కూడగట్టుకుని ఆయన ముందు నిలబడ్డాను. ఆరోజు పరిచయం అయింది మొదలుకుని క్రమం తప్పకుండా ఆయనను కలిసేవాడిని. కేవలం ఆయన ఔదార్యంతోటే వారి సరసన నిలిచి కొన్ని పనులు చేయగలిగాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో రూపొందించిన వీడియో పాఠాలకు యానిమేషన్ చేసే గొప్ప అవకాశం నాకు బాపుగారే కల్పించారు. తొలిపరిచయం తర్వాత గత నలభై ఏళ్లుగా ఆయనతో స్నేహం, సాన్నిహిత్యం కొనసాగుతూ వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు కార్టూనిస్టులందరూ ఆయనకు ఏకలవ్య శిష్యులే. తెలుగులో ఉన్నంతమంది కార్టూనిస్టులు ఏ తెలుగేతర ప్రాంతంలోనూ లేరంటే అది బాపు గారి చలవే అని చెప్పాలి. ఆయన వంటి ప్రజెంటర్ కూడా లేరు. చిత్రలేఖనం, స్టోరీ ప్రజెంటేషన్, సినిమా కళను ఔపోసన పట్టడం ఒకే వ్యక్తిలో మూర్తీభవించిన రూపమే బాపు. రెండు లేక మూడు మాసాల క్రితం హైదరాబాద్‌లో నందగోపాల్ గారి పుస్తకావిష్కణ సందర్భంగా బాపుగారిని చెన్నైలో కలిసి విషయం చెప్పాను. తిరిగి వస్తుండగా ఎందుకోగానీ నన్ను గట్టిగా కౌగలించుకుని ఉండిపోయారు. అప్పటికే ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. ముళ్లపూడి వెంకటరమణ గారు తనువు చాలించడం, కొన్ని నెలల క్రితం ఆయన సతీమణి కన్నుమూయడం. ఈ రెండు దెబ్బలతో ఆయన తట్టుకోలేకపోయారు. గుండెభారం తగ్గించుకోవడానికి ఆయనతో నా జ్ఞాపకాలను పంచుకుంటున్నాను కాని మాలాంటి చిత్రకారులకు ఆయన లేరన్న విషయం జీర్ణం చేసుకోవడం కష్టమే. చివరగా ఒక్కమాట.. ఆ మహా మేరు పర్వతం ముందు మేము ఇసుక రేణువుల వంటివాళ్లం. - జయదేవ్ (ప్రముఖ కార్టూనిస్టు) -
‘పశ్చిమ’లో ప్రభవించారు
ఏది తూరుపు.. ఏది వెలుతురు.. ఎవరు బాపు.. పొద్దు పొడవగానే తూరుపు తెలుస్తుంది.. చీకటి పడగానే వెలుతురు తెలుస్తుంది.. మరి బొమ్మ చూడగానే.. తెలుగుతనం పరవళ్లు తొక్కగానే.. గీతలు అందాలు దిద్దుకోగానే.. మాటలు బిడియం ఒలికించగానే.. రాతలు వినయం తొణికించగానే.. బుడుగు అల్లరి స్ఫురించగానే.. రాముని దయ స్మరణకు రాగానే.. బాపు తెలుస్తారు. ఆయన గీత, రాత తెలుగు సంస్కృతిలో భాగమైపోయాయి. బాపు బొమ్మ అందానికే నిలువెత్తు నిర్వచనంలా నిలిచింది. పశ్చిమ మెడలో పచ్చల హారంలా బాపు నిలిచిపోయారు. జిల్లాలోని నరసాపురంలో సత్తిరాజు వెంకట వేణుగోపాలరావు, సూర్యకాంతం దంపతులకు 1933 డిసెంబర్ 15న బాపు జన్మించారు. తండ్రి వెంకట వేణుగోపాలరావు మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. తల్లి సూర్యకాంతమ్మ సోదరుడు నిడుమోలు వెంకటశివరావు నివాస ప్రాంతమైన నరసాపురంలో బాపు జన్మించారు. తర్వాత మద్రాస్ వెళ్లిన బాపు తల్లిదండ్రులు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అక్కడ బాంబింగ్ జరిగే ప్రమాదం ఉందని తెలుసుకుని 1937లో బాపును నరసాపురంలోని ఆయనను నరసాపురంలోని మేనమామ ఇంటికి పంపిం చారు. టేలర్ హైస్కూలో మూడేళ్లపాటు విద్యాభ్యాసం చేసిన బాపు తిరిగి మద్రాస్ వెళ్లారు. అక్కడే న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. మద్రాస్ హైకోర్టులో రెండేళ్లపాటు న్యాయవాదిగా పనిచేశారు. ఆ తర్వాత ప్రముఖ సాహితీవేత్త ముళ్లపూడి రమణ పరిచయంతో సినీ రంగంలో అడుగుపెట్టారు. అసలు పేరు వెంకట లక్ష్మీనారాయణ బాపు అసలు పేరు వెంకట లక్ష్మీనారాయణ. జిల్లా నుంచి కుంచె, కలం పట్టుకుని జీవన ప్రస్థానాన్ని ప్రారంభించారు. చిత్రకారుడిగా, కార్టూనిస్టుగా, దర్శకుడిగా తన ప్రతిభను అంతర్జాతీయ వేదికలపై చాటి పశ్చిమ సిగలో పచ్చల హారమై మెరిశారు. తొలినాళ్లలో ఆంధ్రపత్రికలో వ్యంగ్య చిత్రకారునిగా పనిచేసిన బాపు అంచెలంచెలుగా ఎదిగారు. బహుముఖ ప్రజ్ఞాశాలి బాపు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన బొమ్మలే కాదు చేతి అక్షరాలు సైతం హొయలు ఒలకబోస్తాయి. బొమ్మలు గీయడంతోపాటు తెలుగు అక్షరాలను రాయడంలోనూ సరికొత్త శైలిని సృష్టించారు. ఇందుకు నిదర్శనమే బాపు ఫాంట్. దాదాపు అన్ని తెలుగు పత్రికలు బాపు చిత్రాలను ప్రచురించాయి. ‘సాక్షి’తో సినీ ప్రస్థానం 1967లో ‘సాక్షి’ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా బాపు అడుగుపెట్టారు. ముత్యాలముగ్గు, సీతాకల్యాణం, వంశవృక్షం, సుందరాకాండ, రాంబంటు, పెళ్లికొడుకు, పెళ్లిపుస్తకం, మిస్టర్ పెళ్లాం, శ్రీరామరాజ్యం చిత్రాలు ఆయనకు ఎనలేని పేరు తెచ్చిపెట్టాయి. చిరంజీవి నటించిన మనవూరి పాండవులు, మంత్రిగారి వియ్యంకుడు సినిమాలకు బాపు దర్శకత్వం వహించారు. కృష్ణంరాజు నటించిన భక్తకన్నప్ప సినిమా దర్శకుడు కూడా బాపూనే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అవార్డులు.. మరెన్నో రివార్డులు బాపును వరించిన అవార్డులు, రివార్డులకు లెక్కలేదు. భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో బాపును సత్కరించింది. రెండు నేషనల్ ఫిల్మ్, ఐదు నంది, రెండు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ దర్శకుడి పురస్కారాలను బాపు అందుకున్నారు. 2012లో జీవన సాఫల్య పురస్కారం పొందారు. మెప్పించే గీత .. నొప్పించని హేళన అందరినీ మెప్పించే గీత.. ఎవరిని నొప్పించని హేళన మేళవింపు బాపు. విశేష ప్రతిభాపాటవాలతో జిల్లాకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టిన బాపు లేరంటే నమ్మడం కొంచెం కష్టమే. ప్రముఖుల నివాళి బాపు మృతికి జిల్లాలోని పలువురు నివాళుల ర్పించారు. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఆళ్ల నాని, టీడీపీ జిల్లా అధ్య క్షురాలు తోట సీతారామలక్ష్మి, డీసీసీ అధ్యక్షుడు ముత్యాల వెంకటేశ్వరరావు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, నగర మేయర్ షేక్ నూర్జహాన్, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, కళాకారులు గరికపాటి కాళిదాసు, గొర్తి మురళీకృష్ణ, నంది అవార్డు గ్రహీత ఖాజావలి, వైఎంహెచ్ఏ అధ్యక్షుడు వేణుగోపాల్ లునాని, రామకృష్ణ ఆర్ట్స్ ప్రతినిధి పెదపాటి రామకృష్ణ తదితరులు బాపు మృతికి సంతాపం వ్యక్తం చేశారు. నరసాపురంతో విడదీయరాని బంధం నరసాపురం (రాయపేట): తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కొంటె బొమ్మల బాపునకు నరసాపురంతో ఎనలేని అనుబంధం ఉంది. నరసాపురంలో తల్లి సూర్యకాంతమ్మ సోదరుడు నిడుమోలు వెంకటశివరావు ఇంట జన్మించిన బాపు బాల్యం ఇక్కడే గడిచింది. గోదావరి అందాలు, కోనసీమ సోయగాలను తనదైన శైలిలో తెరకెక్కించిన బాపు బాల్యంలో అక్షరాలు దిద్దింది నరసాపురం టేలర్ హైస్కూల్లో. మూ డేళ్లపాటు ఆయన ఇక్కడ చదువుకున్నారు. అనంతరం మద్రాస్ వెళ్లిన ఆయన న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. పుట్టుకతోనే చిత్రకళ అబ్బింది బాపు ఇకలేరనే విషయం తట్టుకోలేకపోతున్నా. ఆయనతో గడిపిన జ్ఞాపకాలను మరువలేకపోతున్నా. బాపు నాకు వరుసకు బావ అవుతారు. మా ఇంట్లోనే పుట్టారు. బాపుకు చిత్రలేఖనం పుట్టుకతోనే అబ్బింది. బాల్యంలోనే బొమ్మలు గీయడంపై ఆసక్తిని కనబర్చారు. చిన్నతనంలో అద్భుతమైన చిత్రాలు గీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. జాతీయ నాయకులు, కుటుంబ సభ్యుల చిత్రాలు లిఖించి అందరికీ బహుమతిగా ఇచ్చేవారు. నా కుమార్తె వివాహ పత్రికపై బాపు గీసిన చిత్రాలు ఎప్పటికీ మా మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో షూటింగ్‌లు చేసిన సందర్భాల్లో బాపు ఇక్కడికి వచ్చి మాతో గడిపేవారు. - నిడుమోలు రామచంద్రరావు, న్యాయవాది, బాపు బంధువు, నరసాపురం ఆయన్ను సన్మానించుకోవడం మా అదృష్టం ఏలూరు : సినీ దర్శకుడు బాపును సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని ఏలూరు గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్‌గుప్త అన్నారు. బాపు మృతి కళారంగానికి తీరని లోటని చెప్పారు. కళారంగంలో విశేష సేవలందించిన బాపు, రమణను తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1999లో ఏలూరు సీఆర్ఆర్ కళాశాలలో సన్మానించామని గుర్తు చేసుకున్నారు. ఇద్దరినీ ఒకే వేదికపై సత్కరించిన సంఘటన తమ కళ్ల ముందు ఇప్పటికీ కదలాడుతోందన్నారు. కళామతల్లికి వారి సేవలు అనిర్వచనీయమని కొనియాడారు. కళారంగానికి తీరని లోటు ఏలూరు సిటీ : ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్, దర్శకుడు, పద్మశ్రీ బాపు అస్తమయం సినీ, సాహిత్య, కళారంగాలకు తీరనిలోటు అని ఏపీ లైబ్రరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ అల్లూరి వెంకట నరసింహరాజు, ఎల్.వెంకటేశ్వరరావు సంతాపాన్ని తెలిపారు. ఆరు నంది, రెండు ఫిలింఫేర్, రఘుపతి వెంకయ్య అవార్డులు అందుకున్న మహానీయుడు బాపు అని నివాళులర్పించారు. బాపూ రమణీయం బాపు ప్రస్తావన వస్తే ముళ్లపూడి వెంకటరమణను తెలుగు ప్రజలు కచ్చితంగా తలచుకుంటారు. బాపు తన ప్రాణానికి ప్రాణం ముళ్లపూడి వెంకటరమణ అని చెప్పేవారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన వెంకటరమణ 2011లో మరణించగా, తన ప్రాణం అప్పుడే పోరుుందని బాపు వ్యాఖ్యానించారు. అంతటి స్నేహం వారిద్దరిదీ. తెలుగు నవలలు, కథలు, సినిమా కథలు, హాస్య కథలతోపాటు వెంకటరమణ రాసిన ‘బుడుగు’ పుస్తకం బాపు వేసిన బొమ్మలతో సంపూర్ణత సాధించింది. అందుకే వీరిద్దరి జంటను బాపురమణలుగా పేర్కొంటారు. వీరిద్దరి పేరిట వెలువరించిన ‘బాపూరమణీయం’ పుస్తకం తెలుగు పాఠకుల మదిని దోచిందంటే అతిశయోక్తి లేదు. ఆరుద్ర ఏమన్నారంటే... ‘కొంటె బొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండెల్ని ఊయలలూపు ఓ కూనలమ్మా’ అంటూ ఆరుద్ర ఏనాడో పద్యాభిషేకం చేశారు. బాపు బొమ్మలు కదిలేవి ‘బాపు వంటి బొమ్మ బ్రహమదేవుడు కూడ ప్రాణమిచ్చి భువికి పంపగలడె వాని గీతలోని వైభవ జ్యోతికి ఇంకిపోదు తైలమెన్నడేని’ అంటూ బాపు ఔన్నత్యాన్ని తణుకు పట్టణానికి చెందిన సినీ గేయ రచయిత రసరాజు పద్యం కట్టారు. బాపు ఏ బొమ్మ గీసినా కదులుతూ ఉండేవని.. చిత్రాలలో కళకు ప్రాణమిచ్చేవారని.. సహజత్వానికి దగ్గరకు బొమ్మలు గీయడం ఆయన ప్రత్యేకత అని పేర్కొన్నారు. బాపు పూర్వీకులు ఇరగవరం మండలం కంతేరు గ్రామంలో ఉండేవారని చెప్పారు. తాను రాసిన పలు రచనలు, సీరియల్స్‌కు బాపు బొమ్మలు గీశారన్నారు. బాపు మృతి కళారంగానికి తీరని లోటని సంతాపం తెలిపారు. ‘ఆమ్యామ్యా’ ఆయన సృష్టే ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : బాపు మరణం కళారంగానికి తీరని లోటని.. ఆయన శైలి విశ్వవ్యాప్తమైందని సినీ నృత్య దర్శకుడు కేవీ సత్యనారాయణ సంతాపం తెలి పారు. లంచానికి పర్యాయ పదంగా బాపు సృష్టించిన ‘ఆమ్యామ్యా’ ఇప్పటికీ తెలుగు నోళ్లలో నానుతుండటం ఆయన చతురతకు నిదర్శనమన్నారు. హిందూ యువజన సంఘం బాపు మృతికి సంతాపం తెలిపింది. ఆదివారం నిర్వహించిన సమావేశంలో సంఘ ప్రతిని ధులు వేణుగోపాల్ లునాని, మోదుగు కృష్ణారావు, శలా వెంకట సత్యనారాయణ, కేబీవీ రమేష్, సీహెచ్ నరసింహరావు తదితరులు సంతాపం తెలిపారు. -
గురుతు చెరగని మనిషి
రేఖ పుట్టిన దగ్గరినుంచీ అనాది మానవ జీవన కాలం నుంచి ఎంతమంది చిత్రకారులు.. ఎన్ని లక్షలు, కోట్ల గీతలు వేసి ఉంటారు. కానీ బాపూ గీత కొట్టొచ్చినట్లుంది. బాపూ బొమ్మ అప్పుడే పుట్టినట్లుంటుంది. తెలుగు జీవంతో ముద్దుగా, ఒద్దికగా ఉంటుంది. ప్రత్యేక శైలికి చెందిన చిత్రకారుడిగా ఆయన స్థానం ఎప్పటికీ చెరగనిదీ, చలించనిదీ. ఆయన చిత్రకళలాగే ఆయన చలన చిత్ర కళా అద్భుతమైంది. బాపు...తన కలలను కాన్వాస్తోనే పంచుకున్నవాడు. రంగుల జలపాతాలను ఉరికించినవాడు. వేల ఇంద్రధనుస్సులను నేల మీద పరిచినవాడే కాదు, వెండితెర మీద రంగులతో మాట్లాడించినవాడు. వందల పేజీల భావాన్ని ముఖపత్రం మీది సప్తవర్ణ మౌనంతో ఆవిష్కరించినవాడు. కొంటె బొమ్మల బాపు.. నిజానికి కోటి బొమ్మల వేలుపు. ‘నా బొమ్మ తగిలించడానికి గోడ లేకుండా పోయింద’ని తన ఆత్మీయుడు ముళ్లపూడి గురించి బాధపడిన బాపు, ఎన్నెన్నో బొమ్మలను మూసిన కళ్లలోనే వదిలేసి వాటికి కాన్వాసే లేకుండా చేశాడు. బుడుగు, సీగానపెసూనాంబ, అప్పారావు వంటి సాదాసీదా మనుషుల బొమ్మలు మొదలు ఆజానుబాహులైన పురాణ పురుషులూ, ఆకర్ణాంత నయనాలతో అచ్చెరువొందించే పురాణ స్త్రీల బొమ్మలూ, సమకాలీనుల క్యారికేచర్లు... ఎన్ని వందలు ఆయన కుంచె నుంచి జనం మధ్యకు వచ్చాయి! బాపు తెలుగు వర్ణమాలను సప్తవర్ణ శోభితం చేయాలని స్వప్నించాడు. అక్షరానికి కొత్త రూపు ఇచ్చాడు. రాత మీద మమకారం పెంచాడు. తెలుగు నుడికారాన్ని రేఖలుగా మలిచాడు. తెలుగునేల సౌందర్యానికి కొత్త రంగులద్దాడు. ఆరుద్ర చెప్పినట్టు ‘కొంటెబొమ్మల బాపు/ కొన్నితరముల సేపు/ గుండెలూయలూపు/ ఓ కూనలమ్మా!’ బాపు లేని తెలుగునేల, రంగు వెలిసిన కల. ‘సాక్షి’తో ప్రయాణం ప్రారంభించిన బాపు గారికి ‘తెలుగువారి మనస్సాక్షి’ నివాళి జంటతారలలో మరో తార కూడా వెళ్లిపోయింది. తాత్కాలిక వియోగం తర్వాత తిరిగి బాపు-రమణ కలిసిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఎందరికో బాపుగారు తెలుసు. తెలుగు వారికి మరీనూ. కళాకారులకీ, రచయితలకీ, సినిమావారికీ మరీమరీ తెలుసు. తెలుగు సినీ గమనంలో బాపు ఓ ప్రత్యేక ప్రవాహం. మొదటి సినిమాతోటే తన ముద్రను ప్రత్యేకంగా చాటి సాక్ష్యంగా నిలబెట్టిన ఘనత బాపూది. ఆయన సినిమాల్లో ఏ దృశ్యం గుర్తు తెచ్చుకున్నా ఆయన గుర్తొస్తారు. ఆయన గుర్తొస్తే చాలు.. ఆయన అద్భుతంగా మన ముందు నిలిపిన దృశ్యాలు గుర్తొస్తాయి. ‘సాక్షి’ సినిమాలో ఒక సామాన్యుడికి రౌడీ అంటే ఉండే భయం, నిస్సహాయత కళ్లముందు కదిలితే ‘బుద్ధిమంతుడు’లో ఎ.ఎన్.ఆర్ భగవంతుడితో జరిపిన సంభాషణా చాతుర్యం మనని ఎప్పటికీ వదలదు. ‘గంగావతరణం’, ‘సంపూర్ణ రామాయణం’లో రావణుడు, ‘శ్రీరామరాజ్యం’లో సీతమ్మ తల్లి భూమాత ఒడి చేరిన తీరు ఒకటేమిటి, అనేకానేక దృశ్యాలు దేనికదే ప్రత్యేకం. బాపు దేన్నయినా అందంగానే తీస్తారు అన్నది చాలామంది అభిప్రాయం. దేనిలోనయినా అందాన్ని, సౌందర్యమూలాన్ని పట్టుకోవటం ఆయనకే చెల్లిన ప్రత్యేక బాణీ. దృశ్యం, మాట, పాట, సంగీతం, చీకటి వెలుగులు, అందాల రంగుల కలయిక, అద్భుత ఊహాలోకం, నిఖార్సయిన జీవితం.. వీటన్నిటి కలగలుపు మంచి చిత్రమైతే, అవన్నీ బాపూ గారి సినిమాలు. పాఠ్య పుస్తకాల్లాంటి సినిమాలు తీసినా, ప్రేక్షకులు పరవశించి పదే పదే చూసిన సినిమాలు తీసినా ఆయనకే చెల్లింది. చలన చిత్రాల్లో నలుపు తెలుపు నుంచి రంగుల చలన చిత్రాల వరకు సాగింది ఆయన ప్రస్థానం. చిత్రకారుడిగానే కాదు, చిత్రదర్శకుడిగా కూడా నిరంతర అధ్యయన శీలి. అయినా ఒక్కమాటగానైనా తనకి చలనచిత్రాల గురించి ఇంత తెలుసు, అంత తెలుసు అని ఏనాడూ అనని సౌమనస్యజీవి. ఒక్కసారైనా ఆయన తమ కథకు బొమ్మేస్తే చాలు అని కోరుకున్న రచయితలు ఎందరో. కథా హృదయం పట్టుకుని అది ప్రతిబింబించేలా ఇలస్ట్రేషన్ చెయ్యటం ఆయనకే చెల్లింది. కథ బావుండక పోవచ్చునేమో కానీ, బాపూ వేసిన బొమ్మ బావుండని సందర్భాలు లేవనే చెప్పాలి. రేఖ పుట్టిన దగ్గరినుంచీ అనాది మానవ జీవన కాలం నుంచి ఎంతమంది చిత్రకారులు.. ఎన్ని లక్షలు, కోట్ల గీతలు వేసి ఉంటారు. కానీ బాపూ గీత కొట్టొచ్చినట్లుంది. బాపూ బొమ్మ అప్పుడే పుట్టినట్లుంటుంది. తెలుగు జీవంతో ముద్దుగా, ఒద్దికగా ఉంటుంది. ప్రత్యేక శైలికి చెందిన చిత్రకారుడిగా ఆయన స్థానం ఎప్పటికీ చెరగనిదీ, చలించనిదీ. ఆయన చిత్రకళలాగే ఆయన చలన చిత్ర కళా అద్భుతమైంది. స్నేహంతో, స్నేహం కోసం చిత్రరంగ ప్రవేశం చేసిన ఆయన తీరే విలక్షణం. వారు ఎన్నుకున్న కథా వస్తువులు, చిత్రీకరణ తీరులో వారి ముద్ర సుస్పష్టం. వేల కొద్దీ ఉన్న తెలుగు సినిమాలలో బాపూ సినిమా ప్రత్యేకంగా కనిపిస్తుంది. మొదటి ఫ్రేమ్ నుంచి ముగింపు వరకు ఎక్కడా మర్యాదని దాటకపోవటం బాపూ సినిమా ప్రత్యేకత. రామభక్తి అయినా, రావణనీతి అయినా, అభినవ రామాయణం ‘ముత్యాల ముగ్గు’ అయినా, ఆ నడక, నడత వారిదే. ప్రతి సినిమా ఓ పుస్తకం. ఓ అధ్యయన గ్రంథం. ఎన్నో రంగాలకి చెందిన, దేశ విదేశీ స్నేహ సంపద అపారం బాపుగారికి. ఆయనకి రచన నచ్చితే ఎంత బలవంతం చేసినా ఆయన వేసిన బొమ్మలకి పారితోషికం తీసుకోకపోవటం మిత్రులకి తెలుసు. బాపూ గారి బొమ్మల్ని చూసి మురిసిన వారిలో మూడు నాలుగు తరాల వారు ఉన్నారు. బొమ్మలూ, సినిమాలనే కాదు. బాపు గారు తెలుగు కథల్ని కూడా బాగా ఎరిగిన వ్యక్తి. బాపూ మన్నన పొందితే అది అంతర్జాతీయ స్థాయి కథ అని ధీమాగా చెప్పొచ్చు. దానికి తార్కాణంగా ఆయన సంకలనం చేసిన ‘కథ’ సంకలనాన్నే చెప్పొచ్చు. 1960 నవంబర్‌లో ‘కథ’ అన్న పదకొండు కథల సంపుటిని ఆంధ్రప్రదేశ్ బుక్ డిస్ట్రిబ్యూటర్స్ వారు తమ ఇంటింటా స్వంత గ్రంథాలయం ప్రణాళికలో భాగంగా ప్రచురించారు. ఈ పదకొండు కథలకి బొమ్మలు వేయటమే కాక ఆ కథల్ని ఎంపిక చేసి సంకలనం చేసింది బాపు. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఇది ఒక విశిష్ట కథా సంకలనం. కళ్యాణ సుందరీ జగన్నాథ్ ‘మాడంత మబ్బు’, రాచకొండ విశ్వనాథశాస్త్రి ‘వర్షం’, కొడవటి గంటి కుటుంబరావు ‘ఫాలౌట్’, సి. రామచంద్రరావు ‘నల్లతోలు’, అరిగే రామారావు ‘నచ్చినోడు’, రావి కొండలరావు ‘మాయమైన మనీపర్సు’, రుద్రాభట్ల నరసింగరావు ‘వరలక్ష్మికి వరుడు’, పూసపాటి కృష్ణం రాజు ‘సీతాలు జడుపడ్డది’, భమిడిపాటి జగన్నాథరావు ‘లౌక్యుడు’, శివరాజు సుబ్బులక్ష్మి ‘మనోవ్యాధికి మందుంది’, మల్లాది రామకృష్ణ శాస్త్రి ‘కొమరయ్య కోన’ ఈ పదకొండు కథలు ఈ సంకలనంలో ఉన్నాయి. వీటిని చదివితే వ్యక్తుల మనస్తత్వం, వివిధ సందర్భాల ప్రభావం, సంస్కృతీ బలం, ఆధునిక మార్పులు, మనుషుల్లో హెచ్చుతగ్గులు, ఆశ నిరాశల శక్తి వెరసి మొత్తం తెలుగు జీవితం అంతా కళ్లముందు పరుచుకుంటుంది. ఒక కథ పోలిక మరో కథలో ఎంతమాత్రం లేకపోవటం ఈ సంకలనం ప్రత్యేకత. రచయితలు ఎంత ప్రతిభతో ఈ కథలను రాశారో, అంతటి ప్రతిభతో వీటిని సంకలనం చేశారు బాపూ. నచ్చిన రచనని పనిగట్టుకుని ఓ ఉద్యమంలా ప్రచారం చెయ్యటంలోనూ, అద్భుతమైన సంగీత, సాహిత్య, సినిమా సంపదని ప్రోది చెయ్యటంలోనూ ఆయన ప్రత్యేకత ఆయనదే. మహా గాయకుడు బాలమురళీ కృష్ణ గారిచేత తన అన్ని సినిమాల్లోనూ పాడించారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో! ఆయనకు నా పైన అమితమైన వాత్సల్యం ఉండేది. ఆయన నన్ను ఫ్రెండ్ అనేవారు. చిన్నవాడిననీ, చితకవాడిననీ చూసింది ఎప్పుడూ లేదు. నాకు ఫలాని ఆర్టిస్టు బొమ్మలంటే ఇష్టం అని తెలుసుకుని వారి బొమ్మల పుస్తకాలు ఎక్కడున్నా తెప్పించి ప్రజెంట్ చేసేవారు. ఒకసారి సెర్గియొ టొప్పి అనే చిత్రకారుడి పుస్తకాలు కొనడానికి డబ్బులు లేవని దిగాలు మొహం పెట్టుకుని ఆయన ముందు నిలబడితే, నా మొహంలో నవ్వు తెప్పించడానికి ఇరవై వేల రూపాయల చెక్కు నా పేర రాసి నా మొహాన నవ్వు రప్పించారు. నేను మంచి ఉద్యోగంలో పెద్ద పొజిషన్లో ఉండాలని ఎప్పుడూ కోరుకునేవారు. ఓసారి బెంగళూరులో ఒక పెద్ద సంస్థలో నాకు ఉద్యోగం వచ్చినప్పుడు ఆ సాయంకాలం నాకు ఫోన్ చేసి ‘ఏవండీ! నేనూ రమణగారూ మీ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్నామ’ని ఆనందపరిచారు. క్రమక్రమంగా ఆయన్ని కలిసిన ప్రతిసారీ హెచ్చరించేవారు. ‘మీరు మీ టాలెంట్‌ని వృధా చేసుకుంటున్నారు. నా మాట విని ఈ ఇలస్ట్రేషన్ వదిలేయండి. టెక్నాలజీ వైపు మళ్లండి..’ ఆయనకు ఏం చెప్పాలో నాకు తోచేది కాదు. గత సంవత్సరం డిసెంబర్ 15న ఆయన పుట్టిన రోజు. హెల్త్ చెకప్‌కు హైద్రాబాద్ వచ్చారు. ఆస్పత్రిలో ఆయన్ని కలవడం అంతగా ఇష్టపడేవారు కాదు. ఆయన హైద్రాబాద్‌కు వచ్చినా నేను కలవకపోతే మొహం మాడ్చుకునేవాడిని. చెకప్ అయిపోయాక వెళ్లేదారిలో సాక్షి ఆఫీసు ముందు ఆగి, కిందికి రమ్మన్నారు. రోడ్‌పై ది గ్రేట్ బాపుగారు ప్రేమగా తన చేతుల్లోకి నా చేతుల్ని తీసుకున్నారు. ఆయన చేతుల మధ్యనుంచి ఒక కవర్ నా చేతులపైకి వచ్చింది. ‘పెద్దవాణ్ణి ఇస్తున్నా.. కాదు అనరాదు..’ అంటూ చిరునవ్వుతో నా తల నిమిరి కారెక్కి కూచున్నారు. ఈ సంవత్సరం జనవరి ఒకటో తేదీన మధ్యాన్నం ఫోన్ చేశారు. ‘నాకో సహాయం చేయాలండీ’ అన్నారు. ‘ఏంటి సార్’ అనడిగాను. ‘మీకు ప్రపంచంలోని ఇంతమంది చిత్రకారుల బొమ్మలు వారి రీతులు తెలుసు కదా. విజయవాడ గంధం ప్రసాద్ గారు నా బొమ్మలన్నీ కలిపి ఒక బుక్ తెస్తున్నారు. దానికి మీరు ముందుమాట వ్రాయాలని నా కోరిక’ అన్నారు. నేను తెలీక ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో.. దాని ఫలం పేరు బాపు. - అన్వర్ చిన్నబోయిన ముఖచిత్రం కుంచె కన్నీటి కెరటమైంది. తెలుగు అక్షరం చిన్నబోయింది. ముఖ చిత్రం మూగబోయింది. వర్ణాలన్నీ వివర్ణమయ్యాయి. ఆయన బొమ్మలన్నీ కొలువు దీరి నాన్న దూరమయ్యాడని వెక్కివెక్కి రోదించాయి. తెలుగింట్లో బుడుగులు, బాపు బొమ్మలాంటి అమ్మాయిలు శోకతప్తులయ్యారు. బాపు ఇక లేరన్న వార్త ఆయన అభిమానులందర్నీ కలచి వేసింది. కవిత్వాన్ని మహాకవి శ్రీశ్రీ ఏరీతిగా భూమార్గం పట్టించారో..చిత్రకళను బాపు ప్రజల్లోకి తీసుకువచ్చారు. ఇదేమంత ఆషామాషీ వ్యవహారం కాదు. గతంలో రవివర్మ ఆ పని మొదలుపెడితే బాపు దానిని కొనసాగించారన్నమాట కూడా ఉంది. గీత రహస్యాన్ని అతను కాచివడబోశాడు. ‘బాపు చిత్రాలు చూచి ఆనందించడం మన కళాభిజ్ఞతకు వన్నె..’ అని మల్లాది రామకృష్ణశాస్త్రి గారన్నమాటలు అక్షర సత్యం. చిత్రకళను ప్రజల్లోకి తీసుకురావటం అంత ఆషామాషీ కాదు. ఇతర చిత్రకారులు అసూయపడే విధంగా ఆయన గీత ఉంటుందన్నది నండూరి రామమోహనరావు వ్యాఖ్య. తన గాలిబ్ గీతాలకు బాపు వేసిన బొమ్మలను చూసి దాశరథి మురిసిపోయారు. ‘దూది చూడడానికి సాదాగా ఉంటుంది. కానీ అది ఎందరి మానాలను కాపాడుతుందనీ..బాపు బొమ్మలు అంతే నిరాడంబరంగా ఉంటాయి. కానీ గుండె పొరల వెనకాల ఉన్న స్వాభిమానాలకు హాయిగా చురకలు పెడతాయి.. బాపులో ఒక దర్శకుడు ఉన్నాడు.. దార్శనికుడు ఉన్నాడు’ అంటారు సినారె. ‘బాపు ప్రతిభ తెలుగు తల్లి ప్రాంగణంలో పెట్టిన మంచి ముత్యాల ముగ్గు ..ఇంది ఎంచిన సత్యాల నిగ్గు..’అన్నారు ఆరుద్ర. అది 1943వ సంవత్సరం...అది న్యాయపతి రాఘవరావు (రేడియో అన్నయ్య)గారి ‘బాల’ పత్రికా కార్యాలయం. పదేళ్ల బాలుడు ఆయన ఎదురుగా నిల్చుని నేను బొమ్మలు గీస్తాను. మీ పత్రికలో వేస్తారా అని ధైర్యంగా అడిగేశాడు. వెంటనే అతని ఉత్సాహాన్ని గమనించి రంగులు, కుంచెలు ఇచ్చి బొమ్మలు గీయమన్నారు. చకచకా అతను వేసిన చిత్రాలన్నింటినీ చూసి ఆశ్చర్యపడి తన పత్రికలో వేయించారు. ఆ బాలుడి గీతాభ్యాసం అలా మొదలై ఏడు దశాబ్దాలపాటు తెలుగు భాష గీతనే మార్చేసింది. సత్తిరాజు లక్ష్మీనారాయణ అనే ఆ బుడతడు అనంతర కాలం బాపుగా అవతరించి అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. తొలినాళ్లలో బాపు చిత్రకళాభ్యాసానికి గురువులైన గోపులుగారు, చామకూరగారు మెరుగులు దిద్దారు. అప్పటి నుంచి బాపు బొమ్మలు, కార్టూన్లు, కామిక్స్, కవర్ డిజైన్లు దర్శనమివ్వటం ప్రారంభించాయి. 1954లో ఫ్రీ హేండ్ అవుట్‌లైన్ అండ్ మోడల్ డ్రాయింగ్‌లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత. 1955లో ఆంధ్రపత్రికలో రాజకీయ కార్టూనిస్టుగా రంగప్రవేశం. 1978లో లండన్‌లో ‘వన్‌మేన్ షో’ప్రదర్శన. ప్రతి గీత ప్రాణం పలుకుతుంది. ఆయన రాసిన ప్రత్యక్షరం నవలాస్యం చేస్తుంది. 1955-65 మధ్యకాలంలో ఆర్టిస్టుగా, ఆర్ట్ డైరక్టర్‌గా ఉద్యోగం. ఆయన మృతితో ఒక తెలుగు జాతి వెలుగు రేఖ చీకటైపోయింది. బాపు టైటిల్‌తోనే ఏదైనా పుస్తకానికి సార్థకత. ఈ ఏడాదిలోనే మా నాన్నగారు మధునాపంతులవారి పుస్తకానికి ఆయన వేసిన ముఖచిత్రమే ఇటీవల కాలంలో ఆయన వేసిన టైటిల్ అయి ఉంటుందని భావిస్తున్నాను. నా అభ్యర్థన మేరకు పదికి పైగా పుస్తకాలకు అద్భుతమైన ముఖచిత్రాలను సహృదయంతో వేసి ఇచ్చిన ఆయన రుణం తీరేదెలా..! - మధునాముర్తి మిత్రుడు కె. వివేకానందమూర్తితో కలిసివెళ్లి ఆయన ఇంట్లో నేను ఆత్మీయంగా గడిపిన కాలం మరపురాదు. అలాగే శ్రీరామరాజ్యం చిత్రాన్ని గోవా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఆయన పక్కనే కూర్చుని చూసిన సమయం కూడా.. చక్కటి చిరునవ్వు, మెత్తటి పాట, నిష్కర్షగా నిజ వ్యక్తీకరణ, ఇంక మళ్లీ అలా ఆయన్ను చూడలేం అన్న బాధ, ఆయన కళ్లబడరన్న దిగులు. నాకే కాదు.. నన్ను మించి ఎందరెందరికో.. ఓ గొప్ప, అపురూప వ్యక్తి కాలంలో కలిసిపోయారు. కానీ ఆయన గురుతు, గీత, మాట, చేత, దృశ్యం, తెలుగుతనం, చిలిపితనం, మొహమాటం ఎప్పటికీ అలాగే ఉంటాయి. ప్రత్యక్షంగా ఎరిగిన వారికి ఆయన మరపురారు. అలా ఎరగనివారికి ఆయన బొమ్మలు, చలనచిత్రాలు, రాతలు మరపురావు. - వి.రాజారామమోహనరావు (వ్యాసకర్త నవలా రచయిత, సినీ విమర్శకులు ) -
దర్శకుడు బాపు కన్నుమూత
-
రేపు బాపు అంత్యక్రియలు
చెన్నై: ప్రఖ్యాత చిత్రకారుడు, సాహితీవేత్త, కార్టూనిస్ట్, సినిమా దర్శకుడు బాపు అంత్యక్రియలు రేపు జరుగుతాయని ఆయన సోదరుడు సత్తిరాజు శంకర నారాయణ చెప్పారు. కొన్ని రోజులుగా బాపు తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నట్లు తెలిపారు. తీవ్ర గుండెపోటుతో ఆయన మరణించినట్లు శంకర నారాయణ తెలిపారు. బాపు చెన్నైలోని మల్లాయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం మృతి చెందిన విషయం తెలిసిందే. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన బాపు 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 12 హిందీ చిత్రాలకు కూడా ఆయన దర్శకత్వం వహించారు. -
తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి బాపు:వైఎస్ జగన్
హైదరాబాద్: చిత్రకళ, సాహిత్యం, సినిమా వంటి రంగాలలో తెలుగు జాతి గర్వించదగిన వ్యక్తి బాపు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి అన్నారు. బాపు మృతికి ఆయన సంతాపం వ్యక్తం చేశారు. బాపు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. బాపు బొమ్మ ఎంతో ప్రాముఖ్యత కలిగినదని అన్నారు. భారత దేశం ఓ మహానుభావుడిని, మహా మనిషిని కోల్పోయిందని జగన్ అన్నారు. -
ప్రముఖ దర్శకుడు బాపు కన్నుమూత..!
-
బాపు మృతిపై ప్రముఖుల దిగ్బ్రాంతి
-
ఒక శకం ముగిసింది
-
ప్రముఖ దర్శకుడు బాపు కన్నుమూత!
ప్రముఖ సినీ దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి బాపు ఆదివారం చెన్నైలో కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని మల్లార్ ఆస్పత్రిలో మరణించినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. ఐదు నంది అవార్డులు అందుకున్నారు. 1933 సంవత్సరం డిసెంబర్ 15 తేదిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో బాపు జన్నించారు. బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మినారాయణ. ఆంధ్రపత్రికలో ఆయన కార్టూనిస్తుగా కెరీర్ ప్రారంభించిన ఆయన సంగీతకారుడిగా, చిత్రకారుడిగా, కార్టునిస్ట్, డిజైనర్ గా పలు రంగాలకు ఎనలేని సేవనందించారు. సాక్షి చిత్రం ద్వారా చలన చిత్ర జీవితాన్ని ప్రారంభించిన బాపు తన కెరీర్ లో 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాపు చివరి చిత్రం శ్రీరామరాజ్యం. ఆయన సినీ జీవితంలో 5 నంది అవార్డులు, రెండు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ముత్యాలముగ్గు చిత్రానికి బాపుకు జాతీయ పురస్కారం లభించింది. 1986 సంవత్సరంలో ఆయనకు రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2013లో పద్మశ్రీ అవార్డు లభించింది. తెలుగులో సాక్షి, బాలరాజు కథ, ముత్యాల ముగ్గు, భక్త కన్నప్ప, మనవూరి పాండవులు, గోరంత దీపం, తూర్పు వెళ్లే రైలు, వంశవృక్షం, మిస్టర్ పెళ్లాం, రాధా గోపాలం, శ్రీరామ రాజ్యం వంటి విజయవంతమైన చిత్రాలకు, హిందీలో హమ్ పాంచ్, సీతా స్వయవర్, అనోఖా భక్త్, బేజుబాన్, వో సాత్ దిన్, ప్యారీ బహ్నా, మొహబ్బత్, మేరా ధరమ్, ప్రేమ్ ప్రతిజ్ఞ చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాలరాజుకథ, అందాల రాముడు, ముత్యాలముగ్గు, పెళ్లిపుస్తకం, శ్రీరామరాజ్యం చిత్రాలకు నంది అవార్డు లభించింది. ముత్యాల ముగ్గు, మిస్టర్ పెళ్లాం చిత్రాలకు జాతీయ అవార్డులను బాపు సొంతం చేసుకున్నారు. -
ఒక శకం ముగిసింది
హైదరాబాద్: ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు మరణంతో ఒక శకం ముగిసిందని విప్లవ దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి అన్నారు. ఆయన సాక్షి టీవీతో మాట్లాడుతూ ఏడుపు వస్తుందని చెప్పారు. బాపు మహా దర్శకుడు, మహా చిత్రకారుడు అన్నారు. గుంటూరు గోంగూర ఎంత ప్రాముఖ్యమో, ఓరుగల్లు కాకతీయత ఎంత ప్రాముఖ్యమో, బాబు బొమ్మ అంత ప్రాముఖ్యమైనదన్నారు. తెలుగు జాతికి కీర్తి ప్రతిష్టలు తెచ్చారని కొనియాడారు. బాపు మంచి మనిషి. నవ్వుతూ మాట్లాడతారు. సామాన్య మనిషిగా మాట్లాడతారు. గొప్ప మనిషి. గొప్ప సినిమాలు తీశారు. సాక్షి నుంచి శ్రీరామరాజ్యం వరకు ఆయన చిత్రాలలో తెలుగుదనం ఉట్టిపడుతుందన్నారు. బాపు మరణం యావత్ తెలుగుజాతికి తీరని లోటు. అన్నారు. బాపుకు భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చిందని, ఆయనకు అది సరిపోదని,. పద్మభూషణ్ గాని పద్మవిభూషణ్ గానీ ఇవ్వాలని నారాయణ మూర్తి అన్నారు. -
సోషల్ మీడియాలో బాపు మృతిపై అభిమానుల దిగ్బ్రాంతి
బాపు స్కూల్ నుంచి వచ్చిన వాడినని చెప్పుకోవడానికి గర్వ పడుతున్నానని సినీ హీరో నానీ అన్నారు. బాపు వద్ద దర్శకత్వ శాఖలో నానీ పనిచేసిన సంగతి తెలిసిందే. బాపు మృతిపై పలువురు ప్రముఖులు, అభిమానులు దిగ్బ్రాంతిని సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. Rip Bapu garu. A legend rests. What an amazing artistic journey. — Lakshmi Manchu (@LakshmiManchu) August 31, 2014 Bapu gaaru is no more..My first director..My guru..My inspiration.A great artist.An amazing director.A complete human being.Will miss u sir. — Nani (@NameisNani) August 31, 2014 I am very very proud to say that I belong to Bapu school .. Thank you for everything sir. pic.twitter.com/44XD3ua81t — Nani (@NameisNani) August 31, 2014 Oh Sad news, veteran director Bapu, maker of some memorable movies in Telugu, Hindi has passed away, may his soul have peace. — Ratnakar Sadasyula (@ScorpiusMaximus) August 31, 2014 RIP bapu garu. Greatest filmmaker ever. — idlebrain jeevi (@idlebrainjeevi) August 31, 2014 One frame of Bapu garu will tell 100stories, Master!! Pride of Telugu. Rest in peace Legend. — Deepak (@Deepuzoomout) August 31, 2014 Saddened by the demise of dir. Bapu.Admired his work a lot &worked in Radha Kalyanam which got me a lot of awards .A genius. RIP sir — Radikaa Sarathkumar (@realradikaa) August 31, 2014 One of the biggest compliments for any Telugu girl is to be called a Bapu Bomma. Such was his artistry, may God grant peace to his soul. — Ratnakar Sadasyula (@ScorpiusMaximus) August 31, 2014 RIP Bapu garu!!!a great loss for the industry..:( — Priya Mani (@priyamani6) August 31, 2014 Highly shocking to knw that Bapu garu is no more!! :-O! Snehithudi deggaraki vellipoyara appude? Will take more time to digest this news :-( — Kireeti Damaraju (@KirrD) August 31, 2014 Rip legendary director bapu garu... I shall always treasure the paintings that u drew and gave me when I met u for te first time... — soumya bollapragada (@bsoumya26) August 31, 2014 Bapu garu, director of many classics like Mutyalamuggu, is no more. Great loss to Tollywood. RIP. — Jalapathy Gudelli (@JalapathyG) August 31, 2014 very sad to hear about the sudden demise of legendary director bapu garu.... rest in peace... — krishnachaitanya (@kanchetikrishna) August 31, 2014 -
ప్రముఖ దర్శకుడు బాపు కన్నుమూత!