రామభక్త హనుమాన్.. మన బాపు!
ప్రఖ్యాత కార్టూనిస్టు, చిత్రకారుడు, దర్శకుడు, రచయిత అయిన సత్తిరాజు లక్ష్మీనారాయణ.. అదే మన బాపు గారికి శ్రీరాముడన్నా, ఆంజనేయుడన్నా ఎక్కడలేని భక్తి ప్రపత్తులున్నాయి. ఈ విషయం పలు సందర్భాలలో తేటతెల్లం అయ్యింది. తాను గీసిన ఒకానొక పెయింటింగ్లో కూడా శ్రీరాముడు సీతమ్మ వారికి పర్ణశాలలో ఉన్నప్పుడు కుంచెతో పారాణి దిద్దుతున్నట్లు బాపు చూపించారు. అందులోనూ.. ఆంజనేయుడి వేషంలో తాను స్వయంగా ఉన్నట్లు చూపించుకుంటూ తానే స్వయంగా రంగులను శ్రీరాముడికి అందిస్తున్నట్లుగా అందులో చిత్రీకరించారు. 'ఆది చిత్రకారుడైన మా గురువుగారు' అంటూ.. శ్రీరాముడిని తన గురువుగాను, ఆది చిత్రకారుడి గాను ప్రస్తావించారు.
ఇక తాను రాసిన 'రామాయణ విషవృక్షం' పుస్తకానికి కవర్ పేజీ బొమ్మ వేయాల్సిందిగా ప్రముఖ రచయిత్రి ముప్పాళ్ల రంగనాయకమ్మ బాపు గారిని కోరుతూ.. ముందస్తుగానే ఒక చెక్కు కూడా పంపించారట. అయితే, ఆ చెక్కు వెనకాల 'రామ.. రామ' అని రాసి బాపు గారు తిప్పి పంపారట. ఈ విషయాన్ని స్వయంగా రంగనాయకమ్మే చెప్పుకొన్నారు కూడా. ఇలా రామభక్తి విషయంలో బాపు ఎలాంటి తరుణంలోనూ వెనుకాడలేదు.