ప్రముఖ సినీ దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి బాపు ఆదివారం చెన్నైలో కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని మల్లార్ ఆస్పత్రిలో మరణించినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. ఐదు నంది అవార్డులు అందుకున్నారు. 1933 సంవత్సరం డిసెంబర్ 15 తేదిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో బాపు జన్నించారు. బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మినారాయణ. ఆంధ్రపత్రికలో ఆయన కార్టూనిస్తుగా కెరీర్ ప్రారంభించిన ఆయన సంగీతకారుడిగా, చిత్రకారుడిగా, కార్టునిస్ట్, డిజైనర్ గా పలు రంగాలకు ఎనలేని సేవనందించారు.
సాక్షి చిత్రం ద్వారా చలన చిత్ర జీవితాన్ని ప్రారంభించిన బాపు తన కెరీర్ లో 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాపు చివరి చిత్రం శ్రీరామరాజ్యం. ఆయన సినీ జీవితంలో 5 నంది అవార్డులు, రెండు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ముత్యాలముగ్గు చిత్రానికి బాపుకు జాతీయ పురస్కారం లభించింది. 1986 సంవత్సరంలో ఆయనకు రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2013లో పద్మశ్రీ అవార్డు లభించింది.
తెలుగులో సాక్షి, బాలరాజు కథ, ముత్యాల ముగ్గు, భక్త కన్నప్ప, మనవూరి పాండవులు, గోరంత దీపం, తూర్పు వెళ్లే రైలు, వంశవృక్షం, మిస్టర్ పెళ్లాం, రాధా గోపాలం, శ్రీరామ రాజ్యం వంటి విజయవంతమైన చిత్రాలకు, హిందీలో హమ్ పాంచ్, సీతా స్వయవర్, అనోఖా భక్త్, బేజుబాన్, వో సాత్ దిన్, ప్యారీ బహ్నా, మొహబ్బత్, మేరా ధరమ్, ప్రేమ్ ప్రతిజ్ఞ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
బాలరాజుకథ, అందాల రాముడు, ముత్యాలముగ్గు, పెళ్లిపుస్తకం, శ్రీరామరాజ్యం చిత్రాలకు నంది అవార్డు లభించింది. ముత్యాల ముగ్గు, మిస్టర్ పెళ్లాం చిత్రాలకు జాతీయ అవార్డులను బాపు సొంతం చేసుకున్నారు.