బాపు....లేదు మరపు
- బాపు కుంచెకు ప్రాణంపోసిన బెజవాడ
- అత్యధికంగా నగరంలోనే ముద్రితం
- ఏడాది పాటు గాంధీనగర్‌లోనే అద్దెకు ఉన్న బాపు-రమణలు
- కృష్ణమ్మ పరవళ్లు, బీసెంట్‌రోడ్డు రద్దీ, గాంధీనగర్ అంటే ఆయనకెంతో ఇష్టం..
అచ్చతెలుగు ఆనంద శిఖరం కరిగిపోయింది. భక్తిచిత్రాల బంగారు నిధి నింగికెగసింది. అందాల అలివేణి.. తెలుగింటి విరిబోణి అయిన ‘బాపు’బొమ్మ మూగబోయింది. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న తెలుగుతేజం దేహం విడిచింది. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ ఎన్నో సినిమాలకు జీవంపోసిన సంప్రదాయ సంగమం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో జన్మించిన సత్తిరాజు లక్ష్మీనారాయణ (బాపు) ఆదివారం చెన్నైలో పరమపదించడంతో జిల్లాలోని ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యూరు. ఆ మహనీయునికి జిల్లాతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
విజయవాడ కల్చరల్ : బాపు కుంచె నుంచి జాలువారిన చిత్రాలెన్నో బెజవాడలోనే ప్రాణం పోసుకున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. వేలసంఖ్యలో బాపు బొమ్మలు నగరంలో ముదిత్రమయ్యాయి. 1955లో బెజవాడతో మొదలైన ఆయన అనుబంధం తుదిశ్వాస విడిచే వరకు కొనసాగింది. నగరానికి చెందిన పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు, స్వాతి వారపత్రిక అధినేత వేమూరి బలరామ్, ప్రముఖ రచయితలు పెద్దిభొట్ల సుబ్బరామయ్య, పన్నాల సుబ్రహ్మణ్యభట్టు, నవోదయ పబ్లిషర్స్‌కు చెందిన రామ్మోహన్‌రావు, న్యూస్టూడెంట్ బుక్ సెంటర్ అధినేత బాజ్జీ, కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జీవీ పూర్ణచంద్, బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కృష్ణమ్మ పరవళ్లు, బీసెంట్‌రోడ్డులో రద్దీ, డిస్ట్రిబ్యూటర్ల కేంద్రమైన గాంధీనగర్ అంటే బాపు గారికి ఎంతో అభిమానం. ఇలా సుమారు 50 ఏళ్ల పాటు నగరంతో ఆయన సాహితీ అనుబంధాన్ని కొనసాగించారు.
బాపు బొమ్మలకు డిమాండ్ ఎక్కువ
ఒకప్పుడు ఏదైనా ముఖచిత్రంపై బాపు బొమ్మ ఉంటే చాలు ఆ పుస్తకాలకు డిమాండ్ విపరీతంగా ఉండేది. ఇదే కోవలో బాపుకు బెజవాడతో బంధం ఏర్పడింది. అనేకమంది ఔత్సాహిక కవులు, రచయితలు రాసిన పుస్తకాలపై బాపుతో ముఖచిత్రం వేయించుకోవటం అంటే అప్పట్లో పెద్ద క్రేజ్‌గా ఉండేది. ఇలా వందల పుస్తకాలు ముద్రితమైన క్రమంలో బాపు స్వయంగా రచయితతో, పబ్లిషర్‌తో మాట్లాడేవారు. న్యూ స్టూడెంట్ బుక్ సెంటర్ ముద్రించే నోట్ పుస్తకాలపై బాబు వేసిన బొమ్మలు, కొత్త సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబించించేలా ముద్రించే అభినందన గ్రీటింగ్ కార్డులకు బాపు బొమ్మలు వేసేవారు. వీటికి అప్పట్లో విపరీతమైన డిమాండ్ ఉండేది.
మాసపత్రిక నుంచి మోడరన్ కేఫ్ వరకు..
బాపుకు విజయవాడలో ఏడాది పాటు అద్దెకు ఉన్నారు. 1970వ దశకంలో ఆంధ్రజ్యోతి మాసపత్రికలో కార్టూనిస్ట్‌గా పనిచేశారు. అదే మాసపత్రికకు ముళ్లపూడి రచయితగా పనిచేశారు. గాంధీనగర్‌లోని పాత రాధా టాకీస్ సమీపంలోని నివాసంలో బాపు, రమణ ఒకేచోట నివాసం ఉన్నారు. ఏడాదిపాటు ఇక్కడ పనిచేసిన ఇద్దరూ ఆ తరువాత చెన్నై వెళ్లిపోయూరు. ఆ తర్వాత ప్రచురణలు, ఇతర పనుల నిమిత్తం ఎప్పుడు విజయవాడ వచ్చినా బీసెంట్‌రోడ్డులోని మోడరన్ కేఫ్ హోటల్‌లోనే బస చేసేవారు. అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా రూపొందించిన ‘ఇద్దరుమిత్రులు’ సినిమా కథ రచన, చిత్రాల రూపకల్పన పనులన్నీ అక్కడే జరిగాయని బాపు ఒక సందర్భంలో ప్రకటించారు. ఆ తర్వాత విశాలాంధ్ర పబ్లిషర్స్‌లో ఆయన ముఖచిత్రాలు అనేకం ప్రచురితమయ్యూరుు.
‘బుక్ ఫెస్టివల్’తో అనుబంధం
విజయవాడలో ఏటా నిర్వహించే బుక్ ఫెస్టివల్‌కు, బాపుకు విడదీయరాని బంధం ఉంది. దీనికి కావాల్సిన లోగోలు, బొమ్మలు ఆయనే వేసేవారు. ఈ ఏడాది జరిగిన 20వ బుక్ పెస్టివల్ లోగో బొమ్మను ఆయనే వేశారు. ఆయన సన్మానాలకు ఇష్టపడేవారు కాదని ఆయనకు సన్నిహితంగా ఉండేవారు పేర్కొంటారు. అయితే, బుక్ ఫెస్టివల్‌కు వచ్చి ఇక్కడ పుస్తకాలు కొనుగోలు చేసుకుని వెళ్లేవారు. బుక్ ఎగ్జిబిషన్ లైబ్రరీలో బాబు బొమ్మలు మనకు దర్శనమిస్తాయి.
అపర శ్రీరామభక్తుడు
బాపు రామభక్తుడు. ఒక రచయిత్రి ‘రామాయణ విషవృక్షం’ అనే నవల రాసి ముఖచిత్రం వేసి ఇవ్వమంటూ ఖాళీ చెక్కును ఆయనకు పోస్ట్ చేశారు. ఆయన ఆ ఖాళీ చెక్కుపై శ్రీరామ.. శ్రీరామ.. శ్రీరామ.. అని రాసి సదరు రచయితకు తిప్పి పంపి తన భక్తిని చాటుకున్నారు. దైవానికి వ్యతిరేకంగా బొమ్మలు గీయడం కానీ, వ్యాఖ్యానాలు చేయడం కానీ బాపు ఎప్పుడూ చేసిన దాఖలాలు లేవు.
చిత్ర పరిశ్రమకు తీరని లోటు
తెలుగు సినీరంగానికి విశేష సేవలందించిన బాపు మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన దర్శకత్వంలో ఎన్నో కళాత్మక చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. తనదైన బాణీలో సినిమాలు తీసి సినీరంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
- మండలి బుద్ధప్రసాద్, శాసనసభ డెప్యూటీ స్పీకర్
గోటితో నా బొమ్మ వేశారు..
నేను రచించిన ‘ధ్రువతార’ నవల వారంవారం ప్రచురితమయ్యేది. దాని ముఖచిత్రాలు బాపునే వేసేవారు. ముఖచిత్రం ఏవిధంగా ఉంటే ఆకర్షణగా ఉంటుందో ఆయనే నాతో మాట్లాడేవారు. నేను రాసిన ‘అంగారతల్పం’ నవలకు కూడా ముఖచిత్రం ఆయనే వేశారు. ఒకసారి ఆయనను కలిసినప్పుడు నాతో మాట్లాడుతూనే.. గోటితో నా బొమ్మను వేసి ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది.
- పెద్దిబొట్ల సుబ్బరామయ్య, రచయిత
ఏడు దశాబ్దాల అనుబంధం
బాపు, రమణ లతో నాకు సన్నిహిత సంబంధం ఉంది. ఏడు దశాబ్దాలుగా బాపుతో స్నేహాన్ని కొనసాగిస్తున్నాను. రమణతో కలిసి నేను ప్రజాతంత్ర పత్రికలో పనిచేసేవాడ్ని. అక్కడకు బాపుగారు కూడా వచ్చేవారు. ‘బాపు రమణీయం’ పుస్తకం నన్నెంతో ఆకట్టుకుంటుంది. బాపు శ్రీరామ కథలను సినిమాగా తీసేవారు. నేటితరం ఆర్టిస్టులకు ఆయన ఆదర్శం.
- తుర్లపాటి కుటుంబరావు, సీనియర్ పాత్రికేయుడు
రచయిత ఆరాధ్యుడు..
మాలాంటి రచయితలు బాపును ఆరాధిస్తారు. ఆయన సోదరుడు సత్తిరాజు రామనారాయణకు మ్యూజియంరోడ్డులో ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. నా తొలి పుస్తకం ‘అమలిన శృంగారం’ 1980లో విడుదలైంది. దాని ముఖచిత్రం బాపుగారే వేశారు. ‘నీ స్నేహితుడు కాబట్టి అతని వద్ద డబ్బు తీసుకోవద్దు. పూర్ణచంద్‌కు నా అభినందనలు.’ అని బాపు అనడం మరచిపోలేను.
- జీవీ పూర్ణచందు,కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి