
‘‘బాపు’ చాలా యునిక్ కాన్సెప్ట్. రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంటుంది. అప్పుల బాధతో నా పాత్ర ఆత్మహత్యకి ప్రయత్నించినప్పుడు ఏమవుతుంది? అనేది ఈ సినిమాలో చూడాలి. ఈ చిత్రం ఫైనల్ కాపీ చూశాను... చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది’’ అని బ్రహ్మాజీ అన్నారు. దయా దర్శకత్వంలో బ్రహ్మాజీ, ఆమని, ‘బలగం’ సుధాకర్ రెడ్డి, ధన్యా బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బాపు’.
రాజు, సీహెచ్ భానుప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ– ‘‘రెండేళ్ల క్రితం దయా ‘బాపు’ కథ చెప్పారు. పాయింట్ చాలా కొత్తగా, నా పాత్ర వైవిధ్యంగా ఉండటంతో పాటు సహజంగా కనిపించే అవకాశం ఉండటంతో ఒప్పుకున్నాను. అయితే బడ్జెట్‌పై చర్చ జరుగుతున్నప్పుడు.. నాకు పారితోషికం వద్దు... విడుదల తర్వాత లాభాలు వస్తే ఇవ్వమని నిర్మాతలకు చెప్పాను. నా తర్వాత ఇతర నటీనటులు కూడా పారితోషికం తగ్గించడం, లొకేషన్‌లో క్యారవ్యాన్స్ వాడకుండా చిత్రీకరణ జరిపిన ఊర్లో (కరీంనగర్) ఉంటూ సర్దుకుపోవడంతో ఈ మూవీ పూర్తి చేశాం.
కథపై ఇష్టం, సినిమాపై నమ్మకంతోనే ఇది సాధ్యపడింది. ఆమనిగారు సహజ నటి. ‘బాపు’ టైటిల్ రోల్‌లో సుధాకర్ రెడ్డిగారి పాత్రతో ఆడియన్స్ చాలా కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలోని రెండు పాటలు బాగా పాపులర్ అయ్యాయి. డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటిగారికి మా సినిమా చాలా నచ్చింది. ఇక ‘సూపర్ డీలక్స్’ సినిమాలో విజయ్ సేతుపతిగారు చేసినటువంటి పాత్ర చేయాలన్నది నా కల. ప్రస్తుతం చిరంజీవిగారి ‘విశ్వంభర’లో ఓ పాత్ర చేశాను. సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’తో పాటు తరుణ్ భాస్కర్, రాజ్ తరుణ్ వంటి వారి సినిమాల్లో నటిస్తున్నాను’’ అని తెలిపారు.