
బాపూగారు బాగా ప్రోత్సహించారు
‘‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో బౌద్ధ సన్యాసి ధర్మనందనుడుగా, ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ చిత్రంలో విలన్‌గా నటించా. ఈ సంక్రాంతికి విడుదలైన ఆ రెండు చిత్రాలు నటుడిగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. చాలామంది అభినందిస్తున్నారు’’ అని నటుడు సునీల్ కుమార్ చెప్పారు. పాత్రికేయుల సమావేశంలో సునీల్ కుమార్ మాట్లాడుతూ – ‘‘మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో పుట్టి పెరిగిన నేను నటుడిగా రాణించాలనుకున్నాను. ఎన్నో ప్రయత్నాలు చేశాను. అప్పుడే దర్శకుడు బాపూగారిని కలిశాను. ఆయన ‘భాగవతం’ సీరియల్‌లో నన్ను రాముడు, కృష్ణుడు పాత్రలిచ్చి, ప్రోత్సహించారు.
ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో ‘రాధాగోపాలం’, ‘సుందరకాండ’ సినిమాల్లో నటించాను. నాకు యాక్సిడెంట్ కావడంతో సినిమాలకు గ్యాప్ వచ్చింది. ధర్మనందనుడు పాత్రకు మేకప్ సెట్ కాకపోవడంతో గుండు కొట్టుకుంటావా అని క్రిష్ అడగడంతో ఓకే అన్నా. సినిమాలో నా పాత్ర చూస్తుంటే హ్యాపీగా అనిపించింది. బాలకృష్ణ, హేమమాలినిగార్లతో నటించడం మరచిపోలేని అనుభూతి’’ అన్నారు.