బాపు జ్ఞాపకాలలో... | Recall that the association with bapu | Sakshi
Sakshi News home page

బాపు జ్ఞాపకాలలో...

Published Mon, Sep 8 2014 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM

బాపు జ్ఞాపకాలలో...

బాపు జ్ఞాపకాలలో...

ఆయన గీత తెలుగువారి జాతి సంపద. కళారంగంలో చేతులు తిరిగిన కళాకారులకు ఆయనే ‘గీత’కారుడు. తెలుగునాట చాలామంది చిత్రకారులు ఆయనకు ఏకలవ్య శిష్యులు. ఆయనతో కొందరిది సన్నిహిత సంబంధం. మరికొందరిది ఆత్మీయానుబంధం. బాపు గీత గోడ మీద అందమైన బొమ్మ అయినట్లే, ఆయనా ఇప్పుడు తెలుగువారి మనసుల్లో అందమైన జ్ఞాపకంగా మిగిలారు. ఆయన సన్నిహితులు, శిష్యులు, అభిమానులు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వద్ద చేరారు. ఈ సందర్భంగా ‘సిటీప్లస్’తో వారు తమ జ్ఞాపకాలను పంచుకున్నారు.  సీనియర్ ఆర్టిస్టులు గోపి, మోహన్, శంకర్, లేపాక్షి, రవికిషోర్, ఆనంద్, రచయితలు శ్రీరమణ, రమణమూర్తి, శివాజీ తదితర ప్రముఖులు బాపుతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
 
యంగ్‌స్టర్స్‌ని ఎంకరేజ్ చేసేవారు...
బాపు తర్వాత అంతటి ఆర్టిస్టుగా పేరున్న గోపి మాట్లాడుతూ.. ‘బాపుని చాలాసార్లు కలిశాను. 1977లో అనుకుంటా. సీతాకళ్యాణం సినిమా షూటింగ్ సమయంలో మద్రాస్‌లోని విజయా స్టూడియోలో కలుసుకున్నప్పుడు ‘మీరు ఏది గీస్తే అది బొమ్మ అండీ.. వెనక్కు తిరిగి చూడకండి’ అని చెప్పారు. యంగ్‌స్టర్స్‌ని అంతలా ఎంకరేజ్ చేసేవారాయన. మేమంతా బాపుని గురువుగా భావించి ఎదిగిన వాళ్లమే. చివరకు అదెలా అయిందంటే, ఒకానొక సందర్భంలో ఆయన నన్ను తన గురువుగా చెప్పారు. వాత్సల్యానికి అది ఎక్స్‌ట్రీమ్ లెవల్’ అంటూ బాపుతో తన అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. పక్కనే ఉన్న రవికాంత్‌రెడ్డి అందుకుని ‘పదిహేనేళ్ల కిందట విరసం వాళ్లు వేసిన ఓ పుస్తకంలో మోహన్‌గారితో పాటు నేనూ కొన్ని క్యారికేచర్స్ వేశాను. వాటిలో బాపుగారి క్యారికేచర్ కూడా ఉంది.
 
కొన్నాళ్లకు బాపు హైదరాబాద్ వచ్చారు. ఆయన బసచేసే మయూరి గెస్ట్‌హౌస్ ఏరియాలోనే మేం ఉండేవాళ్లం. ఓ రోజు మిట్టమధ్యాహ్నం మా అపార్ట్‌మెంట్‌కొచ్చారు. లిఫ్ట్ లేదు. మెట్లమీది నుంచే థర్డ్‌ఫ్లోర్‌లో ఉన్న మా ఫ్లాట్‌కి వచ్చారు. ‘బాబూ.. నువ్వు బొమ్మలు వేసిన పుస్తకం చూశాను. చాలా బాగా వేస్తున్నావు. కీపిటప్’ అని చెప్పి వెళ్లిపోయారు’ అని గుర్తు చేసుకున్నారు. ఆర్టిస్ట్ లేపాక్షి మాట్లాడుతూ, ‘బాపుగారి కార్టూన్స్ ఇమిటేట్ చేయాలని చాలా ట్రై చేశా. నావల్ల కాలేదు. ఆయన కార్టూన్స్‌ని ఇమిటేట్ చేయడానికి ఓ స్థాయి ఉండాలనిపించి వదిలేశా. నాకు ఇన్స్‌పిరేషన్ మాత్రం ఆయనే’ అని బాపు నైపుణ్యాన్ని కొనియాడారు.
 
బాపు లేని లోటు లోటే...
 ‘బాపుగారిని ఇష్టపడని వాళ్లుంటారా?’ అంటూ బాపుని తలచుకున్నారు శ్రీరమణ. ‘తమిళ ఆర్టిస్ట్ గోపుల్‌గారికి బాపు అంటే భలే ఇష్టం. వీళ్లిద్దరూ కలసి ఒక అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలో పనిచేసేవారు. అప్పట్లో బాపుగారు హయ్యెస్ట్ పెయిడ్ ఆర్ట్ డెరైక్టర్. నెలకు రెండువేల ఐదువందల రూపాయల జీతం. ఫియట్ కారు.. అలాంటి ఉద్యోగం బోర్ కొడుతోందని మానేశారు. ‘మీరూ మానేసి సొంతంగా పెట్టుకోండి’ అని గోపుల్‌గారికీ సలహా ఇచ్చారట. ఆ సలహాతోనే గోపుల్‌గారు ‘యాడ్‌వేవ్’ పెట్టారు. బాపుగారు సినిమా వైపు వచ్చారు. అలాంటి బాపు లేని లోటు లోటే’ అని శ్రీరమణ అంటుండగా, ‘మీకు ఆయన రాసిన ఉత్తరం గురించి చెప్పండి’ అని  కార్టూనిస్ట్ శంకర్ అడిగారు.
 
ఉత్తరమేంటి అని అడిగిన ఇతర మిత్రుల కోసం శంకర్ తానే చెప్పడం ప్రారంభించారు. ‘ఈ మధ్య శంకర్ వేసిన బొమ్మలను గమనిస్తున్నా. అంతర్జాతీయ స్థాయిలో చాలా బాగుంటున్నాయి.. ఇంకాస్త శ్రద్ధపెడితే ఇంకా అందంగా వస్తాయి. ఆయన వేసిన ఎమ్మెస్ సుబ్బులక్ష్మి క్యారికేచర్ బాగుంది. కింది లిప్ ఇంకాస్త మెరుగ్గా వేసి ఉండాల్సింది. ఈ విషయం శంకర్‌తో అనకండి నొచ్చుకుంటాడేమో.. నేను పంపే ఈ జిరాక్స్‌లు అతనికివ్వండి’ అని ఉత్తరంతో పాటు ఫారిన్ పుస్తకాలకు సంబంధించిన కొన్ని జిరాక్స్‌లు పంపించారు. ఆ ఉత్తరం ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది’ అని చెప్పారు.
 
‘బాపు’రే పదునాల్గు భువనభాండముల్..
‘నేను 1967లో ఎస్సెల్సీలో ఉన్నప్పుడు ఒకసారి మద్రాసు వెళ్లాను. అన్నయ్యతో కలసి బాపుగారి ఇంటికి వెళ్లాను. అప్పుడే ఫస్ట్‌టైమ్ బాపుగారి ఒరిజినల్స్ చూడటం. మనిషంత ఎత్తులో ఉన్న ఆ బొమ్మలను చూస్తే పదునాల్గు భువనభాండములను చూసిన అనుభూతి’ అని గుర్తుచేసుకున్నారు రచయిత, చిత్రకారుడు శివాజీ. బాపు దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేసిన గాంధీ మాట్లాడుతూ ‘వీళ్లందరికీ బాపు ప్రశంసలు ఉంటే, నాకు తిట్లెక్కువ. నేను డెరైక్టర్‌గా చేసిన ‘సారీ.. నాకు పెళ్లయింది’ అడల్ట్ సినిమా అని చాలా సమీక్షలు వచ్చాయి. ఈ విషయం తెలిసిన బాపు ‘డబ్బులే కావాలనుకుంటే ఏ పనైనా చేసుకోవచ్చు. ఇంకోసారి ఇలాంటి సినిమాలు తీయొద్దు’ అన్నారు అని చెప్పారు. బాపు దగ్గర కోడెరైక్టర్‌గా పనిచేసిన ఆర్టిస్ట్ రాంపా మాట్లాడుతూ ‘ఎమినెంట్ కార్టూనిస్ట్స్ ఆఫ్ ఇండియా’ డాక్యుమెంటరీకి నేను కోడెరైక్టర్‌ని.
 
బాపుగారు డెరైక్టర్. ‘మీరిలా కూర్చోవద్దు.. ఇలా కూర్చోండి’ అని చెబితే ‘అలాగేనండి తప్పకుండా.. మీరు చెప్పినట్టే చేస్తాను’ అనేవారు ఎంతో వినయంగా’ అంటూ బాపుని తలచుకున్నారు. ఆర్టిస్ట్ రవికిషోర్ మాట్లాడుతూ.. ‘ఒకసారి ఆయనకు నా ఫొటోలు పంపిస్తూ, ‘ఇవి డ్రైబ్రష్‌లో ఒకటి, కలర్‌లో ఒకటి స్కెచ్‌వేసి పంపగలరు. ధైర్యం చేసి రాస్తున్నాను. ఏమీ అనుకోవద్దు’ అని ఉత్తరం రాశాను. ఆయన నేను కోరినట్టే రెండు స్కెచెస్ పంపించి, ‘కిషోర్‌గారు మీ స్కెచ్‌లు వేసి పంపిస్తున్నాను. నచ్చితే ఉంచుకోండి. నచ్చకపోతే మళ్లీ వేసిస్తా’ అని ఫోన్ చేశారు’ అంటూ బాపుతో తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. రచయిత రమణమూర్తి మాట్లాడుతూ ‘బాపు భాగవతం సీరియల్‌కి పాడిన వారిలో మా అమ్మాయీ ఉంది.
 
పాటను సీరియల్‌లో లిప్ మూమెంట్‌కు అనుగుణంగా పాడించుకున్నారు. కొంచెం కష్టమైన ప్రక్రియ. అయిపోయాక ‘నిన్ను చాలా కష్టపెట్టానమ్మా’ అన్నారు మా అమ్మాయితో. మా అమ్మాయి ఆయనను ఆటోగ్రాఫ్ అడిగితే, ‘మీరు గాయకులు.. పెద్దవాళ్లు. మేం చిన్నవాళ్లమమ్మా.. అంటూనే ఆటోగ్రాఫ్ ఇచ్చారు’ అని తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఆర్టిస్ట్ మోహన్ మాట్లాడుతూ ‘బాపు సినిమాలకు, బొమ్మలకు అమెరికా, ఆస్ట్రేలియాల్లో అభిమానులు ఉన్నారు. అయినా ఆయనకు రావాల్సినంత గుర్తింపు రాలేదు’ అని నిర్వేదం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement