కొంటె బొమ్మల 'బాపు'.. గుండె ఊయలలూపు | cartoonist, director bapu jayanthi | Sakshi
Sakshi News home page

కొంటె బొమ్మల 'బాపు'.. గుండె ఊయలలూపు

Published Tue, Dec 15 2015 10:55 AM | Last Updated on Sun, Sep 3 2017 2:03 PM

కొంటె బొమ్మల 'బాపు'.. గుండె ఊయలలూపు

కొంటె బొమ్మల 'బాపు'.. గుండె ఊయలలూపు

కొంటెబొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె ఊయలలూపు
ఓ కూనలమ్మా..!

తెలుగు వెండితెర మీద తెలుగు దనాన్ని ఒలికించిన దిగ్దర్శకుడు బాపు గురించి ఆరుద్ర చెప్పిన మాటలివి. వెండితెరకు వయ్యారాన్ని నేర్పిన బాపు భౌతికంగా దూరమైనా.. ఆయన గీసిన బొమ్మలు, తీసిన సినిమాలు ఎప్పటికీ ఆయన్ని మనతోనే ఉండేలా చేశాయి. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా ఒక్కసారి ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుందాం.

బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. ఆయన 1933 డిసెంబర్‌ 15న పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పుట్టారు. ఆంద్ర పత్రికలో కార్టూనిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన బాపు తరువాత దర్శకుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాడు.

రామాయణసారం లేకుండా బాపు సినిమాలే లేవు. రామాయణ, మహాభారతాల్ని ఆధునీకరించి తెరకెక్కించారు బాపు. ఆ రెండు మహాకావ్యాల్ని అణువణువునా జీర్ణించుకుని.. ప్రతి కథనీ ఆ కోణం నుంచే చూశారు.. తీశారు. అందుకే రామాయణంలోని ఘట్టాలను సినిమాలుగా తెరకెక్కించిన బాపు. ఆయన తెరకెక్కించిన సాంఘిక చిత్రాల్లోనూ రామాయణ సారాన్నే చూపించారు. తనని తాను రాముని బంటుగా చిత్రీకరించుకున్నారు కూడా. అది రాముడిపై బాపు భక్తి.

కళాత్మక దర్శకుడు బాపుని ఎన్నో అవార్డులు వరించాయి. మదర్ థెరిసా చేతులమీదుగా రఘుపతి వెంకయ్య స్మారక పురస్కారాన్ని అందుకున్నారు. ఆరు నంది అవార్డులతో పాటు, ఎన్నో గౌరవ సత్కారాల్ని పొందారు. సినిమాలోనే కాదు, భక్తిరసం తొణికిసలాడే అనేక బొమ్మలు బాపు చేతిలో ఊపిరిపోసుకున్నాయి. స్క్రిప్ట్ తోపాటే అన్ని ఫ్రేముల్నీ బొమ్మలుగా గీసుకుంటారు బాపు. అందుకే ప్రతి షాట్ సెల్యులాయిడ్‌పై బొమ్మగీసినట్టు అందంగా ఒదిగిపోతుంది. ఆణిముత్యాల్లాంటి సినిమాలను తీసిన బాపు.. ఎవరి దగ్గరా పనిచేయలేదు. కేవలం కథా బలమే ఆయన సినిమాలను విజయపథంలో నడిపించింది.

బాపు గురించి మాట్లాడుకుంటూ రమణ గురించి చెప్పకపోతే అది పూర్తవదు. వారిద్దరూ ఒకే ఆత్మకు రెండు రూపాలు, ఒకే భావాన్ని పలికే రెండు పదాలు. బాపు దృష్టి అయితే రమణ దాని భావం. బాపు చిత్రం అయితే రమణ దాని పలుకు. అందుకే వీరిద్దరి వెండితెర ప్రయాణమే కాదు.. జీవనయానం కూడా కలిసికట్టుగానే సాగింది. అందుకేనేమో.. రమణ మరణించిన తరువాత ఎక్కువ కాలం బాపు మనలేకపోయాడు. ఆత్మ లేని దేహంగా ఉండలేక రమణను కలుసుకోవడానికి 2013 ఆగస్టు 31న శాశ్వతంగా వెళ్లిపోయారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement