బాపురే...
శ్రీరాముడి వేషంలో కనిపిస్తున్న ఈ బాపు చిత్రం వెనక... ఓ హనుమంతుని కుంచె దాగుంది. చిత్రంతో పాటు కథ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఆ కథ పేరు.. ‘బాపు’ని కొలిచే ముచ్చట కనరే!! కథేమిటంటారా!
‘‘బాపుగారు ఏదో పనిపై తన గది విడిచి బయటికి వెళ్లినపుడు...గదిలోని బొమ్మలన్నీ కుంచెతో తన గోడు వెళ్లబోసుకున్నాయి. ఆ మహానుభావుడు తిరిగి గదికి చేరుకునేలోపు మా మనసెరిగి ఓ చిత్రం గీయమా...అంటూ మొరపెట్టుకున్నాయి. టేబుల్‌పై పరచిన తెల్లకాగితంపై కుంచె కదలడం మొదలుపెట్టింది. రాముడి వేషంలో బాపుగారి దివ్యస్వరూపం...చుట్టూ ఆ బొమ్మలకొలువుతో చిత్రం ముగిసింది’’ కథ...బాగుంది. చిత్రం అంతకన్నా గొప్పగా ఉంది. ఇంతకీ ఈ ఆలోచన వచ్చిందెవరికీ...ఆచరణకు నోచుకున్నదెన్నడూ అంటారా? ఆయన భక్తుల్లో ఒకరైన కూచి సాయిశంకర్‌ని పలకరిస్తే విషయాలన్నీ వివరంగా చెబుతారు.
‘సీతమ్మ పెళ్లి చిత్రం రీరికార్డింగ్ సమయంలో నేను బాపుగారి దర్శనం చేసుకున్నాను. ఐదవ ఏట నుంచే కుంచెతో ‘బొమ్మ’లాట ఆడుకున్న నేను బాపుగారికి వీరాభిమానిని. ఆ అభిమానంతోనే నేను ఇంటర్‌లో ఉండగా ‘బాపుని కొలిచే ముచ్చట కనరే!!’ కథతో పాటు దానికి సంబంధించిన చిత్రాలను గీశాను. అమలాపురంలో ఇంటర్ పూర్తయ్యాక ఫైనార్ట్స్ చదవడం కోసం మద్రాసుకెళ్లాను. బాపుగారికి నా కథ, చిత్రాలు చూపించాను. రాముడి వేషంలోఉన్న తన బొమ్మని చూసి చిన్నగా నవ్వుకున్నారు. ‘మద్రాసు దేనికొచ్చావు’ అన్నారు. ఫైనార్ట్స్ చదవడం కోసం అన్నాను. ‘అక్కర్లేదు.. ఈ బ్రష్‌కి ఆ అవసరం లేద’న్నారు. అని ఊరుకోలేదు...ఫైనార్ట్స్‌లోని చాలా ముఖ్యమైన అంశం ‘లైన్ ఆఫ్ యాక్షన్’పై ప్రత్యేకంగా పాఠం కూడా చెప్పారు.
ఆ మాట మరువను...
బాపుగారు నాకు పాఠం చెప్పేటప్పుడు ఒక మాట చెప్పారు ‘బ్రష్ స్ట్రోక్ ఎలాగుండాలంటే.. వేడన్నంమీద వెన్నముద్ద ఎలా కరిగి ప్రవహిస్తుందో...బ్రష్ స్ట్రోక్ బొమ్మమీద అలా వెళ్లాలి’ అని. ఎంత సహజంగా చెప్పారో చూడండి. ఈ ఒక్కముక్క అర్థం చేసుకోడానికి ఫైనార్ట్స్‌ని పదిసార్లు చదవాల్సి ఉంటుందేమో! నేను అప్పుడప్పడు కథలు రాసేవాడ్ని. ఒకసారి ఒక పత్రికకు నా కథను పంపాను. ఉత్తమకథకు బాపుగారు బొమ్మ వేస్తారని చెప్పారు. నేను కోరుకున్నట్టుగానే నా కథే ఎంపికైంది. బాపుగారు బొమ్మ కూడా వేశారు. ‘జంజమోముల స్వామి’ అనే ఆ కథకు బాపుగారు వేసిన బొమ్మ నా మనసు నింపేసింది. ఆ బొమ్మలో చిన్నికృష్ణుడికి మీసాలుంటాయి. అప్పటి నుంచి నా కథ పేరు ‘మీసాల కృష్ణుడి కథ’ అయిపోయింది. బాపుగారు భౌతికంగా మనకు దూరమైన క్షణాన ఆయనతో నాకున్న ఈ చిన్నిపాటి జ్ఞాపకాలు నా కడుపు నింపేశాయి. ఆయన లేరన్న విషయం గుండెను పిండేసినా, ఈ అనుభవాలనే అవార్డులుగా భావిస్తూ, ఒకింత గర్వంగా ఫీలవుతుంటాను.
ఆయన ఆదర్శం...
ప్రతి ఒక్క కళాకారుడు స్టేజి ఎక్కుతాడు ఒక్క చిత్రకారుడు తప్ప. అందుకే నేను పెయింటింగ్‌లో లైఫ్‌షోలపై దృష్టి పెట్టాను. స్టేజిపై ఒక పక్క అన్నమాచార్యుల కీర్తనలు పాడుతుంటే నేను అక్కడే లైవ్‌షోలో పెయింటింగ్స్ వేసి చూపిస్తానన్నమాట. ఈ కళకు అమెరికాలోని ‘తానా’ సభలు చక్కని వేదికగా మారాయి. దాదాపు పదేళ్లనుంచి నేను ఈ లైవ్‌షోలు ఇస్తున్నాను. టీటీడీ వారికి కూడా ఇలాంటి షోలు చేస్తుంటాను. నేను కోరుకున్న కళ నాకు ఎంతటి గుర్తింపు తెచ్చిపెట్టినా బాపుగారితో నాకున్న అనుబంధం...ఆయనపై నేను వేసిన చిత్రాలే నాకు ప్రత్యేక గుర్తింపుని తెచ్చిపెట్టాయి’’
- భువనేశ్వరి