
ఉప్పెన(2021) సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు(Buchi Babu Sana). తొలి సినిమాతోనే రూ.100 కోట్లుకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించాడు. అయితే ఈ సినిమా రిలీజై నాలుగేళ్లు అవుతున్నా.. బుచ్చిబాబు నుంచి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్(Ram Charan)తో సినిమా చేస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. రామ్ చరణ్ కెరీర్‌లో ఇది 16వ సినిమా(RC16).
ఇటీవల విడుదలైన గేమ్ ఛేంజర్ చిత్రం డిజాస్టర్ కావడంతో మెగా ఫ్యాన్స్ అంతా బుచ్చి బాబు సినిమాపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. తమ హీరోకి ఎలాగైనా బ్లాక్ బస్టర్ అందించాలని కోరుతున్నారు. ఫ్యాన్స్ ఊహించినదానికంటే ఎక్కువ హిట్టే అందిస్తానని చెబుతున్నాడు బుచ్చిబాబు. తాజాగా ఓ ఈవెంట్ రామ్ చరణ్ సినిమాపై బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
బ్రహ్మాజీ ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘బాపు’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన బుచ్చిబాబు మాట్లాడుతూ..‘మా నాన్న రైతు. చాలా కష్టపడి మమ్మల్ని పెంచాడు. వ్యవసాయం గురించి మా నాన్న నాతో ఓ మాట చెప్పాడు. ‘పేకాట ఆడితే డబ్బులు మనకో లేదా పక్కోడికో వస్తాయిరా..కానీ వ్యవసాయం చేస్తే ఎవడికి వస్తాయో తెలియదు..అంతా పోతాయి’ అని అనేవాడు. నిజంగానే ఏడాదంతా కష్టపడితే ఏకరం మీద రైతుకు మిగిలేది కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే. ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది’ అని బుచ్చిబాబు అన్నారు.
అలాగే తన నాన్న గురించి మాట్లాడుతూ..‘ఉప్పెన రిలీజ్ సమయంలో మా నాన్న థియేటర్ బయటే నిలబడి ‘సినిమా బాగుందా’ అని వచ్చిన వారందరినీ అడిగేవాడట. ఆయన సినిమా కూడా చూడకుండా థియేటర్‌కు వచ్చిన వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆయన మా నుంచి బౌతికంగా దూరమై ఏడాది అవుతోంది. ప్రస్తుతం నేను చరణ్‌తో తీస్తున్న సినిమా బాగుందా అని ఎవరినీ అడగాల్సిన పని లేదు నాన్నా.. అది కచ్చతంగా హిట్ అవుతుంది’ అని బుచ్చిబాబు ఎమోషనల్‌గా చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.