బాపూ.. మీరు లేరా!
- బాపూ మృతికి విశాఖ దిగ్భ్రాంతి
- నగరంతో ఆయనకు విడదీయరాని అనుబంధం
- ప్రముఖుల సంతాపం
విశాఖపట్నం : ప్రఖ్యాత చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు మృతి విశాఖ వాసులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఎక్కడ ఉన్నా నగరంలోని సాహితీ ప్రియులతో సత్సంబంధాలు కొనసాగిస్తుంటారు. విశాఖ వాసులు రాసే సాహిత్యంపై ఆయనకు మక్కువ ఎక్కువ. అందుకే ఇక్కడి కవులు రాసే పుస్తకాలను ఆయన క్రమం తప్పకుండా చదువుతారు.
అనేక పుస్తకాలకు ఆయన ముందు మాట రాశారు. బాపు గీసిన నవరసాల బొమ్మలు మద్దిల పాలెం కళాభారతి ఆడిటోరియంలో ఆయన గౌరవార్థం నేటికీ దర్శనమిస్తాయి. ప్రముఖ సినీనటుడు నూతన ప్రసాద్ వీటిని కళాభారతికి అందజేశారు. ఆంధ్రా యూనివర్సిటీ 1991లో కళాప్రపూర్ణ బిరుదుతో పాటు గౌరవ డాక్టరేట్ ఇచ్చి బాపూను సత్కరించింది.
అప్పుడాయన ఏయూలోని రంజనీ అతిథి గృహంలో బస చేశారు. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు విశాఖలో ఆయన బస చేసినా అది సొంత పర్యటనలు కావడంతో ఎవరికీ తెలియజేయలేదు. చివరిగా ఆయన దర్శకత్వం వహించిన శ్రీరామరాజ్యం చిత్రంలో కొంతభాగాన్ని ఇక్కడ చిత్రీకరించారు.
తీరని లోటు
సినీ లోకానికి బాపు లేని లోటు తీరనిది. సినిమాల్లో అన్ని రసాలతో రక్తికట్టించే అపర దర్శకునిగా కీర్తినార్జించారు. ఆరు సార్లు నంది అవార్డు అందుకుని విశ్వ విఖ్యాత దర్శక మహ ర్షి అనే బిరుదు పొందారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.
-గంటా శ్రీనివాసరావు, విద్యా శాఖ మంత్రి
బాపూ చిత్రాలు అజరామరం
తెలుగుదనానికి ప్రతీకగా నిలచిన బాపు ఆకస్మిక అస్తమయం విశాఖ సాహితీలోకాన్ని నివ్వెరపరచింది. వారు గీసిన రేఖా చిత్రాలు, దస్తూరి నభూతో నభవిష్యత్. భక్త కన్నప్ప, సంపూర్ణ రామాయణం, మన ఊరి పాండవులు తదితర సినిమాలు తెలుగు చిత్రసీమలో తిరుగులేని కళాకండాలు. భౌతికంగా ఆయన లేకపోయినా ఆయన తీసిన, గీసిన చిత్రాలు అజరామరమైనవి.
-ఆచార్య కె. మలయవాసిని, అధ్యక్షురాలు, విశాఖ సాహితీ
అనితర సాధ్యుడు
బాపు హఠాన్మరణం తెలుగుజాతికి తీరనిలోటు. చిత్రకారునిగా, చలన చిత్ర దర్శకునిగా, ఆయన చూపిన వైవిధ్యం అనితర సాధ్యం. బాపు బొమ్మ తెలుగింటి ముద్దుగుమ్మ...తెలుగు వాకిట పూచిన కొమ్మ. తెలుగు జాతికి-సంస్కృతికి తన ప్రతిభతో సరికొత్త వన్నెలద్ది భువి నుంచి అమరలోకానికి ఏగిన ఆ మహనీయునితో అన్నమయ్య సంకీర్తనల పుణ్యమాని చక్కటి అనుబంధం ఉంది. ఆ మహనీయుని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ...
-వెంకట్ గరికపాటి, తాళ్లపాక పద సాహిత్య విశ్లేషకుడు
ప్రపంచ సాహిత్య కళలకు లోటు
బాపు మృతి ప్రపంచ సాహిత్య, కళా, సినీ రంగాలకు తీరనిలోటు. నేను రాసిన దాలప్ప తీర్థం అనే పుస్తకానికి బొమ్మ వేయాలని కోరుతూ లేఖ రాస్తే రెండు రోజుల్లోనే ఆ బొమ్మ వేసి పంపించారు. సాహితీకారులను ప్రోత్సహించే మహా మనిషి లేడని నమ్మలేకపోతున్నా. ఆ మహనీయుని కుటుంబానికి ప్రగాడ సంతాపం తెలియజేస్తున్నా.
-డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు