
బాపు,రమణ ధనుస్సు బాణాలు
బాపు-రమణ ఒకరికొకరు... ఎలాగంటే, ధనుస్సు బాణంలాగా ఒకరి గెలుపు కోసం ఒకరు కృషి చేశారు. కష్ట సుఖాలు పంచుకుంటూ స్నేహానికే వన్నె తెచ్చారు.
‘‘బాపు-రమణ ఒకరికొకరు... ఎలాగంటే, ధనుస్సు బాణంలాగా ఒకరి గెలుపు కోసం ఒకరు కృషి చేశారు. కష్ట సుఖాలు పంచుకుంటూ స్నేహానికే వన్నె తెచ్చారు. చిత్రకారుడు, రచయితగా వృత్తిని స్వీకరించిన ఈ ఇద్దరు మిత్రులూ జీవితాంతం కలిసి నడిచారు. వీరిద్దరి కలయికతో సాక్షి చిత్రం తెరకెక్కింది. అయితే వీరిద్దరికీ బ్రేక్ ఇచ్చింది మాత్రం అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వచ్చిన బుద్ధిమంతుడు చిత్రమే.’’
చెన్నై, సాక్షి ప్రతినిధి:విభిన్న కళాకారులైన బాపు, రమణ ధనుస్సు బాణాలవలె ఒకరి గెలుపు కోసం ఒకరుగా నిలిచారని ప్రముఖ కథకులు, పాత్రికేయులు శ్రీరమణ (హైదరాబాద్) అభివర్ణించారు. తరతరాల తెలుగు కవిత ధారావాహిక 57వ ప్రసంగ కార్యక్రమాన్ని వేద విజ్ఞాన వేదిక, ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్తంగా ఆదివారం నిర్వహించారు. చెన్నై ఆస్కా హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో ‘బాపు రమణ సినిమాలు- సాహిత్యం’ అనే అంశంపై ఆయన ప్రసంగిస్తూ, ఒకరు చిత్రకారుడు, మరొకరు రచయిత ఎవరి అభిరుచులు వారివిగా ఉన్నా భిన్నత్వంలో ఏకత్వంలా జీవితాంతం కలిసి నడిచారన్నారు. గురజాడను అనుక్షణం తలచుకునే వారిద్దరూ కలిసి అద్భుతమైన పాత్ర లు సృష్టించారని చెప్పారు. రమణ సృష్టించిన పాత్రలే ఆయనను గుర్తుంచుకునేలా చేశాయన్నారు. ఫిలాసఫీతో సృష్టించిన అప్పారావు, బుడుగు పాత్రలు నేటికీ సజీవంగా నిలిచిపోయాయని చెప్పారు. తెలుగు సినిమా పరిశ్రమలో ముత్యాల ముగ్గు ఒక చరిత్రగా మిగిలడం బాపు-రమణల ప్రతిభకు తార్కాణమన్నారు. ఆరు దశాబ్దాల స్నేహంతో వారి సినిమాలు ఒక బ్రాండ్‌గా నిలిచిపోయాయని తెలిపారు.
సినిమా రివ్యూ జర్నలిస్టుగా నిర్మొహమాటంగా విమర్శలు రాసిన రమణను సినిమా పరి శ్రమ ఆహ్వానిస్తే తొలుత నిరాకరించారని చెప్పారు. ఎందుకంటే తనచేత విమర్శలకు గురైన వారు ప్రతీకారం తీర్చుకుంటారేమోనని వెనకడుగు వేశారన్నారు. ఒక యాడ్ ఏజన్సీలో ఆర్ట్ డెరైక్టర్ అరుున బాపు, రమణతో కలిసి సినిమా తీద్దామన్న నిర్ణయంతో సాక్షి చిత్రం వచ్చిందన్నారు. చిత్రకల్పన బ్యానర్‌పై అక్కినేని నాగేశ్వరరావు ద్విపాత్రాభినయంలో తీసిన బుద్దిమంతుడు సినిమాతో వారిద్దరికీ బ్రేక్ వచ్చిందని తెలిపారు. సంగీతం, రచనలపై వారిద్దరికీ ఉన్న పట్టు, చక్కటి సినిమా టీమ్, డబ్బులు ఎగవేయరు అనే మంచిపేరును పరిశ్రమలో సంపాదించుకున్నారని తెలిపారు.
60 ఏళ్లుగా సెలబ్రటీలుగా నిలిచారు, తుది శ్వాస వరకు అలాగే నిలిచారని అన్నారు. తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన జంట బాపూ-రమణ అన్నారు. కష్టసుఖాలు పంచుకుంటూ స్నేహానికి నిర్వచనంగా నిలిచారని అన్నారు. దివంగత బాపు సోదరుడు శంకరనారాయణ, కుమారుడు వెంకటరమణ, కుమార్తె భానుమతి, కోడలు భారతి ఈ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వక్త శ్రీరమణను ఆస్కా మాజీ అధ్యక్షుడు ఈఎస్ రెడ్డి చేతుల మీదుగా వేదవిజ్ఞాన వేదిక అధ్యక్ష కార్యదర్శులు జేకే రెడ్డి, కందనూరు మధు సత్కరించారు. నగరానికి చెందిన తెలుగు కుటుం బాల వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.