
బాపు–రమణ అంటే ఒకే మాట, ఒకే పాట, ఒకే ఆత్మ! ఆ చక్కని చిక్కని స్నేహంలో నుంచి బాపు గురించి ముళ్లపూడి వెంకటరమణ చెప్పిన కొన్ని ముచ్చట్లు ఆయన మాటల్లోనే...
వాళ్ల (బాపు) అమ్మగారికి పెద్ద మిస్టరీ అదే!
‘‘ఇరవై నాలుగు గంటలూ మీలో మీరు మాట్లాడుకోవడం బోర్ కొట్టదా? అసలు ఏం మాట్లాడుకుంటారు? మాట్లాడుకోవడానికి ఏం ఉంటాయి?’’ అని అడిగేవారు.
మాట్లాడుకోవడమే ఒక ఎంజాయ్‌మెంట్. సినిమాలు కూడా ఈ కబుర్ల ముందు దిగదుడుపే.
‘ఇది చదివాను’ ‘అది చదివాను’ ‘ ఆ సంగీతం బాగుంది’ ‘ఆ సినిమా బాగుంది’ ‘ఆ ఆర్టిస్ట్ ఏదో బాగా చేశాడు’ ‘ఈ జోక్ బాగుంది’....ఇలా అనంతంగా తెల్లవార్లూ నాలుగింటి వరకు చెప్పుకుంటూ ఉండేవాళ్లం.
అయిదో క్లాసు కలిసే చదువుకున్నాం. కలిసే ఆడుకున్నాం. ‘బాలానందం’ రేడియో వచ్చినప్పుడు రోజూ కలుసుకునేవాళ్లం. అప్పుడు నేను కథలు రాస్తూ ఉండేవాడిని. ఆయన బొమ్మలు వేస్తుండేవాడు. ‘‘వెధవల్లారా! ఈ కథలు, బొమ్మలు కూడు పెడతాయా? చదువుకోండి’’ అని తిట్టేవారు బాపు నాన్నగారు. అందువల్ల ఇంట్లో ఛాన్సు లేదు కాబట్టి రోడ్డు మీద దీపస్తంభం దగ్గర నిల్చొని నేను కథ చదివితే అది విని వెళ్లిపోయేవాడు బాపు. మరునాడు బొమ్మేసుకొస్తే ఆ దీపస్తంభం దగ్గరే చూసేవాడిని. అది పట్టుకొని నేను ఏదో ఒక పేపర్ ఆఫీస్‌కు వెళ్లి చూపించుకునేవాడిని. అయిదు రూపాయలు ఇచ్చేవారు. ఒకసారి విద్వాన్ విశ్వంగారు ‘ఇడ్లీ కన్నా పచ్చడి బావుంది’ అన్నారు!
∙∙
ఆరోజుల్లో ఒక అమ్మాయి ఉండేది. ఆమె కుచ్చిళ్లను రోడ్డుకీడ్చుకుంటూ నడుస్తుండేది. అదో అందం! ఆ అమ్మాయికి పెద్ద జడ ఉండేది. ఆ జడని చూస్తూ బొమ్మలు వేసేవాడు బాపు.
∙∙
మేము సరదాగా పోట్లాడుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ‘పెళ్లి పుస్తకం’ సినిమా టైమ్‌లో అయితే రెండు నెలలు మాట్లాడుకోలేదు. మాట్లాడుకోక పోయినా సరే, నేను డైలాగులు రాసేవాడిని, ఆయన తీసేవాడు. రిజల్ట్ ఏమిటంటే పదమూడు వేలు ఉండాల్సిన సినిమా ఇరవై వేలు షూటు చేయాల్సి వచ్చింది. ఇంకెప్పుడు పోట్లాడుకోవద్దని లెంపలేసుకున్నాం
‘నాదే తప్పు’ అని నేను, అతనిదే తప్పు అని అతను అనుకున్నాము.
నిజానికి రబ్బరుస్టాంప్‌లా ఉంటే లైఫే లేదు. అభిప్రాయ భేదాలు, కొట్లాట ఉంటేనే మజా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment