
కుక్క– ధర్మరాజుతో స్వర్గాన్ని, దేవదాసుతో దైన్యాన్ని సమానంగా పంచుకున్న ఈ జాతి విరోధాభాసకు చక్కటి ఉదాహరణ. కుక్కలు అరుచుకుంటాయి, అంతలోనే ఎంతకీ విడివడనంతగా కలుసుకుంటాయి. ప్రేమకి, విశ్వాసానికి మారుపేరుగా నిలుస్తాయి, అత్యంత నీచమైన తిట్టుగా వాడబడతాయి. వాటి గొడవలతో, అరుపులతో మిగతావాళ్లు పడే భయాన్ని పట్టించుకోనంత స్వార్థంతో ఉంటాయి. ఒక్కటీ అందిరాదని తెలిసినా, పుంజీడు పిల్లల్ని కని; తినీ తినకా, చచ్చీ చెడీ, నిస్వార్థంగా వాటిని పోషిస్తాయి.
‘నా బుజ్జి బొచ్చు కుక్కపిల్ల ఏం చేచ్చోంది లా’ అంది వందన అతని వతైన తల చెరిపేస్తూ,‘ఏయ్, ఏంటిది? లే, ఇది హాలు. కిటికీలోంచి కనబడతాం’ అన్నాడు మౌళి లాప్‌టాప్‌లో పనిచేసుకుంటూ.‘ఎదురింటివాళ్ళు లేరు లేరా. అయినా ‘చౌ చౌ’ బ్రీడ్ కుక్కపిల్లలా ఇంత జుట్టేంటిరా? నీ జుట్టు నాకుండి, హాయిగా నీకు బట్టతల వస్తే, తిరుపతి వచ్చి తలనీలాలు సమర్పించుకుంటానని మొక్కుకున్నా’ అంది వందన అతని ఒళ్ళో కూర్చుని, ఒతైన జుట్టుని వేలితో తిప్పుతూ.లాభం లేదని, లాప్‌టాప్ పక్కన పెట్టి, ‘అయితే తలుపేయ్, జుట్లు పీక్కుందాం’ అన్నాడతను కొంటెగా ఆమెని దగ్గరకి లాక్కుంటూ.‘నోర్మూసుకుని పని చూసుకో! ఇంత పిసరు చనువిస్తే చాలు, రెచ్చిపోతావ్. కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఏదో అప్పుడప్పుడూ ముద్దొస్తావు. అంతమాత్రాన బుద్ధిలేదూ?’ అంటూ అతని క్రాఫ్ సరిచేసి వంటింట్లోకి వెళ్ళిపోయింది వందన.అంతలో వందనకి ఫోన్ వచ్చింది.
‘ఆ వదినా చెప్పండి, అవునా వెరీ గుడ్. ఆ.. ఇదిగో మీ తమ్ముడు ఇక్కడే ఉన్నారు, ఫోన్ ఇస్తున్నాను మాట్లాడండి, అలాగే, మేము రేపు ఉదయమే బయల్దేరి వస్తాం’ అంటూ భర్తకేసి తిరిగి, ‘ఏమండీ, మీ అక్క ఫోన్, మీ మేనకోడలు హడావిడి చేసిందట, మాట్లాడండి’ అంటూ ఫోన్ మౌళికి ఇచ్చింది.ఆ రాత్రి. పాలమీగడలాంటి ఆమె వంటిపై పాము కుబుసంలాంటి నైటీ మెరిసిపోతోంది. విరబోసుకున్న కురుల్లో విరిసిన మల్లెలు కారుమబ్బుల్ని చీల్చుకొచ్చిన వెలుతురు చుక్కల్లా ఉన్నాయి.‘రేపు ఊరెళ్తే ఓ మూడురోజులు మళ్ళీ పస్తే. అయినా ఇంతందంగా ఉండే నీకు ఏంగర్ ఇష్యూస్ ఏంటిరా’ అన్నాడతను ఆమెకి చేరువౌతూ.‘అక్కడకి నువ్వేదో శాంతమూర్తివైనట్టు. అయినా సత్యభామ కోపం కూడా కృష్ణుడిపై ప్రేమలో భాగమే! సహిస్తేనే సౌఖ్యం, భరిస్తేనే భోగం’ అందామె కొంటెగా.
ఒక్క ప్రథమకోపం తప్పిస్తే, అతనికి ఎలా ఉంటే ఇష్టమో అలాగే ఉంటుంది వందన.అందుకే భర్తొదిలేసిన అక్కని, భార్యొదిలేసిన అన్నని, ఊళ్ళో అమ్మకొదిలేసి మరీ సిటీలో వందనకి వందనంగా ఉంటున్నాడు మౌళి.∙∙ ఆ మర్నాడు ఉదయమే కార్లో బయలుదేరి ఊరికి వెళ్లారు. పిల్లని చాప మీద కూర్చోపెట్టారు. నెమ్మదిగా పేరంటాళ్ళు రావటం మొదలుపెట్టారు.‘అక్కా అందరూ వచ్చారు కదా! ఇంకా దేనికి వెయిటింగ్?’ అడిగాడు మౌళి లోపలికి వస్తూ.‘అదే రా మీ ఆవిడ ఫోన్ పట్టుకుని మేడమీదకి వెళ్ళింది. అరగంటయింది, ఇంకా రాలేదు. తను లేకుండా మొదలుపెడితే ఏమనుకుంటుందో అని...’ అంటూ నసిగింది శ్యామల.
‘వాళ్ళ వాళ్ళతో ఫోన్ మాట్లాడిందంటే ఓ పట్టాన వదలదు. ఉండక్కా, నేనెళ్ళి తీసుకొస్తా’ అంటూ మేడెక్కాడు మౌళి. అటూ ఇటూ నడుస్తూ ఫోన్ మాట్లాడుతున్న వందనని కిందకి రమ్మని సైగ చేశాడు, అతన్ని ఆగమని, ఆమె ఫోన్లో మాట్లాడుతోంది. ‘హా అక్కా, వాళ్ళు పెళ్లి వైజాగ్‌లో చేయమంటున్నారు అంతేగా. నువ్వేం కంగారు పడకు. మీరు ఓకే అని చెప్పండి. నువ్వు, బావ, నీ కూతురు వచ్చేయండి. మొత్తం నేను చూసుకుంటా. అది నాకూ కూతురే. నేను దగ్గరుండి చేస్తా పెళ్లి. కల్యాణ మంటపం ఇప్పుడే బ్లాక్ చేస్తా’ అటూ ఇటూ తిరుగుతూ ఫోన్‌లో ఉత్సాహంగా మాట్లాడుతోంది వందన.
ఆ సంభాషణ విని మౌళికి చిరాకేసింది. అతనికి తోడల్లుడు అంటే పడదు. నక్కు నక్కుగా ఉండి అందర్నీ వాడుకుంటాడని. దానికి తోడు పెళ్లి హడావిడి అంతా వందన నెత్తి మీదేసుకుంటే ఇంక ఆమె తనకి కనీసం ఓ రెండు మూడు నెలలు దొరకదు.ఆమె ఎంతకీ ఫోన్ ఆపకపోవటంతో ‘హే, ఆపు నీ సోది. ఎప్పుడో ఆర్నెల్ల తర్వాత పెళ్ళి. సాయంత్రానికి మన ఊరెళ్ళిపోతాం, అప్పుడు మాట్లాడుకో. ఇప్పుడు ఫంక్షన్‌కి వచ్చాం కదా. అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు. రా కిందకి’ అన్నాడు విసుగ్గా. ఇంట్లో తనని ‘పెళ్ళాం కూచి’ అనుకోవటం మౌళికి తెలుసు.
అది తప్పని ప్రూవ్ చేసుకోవాలనుకోవడం కూడా అతనలా మాట్లాడ్డానికి ఓ కారణం.ఆ మాటలు అవతల ఫోన్లో ఉన్న వందన అక్కకి లీలగా వినబడ్డం వల్లనేమో,‘సరే వందనా, అత్తవారింట్లో బిజీగా ఉన్నట్టున్నావు, మళ్ళీ చేస్తాలే’ అని ఫోన్ పెట్టేసింది.అప్పటికే శ్యామల కూడా మేడమీదకి రావటంతో తమ్ముడు మరదల్ని విసుక్కోవటం చూసింది. ఆమె కళ్ళల్లో చిన్న సంతోషపు తెర వందన చూసింది. అంతే, భర్త చూపించిన విసుగు కంటే, అక్క విందన్న ఉక్రోషంతో, ఆడపడుచు ఉందన్న అవమానంతో, వందనకి కోపం నషాళానికి అంటింది.‘మా అక్క కూతురి పెళ్లంటే నా కూతురి పెళ్లిలాంటిది. శుభమా అని పెళ్లి మాటలు మాట్లాడుతూ ఉంటే సోది అంటావా? మాటలు మర్యాదగా రానీ’ అంది వందన విసురుగా కిందకి వెళుతూ.
అతనూ తగ్గలేదు. ‘చూడూ, మనమా వాళ్ళకంటే చిన్నవాళ్ళం. వాళ్ళు ఎత్తిపెట్టుకుని మనదగ్గరకి వచ్చేస్తే, అన్నీ మనమెక్కడ చూడగలం? పెళ్లి అనేది చాలా పెద్ద బాధ్యత. పైగా మీ బావకి కనీసం బండి తొక్కడం కూడా రాదు. ఎక్కడికైనా ఎత్తుకుని తీసుకెళ్ళాలి. ఏం? మీ అన్నయ్య కూడా వైజాగ్‌లోనే ఉంటున్నాడుగా! అతనితో మాట్లాడొచ్చుగా? మీ అక్క నీకే ఎందుకు చెబుతోంది. ఆ పిల్ల వాడికీ మేనకోడలే కదా?’అన్నాడు విసురుగా. అప్పటికే ఇద్దరూ కిందకి దిగారు. శ్యామల ముందే దిగిపోయింది.‘నోర్ముయ్. వాడూ, వీడు అంటున్నావేంటి రా’ వందన ఊగిపోతోంది కోపంతో.‘ఏయ్ మర్యాదగా మాట్లాడు’ అన్నాడు మౌళి. వాళ్లిద్దరూ చుట్టూ ఎవరున్నారో ఎప్పుడో మర్చిపోయారు. ఆ క్షణం వాళ్ళు వీధికుక్కల్ని తలపించారు.
‘నీకు మర్యాదిచ్చేదేంటిరా. నోటికొచ్చినట్టు మాట్లాడి సిగ్గులేకుండా రాత్రికి నా పక్కలోకే చేరతావురా కుక్కా’అంతే. మౌళి చుట్టూ చూశాడు. అప్పటికే అక్కడికి చేరిన పేరంటాళ్ళు ఉండాలన్న ఉత్సుకతకీ, ఉంటే గొడవ ఆపేస్తారేమో అనే అనుమానానికి మధ్యలో ఊగిసలాడుతున్నారు. చుట్టుపక్కల ఇళ్లవాళ్లు గంటగంటకీ గడియారంలో పక్షి బైటకొచ్చినట్టు అడపాదడపా తలుపు సందుల్లోంచి ఓసారి మొహం బైటపెట్టి మళ్ళీతలుపుచాటుకి వెళ్లిపోతున్నారు. పిల్లలు ఒకప్పుడు చిత్రలహరి చూడ్డానికొచ్చినట్టు కిటికీల దగ్గరకి చేరారు. మౌళి స్పృహలోకొచ్చాడు. అమాంతం తనని లోపలికి తీసుకెళ్ళిపొమ్మని భూదేవిని వేడుకున్నాడు. భూదేవి పలక్కపోవటంతో, ఏం చెయ్యాలో తెలీని ఉక్రోషంతో వందన మీదకి వెళ్ళాడు.‘ఆగక్కడ. నా ఒంటిమీద చెయ్యి పడిందో ఇంటిల్లిపాదినీ జైల్లో తోయిస్తాను’ ఊగిపోతూ వేలు చూపిస్తోంది వందన.అంతే. ఒళ్ళో కూర్చున్న ‘చివావా’ కుక్కపిల్ల వృషణాలు కరిచినట్టు వణికిపోయాడు మౌళి.
శ్యామల కారుతున్న చెమటని సైతం లెక్కచేయకుండా ఫ్యాన్ కూడా లేని కొట్టుగదిలోకి పరిగెత్తింది. అమ్మ వెనుకే ఉండి, చిమ్మిలి నలిగిందో లేదో, బెల్లం సరిపోయిందో లేదో ఆరారా రుచి చూస్తున్న విస్సుబాబు తల్లి వెనక్కి మరింతగా ఒదిగిపోయాడు.
అందరికన్నా ముందు తేరుకున్నది రామలక్షే్మ! గబ గబా చెయ్యి కడుక్కుని, కోడలికి గ్లాస్‌తో మంచినీళ్ళిచ్చి, పక్కనే ఉన్న స్టూల్ జరిపి, ‘ముందు నువ్వు కూర్చో తల్లీ, వాడొట్టి మూర్ఖుడు, నేను మందలిస్తా’ అంది.‘చూడండి మీ కొడుకు బుద్ధి. ఏం? నేను మీ అందరితో కలివిడిగానే ఉంటున్నాను కదా. సాయంత్రం ఫోన్ చేస్తే పొద్దున్నకల్లా పరిగెత్తుకుని రాలేదా. నా వాళ్ళు అనుకోబట్టే కదా. అదే నీ కొడుక్కి మాత్రం మా వాళ్లంటే ఎరుసు. ఎప్పుడూ వాళ్ళని చులకనగానే మాట్లాడతాడు’ అంది వందన రొప్పుతూ.
రామలక్ష్మి ఆమెని స్టూల్ మీద కూర్చోబెట్టి, మంచినీళ్లు తాగించి ఆమె పక్కనే కింద కూర్చుంది. మౌళిని బైటకి పొమ్మని హెచ్చరించింది. కాసేపాగి, వందన వణుకుతున్న గొంతుతో, ‘ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండను. వాడితో నేను వెళ్ళను. నా దగ్గర ఒక్క రూపాయి ఉంచడు నీ కొడుకు. బస్సెక్కి వెళ్ళిపోతా, నాక్కొంచెం డబ్బివ్వండి’ అంది.‘అమ్మా, నువ్వు మంచిదానివి. ఇంటికోడలు ఇలా కంటతడి పెట్టి వెళ్ళిపోతే ఆ చంటిదానికి మంచిది కాదు. ఈ ఒక్కపూట ఉండి సాయంత్రానికి వెళ్లిపోదురు. మీరిద్దరూ విడివిడిగా వెళితే వీధిలో పరువు పోతుంది. వాణ్ణి నేను మందలిస్తాను. నిన్ను ఒక్క మాట అనకుండా ఉండే పూచీ నాది’ అంటూ వందన కాళ్ళు పట్టుకున్నంత పని చేసింది రామలక్ష్మి.నెమ్మదిగా పేరంటం అయిందనిపించారు. మౌళి, వందన మాట్లాడుకోలేదు.
అతికష్టం మీద పిల్లతో ఫోటోకి మాత్రం నించున్నారు. ఆ రోజు సాయంత్రం. మౌళి కారు స్టార్ట్ చేశాడు. రామలక్ష్మి వందన చేతిలో రెండువేలు పెట్టి, ‘అమ్మా, వాడిమాటలేం పట్టించుకోకు. నా బిడ్డలాంటిదానివి. నీకు వాడితో ఎప్పుడు చికాకు అనిపించినా ఇక్కడకు వచ్చేయ్’ అంది.వందన అతని పక్క సీట్లో కూర్చోకుండా వెనక సీట్లో కూర్చుని డోర్ బలంగా వేసింది.ఆ శబ్దానికి రామలక్ష్మి గుండెలు అదిరాయి. కారు కీచు శబ్దం చేసుకుంటూ దుమ్ము రేగ్గొట్టి వెళ్ళింది. రామలక్ష్మి వీధి అరుగుమీద కూలబడింది.
రామలక్ష్మికి పదిహేనో ఏట పెళ్లయింది. పద్దెనిమిదికి ముగ్గురు పిల్లలు. భర్తని పిచ్చికుక్క కరవటంతో రేబిస్ వచ్చి ఆర్నెల్లు నరకయాతన పడి మరణించాడు. అతని ఉద్యోగం ఆమెకిచ్చారు. కుక్కపిల్లల్ని తల్లికుక్క పొదువుకుని కాపాడినట్టు పిల్లల్ని పెంచుకొచ్చింది. కూతురు శ్యామలకి చెమటెక్కువ. ‘ఓస్ అంతేనా’ అనుకునేంత కాదు.డాక్టర్‌కి చూపిస్తే ‘హైపర్ హైడ్రోసిస్’ అని చెప్పేంత. ‘బుల్ డాగ్’లా వాసన కొడుతోందనిపెళ్ళైన వారానికే ఓ పిల్లని కనడానికి సరిపడా ‘అనుభవం’ ఆమెకి వదిలేసి ‘పరియా’ బ్రీడ్‌వీధికుక్కలా పారిపోయాడు భర్త.
రామలక్ష్మి రెండో సంతానం విస్సుబాబు. అమ్మ కూచి. ‘మాస్టిఫ్’ బ్రీడ్ లా ఇంట్లో ఎక్కువ స్థలం ఆక్రమించడం తప్పిస్తే అతని వల్ల రామలక్ష్మికి మరే ఉపయోగం లేదు.పెళ్లయ్యే వరకు ఉద్యోగం ఉంది అనిపించాడు. అవగానే మానేశాడు. భార్య వేరు కాపురం పెట్టమంది. ‘అమ్మని, వదిలి ఎలా వెళ్తాం?’ అన్నాడు. ఎలా వెళ్లాలో ఆమె వెళ్లి చూపించింది. అప్పుడప్పుడూ స్వప్నస్ఖలనాలతో అతనికి భార్యలేని లోటు తెలియలేదు. వీళ్ళిద్దరినీ రామలకే‡్ష్మ పోషిస్తుంది.
పిల్లల చిన్నప్పుడు చిలక జోస్యం చెప్పించుకుంది రామలక్ష్మి. ‘పుంజు’లకి, ‘పెట్ట’కి కూడా పెళ్లి గండం ఉందని తెలిసింది. భయపడినట్టుగానే కూతురు, పెద్దకొడుకు పెళ్లిళ్లు పెటాకులైపోయాయి. రెండు డక్ అవుట్ల తర్వాత దిగే బాట్స్‌మెన్‌ని పెవిలియన్ నించి చూస్తున్న మేనేజర్‌లా రామలక్ష్మి దడదడలాడుతూ మూడోవాడైన మౌళికి పెళ్లి చేసింది. కొడుక్కి కోరికెక్కువ, కోడలికి కోపమెక్కువ. వాళ్ళు చిన్న మాట అనుకున్నా ఆమెకి కంగారెక్కువ. ఆ రోజు జరిగిన గొడవతో చిన్నప్పుడు జోస్యం చెప్పిన చిలక ఇప్పుడు ఆమె తల్లో రాబందులా తిరగసాగింది.
మౌళి, వందన, వాళ్ళింటికి చేరేటప్పటికి రాత్రయింది. ఇంత తిన్నామనిపించి, బెడ్‌రూమ్‌లో ‘ఇగో’ అనే పాముని చెరోవైపు పట్టుకుని సాగదీసి వీసెలకొద్దీ విషాన్ని చిమ్మిన తర్వాత ఏ అర్ధరాత్రికో అమృతం చిలికారు.మరి అదేరాత్రి రామలక్ష్మికి ఎలా గడిచింది? ‘కళ్ళు వాకిట నిలిపి చూసే పల్లెటూళ్ళో తల్లి ఏమని పలవరిస్తోందో’ అని ఆలోచించటానికి మౌళి మహాకవి కాదు.
ఆ మర్నాడు వాళ్లిద్దరూ పన్నెండు రోజులుండటానికి సరిపడా బట్టలూ, గట్రా తెచ్చుకుని మళ్ళీ కార్లో ఊరొచ్చారు. బతికుండగా బువ్వెట్టకపోయినా చితిలో చక్కెర పోశాడు. ఈ పదకొండు రోజులూ పాటించవలసిన నియమాలు చెబుతూ బ్రహ్మచర్యం కూడా పాటించాలని బ్రహ్మగారు మౌళిని చాటుకి పిలిచి చెప్పారు. తలైతే ఊపాడు కానీ, అందరికీ కనబడే భూశయనం, ఏకభుక్తం వరకే పాటించగలిగాడు. మధ్యలో ఓ రోజు రాత్రి వందన అతన్ని ఓదార్చడానికి దగ్గరకి తీసుకున్నప్పుడు పాలమీగడ, పాముకుబుసం మళ్ళీ తెరమీదకొచ్చాయి.
‘చౌ చౌ’ బ్రీడు, ‘చివావా’ బ్రీడూ కలిసి ఆ రాత్రి చిత్తకార్తెని తలపించాయి. అది చూసి (?) రామలక్ష్మి అస్సలు బాధపడలేదు. పైగా వాళ్లిద్దరూ కలిసున్నందుకు ఎంతో సంతోషించడంచేత, ఆమెకి ప్రేతత్వ విముక్తి కలిగి, హాయిగా యమదూతల ఎస్కార్ట్‌లో వెళ్ళిపోయింది.
మునిసిపాలిటీ వాళ్ళు వలతో వస్తే, వయసులో ఉన్న కుక్కలన్నీ తలో రకంగా తప్పించుకోగా, ఎటూ కదల్లేక దొరికిపోయి, ఆ కుక్కలబండిలో బిక్కు బిక్కు మంటూ, కంటనీరు కారుస్తూ, చావుకెదురు చూస్తూ, ఒంటరిగా మిగిలిపోయిన వీధి కుక్కలా గొడవ జరిగిన రోజు రాత్రంతా గడిపిన రామలక్ష్మి దుఃఖం ఎవరికి పట్టాలి? బతికుండగా నరకం చూపించి, చచ్చాక ‘పున్నామనరకం’ తప్పించే ‘కొడుకు’ విరోధాభాసకు మరో ఉదాహరణ.
Comments
Please login to add a commentAdd a comment