అవుట్‌డోర్ ‘సాక్షి’గా...
బాపు తీసిన తొలి బొమ్మ
బొమ్మలతో సున్నితమైన హావభావాలను పలికింపజేయడమే కాదు, ఒక రచయిత పుంఖాను పుంఖాలుగా రాసే కథలోని ఆంతర్యం మొత్తాన్ని ఒక్క బొమ్మతో చెప్పేసే బాపు... రెండున్నర గంటల కథను తెరపై రక్తికట్టించలేడా? కచ్చితంగా రక్తికట్టించగలడు. బాపుపై ముళ్లపూడి వెంకటరమణకి ఉన్న ఆపారమైన నమ్మకం అది. ఆ నమ్మకమే ‘సాక్షి’ నిర్మాణానికి కారణమైంది. బాపుకి కేరీ కూపర్ నటించిన ‘హై నూన్’ సినిమా అంటే ఇష్టం. రెండున్నర గంటల్లో జరిగే కథ అది. తన సినిమాను అలాగే చేద్దామనుకున్నారు బాపు. అందుకు తగ్గట్టే ముళ్లపూడి ‘సాక్షి’ స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ స్క్రిప్టులో పాటలుండవ్. అప్పటికే నవయుగ పంపిణీదారులు కొన్ని సినిమాల వల్ల నష్టపోయి ఉన్నారు.
వారి వద్దకెళ్లి ‘సాక్షి’ కథ వినిపించారు ముళ్లపూడి. ‘మూగమనసులు’ రచయితగా ముళ్లపూడి అంటే నవయుగావారికి వల్లమాలిన ప్రేమ. ‘మీరు కొత్తవారితో సినిమా చేద్దామంటున్నారు. సంతోషం. సినిమా అంతా అవుట్‌డ్డోర్‌లోనే అంటున్నారు. ఇంకా సంతోషం. కానీ... పాటల్లేకుండా సినిమా అంటున్నారు. అది మాత్రం బాలేదు. మన ప్రేక్షకులకు పాటలు చాలా ముఖ్యం’ అని ముళ్లపూడికి నచ్చజెప్పారు. పంపిణీదారుల సహకారం లేకుండా సినిమా పూర్తి చేయలేం కాబట్టి... పాటలు, నృత్యాలు... ఇలా అన్నీ కలిసొచ్చేట్లుగా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేశారు ముళ్లపూడి. దాంతో నవయుగ వారి భరోసా లభించింది. ి
సనిమా సెట్స్‌కి వెళ్లింది. షూటింగ్‌కి వారం రోజుల ముందు ఆదుర్తి దగ్గర సహాయదర్శకుడైన కబీర్‌దాస్... బాపుని కూర్చోబెట్టి, లాంగ్ షాట్స్, మిడ్‌లాంగ్ షాట్స్, క్లోజ్ షాట్స్, సజషన్ షాట్స్ ఇవన్నీ... ఎలా తీయాలో సూచించారు. ‘అమ్మ కడుపు చల్లగా’ పాటతో చిత్రీకరణ స్టార్ట్. సాయంత్రానికలా పాటను పూర్తి చేసేశారు బాపు. ఆయన షాట్స్ పెట్టిన తీరు చూసి కెమెరామేన్ సెల్వరాజ్ విస్తుపోయారు. భవిష్యత్‌లో బాపు దేశం గర్వించదగ్గ దర్శకుడు అవుతాడని జోస్యం చెప్పారు. ఇక ‘సాక్షి’ కథ విషయానికొస్తే... హంతకుడు చంపుతాడేమోనని ప్రాణభయంతో వణికిపోతున్న కథానాయకుడికి హంతుకుని చెల్లెలైన కథానాయికే భరోసా ఇస్తుంది. హీరోని పెళ్లాడుతుంది.
తర్వాత ఏం జరిగిందనేది కథ. సినిమా ఆద్యంతం కోనసీమలోని పులిదిండి అనే గ్రామంలో తీశారు బాపు. కృష్ణకు ఇది రెండో సినిమా. విజయనిర్మల కూడా ‘రంగులరాట్నం’ తర్వాత నటించిన సినిమా ఇదే. విజయలలిత, సాక్షి రంగారావు, కనకదుర్గ, జగ్గారావులకు ఇదే తొలి సినిమా. కేవలం రెండున్నర లక్షల్లోనే సినిమాను పూర్తి చేశారు బాపు. సినిమా కూడా మంచి లాభాలే వచ్చాయి. అవార్డులను కూడా కైవసం చేసుకుంది.