first movie
-
తెలుగు సినిమాల్లో సరిగ్గా 91 ఏళ్ల కిందట..
తొలి పూర్తి తెలుగు టాకీ సినిమా ‘భక్త ప్రహ్లాద’ విడుదలై నేటికి సరిగ్గా 91 ఏళ్లు నిండాయి. ఇది తెలుగు సినిమా పరిశ్రమలో ఒక చరిత్రాత్మక సంఘటన. అంతకు ముందు సగం తెలుగు, సగం తమిళంతో 1931 అక్టోబర్ 31న తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్’ వచ్చింది. ఆ పైన పూర్తిగా తెలుగు మాటలు, పాటలతో ‘భక్త ప్రహ్లాద’ 1932 ఫిబ్రవరి 6న విడుదలై సంచలనం సృష్టించింది. అందుకే ఫిబ్రవరి 6న మొదటి పూర్తి తెలుగు టాకీ ఆవిర్భావ సంబరాలు జరుపుకొంటారు. గతంలో ఈ సినిమా సెప్టెంబరు 15న విడుదల అయినట్టు ప్రచారం జరిగింది. కాని సీనియర్ జర్నలిస్టు డా‘‘ రెంటాల జయదేవ ఎన్నో యేళ్ళు ఊరూరా తిరిగి, ఎంతో పరిశోధించి, సాక్ష్యాలు సేకరించి, ఈ సినిమా 1932 జనవరి 21న బొంబాయిలో సెన్సారై, ఫిబ్రవరి 6న అక్కడే తొలిసారి విడుదలై నట్లు ఆధారాలతో నిరూపించారు. ఆ విధంగా 1932 ఫిబ్రవరి 6న బొంబాయి శ్రీకృష్ణా సినిమా ధియేటర్లో విడుదలైన తర్వాత, విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్ళి, విజయవంతంగా ఆడింది. 1932 ఏప్రిల్ 2న మద్రాసులోని ‘నేషనల్ పిక్చర్ ప్యాలస్’లో విడుదల చేశారు. ఈ చిత్ర దర్శకుడు హెచ్ఎమ్ రెడ్డి. సురభి కళాకారులు సహా పలువురిని బొంబాయి తీసుకెళ్ళి అక్కడ స్టూడియోలో 20 రోజుల్లో షూటింగ్ పూర్తిచేశారు. ఆ రోజుల్లో.. చిత్ర నిర్మాణా నికి సుమారు రూ. 20 వేలు ఖర్చయింది. ఈ సినిమా సహజంగానే అనేక రికార్డులు నమోదు చేసుకుంది. ఇందులో లీలావతిగా నటించిన ‘సురభి’ కమలాబాయి తొలి తెలుగు తెర ‘కథా నాయిక’. ఈ చిత్ర నిర్మాణానికి ప్రధాన కారకులు పూర్ణా మంగరాజు. ఆంధ్రాలో తొలి సినీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ‘క్వాలిటీ పిక్చర్స్’ వ్యవస్థాపకుడు. ఈ చిత్ర గీత రచయిత ‘చందాల కేశవదాసు’. ఆ విధంగా తొలి పూర్తి తెలుగు సినిమా తయారై సంచలనం సృష్టించింది. దురదృష్టవశాత్తూ ఈ ఫిల్మ్ ప్రింట్ ఇప్పుడు లభ్యం కావడం లేదు. నిజానికి, టాకీలు రావడానికి చాలాకాలం ముందే మూకీల కాలం నుంచి మన సినీ పితామహులు రఘుపతి వెంకయ్య నాయుడు వంటివారెందరో మన గడ్డపై సినిమా నిలదొక్కు కొని, అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేశారు. అప్పట్లోనే తన కుమారుడు ప్రకాశ్‌ని విదేశాలకు పంపి ప్రత్యేక సాంకేతిక శిక్షణనిప్పించి, సినిమాలు తీసి తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేశారు వెంకయ్య. ఇలాంటి వారి గురించి ముందు తరాల వారికి తెలియజేసే కార్యక్రమాలను సినిమా పెద్దలు, ఫిల్మ్ ఛాంబర్ లాంటి సంస్థలు, పాలకులు నిర్వహించాలి. తెలుగు సినిమా ఆవిర్భావ దినాన్ని ఒక ఉత్సవంగా నిర్వహించి... భావి తరాలకు తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన విషయాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే పాత చిత్రాలు అన్నీ సేకరించి ఒక సినీ మ్యూజియం ఏర్పాటు చేయాలి. ఇటువంటిది దేశంలో పుణేలో ఉంది. ప్రపంచ ఉత్తమ చిత్రాలు ప్రదర్శిస్తున్న వైజాగ్ ఫిలిం సొసైటీ ‘తెలుగు టాకీ సినిమా ఆవిర్భావ దినోత్సవం’ సందర్భంగా ఫిబ్రవరి 6 నుండి 8 వరకు క్లాసిక్ చిత్రాలు ప్రదర్శిస్తోంది. ఉచిత ఫిల్మ్ వర్క్‌షాప్ నిర్వహిస్తోంది. (‘భక్త ప్రహ్లాద’ విడుదలై నేటికి 91 ఏళ్లు) ::: నరవ ప్రకాశరావు; గౌరవ కార్యదర్శి, వైజాగ్ ఫిలిం సొసైటీ -
ఈ చిచ్చర పిడుగే ఇప్పుడు నట నాయకుడు
మహానటుడనే ట్యాగ్ లైన్‌కు ఏమాత్రం తీసిపోని వ్యక్తి ఈయన. ఆయన నటనే కాదు.. డ్యాన్స్‌లు, ఫైట్లు ప్రతీదాంట్లోనూ ఓ వైవిధ్యమే కనిపిస్తుంటుంది. ప్రయోగాలంటే ఇష్టపడే ఆయన్ను అభిమానులు ముద్దుగా పిల్చుకునే పేరు ‘ఉళగ నాయగన్’. పేరుకే ఆయన తమిళ నటుడు. కానీ, స్ట్రెయిట్-డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ఆడియెన్స్‌కు ‘లోకనాయకుడి’గా సుపరిచితుడు. కమల్ హాసన్.. సౌత్ సినీ పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక పేరు. సరిగ్గా 62 ఏళ్ల క్రితం నటుడిగా ఆయన సినీ ప్రస్థానం మొదలైంది ఇవాళే. కమల్ హాసన్.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన తొలి చిత్రం ‘కళథూర్ కణ్ణమ్మ’. కేవలం నాలుగేళ్ల వయసుకే ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నాడు కమల్. (సినిమా రిలీజ్ అయ్యింది మాత్రం 1960లో..) ఇందులో యుక్తవయసులో ఓ జంట చేసిన తప్పు.. దానికి ఫలితంగా తల్లిదండ్రులు ఎవరో తెలియకుండా అనాథగా క్షోభను అనుభవిస్తూ.. చివరికి తండ్రి-తల్లి పంచన చేరి ఆప్యాయతను పొందే చిన్నారిగా కమల్ నటన ఆకట్టుకుంది. అంత చిన్నవయసులో ‘సెల్వం’ క్యారెక్టర్లో అంతేసి భావోద్వేగాలను పండించడం ఆడియొన్స్నే కాదు.. ఆ సినిమా లీడ్ ద్వయం జెమినీ గణేశన్-సావిత్రిలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది కూడా. అలా చైల్డ్ ఆర్టిస్ట్‌గా తొలి చిత్రం కళథూర్ కణ్ణమ్మ ఆరేళ్ల వయసుకే ఏకంగా రాష్ట్రపతి గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టింది బుల్లి కమల్‌కు. నటనకు బీజం కమల్ అసలు పేరు పార్థసారథి. చిన్నవయసులో బాగా చురుకుగా ఉండే పార్థూ.. తండ్రి శ్రీనివాసన్ అయ్యంగార్ ప్రొత్సాహంతో కళల పట్ల ఆసక్తికనబరిచాడు. కమల్ తల్లి సరస్వతికి దగ్గరి స్నేహితురాలు ఒకామె ఫిజీషియన్‌గా పని చేస్తుండేది. ఒకరోజు పార్థూను తన వెంటపెట్టుకుని డ్యూటీకి వెళ్లిందామె. ఏవీఎం(ఏవీ మెయ్యప్పన్) ఇంటికి ఆయన భార్య ట్రీట్మెంట్ కోసం వెళ్లగా.. ఏవీఎం తనయుడు శరవణన్ పార్థూను చూసి ముచ్చటపడ్డాడు. పార్థూ చలాకీతనం శరవణన్‌ను బాగా ఆకట్టుకుంది. అదే టైంలో ఏవీఎం బ్యానర్లో దర్శకుడు బీష్మ్సింగ్ ఓ ఎమోషనల్ కథను తీసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో కొడుకు క్యారెక్టర్ కోసం పార్థూను రికమండ్ చేశాడు శరవణన్. అలా నాలుగేళ్లకు పార్థూ అలియాస్ కమల్ హాసన్ నటనలో అడుగుపెట్టాడు. జెమినీ గణేశన్-సావిత్రి జంటగా తెరకెక్కిన కళథూర్ కణ్ణమ్మ కొన్ని కారణాలతో ఆలస్యంగా 1960, ఆగష్టు 12న రిలీజ్ అయ్యింది. అయితేనేం సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. హిందీలో సునీల్‌దత్-మీనాకుమారి జంటగా ‘మై చుప్ రహూంగీ’, సింహళంలో ‘మంగళిక’ తెలుగులో నాగేశ్వర రావు-జమున జంటగా ‘మూగ నోము’ పేరుతో రీమేక్ అయ్యి అంతటా హిట్ టాక్ తెచ్చుకుంది. కళథూర్ కణ్ణమ్మ తర్వాత మరో నాలుగు తమిళం, ఒక మలయాళం సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు కమల్. ఆ తర్వాత ఏడేళ్లపాటు కెమెరాకు వెనకాల మేకప్ ఆర్టిస్ట్, డ్యాన్స్ మాస్టర్‌గా పని చేశాడు. అటుపై చిన్నాచితకా పాత్రల్లో కనిపించి.. 1974లో మలయాళ చిత్రం ‘కన్యాకుమారి’తో హీరోగా మారాడు. అలా ‘కళథూర్ కణ్ణమ్మ’ ఒక అద్భుతమైన నటుడిని భారతీయ సినీ పరిశ్రమకు పరిచయం చేసింది. అందుకే #62YearsOfKamalism ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. Keep inspiring us sir 🙏#62YearsOfKamalism pic.twitter.com/Sr4PH6vNZd — Lokesh Kanagaraj (@Dir_Lokesh) August 11, 2021 -సాక్షి, వెబ్‌డెస్క్ -
హీరో అఖిల్... నిర్మాత నితిన్!
కొంత కాలంగా వార్తల్లో ప్రథమాంశంగా నిలుస్తోన్న అఖిల్ అక్కినేని సినీ అరంగేట్రం జరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ముహూర్తపు దృశ్యానికి నాగచైతన్య కెమెరా స్విచాన్ చేయగా, అమల క్లాప్ ఇచ్చారు. నాగార్జున గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి హీరో నితిన్ నిర్మాత కావడం విశేషం. నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి మొదటి వారంలో మొదలు కానుంది. నితిన్ మాట్లాడుతూ -‘‘అఖిల్ సరసన నటించే కొత్త హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నాం. ‘దిల్’తో నా కెరీర్‌ని మలుపు తిప్పిన వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించే అద్భుతమైన సినిమాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తాం’’ అని చెప్పారు. సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ -‘‘ఈ సినిమా ముహూర్తం షాట్ తీసినట్లు అఖిల్, నితిన్‌లు ట్విట్టర్లో పెట్టగానే ఒక గంటలో రెండు లక్షల క్లిక్స్ వచ్చాయంటే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతోంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, కెమెరా: అమోల్ రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు. -
అవుట్డోర్ ‘సాక్షి’గా...
బాపు తీసిన తొలి బొమ్మ బొమ్మలతో సున్నితమైన హావభావాలను పలికింపజేయడమే కాదు, ఒక రచయిత పుంఖాను పుంఖాలుగా రాసే కథలోని ఆంతర్యం మొత్తాన్ని ఒక్క బొమ్మతో చెప్పేసే బాపు... రెండున్నర గంటల కథను తెరపై రక్తికట్టించలేడా? కచ్చితంగా రక్తికట్టించగలడు. బాపుపై ముళ్లపూడి వెంకటరమణకి ఉన్న ఆపారమైన నమ్మకం అది. ఆ నమ్మకమే ‘సాక్షి’ నిర్మాణానికి కారణమైంది. బాపుకి కేరీ కూపర్ నటించిన ‘హై నూన్’ సినిమా అంటే ఇష్టం. రెండున్నర గంటల్లో జరిగే కథ అది. తన సినిమాను అలాగే చేద్దామనుకున్నారు బాపు. అందుకు తగ్గట్టే ముళ్లపూడి ‘సాక్షి’ స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ స్క్రిప్టులో పాటలుండవ్. అప్పటికే నవయుగ పంపిణీదారులు కొన్ని సినిమాల వల్ల నష్టపోయి ఉన్నారు. వారి వద్దకెళ్లి ‘సాక్షి’ కథ వినిపించారు ముళ్లపూడి. ‘మూగమనసులు’ రచయితగా ముళ్లపూడి అంటే నవయుగావారికి వల్లమాలిన ప్రేమ. ‘మీరు కొత్తవారితో సినిమా చేద్దామంటున్నారు. సంతోషం. సినిమా అంతా అవుట్డ్డోర్లోనే అంటున్నారు. ఇంకా సంతోషం. కానీ... పాటల్లేకుండా సినిమా అంటున్నారు. అది మాత్రం బాలేదు. మన ప్రేక్షకులకు పాటలు చాలా ముఖ్యం’ అని ముళ్లపూడికి నచ్చజెప్పారు. పంపిణీదారుల సహకారం లేకుండా సినిమా పూర్తి చేయలేం కాబట్టి... పాటలు, నృత్యాలు... ఇలా అన్నీ కలిసొచ్చేట్లుగా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేశారు ముళ్లపూడి. దాంతో నవయుగ వారి భరోసా లభించింది. ి సనిమా సెట్స్‌కి వెళ్లింది. షూటింగ్‌కి వారం రోజుల ముందు ఆదుర్తి దగ్గర సహాయదర్శకుడైన కబీర్దాస్... బాపుని కూర్చోబెట్టి, లాంగ్ షాట్స్, మిడ్లాంగ్ షాట్స్, క్లోజ్ షాట్స్, సజషన్ షాట్స్ ఇవన్నీ... ఎలా తీయాలో సూచించారు. ‘అమ్మ కడుపు చల్లగా’ పాటతో చిత్రీకరణ స్టార్ట్. సాయంత్రానికలా పాటను పూర్తి చేసేశారు బాపు. ఆయన షాట్స్ పెట్టిన తీరు చూసి కెమెరామేన్ సెల్వరాజ్ విస్తుపోయారు. భవిష్యత్‌లో బాపు దేశం గర్వించదగ్గ దర్శకుడు అవుతాడని జోస్యం చెప్పారు. ఇక ‘సాక్షి’ కథ విషయానికొస్తే... హంతకుడు చంపుతాడేమోనని ప్రాణభయంతో వణికిపోతున్న కథానాయకుడికి హంతుకుని చెల్లెలైన కథానాయికే భరోసా ఇస్తుంది. హీరోని పెళ్లాడుతుంది. తర్వాత ఏం జరిగిందనేది కథ. సినిమా ఆద్యంతం కోనసీమలోని పులిదిండి అనే గ్రామంలో తీశారు బాపు. కృష్ణకు ఇది రెండో సినిమా. విజయనిర్మల కూడా ‘రంగులరాట్నం’ తర్వాత నటించిన సినిమా ఇదే. విజయలలిత, సాక్షి రంగారావు, కనకదుర్గ, జగ్గారావులకు ఇదే తొలి సినిమా. కేవలం రెండున్నర లక్షల్లోనే సినిమాను పూర్తి చేశారు బాపు. సినిమా కూడా మంచి లాభాలే వచ్చాయి. అవార్డులను కూడా కైవసం చేసుకుంది. -
'తొలి ప్రేమ కథ'కు 25 మంది డబ్బులు పెట్టారు
తాను తొలిసారిగా మెగాఫోన్ పట్టకుని దర్శకత్వం వహించిన సినిమా 'తొలి ప్రేమకథ'కు 25 మంది స్నేహితులు కలిసి డబ్బులు పెట్టారని ఆ చిత్ర దర్శకుడు వసంత్ దయాకర్ చెప్పారు. 'ఈ సినిమా పూర్తి చేయడానికి నాకు 25 మంది స్నేహితులు సాయం చేశారు. వాళ్లందరికీ నేను ఎంతగానో రుణపడి ఉంటాను. వాళ్లే లేకపోతే నా సినిమా ఇంకా స్క్రిప్టు దశలోనే ఉండిపోయేది. చిన్న బడ్జెట్లో రూపొందించిన వినోదాత్మక ప్రేమకథా చిత్రమిది' అని ఆయన అన్నారు. నందమూరి బాలకృష్ణ నటించిన భారీ చిత్రం 'లెజెండ్' విడుదలవుతున్న శుక్రవారమే ఈ చిన్న సినిమా కూడా తెరమీదకు రానుంది. తమకు మరో వారం దొరుకుతుందో లేదోనని ఈ వారమే విడుదల చేస్తున్నామని, ఆ తర్వాత ప్రతి వారం దాదాపు నాలుగు నుంచి ఐదు సినిమాల వరకు విడుదల అవుతున్నాయని దయాకర్ తెలిపారు. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టం అయిపోతోందని, అందుకే లెజెండ్‌తో పాటే తమ సినిమా కూడా విడుదల చేస్తున్నామన్నారు. వీలైనన్ని ఎక్కువ చిన్న థియేటర్లు తీసుకుని, అన్నిచోట్లా విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ సినిమాలో సిద్ధు, అనిల్, నిఖిత, కనికా తివారీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.