బాపు! ఈ పేరు చందమామ పుస్తకాన్ని గుండెలకు అదుముకుని చదువు తున్నప్పుడు విన్న పేరు. అసలుపేరు తెలియని చిన్నతనం. ఈలోగా ‘బుడు గ్గాడు’ ఎక్కడినుంచో ఊడిపడ్డాడు ‘హాచ్చరంగా’. ఇక ఏ పిల్లని చూసినా సీగాన పెసూనాంబే! బుడుగు బొమ్మ చూసి పెద్ద ఇన్‌స్పిరేషనొచ్చి మా నాన్న నాక్కూడా బద్దెల నిక్కరు కుట్టించాడు. ముత్యాల కోవలా ‘ఉండాల్రోయ్ చేతిరాత’ అని మాష్టారంటే– ఛత్ ఏం బావుంటుందని, అప్పుడే పత్రికల్లో అలవోకగా కనబడుతున్న బాపు రాత చూసి స్కూల్లో పోజుకొట్టడానికి ప్రాక్టీసు చేయడం మొదలెట్టాను.
అలా నా చిన్న జీవితంలోకి, బుల్లి బుర్రల్లోకి దూరిపోయాడు బాపు. ఆ రోజుల్లో మరో జతగాడు, రాతగాడు రమణ, బాపుల సినిమా ‘బాలరాజు కథ’ వెండితెరమీదకొచ్చింది. మహాబలిపురం పాటని పాడుతూ మాస్టర్ ప్రభాకర్‌లా యాక్షన్ చేసే కుర్రాళ్ళు ఎక్కడ చూసినా. అందులో మనం కూడా! ఆ చిత్రంతో మనసులో ‘సినిమా కథల చిత్రాల బాపు’ తిష్టవేశాడు. అప్పటికే సాక్షి నామ సంవత్సరం వచ్చిందట నా బందుల నిక్కరు గుడ్డ ‘కుంచెం’గా ఉన్నప్పుడు. మరోటేమో ‘బుడ్డిమంతుడు’ అని మత్తుగా చెప్పాడు, కేసులు కేసులు తాగే మా ఏలేటిపాడు చెన్నకేశు మావయ్య.
కాస్త వయసొచ్చాకా మనకేసి చూసీచూడక పెద్దజడతో విసురుగా కదిలే ఏ పిల్లని చూసినా బాపూ బొమ్మే అనిపించేసి, గుండె కోసేసేవు కదయ్యా ‘కుంచె కొడవలితో’ అని లబలబ లాడేవాళ్ళం. కొందరైతే బాçపూ బొమ్మలాంటి అమ్మాయినే పెళ్ళాడాలని ఒట్టేసుకుని బజ్జుంటే, ఆనక కలలో కనబడి ఫక్కున నవ్వి మాయమై పోయేవారు. పక్కింటి పిన్నిగారి ‘వణికిన చిన్న గీతలాంటి’ తలుపుచాటునున్న మొగుడుని చూసినప్పుడల్లా హమ్మ! ఎలా గీశావు తెలుగు మొగుడి నుదుటి రాత అనిపించేదంటే నమ్మండి. సరసొత్తోడండి!
గుండెల్లో రమణీయ రాముణ్ణి, తెరమీద సీతారావుణ్ణి రంగుల చిత్ర కల్పన చేయడం ఆయనకే చెల్లు, అది తెలుగువారి ఆనందపు ‘హరివిల్లు’. ‘తీతా’ అని రమణ అంటే, ‘సీత’ని బాపు కంటే... ఇద్దరూ చూసింది రాముణ్ణే! ఒకరు అందాల జనతా రాముడైతే, మరొకరు జనరంజక మనోభిరాముడని తెలుసుకోడానికి కాలేజి క్లాసులెగ్గొట్టి చూసొచ్చాం. నేడు పోయి రేపు రమ్ము అనగానే జనం అచ్చం మన రాములోరు ఇలాగే మాట్లాడతారంట అని గుండెల్లో దాచుకున్న రామబంటులయ్యారు, సంపూర్ణ రామాయణం చూసిన భక్తితో. ఇదిలా ఉండగా ‘అలో వలో’మనే కాంట్రాక్టరు లాంటి పంచెకట్టు గోదారి జిల్లా ‘ఇలనిజాన్ని’ నిజమనిపించేశారు ఇద్దరు సావాసగాళ్ళు. తెలుగోళ్ళు ‘ఓలు’ మొత్తం చూసి తెలుగుదనం అంటే ఇదేరా బాబు అని ఎగిరిగంతేశారు. సీతాకల్యాణంలో సీత (జయప్రద) కళ్లు, రాముడి అందం చూసిన లండన్, చికాగో, బెర్లిన్, డెన్వర్ ప్రేక్షకులు మైమరిచిపోయారు. గంగావతరణాన్ని చూసి ఆనందపు గంగలో మనకన్నా కాస్త ఎక్కువగా తానమాడారు.
శ్యామసుందరులందరికీ ధైర్యమనే ‘గోరంతదీపం’ వెలిగించి, రంగులద్దేవాడికి నలుపైనా, తెలుపైనా ఒకటే ప్రేమ అంటావు కదయ్యా బాపు! కొత్తగా పెళ్ళయిన వాళ్ళకి ‘పెళ్లి పుస్తకాన్ని’ బహుమతిగా ఇచ్చావు. అవసరమైతే సంసారాన్ని ‘మిష్టర్ పెళ్లాం’లా సరిదిద్దుకోవాలని చెప్పావు. తెలుగు వాకిళ్ళముందు ముగ్గు, గోదారి, గూటి పడవ, రాములోరు, విశాలమైన కళ్ళతో ఆరణాల తెలుగు ఆడపిల్ల, మధుపర్కాలు, ఏవి కనబడ్డా నువ్వే గుర్తొస్తావు. మా అదృష్టం కొద్దీ ఇక్కడ పుట్టావయ్యా. నీ గీతల్లో దేవుళ్ళందరిని చూసి రోజూ పొద్దున్నే దణ్ణం పెట్టుకునే మహద్భాగ్యాన్ని మా నుదుట గీసిన గీతాచార్యుడివి నువ్వేనయ్యా సత్తెపెమాణకంగా సత్తిరాజు లక్ష్మీ నారాయణా!
(నేడు బాపు జయంతి సందర్భంగా)
- చాగంటి ప్రసాద్
మొబైల్ : 90002 06163
Comments
Please login to add a commentAdd a comment