
నాకప్పుడు ఎనిమిదేళ్ళు. వేసవికని బెంగు ళూరులో ఉన్నాము. అక్కడి ‘మినర్వా’ సినిమా హాలులో హీరోయిన్ కృష్ణవేణి నటించిన ‘గొల్లభామ’ (1947) సినిమా చూశాను. ఒకటికి రెండు మార్లు! నాకు చిన్నతనం నుంచి గ్రామఫోన్ రికార్డులు వినడం అలవాటు. సినిమా చూడటానికి ముందే ఆ సినిమా రికార్డులు యింట్లో ఉన్నాయి. అందులో పాటలే కాక –– కె. రఘురామయ్యతో యుగళగీతం ‘చందమామ...’, కృష్ణవేణి సోలో ‘ఉన్నావా? లేవా...’–– ఒక పద్యం, సినిమాలోని పతాక సన్నివేశం లోనిది ‘భూపతి జంపితిన్’ ఉంది.
అంతవరకు సినిమా పాటలే నా బుర్రకెక్కాయి. ఇదే మొదటి పద్యం. ఆ రాగ మాధుర్యం, నేపథ్య సంగీతం ఒరవడి అర్థమై కాదు... ఆ సులభమైన మాటలు, ఆ సన్నివేశానికి తగినట్లుగా బోధపడటం వలన!
1947 మద్రాసులో మేము కొన్న యిల్లు ఉండేది పైక్రాఫ్ట్స్ గార్డెన్స్‌లో! ఆ వీధి చివరి యిల్లే కృష్ణవేణిది. ఆమె అమెరికా నుంచి దిగుమతి అయిన ఖరీదైన రెండు రంగుల ఇంపోర్టెడ్ కాడిలాక్ కారులో తిరిగేది. ఆమె భర్త మీర్జాపురం రాజా వారు చిన్న మోరీస్ మైనర్ కారులో వచ్చేవారు. అప్పట్లో సినీ రంగంలో సొంత లగ్జరీ లిమొజీన్ కారున్న తొలి వ్యక్తి కూడా కృష్ణవేణే!
ఆమె కూతురు –– అప్పటి పేరు మేకా రాజ్యలక్ష్మి అనూరాధ. ‘ఎమ్.ఆర్.ఎ.’ ప్రొడక్షన్స్ అన్న కృష్ణవేణి సినిమా నిర్మాణసంస్థ యీమె పేరు తాలూకు పొడి అక్షరాలే! సాయంత్రం పూట తోపుడు బండిలో షికారు వస్తే మా అమ్మ ఆమెను ముద్దు చేసేది.
నటిగా, గాయనిగా, నిర్మాతగా, స్టూడియో అధినేత్రిగా కృష్ణ వేణిది బహుముఖమైన ప్రస్థానం. కొన్ని సంగతులు ప్రత్యేకించి చెప్పుకోవాలి. చిన్న వయసులో ఆమె నటించిన ‘కచ దేవయాని’ (1938) దశాబ్దాల తరువాత పూనాలోని నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్‌లో చూశాను. అందులో ‘‘కచా! కచా!!’ అంటూ ఆమె నాయకుడి వెంట బడటం గుర్తున్నది నాకు! అలాగే, కథానాయికగా విజయాలు సాధించిన తర్వాత ఆమె కెరీర్‌లో ఒకే ఒక సందర్భంలో... ‘తిరుగుబాటు’ (1950) చిత్రంలో... వ్యాంప్ పాత్ర ధరించడం మరో విశేషం. అయితే, అంతటి వ్యాంప్ పాత్రలోనూ ఆమె బాడీ ఎక్స్‌పోజర్ చేయకుండా నటించడం గమనార్హం. ఆ పాత్ర కోసం ఆమె ఫుల్ స్లీవ్డ్ బ్లౌజులు స్వయంగా డిజైన్ చేసుకొని, ధరించడం మరో చిత్రం.
కృష్ణవేణి తాను నటించిన సినిమాలన్నిటిలో తన పాటలు తానే పాడుకున్న అరుదైన గాయని. అయితే, ‘దాంపత్యం’ (1957) చిత్రంలో మాత్రం తెరపై కృష్ణవేణి నటనకు రావు బాలసరస్వతి నేపథ్యగానం చేయడం అరుదైన సందర్భం. ఇక, తమ సంస్థ సొంత చిత్రం ‘కీలుగుర్రం’(1949)లో నటి అంజలీదేవికి కృష్ణవేణి ప్లేబ్యాక్ పాడడం మరో గమ్మత్తు. ఆమె పాడిన పాటల్లో దాదాపు 20 దాకా పాటలు 78 ఆర్‌పీఎం గ్రామఫోన్ రికార్డుల్లో ఉన్నాయి.
ఎన్.టి. రామారావుని ‘మన దేశం’ (1949) పోలీసు యిన్‌స్పెక్టర్‌గా, అదే చిత్రంతో ఘంటసాలను సంగీత దర్శ కునిగా పరిచయం చేసింది ఆమె. రమేశ్ నాయుడికి స్వతంత్ర సంగీత దర్శ కుడిగా మొదటి అవకాశమూ ఆమె నిర్మించిన ‘దాంపత్యం’ ద్వారానే! ఆ ‘దాంపత్యం’ చిత్రం ద్వారానే విజయ్ కుమార్‌ను హీరోగానూ పరిచయం చేశారు. ఆ విజయ్‌కుమార్ తల్లి...
అంతకు చాలాకాలం ముందే వచ్చిన తొలి తెలుగు సాంఘిక చిత్రం ‘ప్రేమ విజయం’ (1936)లో నటించారు. మద్రాసులో శోభనాచలా స్టూడియో నిర్వహణతో పాటు, నిర్మాతగా కృష్ణవేణి కన్నడంలో రాజ్‌కుమార్‌తో హిట్ చిత్రాలు నిర్మించడమూ మర్చిపోలేము. చివరి రోజుల్లో ఆమె తన జీవితచరిత్రను సీనియర్ జర్నలిస్ట్ ఎస్వీ రామారావు సహకారంతో రాయగా, ‘కృష్ణవేణీ తరంగాలు’ పేరిట కుమార్తె అనూరాధ ప్రచురించారు.
నూటొక్క సంవత్సరాలు నిండిన చిత్తజల్లు కృష్ణవేణి గంధర్వ లోక గతురాలైందన్న విషయం తెలిసి యివన్నీ గుర్తుకు వచ్చాయి.
అవన్నీ మరపురాని గుర్తులు... ఆమె పాడినవి మధుర గీతాలు!!
-వి.ఏ.కె. రంగారావు , వ్యాసకర్త ప్రముఖ సినీ – సంగీత – నాట్య విమర్శకులు
Comments
Please login to add a commentAdd a comment