
తొంభై మూడేళ్ల వరకూ నిరవధికంగా నటిస్తూ సినీ ప్రేమికుల్ని అలరించిన ఎవర్ గ్రీన్ హీరో అక్కినేని నాగేశ్వరరావు. గుండెకి ఆపరేషన్ జరిగినా నటనలో,నాట్యంలో ఉత్సాహం మరింత పెరిగిందే కానీ, ఇసుమంతైనా తగ్గకపోవడం ఆయన మానసిక స్థైర్యానికి మచ్చుతునక. తెలుగు సినీరంగంలో అక్కినేని ‘ఎక్కని ఎత్తుల్లేవు. వెళ్లలేని దూరాల్లేవు.’
జనన మరణాల మధ్య రెప్పపాటు జీవితకాలంలో, మన చూపు తిప్పుకోకుండా మన నలరించిన ఎందరో మహానుభావుల్లో ప్రముఖులు... తెలుగు సినిమా ఎవర్‌గ్రీన్ హీరో అక్కినేని నాగేశ్వరరావు. నాటక రంగం నుంచి నటరాజు వరప్రసాదమైన ‘అభినయ’ కళ ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించి, తొంభై మూడు సంవత్సరాల వయసు వరకూ నిరవధికంగా నటిస్తూ సినీ ప్రేమికుల్ని, తెలుగు ప్రేక్షకుల్ని అలరించి, తెలుగు హృదయాలలో చిరంజీవిగా కొలువై ఉన్న నటనావతంసుడీయన. పద్మవిభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వంటివి అక్కినేనిని అలంకరించి తమ గౌరవాలను ఇనుమడింప చేసుకున్నాయి. తన కళని తర్వాత తరాలకి కూడా వారసత్వంగా అందించి అక్కినేని నాగార్జున వంటి సూపర్ స్టార్‌ని, నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్ వంటి స్టార్లని తయారు చేసి ‘అక్కినేని’ జయభేరి తరతరాలుగా నినదించేలా చేయడం సామాన్యమైన విషయం కాదు.
1950 నుంచి 60ల మధ్యలోనే ‘నాతో సినిమాలు తీయాలనుకుంటే దర్శక, నిర్మాతలు హైదరాబాద్‌కి వచ్చి తీయా’లని నిర్దేశించ గలిగిన ‘ఖలేజా’ ఉన్న ఏకైక తెలుగు సూపర్ స్టార్ అక్కినేని.
1970ల మధ్య గుండెకి ఆపరేషన్ జరిగినా నటనలో, నాట్యంలో ఉత్సాహం మరింత పెరిగిందే కానీ, ఇసుమంతైనా తగ్గకపోవడం ఆయన మానసిక స్థైర్యానికి మచ్చుతునక. అదే ‘గుండె ధైర్యం’తో తన తొంభై ఏళ్ల వయసులో ప్రెస్ మీట్ పెట్టి తనకు క్యాన్సర్ సోకిందనీ, మరెంతో కాలం బతకననీ చెప్పగలగడం స్ఫూర్తి దాయకం. పై మూడు సంఘటనలూ, వయసు మారిందే గానీ, ఆయన వన్నె ఏ మాత్రం తగ్గ లేదని నిరూపించాయి.
‘ఆడపిల్లలకి చదువులెందుకు? పెళ్లిళ్లు చేసి ఓ అయ్య చేతిలో పెట్టి పంపెయ్యక’ అనే పాత కాలపు భావజాలం సమాజంలో అధికంగా ఉన్న రోజుల్లో ‘చదువుకున్న అమ్మాయిలు’ అనే టైటిల్‌తో స్త్రీలకు విద్య యొక్క ప్రాధాన్యతను తెలిపేలా చిత్రం చేయడం ఆయన ప్రోగ్రెసిన్ థాట్ ప్రాసెస్‌కి తార్కాణం. ఈనాటి ‘వుమెన్ ఎంపవర్‌మెంట్’ ట్రెండ్‌కి బీజం వేసిన సాంఘిక కార్యకర్తల్లో అక్కినేని కూడా ఒకరు.
విగ్గు, మేకప్పు లేకుండా ఇంట్లోంచి కాలు కూడా బైటికి కదపలేని కళాకారులకి ఆయన ‘సీతారామయ్య గారి మనవరాలు’ మారుతున్న సినిమా మేకింగ్ విలువలకి ఒక గొప్ప పాఠం. స్టార్ హీరోగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న రోజుల్లో ‘సుడిగుండాలు’ వంటి చిన్న పిల్లల మానసిక సమస్య మీద చిత్రాన్ని నిర్మించి, నటించడం ఆయన సామాజిక బాధ్యతకి, ప్రభావవంతమైన ఆలోచనా పరిణతికి నిదర్శనం.
దసరా బుల్లోడు, ప్రేమనగర్, ప్రేమాభిషేకం, ఆత్మగౌరవం, అగ్నిపుత్రుడు, సూత్ర ధారులు, డాక్టర్ చక్రవర్తి, మూగ మనసులు, దేవదాసు, మాంగల్యబలం, విప్రనారాయణ, సువర్ణ సుందరి, కీలుగుర్రం... ఇలా ఏ జోనర్‌లో చూసినా తెలుగు సినిమా కీర్తి కిరీటంలో అక్కినేని పాదుకొచ్చిన కలికి తురాళ్లు కనిపిస్తాయి. మిస్సమ్మ, గుండమ్మ కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం వంటి మల్టీ స్టారర్‌లతో తెలుగు సినిమా మార్కెట్ పరిధిని ఇతోధికంగా పెంచడం కూడా ఆయన చేసిన కృషిలో ఒక భాగం. హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోస్ నెలకొల్పడం, చలన చిత్ర నిర్మాణ సంస్థని ప్రారంభించడం... కొన్ని లక్షలమంది కళాకారుల కలలని సాకారం చేయడానికి ఆయన ఏర్పాటు చేసిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పాలి.
‘‘అక్షరం నేర్చుకోలేదని బాధ ఉంది’’ అని చెప్తూనే, నిరంతర విద్యార్థిగా తెలుగు, తమిళ, హిందీ, ఉర్దూ్ద, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడడం, రాయడం, నేర్చుకుని, ‘అక్కినేని ఆలోచనలు (అ, ఆలు)’ వంటి వచన కవితా సంపుటిని ప్రచురించడం ఆయనలోని క్రమశిక్షణకి, విద్యారంగం పట్ల గౌరవానికి దర్పణం. ముళ్లపూడి వెంకటరమణ గారన్నట్లు–అక్కినేని నాగేశ్వరరావు / ఎక్కని ఎత్తుల్లేవు / వెళ్లలేని దూరాల్లేవు. ఆయన కీర్తి, ప్రభావం, ప్రతిభ ప్రయాణించే కాలంలో మన జీవిత కాలం ఒక చిన్న మజిలీ మాత్రమే. ఆయనే శాశ్వతం. శతమానం భవతి. అక్కినేని అభిమానులకి ఆయన శత సంవత్సర జయంతి శుభాకాంక్షలు.
వి.ఎన్. ఆదిత్య
వ్యాసకర్త ప్రముఖ సినీ దర్శకుడు
(నేటి నుంచి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సంవత్సరం)