V.N. Aditya
-
తెలుగు సినిమా ఎవర్గ్రీన్ హీరో ఆయనే!
తొంభై మూడేళ్ల వరకూ నిరవధికంగా నటిస్తూ సినీ ప్రేమికుల్ని అలరించిన ఎవర్ గ్రీన్ హీరో అక్కినేని నాగేశ్వరరావు. గుండెకి ఆపరేషన్ జరిగినా నటనలో,నాట్యంలో ఉత్సాహం మరింత పెరిగిందే కానీ, ఇసుమంతైనా తగ్గకపోవడం ఆయన మానసిక స్థైర్యానికి మచ్చుతునక. తెలుగు సినీరంగంలో అక్కినేని ‘ఎక్కని ఎత్తుల్లేవు. వెళ్లలేని దూరాల్లేవు.’ జనన మరణాల మధ్య రెప్పపాటు జీవితకాలంలో, మన చూపు తిప్పుకోకుండా మన నలరించిన ఎందరో మహానుభావుల్లో ప్రముఖులు... తెలుగు సినిమా ఎవర్గ్రీన్ హీరో అక్కినేని నాగేశ్వరరావు. నాటక రంగం నుంచి నటరాజు వరప్రసాదమైన ‘అభినయ’ కళ ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించి, తొంభై మూడు సంవత్సరాల వయసు వరకూ నిరవధికంగా నటిస్తూ సినీ ప్రేమికుల్ని, తెలుగు ప్రేక్షకుల్ని అలరించి, తెలుగు హృదయాలలో చిరంజీవిగా కొలువై ఉన్న నటనావతంసుడీయన. పద్మవిభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వంటివి అక్కినేనిని అలంకరించి తమ గౌరవాలను ఇనుమడింప చేసుకున్నాయి. తన కళని తర్వాత తరాలకి కూడా వారసత్వంగా అందించి అక్కినేని నాగార్జున వంటి సూపర్ స్టార్‌ని, నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్ వంటి స్టార్లని తయారు చేసి ‘అక్కినేని’ జయభేరి తరతరాలుగా నినదించేలా చేయడం సామాన్యమైన విషయం కాదు. 1950 నుంచి 60ల మధ్యలోనే ‘నాతో సినిమాలు తీయాలనుకుంటే దర్శక, నిర్మాతలు హైదరాబాద్‌కి వచ్చి తీయా’లని నిర్దేశించ గలిగిన ‘ఖలేజా’ ఉన్న ఏకైక తెలుగు సూపర్ స్టార్ అక్కినేని. 1970ల మధ్య గుండెకి ఆపరేషన్ జరిగినా నటనలో, నాట్యంలో ఉత్సాహం మరింత పెరిగిందే కానీ, ఇసుమంతైనా తగ్గకపోవడం ఆయన మానసిక స్థైర్యానికి మచ్చుతునక. అదే ‘గుండె ధైర్యం’తో తన తొంభై ఏళ్ల వయసులో ప్రెస్ మీట్ పెట్టి తనకు క్యాన్సర్ సోకిందనీ, మరెంతో కాలం బతకననీ చెప్పగలగడం స్ఫూర్తి దాయకం. పై మూడు సంఘటనలూ, వయసు మారిందే గానీ, ఆయన వన్నె ఏ మాత్రం తగ్గ లేదని నిరూపించాయి. ‘ఆడపిల్లలకి చదువులెందుకు? పెళ్లిళ్లు చేసి ఓ అయ్య చేతిలో పెట్టి పంపెయ్యక’ అనే పాత కాలపు భావజాలం సమాజంలో అధికంగా ఉన్న రోజుల్లో ‘చదువుకున్న అమ్మాయిలు’ అనే టైటిల్‌తో స్త్రీలకు విద్య యొక్క ప్రాధాన్యతను తెలిపేలా చిత్రం చేయడం ఆయన ప్రోగ్రెసిన్ థాట్ ప్రాసెస్‌కి తార్కాణం. ఈనాటి ‘వుమెన్ ఎంపవర్మెంట్’ ట్రెండ్‌కి బీజం వేసిన సాంఘిక కార్యకర్తల్లో అక్కినేని కూడా ఒకరు. విగ్గు, మేకప్పు లేకుండా ఇంట్లోంచి కాలు కూడా బైటికి కదపలేని కళాకారులకి ఆయన ‘సీతారామయ్య గారి మనవరాలు’ మారుతున్న సినిమా మేకింగ్ విలువలకి ఒక గొప్ప పాఠం. స్టార్ హీరోగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న రోజుల్లో ‘సుడిగుండాలు’ వంటి చిన్న పిల్లల మానసిక సమస్య మీద చిత్రాన్ని నిర్మించి, నటించడం ఆయన సామాజిక బాధ్యతకి, ప్రభావవంతమైన ఆలోచనా పరిణతికి నిదర్శనం. దసరా బుల్లోడు, ప్రేమనగర్, ప్రేమాభిషేకం, ఆత్మగౌరవం, అగ్నిపుత్రుడు, సూత్ర ధారులు, డాక్టర్ చక్రవర్తి, మూగ మనసులు, దేవదాసు, మాంగల్యబలం, విప్రనారాయణ, సువర్ణ సుందరి, కీలుగుర్రం... ఇలా ఏ జోనర్లో చూసినా తెలుగు సినిమా కీర్తి కిరీటంలో అక్కినేని పాదుకొచ్చిన కలికి తురాళ్లు కనిపిస్తాయి. మిస్సమ్మ, గుండమ్మ కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం వంటి మల్టీ స్టారర్లతో తెలుగు సినిమా మార్కెట్ పరిధిని ఇతోధికంగా పెంచడం కూడా ఆయన చేసిన కృషిలో ఒక భాగం. హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోస్ నెలకొల్పడం, చలన చిత్ర నిర్మాణ సంస్థని ప్రారంభించడం... కొన్ని లక్షలమంది కళాకారుల కలలని సాకారం చేయడానికి ఆయన ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పాలి. ‘‘అక్షరం నేర్చుకోలేదని బాధ ఉంది’’ అని చెప్తూనే, నిరంతర విద్యార్థిగా తెలుగు, తమిళ, హిందీ, ఉర్దూ్ద, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడడం, రాయడం, నేర్చుకుని, ‘అక్కినేని ఆలోచనలు (అ, ఆలు)’ వంటి వచన కవితా సంపుటిని ప్రచురించడం ఆయనలోని క్రమశిక్షణకి, విద్యారంగం పట్ల గౌరవానికి దర్పణం. ముళ్లపూడి వెంకటరమణ గారన్నట్లు–అక్కినేని నాగేశ్వరరావు / ఎక్కని ఎత్తుల్లేవు / వెళ్లలేని దూరాల్లేవు. ఆయన కీర్తి, ప్రభావం, ప్రతిభ ప్రయాణించే కాలంలో మన జీవిత కాలం ఒక చిన్న మజిలీ మాత్రమే. ఆయనే శాశ్వతం. శతమానం భవతి. అక్కినేని అభిమానులకి ఆయన శత సంవత్సర జయంతి శుభాకాంక్షలు. వి.ఎన్. ఆదిత్య వ్యాసకర్త ప్రముఖ సినీ దర్శకుడు (నేటి నుంచి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సంవత్సరం) -
ధూమ్ ధామ్ బ్లాక్ బస్టర్
దేడ్ కహానీ - ధూమ్ 2 తెర మీద: ఓ పోలీసాఫీసరు ‘ఎ’ అనే పెద్ద అంతర్రాష్ట్రీయ దొంగని పట్టుకోవడానికి ఓ అమ్మాయిని దొంగగా ప్రవేశపెడతాడు. ఆమె ఆ దొంగని పడేయడానికి, నమ్మించడానికి విపరీతంగా అంగాంగ ప్రదర్శన చేస్తుంది. తనని తాను అర్పించుకుంటుంది. మోతాదు మించి రొమాన్స్ చేస్తుంది. ఆ క్రమంలో ఆ దొంగతో నిజంగానే ప్రేమలో పడిపోతుంది. తెర వెనుక: ఆ పోలీసు పాత్రధారి దొంగగా ప్రవేశపెట్టే అమ్మాయి అతనికి నిజ జీవితంలో కాబోయే భార్య. నిశ్చితార్థం అయ్యి, పెళ్లి జరగబోయే ముందు తీసిన సినిమా. ఆ దొంగ బాలీవుడ్లో మోస్ట్ డిజైరబుల్, హ్యాండ్సమ్ హీరో హృతిక్. ఆ అమ్మాయి భారతీయ సౌందర్యాన్ని ప్రపంచ వేదికపై ప్రశంసించేలా చేసిన సుందరి ఐశ్వర్యారాయ్. ఆ పోలీసాఫీసరు, నిజ జీవితంలో ఆమె కాబోయే భర్త... అమితాబ్ బచ్చన్ వారసుడు అభిషేక్ బచ్చన్. ఎంతో ప్రొఫెషనలిజమ్ ఉంటే తప్ప ఇలాంటి పాత్రల్లో పాత్రధారులు నటించలేరు. ఆ ప్రొఫెషనలిజమే బాలీవుడ్ పరిశ్రమని ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానానికి ఎగరేసుకుపోతోంది. పర్సనల్ లైఫ్‌లో ఎవరు ఎవరికి ఏమైనా కానీ, తెర మీద పాత్ర ఏం చేయాలో, ప్రేక్షకుడికి ఏం కావాలో అది ఇచ్చేయడంలో బాలీవుడ్‌ని మించిన పరిశ్రమ భారతదేశంలో లేదు. ప్రేక్షకులు కూడా అలాగే ప్రేమిస్తారు ఆ పరిశ్రమని. తెలుగులో ఓ పెద్ద నటుడి కూతురు హీరోయిన్ అవ్వాలంటే అభిమానులు ఒప్పుకోరు. ఆ వంకన ఇంట్లోవాళ్లూ ఒప్పుకోరు. ఫ్యాషన్‌కి, ప్రతిభకి, క్యారెక్టర్నీ పర్సనల్ ఇమేజ్‌నీ ముడిపెట్టడం వల్లే దక్షిణాది సినిమా చాలా విషయాల్లో వెనకబడిపోతూ ఉంటుంది (ఇది నా వ్యక్తిగత పరిశీలన మాత్రమే. ఎవరి అభిప్రాయం వాళ్లది. చర్చలకు తావు లేదు). ‘ధూమ్’ మొదటి భాగం హిట్ అయిన ఆనందంలో జాన్ అబ్రహాం పాత్రలో హృతిక్ రోషన్‌ని పెట్టి, అదే దర్శక నిర్మాతలు సంజయ్ గధ్వీ, ఆదిత్య చోప్రాలు అందించిన ఫక్తు కమర్షియల్ చిత్రం ‘ధూమ్ 2’. ఇది సర్వ రుచుల సమ్మేళనం! ముప్ఫై అయిదు కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రానికి 150 కోట్ల వసూళ్లు వచ్చాయి. అంటే హిందీ సినిమా ఎక్కడుంది మిలీనియమ్‌లో?! హృతిక్ రోషన్, ఐశ్వర్యారాయ్‌ల అధర చుంబనాలు, అర్ధనగ్న ప్రదర్శనలతో పాటు తెరమీద నుంచి కళ్లు పక్కకి తిప్పనివ్వని విజువల్స్, థ్రిల్స్, చేజులు, అడుగడుగునా వీడియో గేమ్స్‌ని మించిపోయిన బ్రెయిన్ గ్రేమ్స్, కాళ్లని క్షణం కూడా కుదురుగా ఉండనివ్వని పాటలు... వెరసి బాగా ఆకలి మీదున్నప్పుడు పెట్టిన బఫే భోజనం ‘ధూమ్ 2’. మొదటి భాగం ‘ధూమ్ మచాలే’ అన్న పాటతో పూర్తవుతుంది. అందులో ఈషా డియోల్ ప్రత్యేక ఆకర్షణ. ఇదే పాటతో ‘ధూమ్ 2’ మొదలవుతుంది. సిక్స్‌ప్యాక్ బాడీతో హృతిక్ రోషన్ స్ప్రింగ్‌లా కదులుతూ చేసిన అద్భుతమైన డ్యాన్స్‌తో ‘ధూమ్ అగైన్’ అంటూ టైటిల్స్ పడుతుండగా పాట! దాన్ని మించి నైరోబీ ఎడారిలో రైలులో ప్రయాణిస్తున్న బ్రిటిష్ రాజ కుటుంబీకుల వద్ద నుంచి వారి కిరీటాన్ని అత్యంత లాఘవంగా ఎత్తుకెళ్లే ఎపిసోడ్‌తో హీరో హృతిక్ రీ ఇంట్రడక్షన్! ఈ రెండూ ప్రేక్షకుణ్ని సినిమాలోకి లాక్కెళ్లిపోతాయి. తెరకు కళ్లు అప్పగించేలా చేస్తాయి. ఆ తర్వాత సినిమా ముగిసే వరకూ ఆ ఆసక్తి కొనసాగుతుంది. సన్నివేశాన్ని బట్టి హృతిక్ వేసే మారువేషాలు చాలా ఆకట్టుకుంటాయి. జెంటిల్‌మేన్ చిత్రంలో అర్జున్ పాత్ర చేసే దొంగతనాల మాదిరిగా ఈ చిత్రంలోనూ దొంగతనాలు తీర్చిదిద్దినట్టు ఉంటాయి. మొదటి భాగంలో కథకి, సెంటిమెంట్‌కి ఈ చిత్రంలో ప్లేస్ లేదు కానీ... సెకెండాఫ్‌లో హృతిక్, ఐశ్వర్య పాత్రల మధ్య కాస్త సెంటిమెంటును టచ్ చేశారు. ఈ సినిమా కథ చెప్పుకోవడానికి పెద్దగా ఉండదు. చూడాల్సిందే. అయినా మూడు ముక్కల్లో చెప్పాలంటే ఇది ఓ దొంగ కథ. అతన్ని పట్టుకోవ డానికి ప్రయత్నించే పోలీసుల కథ. పోలీసుల తరఫున దొంగ దగ్గర చేరి, అతని ప్రేమలో పడి వచ్చిన పని నెరవేర్చలేకపోయిన ఓ అమ్మాయి కథ. సెకెండాఫ్‌లో బిపాసా బసు మంచి ఆకర్షణ. మొదటి భాగంలో నటించిన రిమీసేన్ కూడా ఇందులో అభిషేక్ భార్యగానే కంటిన్యూ అయ్యింది. రాజేష్ రోషన్ నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రాలు కాకుండా... హృతిక్‌తో బయటి నిర్మాతలు, దర్శకులు తీసిన చిత్రాల్లో పెద్ద హిట్... ధూమ్ 2 ఒక్కటే. ఈ చిత్రంలో కథ కన్నా స్క్రీన్‌ప్లే బలం ఎక్కువ. విజయకృష్ణ ఆచార్య ధూమ్కి, ధూమ్ 2కి రచయిత. ‘ధూమ్ 3’కి రచనతో పాటు దర్శకత్వం కూడా చేశాడాయన. హాలీవుడ్ సినిమాల తరహా హైటెక్ దొంగతనాల కథ ఇది. దాన్ని స్కేల్లో నిర్మించే సాహసం చేసిన ఘనత ఆచార్యదే. బ్రెజిల్లో షూటింగ్ జరుపుకున్న తొలి హిందీ చిత్రం ఇది. పెపె జీన్స్, కోకో కోలా సంస్థలు బ్రాండ్ అంబాసిడర్లుగా చిత్రాన్ని ప్రమోట్ చేశాయి. 1800 ప్రింట్లతో ప్రపంచ వ్యాప్తంగా విడుదలై రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలోని బైక్ రేసులు కుర్రకారును అమితంగా ఆకర్షించేలా ఉన్నాయని, వాటిని తొలగించడం మంచిదని ముంబై కమిషనర్ హై కోర్టులో పిటిషన్ పెట్టారంటే... ఈ చిత్రం యువతనెలా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ఆదిత్య చోప్రా నిర్మించే అన్ని చిత్రాల్లోనూ ఒక పాత్రలో తప్పనిసరిగా కనిపించే అతని తమ్ముడు ఉదయ్‌చోప్రా ఇందులోనూ నటించాడు. అభిషేక్ బచ్చన్‌కి అసిస్టెంట్‌గా కనిపించి నవ్వించాడు. బిపాసా ద్విపాత్రాభినయం ఓ మంచి ట్విస్టు ఈ చిత్రంలో. హృతిక్, ఐశ్వర్యలిద్దరూ చాలా బరువు తగ్గారట ఆదిత్య చోప్రా సూచనల మేరకు. పాత్రకు తగ్గ షేప్, బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ లేకపోతే పాత్రధారుల్ని ఆ పాత్రలో పెట్టనని ఆయన ఖరాఖండిగా చెబుతుంటారు. నిర్మాత కథ ఇవ్వడం, మేకింగ్‌లో తన టీమ్‌కి కావలసిన స్వేచ్ఛనిస్తూనే... చిత్రం అనుకున్న స్థాయిలో రావడానికి అహర్నిశలూ శ్రమించడం తెలుగు పరిశ్రమలో కూడా ఉంది. ముళ్లపూడి వెంకట రమణగారు నిర్మాత, రచయిత. ఎమ్మెస్ రాజు కథకుడు, నిర్మాత (దర్శకుడు కాకముందు). శ్యామ్‌ప్రసాద్ రెడ్డి కథకుడు, నిర్మాత. ఆయన తండ్రి ఎమ్మెస్ రెడ్డిగారు అఫీషియల్‌గా స్క్రీన్ మీద పేరు వేసుకోకపోయినా ఆయన కూడా నిర్మాత, రచయిత. ఇంకా రామా నాయుడుగారు, అశ్వినీదత్, అల్లు అరవింద్, నాగబాబు, సురేష్‌బాబు, స్రవంతి రవికిశోర్, బూరుగుపల్లి శివరామ కృష్ణ, దిల్‌రాజు... ఇలా నాకు తెలిసిన కొంతమంది నిర్మాతల చిత్రాల్లోనే టీమ్ వర్క్ కనిపిస్తోంది తప్ప మిగిలిన చిత్రాల్లో కనిపంచట్లేదు. టీమ్ వర్క్ లేని చిత్రాలు ఆడవచ్చు. కానీ ఆడినా ఆడకపోయినా ఆ సినిమాలు ఆ నిర్మాతలను క్యాషియర్లుగానే చూస్తాయి. లేదా క్యాష్ ఈయరు గానే నిరూపిస్తాయి. వేరే వాళ్ల మెదడు మీద బెట్టింగ్ కాయడం పొగరు. అదే తన డబ్బుతో పెట్టుబడి పెట్టి, కొద్దిమందితో కలిసి కష్టపడి చేసి, ఆ ప్రొడక్టుని మార్కెట్లో పెడితే... దానికి దాదాపు ఫెయిల్యూర్ శాతం చాలా తక్కువ. అయినా మన నిర్మాతలు ఆ కష్టాన్ని ఇష్టపడరెందుకనో! ఆదిత్య చోప్రా విజయవంతమైన దర్శకుడే కాదు... అంతకంటే విజయవంతమైన నిర్మాత అవ్వడానికి కారణం, మన తెలుగు నిర్మాతల బాట పట్టడమే అని నా అభిప్రాయం. అందుకు ఒక సాక్ష్యం.. ధూమ్ 2. ఇంతకుముందు మీకలా అనిపించకపోతే, ఓసారి ఆ సినిమాని మళ్లీ చూడండి. నాతో ఏకీభవించి తీరతారు! - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
షేక్స్పియర్ బాహుబలి!
దేడ్ కహానీ - ఓంకార * షేక్స్పియర్ నవలకు చిత్రరూపం. * అవార్డులందుకున్న చిత్రరాజం. * విశాల్ ప్రతిభకు తార్కాణం. ఈవారం సినిమా గురించి రాసేముందు చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పి తీరాలి. 1998, 99 మధ్య ప్రాంతాల్లో ఇందిరా పార్క్ దగ్గరలో నివాసం ఉంటూ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతుండేది శిరీష అనే నా విజయవాడ స్నేహితురాలు. చాలా బాగా చదివేది. అలాగే సినిమాలన్నా, వాటిని చూసి విశ్లేషించడమన్నా తనకు యమా ఇష్టం. ట్రైలర్ చూసి ఆ కథని ఊహిం చెయ్యడం, ట్రైలర్ చూసి ఆ సినిమా ఆడుతుందో లేదో కరెక్ట్‌గా చెప్పగలగడం ఆమె ప్రత్యేకతలు. తను ఇంగ్లిషు లిటరేచర్ బాగా చదివేది. నేనోసారి అడిగాను... ఇంగ్లిషు సాహిత్యంలో ఇవాళ్టి సినిమాలకి పనికొచ్చే కథలేమన్నా ఉన్నాయా అని. ఒక్కక్షణం కూడా ఆలో చించకుండా టక్కున చెప్పింది షేక్స్పియర్ డ్రామాలున్నాయ్ అని. నాకు కొద్దిగా ఐడియా ఉంది గానీ, అవి అంత మోడరన్ అనిపించలేదెప్పుడూ. తను ఎందుకలా అందో అని, నాకు తెలుగులో ఒక్కో షేక్స్పియర్ డ్రామాని కథలాగ చెప్పమన్నాను. రోజూ సాయంత్రం నాలుగు నుంచి అయిదు మధ్య ఇందిరా పార్కు రోడ్డు మీద, వాళ్లింటి వరండాలో, ఎదురుగా ఉన్న బేకరీలో... రోజుకొక షేక్స్పియర్ డ్రామాని కథలాగ చెప్పేది. ఒకరోజు మాక్బెత్, ఒకరోజు ఒథెల్లో, ఇంకోరోజు హామ్లెట్, ఇంకోరోజు కింగ్‌లియర్, ఏ మిడ్ సమ్మర్ నైట్స్డ్రీమ్, మర్చెంట్ ఆఫ్ వెనిస్, మచ్ ఎడో అబౌట్ నథింగ్, యాజ్ యూ లైక్ ఇట్, ట్వెల్త్ నైట్, రోమియో అండ్ జూలియట్, ద ట్రాజెడీ ఆఫ్ జూలియస్ సీజర్ ఇత్యాదివి ఓ పదిహేను రోజుల పాటు ఓపిగ్గా నేరేట్ చేసింది. ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవాళ్టి తరానికి ఆమోదయోగ్యమైన సినిమా అవుతుందని నాకనిపించలేదు ఆ రోజు. అదే తనకి చెప్పి షేక్స్పియర్ కథల చర్చ ఆపేశాను. 1600వ టైమ్‌లో రాసిన డ్రామా ఇవాళ్టి జీవితంలో ఎలా జరుగుతుందనేది నాకర్థమయ్యేది కాదు. ప్రేక్షకుడు ఎలా కనెక్ట్ అవుతాడని! నా ఆలోచన పూర్తిగా తప్పని నిరూపించాడు దర్శకుడు, రచయిత, నిర్మాత, సంగీత దర్శకుడు విశాల్ భరద్వాజ్. బాలీవుడ్లో మిలీనియమ్ సంచలనం అతను. సంగీత దర్శకుడిగా పద్దెనిమిది సినిమాలు చేశాక... ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందాక... బాగా బిజీగా ఉన్న టైములో రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా మారి... మళ్లీ వాటితో పాటు సంగీత దర్శకత్వం తనే చేస్తూ... దర్శకుడిగానూ, సంగీత దర్శకుడి గానూ రెండేసి అవార్డులు అందుకుంటున్న ఈతరం మేధావి విశాల్. పది సినిమాలు తీసి ఆరు నేషనల్ అవార్డ్స్ అందుకున్న దర్శకుడు. షేక్స్పియర్ నాటకాలలో మాక్బెత్ని ‘మక్బూల్’గా, ఒథెల్లోని ‘ఓంకార’గా, హామ్లెట్‌ని ‘హైదర్’గా రూపొందించి ఈ తరం ప్రేక్షకులకి 1600వ శతాబ్దపు మానవ బంధాల మధ్యనున్న భావో ద్వేగాల రుచి చూపించి సక్సెస్ అయ్యారు విశాల్. షేక్స్పియర్ నాటకాలు చాలా మంది పాఠకులు చదివే ఉంటారు. కానీ చాలామంది ప్రేక్షకులు చదవరు. 1600లోనే ఒథెల్లో నాటకాన్ని ఒక చిన్న కథానిక నుంచి స్ఫూర్తి పొంది రాసినట్టు చెప్పుకొచ్చారు షేక్స్పియర్. 2000 తర్వాత దానిని సినిమాగా స్ఫూర్తి పొందడంలో తప్పేముంది! ఇంకో విశేషం ఏంటంటే, ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గొప్పగా మాట్లాడుకుంటున్న మన తెలుగు సినిమా ‘బాహుబలి’... ‘ఓంకార’ చిత్రంలో హీరో అజయ్ దేవ్గన్ పదవి పేరు. మహారాష్ట్రలో ‘భాయి’, తమిళ నాడులో దళపతి, నాయగన్... ఇవన్నీ మాఫియా లేదా రౌడీల బాస్‌ల సర్వ నామాలు. అలా ఉత్తర్‌ప్రదేశ్‌లో బాహు బలి అంటారు ఒక రౌడీ లీడర్ని. ఆ పదవి అజయ్ దేవ్గన్ పోషించిన ఓమీ భాయ్‌ది. అతనికి ఇద్దరు అనుచరులు... లంగ్డా త్యాగి, కేశు. ఈ ఇద్దరిలో తన తర్వాత ఎవరిని బాహుబలిని చేయాలన్న ప్రశ్న వచ్చినపుడు, అప్పటివరకూ ఓమి తర్వాత స్థానం తనదే అని భావిస్తున్న త్యాగిని కాదని, కేశుని బాహుబలిని చేస్తాడు ఓమి. తనేమో రాజకీయ నాయకుడౌతాడు. దీంతో త్యాగికి కడుపు మండి ఓమి భార్యకి, కేశుకి అక్రమ సంబంధం సృష్టించి... ఓమి చేతనే ఆమె హత్యకు గురయ్యేలా చేస్తాడు. భార్యని చంపేసిన తర్వాత ఓమికి... త్యాగి భార్య ద్వారా నిజం తెలిసి తనను తానే హతమార్చు కుంటాడు. చాలా బరువైన కథ. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైన చిత్రం ఇది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని చిన్న చిన్న టౌన్‌షిప్స్‌లో ఉండే వాతావరణాన్ని తీసుకుని చేశారు. డైలాగ్స్ కూడా సినిమా కోసమని సెన్సార్ చేసేయకుండా... సహజంగా రౌడీలు మాట్లాడే బూతులు, యాసతో రాయించుకోవడం వల్ల ఈ సినిమాని కుటుంబ సమేతంగా భారతీయులు అంతగా ఆదరించలేక పోయారు. అయితే సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, విశాల్ భరద్వాజ్, అజయ్ దేవ్‌గన్‌లను మాత్రం అవార్డులు వరించాయి. యూరప్ దేశాలలోను, అమెరికాలోను ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ఆ భాషలోని బూతులు సరిగా అర్థం కాకపోవడం వల్ల అనుకుంటా, నాక్కూడా ఈ సినిమా అంత ఎబ్బెట్టుగా అనిపించలేదు. కానీ హిందీలో మారుమూల గల్లీ భాష అర్థం అయ్యేవాళ్లు మాత్రం ఆడవాళ్లని, పిల్లల్ని చూడద్దని రికమెండ్ చేసేలా ఉంటుందిట స్క్రిప్టు. విజువల్‌గా ఇది కొంచెం డార్క్ సినిమా. డార్క్ సినిమాల లుక్‌ని లైక్ చేసే ప్రేక్షకులు వేరు. వాళ్లు ఎక్కువ ఎ సెంటర్ ప్రేక్షకులు. బి, సిలలో సినిమా కళకళలాడుతూ గ్లామరస్‌గా కనిపించాలి భారతదేశంలో. సైఫ్ అలీఖాన్ పోషించిన లంగ్డా త్యాగి పాత్ర మొదట హీరోకి నమ్మిన బంటులా ఉంటుంది. తర్వాత విలన్లా మారుతుంది. నటనకు చాలా అవకాశ మున్న పాత్ర. ఈ పాత్రని మొదట ఆమిర్ ఖాన్ చేస్తానని ముందుకొచ్చాట్ట. తర్వాత డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో సైఫ్‌ని వరించింది. గత రెండు వారాలుగా ఈ శీర్షికలో 2006లో విడుదలైన సినిమాల గురించి రాస్తున్నాను. అవి ఫనా, కార్పొరేట్... ఇప్పుడు ఓంకార. విశేషమేమిటంటే... ‘ఫనా’లో చేసిన కాజోల్, ‘కార్పొరేట్’లో చేసిన బిపాషాబసు, ‘ఓంకార’లో చేసిన కరీనాకపూర్... వీళ్లు ముగ్గురూ 2007లో ఉత్తమ నటి అవార్డుకు పోటీపడ్డారు. కరీనా కపూర్ అవార్డును గెలిచింది. ఈ చిత్రంలో త్యాగి భార్యగా నటించిన కొంకణాసేన్‌శర్మ ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. నటీనటుల నటనా పటిమకి ఇంతకన్నా మంచి కొలమానం ఏముంటుంది? పెట్టిన డబ్బుకు మూడింతలు వసూలు చేయడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు, ప్రశంసకుల విమర్శలు అన్నీ పొంది తనకంటూ ఓ స్థానాన్ని ఈ చిత్రమూ, దీని దర్శకుడు విశాల్ భరద్వాజ్ ఇద్దరూ ఏర్పరచుకున్నారు. కొత్తగా దర్శకులు అవ్వాలనుకునే చాలామందికి కనువిప్పు కలగాల్సిన అంశం ఏమిటంటే... పాత సాహిత్యంలో భావాలు, పాత్రల ప్రవర్తన, వాటి మధ్య సంఘర్షణ (కాన్ఫ్లిక్ట్) చాలా బలంగా ఉంటాయి. వాటిని స్ఫూర్తిగా తీసుకుని ఈతరం జీవనశైలిలో ఆ పాత్రల్ని ప్రవేశపెట్టి, అటువంటి కాన్ఫ్లిక్ట్నే క్రియేట్ చేస్తే ఇప్పుడూ ఆ కథలు కిక్కిస్తాయి. పాత కథ తీయమంటే పీరియడ్ కథలే తీయక్కర్లేదు. ఆ సాహిత్యాన్ని చదవాలి. ఈ కాలానికి వాటి సారాన్ని అప్లయ్ చేసు కోవాలి. అప్పుడు ప్రేక్షకుడు ఆదరిస్తాడు. ఇది హిందీలో కొత్త తరంలో వచ్చిన, అంటే మిలీనియమ్‌లో దర్శకులైనవాళ్లు ఆచరించి నిరూపిస్తున్న నిజం. తెలుగులో కొత్త దర్శకులు ఎక్కువమంది ఫెయిల్ అవుతుండడానికి కారణం సాహిత్యం మీద అవగాహన లేకపోవడం, సమాజం గురించి అసలేమీ తెలియకపోవడం, కనీసం రోజూ న్యూస్ పేపర్ చదివే అలవాటైనా చాలామందికి లేకపోవడం, పాత్రలు, పాత్ర ప్రవర్తన, చిత్రణ, భావోద్వేగాల కొలతలు తెలియకపోవడం, నాటకాలు, కవితలు, కథలు, నవలలు ఎక్కువగా తెలియకపోవడం, కొరియన్ సినిమాలే జీవితంగా బతికేయడం. విశాల్ భరద్వాజ్‌ని చూసి సాటి దర్శకులే కాదు, సంగీత దర్శకులు కూడా చాలా నేర్చుకోవాలి. కొత్త పథానికి, పాత భావానికి మధ్య వారధి విశాల్. ఆ రూట్లో ఓంకారం పలికించిన ప్రణవ నాదం విశాల్. పి.ఎస్.: షేక్స్పియర్ నాటకాలు సినిమాలకి బాగా పనికి వస్తాయని చెప్పిన నా స్నేహితురాలు ప్రస్తుతం వాళ్లాయన అనిల్, కూతురితో పాటు బెంగళూరులో సెటిల్ అయ్యారు. తన జడ్జిమెంట్‌ని మరోసారి అభినందిస్తూ... మళ్లీ వారం మరో మంచి సినిమాతో కలుద్దాం. - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
యెద యెదలో రగిలిన స్ఫూర్తి
దేడ్ కహానీ - రంగ్ దే బసంతీ ‘‘మరగకపోతే రక్తం కాదది, నీటితో సమానం. దేశానికి పనికిరాకపోతే యువత కాదది, నిర్వీర్యం’’ అని అర్థం వచ్చేలా టైటిల్ పడింది. చాలా అర్థవంత మైన సినిమా చూడబోతున్నానని అర్థం అయ్యింది. గంటా ఇరవై ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకెన్ల దగ్గర వచ్చే ఒక సన్నివేశం - అనూహ్యమైనది. అది రాసిన రచయితలకి, తీసిన దర్శకుడికి, అభిమాని కానివాడు ప్రేక్షకుడే కాడు. భారత స్వాతంత్య్ర సమరయోధుల్ని చంపే బాధ్యతని నిర్వర్తిస్తున్న బ్రిటిషు పోలీసు అధికారి చర్చ్‌కి వెళ్లి జీసస్ దగ్గర ఏడవడం, తను చంపుతున్న సమర యోధులు చిరునవ్వుతో దేశం కోసం ప్రాణాలని అర్పిస్తుంటే, వారికి అతను అభిమానిగా మారడం... ఒక పక్క పాలకుల ఆజ్ఞ, మరోపక్క మానవ హృదయం - ఈ సంఘర్షణని ఇంత అందంగా చూపించిన సినిమా, ఈ నేపథ్యం ఉన్న కథల్లో ఎక్కడా లేదు. స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో తీసిన ప్రతి సినిమా దేశభక్తిని హీరోని చేసి పాలకుల్ని విలన్లని చేస్తుంది. అది సాధారణ కాన్ఫ్లిక్ట్. కానీ దేశభక్తికి విధి నిర్వహణకి సమానంగా అంతః సంఘ ర్షణని చూపించడం అసాధారణ కాన్ఫ్లిక్ట్. ఇప్పటివరకూ - స్వాతంత్య్ర పోరాట యోధుల కథలు పూర్తిగా పీరియాడికల్ సినిమాలుగానూ, ఈనాటి యువతరం కథలు పూర్తిగా మోడరన్గానూ అంటే తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అన్నట్టు తీస్తూ వచ్చారు. కానీ మొదటి సారి ఆనాటి యువ దేశభక్తులైన హీరోల కథని, ఈనాటి అల్లరి చిల్లరి యువ హీరోల కథని కలిపి ఒకే కథగా అల్లుకో వడం, అందుకు సూత్రధారిగా ఒక బ్రిటిష్ అమ్మాయి పాత్రనే సృష్టించడం... నిజంగా అద్భుతమైన ఆలోచన. ఆ ఆలోచనకి ఫలితమే... ‘రంగ్ దే బసంతి’. దాన్ని నిర్మించి, దర్శకత్వం వహించిన వ్యక్తి రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా. హీరోగా నటించింది... తన పాత్ర చుట్టూ కథ, కథనాలు పరిభ్రమించాలనుకోకుండా, మంచి కథ, కథనాలతో ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉండాలనుకునే ఆమిర్‌ఖాన్. నాకు తెలిసి... ఇలా ఆలోచించి సినిమాలు ఓకే చేసే హీరో ఇండియాలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఆయన ఒక్కరే. ఇలాంటి కథలు చేయడానికి అంగీకరించే పెద్ద హీరోల్ని అభినందించి తీరాలి. ఈ దశాబ్దన్నరలో బాలీవుడ్లో మూసధోరణి పోయి ప్రేక్షకులు ఆదరించేలా మంచి కథలు వస్తున్నాయి. ఈ విషయం ఒక్కో సినిమా వచ్చి వెళ్తున్నప్పటికంటే, ఈ వ్యాసం రాయడం కోసం వరసగా ఆ సినిమాలు మళ్లీ చూస్తున్నప్పుడు బాగా తెలుస్తోంది నాకు. ఇక ‘రంగ్ దే బసంతి’ విషయానికి వద్దాం. న్యూఢిల్లీలో నివాసముంటున్న పంజాబీ కుటుంబంలో పుట్టిన రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా యురేకా ఫోర్బ్స్ కంపెనీలో వాక్యూమ్ క్లీనర్లు అమ్మేవాడు. తర్వాత ఒక అడ్వర్టయిజింగ్ కంపెనీని పెట్టి కోక్, పెప్సీ, టయోటా, బీపీఎల్ కంపెనీలకి యాడ్స్ తీశాడు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్‌తో ‘అభీ బేబీ’ అనే మ్యూజిక్ వీడియో తీశాడు. 2001లో అమితాబ్ ప్రధాన పాత్రలో, మనోజ్ బాజ్‌పాయ్ సహనటుడిగా ‘అక్స్’ అనే సినిమా తీశాడు. అక్స్ అంటే రిఫ్లెక్షన్. ఈ దర్శకుడు తన ఆలోచనలని తెరమీదకి సరిగా రిఫ్లెక్ట్ చేయలేడు అనిపించింది ‘అక్స్’ చూసి. కానీ అమితాబ్‌కి అవార్డుల పంట పండింది. అర్థం కాకపోతే అవార్డులెక్కువొస్తాయేమో అనుకున్నాను నా ఇగోని శాటిస్ఫై చేసుకోడానికి. ఆ తర్వాత రంగ్ దే బసంతి, భాగ్ మిల్కా భాగ్ సినిమాలు తీశాడు మెహ్రా. అంతే... ఫిదా అయిపోయాను అతడి టాలెంట్‌కి. తను రిటైరైపోయినా ఈ రెండు సినిమాలూ చాలు తనని తరతరాలు గుర్తు పెట్టుకోడానికి. నేను, నాలాంటి చాలామంది దర్శకులు జీవితాంతం టైర్ అవుతూనే ఉండాలి తన సినిమాల స్థాయిని అందుకోడానికి. అందుకే ‘భాగ్ మిల్కా భాగ్’ చూసిన తర్వాత నా ఫేస్బుక్లో పెట్టాను- ‘‘సిగ్గేస్తోంది, దర్శకుడైన పదేళ్లలో ఇలాంటి సినిమా ఒక్కటి కూడా ఇంకా తీయనందుకు’’ అని. దటీజ్ ఓం ప్రకాష్ మెహ్రా. మళ్లీ రంగ్ దే బసంతి విషయానికి వద్దాం. భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో బ్రిటిష్ జనరల్‌గా ఇండియాలో పనిచేసిన మెకిన్లే మనవరాలు, స్యూ మెకిన్లే బ్రిటన్ టెలివిజన్ చానల్లో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తూ ఉంటుంది. తాతగారు రాసుకున్న డైరీ చదివితే అందులో భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి మహామహుల బలిదానాలు, వాటి పర్యవసానాలు ఉంటాయి. దానిని ఫిల్మ్ చేసి, ఆ కథల్ని ప్రజలకి చూపించాలని ఆశ పడుతుంది. చానల్ ఓనర్ని అడిగితే, అవి బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ రిజెక్ట్ చేస్తుంది. దాంతో ఎలాగైనా తన తాతగారి డైరీ కథల్ని సినిమాగా తెరకెక్కిస్తానని చాలెంజ్ చేసి ఢిల్లీ వస్తుంది స్యూ. అక్కడ తన ఫ్రెండ్ సోనియాని (సోహా అలీ ఖాన్) కలుస్తుంది. సోనియా ఢిల్లీ యూనివర్శిటీలో చదువుతుంటుంది. ఆమె స్నేహితులు డీజే, కరణ్, అస్లమ్‌ఖాన్, సుఖీరామ్... నలుగురూ పరమ అల్లరి మూక. జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయాలనుకునే ఆధునిక మెట్రో నగరాల యువతలాగ ఉంటారు. వీళ్ల స్నేహితుడు అజయ్‌సింగ్ రాథోడ్ ఆర్మీలో యుద్ధ విమానాల పైలట్. అతి కష్టమ్మీద తన భారత స్వాతంత్య్ర సమర వీరుల కథలో ముఖ్య పాత్రలకి ఈ అయిదుగురినీ ఒప్పిస్తుంది స్యూ. కానీ వాళ్లకి దేశమంటే లెక్కలేదు. నిన్న ఏం జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలం లేదు. రేపు ఎలా ఉండాలో అన్న ఆలోచన లేదు. ఈరోజు బావుంటే చాలు... అంతే. అలాంటి వారిని నెమ్మదిగా దేశభక్తుల, అమరవీరుల పాత్రలు, ఆలోచనలు కొంచెం కొంచెం ప్రభావితం చేస్తాయి. వాళ్లెందుకు ప్రాణ త్యాగం చేసి చిరునవ్వుతో దేశం కోసం చనిపోయారు అన్న ఆలోచన నుంచి... మనం దేశం కోసం ఎలా బతకాలి అని ఆలోచించే స్థాయికి చేరుకుంటారు. అవినీతితో ఆవిరైపోయిన నీతిని సమాజంలో నింపడానికి కంకణం కట్టుకుంటారు. సరిగ్గా అదే సమయంలో వాళ్ల స్నేహితుడు అజయ్ మిగ్-21 యుద్ధ విమానం నడుపుతూ మరణించడం వాళ్లని కుంగదీస్తుంది. గత పదిహేను సంవత్సరాలలో 206 మిగ్ యుద్ధ విమానాలు కూలిపోయాయి, 78 మంది ఆర్మీ పైలట్లు అసువులు బాశారు, 1964 నుంచి మన దేశం వాడుతున్న మిగ్ విమానాల పనిముట్ల దిగుమతిలో జరుగుతున్న స్కామ్... ఈ విమానాలు నాసిరకంగా తయారై మన సైనికుల ప్రాణాలు పోవడానికి కారణం అని తెలుసుకున్న ఈ నలుగులూ తమ స్నేహితుడి మృతికి కారణమైన రక్షణ మంత్రిని చంపేస్తారు. తీవ్ర వాదులుగా ముద్రపడతారు. చివరికి ఆకాశవాణిలో నిజాన్ని నేరుగా ప్రజలకి వివరిస్తారు. అయినా పోలీసుల చేతిలో హతమౌతారు. పరాయివాడి పాలన కోసం అసువులు బాసిన వీరులలాగే చిరునవ్వులు చిందిస్తూ, వారి పాత్రలు తమలో నింపిన స్ఫూర్తిని మొత్తం యువతరానికి రేడియో ద్వారా పంచుతూ, స్వ పరిపాలనలో అవినీతి రాజకీయ నాయకుల రాక్షస ఘాతానికి బలై పోతారు. ఇది కథా? ఒక సినిమా కథా? కాదు... జీవితం. ఇది వాస్తవం. వ్యవస్థలో చెడుని మనం కూకటివేళ్లతో సహా పెకలించి మార్పును తేలేం. కానీ మనం మారడం ద్వారా వ్యవస్థలో మార్పు దానంతట అదే వస్తుంది. ఇవాళ కాకపోయినా రేపు. రేపు కాకపోతే ఎల్లుండి. మారాలన్న ఆలోచన మనకి ఉండాలి. అంతే. బాధ్యతారాహిత్యంగా ఉన్న యువతకి దిశానిర్దేశం చేసేవాడు వట్టి సినిమా దర్శకుడు మాత్రమే కాడు. సమాజానికి దార్శనికుడు కూడా. రాజ్‌కుమార్ హిరానీ తర్వాత ఆ కోవలోకి వచ్చే రెండో వ్యక్తి రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా అని కచ్చితంగా చెప్పొచ్చు. అతుల్ కులకర్ణి, సిద్ధార్థ, అతిథి పాత్రలో మాధవన్ చాలా బాగా నటించి మెప్పించారు. ఎ.ఆర్.రెహమాన్ పాటలు అత్యద్భుతం. నిజానికి ఆస్కార్‌కి రెండు ట్రాక్స్ నామినేట్ అయ్యాయి కూడా. ఇవన్నీ ఏమో కానీ, నేను మాత్రం వీలు చూసుకుని రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దగ్గరకెళ్లాలి అని నిర్ణయించుకున్నా. సినిమాలు ఎలా తీయాలో నేర్చుకోవడానికి కాదు. అది నాకూ కాస్తో కూస్తో వచ్చు. అయినా వెళ్లాలను కుంటున్నాను. దేనికో తెలుసా? ఒక సినిమాని ఎలా ఊహించాలో, మనకొచ్చే కొన్ని వందల థాట్స్‌లో ఏ థాట్‌ని సినిమాగా మలచాలో, ఒక దర్శకుడు ఒక వస్తువులో మంచి కథ ఉందని ఎలా గ్రహి స్తాడో, అలాంటి కథని ఎలా ఎంచు కుంటాడో నేర్చు కోవడానికి. వచ్చే వారం మరో మంచి సినిమాతో కలుద్దాం. - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
కనులు చూడలేని ప్రపంచం
దేడ్ కహానీ - బ్లాక్ ‘‘కళ్లున్న ప్రతి వాళ్లూ కలలు కంటారు-’’ అని టీచర్ క్లాసులో పాఠం చెబుతోంది. విద్యార్థులంతా శ్రద్ధగా వింటున్నారు. అంతలో హా అని ఒక గర్జనతో కూడిన అరుపు వినిపించింది. మిచెల్ అనే అంధ విద్యార్థిని. మతిస్థిమితం, వినికిడి శక్తి కూడా సరిగాలేని ఆమెని మనిషిగా మలచిన టీచర్ దేవరాజ్ సహాయ్ ఆమెకి ట్రాన్స్‌లేటర్‌గా క్లాస్‌రూమ్‌లో పక్కనే కూర్చుని ఉన్నాడు. సహాయ్ వల్లే మిచెల్ అందరు పిల్లల్తోపాటు గ్రాడ్యుయేషన్ వరకూ వచ్చింది. ‘నో’ అని అర్థం వచ్చేలా ఆమె అరిచిన అరుపుకి పాఠం చెప్తున్న టీచరు, వింటున్న పిల్లలు, పక్కనే కూర్చున్న సహాయ్ అందరూ ఉలిక్కిపడి ఆమెవైపు చూశారు. మిచెల్, సహాయ్ చేయి పట్టుకుని ఏదో సంజ్ఞ చేసింది. సహాయ్ టీచర్‌తో ట్రాన్స్‌లేట్ చేసి చెప్పాడు. ‘‘మీరు చెప్పిన విషయంతో నేను ఏకీభవించను అంటోంది టీచర్’’. టీచర్ మిచెల్‌ని నించోమంది. తన అభ్యంతరం ఏమిటో చెప్పమంది. మిచెల్ ఆంగికంతో అభినయం చేస్తుంటే సహాయ్ వాచికంతో చెప్పాడు - ‘‘కళ్లున్నవాళ్లు మాత్రమే కలలు కంటారన్నది తప్పు. కళ్లున్నవాళ్లు బయటి ప్రపంచాన్ని మాత్రమే చూస్తారు. కానీ, మనసున్నవాళ్లు లోపల మరో ప్రపంచాన్ని చూస్తారు. కలల్ని మనసుతో మాత్రమే చూడగలం. కళ్లు మూసుకున్నాకే మనసు తలుపులు తెరుచుకుని కలలు బైటకొస్తాయి. నాకు కళ్లు లేవు. కానీ నేను రోజూ కలలు కంటాను. వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడతాను’’ అంది మిచెల్. టీచర్‌తో సహా అందరూ చప్పట్లు కొట్టారు - ఆ సన్నివేశాన్ని థియేటర్లో చూస్తున్న ప్రేక్షకులతో సహా. ఒక పెద్ద బంగ్లా. మిచెల్ చెల్లెలి నిశ్చి తార్థం. పెళ్లికొడుకు, అతని తల్లిదండ్రులు, మిచెల్, ఆమె చెల్లెలు, వాళ్ల తల్లిదండ్రులు, మిచెల్ ట్రాన్స్‌లేటర్ కమ్ టీచర్ సహాయ్.. అందరూ భోజనాలకి కూర్చున్నారు. మిచెల్ చెల్లెలు అందరినీ ఉద్దేశించి మాట్లా డటం ప్రారంభించింది. నాకీ ఇంటితో చాలా జ్ఞాపకాలున్నాయి. చాలా ఏళ్లుగా చెప్పుకోలేని విషయాలున్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. ఆరేళ్ల వయసున్నప్పుడు నేను, మిచెల్ ఆడు కుంటూ పరుగెత్తాం. ఇద్దరం కిందపడ్డాం. ఇద్దరమూ ఏడ్చాం. అమ్మ, నాన్న ఇద్దరూ కంగారుగా గార్డెన్‌లోకి వచ్చారు. మిచెల్‌ని ఎత్తుకున్నారు. ఊరడిస్తూ లోపలికి తీసు కెళ్లారు. నాకూ దెబ్బతగిలింది. ఎత్తుకో మని చేతులు చాపి ఏడుస్తున్నాను. కానీ ఎత్తుకోలేదు ఆ దెబ్బ ఇంకా మానలేదు. ఇవాళ్టికీ అలాగే ఉంది. నేనూ చేతులు జాపి హత్తుకోమని అలాగే ఉన్నాను. ఇప్పటికీ అమ్మ, నాన్న మిచెల్‌ని కంటికి రెప్పలా చూస్తూనే ఉన్నారు. అన్నీ సవ్యంగా ఉండి, అందంగా పుట్టడం నేను చేసిన తప్పు కాదు. అమ్మానాన్నల ప్రేమను అక్క మిచెల్ మాత్రమే పొందింది. అది అదృష్టవంతురాలు. తల్లి దండ్రుల ప్రేమకి నోచు కోని నేను నిజ మైన వికలాంగురాలిని’’ - ఈ ప్రసంగం మొత్తాన్నీ సహాయ్ సంజ్ఞల ద్వారా మిచెల్‌కి అనువదిస్తూనే ఉన్నాడు. ఆమెలో ఉద్రేకం కట్టలు తెంచుకుంది. చెల్లెల్ని తనెంత ప్రేమించిందో ఆమె రాసుకున్న ప్రసంగాన్ని సహాయ్కిచ్చింది. అతను చదివి వినిపించాడు. చుట్టూ ఉన్న పాత్ర లన్నీ, నిందించిన చెల్లెలితో సహా కన్నీళ్లు పెట్టుకున్నాయి - ఈ దృశ్యం చూస్తున్న మనలాంటి ప్రేక్షకులతో సహా. అన్నం ఉడికిందో లేదో చెప్పాలంటే ఒక మెతుకు చూసి చెప్పమన్నారు. నేను రెండు మెతుకులు శాంపిల్ చూపించాను. ఉడికిందా? మనసు తడిసిందా? కడుపు నిండా, గుండె నిండా ఆ అనుభూతిని అనుభవించాలని ఉందా? అయితే సంజయ్‌లీలా భన్సాలీ నిర్మించి, దర్శకత్వం వహించిన ‘బ్లాక్’ చిత్రం చూసెయ్యాల్సిందే. 2005లో విడుదలైన ఈ చిత్రం ‘ఎ’ సెంటర్లలో కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు, 2 నేషనల్ అవార్డులు, 11 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకుని రికార్డులు సృష్టించింది. మానసిక అపరిపక్వత, అంగవైకల్యం జీవితంలో ఎదగడానికో, అనుకున్నది సాధించడానికో అవరోధాలు కాదు అని నమ్మిన సహాయ్ (అమితాబ్), మిచెల్ అనే చిన్న పాపకి ట్యూటర్‌గా చేరతాడు. ఆమె కన్నుల్లో అంధకారాన్ని ఏమీ చేయలేకపోయినా, లోపలున్న అంధకారాన్ని తొలగించి, ఆత్మజ్యోతిని అతడు వెలి గించడమే ఇతివృత్తం. అసహనం, చిరాకు కలగలిసిన ఓ తాగుబోతు సహాయ్. మిచెల్ (రాణీముఖర్జీ)ని ఆమె కుటుంబ సభ్యులు, సభ్యసమాజం ఒక విక లాంగురాలిగా, మతిస్థిమితం లేని దానిగా సానుభూతితో చూడకుండా, ఇండిపెండెంట్ హ్యూమన్ బీయింగ్ లా చూడాలని తాపత్రయపడటం, అతని సహాయంతో మిచెల్ తన వైకల్యాన్ని అధిగమించి జీవితంలో ఎదిగిన వైనం చూసి తీరాల్సిందే. అంధురాలిగా రాణీముఖర్జీ, ఆమె ఉన్నతికై తాపత్రయపడే సహాయ్గా అమితాబ్ బచ్చన్ నటన శిఖరాగ్ర స్థాయిలో ఉంటాయి. నిజానికి రాణీముఖర్జీ ప్రొఫెషనల్ అండ్ సీజన్డ్ ఆర్టిస్ట్. ఆమె బాగా చేయడంలో ఆశ్చర్యం లేదు. కానీ చిన్ననాటి మిచెల్గా నటించిన బాలనటి ఆయేషా కపూర్ కూడా రాణీ అంత బాగా చేయడం విశేషం. ఆ పాత్ర తాలూకు స్వరూప స్వభావాలని ముందు చిన్ననాటి పాత్రయే ప్రేక్షకులకి రుచి చూపిస్తుంది కాబట్టి ఆమె రాణించడం పెద్ద సవాలు. ఆ సవాలును స్వీకరించి చక్కగా సక్సెస్ సాధించింది ఆయేషా కపూర్. అలా ఆమెకి రెండు మార్కులు ఎక్కువే వేయొచ్చు. అయితే వీళ్లందరితో ఇంత బాగా చేయించిన ఘనత మాత్రం దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీదే. ఆయన ఈ చిత్రాన్ని మలిచిన తీరు అమోఘం! ఈ చిత్రంలోనే కాదు... చిత్ర నిర్మాణం వెనుక కూడా కొన్ని ఆసక్తి కరమైన విశేషాలు ఉన్నాయి. వాటిలో ఇవి కొన్ని... పాత్ర చాలా చాలెంజింగ్‌గా ఉంది కాబట్టి దానికి న్యాయం చేయగలనో లేదో అని రాణీముఖర్జీ ఈ పాత్రని ఒప్పుకోవ డానికి మొదట చాలా తటపటా యించిందట. ఈ చిత్రానికి ముందు ఎ.ఆర్.రెహ్మాన్‌ని సంగీత దర్శకుడిగా అనుకున్నారట. కానీ ఆ సమయానికి ఆయనకి ఖాళీ లేక మాంటీశర్మని ఫిక్స్ అయ్యారట. ప్రముఖ బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ (రిషికపూర్ కొడుకు), ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సోనమ్‌కపూర్ (అనిల్‌కపూర్ కూతురు) ఇద్దరూ ఈ చిత్రానికి దర్శకత్వ శాఖలో సహాయ దర్శకులుగా పనిచేశార్ట. హెలెన్ కెల్లెర్ ఆత్మకథని చదివి, ఆమె ఇన్స్టిట్యూట్కి వెళ్లి ఇంకొంత రీసెర్చ్ చేసి సంజయ్‌లీలా భన్సాలీ ఈ కథని తయారుచేసుకున్నాట్ట. 2013లో టర్కీ భాషలో ‘బెనిమ్ డున్యమ్’ పేరుతో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఇలాంటి ఎన్ని విశేషాలు ఉన్నా... ఈ చిత్రం ద్వారా భన్సాలీ ప్రేక్షకులకు ఇచ్చిన సందేశం తర్వాతే ఏదయినా. మానసి కంగా అయినా, శారీరకంగా అయినా వైకల్యాన్ని జయిస్తే కైవల్యం సిద్ధిస్తుందన్న వాస్తవాన్ని అందమైన దృశ్య రూపంలో చూపించిన ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే! - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
లబ్‌కి డబ్కి మధ్య జీవితకాలపు కథ
దేడ్ కహానీ - కల్ హో న హో 1999, డిసెంబర్ 31... అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రపంచవ్యాప్తంగా వైటుకె వచ్చి కంప్యూటర్ వ్యవస్థలన్నీ కొట్టుకుపోతాయి. ఇంక 2000 నంచి టెక్నాలజీ ఉంటుందో, ఉండదో అన్నారు. కల్ హో న హో... ఉంది. ఇంకా బాగా పెరిగింది. 2012... ప్రళయం వచ్చి మొత్తం ప్రపంచమంతా కొట్టుకుపోతుంది అన్నారు. ఇంక మానవాళికి రేపన్నది ఉంటుందో, ఉండదో అన్నారు. కల్ హో న హో... ఉంది. ఇంకా బ్రహ్మాండంగా ఎదిగింది. 2003, నవంబర్ 28న షారుక్‌ఖాన్, ప్రీతిజింతా, సైఫ్ అలీఖాన్ లాంటి అగ్ర తారాగణంతో కరణ్ జోహార్ కథ, నిర్మాణంలో నిఖిల్ అద్వానీని దర్శకుడిగా పరిచయం చేస్తూ కల్ హో న హో... అన్నారు. ఆడింది. అద్భుతంగా ప్రజాదరణ పొందింది. లబ్... డబ్.. అనే గుండె చప్పుడులో లబ్‌కి డబ్కి మధ్య జీవితకాలపు కథ. ఇది ట్యాగ్‌లైన్‌కి తెలుగు అర్థం. ఎంత అద్భుతమైన ఆలోచన. ‘‘ఈ రోజు ఒక నవ్వు ఎక్కువ నవ్వు... ఈ రోజు ఒక ప్రార్థన ఎక్కువ చెయ్యి... ఈ రోజు ఒక కన్నీటి చుక్క ఎక్కువ త్రాగు... ఈ రోజు ఒక జీవితం ఎక్కువ జీవించు... ఈ రోజు ఒక కల ఎక్కువ కను... ఎవరికి తెలుసు... రేపుంటుందో, ఉండదో’’... కల్ హో న హో... ఈ చిత్రం అమన్ పాత్రధారి షారుక్‌ఖాన్, నైనా పాత్రధారి ప్రీతిజింతాతో అనే డైలాగ్... ఎంత అద్భుతమైన సంభాషణ. 1971లో వచ్చిన ‘ఆనంద్’ అనే హిందీ సినిమా రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్, సుమితా శాన్యాల్ ప్రధాన పాత్రధారులుగా, హృషికేశ్ ముఖర్జీ రచన, దర్శకత్వం. ఈ ‘ఆనంద్’ కథనే స్ఫూర్తిగా తీసుకుని, 2003లో పూర్తిగా అమెరికా నేపథ్యంలో ఎన్నారైల మధ్య కథగా, భారతీయ ఆధునిక కుటుంబాల భావోద్వేగాలు కలగలిపి తీసిన చిత్రంలా ఉంటుంది ‘కల్ హో న హో’. సాధారణంగా సినిమాలలో కొన్ని అంశాలు చాలా బావుంటాయి. కొన్ని సాధారణంగా ఉంటాయి. ప్రతి మూమెంట్‌ని మనం ఆస్వాదించే సినిమాలు కొన్నే ఉంటాయి. వాటిలో ‘కల్ హో న హో’ ఒకటి. పాటలు వినగానే సినిమా చూడాలనిపించింది. సంగీత దర్శక త్రయం శంకర్-ఇషాన్-లాయ్ మహత్యం అది. పోస్టర్ చూడగానే సినిమా చూడాలనిపించింది. కరణ్ జోహార్ ప్రతిభ అది. సినిమా చూడగానే మళ్లీ చూడాలనిపించింది. కొత్త దర్శకుడు నిఖిల్ అద్వానీ గొప్పదనం అది. అమన్ పాత్రలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ నటన అమోఘం. కనీసం నాలుగైదుసార్లు కన్నీళ్లు పెట్టిస్తాడు. కొద్దిక్షణాల్లో చనిపోతాడనగా కూడా చిరునవ్వు నవ్విస్తాడు. ఈ సినిమా కచ్చితంగా చూసి తీరవలసిందే. ఇందులో ప్రీతిజింతా పాత్రకి ముందు కరీనా కపూర్‌ని ఎంచుకున్నార్ట. పారితోషికం దగ్గర తేడా వచ్చి, ఆమె ఈ అవకాశాన్ని వదులుకుంది. అది ప్రీతిజింతాని వరించింది. ఆమె చాలా తెలివిగా ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకొంది. రోహిత్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటన చాలా సహజంగా, ఉన్నతంగా, అంతకంటే ఎక్కువ సరదాగా ఉంటుంది. నైనా జీవితంలో చికాకులతో కోల్పోయిన చిరునవ్వుని వెలిగిస్తాడు పక్కింట్లోకి కొత్తగా వచ్చిన అమన్. అతనితో ప్రేమలో పడుతుందామె. కానీ ఆమె స్నేహితుడు రోహిత్‌కి నైనా అంటే ప్రేమని తెలిసి, తనకు ఆల్రెడీ ప్రియ అనే అమ్మాయితో (సోనాలీ బింద్రే) పెళ్లయిపోయిందని చెప్తాడు. బాధగా వెళ్లిపోతుంది నైనా. అమన్ తల్లి అడుగుతుంది అమన్‌ని - ‘‘నువ్వు కూడా ప్రేమించావ్ కదరా నైనాని. అబద్ధం ఎందుకు చెప్పావ’’ని. ‘‘నిజం చెప్పాలా అమ్మా. నా గుండె ఏ క్షణాన్నైనా ఆగిపోవడానికి సిద్ధంగా ఉందని నిజం చెప్పాలా? నాకు తనంటే ఇష్టమున్నా, రేపు అనేది నా జీవితంలో ఉందో లేదో తెలీకుండా ప్రతిరోజూ గడుపుతున్నానని నిజం చెప్పాలా’’ అని ఆవేదనగా అడుగుతాడు. ఈ నిజం ప్రేక్షకుడికి తెలియడమే ఇంటర్వెల్. ఇంక ద్వితీయార్ధంలో నైనా, రోహిత్‌లని కలపడమనే ప్రహసనాన్ని వీలైనంత కామెడీ జొప్పించి మెప్పించారు రచయితలు, దర్శకుడు, నటీనటులు. చివరికి ప్రేక్షకుడికి తెలిసిన నిజాలన్నీ పాత్రలకి కూడా తెలియడం, బాధలు, ఆవేదనలు, అమన్ చనిపోవడం, నైనా, రోహిత్ ఒకటవ్వడం... ఇవన్నీను! ఎన్నారై మార్కెట్‌ని పెంచిన ‘కభీ కుషీ కభీ గమ్’ తర్వాత అదే ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌పైన కరణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రం ఎన్నారై మార్కెట్‌ని కొత్త పుంతలు తొక్కించింది. క్షణ భంగురమైన మానవ జీవితానికి రేపన్నది ఉంటుందో లేదో తెలీదు కానీ, మంచి భారతీయ చలన చిత్రాల జాబితాలో ‘కల్ హో న హో’ ఎప్పుడూ ఉంటుంది. వచ్చేవారం సినిమాలు తీసే ఆలోచనలని అన్నింటినీ కకావికలం చేసి ఇలా తీయాల్రా అని మెదళ్లకి రిపేర్లు చేసిన దర్శక శ్రేష్టుడు రాజ్‌కుమార్ హిరానీ ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’తో మళ్లీ కలుద్దాం. -వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
ఓ తండ్రి మాయాజాలం
కోయీ మిల్ గయా దేడ్ కహానీ - కోయీ మిల్గయా అది 8, ఆగస్ట్, 2013 - ఎవరో... కలిశారు. కోయీ... మిల్గయా. ఆ ఎవరో పేరు జాదూ. ఒక అశక్తుడికి సర్వశక్తి యుక్తులూ సెకన్లలో రావడమే జాదూ అంటే - మాయాజాలం, మ్యాజిక్. కహో నా ప్యార్ హై... లాంటి సూపర్‌హిట్ సినిమాతో ఎంటర్ అయ్యాక, వరుసగా ‘ఫిజా’, ‘మిషన్ కాశ్మీర్’ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడటం, ‘కభీ కుషీ కభీ గమ్’ హిట్ అయినా అది హీరో షారుక్ ఖాన్‌కి, డెరైక్టర్ కరణ్ జోహార్‌కి మాత్రమే ప్లస్ అవ్వడం - దర్శకుడు, నిర్మాత, కథకుడు రాకేష్ రోషన్‌ని ఆలోచనలో పడేసింది. కొడుకు కెరీర్‌ని మళ్లీ తానే గాడిలో పెట్టాలనుకున్నట్టున్నాడు - ఇంకో ‘మ్యాజిక్’ చేశాడు - ఆ జాదూ పేరే ‘కోయీ మిల్ గయా’. ఫక్తు కమర్షియల్ అంశాలున్న సైన్స్ ఫిక్షన్ ఇది. ఈ కథ గురించి చెప్పాలంటే, 40 ఏళ్లు వెనక్కి వెళ్లి ఇంకో చిన్న కథ గురించి చెప్పుకోవాలి. టింగ్... టింగ్... టింగ్... (ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్స్) 1962లో విశ్వవిఖ్యాత భారతీయ దిగ్దర్శకుడు సత్యజిత్ రే తన ఫ్యామిలీ మ్యాగజైన్ ‘సందేశ్’ కోసం ‘ది ఎలియన్’ అనే కథ రాసుకుని ప్రచురించారు. మిస్టర్ ‘అంగ్’ అనే ఒక గ్రహాంతర వాసి, బెంగాల్‌లోని ఒక కుగ్రామంలో అంతరిక్ష విమానంలోంచి దిగి, ఆ పల్లెటూళ్లో ‘హాబా’ అనే ఓ అమాయకపు బాలుడిని కలవడం, ఆ అంతరిక్ష విమానాన్ని గ్రామస్థులు సరస్సులో వెలసిన దేవాలయంలా భావించి పూజించడం... ఇలాంటి ఇతివృత్తంతో రాసుకున్న కాల్పనిక కథ ఇది. హాలీవుడ్ తెరమీద మన కథ! తర్వాత రోజుల్లో ‘ది ఎలియన్’ కథని ఇండో-అమెరికన్ సంయుక్త నిర్మాణంలో కొలంబియా పిక్చర్స్ సంస్థ అప్పటి హాలీవుడ్ సూపర్‌స్టార్ మార్లన్ బ్రాండోని ప్రధాన పాత్రధారిగా, సత్యజిత్ రే దర్శకత్వంలోనే సినిమా తీద్దాం అనుకున్నారు. అనుకోని పరిస్థితుల్లో ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. కానీ, ఆ కథని మైక్ విల్సన్ అనే వ్యక్తి తన పేరున రిజిస్టర్ చేసుకుని మార్కెట్ చేసుకోవడం ఆరంభించాడు. ఎక్కువ కాలం వేచి ఉండలేక, సత్యజిత్ రే భారతదేశానికి వచ్చేశారు. ఆ తర్వాత 1977లో ‘క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్’, 1979లో ‘ఎలియన్’, 1982లో స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలో ‘ఈ.టీ.’ (ఎక్స్ట్రా టెరస్ట్రియల్) సినిమాలు వరుసగా వచ్చాయి. వాటన్నింటి మూలం భారతీయ దర్శక మేధావి సత్యజిత్ రే కథ ‘ది ఎలియన్’ అని హాలీవుడ్ పరిశ్రమ మొత్తానికి తెలుసు. కథా చౌర్యం కురిపించిన కాసుల ఖజానాలో కథ రాసిన ఒరిజినల్ రైటర్ సత్యజిత్ రేకి రూపాయి కూడా రాలేదు. కానీ, ఆ చిత్రాలకి భారతదేశం ఇచ్చిన రెవెన్యూ వాటి కలెక్షన్ల మొత్తంలో పాతిక శాతం పైనే. టింగ్... టింగ్... టింగ్... (ఫ్లాష్ బ్యాక్ ఎండ్స్) ప్రస్తుతంలోకొస్తే ఇంచుమించు అనే కథావస్తువుతో ‘హాబా’ అనే బాలుడి పాత్రని కొద్దిగా మార్చి, మనిషి ఎదిగినా మెదడు ఎదగని అమాయకుడి పాత్ర రోహిత్ మెహ్రాగా మలచి, తన కొడుకు హృతిక్ రోషన్ సైజుకి తగ్గట్టు పాత్రని కుట్టాడు తండ్రి, దర్శకుడు రాకేష్ రోషన్. రెయిన్ మ్యాన్, ఫారెస్ట్ గంప్, స్వాతిముత్యం తదితర చిత్రాల్లోని హీరో పాత్రల్లా హృతిక్ రోషన్‌కి స్టార్ హీరోగా మాత్రమే కాదు మంచి నటుడిగా కూడా పేరు, అవార్డులు తెచ్చిపెట్టింది ‘కోయీమిల్ గయా’. ఇంగ్లిష్ టేకింగ్కి భారతీయ మసాలా! గ్రహాంతర వాసి ‘జాదూ’, అమాయకుడైన రోహిత్ మెహ్రాని మామూలు యువకుడిగా మార్చడం, తన అతీత శక్తులతో రోహిత్, అతని స్నేహితులని హీరోలను చేయడం, వాళ్ల శత్రువుల్ని విలన్లను చేసి ఆటపట్టించి, ఓడించడం - ఇందులో భాగంగా ఆ హిల్‌స్టేషన్ కలెక్టర్ కూతురు నిషా (ప్రీతిజింతా), రోహిత్ ప్రేమలో పడటం, చివరికి ‘జాదూ’ని మానవ మృగాల బారినపడనివ్వకుండా రోహిత్ హీరోచితంగా పోరాడి, అతడిని గ్రహాంతర వాసులతో కలిపి సేఫ్‌గా స్పేస్‌షిప్ ఎక్కించి పంపించడం - రాజేష్ రోషన్ అద్భుతమైన పాటలతో, ఇంగ్లిష్ సినిమాలకి ఏ మాత్రం తీసిపోని విజువల్ ఎఫెక్ట్స్‌తో, భారతీయ ప్రేక్షకుడు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్లు మసాలా రుచులు పర్ఫెక్ట్గా మేళవించి మిలీనియమ్ మొదలైన మూడేళ్లలో రెండో సూపర్ డూపర్ హిట్ నమోదు చేశారు తండ్రి రాకేష్, తనయుడు హృతిక్ రోషన్లు. తత్ఫలితంగా భారతీయుడి మేధస్సుకి (సత్యజిత్ రే) ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ పట్టం కట్టినట్టు కూడా అయింది. పోస్టర్ చూస్తే... ‘కోయీ మిల్ గయా’ పోస్టర్ చూడగానే, హృతిక్, ప్రీతిజింతాల అందమైన ప్రేమకథ కాబోసు అనిపించింది. రాకేష్ రోషన్ సినిమా కాబట్టి కహో నా ప్యార్ హై తర్వాత కచ్చితంగా ఇంకో ప్రేమకథే తీసుంటారు అనిపించింది. ఆడియో వినగానే అన్ని పాటలూ పక్కగా ప్రేమకథా చిత్రాల్లోని పాటల్లాగే ఉంటాయి. ‘కోయీ మిల్ గయా’ అనే టైటిల్ సాంగ్ పాడినది మన దక్షిణాది మధుర గాయని చిత్రగారు. ఆ పాట సూపర్‌హిట్. ‘ఇదర్ చలా మై ఉదర్ చలా’ పాట, ‘హైలా..’ పాట కూడా వినడానికి చాలా బావున్నాయి. థియేటర్లో కూచున్నాక, బ్రహ్మాండమైన సర్ప్రైజ్. అది గుర్తుతెచ్చుకోవాలన్నా, అనుభూతి చెందాలన్నా మళ్లీ ఓసారి చూడాల్సిందే. తల్లిగా రేఖ నటన మళ్లీ కనువిందు చేస్తుంది. ఇవాళ్టి ప్రముఖ హీరోయిన్ ‘హన్సిక’ ఇందులో బాల నటి. ఈ చిత్రం సాధించిన ఘనవిజయం బాలీవుడ్ తెరమీద హృతిక్ రోషన్‌ని ఆబాలగోపాలం మెచ్చే సూపర్ హీరోని చేసింది. ఈ చిత్రానికి రెండు సూపర్ హిట్ సీక్వెల్స్ చేసేలా ప్రేరేపించింది. హాలీవుడ్‌కి ఒక సూపర్మ్యాన్లా, బ్యాట్‌మ్యాన్‌లా మనకి ‘క్రిష్’ అనే ఓ వెండితెర సూపర్ హీరోని అందించింది. వచ్చేవారం...‘కల్ హో న హో’... రేపనేది ఉంటుందో ఉండదో - అని. ఆ ఆర్టికల్ కూడా ఇవ్వాళే రాసేయలేను కదా! కాబట్టి, రేపన్నది ఉందని నమ్మి, వచ్చే ఆదివారం కలుద్దాం. నమస్తే! మాటల్లో మెచ్చు తునకలు కొన్ని... * ‘ఓమ్’ అనేది పవిత్ర హిందూ నాదం. విశ్వంలో ఉన్న శబ్ద తరంగాలన్నీ ఒక్క ‘ఓమ్’లో ఉన్నాయి. * పిచ్చి అనేది ఒక గుణం - రోగం కాదు. కొంత మందికి షాపింగ్ పిచ్చి, కొంతమందికి తిండి పిచ్చి, కొంతమందికి సంగీతం పిచ్చి... ఇలా రకరకాల వ్యాపకాల పిచ్చి ఒక రకం అయితే, మామూలు కన్నా కొంచెం ఎక్కువో, తక్కువో ప్రతిస్పందించడాన్ని కూడా పిచ్చి అనుకోవచ్చు. * రకం పిచ్చికి సైకియాట్రిస్ట్‌లు మందు ఇస్తారు. నన్ను పిచ్చివాడన్నారు కదా! యస్. నేను పిచ్చివాడినే. మా అమ్మాయి ప్రేమలో పడిన పిచ్చివాణ్ని. * కంప్యూటర్ మనుషుల్ని తయారుచేయదు - మానవ మేధస్సే కంప్యూటర్స్‌ని తయారుచేసింది. మెదడు చేసేవన్నీ కంప్యూటర్ చేయలేదు. * ఎవరినీ చిన్నపిల్లలని చులకన చేయకండి సర్. ఆ పిల్లలే పెరిగి పెద్దవాళ్లవుతారు ఫ్యూచర్లో. * ఈ ప్రపంచం ప్రతి కొత్త విషయాన్ని ముందు తిరస్కరించింది. తర్వాతే అంగీకరించింది. * ఇలాంటి మంచి సంభాషణలతో పాటు గ్రహాంతర వాసులకి కూడా మంచి మనసు, ఆర్ద్రత, కన్నీరు, ఆనందం అన్నీ మనలాంటి భావాలే ఉంటాయని, ఈ తరం ప్రేక్షకులని ఒప్పించిన ఘనత దర్శకుడిది. - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
స్నేహం... ప్రేమ కలిస్తే!
దేడ్ కహానీ - దిల్ చాహ్తా హై ‘‘మనసు కోతి లాంటిది. యుక్త వయసులో ఏది పడితే అది కోరుకుంటుంది. బుద్ధి... బుద్ధిగా ఉండమని ఎంత చెప్పినా మనసు వినదు. ఎప్పుడో విధి ఒక హెడ్మాస్టారిలా ఏదన్నా ఒక సంఘటన రూపంలో లాగి మనసుని కొట్టినప్పుడు బుద్ధిగా మాట వింటుంది. ఆ అనుభవాన్ని పాఠంలా అవలోకనం చేసుకుంటుంది. ఆ తర్వాత కూడా నిలబడేవే నిజమైన బంధాలు. అవే ఆ జన్మకి అందాలు.’’ ఈ వ్యాసం రాయడం కోసం ‘దిల్ చాహ్తా హై’ సినిమా మళ్లీ చూసినప్పుడు నాకిలా అర్థమైంది. కొన్ని సినిమాలు మొదటిసారి చూస్తే బావుండీ, బాలేక అటు ఇటుగా అనిపిస్తుంటాయి. తర్వాత వాటి రన్లో వాటి విలువ రోజురోజుకీ పెరిగి చివరికి అవి కల్ట్ ఫిల్మ్గానో, ఎపిక్ ఫిల్మ్గానో నిలుస్తాయి. దిల్ చాహ్తా హై... ఆ కోవకు చెందిన సినిమా. ‘షోలే’ రాసిన గొప్ప రచయితలు సలీమ్, జావేద్‌లలో జావేద్ అఖ్తర్ కొడుకు ఫర్హాన్ అఖ్తర్. చిన్నప్పట్నుంచీ సినిమా కుటుంబం, ఎగువ మధ్య తరగతి, ఆపైన సంపన్న జీవితాల సావాసం. ఆ యువత జీవనశైలితో ఓ కథ రాసుకున్నాడు. అది కూడా నెలన్నరపాటు అమెరికాలో హాలిడేకి వెళ్లినప్పుడు తన స్నేహితుల్ని కలిసి, వారితో సాగిన ముచ్చట్ల నుంచి, వారి ప్రేమకథల గురించి ఒక కథ రాసుకున్నాడు. అందుకే దిల్ చాహ్తా హై సినిమాలో నిజ జీవిత దర్పణం ఉంది. జీవం ఉంది. ప్రాథమిక హిందీ సినిమా కమర్షియల్ సూత్రాలన్నింటినీ బ్రేక్ చేసినా, కమర్షియల్‌గా హిట్ అవ్వగలిగిన ఆత్మ ఉంది. ఆకాష్, సమీర్, సిద్ధూల పాత్రల్లో ప్రతి మిలీనియం యువకుడూ తనని తాను చూసుకున్నాడు. పక్కింటి ఆంటీకి సైటు కొట్టడం నుంచి, నచ్చిన ప్రతి అమ్మాయినీ ప్రేమించేయడం నుంచి, అమ్మాయి కోసం ఫ్రెండ్స్‌తో కూడా దెబ్బలాడి దూరం అవ్వడం నుంచి, ప్రేమ, విరహం, బాధ, నవ్వులు, మళ్లీ కలుసుకోవడం, అనుభూతులు - అన్నింట్లోనూ ఐడెంటిఫై అవ్వక తప్పని బలమైన సహజ పాత్రలు సృష్టించాడు దర్శక రచయిత ఫర్హాన్ అఖ్తర్. అలాగే శాలిని, దీప, ప్రియ, పూజ, తార ఆంటీ - ఆధునిక భారతావని వనితల్లో ప్రతి ఒక్కరూ వీళ్లల్లో కనపడతారు. కన్ఫ్యూజన్లు, కోపాలు, ప్రేమలు, విరహాలు... అన్నీ. పోస్టర్ చూశాక: ఒక మోడర్న్ కామెడీ సినిమా విత్ మల్టిపుల్ క్యారెక్టర్స్ అనిపించింది. ఆమిర్‌ఖాన్, ప్రీతిజింతా కోసం, ‘దిల్ చాహ్తా హై’ అని మంచి టైటిల్ పెట్టాడు కాబట్టి ‘దిల్‌తో పాగల్ హై’లో సగం ఉన్నా చాలనుకుని వెళ్లాలనుకున్నాను. దర్శకుడి మొదటి సినిమా అనగానే కాస్త భయం ఉంటుంది మనసులో నాకెప్పుడూ - అదృష్టవశాత్తూ ఫర్హాన్ అఖ్తర్ రెండో సినిమా ‘లక్ష్య’కి భయపెట్టాడు కానీ, మొదటి సినిమా ‘దిల్ చాహ్తా హై’ని అద్భుతంగా కన్నా కొంచెం ఎక్కువ బాగా తీశాడు. నిజ జీవిత పాత్రల స్వభావాలు, కొన్ని సంఘటనలు స్నేహితుల నుంచి సేకరించినా, మరికొంత డ్రామాని, కథని షేక్స్పియర్ రాసిన ‘మచ్ ఎడో అబౌట్ నథింగ్’ నుంచి ప్రేరణ పొందినట్టు ఉంటుంది. మొదట ఆమిర్‌ఖాన్‌కి సిద్ధూ పాత్రని ఆఫర్ చేస్తే, ఆయన కథంతా విని ఆకాష్ పాత్ర నాకు బాగా దగ్గరగా ఉంది, ఆ పాత్రనే చేస్తానని ఎంచుకున్నార్ట. చాలాకాలం తర్వాత డింపుల్ కపాడియాని ఒప్పించి తార పాత్రకి తెచ్చుకోవడం ఫర్హాన్ కృషే. అలాగే అభిషేక్ బచ్చన్ మొదట సిద్ధూ పాత్రని ఒప్పుకుని, చివరి నిమిషంలో డ్రాప్ అయితే, ఆ అవకాశం అక్షయ్ఖన్నా దక్కించుకున్నాడు. అలా, ఆమిర్‌ఖాన్, సైఫ్ అలీఖాన్, అక్షయ్ఖన్నా స్నేహితుల పాత్రలకి సెట్ అయ్యారు. కథ గురించి చెప్పుకుంటే... ఆకాష్ ధనవంతుల బిడ్డ - ప్రేమ, దోమ లాంటి ఫీలింగ్స్‌ని నమ్మడు. ఫ్లర్ట్ చేసి వదిలేస్తుంటాడు ఏ అమ్మాయినైనా. సమీర్, సిద్ధూ ఎగువ, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు. సమీర్ ఏ అమ్మాయినైనా ఇట్టే ప్రేమించేసి, అదే నిజమని నమ్మేస్తుంటాడు. సిద్ధూ చాలా ముభావి. స్వతహాగా పెయింటర్. వీళ్ల స్నేహంలో వచ్చిపోయే సబ్ క్యారెక్టర్లే హీరోయిన్లు, తల్లిదండ్రులు అందరూ. ఈ స్నేహం విడిపోయినట్టు మొదటి సీన్లో చెప్పి, అక్కణ్నుంచి వీళ్ల ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. విశ్రాంతి సమయానికి సిద్ధూ, ఆకాష్ ఒకరినొకరు తిట్టుకుని విడిపోతారు. సెకెండ్ హాఫ్‌లో వాళ్ల జీవితాల్లో వచ్చిన మార్పులు, ఒంటరిగా వాళ్లు తీసుకున్న నిర్ణయాలు, వాటి మంచీ చెడులు - చివరికి ముగ్గురూ కలవడం. ఇది కథ కాదు - కొందరి జీవితం. పాత్రల స్వభావాలకు అనుగుణంగా రాసుకున్న సంఘటనలు, వాటివల్ల ఉత్పన్నమయ్యే ఎమోషన్లు - కాబట్టి ఈ సినిమాలో పాత్రలు ఏడిస్తే మనకు ఏడుపొస్తుంది. పాత్రలు నవ్వితే మనకి నవ్వొస్తుంది. పాత్రలు దెబ్బలాడుకుంటే మనకి బాధేస్తుంది. పాత్రలు మళ్లీ కలుసుకుంటే మనకు కళ్లు చెమ్మగిల్లుతాయి. ఈ పాత్రలకి తోడు వాళ్ల స్టైలింగ్, వాళ్లు నివసించే ఇళ్లు, గదులు, ఫర్నిచర్, కాస్ట్యూమ్స్ అన్నీ అంతే న్యాచురల్‌గా, అంతే అందంగా ఉండటం చెప్పుకోదగ్గ విషయం. శంకర్, ఎహ్సాన్, లాయ్ సంగీతం ఈ చిత్రానికి ఆయువుపట్టు. పాటలెక్కడా అసందర్భంగా ఉండవు. సీన్ల మధ్యలో ఒక్కో సీన్‌లాగే పాట వచ్చి వెళ్తుంది - సాహిత్యం కూడా క్యారెక్టర్లు మాట్లాడుకున్నట్టే ఉంటాయి. డ్యాన్సర్లు, స్టెప్పులు లేకుండా సినిమాలో అన్ని పాటలూ తీయడం ఈ సినిమాకి క్లాస్‌ని ఆపాదించింది. ‘దిల్ చాహ్తా హై’ టైటిల్ ట్రాక్, జానెక్యూం లోగ్ ప్యార్ కర్తే హై, తన్హాయీ... అన్ని పాటలూ దేనికవే సూపర్హిట్లు. అన్నీ కథను ముందుకు నడిపించేవే. రవి.కె.చంద్రన్ ఛాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, చెన్నైలో సౌండ్ ఇంజినీరు మీడియా ఆర్టిస్ట్ శ్రీధర్... వీళ్లంతా భారతీయ మిలీనియం సినిమా మీద దక్షిణాది నుంచి బలమైన ముద్ర వేసిన సాంకేతిక నిపుణులు. జావేద్ అఖ్తర్ అన్ని పాటలూ యువతీ యువకుల మనోభావాల, భావాల సంఘర్షణలని, ఆనందాల్ని అక్షరీకరించాయి. పెట్టిన ప్రతి రూపాయికీ మరో రూపాయి లాభాన్ని తెచ్చి పెట్టిన చిత్రం ‘దిల్ చాహ్తా హై’. ఈ సినిమాలో మాటల్లాగ, ఇది ఆకాష్ మ్యాజిక్. ఇది ఫర్హాన్ అఖ్తర్ మ్యాజిక్ - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
కర్రా బిళ్లా VS క్రికెట్
దేడ్ కహానీ లగాన్ అంటే పన్ను, శిస్తు. ‘శిస్తువేత్తి, పస్తువేత్తి - వేత్తి కనకవర్షం సుమీ’... ఇదీ కొత్త సామెత. లగాన్ సృష్టించిన చరిత్ర, కురిపించిన కాసులు ఒక ఎత్తయితే... తెల్ల దొరల పాలనలో పన్నుల బాధల్ని ఎంతో ఎంటర్టైనింగ్గా చెప్పిన చిత్రం అయినందుకు నల్ల దొరల పాలనలో వినోద ‘పన్ను’ మినహాయింపులు పొందడం ఎంత గొప్ప! 15 జూన్ 2001 భారతీయ సినీచరిత్రలో గుర్తించుకోదగిన రోజు. 1983 నుంచీ మన దేశంలో అనధికార మతంగా ఎదిగిన క్రీడ క్రికెట్. దాని మూలాలు బ్రిటిష్వాళ్లవే. స్వాతంత్య్రానికి పూర్వం భారతీయ బానిసత్వం నేపథ్యంగా వచ్చిన చిత్రాలన్నీ స్ఫూర్తిమంతమైన, దేశభక్తిపూరిత చిత్రాలుగా మాత్రమే ఉంటాయి. కానీ అదే స్ఫూర్తి, దేశభక్తిని క్రికెట్ అనే క్రీడావినోదంతో ముడిపెట్టవచ్చనే ఆలోచన దర్శక రచయిత అశుతోష్ గోవారికర్కి రావడమే అద్భుతం. దాన్ని ఆమిర్‌ఖాన్ అంగీకరించి స్వయంగా నిర్మించడానికి పూనుకోవడం మహాద్భుతం. ‘లగాన్’కి తొమ్మిదేళ్లకు ముందు వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘బాజీ’ అనే మాస్ మసాలా సినిమా అట్టర్‌ఫ్లాప్. ఆ భయంతోనే ఏమో అశుతోష్ ‘లగాన్’ కథని వేరే హీరోలందరికీ వినిపించాడు ముందర. అన్నిచోట్లా తిరస్కారానికి గురైన ఆ కథ, చివరకు ఆమిర్‌ఖాన్ ఒప్పుకోవడంతో తెరకెక్కి... అత్యున్నత పురస్కారాలను, ప్రేక్షకుల నీరాజనాలను అందుకోవడానికి తయారైంది. ఈ సినిమా మీద నేను నాలుగు పేజీల వ్యాసం రాయలేను. కనీసం నాలుగొందల పేజీల పుస్తకం రాయాలి. మస్తిష్కం ఉపయోగించి తీసిన సినిమాలు కమర్షియల్‌గా హిట్ అవుతాయి. కానీ, మనసుపెట్టి తీసిన సినిమాలు హిట్‌తో పాటు ప్రేక్షకుడి మస్తిష్కాన్ని మధిస్తాయి. ప్రేక్షకుడి మనసు మీద చెరగని ముద్ర వేస్తాయి. ‘లగాన్’ ఆ కోవకు చెందిన సినిమా. పోస్టర్ చూశాక: ఓ స్వాతంత్య్ర సమరయోధుడి ప్రేమకథ కాబోసు అని డౌట్ వచ్చింది. ఓ పక్క బ్రిటిష్ యువరాణి, మరోపక్క సంప్రదాయ భారత వనిత, మధ్యలో చిన్న రూరల్ గెటప్‌లో అందమైన ఆమిర్‌ఖాన్. ఇంతకన్నా ఏం చేసుకుంటాడులే - అనుకున్నా. థియేటర్లో కూర్చున్నాక: గంభీరమైన అమితాబ్ బచ్చన్ స్వరంతో... స్వాతంత్య్రం రాకముందు తెల్లదొరలు స్థానిక రాజుల్ని వశపర్చుకుని సామాన్య ప్రజలకి పన్నులెలా బాదేవారు? గుజరాత్‌లోని చంపానెర్ అనే కుగ్రామంలో జరిగిన కథ అని మొదలై... పాత్రలు ఒక్కొక్కటిగా పరిచయం అవుతూ బ్రిటిష్ సైనికుల దౌర్జన్యం కనపడుతుంది. ఇదేదో ఫ్రీడమ్ ఫైటర్ స్టోరీ అయ్యుంటుంది అనుకున్నా. భువన్ గురించి వేరే పాత్రలు మాట్లాడుకున్నాక, దొంగతనంగా జింకల్ని రాళ్లతో కొడుతున్న భువన్. సరిగ్గా జింకల పక్కనున్న చెట్టుకి రాయి తగిలి జింకలు పరుగెత్తడం, అదే చెట్టుకి ఓ తుపాకీ గుండు తగలడం, ఆ తుపాకీని పేల్చిన తెల్లదొర కెప్టెన్ రసెల్ కనబడటం క్షణాల్లో జరుగుతుంది. భువన్ జింకల్ని కొట్టట్లేదు. ఆ తుపాకీ గుళ్ల నుంచి వాటిని కాపాడుతున్నాడని అర్థమైంది. భువన్ పాత్రని, ఆ పాత్రనలా పరిచయం చేసిన దర్శకుణ్ని ప్రేమించేయడం మొదలుపెట్టాను. ‘ఆహా! ఏం ఐడియా’ అనుకున్నాను. భువన్ మెడమీద తుపాకీ పెట్టి, జింకల్ని కాలుస్తాడు కెప్టెన్ రసెల్. భువన్‌కి వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు. హీరో ఫెయిల్యూర్‌తో సినిమా స్టార్ట్ అయ్యింది. చివ్వరి రీలు దాకా ఆ ఓటమి పరంపరలోనే సినిమా అంతా నడుస్తుంది. అయినా అతని పాత్రలోని మొక్కవోని ధైర్యం, పట్టుదల, తెగింపు, దేశభక్తి చూసి చూసి చూసి... చివరి బాల్కి వీడు సిక్స్ కొట్టకపోతే మనం సీట్లోంచి లేచి తెరమీద సిక్స్ కొట్టి భారతీయుల్ని గెలిపించాలన్నంత కసి వచ్చేస్తుంది. ‘చిన్న చిన్న కళ్లల్లో పెద్ద పెద్ద కలలు...’ భువన్ పాత్రని తిడుతూ గ్రామస్తుల మాటలు... క్రికెట్‌ని తేలిక చేస్తూ భువన్ ‘ఇది మా గిల్లీ దండా ఆటే... చిన్నప్పట్నుంచీ చూస్తున్నాను’ అనడం చప్పట్లు కొట్టించింది. ఈ కథని రాయకూడదు. అనుభవించాలి. ఎందుకంటే... ఈ సినిమాని దర్శకుడు తీయలేదు, తీయగా మలిచాడు కాబట్టి. విశేషాలు: నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉండటానికి అనువైన చిన్న హోటల్ కూడా లేని పల్లెటూళ్లో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న అపార్ట్‌మెంట్‌ని పూర్తిచేసి, అన్ని ఫ్లాట్లూ అద్దెకు తీసుకుని, వంటవాళ్లని, సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని మరీ షూటింగ్ చేయడం గొప్ప విషయం. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా దర్శకుడికి వెన్నులో డిస్కు స్లిప్ అయితే ముప్ఫై రోజుల పాటు మానిటర్ పక్కనే బెడ్‌మీద పడుకుని డెరైక్షన్ చేయడం ఇంకా గొప్ప విషయం. షూటింగ్ జరిగిన ఏడాది తర్వాత, గుజరాత్‌లోని కచ్ దగ్గర, భుజ్ గ్రామ సమీపంలో భూకంపం వచ్చి అక్కడి జనం ఆస్తి, ధన, ప్రాణ నష్టాలకు గురైతే... ‘లగాన్’ యూనిట్ అంతా కలిసి తమ తమ వేతనాల్లోంచి ఆ ప్రాంతానికి అండగా నిలబడటం మరో గొప్ప విషయం. ఈ చిత్రం పేరుకు తగ్గట్టే ఆమిర్‌ఖాన్ పదిహేనేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పి, పన్ను చెల్లించి, ఈ చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేసిన కిరణ్‌రావుని రెండో వివాహం చేసుకోవడం ఓ విచిత్రం. ఆ గొడవల్లో ఆమిర్ దాదాపు నాలుగేళ్లు వృత్తికి దూరంగా ఉండాల్సి రావడం బాధాకరం. ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఫిల్మ్ ఇన్ ఫారిన్ ల్యాంగ్వేజ్ కేటగిరీకి ఎంపికైన మూడవ భారతీయ చిత్రం ‘లగాన్’. వసూళ్లు, అవార్డులు, విమర్శకుల ప్రశంసలు అన్నీ అమితంగా దక్కిన మిలీనియం భారతీయ చిత్రాల్లో ‘లగాన్’ తొలి రెండు, మూడు స్థానాల్లో ఉంటుంది. గ్రేసీసింగ్, రేచెల్షెల్లీ ఇద్దరూ రాధ, ఎలిజబెత్ పాత్రల్లో అద్భుతంగా రాణించారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం ఈ చిత్రానికి ఆయువు పట్టు కావడం మరింత గొప్పగా అనిపించే విషయం. ఈ చిత్రం డీవీడీ అమ్మకాలు 1975లో విడుదలైన ‘షోలే’ అమ్మకాల రికార్డుల్ని బద్దలుకొట్టాయి. నటుడిగా కెరీర్ ప్రారంభించిన అశుతోష్ గోవారికర్ ఈ చిత్రంతో దర్శకుడు, రచయిత అయ్యాడు. నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆమిర్‌ఖాన్ ‘లగాన్’తో నిర్మాత అయ్యాడు. ఆ విజయం ఇచ్చిన ఊపుతో తర్వాత దర్శకుడూ అయ్యాడు. అదే ఊపుతో అశుతోష్ గోవారికర్ నిర్మాత అయ్యాడు. ఒక ‘సినిమా’ జీవితాల్ని మారుస్తుంది. అదే ‘లగాన్’. ముస్లిముల్ని, హిందువుల్ని విభజించి పాలించిన తెల్లవారి కుతంత్రం క్రికెట్ ఆటలో కళ్లకు కట్టినట్టు చూపాడు దర్శకుడు. మళ్లీ వారిని ఒకటి చేసి, తెల్లవారిని ఓడించిన భువన్ ఆ క్షణంలో గాంధీ మహాత్ముడిలా కనిపిస్తాడు. నిజంగా ఈ కథ జరిగుంటే భారతదేశమంతా క్రికెట్ ఆడేసేదేమో - భువన్ జాతిపిత అయ్యుండేవాడేమో అనిపిస్తుంది. నిజంగానే క్రికెట్ ఇవాళ మతం అయ్యిందిగా. ‘అనగ అనగ రాగమతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు’ అన్నట్టు తీయగా, తీయగా ఒక్కో తపన కలిగిన దర్శకుడి జీవితంలో ముందో వెనకో మధ్యలోనో ఒక్క సినిమా ‘లగాన్’ అవుతుంది. ఈ చిత్రం విడుదలైన రోజే స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో తెరకెక్కిన ప్రేమకథ ‘గదర్... ఏక్ ప్రేమ్ కథ’ విడుదలైంది. ఒకే నేపథ్యం ఉన్న కథలు కాబట్టి జనం పోటీగా భావించారు. పైగా ఆమిర్‌ఖాన్, సన్నీడియోల్ హీరోలు, నిర్మాతలు అవ్వడం వలన దాయాదుల పోరు (హిందు, ముస్లింలు)గా అభివర్ణించారు. కానీ ప్రేక్షకులు మాత్రం..? వచ్చేవారం కలుద్దాం... ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’ చిత్ర విశేషాలతో! - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
అలా వచ్చి... ఇలా హిట్టిచ్చాడు...
దేడ్ కహానీ ఒకటిన్నర దశాబ్ద కాలంలో బాలీవుడ్ గమనం... ప్రపంచ సాంకేతిక చరిత్రని తిరగరాసిన మిలీనియమ్ సంవత్సరం (2000)... భారతీయ సినిమాని, ముఖ్యంగా బాలీవుడ్ సినిమా చరిత్రని కూడా తిరగ రాసింది. సమాజం ఏ ఇరవై ఏళ్లకో ఒకసారి ఎదిగే స్థాయి నుంచి ప్రతి ఇరవై రోజులకి కొత్త కొత్త విషయాలతో ఎదగడం ప్రారంభించింది 2000 నుంచే. దుకే ఈ కాలమే 2000 కాలం నుంచి ఇవాల్టి దాకా హిందీ సినిమాలలో వచ్చిన మార్పులు, వాటి విశేషాలు, మారుతున్న ప్రేక్షకుడి ధోరణి, దానికనుగుణంగా మారుతున్న సినిమా - వీటి సమాహారం. ఈ శీర్షికలో ఈ వారం సినిమా ‘కహో న ప్యార్ హై’పదిహేనేళ్ల క్రితం ఆరువేళ్ల అందగాడిని చూసి యువత భారతదేశంలోని సినీ ప్రేమికులు మనసు పారేసుకున్నారు. తెర మీద... ‘‘రోహిత్, రోహిత్’’ అని కొన్ని వేల మంది ప్రజలు అరుస్తుంటే, యేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి కూడా ఒక ఉత్కంఠ, ఒక ఉద్వేగం, బిల్డప్ షాట్స్ - పాట హమ్మింగ్- మెస్మరైజింగ్ ఫేస్ - ఏ స్టార్ ఈజ్ బోర్న్- పేరు: హృతిక్ రోషన్. తండ్రి: రాకేష్ రోషన్ - కొడుకు తొలి సినిమాకి కథ, నిర్మాత, దర్శకుడు. బాబాయ్: రాజేష్ రోషన్ - అన్న కొడుకు తొలి సినిమాకి సంగీత దర్శకుడు. సినిమా: కహో నా... ప్యార్హై కుటుంబమంతా కలిసి కష్టపడి ప్రేక్షక దేవుళ్ల ఆశీస్సులు, మెప్పులు పొందిన సూపర్ హిట్ మర్షియల్ సినిమా. క్లుప్తంగా కథ: హిత్, అతని తమ్ముడు అమిత్ ఒక మధ్యతరగతి ఇంట్లో పేయింగ్ గెస్టులు. వారికి తల్లిదండ్రులు లేరు. తమ్ముడి ఆలనా పాలనా అన్నే చూసుకుంటుంటాడు. తమ్ముడు తెగ మోసేసినా ఆ అన్న అలగడు. అభిమానంగా స్వీకరిస్తాడు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం. మంచి అన్నకి చిలిపి తమ్ముడు. స్టార్ సింగర్ కావాలని రోహిత్ కల. ఆ కలతోనే సినిమా మొదలౌతుంది. రోహిత్ కార్ షోరూమ్‌లో సేల్స్‌మన్. అందమైన సోనియా అనే అమ్మాయిని మొదటిసారి ట్రాఫిక్‌లో చూస్తాడు. బానే ఉందనుకుంటాడు. తర్వాత... సోనియా తండ్రి ఆమెకు పుట్టిన రోజు కానుకగా కారు కొంటాడు. ఆ కారుని సోనియా బర్త్‌డే రోజు ఇంటికి తెమ్మని రోహిత్‌కి చెబుతాడు. కూతురు ‘నా పుట్టినరోజు కానుకేది’ అనడిగితే ‘తలుపు తియ్యి’ అంటాడు. తలుపు తీస్తే ఎదురుగా హీరో. ఒక్క క్షణం ఆమెకర్థం కాదు. ‘బహుమతి ఎలా ఉంద’ంటాడు తండ్రి. ‘కలర్ బావుంది, గిఫ్ట్ బావుంది’ హీరోని కొంటెగా చూస్తూ - తండ్రితో. కారు తాళం చూపిస్తాడు హీరో- లోపల్నించి తండ్రి ‘నడిపి చూడు ఇంకా బావుంటుంది’ అంటాడు. ‘ఓ నిన్ను తాళంతో నడపచ్చా’ అంటుంది. ఆమె కొంటెతనం అర్థమై, కారు చూపిస్తాడు హీరో. ఇందులో సరసం ఉంది. వెగటుతనం లేదు. అలా వాళ్ల మధ్య పరిచయం స్నేహమై, ప్రేమై తండ్రికి తెలిసి, అతనితో మాట్లాడతాను రమ్మంటాడు. డ్రగ్స్ ముఠాని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న కమీషనర్ని విలన్లు హత్య చేయడం హీరో చూస్తాడు. హీరోని వాళ్లు వెంటపడి వెంటపడి చంపుతారు. విశ్రాంతి... ఇంటర్వెల్‌కే హీరో చనిపోతాడు. ప్రేక్షకులూ, హీరోయినూ కలిసి గాఢంగా ప్రేమించేసిన హీరో చనిపోతాడు. సినిమాటిక్‌గా సెకండాఫ్‌లో బతికొస్తాడులే అనుకుంటాం. సినిమా అయిపోయినా రోహిత్ బతకడు. రాజ్ అనే మరో హృతిక్ రోషన్ సెకండాఫ్ కథ నడిపిస్తాడు. రోహిత్‌ను హత్య చేసిన దుర్మార్గుల పని పడతాడు. రోహిత్ కలగన్న పెర్ఫార్మెన్స్ ఇస్తాడు రాజ్. రోహిత్ ప్రేయసి సోనియా మనసు గెలుస్తాడు. రోహిత్ తమ్ముడిని కూడా న్యూజిలాండ్ తీసుకెళ్లిపోతాడు. రెండు రకాల స్వభావాలున్న పాత్రలు రెండూ ఒకే హీరో ఒకే సినిమాలో చేయాలంటే, అదీ తన మొదటి సినిమాలోనే చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఆ గట్స్తోటే హృతిక్‌రోషన్ హీరో అయ్యాడు. ఈ సినిమాలో డైలాగులాగే ‘‘ఏక్ బాత్ బోలూ...’’ మిలీనియమ్‌లో మొదటి సూపర్‌హిట్ బాలీవుడ్ సినిమా ‘‘కహోనా... ప్యార్హై...’’ ‘‘చాంద్సెతారే పూల్ అవుర్ కుష్బూ’’ పాట, ‘‘కహోనా... ప్యార్హై’’ టైటిల్ సాంగ్ పెద్ద హిట్. ఇక... సినిమాకు ముందు విషయానికొస్తే... తండ్రి రాకేష్ రోషన్ దీనికి ముందు తీసిన భారీ చిత్రం ‘‘కోయ్లా’’కి హృతిక్ సహాయ దర్శకుడు. కండలవీరుడు సల్మాన్‌ఖాన్ సలహాలతో తన శరీరాకృతిని సర్వాంగ సుందరంగా మార్చుకున్నాడు హృతిక్. యువతరం మనసు కొల్లగొట్టాడు. బాలీవుడ్లో డ్యాన్స్ చేసే హీరోలు లేరని గుర్తించి సౌత్‌లో లాగ చాలా కష్టమైన డ్యాన్స్‌లు సునాయాసంగా చేశాడు. బాక్సాఫీసుని బద్దలు కొట్టాడు. చిత్రానికి హీరోయిన్గా ముందు కరీనాకపూర్‌ని ఎంచుకుని కొంత షూటింగ్ చేశారు. రషెస్ చూశాక, కొత్తమ్మాయి అమీషా పటేల్‌తో రీషూట్ చేశారు. అమితాబ్ తర్వాత ఖాన్లు ఏలుతున్న బాలీవుడ్‌కి నాన్ఖాన్ సూపర్‌స్టార్‌గా, ప్రత్యామ్నాయంగా ఎదిగాడు హృతిక్. సవరించిన ద్రవ్యోల్బణ రేటు ప్రకారం బాలీవుడ్ హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో ఇవాళ్టికీ పదకొండో చిత్రంగా నిలిచింది కహోనా...ప్యార్హై. చిత్రంలో హృతిక్ తమ్ముడు అమిత్‌గా నటించిన బాలనటుడు అభిషేక్ శర్మ ఇవాళ హిందీ బుల్లితెర మీద పెద్దనటుడు. సినిమా మొత్తం హృతిక్ చేతికున్న ఆరోవేలు కనపడకుండా సినిమా తీశారు రాకేష్ రోషన్. ఫస్టాఫ్ షిప్‌లోనూ, ఐలాండ్లోను తీసి, సెకండాఫ్ న్యూజిలాండ్‌లోనూ, ముంబైలోనూ తీయడం వల్ల సినిమాకి ఎక్కడలేని రిచ్‌నెస్ వచ్చింది. అయిదు పదుల వయసులో కూడా 2000వ సంవత్సరపు ప్రేక్షకుడి నాడికి పట్టుకోవడం అసాధ్యం కాదని, షారుఖ్‌ఖాన్, మాధురీదీక్షిత్ లాంటి అగ్రతారలతో తీసిన కోయ్లా డిసాస్టర్ అయ్యాక కూడా ఆ దర్శకుడు బౌన్స్ బ్యాక్ అవ్వచ్చని కహోనాప్యార్హైతో రచయితగా, దర్శకుడిగా నిరూపించారు నిన్నటి తరం నటుడు రాకేష్ రోషన్. క్రియేటివిటీ డివైన్ మాత్రమే కాదు, వైన్లాంటిది కూడా. పాతబడిన కొద్దీ రుచిలో కిక్ పెరుగుతుంటుంది. సానబెట్టిన కొద్దీ రాయి వజ్రంగా మారినట్టు. మళ్లీ వచ్చేవారం మరో సూపర్‌హిట్ బాలీవుడ్ మూవీతో కలుద్దాం... హ్యాపీ సండే, ఫన్డే. - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
ప్రతిభకు ‘ఆస్కార’మిచ్చే అవార్డులు
ఇంగ్లీషు విశ్వ భాష. ఇంగ్లీషు సినిమాలు విశ్వవ్యాప్తంగా విడుదలవుతాయి. అందుకే ఇంగ్లీషు అవార్డుల్లో ‘ఆస్కార్’ అవార్డులకు విశ్వవ్యాప్తంగా పేరుంది. అందులో విన్నర్‌కి విపరీతమైన క్రేజుంది.కేవలం ఓ 1600 పై చిలుకు మంది కూర్చుని నిర్ణయిస్తే, ప్రపంచమంతా ఆమోదించినట్టేనా అని బొమ్మకు అవతలివైపు బొరుసున్నట్టు ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు. కానీ క్రేజు దృష్ట్యా, ఆ అవార్డు విశిష్టత దానిది. దానికి ప్రజలు ఆమోదించిన మీదట ఆస్కార్ అవార్డే సినిమా పరిశ్రమలో ప్రతిభకు అత్యున్నత కొలమానం అని నమ్మక తప్పదు.సిసిలీ బి. డిమిలీ నుంచి జేమ్స్ కామెరూన్ దాకా హాలీవుడ్లో ఎందరో గొప్ప దర్శకులు, మేధావులు, కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన వాళ్లు అందరూ ప్రతి ఏడాదీ ‘‘అండ్ ది ఆస్కార్ గోస్ టూ...’’ అని యాంకర్ కాస్తంత ఆపి, పాజ్ ఇవ్వగానే చూపించే క్లోజప్ ఎక్స్ప్రెషన్ ఒకటే. ఉత్కంఠను అణచి పెట్టుకుంటూనే మామూలుగా ఎదురు చూస్తున్నట్టు గెడ్డం కింద అరచేయి, ముక్కు మీద వరకూ చూపుడు వేలు. నటులు రాబర్ట్ డీనీరో అయినా, టామ్ హాంక్స్ అయినా, బ్రాడ్ పిట్ అయినా, కేట్ విన్స్లెట్ అయినా, ఏఆర్ రెహ్మాన్ అయినా, అవార్డు తీసుకున్నాక మైకు ముందు ప్రకటించే ఉద్వేగం, ఆనందం ఒకటే. ప్రపంచాన్ని గెలిచిన ఫీలింగ్. దానికి ఏ ప్రైజ్‌మనీ సరిపోదు. బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ అని నామ్‌కే వాస్తే కేటగిరీ ఒకటి పెట్టారు. కానీ చాలా మంచి సినిమాలు పరిశీలన దాకా కూడా వెళ్లవు. అవార్డు ఫంక్షన్‌కి ఉన్న ప్రచారం అవార్డుల నామినేషన్లకు లేకపోవడమే కారణం. అలా ఉండి ఉంటే ఆ జ్యూరీకి ఏడాదంతా సరిపోదు. వరల్డ్ కప్లాగ ఏ నాలుగేళ్లకోసారో ఆస్కార్ నిర్వహించాల్సి వస్తుంది. సీతారామశాస్త్రిగారు 2000లో ఒక సినిమాకు పాట రాశారు. ‘‘నువ్వెవరైనా నేనెవరైనా నీ, నా నవ్వుల రంగొకటే ఊరేదైనా, పేరేదైనా మన ఊపిరి గీతం ఒకటే నదులన్నిటికీ నీరొకటే, అలలన్నిటికీ కడలొకటే మనసు తడిస్తే నీ, నా చెంపలు నిమిరే వెచ్చని కన్నీరొకటే’’ - ఆస్కార్ ఫంక్షన్ చూస్తున్నంత సేపూ ఆర్టిస్టుల భావోద్వేగాలకు మనమూ మూవ్ అవుతాం. వాళ్లెవరో మనకి తెలీదు. మన చిరంజీవో, మన బాలకృష్ణో, మన నాగార్జునో, మన వెంకటేషో, మన పవన్ కల్యాణో, మన మహేష్ బాబో కాదు. అయినా మనం ఫీలౌతాం. అవార్డు రాని వారిని చూసి వారితో పాటు మన కన్ను చెమ్మగిల్లుతుంది. వచ్చిన వారి ఆనంద బాష్పాలు చూసి మన ఇంకో కన్ను హర్షంతో వర్షిస్తుంది. ఎఛీవ్మెంట్ ఎవరిదైనా ఆ కిక్కే వేరు. అందుకే ఆస్కార్ అవార్డు అంత గొప్పది. అదొక ప్రత్యేకమైన భావోద్వేగపు సినిమా. ‘‘పూను స్పర్థలు విద్యలందే, వైరములు వాణిజ్యమందే’’ అన్నారు పెద్దలు. అలా మన ప్రాంతీయ సినిమా విశ్వ సినిమాతో ప్రతిభలో స్పర్థలు పడితే, వాణిజ్యంలో వైరమొందితే - విశ్వ సినిమాకు విలువ తగ్గేదేం లేదు కానీ, మన ప్రాంతీయ సినిమా విలువ చాలా పెరుగుతుంది. అందుకు ప్రయత్నిద్దాం. మన నుంచి మరో కొందరు సత్యజిత్రేలు, ఏఆర్ రెహ్మాన్‌లు, గుల్జార్‌లు పైకొస్తారు. మన జెండా ఎగరేస్తారు.