ఓ తండ్రి మాయాజాలం
కోయీ మిల్ గయా
దేడ్ కహానీ - కోయీ మిల్‌గయా
అది 8, ఆగస్ట్, 2013 - ఎవరో... కలిశారు. కోయీ... మిల్‌గయా. ఆ ఎవరో పేరు జాదూ. ఒక అశక్తుడికి సర్వశక్తి యుక్తులూ సెకన్లలో రావడమే జాదూ అంటే - మాయాజాలం, మ్యాజిక్. కహో నా ప్యార్ హై... లాంటి సూపర్‌హిట్ సినిమాతో ఎంటర్ అయ్యాక, వరుసగా ‘ఫిజా’, ‘మిషన్ కాశ్మీర్’ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడటం, ‘కభీ కుషీ కభీ గమ్’ హిట్ అయినా అది హీరో షారుక్ ఖాన్‌కి, డెరైక్టర్ కరణ్ జోహార్‌కి మాత్రమే ప్లస్ అవ్వడం - దర్శకుడు, నిర్మాత, కథకుడు రాకేష్ రోషన్‌ని ఆలోచనలో పడేసింది.
కొడుకు కెరీర్‌ని మళ్లీ తానే గాడిలో పెట్టాలనుకున్నట్టున్నాడు - ఇంకో ‘మ్యాజిక్’ చేశాడు - ఆ జాదూ పేరే ‘కోయీ మిల్ గయా’.
ఫక్తు కమర్షియల్ అంశాలున్న సైన్స్ ఫిక్షన్ ఇది. ఈ కథ గురించి చెప్పాలంటే, 40 ఏళ్లు వెనక్కి వెళ్లి ఇంకో చిన్న కథ గురించి చెప్పుకోవాలి.
టింగ్... టింగ్... టింగ్...
(ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్స్)
1962లో విశ్వవిఖ్యాత భారతీయ దిగ్దర్శకుడు సత్యజిత్ రే తన ఫ్యామిలీ మ్యాగజైన్ ‘సందేశ్’ కోసం ‘ది ఎలియన్’ అనే కథ రాసుకుని ప్రచురించారు. మిస్టర్ ‘అంగ్’ అనే ఒక గ్రహాంతర వాసి, బెంగాల్‌లోని ఒక కుగ్రామంలో అంతరిక్ష విమానంలోంచి దిగి, ఆ పల్లెటూళ్లో ‘హాబా’ అనే ఓ అమాయకపు బాలుడిని కలవడం, ఆ అంతరిక్ష విమానాన్ని గ్రామస్థులు సరస్సులో వెలసిన దేవాలయంలా భావించి పూజించడం... ఇలాంటి ఇతివృత్తంతో రాసుకున్న కాల్పనిక కథ ఇది.
హాలీవుడ్ తెరమీద మన కథ!
తర్వాత రోజుల్లో ‘ది ఎలియన్’ కథని ఇండో-అమెరికన్ సంయుక్త నిర్మాణంలో కొలంబియా పిక్చర్స్ సంస్థ అప్పటి హాలీవుడ్ సూపర్‌స్టార్ మార్లన్ బ్రాండోని ప్రధాన పాత్రధారిగా, సత్యజిత్ రే దర్శకత్వంలోనే సినిమా తీద్దాం అనుకున్నారు. అనుకోని పరిస్థితుల్లో ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. కానీ, ఆ కథని మైక్ విల్సన్ అనే వ్యక్తి తన పేరున రిజిస్టర్ చేసుకుని మార్కెట్ చేసుకోవడం ఆరంభించాడు.
ఎక్కువ కాలం వేచి ఉండలేక, సత్యజిత్ రే భారతదేశానికి వచ్చేశారు. ఆ తర్వాత 1977లో ‘క్లోజ్ ఎన్‌కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్’, 1979లో ‘ఎలియన్’, 1982లో స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో ‘ఈ.టీ.’ (ఎక్స్‌ట్రా టెరస్ట్రియల్) సినిమాలు వరుసగా వచ్చాయి. వాటన్నింటి మూలం భారతీయ దర్శక మేధావి సత్యజిత్ రే కథ ‘ది ఎలియన్’ అని హాలీవుడ్ పరిశ్రమ మొత్తానికి తెలుసు. కథా చౌర్యం కురిపించిన కాసుల ఖజానాలో కథ రాసిన ఒరిజినల్ రైటర్ సత్యజిత్ రేకి రూపాయి కూడా రాలేదు. కానీ, ఆ చిత్రాలకి భారతదేశం ఇచ్చిన రెవెన్యూ వాటి కలెక్షన్ల మొత్తంలో పాతిక శాతం పైనే.
టింగ్... టింగ్... టింగ్...
(ఫ్లాష్ బ్యాక్ ఎండ్స్)
ప్రస్తుతంలోకొస్తే ఇంచుమించు అనే కథావస్తువుతో ‘హాబా’ అనే బాలుడి పాత్రని కొద్దిగా మార్చి, మనిషి ఎదిగినా మెదడు ఎదగని అమాయకుడి పాత్ర రోహిత్ మెహ్రాగా మలచి, తన కొడుకు హృతిక్ రోషన్ సైజుకి తగ్గట్టు పాత్రని కుట్టాడు తండ్రి, దర్శకుడు రాకేష్ రోషన్.
రెయిన్ మ్యాన్, ఫారెస్ట్ గంప్, స్వాతిముత్యం తదితర చిత్రాల్లోని హీరో పాత్రల్లా హృతిక్ రోషన్‌కి స్టార్ హీరోగా మాత్రమే కాదు మంచి నటుడిగా కూడా పేరు, అవార్డులు తెచ్చిపెట్టింది ‘కోయీమిల్ గయా’.
ఇంగ్లిష్ టేకింగ్‌కి భారతీయ మసాలా!
గ్రహాంతర వాసి ‘జాదూ’, అమాయకుడైన రోహిత్ మెహ్రాని మామూలు యువకుడిగా మార్చడం, తన అతీత శక్తులతో రోహిత్, అతని స్నేహితులని హీరోలను చేయడం, వాళ్ల శత్రువుల్ని విలన్‌లను చేసి ఆటపట్టించి, ఓడించడం - ఇందులో భాగంగా ఆ హిల్‌స్టేషన్ కలెక్టర్ కూతురు నిషా (ప్రీతిజింతా), రోహిత్ ప్రేమలో పడటం, చివరికి ‘జాదూ’ని మానవ మృగాల బారినపడనివ్వకుండా రోహిత్ హీరోచితంగా పోరాడి, అతడిని గ్రహాంతర వాసులతో కలిపి సేఫ్‌గా స్పేస్‌షిప్ ఎక్కించి పంపించడం - రాజేష్ రోషన్ అద్భుతమైన పాటలతో, ఇంగ్లిష్ సినిమాలకి ఏ మాత్రం తీసిపోని విజువల్ ఎఫెక్ట్స్‌తో, భారతీయ ప్రేక్షకుడు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్లు మసాలా రుచులు పర్‌ఫెక్ట్‌గా మేళవించి మిలీనియమ్ మొదలైన మూడేళ్లలో రెండో సూపర్ డూపర్ హిట్ నమోదు చేశారు తండ్రి రాకేష్, తనయుడు హృతిక్ రోషన్లు. తత్ఫలితంగా భారతీయుడి మేధస్సుకి (సత్యజిత్ రే) ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ పట్టం కట్టినట్టు కూడా అయింది.
పోస్టర్ చూస్తే...
‘కోయీ మిల్ గయా’ పోస్టర్ చూడగానే, హృతిక్, ప్రీతిజింతాల అందమైన ప్రేమకథ కాబోసు అనిపించింది. రాకేష్ రోషన్ సినిమా కాబట్టి కహో నా ప్యార్ హై తర్వాత కచ్చితంగా ఇంకో ప్రేమకథే తీసుంటారు అనిపించింది. ఆడియో వినగానే అన్ని పాటలూ పక్కగా ప్రేమకథా చిత్రాల్లోని పాటల్లాగే ఉంటాయి. ‘కోయీ మిల్ గయా’ అనే టైటిల్ సాంగ్ పాడినది మన దక్షిణాది మధుర గాయని చిత్రగారు. ఆ పాట సూపర్‌హిట్. ‘ఇదర్ చలా మై ఉదర్ చలా’ పాట, ‘హైలా..’ పాట కూడా వినడానికి చాలా బావున్నాయి.
థియేటర్‌లో కూచున్నాక, బ్రహ్మాండమైన సర్‌ప్రైజ్. అది గుర్తుతెచ్చుకోవాలన్నా, అనుభూతి చెందాలన్నా మళ్లీ ఓసారి చూడాల్సిందే. తల్లిగా రేఖ నటన మళ్లీ కనువిందు చేస్తుంది. ఇవాళ్టి ప్రముఖ హీరోయిన్ ‘హన్సిక’ ఇందులో బాల నటి. ఈ చిత్రం సాధించిన ఘనవిజయం బాలీవుడ్ తెరమీద హృతిక్ రోషన్‌ని ఆబాలగోపాలం మెచ్చే సూపర్ హీరోని చేసింది. ఈ చిత్రానికి రెండు సూపర్ హిట్ సీక్వెల్స్ చేసేలా ప్రేరేపించింది. హాలీవుడ్‌కి ఒక సూపర్‌మ్యాన్‌లా, బ్యాట్‌మ్యాన్‌లా మనకి ‘క్రిష్’ అనే ఓ వెండితెర సూపర్ హీరోని అందించింది.
వచ్చేవారం...‘కల్ హో న హో’...
రేపనేది ఉంటుందో ఉండదో - అని. ఆ ఆర్టికల్ కూడా ఇవ్వాళే రాసేయలేను కదా! కాబట్టి, రేపన్నది ఉందని నమ్మి, వచ్చే ఆదివారం కలుద్దాం. నమస్తే!
మాటల్లో మెచ్చు తునకలు కొన్ని...
* ‘ఓమ్’ అనేది పవిత్ర హిందూ నాదం. విశ్వంలో ఉన్న శబ్ద తరంగాలన్నీ ఒక్క ‘ఓమ్’లో ఉన్నాయి.
* పిచ్చి అనేది ఒక గుణం - రోగం కాదు. కొంత మందికి షాపింగ్ పిచ్చి, కొంతమందికి తిండి పిచ్చి, కొంతమందికి సంగీతం పిచ్చి... ఇలా రకరకాల వ్యాపకాల పిచ్చి ఒక రకం అయితే, మామూలు కన్నా కొంచెం ఎక్కువో, తక్కువో ప్రతిస్పందించడాన్ని కూడా పిచ్చి అనుకోవచ్చు.
* రకం పిచ్చికి సైకియాట్రిస్ట్‌లు మందు ఇస్తారు. నన్ను పిచ్చివాడన్నారు కదా! యస్. నేను పిచ్చివాడినే. మా అమ్మాయి ప్రేమలో పడిన పిచ్చివాణ్ని.
* కంప్యూటర్ మనుషుల్ని తయారుచేయదు - మానవ మేధస్సే కంప్యూటర్స్‌ని తయారుచేసింది. మెదడు చేసేవన్నీ కంప్యూటర్ చేయలేదు.
* ఎవరినీ చిన్నపిల్లలని చులకన చేయకండి సర్. ఆ పిల్లలే పెరిగి పెద్దవాళ్లవుతారు ఫ్యూచర్‌లో.
* ఈ ప్రపంచం ప్రతి కొత్త విషయాన్ని ముందు తిరస్కరించింది. తర్వాతే అంగీకరించింది.
* ఇలాంటి మంచి సంభాషణలతో పాటు గ్రహాంతర వాసులకి కూడా మంచి మనసు, ఆర్ద్రత, కన్నీరు, ఆనందం అన్నీ మనలాంటి భావాలే ఉంటాయని, ఈ తరం ప్రేక్షకులని ఒప్పించిన ఘనత దర్శకుడిది.
- వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు