లబ్‌కి డబ్‌కి మధ్య జీవితకాలపు కథ | Dub labki To Story of a lifetime | Sakshi
Sakshi News home page

లబ్‌కి డబ్‌కి మధ్య జీవితకాలపు కథ

Published Sun, Jul 5 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM

లబ్‌కి డబ్‌కి మధ్య జీవితకాలపు కథ

లబ్‌కి డబ్‌కి మధ్య జీవితకాలపు కథ

దేడ్ కహానీ - కల్ హో న హో
1999, డిసెంబర్ 31... అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రపంచవ్యాప్తంగా వైటుకె వచ్చి కంప్యూటర్ వ్యవస్థలన్నీ కొట్టుకుపోతాయి. ఇంక 2000 నంచి టెక్నాలజీ ఉంటుందో, ఉండదో అన్నారు. కల్ హో న హో... ఉంది. ఇంకా బాగా పెరిగింది. 2012... ప్రళయం వచ్చి మొత్తం ప్రపంచమంతా కొట్టుకుపోతుంది అన్నారు. ఇంక మానవాళికి రేపన్నది ఉంటుందో, ఉండదో అన్నారు. కల్ హో న హో... ఉంది. ఇంకా బ్రహ్మాండంగా ఎదిగింది.
 
2003, నవంబర్ 28న షారుక్‌ఖాన్, ప్రీతిజింతా, సైఫ్ అలీఖాన్ లాంటి అగ్ర తారాగణంతో కరణ్ జోహార్ కథ, నిర్మాణంలో నిఖిల్ అద్వానీని దర్శకుడిగా పరిచయం చేస్తూ కల్ హో న హో... అన్నారు. ఆడింది. అద్భుతంగా ప్రజాదరణ పొందింది.
 లబ్... డబ్.. అనే గుండె చప్పుడులో లబ్‌కి డబ్‌కి మధ్య జీవితకాలపు కథ. ఇది ట్యాగ్‌లైన్‌కి తెలుగు అర్థం. ఎంత అద్భుతమైన ఆలోచన.

 ‘‘ఈ రోజు ఒక నవ్వు ఎక్కువ నవ్వు... ఈ రోజు ఒక ప్రార్థన ఎక్కువ చెయ్యి... ఈ రోజు ఒక కన్నీటి చుక్క ఎక్కువ త్రాగు... ఈ రోజు ఒక జీవితం ఎక్కువ జీవించు... ఈ రోజు ఒక కల ఎక్కువ కను... ఎవరికి తెలుసు... రేపుంటుందో, ఉండదో’’... కల్ హో న హో...
 ఈ చిత్రం అమన్ పాత్రధారి షారుక్‌ఖాన్, నైనా పాత్రధారి ప్రీతిజింతాతో అనే డైలాగ్... ఎంత అద్భుతమైన సంభాషణ.
 
1971లో వచ్చిన ‘ఆనంద్’ అనే హిందీ సినిమా రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్, సుమితా శాన్యాల్ ప్రధాన  పాత్రధారులుగా, హృషికేశ్ ముఖర్జీ రచన, దర్శకత్వం. ఈ ‘ఆనంద్’ కథనే స్ఫూర్తిగా తీసుకుని, 2003లో పూర్తిగా అమెరికా నేపథ్యంలో ఎన్నారైల మధ్య కథగా, భారతీయ ఆధునిక కుటుంబాల భావోద్వేగాలు కలగలిపి తీసిన చిత్రంలా ఉంటుంది ‘కల్ హో న హో’.
 సాధారణంగా సినిమాలలో కొన్ని అంశాలు చాలా బావుంటాయి. కొన్ని సాధారణంగా ఉంటాయి. ప్రతి మూమెంట్‌ని మనం ఆస్వాదించే సినిమాలు కొన్నే ఉంటాయి. వాటిలో ‘కల్ హో న హో’ ఒకటి.
 పాటలు వినగానే సినిమా చూడాలనిపించింది. సంగీత దర్శక త్రయం శంకర్-ఇషాన్-లాయ్ మహత్యం అది.
 
పోస్టర్ చూడగానే సినిమా చూడాలనిపించింది. కరణ్ జోహార్ ప్రతిభ అది.
 సినిమా చూడగానే మళ్లీ చూడాలనిపించింది. కొత్త దర్శకుడు నిఖిల్ అద్వానీ గొప్పదనం అది.
 అమన్ పాత్రలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ నటన అమోఘం. కనీసం నాలుగైదుసార్లు కన్నీళ్లు పెట్టిస్తాడు. కొద్దిక్షణాల్లో చనిపోతాడనగా కూడా చిరునవ్వు నవ్విస్తాడు.
 ఈ సినిమా కచ్చితంగా చూసి తీరవలసిందే. ఇందులో ప్రీతిజింతా పాత్రకి ముందు కరీనా కపూర్‌ని ఎంచుకున్నార్ట. పారితోషికం దగ్గర తేడా వచ్చి, ఆమె ఈ అవకాశాన్ని వదులుకుంది. అది ప్రీతిజింతాని వరించింది. ఆమె చాలా తెలివిగా ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకొంది.
 
రోహిత్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటన చాలా సహజంగా, ఉన్నతంగా, అంతకంటే ఎక్కువ సరదాగా ఉంటుంది. నైనా జీవితంలో చికాకులతో కోల్పోయిన చిరునవ్వుని వెలిగిస్తాడు పక్కింట్లోకి కొత్తగా వచ్చిన అమన్. అతనితో ప్రేమలో పడుతుందామె. కానీ ఆమె స్నేహితుడు రోహిత్‌కి నైనా అంటే ప్రేమని తెలిసి, తనకు ఆల్రెడీ ప్రియ అనే అమ్మాయితో (సోనాలీ బింద్రే) పెళ్లయిపోయిందని చెప్తాడు. బాధగా వెళ్లిపోతుంది నైనా. అమన్ తల్లి అడుగుతుంది అమన్‌ని - ‘‘నువ్వు కూడా ప్రేమించావ్ కదరా నైనాని. అబద్ధం ఎందుకు చెప్పావ’’ని. ‘‘నిజం చెప్పాలా అమ్మా. నా గుండె ఏ క్షణాన్నైనా ఆగిపోవడానికి సిద్ధంగా ఉందని నిజం చెప్పాలా? నాకు తనంటే ఇష్టమున్నా, రేపు అనేది నా జీవితంలో ఉందో లేదో తెలీకుండా ప్రతిరోజూ గడుపుతున్నానని నిజం చెప్పాలా’’ అని ఆవేదనగా అడుగుతాడు.

ఈ నిజం ప్రేక్షకుడికి తెలియడమే ఇంటర్వెల్. ఇంక ద్వితీయార్ధంలో నైనా, రోహిత్‌లని కలపడమనే ప్రహసనాన్ని వీలైనంత కామెడీ జొప్పించి మెప్పించారు రచయితలు, దర్శకుడు, నటీనటులు. చివరికి ప్రేక్షకుడికి తెలిసిన నిజాలన్నీ పాత్రలకి కూడా తెలియడం, బాధలు, ఆవేదనలు, అమన్ చనిపోవడం, నైనా, రోహిత్ ఒకటవ్వడం... ఇవన్నీను! ఎన్నారై మార్కెట్‌ని పెంచిన ‘కభీ కుషీ కభీ గమ్’ తర్వాత అదే ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌పైన కరణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రం ఎన్నారై మార్కెట్‌ని కొత్త పుంతలు తొక్కించింది.
 
క్షణ భంగురమైన మానవ జీవితానికి రేపన్నది ఉంటుందో లేదో తెలీదు కానీ, మంచి భారతీయ చలన చిత్రాల జాబితాలో ‘కల్ హో న హో’ ఎప్పుడూ ఉంటుంది. వచ్చేవారం సినిమాలు తీసే ఆలోచనలని అన్నింటినీ కకావికలం చేసి ఇలా తీయాల్రా అని మెదళ్లకి రిపేర్లు చేసిన దర్శక శ్రేష్టుడు రాజ్‌కుమార్ హిరానీ ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’తో మళ్లీ కలుద్దాం.
 -వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement