Ded Kahani
-
గ్లామర్ ట్రాప్
దేడ్ కహానీ - ఫ్యాషన్ మిలీనియమ్‌లో బాలీవుడ్ సినిమా దిశను, గతిని, మార్కెట్‌ను మార్చేసిన ట్రెండీ కమర్షియల్ హిట్ చిత్రాల కథలు, సంగతుల్ని విశ్లేషించుకునే మన ‘దేడ్ కహానీ’లో... చాందినీ బార్, పేజ్ 3ల గురించి నేను రాయలేదు కానీ కార్పొరేట్, ట్రాఫిక్ సిగ్నల్ గురించి రాసినప్పుడే ఆ సినిమాలని ప్రస్తావించాను. ఇప్పుడు ‘ఫ్యాషన్’. తీసిన ప్రతి సినిమా అప్పటి కాలాన్ని శాసిస్తూ పరిశ్రమను కొత్త దారి పట్టించేలా తీయడం ఆ దర్శకుడి అద్భుత ప్రతిభ, కఠిన శ్రమ తప్ప మరోటి కాదు. సినిమా గురించి ఎన్ని విశేషాలైనా రాయచ్చు కానీ, ఒకే దర్శకుడి గురించి పదే పదే ఎలా కొత్తగా రాస్తాం అని ఆలో చిస్తుంటే, మధుర్ భండార్కర్ గురించి కొత్తగా ఈ వారం రాయడానికొక మంచి మ్యాటర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆయనని ‘పద్మశ్రీ’గా గుర్తించింది. తెలుగు నుంచి మన ఎస్.ఎస్.రాజమౌళిని గుర్తించినందుకు ఎంత ఆనందపడ్డానో, మధుర్ భండార్కర్ విషయంలోనూ అంతే. ఎందుకంటే, తెలుగులో ఇదే దేడ్ కహానీ ఎవరైనా రాస్తే అందులో తీసిన ప్రతి సినిమా లిస్టులో ఉండే దర్శకుడు రాజమౌళిగారొక్కరే. ఇద్దరికీ కథ, కథనా ల్లోనూ, దర్శకత్వ శైలిలోను ఎందులోనూ సంబంధం, పోలిక లేవు. ఒకరిది కల... ఇంకొకరిది జీవితం. కానీ ప్రతిభ, కష్టం, క్రమశిక్షణ, తీస్తున్న సినిమాపై సాధికారత, ముద్ర ఇవి కామన్. అందుకే వీరికి లభించిన గుర్తింపు, అవార్డు కూడా కామన్. ఇక ఫ్యాషన్ విషయానికొద్దాం. ఒక మధ్య తరగతి అమ్మాయి తండ్రికిష్టం లేకున్నా, తల్లి ప్రోత్సాహంతో ముంబై మహానగరంలో మోడల్‌గా రాణించాలని కలలుగని, ఫ్యాషన్‌తో ఫ్యాషన్ వరల్డ్‌లో నెగ్గుకురావాలని చేసే ప్రయత్నాలు, అందులో అనుభవించే కష్టాలు, సుఖాలు, అనుభవాలు, అను భూతులు, నేర్చుకునే పాఠాలు ఇవన్నీ తెర మీద కళ్లకు కట్టినట్టు, చెవిలో చెప్పినట్టు, పెదవులు నవ్వినట్టు, గుండెను తడితో తడిమినట్టు ప్రేక్షకుడికి అనిపించేలా తీసిన సినిమా ఫ్యాషన్. పదహారణాల భారతీయ ఆధునిక యువతి వ్యథని కథగా తీస్తే అయిన ఖర్చు పదహారు కోట్లు. వచ్చిన రాబడి అరవై కోట్ల పైనే. చిన్న సినిమాల్లో బాగా ఎక్కువ మార్జినల్ ప్రాఫిట్ వచ్చి ట్రెండ్ సృష్టించాలంటే, కంటెంట్ చాలా చాలా బలంగా ఉండాలి. సహజత్వం, ప్రేక్షకుడు తనని తాను ఐడెంటిఫై చేసుకో గలిగే పాత్రలు, సన్నివేశాలు, సంభాషణ లతో పాటు ఆద్యంతం కట్టిపడేసే కథనం కూడా ఉండాలి. ఇవన్నీ బడ్జెట్ పరిమితు లకి లోబడి తెరకెక్కించాలంటే దర్శకుడు ఏ మధుర్ భండార్కరో అయ్యుండాలి. సాధారణంగా మగవాడికి ఏదన్నా ఆలోచన వస్తే వెంటనే అది నోట్లోంచి బైటకొచ్చేస్తుంది ముందు. అదే ఆడవాళ్లకి ఏదన్నా ఆలోచన వస్తే అది నోట్లోంచి చచ్చినా రాదు. మనసులో దాక్కుని ఆచ రణ రూపంలో బైటకొస్తుంది. ఇది అర్థం కావటానికి మగాడికి జీవితకాలం సరి పోదు. అలా, అర్థం కాని పాఠాలు చద వాల్సి వస్తే విద్యార్థులు ‘గైడ్స్’మీద ఆధార పడతారు. అలాంటి గైడ్సే మధుర్ సినిమాలు. వాటిల్లో ‘ఫ్యాషన్’ ఒకటి. 2002, 3 ప్రాంతంలో హైదరాబాద్‌లో సినిమా చాన్స్‌కోసం హీరోయిన్గా ప్రయ త్నాలు చేసిన చిన్న మోడల్ ప్రియాంకా చోప్రా. నెక్కంటి శ్రీదేవి అనే నిర్మాత ‘అపురూపం’ అనే సినిమాలో ఆమెకి అవ కాశమిద్దామని ప్రయత్నించడం నాకింకా గుర్తే. దానికి మొదట తేజగారిని, ఆయన కాదన్నాక నన్ను దర్శకుడిగా అనుకు న్నారు. కారణాంతరాల వల్ల అది మొద లవ్వలేదు. కానీ ఆరేళ్ల తర్వాత ప్రియాంక బాలీవుడ్లో అత్యంత విజయ వంతమైన హీరోయిన్. గ్లామర్‌కే కాదు పెర్ఫార్మెన్స్ తోనూ ప్రేక్షకుడి మన్ననలు, ప్రభుత్వ, ప్రైవేటు అవార్డులు కూడా గెల్చుకున్న ఉత్తమ నటి. ‘ఫ్యాషన్’ సినిమాకే ఆమె జాతీయ ఉత్తమ నటి అవార్డును స్వీకరించింది ఫిల్మ్‌ఫేర్‌తో పాటు. ఆమె అదృష్టం, కృషి, ఆమెను ‘అపురూపం’ సినిమా నుంచి తప్పించి, అంతర్జాతీయంగా అపురూపమైన కెరీర్‌ను సృష్టించి ఇచ్చాయి. అపరిమితమైన పోటీని, వాణిజ్య ప్రధానమైన పరిశ్రమలో విలువల్ని కాపాడుకుంటూ పనిచేయడం, అది కూడా ఏళ్ల తరబడి నిలదొక్కుకోవడం మామూలు విషయం కాదు. అరగంటకి ఒక ఆస్కార్ ఉత్తమనటి అవార్డు ఇవ్వచ్చు - భారతీయ సినీ పరిశ్రమలో ఆడపిల్లలు సక్సెస్‌ఫుల్‌గా స్టార్డమ్లో నిలదొక్కు కోవడానికి పడే కష్టానికి. పెదాల మీద చిరునవ్వు చెరగకుండా నటించే శ్రమకి. ఆత్మాభిమానంతో, కెరీర్లని పర్స్యూ చేసుకునే విధానానికి. ఇవన్నీ ‘ఫ్యాషన్’ సినిమాలో ఉంటాయి. లైట్ల ముందు స్టేజ్ మీద తళుక్కుమనే మోడల్స్ జీవితాల్లో స్టేజ్ వెనకాల ఉన్న చీకటి, ఆకలి, ఆర్తి, పోటీ, రాజకీయాలు, అవకాశాలు, అవకాశ వాదాలు, నిరాశలు, నిస్పృహలు అన్నీ ఫ్యాషన్‌లో చూడచ్చు. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం అన్నీ ఒకే ఫ్లోలో ఉంటాయి మధుర్ సినిమాల్లో. ఫ్యాషన్‌లోనూ అంతే. ముఖ్యంగా చెప్పుకోవలసింది కంగనా రనౌత్ గురించి. ‘ఫ్యాషన్’తో బాలీవుడ్‌ని భారతీయ సినీ ప్రేక్షకుడి మన్ననలనీ పొందింది ఈ సహాయ నటి. ప్రియాంక చోప్రాతో సమానంగా ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డుని, ఫిల్మ్‌ఫేర్ అవార్డునీ కైవసం చేసుకోవడం గొప్ప, అరుదైన విషయం. అసలు ఒకే కథలో రెండు పాత్రలకి ఇంత బలం ఉండడం కూడా చాలా రేర్. తన పాత్రకి కావల్సిన యాటిట్యూడ్‌ని, యారొగెన్స్ని, హావ భావాల్సి, బాడీ లాంగ్వేజ్‌ని అచ్చు గుద్ది నట్టు దింపేసింది. అతి తక్కువ కాలంలో కంగనా బాలీవుడ్ ‘క్వీన్’గా వంద కోట్ల సినిమాల క్లబ్బులో హీరోలా చేరిపోడానికి పునాది ‘ఫ్యాషన్’ సినిమా. ఒక దర్శకుడిగా కొన్ని వందల మంది మహిళా తారలతోను, వారి వ్యక్తిగత జీవితాలతోనూ పరిచయం ఉంది నాకు. కానీ ఏ రోజూ దానిని సినిమా కథగా మల చాలన్న ఆలోచనే నాకు రాలేదు. మధుర్ సనిమాలు చూడడం మొదలుపెట్టాక, నేను చూసిన జీవితంతో ‘తార’ అని ఒక కథ రాసుకున్నాను. కానీ ఆ కథ క్లైమాక్స్‌ని ఇంకా నేను చూడలేదు కాబట్టి కంప్లీట్‌గా రాయలేదు. వాస్తవాన్ని కల్పించిన కథగా చెప్పే టెక్నిక్‌ని మధుర్ సినిమాల ద్వారా తెల్సుకోవచ్చు. నా చిన్నప్పుడు దాసరి నారాయణరావు, కె.బాలచందర్, కె.రాఘవేంద్రరావు... ఇలాంటి చిత్రాలని జనరంజకంగా తీసి సక్సెస్ చేయగలిగారు. ఆ తర్వాత ఈ పాతికేళ్లలో, ఈ జానర్లో ప్రతి ఆధునిక తెలుగు దర్శకుడూ ఫెయిలే. తమిళంలో తీస్తున్నారు. కానీ ఒక దర్శకుడు ఒకసారే తీయడం వల్ల అది బాణీ అవ్వలేకపోతోంది. హిందీలో మధుర్ది ఆ బాణీ. పరిశ్రమకి మేలు చేసే బాణీ. నటీనటులకి పరీక్ష పెట్టి, శిక్షణ నిచ్చి, తారాస్థాయికి తీసుకెళ్లి వదిలిపెట్టే బాణీ. పదిమందీ అనుసరించదగిన బాణీ. మనం రోజూ చూసే జీవితాన్ని మనం నేర్చుకుంటే స్ఫూర్తి. పది మందికి చెప్పగలిగితే పాఠం. అందుకే ఈ దర్శ కుడు చాలామంది మోడ్రన్ దర్శకులకి మంచి మాస్టారు. ఈయన నేర్చుకున్న మంచి మేస్టారు మన తెలుగువాడైన రామ్ గోపాల్‌వర్మ. ఆయన ‘పద్మశ్రీ’ పథంలో పదం ఆర్జీవీది. శ్రీ మధుర్ భండార్కర్ది. గురువు గొప్పదనం శిష్యుడి ప్రగతిలోను, ప్రస్థానంలోను కనిపిస్తుంది. -
కలెక్షన్ కింగ్
దేడ్ కహానీ - సింగ్ ఈజ్ కింగ్ ఒకటిన్నర దశాబ్ద కాలంలో బాలీవుడ్ గమనం... వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు భారతీయులకి ఓ బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఎవరు ఎంత ఎత్తు ఎదిగితే, వాళ్లమీద అన్ని సెటైర్లు, జోకులూ వేయడం. భారత భూభాగంలో పంజాబ్ ప్రాంతంలో సిక్కు మతస్థుల్ని సర్దార్లు అంటారు. వీళ్ల పేర్ల చివర మనకి రెడ్డి, చౌదరి, శాస్త్రి, నాయుడు అని ఉన్నట్టు సింగ్ అని ఉంటుంది. వీళ్లకి తలమీద ఓ కోక కూడా ఉంటుంది. దాన్ని టర్బన్గా తలకి చుట్టుకుంటారు. అది ఆచారం. వీళ్లు చాలా బలిష్టులు, మంచివాళ్లు, యుద్ధ రంగంలో కమాండర్ల స్థాయిలో పోరాట యోధులు, చాలా మంచి పేరు, మర్యాద కలిగినవాళ్లు. కానీ వీళ్లనిని బఫూన్లని చేసి కడుపారా నవ్వుకుంటుంది శాడిస్టు సమాజం. ‘‘ఓ సర్దారు ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ షాపుకెళ్లాడు. నాకీ చిన్న టీవీ సెట్ కావాలన్నాడు. షాపువాడు, నేను సర్దార్జీకి అమ్మను అన్నాడు. వెంటనే ఇంటికెళ్లి టర్బన్ తీసేసి, గెటప్ మార్చి మళ్లీ షాపుకి వచ్చి, నాకీ చిన్న టీవీ కావాలన్నాడు. షాపువాడు, చెప్పానా, నేను సర్దార్జీకి అమ్మను అన్నాడు. సర్దార్జీకి కోపం వచ్చి, మళ్లీ ఇంటికెళ్లి జుత్తు, గెడ్డం కూడా తీసేసి, పూర్తిగా వేషం మార్చుకుని, మారువేషంలో షాపుకొచ్చి, నాకీ టీవీ కావాలన్నాడు. షాపువాడు కోపంగా, ఎన్నిసార్లు చెప్పాలయ్యా, నేను సర్దార్జీలకి అమ్మనని అన్నాడు. ఎలా గుర్తుపట్టేస్తు న్నావు నన్ను అని అడిగాడు సర్దార్జీ. ఎలా అంటే, ఇది టీవీ కాదు. మైక్రో అవెన్ కాబట్టి అన్నాడు తాపీగా షాపువాడు. దేశ పరిరక్షణలో ప్రాణాలొడ్డే వీర సోదరులు మనకి బ్రహ్మా నందం, పోసాని, పృథ్వీ లాంటి పాత్రల ముడి సరుకులు. అయినా మనం బాధ పడక్కర్లేదు. ఇదీ దేశ సేవే. అలాక్కూడా వాళ్లు మన ఆరోగ్యాల్ని కాపాడుతున్నట్టే. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకో అర్థమయ్యే ఉంటుంది. 2008లో అనీస్ బజ్మీ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్, కత్రినాకైఫ్ ప్రధాన పాత్రధారులుగా వచ్చిన ‘సింగ్ ఈజ్ కింగ్’ సినిమా గురించి. యాభై కోట్లకి, నూట యాభై కోట్లు వసూలు చేసిన సూపర్‌హిట్. ‘వెల్కమ్’ సినిమా సూపర్ హిట్ తర్వాత ఆ స్థాయిలో నవ్వులు పూయించాలంటే ఈ నేపథ్యం తప్పనిసరని భావించినట్టున్నాడు దర్శకుడు అనీస్ బజ్మీ. ఆయన అంచనా నిజమైంది. అడుగు తీసి అడుగేస్తే నవ్వించే ప్రయత్నం చేశాడు సినిమా అంతా. దీపావళి టపాసుల్లా కొన్ని పేలొచ్చు, కొన్ని పేలకపోవచ్చు. కానీ ఆయన ప్రయత్నం మాత్రం ఫలించింది. కలెక్షన్లు బాగా వచ్చి, నిర్మాత మొహంలో నవ్వులు పూయించి,‘కలెక్షన్’ కింగ్ అనిపించుకున్నాడు సింగ్. ఆస్ట్రేలియాలో పెద్ద అండర్‌వరల్డ్ డాన్ లక్కీసింగ్ (సోనూసూద్). అతని అన్న మిఖాసింగ్. అతని అనుచరులంతా ఊరి నుంచి పారిపోయి వచ్చిన సింగ్లే. వీళ్ల మాఫియాలో లక్కీని అందరూ ‘కింగ్’ అంటారు... డాన్ లాగ. పంజాబ్‌లో ఉన్న ఓ మారుమూల కుగ్రామంలో ఒక అమాయకుడు, మంచివాడైన యువకుడు హ్యాపీసింగ్ (అక్షయ్ కుమార్). ఇతను చేసే ప్రతి చిన్న పనీ ఎవరో ఒకరికి తీరని నష్టం కలిగిస్తుంది. దాని వెనుక ఏ దురుద్దేశం లేకపోయినా, అతని వల్ల జరిగే నష్టాల కారణంగా తనని ఎలాగైనా ఊరి నుంచి పంపించేయాలని అదే వూళ్లో ఉన్న రంగీలా (ఓమ్పురి) ప్లాన్ చేస్తాడు. హ్యాపీ ఊళ్లో ఉన్నంతవరకూ తనకి పెళ్లి చెడిపోతూనే ఉంటుందని అతని భయం. చివరికి ఒక సంబంధం కుదిరి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోయుంటుంది రంగీలాకి. అలాంటి సమయంలో ఆస్ట్రేలియాలో కింగ్ మాఫియా గురించి లక్కీ ఫొటోతో ఒక న్యూస్ వస్తుంది. ఇక్కడున్న లక్కీ తండ్రికి కడుపునొప్పి వస్తుంది అదే రోజు అసిడిటీతో. రెండింటినీ కలిపి రంగీలా ఊరివాళ్లతో పథకం పన్నుతాడు. పేపర్లో న్యూస్ వల్లే లక్కీ తండ్రికి గుండెపోటు వచ్చిందని. హ్యాపీ వెళ్లి లక్కీని తీసుకొస్తే గానీ ఆ ముసలాయన ప్రాణం నిలబడదని. హ్యాపీ ఒప్పుకుంటాడు బలవంతంగా. కానీ తనకి ఇంగ్లీషు రాదు. ఊళ్లో నాలుగు ఇంగ్లీషు ముక్కలు ఇంగ్లీషు మాట్లాడగలిగిన రంగీలా తోడుగా రావాలని హ్యాపీ ఊరివాళ్లని ఒప్పిస్తాడు. ఊరివాళ్లంతా వీళ్లిద్దరికీ చందాలేసుకుని మరీ ఆస్ట్రేలియా టిక్కెట్లు కొని పండగ చేసుకుంటారు. తీరా కనెక్టింగ్ ఫ్లయిట్ క్యాచ్ చేయాల్సిన టైమ్‌లో వేరేవాడికి డ్యాష్ ఇచ్చి బోర్డింగ్ పాసులు మారిపోయి (?) (లాఫ్టర్కి లాజిక్కులు ఉండవు) ఆస్ట్రేలియా బదులు ఈజిప్టు వెళ్తారు. అక్కడ హ్యాపీ కత్రినాకైఫ్‌ని చూసి ఆమె బ్యాగ్ కొట్టేసిన దొంగని పట్టించి ఆమెతో రోజంతా గడిపి ప్రేమలో పడిపోయి ఎయిర్‌లైన్స్ వాళ్లిచ్చిన ఆస్ట్రేలియా టిక్కెట్లతో (?) ఈజిప్టు నుంచి ఆస్ట్రేలియా వచ్చేస్తారు. ఆస్ట్రేలియాలో లక్కీసింగ్ని రమ్మని బతిమాలితే రాడు. పైగా హ్యాపీని, రంగీలాని మెడపట్టి బైటకి గెంటేస్తాడు. నడిరోడ్డున ఉన్న హ్యాపీని కిరణ్ ఖేర్ ఆదరిస్తుంది. నీడనిస్తుంది. తర్వాత లక్కీ మీద జరిగిన ఓ అటాక్‌లో హ్యాపీ లక్కీ ప్రాణాలు కాపాడబోయి అతని తలకి పెద్ద దెబ్బ తగిలేలా చేస్తాడు అనుకోకుండా. దాంతో లక్కీ కోమాలోకి వెళ్తాడు. చూపు, ఒళ్లు, చెవులు అన్నీ పనిచేస్తాయి బ్రెయిన్ తప్ప. అతడు చేసిన ఓ సైగ వల్ల... లక్కీ బాగయ్యే వరకూ హ్యాపీనే కింగ్ అవ్వ మంటున్నాడని అర్థం చేసేసుకుంటారు సర్దార్జీలంతా. హ్యాపీ కింగ్ అయ్యాక కిరణ్ కూతురు, అల్లుడు ఈజిప్టు నుంచి వస్తున్నారని, తన పేదరికం కూతురికి తెలీదని ఏడుస్తుంటే (?)... లక్కీ తన హోటళ్లు, బంగ్లాలు ఆవిడవిగా నమ్మించి, అతను మేనేజరుగా, మిగిలిన మాఫియా అనుచరులంతా సర్వెంట్లుగా నాటకం ఆడ తారు. తీరా వచ్చిన కూతురు తను ప్రేమించిన కత్రినాకైఫ్, కాబోయే అల్లుడు బోర్డింగ్ పాస్ మారడానికి కారకుడైన గుద్దిన వ్యక్తి పునీత్. వాళ్ల పెళ్లికి ఎన్ని మంచి ప్రయత్నాలు చేసినా అవి బెడిసికొట్టి చివరికి హ్యాపీకి, కత్రినాకి పెళ్లవుతుంది. లక్కీకి బ్రెయిన్ పనిచేసి, మాఫియాని మంచితనంతో మార్చిన హ్యాపీని కౌగిలించుకుని తనతో కలిసి పంజాబ్ వెళ్లిపోతాడు. కథ సుఖాంతం. ఈ మొత్తం వ్యవహారంలో కళ్లు సరిగా కనపడని, చెవులు సరిగా వినపడని లక్కీ అన్న మిఖాసింగ్గా జావెద్ జాఫ్రీ చాలా నవ్విస్తాడు. హిందీ సినిమాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే... అంతర్జాతీయ మార్కెట్ అవ్వడం వల్ల చిన్న కామెడీ కథల్ని కూడా భారీ తారాగణంతో ‘బాహుబలి’లా తీసేస్తారు. దానివల్ల సినిమా ఎక్కడైనా బోరు కొట్టినా, నవ్వించకపోయినా విజువల్‌గా భారీగా ఉండో, ఫైట్లు, ఛేజ్‌లు, పాటలు గ్రాండ్‌గా ఉండో చక్కగా పాసైపోతుంటుంది. ఆలోచనాత్మకమైన కమర్షియల్ హిట్స్‌కి ముందు, అనాలోచితంగా తీస్తే సూపర్‌హిట్ అయిన సినిమాలు 2008లో ‘సింగ్ ఈజ్ కింగ్’ వరకూ బాలీవుడ్‌ని శాసించాయని చెప్పచ్చు. తర్వాత సినిమాల నుంచి బాలీవుడ్ తీరుతెన్నులు చాలా మారిపోయినట్టు తెలుస్తుంది. పి.ఎస్.: నేను పెట్టిన క్వశ్చన్ మార్కులన్నీ కథ రాసేటప్పుడు కనీసం ఊహించడానికి కూడా సాహసించని విషయాలు. అయితే ధైర్యంగా సినిమాగా తీసేస్తే... అవేవీ హిట్‌కి అడ్డం రాని విషయాలు అని అర్థం అయింది. ఏదైనా ప్రేక్షకుడికి నచ్చేలా తీయడమే సక్సెస్. అలా తీసి భారీ హిట్టు కొట్టేశాడు అజ్మీ. -
నేల మీద తారలు
దేడ్ కహాని - తారే జమీన్ పర్ అనగనగా ఓ భయంకరమైన అల్లరి అబ్బాయి. వాడికి అయిదేళ్లప్పుడు అన్నలు ఇసుకతో కట్టిన గుడిని కసిగా కూల్చేసి నాన్నతో దెబ్బలు తిన్నాడు. ఇంకో ఆర్నెల్ల తర్వాత స్కూల్లో మాస్టారు వేరే స్టూడెంట్‌ని కొడుతుంటే భయమేసి నెలరోజులు స్కూలుకెళ్లలేదు. ఇంట్లో బయల్దేరి, గుళ్లో కూర్చుని, ఆడుకుని, పడుకుని మళ్లీ స్కూలు వదిలే టైముకి ఇంటికెళ్లిపోయేవాడు. సినిమాలు చూస్తున్నప్పుడు నిద్ర రాదు. పుస్తకం తెరిస్తే పడుకునేవాడు. స్కూలు విషయం ఇంట్లో తెలిసి అమ్మచేత ఒళ్లంతా రక్తం వచ్చేలా దెబ్బలు తిన్నాడు. అర్ధరాత్రి ఏదో గుర్తొచ్చి వాళ్ల నాన్న తలగడ కింద చెయ్యి పెడితే, పామనుకుని భయపడిన నాన్న తెల్లారేదాకా కొట్టారు. మూడు రోజులు కష్టపడి వత్తిన వందల అప్పడాలు అర సెకనులో చిదిమి ముక్కలు చేసి అమ్మచేత కవ్వం విరిగేలా తన్నులు తిన్నాడు. బైటికెళ్తే రక్తం కారుతూ వచ్చేవాడు. చెప్పకుండా సినిమాలకి పోయేవాడు. ఇంట్లోవాళ్లకి వాడొక పీడకల. వాడు మాత్రం అందమైన కలలు కంటూ పెరిగాడు. రాఘవేంద్రరావులా, దాసరిలా, విశ్వనాథ్‌లా, బాపులా, బాలచందర్‌లా, జంధ్యాలలా, సింగీతంలా, మణిరత్నంలా అవ్వాలని, అవుతానని కలలు కనేవాడు. చూసిన సినిమా కథ బాగా చెప్పేవాడు. ఎవరో ఒకరికి చెప్పకుండా నిద్రపోయే వాడు కాదు. ఎక్కువ బలైంది వాళ్లమ్మే పాపం. కాలేజీలో చదువు ఎగ్గొట్టడానికి కల్చరల్ కాంపిటీషన్స్‌కి వెళ్లేవాడు. వెళ్లగా వెళ్లగా అనుభవం వచ్చి, ప్రైజులు తేవడం మొదలెట్టాడు. ప్రైజులు తేగా తేగా కాన్ఫిడెన్స్ వచ్చి డిగ్రీ అవ్వగానే సినిమాల్లోకి దూకేశాడు. ఈదగా ఈదగా అనుభవం వచ్చి ‘మనసంతా నువ్వే’ సినిమా తీసి దర్శకుడైపోయాడు. ఇది బాల్యం. పెరిగి పెద్దయిన ప్రతి ఒక్కరికీ ఇలా ఒక బాల్యం ఉంటుంది. అది అందరికీ చాలా అందంగా ఉంటుంది. థాంక్ గాడ్... అప్పట్లో ఇంటర్నెట్లు, గూగుల్ సెర్చ్‌లు, అతిగా నాలెడ్జ్‌లు లేవు, అనవసరమైన అవేర్నెస్లు లేవు. లేకపోతే నన్ను కూడా ఏ ‘డిస్లెక్సిక్’ పేషెంట్గానో భావించి, మా పేరెంట్స్ ఏ స్పెషల్ చైల్డ్ గానో ట్రీట్మెంట్ ఇప్పించేస్తే, ఎటో పారిపోయేవాణ్ని, ఏదో అయిపోయే వాణ్ని. కోపం వస్తే నాలుగు దెబ్బలేసినా, ప్రేమను పంచి, అందరు పిల్లల్లానే మామూలుగానే పెంచేశారు. కాబట్టి సమాజంలో ఉండగలిగాను. అనుకున్నది చేయగలిగాను. ఇది నా కథ. ఇలా మనలో అందరికీ ఒక కథ ఉంటుంది. దాని నుంచి ఈ రోజున మనం తీసుకోగలిగిన స్ఫూర్తి ఉంటుంది. నేర్చుకోవలసిన పాఠం ఉంటుంది. చిన్నప్పుడు చదువంటే ఉండే భయం నుంచి, జీవితంలో పైకి రావడమనే జయం వరకు మనని, ప్రతి ఒక్కరినీ ఏదో ఒక పాత్ర, ఒక సంఘటన, ఒక తల్లో, తండ్రో, స్నేహితుడో, గురువో, అంకులో, ఆంటీయో, తాతగారో, నానమ్మో, అమ్మమ్మో... ఎవరో ఒక వ్యక్తి ప్రభావితం చేసి ఉంటారు. అలా కూడా ఎవరూ లేని వాళ్లకోసం ‘తారే జమీన్ పర్’ అనే ఒక సినిమా ఉంది. మన నిన్నటికి, మన రేపటికి మధ్య సంధి కాలం చీకటైతే, అందులో వెలుగునిచ్చే నక్షత్రం... ‘తారే జమీన్ పర్’. దర్శీల్ సఫారీ అనే ఎనిమిదేళ్ల కుర్రాడు ‘ఇషాన్ నందకిషోర్ అవస్థీ’గా జీవించిన చిత్రం. విపిన్శర్మ, టిస్కాచోప్రా మన అమ్మానాన్నలే అనిపించేంత సహజంగా నటించి, అలరించిన చిత్రం. ఆమిర్‌ఖాన్ రామ్‌శంకర్ నికుంభ్గా అత్యద్భుతంగా ఇమిడిపోయి, నటుడిగా ఎదిగిపోయిన చిత్రం. ‘తారే జమీన్ పర్’ ఆమిర్‌ఖాన్‌కి దర్శకుడిగా మొదటి చిత్రం. ఈ సినిమా కథ గురించి రాసే ముందు ఈ సినిమా పుట్టుక వెనుక ఉన్న కథని కచ్చితంగా చెప్పాలి. బాలీవుడ్లో దీపా భాటియా అనే ఫేమస్ ఫిమేల్ ఎడిటర్ ఒకామె ఉన్నారు. ఆమె భర్త అమోల్ గుప్తే కథలు రాసుకుంటూ, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ, దర్శకత్వ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ తిరుగుతుండేవాడు. ఒకరోజు దీపా భాటియా ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్శక శ్రేష్టుడు ‘అకిరా కురసోవా’ బాల్యం గురించి చదువుతూ... అంతటి మేధావి, దర్శకుడూ చిన్నప్పుడు స్కూల్లో చాలా పూర్ స్టూడెంట్ అని, చదువనే చట్రంలో ఇమడలేక ఇబ్బంది పడ్డాడని తెలిసి, వాళ్లాయనతో దీనిమీద ఒక సినిమా కథ తయారు చేయమంది. భారతీయ బాల్య విద్యా నేపథ్యానికి అకిరా కురసోవా జీవితాన్ని తర్జుమా చేసే ప్రయత్నంలో అమోల్ గుప్తే చాలా రీసెర్చ్ చేశాడు. అందులో ఆయనకి ప్రపంచంలో చాలామంది గొప్పవాళ్లు, ఏదో ఒక రంగంలో ప్రపంచాన్ని శాసించినవాళ్లు కూడా చిన్నప్పుడు ఒక ఫిక్స్డ్ కరిక్యులమ్‌లో, డిసిప్లిన్డ్ స్టడీస్‌లో ఫెయిలయ్యారని తెలిసింది. ఆ రీసెర్చ్ లోంచి డిస్లెక్సియా అనే వ్యాధి పిల్లలకి అక్షరాలని గుర్తుండనివ్వదని తెలిసింది. అన్ని విషయాల్లోనూ తెలివిగా ఉండే మూడో తరగతి పిల్లాడు యాపిల్ స్పెల్లింగ్ కూడా గుర్తుంచుకుని సరిగా రాయలేక పోతే, దానికి కారణం ఈ వ్యాధి అని అర్థమైంది. అలా ‘తారే జమీన్ పర్’ కథ పుట్టింది. దానికి సరిగ్గా సరిపోయే కుర్రాడి కోసం వెతుకుతూ, షమ్యక్ దేవర్ సమ్మర్ డ్యాన్స్ క్లాస్‌లో పిల్లల్ని చూస్తుంటే... దర్శీల్ సఫారీ అనే కుర్రాడు దొరికాడు. చదువుతో నానా అవస్థలు పడే ఇషాన్ అవస్థి పాత్రకు అతడు ఫిక్స్ అవ్వగానే... టీచర్ పాత్రధారి అయిన హీరో కోసం, నిర్మాత కోసం వెతకనారంభించాడు. ముందు హీరోని ఒప్పిస్తే నిర్మాత దొరుకుతాడు కాబట్టి అక్షయ్ఖన్నాని కలిసి కథ చెప్పాడు. కథ వల్లో, అమోల్ గుప్తే దర్శకత్వం వల్లో అక్షయ్ఖన్నా ఒప్పుకో లేదు. అప్పుడు ఆమిర్‌ఖాన్‌ని కలిశాడు. తన బాల్యంలో ఆర్ట్ క్లాస్ టీచర్ అయిన రామ్‌దాస్ సంపత్ నికుంభ్ని స్ఫూర్తిగా తీసుకుని అమోల్ గుప్తే హీరో పాత్రని రూపొందించాడు. అందుకే ఆ పాత్రకి రామ్‌శంకర్ నికుంభ్ అని పేరు పెట్టాడు. మంచి కథలకి, మంచి పాత్రలకి ఎప్పుడూ ముందుండే ఆమిర్‌ఖాన్ నికుంభ్ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు. తనే నిర్మాతగా, అమోల్ గుప్తేకి దర్శకత్వం అవకాశం ఇచ్చాడు. నెలలు గడుస్తున్నాయి. కథ, మాటలు బావున్నా... స్క్రీన్‌ప్లే, దర్శకత్వం తేడాగా ఉన్నాయని ఆమిర్‌కి అనుమానం వచ్చింది. అమోల్ వర్క్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తున్నా కానీ, క్రియేటివ్‌గా కాయితం నుంచి వెండితెర మీదకి ఎక్కించే విషయాల్లో ఏదో లోపిస్తోందని ఆమిర్ అనుమానపడ్డాడు. దాంతో అమోల్‌ని దర్శకుడిగా వద్దన్నాడు. అయితే వేరే దర్శకులని వెతకడం, వాళ్లు దానిని ఎక్కించుకుని తెరకెక్కించేలోపు దర్శీల్ పెరిగి పెద్దయిపోతుండడం - ఇవన్నీ ఎందుకని ఆమిర్‌ఖాన్ స్వయంగా మెగాఫోన్ పట్టేసుకున్నాడు. తనే నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా బాధ్యతలు భుజానేసుకుని అమోల్ గుప్తేని క్రియేటివ్ డెరైక్టర్‌గా పెట్టి ‘తారే జమీన్ పర్’ని మనకందించాడు. ప్రేక్షకులేం తక్కువ తినలేదు. 12 కోట్ల బడ్జెట్‌కి 89 కోట్లు తిరిగి ఇచ్చారు. ఇంత మంచి చిత్రం తీసిచ్చిన ఆమిర్ ఖాన్‌కి, కాసులతో పాటు అవార్డుల పంట కూడా పండింది. భారతదేశం తరఫున ఆస్కార్ బెస్ట్ ఫారిన్ ఫిల్మ్‌గా నామినేట్ కూడా అయ్యింది. చెన్నైలో ప్రతి యేటా ప్రపంచ వ్యాప్తంగా మొదటి సినిమా దర్శకుడికి ఇచ్చే ‘గొల్లపూడి శ్రీనివాస్ అంతర్జాతీయ అవార్డు (తన మొదటి చిత్రానికి దర్శకత్వం వహిస్తూ షూటింగ్లో ప్రమాద వశాత్తూ మరణించిన తన కుమారుడు శ్రీనివాస్ జ్ఞాపకార్థం ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావుగారు ఇరవై ఏళ్లుగా ప్రతి యేటా ఎంతోమంది అంతర్జాతీయ దర్శకులకి ప్రోత్సాహంగా ఈ అవార్డు ఇస్తున్నారు)’ ఆ యేడు ఆమిర్‌ఖాన్‌కి దక్కింది. ఇదీ... ‘తారే జమీన్ పర్’ తెర వెనుక కథ. చదవలేక పోవడం నిర్లక్ష్యం కాదు, వ్యాధి అని చెప్పే ఒక ఉపాధ్యాయుడు నిరాశా నిస్పృహలకు లోనైన చిన్నారిని ఉత్తేజితుల్ని చేసి ఆ స్కూల్‌కి చిన్న సైజు హీరోని చేస్తాడు. ఇది పిల్లలు చూడాల్సిన సినిమా మాత్రమే కాదు. పిల్లలున్న తల్లిదండ్రులు, టీచర్లు అందరూ చూడాల్సిన చిత్రం. నిజానికి ఇది ఒక కమర్షియల్ చిత్రం కాదు. కంపల్సరీగా ప్రతి స్కూల్లోనూ చూపించాల్సిన పాఠం. ముఖ్యంగా ఎలిమెంటరీ స్కూలు స్థాయిలో ఉండాల్సిన పాఠం. ఆమిర్‌ఖాన్ నటుడిగా, నిర్మాతగా ఎన్నో మంచి చిత్రాలిచ్చాడు. ఇక దర్శకుడిగా మారి ఇచ్చిన ‘తారే జమీన్ పర్’ గురించి చెప్పుకోవాల్సిన పనే లేదు. అదొక ఆణిముత్యం. ర్యాంకుల కోసం పిల్లల నెత్తిమీద మోయలేని బరువును పెట్టేసి, ఒత్తిడికి లోను చేసి, వారి ఆత్మహత్యలకు సైతం కారణమవుతోన్న తల్లిదండ్రులందరికీ గొప్ప సందేశాన్నే ఇచ్చాడు ఆమిర్ ఈ చిత్రం ద్వారా. పిల్లలు వెనుకబడటానికి వాళ్లు మొద్దులు కావడం కారణం కాదని, ఏదైనా సమస్య ఉందేమో చూడమని, ఏదైనా టాలెంట్ ఉంటే వెలికి తీసి వాళ్లని గొప్పవాళ్లను చేయమని కొత్త పాఠం చెప్పాడు. ఎంత గొప్ప పాఠమిది! పిల్లలు... నేలమీది తారలు. వాళ్లని బాగా పెంచితేనే సమాజం బావుంటుంది. -
ఈ జోడీ పర్ఫెక్ట్!
దేడ్ కహానీ - జబ్ వియ్ మెట్ చేపపిల్ల... నీళ్లల్లో ఈదుతున్నంతసేపూ నోటి దవడలు ఆడిస్తూనే ఉంటుంది. నీళ్లు తాగకుండా ఆక్సిజన్ తీసుకునే ప్రక్రియ అది. దాని జీవనాధారం. అలాగే ఓ చేప కళ్లున్న ఆడపిల్ల, చలాకీగా ఇరవై నాలుగ్గం టలూ తన పెదాలని ఆడిస్తూనే ఉంటుంది. ఎదుటి వాడి మనోభావాలతో సంబంధం లేదు. అలా మాట్లాడుతూనే ఉంటుంది. చివరికి నిద్రలో కూడా. ఆమే... గీత్ సింగ్. అమాయకమైన పల్లె టూరి అమ్మాయి. ముంబైలో ట్రైన్ ఎక్కుతుంది. పరిగెడుతున్న ట్రైన్ లోపల కెమెరా పెట్టి, ఖాళీ డోరు షాటు, కదులు తున్న ట్రైనుని చూపిస్తూ, గట్టిగా గీత్ గొంతు, మాటలు మాత్రమే వినపడేలా కొంత దూరం నడిపించి, తర్వాతే ఆమె రూపాన్ని ప్రేక్షకులకి పరిచయం చేస్తాడు దర్శకుడు. ఒక వాగుడుకాయ్ క్యారెక్టర్‌కి ఇంతకంటే అందమైన, అర్థవంతమైన పరిచయం వేరేది ఉండదు. ఇలా గీత్‌ని పరిచయం చేయడానికి ముందే ముంబైలో ఒక గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ వారసుడు ఆదిత్య కశ్యప్‌ని చాలా నిరాశగా, నిస్పృహగా, జీవితంలో ఓడిపోయి, అదీ తల్లి వేరే వ్యక్తిని ప్రేమించి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోతే, ఆ రిఫ్లెక్షను తనని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మీద పడి, ఆమె పెళ్లి క్యాన్సిల్ చేసేస్తే, మూగ బోయినవాడిగా చూపిస్తాడు దర్శకుడు. గమ్యం తెలీక, ఎలా ఉన్నవాడు అలా ఇల్లొదిలి రెలైక్కి కూర్చుంటాడు. అలాంటి వాడికి కో-ప్యాసింజర్ గీత్. అడిగినా అడక్కపోయినా, విసుక్కున్నా, లేచి వెళ్లి ఇంకో దగ్గర కూర్చున్నా ఆమె ధోరణి ఆమెదే. ఆ ఇద్దరూ కలిసి చేసే రైలు ప్రయాణం, దాని కొనసాగింపుగా చేసే జీవిత ప్రయాణమే ‘జబ్ వియ్ మెట్’ సినిమా మొదటి భాగం. నిరాశా నిస్పృహల్లో ఉన్న ఆదిత్యని తన సెలయేటి ప్రవాహం లాంటి మాటల నుంచి ప్రసరించిన తరంగాల కరెంటుతో చైతన్యవంతుణ్ని చేస్తుంది గీత్. అద్భుతమైన సీన్ ఏంటంటే, తండ్రి మరణానికి కారణం తన తల్లి వేరే వ్యక్తిని ప్రేమించి వెళ్లిపోవడం అని, సమాజం తల్లి మీద వేసిన నిందని కొడుకుగా తనూ వేసి ఆమెపై కోపం పెంచుకున్న కశ్యప్‌కి గీత్, తల్లి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం నేర్పిస్తుంది. తల్లి కూడా ఒక మనిషే అని, ఆమె ప్రేమలో తప్పు లేదని, కొడుకుగా ఆమెని అర్థం చేసుకోవాలే తప్ప, సమాజం దృష్టి నుంచి ఆమెని చూడకూడదని చెప్తుంది. ఇలాంటి తల్లుల్ని నిజ జీవితంలో చూసే ఉంటాం, సమాజంలాగ వాళ్లని చెడుగా తిట్టే ఉంటాం - గీత్‌లా వాళ్లని మనుషులుగా భావించమని చెప్పేవాళ్లు మనకుండకపోవచ్చు. జబ్ వియ్ మెట్ గీత్... వుయ్ లెర్న్ హౌ టు లీడ్ లైఫ్ అండ్ హౌ టు ట్రీట్ అదర్స్. సరే, అలాంటి గీత్‌ని ఆమె ఇంట్లోంచి తెల్లారుఝామున తీసుకొచ్చి ఆమె ప్రేమించిన అన్షుమన్ దగ్గర వదిలి వెళ్లిపోతాడు కశ్యప్. ఆమె అడుగుతుంది - మా ఇంట్లోవాళ్లకి తెలీకుండా ఇలా వెళ్లిపోతున్నాను నన్ను క్షమిస్తారా అని! ఆదిత్య చెప్తాడు - మా అమ్మని నీవల్ల నేను అర్థం చేసుకున్నాను, నిన్ను కూడా మీవాళ్లు కొన్నాళ్లకి అర్థం చేసుకుంటారని. అన్షుమన్‌ని కలవకుండానే గీత్‌ని దింపేసి వెళ్లిపోతాడు కశ్యప్ - ఇక్కడ విశ్రాంతి. జీవితాన్ని ఎలా చూడాలో, ఆ క్షణాన్ని ఎలా ఆస్వాదించాలో గీత్ ఆదిత్యకే కాకుండా ఆడియెన్స్ అందరికీ చెప్తుంది. అందుకే ఫస్ట్ హాఫ్ చాలా బావుంటుంది. అందుకే ఫస్ట్ హాఫ్ గురించి ఎక్కువ రాశాను. ద్వితీయార్ధంలో ఆదిత్య చాలా యాక్టివ్ అయిపోతాడు. కానీ గీత్ మాత్రం జీవితంలో ఓడిపోయి కాన్ఫిడెన్స్ కోల్పోయి డీలా పడిపోతుంది. అది తెలిసి ఆమెలో తన చైతన్యంతో కరెంట్ ప్రవహించేట్టు చేసి ఆమెని మామూలుగా తన కుటుంబంతో కలిపే ప్రయత్నం చేస్తాడు ఆదిత్య. ఆ క్రమంలో వాళ్లిద్దరూ ఒకటవ్వడమే కథ. ప్రథమార్ధంలో ఉత్తుంగ తరంగం లాంటి గీత్‌గా మెప్పించిన కరీనా కపూర్ నీరసించడం, నీరస పాత్రలో బాగా మెప్పించిన షాహిద్ కపూర్ ద్వితీయార్ధంలో ఉత్తుంగ తరంగంలా ఎగసి పడలేకపోవడం చూస్తే... సినిమాని కొంచెం పడేసిన ఫీలింగ్ వస్తుంది. కానీ, గీత్ ప్రేమించిన అన్షుమన్‌ని కుటుంబ సభ్యులు స్నేహితుడనుకుని, ఆదిత్యని అల్లుడనుకునే సన్నివేశాలు బాగా నవ్వు తెప్పిస్తాయి. ఆ ఇంటి సీన్లే సెకండ్ హాఫ్‌కి సేవింగ్ ఫ్యాక్టర్. ఒక విధంగా శ్రీను వైట్లగారి సినిమాల ఫార్మాట్ నుంచే ఈ చిత్ర రూపకల్పన జరిగినట్టు ఉంటుంది. ఆ ఇంటి సీన్లు తెలుగులో చాలా సినిమాలకి ముడి సరుకు. షాహిద్, కరీనాలు అప్పటికే ప్రేమికులుగా పాపులర్ అవ్వడం వల్ల కెమిస్ట్రీ మరింత బాగా పండినట్టు ఉంటుంది. కానీ, ఇదే ‘దిల్వాలే దుల్హనియా’ టైమ్‌లో షారుఖ్, కాజోల్ లాంటి జంట చేసుంటే... ఇది కూడా వాటిలాగే ఒక కల్ట్ ఫిల్మ్ అవ్వగలిగే కథ, కథనం ఉన్నాయి ఇందులో. అందుకే ఈ సినిమా బాలీవుడ్లో కమర్షియల్ హిట్‌గా నిలిచింది. 2007 అక్టోబర్‌లో రిలీజైన ఈ సినిమా 2010లో హాలీవుడ్లో ‘లీప్ ఇయర్’ అనే సినిమాకి ప్రేరణ కావడం భారతీయ సినిమా గర్వించదగ్గ అంశమే. విచిత్రం ఏంటంటే ఈ చిత్రం చివరి షెడ్యూల్‌కి వచ్చేసరికి షాహిద్, కరీనాలు నిజ జీవితంలో విడిపోయారు. మీడియా అంతా అది ఈ చిత్రం తాలూకు పబ్లిసిటీ స్టంట్ అని అభివర్ణించింది. కానీ తర్వాత అది నిజమని రుజువైంది. ఈ సినిమా టైటిల్‌ని ‘పంజాబ్ మెయిల్’ అని పెట్టాలా, ‘ఇష్క్ వయా భటిండా’ అని పెట్టాలా ‘జబ్ వియ్ మెట్’ అని పెట్టాలా తేల్చుకోలేక పబ్లిక్ ఓటింగ్ పెడితే జబ్ వియ్ మెట్ గెలిచింది. అలాగే రిలీజయ్యాక ప్రేక్షకుల మన్ననలూ గెలిచింది. కాసుల వర్షమూ రూపాయికి మూడు రూపాయల చొప్పున గెలుచుకొంది. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన మరో ముఖ్య అంశం... ప్రీతమ్ సంగీతం. ఆసాంతం ఆకట్టుకొంటుంది. నటరాజన్ సుబ్రమణియన్ కెమెరా పనితనం కూడా చాలా బావుంటుంది. శ్రేయాఘోషల్కి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ గాను, సరోజ్ఖాన్కి బెస్ట్ కొరియోగ్రాఫర్ గాను, నేషనల్ అవార్డులను తేవడంతో పాటు కరీనా కపూర్‌కి ఉత్తమ నటిగా ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రైవేటు అవార్డుల్ని తెచ్చిపెట్టింది ఈ చిత్రం. దర్శకుడు ఇంతియాజ్ అలీ రెండో చిత్రం ఇది. ఈ చిత్రం సక్సెస్ ఇచ్చిన ఊపుతో తర్వాత చాలా మంచి చిత్రాలు తీశాడు. ఇంతియాజ్ కథ కన్నా పాత్రకి, పాత్రల రూపకల్పనకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. వాటి ద్వారా జీవితాన్ని, భావోద్వేగాల్ని అద్భుతంగా ఆవిష్కరిస్తాడు. ప్రేమని చాలా సున్నితంగా ప్రస్తావిస్తాడు. సీన్స్‌ని సుతిమెత్తటి పూవుల్లా ప్యాంపర్ చేస్తాడు. అందుకే మంచి దర్శకుడిగా ఎదిగాడు. రైలు ప్రయాణం ఆధారంగా తీసిన ఈ చిత్రంతో కెరీర్లో, జీవితంలో సక్సెస్ అందుకున్నాడు. తిన్నగా హైవే ఎక్కేశాడు. ఇక పక్కదారి పట్టడనే భావిద్దాం. మరిన్ని మంచి సినిమాలు తీస్తాడని, మనకు చూపిస్తాడనీ ఆశిస్తాం. - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
ప్రతి మదిలో రగిలిన క్రీడాస్ఫూర్తి!
దేడ్ కహానీ - చక్ దే ఇండియా నిద్రాణమైన జాతిని, నిస్తేజమైన జీవితాల్ని ఉత్తేజితుల్ని, చైతన్యవంతుల్ని చేసిన చిత్రమిది. అందుకే సూపర్‌హిట్ అయ్యింది. మిలీనియమ్‌లో వచ్చిన చిత్రాల్లో మణిపూసలా నిలిచింది. ప్రేక్షకులకే కాదు... యావత్ సమాజానికే ప్రేరణనిచ్చింది. హాకీ మ్యాచ్ చూడ్డానికి బోరు. అందులోనూ మహిళల హాకీ. మ్యాచ్ అసలు ఎక్కడాడతారో, ఎప్పుడు జరుగుతాయో కూడా తెలీదు. ఇది సగటు భారతీయుడిగా నా నాలెడ్జ్, నా ఇంటరెస్ట్. 1983 నుంచి ఇండియాలో మగాళ్ల ఆట అంటే క్రికెట్టే. 1990ల నుంచి ప్రపంచంలో ఆడవాళ్ల ఆట అంటే టెన్నిస్సే. వేరే ఆటలుంటాయని, అవి కూడా ఆడుతుంటారని అప్పుడప్పుడూ కామన్వెల్త్, ఆసియా గేమ్స్, ఒలింపిక్స్ లాంటివి జరిగినప్పుడు న్యూస్పేపర్లో చదవడం... ఏ దేశానికెన్ని పతకాలు వచ్చాయో పట్టీ మాత్రం చూసేసి, ఇండియాని తక్కువ స్థానంలో చూడడం, ఆ తక్కువ పతకాలు తెచ్చిన ఆటగాళ్లని కూడా తక్కువ చేసి చూడడం అలవాటై పోయింది. అలా ఎదిగేశాం. అలాగే అన్ని ఆటల్నీ వదిలేశాం. ఇలాంటి భావ సంచయం ఉన్న నాలాంటి ప్రేక్షకుడు, అందులోనూ క్రికెట్ మతం పుచ్చుకున్న ఉన్మాది... హాకీ ఆటే ప్రధానంగా తీసిన సినిమా చూడ్డానికి ఏ మాత్రమైనా ఆసక్తి చూపిస్తాడా? అయినా నేను ‘చక్ దే ఇండియా’ సినిమా చూడ్డానికి వెళ్లాను. దానికి కారణం... అది యశ్‌రాజ్ ఫిలిమ్స్వాళ్లు షారుఖ్‌ఖాన్ హీరోగా, ఆదిత్యచోప్రా నిర్మాతగా, షిమిత్ అమీన్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ తీయడమే. అయితే సినిమా మాత్రం భారత హాకీ టీమ్‌కి సంబంధించి నది కాబట్టి కాస్త అయిష్టంగానే వెళ్లాను. ‘లగాన్’ చూసిన కళ్లతో హాకీ ఆటని చూడగలనా? అనుకున్నాను. అప్పటికి నాకు 33 ఏళ్లు. జీవితంలో ఎప్పుడూ ఒక్క హాకీ మ్యాచ్ చూసిన పాపాన పోలేదు. అందుకే ఆ సినిమాను చూడ్డానికి అంత కష్టంగా వెళ్లాను. కానీ ‘చక్ దే ఇండియా’ సినిమా చూశాక మాత్రం... జీవితాంతం హాకీ మ్యాచెస్‌ని వదలకుండా చూసి తీరాలని గట్టిగా నిశ్చయించుకున్నాను. భారతదేశ పురుషాహంకార సమాజంలో ఆడవారు ఆటుపోట్లు ఎదుర్కోవడానికే గానీ ఆటలాడడానికి పనికి రారు అన్న భావన చాలామందిలో ఉంది. అందరూ పిచ్చిగా అభిమానించే క్రికెట్లోనే మహిళల క్రికెట్‌కి ఆదరణ లేని భారతీయ సమాజంలో... ఇతర ఆటలకి విలువ, ఆ ఆటగాళ్లకి గుర్తింపు లేని రోజుల్లో... ఆడవాళ్ల హాకీని ప్రధానంగా చూపిస్తూ ‘చక్ దే ఇండియా’ తీశారు. ఆ ఆటను ఎవ్వరూ ఎలా పట్టించుకోవడం లేదో, అదే కథగా తీసి చూపించారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ కొన్ని పాత్రల్లో ఎంతో బాగా ఇమిడిపోతాడు. అలా అతడు అద్భుతంగా ఇమిడిపోయిన వాటిలో మొదటిది ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ అయితే, రెండోది ‘చక్ దే ఇండియా’నే. మన జాతీయ క్రీడ హాకీ. కానీ దానికి మన దేశంలోనే ఆదరణ కరువైపోయింది. ఆ నిరాదరణ మహిళల హాకీని పూర్తిగా చంపేయబోయింది. అలాంటి సమయంలో హాకీ సమాఖ్య... ఒక భారత పురుషుల హాకీ టీమ్ మాజీ కెప్టెన్‌ని మహిళల టీమ్‌కి కోచ్‌గా నియమిస్తుంది. అతని పేరు కబీర్‌ఖాన్. కబీర్‌ఖాన్ ఇస్లాం మతస్థుడు. భారత హాకీ కెప్టెన్‌గా ప్రపంచ కప్ ఫైనల్లో పెనాల్టీ కార్నర్ గోల్‌గా మలచలేక విఫలమౌతాడు. దాంతో పాకిస్థాన్ గెలుస్తుంది. కబీర్‌ఖాన్ పాక్ ఆటగాళ్లని కంగ్రాట్యులేట్ చేస్తాడు. అది ఓ జర్నలిస్టు ఫొటో తీసి కబీర్ఖాన్ని దేశద్రోహిగా, పాకిస్థాన్‌కి అమ్ముడు పోయినవాడిగా చిత్రీకరిస్తాడు. దాంతో కబీర్‌ఖాన్ ఇల్లు వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. మళ్లీ ఏడేళ్ల తర్వాత ఒక పాత మిత్రుడి ప్రోత్సాహంతో హాకీ ఆటకు చేరువవు తాడు కబీర్. భారత మహిళల హాకీ టీమ్‌ని ప్రపంచకప్‌కి పంపించే ముందు కోచ్‌గా ఎవ్వరూ ముందుకు రాని సమయంలో... తన దేశభక్తిని నిరూ పించుకునే అవకాశంగా దాన్ని భావించి, కోచ్ పదవిని చేపడతాడు కబీర్‌ఖాన్. పదహారు మంది మహిళలున్న భారత హాకీ జట్టును ముందుకు నడిపించే బాధ్యతను నెత్తిన వేసుకుంటాడు. ప్రపంచకప్ గెలిపించి మహిళల హాకీకి పునరుజ్జీవనం తేవడంతో పాటు తన మీదున్న మచ్చని పోగొట్టుకుంటాడు. కథ కంచికి, కబీర్‌ఖాన్ సొంత ఇంటికి చేరుకోవడంతో సుఖాంతమవుతుంది. జైదీప్ సాహ్ని అనే కథ, స్క్రీన్‌ప్లే, మాటల రచయిత 2002లో కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల హాకీ టీమ్ గెలిచిందన్న చిన్న ఆర్టికల్‌ను చదివాడు. ఆ నేపథ్యంలో సినిమా చేయాలనుకుని మహరాజ్ కృష్ణన్ కౌశిక్ అనే అప్పటి కోచ్‌ని కలిసి తాను అనుకున్న కథ చెప్పార్ట. ఆయన... 1982 ఏషియన్ గేమ్స్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయిన మీర్ రంజన్ నేగి అనే హాకీ ప్లేయర్‌ని పరిచయం చేశాడు. తన వల్లే పాక్ చేతిలో భారత్ ఓడిపోయిందని ఆరోపణలు ఎదుర్కొన్నాడు మీర్. అలా ఒక విన్నింగ్, ఇన్స్పిరేషన్ కథలో ఒక దేశద్రోహం, దేశభక్తి అనే అంశాలు కలగలసి సినిమా స్కోపుకి స్పాన్‌ని బాగా పెంచాయి. పదహారు మంది వివిధ రాష్ట్రాల అమ్మాయిలు, వివిధ ఆకారాలు, ఆహారాలు, అలవాట్లు, భాషలు, అభిప్రాయాలు ఉన్నవాళ్లు - ఒకసారి జీవితంలో దారుణంగా ఓడిపోయిన మనిషి గెడైన్స్‌లో గెలవడానికి కష్ట పడడమే ఈ చిత్ర కథ. మూడు కొప్పులు ఒక దగ్గరుంటే ప్రళయం అన్న నానుడిని తుడిచి పెట్టేలా పదహారు కొప్పులు కలిసి ప్రపంచ కప్పుని గెలిచి, భారత జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగిరేలా చేయడం చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సిక్కు జవాన్లు శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు అడవి దారిలో, జలాశయాలు దాటడానికి పెద్ద పెద్ద దుంగల్ని మోయాల్సి వస్తుంది. ఆ సమయంలో ఇన్స్పిరేషన్ కోసం అరిచే అరుపు ‘చక్ దే’. ప్రపంచకప్పు బ్రిడ్జి దూలాల కన్నా పెనుభారం. దేశ గౌరవం పెంచడం ప్రపంచకప్పు గెలవడం కన్నా బరువైనది. అందుకే అంత కష్టమైన పనిని క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా పదహారు మంది అమ్మాయిలు నెరవేర్చాలి కాబట్టి ఈ చిత్రానికి ‘చక్ దే ఇండియా’ అని టైటిల్ పెట్టారు. ఇందులో ఆడవారి మధ్య సహజంగా ఉండే ఈర్ష్య, అసూయలు ఉంటాయి. పోలికలు ఉంటాయి. అన్ని సహజమైన కథావస్తువులతో పాటు మామూలు మనిషిని, నిద్రాణమైన జాతిని, నిస్తేజమైన జీవితాల్ని, ఉత్తేజితుల్ని, చైతన్యవంతుల్ని చేసే పవర్ఫుల్ స్ఫూర్తి... ప్రధాన కథావస్తువుగా ఉంటుంది. ఈ చిత్రం సూపర్‌హిట్ అవ్వడానికి ఇదే కారణం. మిగిలిన హంగులన్నీ అందంగా అద్దిన అలంకారాలే. మిలీనియమ్‌లో ఇలాంటి కథలు ప్రేక్షకులకే కాదు, సమాజానికే ప్రేరణ. ఇది ఒక స్పోర్ట్స్ మూవీ కాదు. స్పోర్టివ్ స్పిరిట్‌కి సంబంధించిన మూవీ. ‘దిల్వాలే దుల్హనియా’ చిత్రంలో యువతని ప్రేమ మత్తులో ముంచిన ఆదిత్యచోప్రా తానే కనిపెట్టిన విరుగుడు మందు... ‘చక్ దే ఇండియా’ చిత్రం. ‘లగాన్’ జరిగిపోయిన కథ. చరిత్ర. ‘చక్ దే’ నడుస్తున్న వర్తమానం. ఇది మనం వెళ్తున్న దారి. చేరాల్సిన గమ్యం. స్త్రీకి, పురుషుడికి మధ్య సున్నితమైన ఇగోయిస్టిక్ తేడాని... సక్సెస్, కెరీర్, డ్రీమ్, గోల్ లాంటి వాటిని... హాకీకి క్రికెట్‌కి మధ్య ఉన్న ఇగోని కలిపి ప్రీతి అనే అమ్మాయి ప్రేమకథలో మిళితం చేయడం అద్భుతమైన ఆలోచన. ఈ ఒక్క కథే పది వాల్యూమ్స్ గ్రంథం. అది మాత్రమే కాదు. ప్రతి సీన్లోనూ ఎంతో జాగ్రత్త, పకడ్బందీ అల్లిక కనిపిస్తుంది. ‘చక్ దే ఇండియన్ సినిమా.’ చేతనైతే ప్రేరణని కమర్షియల్ కథావస్తువుగా చేద్దాం. ప్రేరణ, స్ఫూర్తి లాంటి మంచి అంశాలు... దురదృష్టవశాత్తూ అవార్డు చిత్రాల కథావస్తువులు మాత్రమే. దాన్ని మార్చడానికి ప్రయత్నించి, ఈ చిత్రాన్ని నిర్మించిన ఆదిత్యచోప్రాకి శత సహస్ర శుభాభినందనలు. ఆయన ప్రయత్నానికి అందమైన రూపమిచ్చిన దర్శకుడికి హ్యాట్సాఫ్! - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
ధూమ్ ధామ్ బ్లాక్ బస్టర్
దేడ్ కహానీ - ధూమ్ 2 తెర మీద: ఓ పోలీసాఫీసరు ‘ఎ’ అనే పెద్ద అంతర్రాష్ట్రీయ దొంగని పట్టుకోవడానికి ఓ అమ్మాయిని దొంగగా ప్రవేశపెడతాడు. ఆమె ఆ దొంగని పడేయడానికి, నమ్మించడానికి విపరీతంగా అంగాంగ ప్రదర్శన చేస్తుంది. తనని తాను అర్పించుకుంటుంది. మోతాదు మించి రొమాన్స్ చేస్తుంది. ఆ క్రమంలో ఆ దొంగతో నిజంగానే ప్రేమలో పడిపోతుంది. తెర వెనుక: ఆ పోలీసు పాత్రధారి దొంగగా ప్రవేశపెట్టే అమ్మాయి అతనికి నిజ జీవితంలో కాబోయే భార్య. నిశ్చితార్థం అయ్యి, పెళ్లి జరగబోయే ముందు తీసిన సినిమా. ఆ దొంగ బాలీవుడ్లో మోస్ట్ డిజైరబుల్, హ్యాండ్సమ్ హీరో హృతిక్. ఆ అమ్మాయి భారతీయ సౌందర్యాన్ని ప్రపంచ వేదికపై ప్రశంసించేలా చేసిన సుందరి ఐశ్వర్యారాయ్. ఆ పోలీసాఫీసరు, నిజ జీవితంలో ఆమె కాబోయే భర్త... అమితాబ్ బచ్చన్ వారసుడు అభిషేక్ బచ్చన్. ఎంతో ప్రొఫెషనలిజమ్ ఉంటే తప్ప ఇలాంటి పాత్రల్లో పాత్రధారులు నటించలేరు. ఆ ప్రొఫెషనలిజమే బాలీవుడ్ పరిశ్రమని ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానానికి ఎగరేసుకుపోతోంది. పర్సనల్ లైఫ్‌లో ఎవరు ఎవరికి ఏమైనా కానీ, తెర మీద పాత్ర ఏం చేయాలో, ప్రేక్షకుడికి ఏం కావాలో అది ఇచ్చేయడంలో బాలీవుడ్‌ని మించిన పరిశ్రమ భారతదేశంలో లేదు. ప్రేక్షకులు కూడా అలాగే ప్రేమిస్తారు ఆ పరిశ్రమని. తెలుగులో ఓ పెద్ద నటుడి కూతురు హీరోయిన్ అవ్వాలంటే అభిమానులు ఒప్పుకోరు. ఆ వంకన ఇంట్లోవాళ్లూ ఒప్పుకోరు. ఫ్యాషన్‌కి, ప్రతిభకి, క్యారెక్టర్నీ పర్సనల్ ఇమేజ్‌నీ ముడిపెట్టడం వల్లే దక్షిణాది సినిమా చాలా విషయాల్లో వెనకబడిపోతూ ఉంటుంది (ఇది నా వ్యక్తిగత పరిశీలన మాత్రమే. ఎవరి అభిప్రాయం వాళ్లది. చర్చలకు తావు లేదు). ‘ధూమ్’ మొదటి భాగం హిట్ అయిన ఆనందంలో జాన్ అబ్రహాం పాత్రలో హృతిక్ రోషన్‌ని పెట్టి, అదే దర్శక నిర్మాతలు సంజయ్ గధ్వీ, ఆదిత్య చోప్రాలు అందించిన ఫక్తు కమర్షియల్ చిత్రం ‘ధూమ్ 2’. ఇది సర్వ రుచుల సమ్మేళనం! ముప్ఫై అయిదు కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రానికి 150 కోట్ల వసూళ్లు వచ్చాయి. అంటే హిందీ సినిమా ఎక్కడుంది మిలీనియమ్‌లో?! హృతిక్ రోషన్, ఐశ్వర్యారాయ్‌ల అధర చుంబనాలు, అర్ధనగ్న ప్రదర్శనలతో పాటు తెరమీద నుంచి కళ్లు పక్కకి తిప్పనివ్వని విజువల్స్, థ్రిల్స్, చేజులు, అడుగడుగునా వీడియో గేమ్స్‌ని మించిపోయిన బ్రెయిన్ గ్రేమ్స్, కాళ్లని క్షణం కూడా కుదురుగా ఉండనివ్వని పాటలు... వెరసి బాగా ఆకలి మీదున్నప్పుడు పెట్టిన బఫే భోజనం ‘ధూమ్ 2’. మొదటి భాగం ‘ధూమ్ మచాలే’ అన్న పాటతో పూర్తవుతుంది. అందులో ఈషా డియోల్ ప్రత్యేక ఆకర్షణ. ఇదే పాటతో ‘ధూమ్ 2’ మొదలవుతుంది. సిక్స్‌ప్యాక్ బాడీతో హృతిక్ రోషన్ స్ప్రింగ్‌లా కదులుతూ చేసిన అద్భుతమైన డ్యాన్స్‌తో ‘ధూమ్ అగైన్’ అంటూ టైటిల్స్ పడుతుండగా పాట! దాన్ని మించి నైరోబీ ఎడారిలో రైలులో ప్రయాణిస్తున్న బ్రిటిష్ రాజ కుటుంబీకుల వద్ద నుంచి వారి కిరీటాన్ని అత్యంత లాఘవంగా ఎత్తుకెళ్లే ఎపిసోడ్‌తో హీరో హృతిక్ రీ ఇంట్రడక్షన్! ఈ రెండూ ప్రేక్షకుణ్ని సినిమాలోకి లాక్కెళ్లిపోతాయి. తెరకు కళ్లు అప్పగించేలా చేస్తాయి. ఆ తర్వాత సినిమా ముగిసే వరకూ ఆ ఆసక్తి కొనసాగుతుంది. సన్నివేశాన్ని బట్టి హృతిక్ వేసే మారువేషాలు చాలా ఆకట్టుకుంటాయి. జెంటిల్‌మేన్ చిత్రంలో అర్జున్ పాత్ర చేసే దొంగతనాల మాదిరిగా ఈ చిత్రంలోనూ దొంగతనాలు తీర్చిదిద్దినట్టు ఉంటాయి. మొదటి భాగంలో కథకి, సెంటిమెంట్‌కి ఈ చిత్రంలో ప్లేస్ లేదు కానీ... సెకెండాఫ్‌లో హృతిక్, ఐశ్వర్య పాత్రల మధ్య కాస్త సెంటిమెంటును టచ్ చేశారు. ఈ సినిమా కథ చెప్పుకోవడానికి పెద్దగా ఉండదు. చూడాల్సిందే. అయినా మూడు ముక్కల్లో చెప్పాలంటే ఇది ఓ దొంగ కథ. అతన్ని పట్టుకోవ డానికి ప్రయత్నించే పోలీసుల కథ. పోలీసుల తరఫున దొంగ దగ్గర చేరి, అతని ప్రేమలో పడి వచ్చిన పని నెరవేర్చలేకపోయిన ఓ అమ్మాయి కథ. సెకెండాఫ్‌లో బిపాసా బసు మంచి ఆకర్షణ. మొదటి భాగంలో నటించిన రిమీసేన్ కూడా ఇందులో అభిషేక్ భార్యగానే కంటిన్యూ అయ్యింది. రాజేష్ రోషన్ నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రాలు కాకుండా... హృతిక్‌తో బయటి నిర్మాతలు, దర్శకులు తీసిన చిత్రాల్లో పెద్ద హిట్... ధూమ్ 2 ఒక్కటే. ఈ చిత్రంలో కథ కన్నా స్క్రీన్‌ప్లే బలం ఎక్కువ. విజయకృష్ణ ఆచార్య ధూమ్కి, ధూమ్ 2కి రచయిత. ‘ధూమ్ 3’కి రచనతో పాటు దర్శకత్వం కూడా చేశాడాయన. హాలీవుడ్ సినిమాల తరహా హైటెక్ దొంగతనాల కథ ఇది. దాన్ని స్కేల్లో నిర్మించే సాహసం చేసిన ఘనత ఆచార్యదే. బ్రెజిల్లో షూటింగ్ జరుపుకున్న తొలి హిందీ చిత్రం ఇది. పెపె జీన్స్, కోకో కోలా సంస్థలు బ్రాండ్ అంబాసిడర్లుగా చిత్రాన్ని ప్రమోట్ చేశాయి. 1800 ప్రింట్లతో ప్రపంచ వ్యాప్తంగా విడుదలై రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలోని బైక్ రేసులు కుర్రకారును అమితంగా ఆకర్షించేలా ఉన్నాయని, వాటిని తొలగించడం మంచిదని ముంబై కమిషనర్ హై కోర్టులో పిటిషన్ పెట్టారంటే... ఈ చిత్రం యువతనెలా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ఆదిత్య చోప్రా నిర్మించే అన్ని చిత్రాల్లోనూ ఒక పాత్రలో తప్పనిసరిగా కనిపించే అతని తమ్ముడు ఉదయ్‌చోప్రా ఇందులోనూ నటించాడు. అభిషేక్ బచ్చన్‌కి అసిస్టెంట్‌గా కనిపించి నవ్వించాడు. బిపాసా ద్విపాత్రాభినయం ఓ మంచి ట్విస్టు ఈ చిత్రంలో. హృతిక్, ఐశ్వర్యలిద్దరూ చాలా బరువు తగ్గారట ఆదిత్య చోప్రా సూచనల మేరకు. పాత్రకు తగ్గ షేప్, బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ లేకపోతే పాత్రధారుల్ని ఆ పాత్రలో పెట్టనని ఆయన ఖరాఖండిగా చెబుతుంటారు. నిర్మాత కథ ఇవ్వడం, మేకింగ్‌లో తన టీమ్‌కి కావలసిన స్వేచ్ఛనిస్తూనే... చిత్రం అనుకున్న స్థాయిలో రావడానికి అహర్నిశలూ శ్రమించడం తెలుగు పరిశ్రమలో కూడా ఉంది. ముళ్లపూడి వెంకట రమణగారు నిర్మాత, రచయిత. ఎమ్మెస్ రాజు కథకుడు, నిర్మాత (దర్శకుడు కాకముందు). శ్యామ్‌ప్రసాద్ రెడ్డి కథకుడు, నిర్మాత. ఆయన తండ్రి ఎమ్మెస్ రెడ్డిగారు అఫీషియల్‌గా స్క్రీన్ మీద పేరు వేసుకోకపోయినా ఆయన కూడా నిర్మాత, రచయిత. ఇంకా రామా నాయుడుగారు, అశ్వినీదత్, అల్లు అరవింద్, నాగబాబు, సురేష్‌బాబు, స్రవంతి రవికిశోర్, బూరుగుపల్లి శివరామ కృష్ణ, దిల్‌రాజు... ఇలా నాకు తెలిసిన కొంతమంది నిర్మాతల చిత్రాల్లోనే టీమ్ వర్క్ కనిపిస్తోంది తప్ప మిగిలిన చిత్రాల్లో కనిపంచట్లేదు. టీమ్ వర్క్ లేని చిత్రాలు ఆడవచ్చు. కానీ ఆడినా ఆడకపోయినా ఆ సినిమాలు ఆ నిర్మాతలను క్యాషియర్లుగానే చూస్తాయి. లేదా క్యాష్ ఈయరు గానే నిరూపిస్తాయి. వేరే వాళ్ల మెదడు మీద బెట్టింగ్ కాయడం పొగరు. అదే తన డబ్బుతో పెట్టుబడి పెట్టి, కొద్దిమందితో కలిసి కష్టపడి చేసి, ఆ ప్రొడక్టుని మార్కెట్లో పెడితే... దానికి దాదాపు ఫెయిల్యూర్ శాతం చాలా తక్కువ. అయినా మన నిర్మాతలు ఆ కష్టాన్ని ఇష్టపడరెందుకనో! ఆదిత్య చోప్రా విజయవంతమైన దర్శకుడే కాదు... అంతకంటే విజయవంతమైన నిర్మాత అవ్వడానికి కారణం, మన తెలుగు నిర్మాతల బాట పట్టడమే అని నా అభిప్రాయం. అందుకు ఒక సాక్ష్యం.. ధూమ్ 2. ఇంతకుముందు మీకలా అనిపించకపోతే, ఓసారి ఆ సినిమాని మళ్లీ చూడండి. నాతో ఏకీభవించి తీరతారు! - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
విలువలకు, వంచనకు మధ్య ఫైట్
దేడ్ కహానీ - కార్పొరేట్ * మంచి సినిమాకు ఉదాహరణ. * నిజాలను కళ్లకు కట్టింది. * పాఠ్యాంశంగా పుస్తకాలకెక్కింది. రెండు కార్పొరేటు సంస్థల అధిపతుల మధ్య ఫైటు, అది ముగిసిపోవడానికి వాళ్లు మాట్లాడుకున్న రేటు, ఆ రేటుకి వాళ్లు వెతికిన ఉద్యోగిని నిషీ అనే గోటు (మేక), ఆ గోటును వేసిన వేటు... మంచి సినిమా గురించి రాయరా అంటే మటన్ బిర్యానీ రెసిపీ మొదలు పెట్టాడేంటి అనుకుంటున్నారా! అదేం కాదు. ఓ మంచి సినిమా సారాంశాన్నే ఇలా క్లుప్తంగా చెప్పాను. 2006లో విడుదలైన ఆ మంచి సినిమా... మధుర్ భండార్కర్ తీసిన ‘కార్పొరేట్’. థియేటర్లలో సినిమాలు ఎప్పుడూ ఉంటాయి. వాటిలో కొన్ని అభిరుచి గల ప్రేక్షకుల మనసుల్లో ఉండిపోతాయి. మరికొన్ని విమర్శకులు, సమీక్షకుల ఆర్టికల్స్‌లో, వాళ్ల మేధస్సుల్లో మమేకమై ఉంటాయి. కానీ ఇవన్నీ దాటి ‘కార్పొరేట్’ అనే సినిమా మాత్రం అహ్మదాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్లో పాఠ్యాంశంగా మారింది. సినిమాలు చూసి చదువులు పాడు చేసుకోకండ్రా అని పెద్దవాళ్లతో తిట్లు తిన్న ప్రతి సినీ అభిమానీ... ఓ సినిమా కూడా చదువైంది అని గర్వంగా చెప్పుకోవడానికి అవకాశాన్నిచ్చిన సినిమా ‘కార్పొరేట్’. అది తీసిన మధుర్ భండార్కర్‌కి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఈ వ్యాసం మొదలు పెట్టలేను. భారతదేశంలోని కొన్ని పుణ్య నదులు భౌతిక కాలుష్యానికి పరాకాష్టగా నిలుస్తున్నాయి. అయినా వాటిలో స్నాన మాచరించి, వాటిలోని నీళ్లు తాగుతున్న తరతరాల భారతీయుల రోగ నిరోధక శక్తిని నమ్మి... ఏ బ్యాక్టీరియా కలిసిన డ్రింకైనా భారతీయులు తాగేయగలరు, తాగి అరాయించుకోనూగలరు అనుకుంది ఓ విదేశీ కూల్‌డ్రింక్ కంపెనీ. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమా ణాలను అనుసరించకుండా, పెస్టిసైడ్స్‌ని ముప్ఫై శాతం ఎక్కువ మోతాదులో కలిపి భారతీయ మార్కెట్లో అమ్మేసింది. 2003లో బయట పడేవరకూ ఆ నిజం మనకు తెలీదు. మనకు తెలీని మరో విషయం ఏమిటంటే... మన భారతీయులం అవినీతిని, అన్యాయాన్ని, పాపాన్ని, లోపాన్ని, పాలకుల నిర్లక్ష్యాన్ని, నిరుద్యోగాన్ని, ప్రాణాలకి విలువ లేకుండా తీసేయడాన్ని... ఇంకా ఇలాంటి ఎన్నో అవలక్షణాలని నరనరానా జీర్ణించేసుకుని పెరుగుతున్నాం కాబట్టి, ఈ సాంఘిక రోగాలేవీ మనల్ని ఏమీ చేయ లేవు. మనకి వీటి నిరోధక శక్తి కూడా ఎక్కువే. అందుకే వీటిని సహిస్తాం తప్ప నిరోధించం. అందుకే కూల్‌డ్రింక్‌లో పెస్టిసైడ్ కలిపారన్న వార్త కేసుగా మారిన ప్పుడు నాలుగు రోజులు మాట్లాడుకుని ఊరుకున్నాం. నెల తర్వాత మళ్లీ అవే కూల్డ్రింకులు మామూలుగా తాగేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు వాటి ప్రమాణా లేంటో మనకి తెలీదు. సడెన్‌గా వాట్సాప్‌లో ఓ మెసేజ్ వస్తుంది... కుర్ కురేలో ప్లాస్టిక్ ఉందని, మాజా ఫ్యాక్టరీలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడైన ఓ వర్కర్ తన రక్తాన్ని డ్రింకులో కలిపేశాడని! ఆ కాసేపు గుర్తుంచుకుంటాం. ఇంకో మెసేజ్ రాగానే మర్చిపోతాం. మనకి వ్యవస్థ మీద కన్నా మన నిరోధక శక్తి మీద నమ్మకం ఎక్కువ. ఈ సామాజిక బలహీనతల్ని బలంగా మార్చుకుని, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాల్ని విస్తరించుకున్న ఇద్దరు బడా వ్యాపారవేత్తల క థే... ‘కార్పొరేట్’. ఇద్దరు బడా వ్యాపారవేత్తలు ఒకరి మీద ఒకరు సాగించుకునే ప్రచ్ఛన్న యుద్ధంలో వారి వెంట ఉన్న పనివాళ్లు నీతిగా, నిజాయతీగా, కంపెనీ బాగుంటేనే మనం బాగుంటాం అని నమ్మి పని చేస్తుం టారు. ఎదుటి కంపెనీతో వారికి వైరం ఉన్నట్టు ద్వేషిస్తారు. చివరికి ఆ వ్యాపారా ధిపతులిద్దరూ రాజకీయ నాయకుల చొరవతో దేశ సంక్షేమం కోసం గొడవలు ఆపేసి ఒకటైపోతే... పనివాళ్లు బలైపో తారు. చదరంగంలో తెల్లరాజు, నల్లరాజు ఒకటైపోతే... వారి కోసం అప్పటివరకూ పోరాటం చేసిన మంత్రులు, సేనానులు, గుర్రాలు, ఏనుగులు, భటుల పరిస్థితిని కళ్లకు కట్టినట్టు రచించారు, చిత్రీకరించారు మధుర్ ‘కార్పొరేట్’ చిత్రంలో. అజిత్ మోంగా, మనోజ్ త్యాగి అనే ఇద్దరు యువ రచయితలతో, కొత్తగా పరిశ్రమలోకి వస్తోన్న వాళ్లతో కూర్చుని మధుర్ ఈ చిత్ర స్క్రిప్టును తయారు చేయడం విశేషం. రామ్‌గోపాల్ వర్మ దర్శకుడు కాకముందు కొన్నాళ్లు ఓ వీడియో షాప్ నడిపారు. అలాగే మధుర్ ఓ వీడియో షాపులో డెలివరీ బాయ్‌గా పని చేశారు. తర్వాత కొన్నాళ్లకి సినిమా పరిశ్రమలో ప్రవేశించి, చిన్నా చితకా సినిమాలకి అసిస్టెంట్ డెరైక్టర్‌గా పని చేశారు. అక్కడ వచ్చే వెయ్యి రూపాయల జీతం సరిపోక, మస్కట్‌లో ఉంటోన్న వాళ్ల అక్క దగ్గరకెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. అదీ వర్కవుటవ్వక మళ్లీ ముంబై వచ్చి వర్మ దగ్గర అసిస్టెంట్‌గా చేరారు. ‘రంగీలా’కి సహాయ దర్శకుడిగా పని చేసి, మెల్లగా దర్శకుడిగా మారారు. మోడ్రన్ మిలీనియమ్‌లో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కాని, సమాజంలో స్త్రీ పాత్ర ఎలా ఉందో కరెక్ట్‌గా, కనెక్టింగ్‌గా గాని చెప్పాలంటే... అది మధుర్కే సాధ్యం. ఫ్యాషన్, పేజ్ 3, కార్పొరేట్, చాందినీ బార్... ఇలా ఆయన తీసిన చిత్రాలన్నీ ఆ కోవకే చెందుతాయి. వర్మ దగ్గర పని చేసిన వందల మంది అసిస్టెంట్ డెరైక్టర్స్ ఆయన టేకింగ్ స్టయిల్ని అనుకరిస్తారు. కృష్ణవంశీ, మధుర్ భండార్కర్, అనురాగ్ కశ్యప్... ఇలా కొద్దిమంది మాత్రమే సమస్యని రాము ఎంత ఇన్టెన్సిటీతో చూపిస్తారో, భావోద్వేగాల్ని పాత్రల్లోనూ ప్రేక్షకుల్లోనూ ఒకే మోతాదులో ఎలా పండించాలో అవగతం చేసుకున్నారు. దానికి వాళ్లు తమ క్రియేటివిటీని, సొంత బాణీని జోడిస్తారు. అందుకే మంచి దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు. ‘కార్పొరేట్’కి పాటలు అనవసరం. పాటలకు పెద్దగా అవకాశం లేని కథ, కథనం అవ్వడం వల్ల ఆడియో అంత అప్పీలింగ్‌గా ఉండదు. అయితే పాత్రల తీరుతెన్నులు మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఎస్.ఐ..ఇ. కార్పొరేట్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ నిషిగంధా దాస్ గుప్తాగా బిపాసా నటన అమోఘం. కార్పొరేట్ రాజకీయాలకు బలైపోయే నిజాయతీ పరురాలైన ఉద్యోగినిగా గుండెల్ని పిండుతుందామె. ఇతర పాత్రల్లో రాజ్‌బబ్బర్, రజత్ కపూర్, కేకే మీనన్‌ల నటన కూడా శిఖరాగ్ర స్థాయిలో ఉంటుంది. కార్పొరేట్ అట్మాస్పియర్ని, స్థాయికి తగినట్టు పాత్రల ప్రవర్తనని, బాడీ లాంగ్వేజీని చూపించాడు దర్శకుడు. మాటలు ఎక్కడ రాయకూడదో అక్కడ రాయలేదు. అది బెస్ట్ పార్ట్ ఈ చిత్రంలో. మనకి అర్థం కాని కార్పొరేట్ కుట్రల్ని, జీవనశైలిని అతి సామాన్యులైన పాత్రల ద్వారా బ్రహ్మాండంగా చెప్పిం చారు మధుర్. బిపాసా ఆఫీసులో ఇద్దరు ప్యూన్లు, గులాబ్రావ్ అనే మంత్రి దగ్గర ఉండే గన్‌మెన్ ద్వారా వాళ్ల మాటల్లోనే కార్పొరేట్ సినిమా కథ, ఆత్మ, అర్థం... అన్నీ అందేస్తాయి ఆర్డినరీ ప్రేక్షకుడికి. ఓ సీన్లో ఒక ప్యూను... ‘ప్యూన్ అండ్ బాస్ మధ్య చాలా తేడా ఉంటుంది’ అంటాడు. రెండో ప్యూను ‘ఏంటా తేడా’ అని అడుగుతాడు. అప్పుడతను... ‘నైన్ టు సిక్స్ ఆఫీస్ టైమ్ అయితే, నైన్ టు ఫోర్ పని చేసి వెళ్లిపోయేవాడు ప్యూన్. ఫోర్ నుంచి పని మొదలుపెట్టేవాడు బాస్’ అంటాడు. అలాగే మరో సందర్భంలో... ‘కంపెనీ డబ్బు మీద సింగపూర్లు, మలేసియాలు తిరగడమే కార్పొరేట్ల జీవితం’ అని ఒక ప్యూన్ కామెంట్ చేస్తాడు. అలాగే... ‘కార్పొరేట్ కంపెనీ అంటే ఒక్క ముక్కలో చెప్తాను. ఎక్కడైతే ఒక్కడు చేయగలిగిన పనికి ఒక టేబుల్ మీద పదిమంది కూర్చుని డిస్కస్ చేసి, చివరికి ఆ పనిని చెడగొడతారో అదే కార్పొరేట్ ఆఫీస్’ అంటూ తేల్చేస్తాడు. ఇంకోసారి... ‘ఈ బాసుగారు ఆఫీసులో ఆర్నెల్లకోసారి సెక్రెటరీని మారుస్తారు’ అంటాడో ప్యూన్. ఎందుకని అడుగుతాడు రెండో ప్యూన్. ‘ఇండియాలో ఆర్నెల్లకోసారి భార్యని మార్చే అవకాశం లేదుగా, అందుకు’ అంటాడా మొదటి ప్యూన్. మంత్రిగారి గన్‌మెన్ కూడా ఇలాంటి నిజాల్ని అలవోకగా చెబుతుంటారు. ఒక గన్‌మేన్... ‘మంత్రిగారు ఆ గదిలోకి వెళ్లారు. ప్రముఖ నటి ఈ గదిలోకి వెళ్లారు. మరి నువ్వేంటి వాళ్లిద్దరి మధ్య సెట్టింగ్ అన్నావ్’ అని అడుగుతాడు. అప్పుడు రెండో గన్‌మేన్... ‘ఒరేయ్ బుద్ధూ... ఇలాంటి సెట్టింగుల కోసం స్టార్ హోటల్స్‌లో గదికి గదికి మధ్య తలుపులు ఉంటాయ్, పబ్లిక్‌కి తెలియకుండా’ అంటూ రహస్యాన్ని బైట పెడతాడు. ఇవి కొన్నే. ఇలాంటి డైలాగులు అడుగడుగునా ఉంటాయీ సినిమాలో. ఉమనైజింగ్, మూఢ భక్తి, స్వామీజీలను గుడ్డిగా నమ్మడం, రాజకీయ నాయకుల జోక్యం, లంచాలు, టై అప్స్, షేర్స్, నైతికతకి అనైతికతకి మధ్య సంఘర్షణ, వ్యక్తిగత జీవితాల్లో ఒంటరితనం, ప్రేమానురాగాలు, నిత్యం గెలుపు ఓటముల మధ్య ఊగిసలాట... ఇలా డబ్బు, అధికారం చుట్టూ ఉండే అన్ని ఎలిమెంట్స్‌నీ కళ్లకి కట్టినట్టు చూపించేలా కథ రాసుకున్నారు మధుర్. ఈ ఆర్టికల్ కోసం సూపర్ హిట్ సినిమాలను చూస్తుంటే నాకో సూత్రం అర్థమైంది. కొత్తగా కథలు రాసుకునేవాళ్లకి పనికొస్తుందది. ముఖ్యంగా ‘కార్పొరేట్’ హిట్ కావడానికి ఆ సూత్రం ఒక ముఖ్య కారణం కాబట్టి చెప్పే తీరాలి. ఉత్థానంలో మొదలైన కథ పతనంతో ముగుస్తుంది. పతనంతో మొదలైన కథ ఉత్థానంతో సుఖాంతమవుతుంది. ఉత్థానం నుంచి ఉత్థానం, పతనం నుంచి పతనం డ్రామాని క్రియేట్ చెయ్యవు. ఫ్లాట్‌గా ఉండి సినిమాలు ఫెయిలవుతాయి. కావాలంటే ఏ సూపర్‌హిట్ సినిమా అయినా చూడండి... ఇదెంత నిజమో మీకే అర్థమవుతుంది. - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
యెద యెదలో రగిలిన స్ఫూర్తి
దేడ్ కహానీ - రంగ్ దే బసంతీ ‘‘మరగకపోతే రక్తం కాదది, నీటితో సమానం. దేశానికి పనికిరాకపోతే యువత కాదది, నిర్వీర్యం’’ అని అర్థం వచ్చేలా టైటిల్ పడింది. చాలా అర్థవంత మైన సినిమా చూడబోతున్నానని అర్థం అయ్యింది. గంటా ఇరవై ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకెన్ల దగ్గర వచ్చే ఒక సన్నివేశం - అనూహ్యమైనది. అది రాసిన రచయితలకి, తీసిన దర్శకుడికి, అభిమాని కానివాడు ప్రేక్షకుడే కాడు. భారత స్వాతంత్య్ర సమరయోధుల్ని చంపే బాధ్యతని నిర్వర్తిస్తున్న బ్రిటిషు పోలీసు అధికారి చర్చ్‌కి వెళ్లి జీసస్ దగ్గర ఏడవడం, తను చంపుతున్న సమర యోధులు చిరునవ్వుతో దేశం కోసం ప్రాణాలని అర్పిస్తుంటే, వారికి అతను అభిమానిగా మారడం... ఒక పక్క పాలకుల ఆజ్ఞ, మరోపక్క మానవ హృదయం - ఈ సంఘర్షణని ఇంత అందంగా చూపించిన సినిమా, ఈ నేపథ్యం ఉన్న కథల్లో ఎక్కడా లేదు. స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో తీసిన ప్రతి సినిమా దేశభక్తిని హీరోని చేసి పాలకుల్ని విలన్లని చేస్తుంది. అది సాధారణ కాన్ఫ్లిక్ట్. కానీ దేశభక్తికి విధి నిర్వహణకి సమానంగా అంతః సంఘ ర్షణని చూపించడం అసాధారణ కాన్ఫ్లిక్ట్. ఇప్పటివరకూ - స్వాతంత్య్ర పోరాట యోధుల కథలు పూర్తిగా పీరియాడికల్ సినిమాలుగానూ, ఈనాటి యువతరం కథలు పూర్తిగా మోడరన్గానూ అంటే తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అన్నట్టు తీస్తూ వచ్చారు. కానీ మొదటి సారి ఆనాటి యువ దేశభక్తులైన హీరోల కథని, ఈనాటి అల్లరి చిల్లరి యువ హీరోల కథని కలిపి ఒకే కథగా అల్లుకో వడం, అందుకు సూత్రధారిగా ఒక బ్రిటిష్ అమ్మాయి పాత్రనే సృష్టించడం... నిజంగా అద్భుతమైన ఆలోచన. ఆ ఆలోచనకి ఫలితమే... ‘రంగ్ దే బసంతి’. దాన్ని నిర్మించి, దర్శకత్వం వహించిన వ్యక్తి రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా. హీరోగా నటించింది... తన పాత్ర చుట్టూ కథ, కథనాలు పరిభ్రమించాలనుకోకుండా, మంచి కథ, కథనాలతో ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉండాలనుకునే ఆమిర్‌ఖాన్. నాకు తెలిసి... ఇలా ఆలోచించి సినిమాలు ఓకే చేసే హీరో ఇండియాలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఆయన ఒక్కరే. ఇలాంటి కథలు చేయడానికి అంగీకరించే పెద్ద హీరోల్ని అభినందించి తీరాలి. ఈ దశాబ్దన్నరలో బాలీవుడ్లో మూసధోరణి పోయి ప్రేక్షకులు ఆదరించేలా మంచి కథలు వస్తున్నాయి. ఈ విషయం ఒక్కో సినిమా వచ్చి వెళ్తున్నప్పటికంటే, ఈ వ్యాసం రాయడం కోసం వరసగా ఆ సినిమాలు మళ్లీ చూస్తున్నప్పుడు బాగా తెలుస్తోంది నాకు. ఇక ‘రంగ్ దే బసంతి’ విషయానికి వద్దాం. న్యూఢిల్లీలో నివాసముంటున్న పంజాబీ కుటుంబంలో పుట్టిన రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా యురేకా ఫోర్బ్స్ కంపెనీలో వాక్యూమ్ క్లీనర్లు అమ్మేవాడు. తర్వాత ఒక అడ్వర్టయిజింగ్ కంపెనీని పెట్టి కోక్, పెప్సీ, టయోటా, బీపీఎల్ కంపెనీలకి యాడ్స్ తీశాడు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్‌తో ‘అభీ బేబీ’ అనే మ్యూజిక్ వీడియో తీశాడు. 2001లో అమితాబ్ ప్రధాన పాత్రలో, మనోజ్ బాజ్‌పాయ్ సహనటుడిగా ‘అక్స్’ అనే సినిమా తీశాడు. అక్స్ అంటే రిఫ్లెక్షన్. ఈ దర్శకుడు తన ఆలోచనలని తెరమీదకి సరిగా రిఫ్లెక్ట్ చేయలేడు అనిపించింది ‘అక్స్’ చూసి. కానీ అమితాబ్‌కి అవార్డుల పంట పండింది. అర్థం కాకపోతే అవార్డులెక్కువొస్తాయేమో అనుకున్నాను నా ఇగోని శాటిస్ఫై చేసుకోడానికి. ఆ తర్వాత రంగ్ దే బసంతి, భాగ్ మిల్కా భాగ్ సినిమాలు తీశాడు మెహ్రా. అంతే... ఫిదా అయిపోయాను అతడి టాలెంట్‌కి. తను రిటైరైపోయినా ఈ రెండు సినిమాలూ చాలు తనని తరతరాలు గుర్తు పెట్టుకోడానికి. నేను, నాలాంటి చాలామంది దర్శకులు జీవితాంతం టైర్ అవుతూనే ఉండాలి తన సినిమాల స్థాయిని అందుకోడానికి. అందుకే ‘భాగ్ మిల్కా భాగ్’ చూసిన తర్వాత నా ఫేస్బుక్లో పెట్టాను- ‘‘సిగ్గేస్తోంది, దర్శకుడైన పదేళ్లలో ఇలాంటి సినిమా ఒక్కటి కూడా ఇంకా తీయనందుకు’’ అని. దటీజ్ ఓం ప్రకాష్ మెహ్రా. మళ్లీ రంగ్ దే బసంతి విషయానికి వద్దాం. భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో బ్రిటిష్ జనరల్‌గా ఇండియాలో పనిచేసిన మెకిన్లే మనవరాలు, స్యూ మెకిన్లే బ్రిటన్ టెలివిజన్ చానల్లో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తూ ఉంటుంది. తాతగారు రాసుకున్న డైరీ చదివితే అందులో భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి మహామహుల బలిదానాలు, వాటి పర్యవసానాలు ఉంటాయి. దానిని ఫిల్మ్ చేసి, ఆ కథల్ని ప్రజలకి చూపించాలని ఆశ పడుతుంది. చానల్ ఓనర్ని అడిగితే, అవి బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ రిజెక్ట్ చేస్తుంది. దాంతో ఎలాగైనా తన తాతగారి డైరీ కథల్ని సినిమాగా తెరకెక్కిస్తానని చాలెంజ్ చేసి ఢిల్లీ వస్తుంది స్యూ. అక్కడ తన ఫ్రెండ్ సోనియాని (సోహా అలీ ఖాన్) కలుస్తుంది. సోనియా ఢిల్లీ యూనివర్శిటీలో చదువుతుంటుంది. ఆమె స్నేహితులు డీజే, కరణ్, అస్లమ్‌ఖాన్, సుఖీరామ్... నలుగురూ పరమ అల్లరి మూక. జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయాలనుకునే ఆధునిక మెట్రో నగరాల యువతలాగ ఉంటారు. వీళ్ల స్నేహితుడు అజయ్‌సింగ్ రాథోడ్ ఆర్మీలో యుద్ధ విమానాల పైలట్. అతి కష్టమ్మీద తన భారత స్వాతంత్య్ర సమర వీరుల కథలో ముఖ్య పాత్రలకి ఈ అయిదుగురినీ ఒప్పిస్తుంది స్యూ. కానీ వాళ్లకి దేశమంటే లెక్కలేదు. నిన్న ఏం జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలం లేదు. రేపు ఎలా ఉండాలో అన్న ఆలోచన లేదు. ఈరోజు బావుంటే చాలు... అంతే. అలాంటి వారిని నెమ్మదిగా దేశభక్తుల, అమరవీరుల పాత్రలు, ఆలోచనలు కొంచెం కొంచెం ప్రభావితం చేస్తాయి. వాళ్లెందుకు ప్రాణ త్యాగం చేసి చిరునవ్వుతో దేశం కోసం చనిపోయారు అన్న ఆలోచన నుంచి... మనం దేశం కోసం ఎలా బతకాలి అని ఆలోచించే స్థాయికి చేరుకుంటారు. అవినీతితో ఆవిరైపోయిన నీతిని సమాజంలో నింపడానికి కంకణం కట్టుకుంటారు. సరిగ్గా అదే సమయంలో వాళ్ల స్నేహితుడు అజయ్ మిగ్-21 యుద్ధ విమానం నడుపుతూ మరణించడం వాళ్లని కుంగదీస్తుంది. గత పదిహేను సంవత్సరాలలో 206 మిగ్ యుద్ధ విమానాలు కూలిపోయాయి, 78 మంది ఆర్మీ పైలట్లు అసువులు బాశారు, 1964 నుంచి మన దేశం వాడుతున్న మిగ్ విమానాల పనిముట్ల దిగుమతిలో జరుగుతున్న స్కామ్... ఈ విమానాలు నాసిరకంగా తయారై మన సైనికుల ప్రాణాలు పోవడానికి కారణం అని తెలుసుకున్న ఈ నలుగులూ తమ స్నేహితుడి మృతికి కారణమైన రక్షణ మంత్రిని చంపేస్తారు. తీవ్ర వాదులుగా ముద్రపడతారు. చివరికి ఆకాశవాణిలో నిజాన్ని నేరుగా ప్రజలకి వివరిస్తారు. అయినా పోలీసుల చేతిలో హతమౌతారు. పరాయివాడి పాలన కోసం అసువులు బాసిన వీరులలాగే చిరునవ్వులు చిందిస్తూ, వారి పాత్రలు తమలో నింపిన స్ఫూర్తిని మొత్తం యువతరానికి రేడియో ద్వారా పంచుతూ, స్వ పరిపాలనలో అవినీతి రాజకీయ నాయకుల రాక్షస ఘాతానికి బలై పోతారు. ఇది కథా? ఒక సినిమా కథా? కాదు... జీవితం. ఇది వాస్తవం. వ్యవస్థలో చెడుని మనం కూకటివేళ్లతో సహా పెకలించి మార్పును తేలేం. కానీ మనం మారడం ద్వారా వ్యవస్థలో మార్పు దానంతట అదే వస్తుంది. ఇవాళ కాకపోయినా రేపు. రేపు కాకపోతే ఎల్లుండి. మారాలన్న ఆలోచన మనకి ఉండాలి. అంతే. బాధ్యతారాహిత్యంగా ఉన్న యువతకి దిశానిర్దేశం చేసేవాడు వట్టి సినిమా దర్శకుడు మాత్రమే కాడు. సమాజానికి దార్శనికుడు కూడా. రాజ్‌కుమార్ హిరానీ తర్వాత ఆ కోవలోకి వచ్చే రెండో వ్యక్తి రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా అని కచ్చితంగా చెప్పొచ్చు. అతుల్ కులకర్ణి, సిద్ధార్థ, అతిథి పాత్రలో మాధవన్ చాలా బాగా నటించి మెప్పించారు. ఎ.ఆర్.రెహమాన్ పాటలు అత్యద్భుతం. నిజానికి ఆస్కార్‌కి రెండు ట్రాక్స్ నామినేట్ అయ్యాయి కూడా. ఇవన్నీ ఏమో కానీ, నేను మాత్రం వీలు చూసుకుని రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దగ్గరకెళ్లాలి అని నిర్ణయించుకున్నా. సినిమాలు ఎలా తీయాలో నేర్చుకోవడానికి కాదు. అది నాకూ కాస్తో కూస్తో వచ్చు. అయినా వెళ్లాలను కుంటున్నాను. దేనికో తెలుసా? ఒక సినిమాని ఎలా ఊహించాలో, మనకొచ్చే కొన్ని వందల థాట్స్‌లో ఏ థాట్‌ని సినిమాగా మలచాలో, ఒక దర్శకుడు ఒక వస్తువులో మంచి కథ ఉందని ఎలా గ్రహి స్తాడో, అలాంటి కథని ఎలా ఎంచు కుంటాడో నేర్చు కోవడానికి. వచ్చే వారం మరో మంచి సినిమాతో కలుద్దాం. - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
సర్కార్... మ్యాన్ ఆఫ్ పవర్!
దేడ్ కహానీ - సర్కార్ * ఇది వర్మ సినిమా. * ఇది అమితాబ్ సినిమా. * ఇద్దరి ఫ్యాన్స మెచ్చిన సినిమా. సెన్సార్ సర్టిఫికెట్ పడింది తెరమీద. సర్కార్, హిందీ, కలర్, సినిమా స్కోప్, 24 జూన్ 2005.. తర్వాత రెండు మూడు టైటిల్స్ పడ్డాయి కేసెరాసెరా, ఎమ్‌టీవీ ఇలా. అప్పుడొచ్చింది ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ కార్డు. ఏమనంటే, ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న, లెక్కలేనంత మంది దర్శకులలాగే నేను కూడా గాఢంగా, లోతుగా ప్రభావితుణ్నయ్యాను ‘గాడ్ ఫాదర్’ అనే సినిమా చూసి. ఆ సినిమాకి నేనిచ్చే నివాళి ‘సర్కార్’ - రామ్‌గోపాల్‌వర్మ.’’ మామూలుగా రామ్‌గోపాల్‌వర్మ అనే టైటిల్ కార్డుకే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అటువంటి రామ్గోపాల్వర్మే ఇలా ఓ కార్డు వేస్తే... గాడ్ ఫాదర్‌కి, సర్కార్‌కి, వర్మకి మళ్లీ మళ్లీ ఫ్యాన్స్ అయిపోతారు ఎవరైనా. ఇంతకీ ఎవరీ సర్కార్? వెన్ సిస్టమ్ ఫెయిల్స్. ఏ పవర్ విల్ రైజ్. ఆ పవరే సర్కార్. అంటే, సుభాష్ నగ్రే. ఆ పాత్ర పోషించింది భారతదేశం ప్రేమించి, పడి చచ్చిపోయే అమితాబ్ బచ్చన్. వర్మ అంటే... ‘గబ్బర్‌సింగ్’లో పవన్ కళ్యాణ్ పాత్రలాగ లెక్కలేనంత తిక్క ఉన్న వ్యక్తిగా ఈ జెనరేషన్ ట్విట్టర్ జనాలు భావించే ఓ వ్యక్తి. ఫ్లాష్‌బ్యాక్‌లో ‘బాషా’లో రజనీకాంత్ పాత్రలాగా మహా వ్యక్తి. తెలుగు సినిమా స్థాయిని, వ్యాపా రాన్ని మాత్రమే కాదు, సినిమా తీసే విధానాన్ని కూడా విపరీతంగా ప్రభావితం చేసిన మేధావి. మన నుంచి హిందీ సీమ కెగసి ‘రంగీలా’తో అక్కడ కూడా అగ్ర దర్శకుడిగా జెండా ఎగరేసిన ఘటికుడు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు తీయ డంలో సిద్ధహస్తుడు. తన శిష్యులందర్నీ దర్శకులుగా మార్చిన నాణ్యమైన నిర్మాత. అతను మనవాడవ్వడం మన అదృష్టం, ఆయన దురదృష్టం (ఈ కోవలోకి వచ్చే తెలుగువాళ్లని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు). ముందు తీసిన సినిమాలతో అందరూ ఇతని పనైపోయింది అనుకున్నప్పుడు తనని దర్శకుడిగా మార్చిన, ప్రభావితం చేసిన సినిమాతో మళ్లీ ప్రేరణ పొంది... తన స్టైల్‌ని, ఇమేజ్‌ని, మార్కెట్‌ని, మేధస్సుని అన్నిటినీ సవ్యంగా ట్రాక్‌మీద పెట్టినట్టు వర్మ సర్కార్ సినిమా తీశారు. దటీజ్ వర్మ... దటీజ్ సర్కార్! వర్మ తీసిన మొదటి సినిమా ‘శివ’లో భవానీ పాత్రని హీరోగా మార్చి, మణి రత్నం తీసిన ‘నాయకుడు’లో కమల్ హాసన్ కొడుకు పాత్రని చిన్న హీరోగా మార్చి, సహజంగా ఉంటుందని ఆ రెండు పాత్రలకీ నిజ జీవితంలో తండ్రీ కొడుకు లైన అమితాబ్‌ని, అభిషేక్‌ని ఊహించి, వాళ్లకనుగుణంగా స్క్రిప్ట్ రాసి, పకడ్బందీగా తీసినట్టు ఉంటుంది సర్కార్. అలాగే ముంబైలో ఎన్నో ఏళ్లుగా మరాఠీ ప్రజల కోసం సమాంతర ప్రభుత్వం నడుపుతున్న శివసేన అధిపతి బాల్‌థాకరే జీవితంలోని సంఘటనల నుంచి స్ఫూర్తి పొందినట్టూ ఉంటుంది. వీటన్నిటికీ గాడ్ ఫాదర్ స్క్రీన్‌ప్లే స్టైల్, మేకింగ్ స్టైల్, పాత్ర చిత్రణ, స్వరూప స్వభావాలని మిక్స్ చేసినట్టు అనిపిస్తుంది. మాఫియా బ్యాక్ డ్రాప్ కాకపోవడం వలన ఈ చిత్రం మన మధ్య జరుగుతున్న ఫీలింగునిస్తుంది. ఇలా చాలా కోణాల్లోంచి దర్శకుడు చేసిన కృషి వల్ల ఈ చిత్రాన్ని అమెరికన్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ లైబ్రరీలో భద్రపరిచారు. అది నిజంగా ఘనతే. ‘‘నాకు రైట్ అనిపించిందే నేను చేస్తాను. భగవంతుణ్ని ఎదిరించైనా, సమాజాన్ని ఎదిరించైనా, పోలీసుల్ని, చట్టాల్ని ఎదిరించైనా, మొత్తం సిస్టమ్‌ని ఎది రించైనా సరే’’... సమాంతర ప్రభుత్వం నడిపే వాడి ధైర్యం, యాటిట్యూడ్ అదే. ‘‘దగ్గర్లో ఉన్న లాభం చూసేముందు, దూరంగా వచ్చే నష్టాల్ని చూడు. పంచా యితీలు చేసేవాళ్లు ఆలోచించాల్సిందిదే’’.. ఇలాంటి మాటల సహాయంతో ‘సర్కార్’ పాత్రని అమితాబ్ చాలా సునాయాసంగా పోషించి మెప్పించేశారు. ‘‘అధికారం ఉన్నవాడు చేసే తప్ప యినా, రైటయిపోతుంది. నేను ఎవ్వర్నీ ఆలోచించొద్దు అనను. ఆలోచించకుండా పనిచెయ్యొద్దు అంటాను’’ - ‘‘సర్కార్ అనేది ఒక సిస్టమ్. అందులో జనం ఒక భాగం’’... ఇలాంటి పదునైన సంభా షణలు ఈ సినిమాలో కోకొల్లలు. బిగ్ బీ నటన సర్కార్ చిత్రానికి, వర్మ ఆలోచనలకి ప్రాణం పోసి నట్టుంటుంది. రౌడీయిజం, సోషల్ ప్రాబ్లెమ్స్ నేపథ్యం మాత్రమే. కథ, కథనం ఓ పెద్దమనిషి కుటుంబం, వారి మధ్య బంధాలు, స్పర్ధల చుట్టూ తిరు గుతూ ఉంటుంది. అందుకే ఈ చిత్రంలో ఒక ‘తడి’ ఉంటుంది. అది మనసుని తడు ముతుంది. ఇదో మంచి ఫార్ములా. అలాగే ప్రతీకారం అనేది కూడా ప్రేమలాగే తర తరాలుగా సినిమాల్లో మోస్ట్ పేయింగ్ ఎలిమెంట్. సర్కార్‌లో అదీ ఉంది. సహజ నటుడు, తెలుగువారు గర్విం చదగిన నటుడు కోట శ్రీనివాసరావుని చాలా ముఖ్యమైన పాత్రకి ఎంచుకున్నారు. నటుడు జీవాకి మరో ముఖ్యమైన పాత్ర నిచ్చారు. అయినా చిత్రానికి కావలసిన నేటివిటీని అణువంతైనా మిస్ కాకుండా చూసుకోవడం వర్మ తెలివికి నిదర్శనం. ఇక షాట్స్ గురించి చెప్పక్కర్లేదు. శివ, క్షణక్షణం, రంగీలా, సత్య తర్వాత రామ్‌గోపాల్‌వర్మ అద్భుతమైన షాట్ టేకింగ్ సర్కార్‌లో చూడగలం. సినిమాలో ప్రతి సీనూ ఒక సినిమాలా ఉండాలం టారు. అంటే టేకింగ్, మిడిల్, ఎండింగ్ పకడ్బందీగా అల్లుకోవడం అన్నమాట. అలా స్క్రీన్‌ప్లే సూత్రానికి కట్టుబడి రాసుకున్న స్క్రిప్టులా ఉంటుంది సర్కార్. ఇది కత్రినాకైఫ్‌కి రెండో సినిమా. నిషా కొఠారికి రెండో సినిమా. అభిషేక్‌కి ఉత్తమ సహాయనటుడిగా ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టిన సినిమా. బహుశా అమితాబ్ నటించలేదని ఏ అవార్డూ ఇచ్చి ఉండరు జ్యూరీ మెంబర్లు. ఆయన అందులో జీవిం చారు మరి. లేకపోతే 1990లోనే ‘అగ్ని పథ్’ చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న ఆయనకి, ‘సర్కార్’కి అవార్డు రాకపోవడం విచిత్రం. అలాగే హీరో షాహిద్ కపూర్ తల్లి, నటుడు, దర్శకుడు, నిర్మాత పంకజ్ కపూర్ భార్య సుప్రియా పాఠక్ నటన అనిర్వచ నీయంగా ఉంటుంది ‘సర్కార్’లో. కాజోల్ చెల్లెలు తనీషా, ఆమె భర్తగా కేకే... అంద రివీ చక్కగా అమరిన పాత్రలు. అసలు సిసలు కాస్టింగ్ డెరైక్టర్ వృత్తికి నిర్వచ నంగా ఉంటుంది ‘సర్కార్’ సినిమా పాత్ర ధారుల ఎంపిక. కొన్ని వేల సినిమాలకి ప్రయత్నించినా కుదరని విషయం అది. ఈ వ్యాసం రాయడం కోసం సాహితీ మిత్రులు సిరాశ్రీ ద్వారా రామ్‌గోపాల్ వర్మకి ఫోన్ చేశాను. నేను ఆశ్చర్యపోయే ఆసక్తికరమైన విషయం ఆయన మాటల ద్వారా తెలిసింది. రామూగారు సీనియర్ ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఒక స్నేహి తుడు ‘ద గాడ్ ఫాదర్’ అనే ఇంగ్లిషు నవల ఇచ్చి, అందులో 26వ పేజీలో ఉన్న రొమాంటిక్ సీన్ చదవమన్నాట్ట. ఈయన ఇంటి కొచ్చి సీన్‌ని చదివేశార్ట. ఆ తర్వాత సరదాగా కవర్‌పేజీ చదివితే, ఆయన ఎప్పుడూ వినని మాఫియా లాంటి పదాలు కనపడ్డాయి. తోచక పుస్తకం మొద ట్నుంచీ చది వారట. చదవడం పూర్తయిన వెంటనే మళ్లీ మొదలు పెట్టారట. అలా నాలుగైదుసార్లు ఆసాంతం చదివేశార్ట. ఆయన ఇమాజి నేషన్‌లో గాడ్ ఫాదర్ నవల గాడ్ ఫాదర్ సినిమా కన్నా ఎక్కువగా, గొప్పగా కన పడింది, స్థిరపడిపోయింది. ఆ ఇమాజి నేషనే ఆయన దర్శకుడవ్వాలని బలంగా నిర్ణయించుకునేలా చేసింది. ఫ్రెండ్ నవల ఇచ్చినప్పుడు తన ఉద్దేశం వేరు. తీసుకున్నపుడు రామూగారి ఉద్దేశం వేరు. కానీ, ఏ విషయం నుంచి ఏం పుడుతుందో అది ఎలా పరిణమిస్తుందో - ఎవ్వరికీ తెలీదు. పైవాడికి తప్ప. ఆ పైవాడినే గాడ్ అంటారు. ఆయనే మనందరికీ ఫాదర్ అవుతారు. ఆయన సర్కారే భూమ్మీద చెల్లుబాటవుతుంది. అంతే! - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
వెలుగు చాటు చీకటి
దేడ్ కహానీ - పేజ్ 3 జీవితపు పరుగుపందెంలో గమ్యం చేరాలనే తాపత్రయమే తప్ప పక్కన గాని, చుట్టూరా గాని జరుగుతున్న పరిణామాలు, మార్పులు ఏంటో ఎలా తెలుస్తుంది? * చూస్తే వెలుగే కనిపిస్తుంది. * కానీ దాని వెనుక అంతా చీకటే. * పేజ్ 3 చెప్పే వాస్తవాలేంటి? మనుషుల జనన, మరణాల మధ్య సమాజంలో మారుతున్న అంశాలెన్నో. జీవితపు పరుగుపందెంలో గమ్యం చేరాలనే తాపత్రయమే తప్ప పక్కన గాని, చుట్టూరా గాని జరుగుతున్న పరిణామాలు, మార్పులు ఏంటో ఎలా తెలుస్తుంది? కొంతమంది న్యూస్‌పేపర్ చదువుతారు. కొంతమంది నెట్లో అప్ టు డేట్ ఫాలో అవుతారు. ఇంకొంత మంది నాటకాలు, పుస్తకాల ద్వారా తెలుసుకుంటారు. ఆధునిక యుగంలో సమాజంలో వస్తున్న మార్పుల్ని కళ్లకి కట్టినట్టు చూపించే బలమైన సాధనం మాత్రం సినిమాలే. అవే మన న్యూస్‌పేపర్లు, మన పుస్తకాలు, మన ఇంటర్నెట్, అన్నీను. వాటిని బాగా చూపించే దర్శకులు దొరికితే ఆ సినిమాలు బాగా ఆడతాయి. లేకపోతే ఎలా వచ్చి, వెళ్లాయో తెలీకుండా వెళ్లిపోతాయి. సమాజాన్ని ప్రతిబింబించే సినిమా బాగా ఆడితే, ఎక్కువమంది ప్రేక్షకులు ఐడెంటిఫై అయ్యారు కాబట్టి, సమాజం అలా ఉందని అర్థం. లేదా ఎక్కువమంది అలా కోరుకోవడం వల్ల సమాజం అలా అవ్వబోతోందని అర్థం. అది సినిమాకి, సమాజానికి ఏళ్ల తరబడి అంతర్లీనంగా ఉన్న సంబంధం. వెండితెర మనం చదవక్కర్లేని న్యూస్ పేపరు. పెద్దగా చూసే టీవీ చానెల్. బ్రౌజ్ చెయ్యక్కర్లేని ఇంటర్నెట్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 2005లో ‘పేజ్ 3’ అని ఒక సినిమా రిలీజయ్యింది. అది ఇలాంటి సినిమానే. దాని దర్శకుడు మధుర్ భండార్కర్. సమకాలీన సమాజాన్ని ప్రతిబింబించే సినిమాలు మాత్రమే తీసే దర్శకుడు. చాందినీ బార్, పేజ్ 3, ట్రాఫిక్ సిగ్నల్, ఫ్యాషన్, హీరోయిన్ తదితర అద్భుత చిత్రాలు తీసిన వెండితెర న్యూస్ పేపర్/చానల్‌కి ఎడిటర్. 2005, జనవరి 21వ తేదీన విడుదలైన పేజ్ 3, కమర్షియల్‌గా సూపర్‌హిట్ సినిమాల కోవలోకి వచ్చేంత వసూళ్లు రాబట్టకపోయినా... ప్రేక్షకుల్ని మాత్రం వంద శాతం రీచ్ అయ్యింది. 2005 సంవత్సరానికి స్వర్ణకమలాన్ని గెల్చుకున్న జాతీయ ఉత్తమ చిత్రం ‘పేజ్ 3’. బెస్ట్ స్క్రీన్‌ప్లేకి, బెస్ట్ ఎడిటింగ్‌కి రెండు రజత కమలాలు గెల్చుకున్న చిత్రం పేజ్ 3. నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెల్చుకున్న చిత్రం కూడా. మాధవీశర్మ ముంబైకి బతుకు తెరువు కోసం వచ్చిన మధ్యతరగతి యువతి. దీపక్ సూరి అనే సంపాదకుడు తన పేపర్లో ఆమెకి జర్నలిస్ట్‌గా ఉద్యోగం ఇస్తాడు. ఆ పేపర్లో పేజ్ 3 సెలెబ్రిటీల న్యూస్ కవరేజ్ చేస్తుంది. సిటీలో ఉన్న గ్లామరస్ పీపుల్ తాలూకు నైట్ లైఫ్ కవర్ చేసి రాయడమే ఆమె జాబ్. మాధవి రూమ్మేట్ పెర్ల్ ఒక ఎయిర్‌హోస్టెస్. డబ్బున్న వ్యక్తినెవరినైనా చూసి పెళ్లి చేసుకుని సెటిలైపోవాలని కలలు కంటూ ఉంటుంది. గాయత్రి అనే మరో పేద యువతి హీరోయిన్ కావాలని కలలు కంటుంది. ఆమె కూడా మాధవి రూమ్మేట్గా చేరుతుంది. డబ్బు, స్టార్డమ్ రెండింటినీ కవర్ చేయాల్సిన జర్నలిస్ట్‌కి వాటికోసమే ఆరాటపడే రెండు పాత్రల్ని స్నేహితురాళ్లుగా తీసుకోవడం దర్శకుడిలోని గొప్పదనం. రోహిత్ అనే స్టార్ హీరో గాయత్రిని మోసం చేసి కడుపు చేయడం, ఆమెని అబార్షన్ చేయించుకోమని ఫోర్స్ చేయడంతో ఆమె ఆత్మహత్యకి ప్రయత్నించడం, ఆ ప్రయత్నంలో ఆమె కడుపులోని శిశువు కడుపులోనే చని పోవడం జరుగుతాయి. ఈ కథనాన్ని ప్రచురించి రోహిత్‌ని ఎండగడదామని ప్రయత్నించిన మాధవికి బాస్ నుంచి వ్యతిరేకత వస్తుంది. ఆ ఆర్టికల్స్‌ని చించేయడమే కాక, మాధవితో రోహిత్‌కి బలవంతంగా క్షమాపణలు కూడా చెప్పిస్తాడు బాస్. ఈలోగా పెర్ల్ ఒక ముసలి ధనవంతుడిని పెళ్లి చేసుకుని అమెరికా చెక్కేస్తుంది. మాధవి ప్రేమించిన స్నేహితుడు అభిజిత్ ‘గే’ అని తెలుస్తుంది. దాంతో చాలా బాధపడుతుంది. సెలెబ్రిటీ లైఫ్‌లో పైకి కనపడినంత సెలెబ్రేషన్ కాని, వైబ్రేషన్ కాని లోపల ఉండవని మాధవికి అర్థమౌతుంది. పేజ్ 3 నుంచి క్రైమ్ న్యూస్‌కి తన ఉద్యోగం మార్పించుకుంటుంది మాధవి. ఆ వృత్తిలో వినాయక్ అనే ఒక ఏసీపీ పరిచయమవుతాడు. ఆయన సహకారంతో చైల్డ్ ట్రాఫికింగ్ సమస్యని వెలుగులోకి తెచ్చి పిల్లల్ని మాఫియా నుంచి కాపాడుతుంది. గాయత్రి ఒక దర్శకుడి కోరిక తీర్చి, అతని తర్వాతి సినిమాలో హీరోయిన్గా అవకాశం సంపాదిస్తుంది. ఇటు మాధవి ఏమో క్రైమ్ న్యూస్ కూడా తన పత్రికలో వేయించలేకపోతుంది. దాంతో ఆమె ఉద్యోగం పోతుంది. ఒక జర్నలిస్ట్ కోణం లోంచి డబ్బు, పరపతి, తారాపథం వీటిని చూస్తే చీకటిగానూ, ఛండాలంగానూ మాత్రమే కనపడతాయి. కానీ వాటిని సాధించాలనే ఆశయం ఉన్న పాత్రల్ని, ఆ ప్రయత్నంలో వాటి కష్టాల్ని చూస్తే మానవీయ కోణంలో ఇవి మంచిగా కనపడతాయి. రెంటినీ బ్యాలెన్స్ చేశాడు దర్శకుడు - ఈ కథకి తను ఎంచుకున్న పాత్రలు, వాటి తీరుతెన్నుల ద్వారా. పోస్టర్ చూస్తే ఒక సాధారణమైన, యువతని ఆకర్షించడానికే తీసిన సినిమాలా కనిపిస్తుంది కానీ సినిమా చూస్తే మేధావి వంతమైన సినిమాలా కనిపిస్తుంది. ‘నైట్ లైఫ్’ అనే వెస్టర్న్ కల్చర్ భారతీయ సమాజం నలభై ఏళ్ల క్రితం నిద్ర పోతుండగా ప్రవేశించి వేళ్లూనుకుని, మర్రిచెట్టైపోయింది. ఇప్పుడు అన్ని ప్రధాన నగరాల్లోనూ డబ్బున్న వారి పిల్లలు, రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు, అందరూ ఈ నైట్ లైఫ్ అలవాటుదారులే. దాన్ని కథావస్తువుగా తీసుకోవడమే దర్శకుడి నైపుణ్యం. ప్రముఖ బెంగాలీ నటి, దర్శకురాలు అపర్ణాసేన్ కూతురు కొంకణాసేన్ శర్మ పేజ్ 3 చిత్ర కథానాయిక. ఈమె 2002లో నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్’ అనే బాలీవుడ్ ఆంగ్ల చిత్రం (తల్లి అపర్ణాసేన్ రచయిత్రి, దర్శకురాలు ఈ చిత్రానికి) కొంకణాసేన్కు జాతీయ ఉత్తమ నటి అవార్డు తెచ్చిపెట్టింది. పేజ్ 3తో పాటు అది కూడా చూసి తీరవలసిన చిత్రం. సహజమైన సినిమాలు ఇష్టపడే ప్రేక్షకుల కోసమే ఈ చిత్రాలు. వచ్చే వారం మరో మంచి సినిమాతో కలుద్దాం. -వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
లబ్‌కి డబ్కి మధ్య జీవితకాలపు కథ
దేడ్ కహానీ - కల్ హో న హో 1999, డిసెంబర్ 31... అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రపంచవ్యాప్తంగా వైటుకె వచ్చి కంప్యూటర్ వ్యవస్థలన్నీ కొట్టుకుపోతాయి. ఇంక 2000 నంచి టెక్నాలజీ ఉంటుందో, ఉండదో అన్నారు. కల్ హో న హో... ఉంది. ఇంకా బాగా పెరిగింది. 2012... ప్రళయం వచ్చి మొత్తం ప్రపంచమంతా కొట్టుకుపోతుంది అన్నారు. ఇంక మానవాళికి రేపన్నది ఉంటుందో, ఉండదో అన్నారు. కల్ హో న హో... ఉంది. ఇంకా బ్రహ్మాండంగా ఎదిగింది. 2003, నవంబర్ 28న షారుక్‌ఖాన్, ప్రీతిజింతా, సైఫ్ అలీఖాన్ లాంటి అగ్ర తారాగణంతో కరణ్ జోహార్ కథ, నిర్మాణంలో నిఖిల్ అద్వానీని దర్శకుడిగా పరిచయం చేస్తూ కల్ హో న హో... అన్నారు. ఆడింది. అద్భుతంగా ప్రజాదరణ పొందింది. లబ్... డబ్.. అనే గుండె చప్పుడులో లబ్‌కి డబ్కి మధ్య జీవితకాలపు కథ. ఇది ట్యాగ్‌లైన్‌కి తెలుగు అర్థం. ఎంత అద్భుతమైన ఆలోచన. ‘‘ఈ రోజు ఒక నవ్వు ఎక్కువ నవ్వు... ఈ రోజు ఒక ప్రార్థన ఎక్కువ చెయ్యి... ఈ రోజు ఒక కన్నీటి చుక్క ఎక్కువ త్రాగు... ఈ రోజు ఒక జీవితం ఎక్కువ జీవించు... ఈ రోజు ఒక కల ఎక్కువ కను... ఎవరికి తెలుసు... రేపుంటుందో, ఉండదో’’... కల్ హో న హో... ఈ చిత్రం అమన్ పాత్రధారి షారుక్‌ఖాన్, నైనా పాత్రధారి ప్రీతిజింతాతో అనే డైలాగ్... ఎంత అద్భుతమైన సంభాషణ. 1971లో వచ్చిన ‘ఆనంద్’ అనే హిందీ సినిమా రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్, సుమితా శాన్యాల్ ప్రధాన పాత్రధారులుగా, హృషికేశ్ ముఖర్జీ రచన, దర్శకత్వం. ఈ ‘ఆనంద్’ కథనే స్ఫూర్తిగా తీసుకుని, 2003లో పూర్తిగా అమెరికా నేపథ్యంలో ఎన్నారైల మధ్య కథగా, భారతీయ ఆధునిక కుటుంబాల భావోద్వేగాలు కలగలిపి తీసిన చిత్రంలా ఉంటుంది ‘కల్ హో న హో’. సాధారణంగా సినిమాలలో కొన్ని అంశాలు చాలా బావుంటాయి. కొన్ని సాధారణంగా ఉంటాయి. ప్రతి మూమెంట్‌ని మనం ఆస్వాదించే సినిమాలు కొన్నే ఉంటాయి. వాటిలో ‘కల్ హో న హో’ ఒకటి. పాటలు వినగానే సినిమా చూడాలనిపించింది. సంగీత దర్శక త్రయం శంకర్-ఇషాన్-లాయ్ మహత్యం అది. పోస్టర్ చూడగానే సినిమా చూడాలనిపించింది. కరణ్ జోహార్ ప్రతిభ అది. సినిమా చూడగానే మళ్లీ చూడాలనిపించింది. కొత్త దర్శకుడు నిఖిల్ అద్వానీ గొప్పదనం అది. అమన్ పాత్రలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ నటన అమోఘం. కనీసం నాలుగైదుసార్లు కన్నీళ్లు పెట్టిస్తాడు. కొద్దిక్షణాల్లో చనిపోతాడనగా కూడా చిరునవ్వు నవ్విస్తాడు. ఈ సినిమా కచ్చితంగా చూసి తీరవలసిందే. ఇందులో ప్రీతిజింతా పాత్రకి ముందు కరీనా కపూర్‌ని ఎంచుకున్నార్ట. పారితోషికం దగ్గర తేడా వచ్చి, ఆమె ఈ అవకాశాన్ని వదులుకుంది. అది ప్రీతిజింతాని వరించింది. ఆమె చాలా తెలివిగా ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకొంది. రోహిత్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటన చాలా సహజంగా, ఉన్నతంగా, అంతకంటే ఎక్కువ సరదాగా ఉంటుంది. నైనా జీవితంలో చికాకులతో కోల్పోయిన చిరునవ్వుని వెలిగిస్తాడు పక్కింట్లోకి కొత్తగా వచ్చిన అమన్. అతనితో ప్రేమలో పడుతుందామె. కానీ ఆమె స్నేహితుడు రోహిత్‌కి నైనా అంటే ప్రేమని తెలిసి, తనకు ఆల్రెడీ ప్రియ అనే అమ్మాయితో (సోనాలీ బింద్రే) పెళ్లయిపోయిందని చెప్తాడు. బాధగా వెళ్లిపోతుంది నైనా. అమన్ తల్లి అడుగుతుంది అమన్‌ని - ‘‘నువ్వు కూడా ప్రేమించావ్ కదరా నైనాని. అబద్ధం ఎందుకు చెప్పావ’’ని. ‘‘నిజం చెప్పాలా అమ్మా. నా గుండె ఏ క్షణాన్నైనా ఆగిపోవడానికి సిద్ధంగా ఉందని నిజం చెప్పాలా? నాకు తనంటే ఇష్టమున్నా, రేపు అనేది నా జీవితంలో ఉందో లేదో తెలీకుండా ప్రతిరోజూ గడుపుతున్నానని నిజం చెప్పాలా’’ అని ఆవేదనగా అడుగుతాడు. ఈ నిజం ప్రేక్షకుడికి తెలియడమే ఇంటర్వెల్. ఇంక ద్వితీయార్ధంలో నైనా, రోహిత్‌లని కలపడమనే ప్రహసనాన్ని వీలైనంత కామెడీ జొప్పించి మెప్పించారు రచయితలు, దర్శకుడు, నటీనటులు. చివరికి ప్రేక్షకుడికి తెలిసిన నిజాలన్నీ పాత్రలకి కూడా తెలియడం, బాధలు, ఆవేదనలు, అమన్ చనిపోవడం, నైనా, రోహిత్ ఒకటవ్వడం... ఇవన్నీను! ఎన్నారై మార్కెట్‌ని పెంచిన ‘కభీ కుషీ కభీ గమ్’ తర్వాత అదే ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌పైన కరణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రం ఎన్నారై మార్కెట్‌ని కొత్త పుంతలు తొక్కించింది. క్షణ భంగురమైన మానవ జీవితానికి రేపన్నది ఉంటుందో లేదో తెలీదు కానీ, మంచి భారతీయ చలన చిత్రాల జాబితాలో ‘కల్ హో న హో’ ఎప్పుడూ ఉంటుంది. వచ్చేవారం సినిమాలు తీసే ఆలోచనలని అన్నింటినీ కకావికలం చేసి ఇలా తీయాల్రా అని మెదళ్లకి రిపేర్లు చేసిన దర్శక శ్రేష్టుడు రాజ్‌కుమార్ హిరానీ ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’తో మళ్లీ కలుద్దాం. -వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
స్నేహం... ప్రేమ కలిస్తే!
దేడ్ కహానీ - దిల్ చాహ్తా హై ‘‘మనసు కోతి లాంటిది. యుక్త వయసులో ఏది పడితే అది కోరుకుంటుంది. బుద్ధి... బుద్ధిగా ఉండమని ఎంత చెప్పినా మనసు వినదు. ఎప్పుడో విధి ఒక హెడ్మాస్టారిలా ఏదన్నా ఒక సంఘటన రూపంలో లాగి మనసుని కొట్టినప్పుడు బుద్ధిగా మాట వింటుంది. ఆ అనుభవాన్ని పాఠంలా అవలోకనం చేసుకుంటుంది. ఆ తర్వాత కూడా నిలబడేవే నిజమైన బంధాలు. అవే ఆ జన్మకి అందాలు.’’ ఈ వ్యాసం రాయడం కోసం ‘దిల్ చాహ్తా హై’ సినిమా మళ్లీ చూసినప్పుడు నాకిలా అర్థమైంది. కొన్ని సినిమాలు మొదటిసారి చూస్తే బావుండీ, బాలేక అటు ఇటుగా అనిపిస్తుంటాయి. తర్వాత వాటి రన్లో వాటి విలువ రోజురోజుకీ పెరిగి చివరికి అవి కల్ట్ ఫిల్మ్గానో, ఎపిక్ ఫిల్మ్గానో నిలుస్తాయి. దిల్ చాహ్తా హై... ఆ కోవకు చెందిన సినిమా. ‘షోలే’ రాసిన గొప్ప రచయితలు సలీమ్, జావేద్‌లలో జావేద్ అఖ్తర్ కొడుకు ఫర్హాన్ అఖ్తర్. చిన్నప్పట్నుంచీ సినిమా కుటుంబం, ఎగువ మధ్య తరగతి, ఆపైన సంపన్న జీవితాల సావాసం. ఆ యువత జీవనశైలితో ఓ కథ రాసుకున్నాడు. అది కూడా నెలన్నరపాటు అమెరికాలో హాలిడేకి వెళ్లినప్పుడు తన స్నేహితుల్ని కలిసి, వారితో సాగిన ముచ్చట్ల నుంచి, వారి ప్రేమకథల గురించి ఒక కథ రాసుకున్నాడు. అందుకే దిల్ చాహ్తా హై సినిమాలో నిజ జీవిత దర్పణం ఉంది. జీవం ఉంది. ప్రాథమిక హిందీ సినిమా కమర్షియల్ సూత్రాలన్నింటినీ బ్రేక్ చేసినా, కమర్షియల్‌గా హిట్ అవ్వగలిగిన ఆత్మ ఉంది. ఆకాష్, సమీర్, సిద్ధూల పాత్రల్లో ప్రతి మిలీనియం యువకుడూ తనని తాను చూసుకున్నాడు. పక్కింటి ఆంటీకి సైటు కొట్టడం నుంచి, నచ్చిన ప్రతి అమ్మాయినీ ప్రేమించేయడం నుంచి, అమ్మాయి కోసం ఫ్రెండ్స్‌తో కూడా దెబ్బలాడి దూరం అవ్వడం నుంచి, ప్రేమ, విరహం, బాధ, నవ్వులు, మళ్లీ కలుసుకోవడం, అనుభూతులు - అన్నింట్లోనూ ఐడెంటిఫై అవ్వక తప్పని బలమైన సహజ పాత్రలు సృష్టించాడు దర్శక రచయిత ఫర్హాన్ అఖ్తర్. అలాగే శాలిని, దీప, ప్రియ, పూజ, తార ఆంటీ - ఆధునిక భారతావని వనితల్లో ప్రతి ఒక్కరూ వీళ్లల్లో కనపడతారు. కన్ఫ్యూజన్లు, కోపాలు, ప్రేమలు, విరహాలు... అన్నీ. పోస్టర్ చూశాక: ఒక మోడర్న్ కామెడీ సినిమా విత్ మల్టిపుల్ క్యారెక్టర్స్ అనిపించింది. ఆమిర్‌ఖాన్, ప్రీతిజింతా కోసం, ‘దిల్ చాహ్తా హై’ అని మంచి టైటిల్ పెట్టాడు కాబట్టి ‘దిల్‌తో పాగల్ హై’లో సగం ఉన్నా చాలనుకుని వెళ్లాలనుకున్నాను. దర్శకుడి మొదటి సినిమా అనగానే కాస్త భయం ఉంటుంది మనసులో నాకెప్పుడూ - అదృష్టవశాత్తూ ఫర్హాన్ అఖ్తర్ రెండో సినిమా ‘లక్ష్య’కి భయపెట్టాడు కానీ, మొదటి సినిమా ‘దిల్ చాహ్తా హై’ని అద్భుతంగా కన్నా కొంచెం ఎక్కువ బాగా తీశాడు. నిజ జీవిత పాత్రల స్వభావాలు, కొన్ని సంఘటనలు స్నేహితుల నుంచి సేకరించినా, మరికొంత డ్రామాని, కథని షేక్స్పియర్ రాసిన ‘మచ్ ఎడో అబౌట్ నథింగ్’ నుంచి ప్రేరణ పొందినట్టు ఉంటుంది. మొదట ఆమిర్‌ఖాన్‌కి సిద్ధూ పాత్రని ఆఫర్ చేస్తే, ఆయన కథంతా విని ఆకాష్ పాత్ర నాకు బాగా దగ్గరగా ఉంది, ఆ పాత్రనే చేస్తానని ఎంచుకున్నార్ట. చాలాకాలం తర్వాత డింపుల్ కపాడియాని ఒప్పించి తార పాత్రకి తెచ్చుకోవడం ఫర్హాన్ కృషే. అలాగే అభిషేక్ బచ్చన్ మొదట సిద్ధూ పాత్రని ఒప్పుకుని, చివరి నిమిషంలో డ్రాప్ అయితే, ఆ అవకాశం అక్షయ్ఖన్నా దక్కించుకున్నాడు. అలా, ఆమిర్‌ఖాన్, సైఫ్ అలీఖాన్, అక్షయ్ఖన్నా స్నేహితుల పాత్రలకి సెట్ అయ్యారు. కథ గురించి చెప్పుకుంటే... ఆకాష్ ధనవంతుల బిడ్డ - ప్రేమ, దోమ లాంటి ఫీలింగ్స్‌ని నమ్మడు. ఫ్లర్ట్ చేసి వదిలేస్తుంటాడు ఏ అమ్మాయినైనా. సమీర్, సిద్ధూ ఎగువ, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు. సమీర్ ఏ అమ్మాయినైనా ఇట్టే ప్రేమించేసి, అదే నిజమని నమ్మేస్తుంటాడు. సిద్ధూ చాలా ముభావి. స్వతహాగా పెయింటర్. వీళ్ల స్నేహంలో వచ్చిపోయే సబ్ క్యారెక్టర్లే హీరోయిన్లు, తల్లిదండ్రులు అందరూ. ఈ స్నేహం విడిపోయినట్టు మొదటి సీన్లో చెప్పి, అక్కణ్నుంచి వీళ్ల ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. విశ్రాంతి సమయానికి సిద్ధూ, ఆకాష్ ఒకరినొకరు తిట్టుకుని విడిపోతారు. సెకెండ్ హాఫ్‌లో వాళ్ల జీవితాల్లో వచ్చిన మార్పులు, ఒంటరిగా వాళ్లు తీసుకున్న నిర్ణయాలు, వాటి మంచీ చెడులు - చివరికి ముగ్గురూ కలవడం. ఇది కథ కాదు - కొందరి జీవితం. పాత్రల స్వభావాలకు అనుగుణంగా రాసుకున్న సంఘటనలు, వాటివల్ల ఉత్పన్నమయ్యే ఎమోషన్లు - కాబట్టి ఈ సినిమాలో పాత్రలు ఏడిస్తే మనకు ఏడుపొస్తుంది. పాత్రలు నవ్వితే మనకి నవ్వొస్తుంది. పాత్రలు దెబ్బలాడుకుంటే మనకి బాధేస్తుంది. పాత్రలు మళ్లీ కలుసుకుంటే మనకు కళ్లు చెమ్మగిల్లుతాయి. ఈ పాత్రలకి తోడు వాళ్ల స్టైలింగ్, వాళ్లు నివసించే ఇళ్లు, గదులు, ఫర్నిచర్, కాస్ట్యూమ్స్ అన్నీ అంతే న్యాచురల్‌గా, అంతే అందంగా ఉండటం చెప్పుకోదగ్గ విషయం. శంకర్, ఎహ్సాన్, లాయ్ సంగీతం ఈ చిత్రానికి ఆయువుపట్టు. పాటలెక్కడా అసందర్భంగా ఉండవు. సీన్ల మధ్యలో ఒక్కో సీన్‌లాగే పాట వచ్చి వెళ్తుంది - సాహిత్యం కూడా క్యారెక్టర్లు మాట్లాడుకున్నట్టే ఉంటాయి. డ్యాన్సర్లు, స్టెప్పులు లేకుండా సినిమాలో అన్ని పాటలూ తీయడం ఈ సినిమాకి క్లాస్‌ని ఆపాదించింది. ‘దిల్ చాహ్తా హై’ టైటిల్ ట్రాక్, జానెక్యూం లోగ్ ప్యార్ కర్తే హై, తన్హాయీ... అన్ని పాటలూ దేనికవే సూపర్హిట్లు. అన్నీ కథను ముందుకు నడిపించేవే. రవి.కె.చంద్రన్ ఛాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, చెన్నైలో సౌండ్ ఇంజినీరు మీడియా ఆర్టిస్ట్ శ్రీధర్... వీళ్లంతా భారతీయ మిలీనియం సినిమా మీద దక్షిణాది నుంచి బలమైన ముద్ర వేసిన సాంకేతిక నిపుణులు. జావేద్ అఖ్తర్ అన్ని పాటలూ యువతీ యువకుల మనోభావాల, భావాల సంఘర్షణలని, ఆనందాల్ని అక్షరీకరించాయి. పెట్టిన ప్రతి రూపాయికీ మరో రూపాయి లాభాన్ని తెచ్చి పెట్టిన చిత్రం ‘దిల్ చాహ్తా హై’. ఈ సినిమాలో మాటల్లాగ, ఇది ఆకాష్ మ్యాజిక్. ఇది ఫర్హాన్ అఖ్తర్ మ్యాజిక్ - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
కర్రా బిళ్లా VS క్రికెట్
దేడ్ కహానీ లగాన్ అంటే పన్ను, శిస్తు. ‘శిస్తువేత్తి, పస్తువేత్తి - వేత్తి కనకవర్షం సుమీ’... ఇదీ కొత్త సామెత. లగాన్ సృష్టించిన చరిత్ర, కురిపించిన కాసులు ఒక ఎత్తయితే... తెల్ల దొరల పాలనలో పన్నుల బాధల్ని ఎంతో ఎంటర్టైనింగ్గా చెప్పిన చిత్రం అయినందుకు నల్ల దొరల పాలనలో వినోద ‘పన్ను’ మినహాయింపులు పొందడం ఎంత గొప్ప! 15 జూన్ 2001 భారతీయ సినీచరిత్రలో గుర్తించుకోదగిన రోజు. 1983 నుంచీ మన దేశంలో అనధికార మతంగా ఎదిగిన క్రీడ క్రికెట్. దాని మూలాలు బ్రిటిష్వాళ్లవే. స్వాతంత్య్రానికి పూర్వం భారతీయ బానిసత్వం నేపథ్యంగా వచ్చిన చిత్రాలన్నీ స్ఫూర్తిమంతమైన, దేశభక్తిపూరిత చిత్రాలుగా మాత్రమే ఉంటాయి. కానీ అదే స్ఫూర్తి, దేశభక్తిని క్రికెట్ అనే క్రీడావినోదంతో ముడిపెట్టవచ్చనే ఆలోచన దర్శక రచయిత అశుతోష్ గోవారికర్కి రావడమే అద్భుతం. దాన్ని ఆమిర్‌ఖాన్ అంగీకరించి స్వయంగా నిర్మించడానికి పూనుకోవడం మహాద్భుతం. ‘లగాన్’కి తొమ్మిదేళ్లకు ముందు వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘బాజీ’ అనే మాస్ మసాలా సినిమా అట్టర్‌ఫ్లాప్. ఆ భయంతోనే ఏమో అశుతోష్ ‘లగాన్’ కథని వేరే హీరోలందరికీ వినిపించాడు ముందర. అన్నిచోట్లా తిరస్కారానికి గురైన ఆ కథ, చివరకు ఆమిర్‌ఖాన్ ఒప్పుకోవడంతో తెరకెక్కి... అత్యున్నత పురస్కారాలను, ప్రేక్షకుల నీరాజనాలను అందుకోవడానికి తయారైంది. ఈ సినిమా మీద నేను నాలుగు పేజీల వ్యాసం రాయలేను. కనీసం నాలుగొందల పేజీల పుస్తకం రాయాలి. మస్తిష్కం ఉపయోగించి తీసిన సినిమాలు కమర్షియల్‌గా హిట్ అవుతాయి. కానీ, మనసుపెట్టి తీసిన సినిమాలు హిట్‌తో పాటు ప్రేక్షకుడి మస్తిష్కాన్ని మధిస్తాయి. ప్రేక్షకుడి మనసు మీద చెరగని ముద్ర వేస్తాయి. ‘లగాన్’ ఆ కోవకు చెందిన సినిమా. పోస్టర్ చూశాక: ఓ స్వాతంత్య్ర సమరయోధుడి ప్రేమకథ కాబోసు అని డౌట్ వచ్చింది. ఓ పక్క బ్రిటిష్ యువరాణి, మరోపక్క సంప్రదాయ భారత వనిత, మధ్యలో చిన్న రూరల్ గెటప్‌లో అందమైన ఆమిర్‌ఖాన్. ఇంతకన్నా ఏం చేసుకుంటాడులే - అనుకున్నా. థియేటర్లో కూర్చున్నాక: గంభీరమైన అమితాబ్ బచ్చన్ స్వరంతో... స్వాతంత్య్రం రాకముందు తెల్లదొరలు స్థానిక రాజుల్ని వశపర్చుకుని సామాన్య ప్రజలకి పన్నులెలా బాదేవారు? గుజరాత్‌లోని చంపానెర్ అనే కుగ్రామంలో జరిగిన కథ అని మొదలై... పాత్రలు ఒక్కొక్కటిగా పరిచయం అవుతూ బ్రిటిష్ సైనికుల దౌర్జన్యం కనపడుతుంది. ఇదేదో ఫ్రీడమ్ ఫైటర్ స్టోరీ అయ్యుంటుంది అనుకున్నా. భువన్ గురించి వేరే పాత్రలు మాట్లాడుకున్నాక, దొంగతనంగా జింకల్ని రాళ్లతో కొడుతున్న భువన్. సరిగ్గా జింకల పక్కనున్న చెట్టుకి రాయి తగిలి జింకలు పరుగెత్తడం, అదే చెట్టుకి ఓ తుపాకీ గుండు తగలడం, ఆ తుపాకీని పేల్చిన తెల్లదొర కెప్టెన్ రసెల్ కనబడటం క్షణాల్లో జరుగుతుంది. భువన్ జింకల్ని కొట్టట్లేదు. ఆ తుపాకీ గుళ్ల నుంచి వాటిని కాపాడుతున్నాడని అర్థమైంది. భువన్ పాత్రని, ఆ పాత్రనలా పరిచయం చేసిన దర్శకుణ్ని ప్రేమించేయడం మొదలుపెట్టాను. ‘ఆహా! ఏం ఐడియా’ అనుకున్నాను. భువన్ మెడమీద తుపాకీ పెట్టి, జింకల్ని కాలుస్తాడు కెప్టెన్ రసెల్. భువన్‌కి వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు. హీరో ఫెయిల్యూర్‌తో సినిమా స్టార్ట్ అయ్యింది. చివ్వరి రీలు దాకా ఆ ఓటమి పరంపరలోనే సినిమా అంతా నడుస్తుంది. అయినా అతని పాత్రలోని మొక్కవోని ధైర్యం, పట్టుదల, తెగింపు, దేశభక్తి చూసి చూసి చూసి... చివరి బాల్కి వీడు సిక్స్ కొట్టకపోతే మనం సీట్లోంచి లేచి తెరమీద సిక్స్ కొట్టి భారతీయుల్ని గెలిపించాలన్నంత కసి వచ్చేస్తుంది. ‘చిన్న చిన్న కళ్లల్లో పెద్ద పెద్ద కలలు...’ భువన్ పాత్రని తిడుతూ గ్రామస్తుల మాటలు... క్రికెట్‌ని తేలిక చేస్తూ భువన్ ‘ఇది మా గిల్లీ దండా ఆటే... చిన్నప్పట్నుంచీ చూస్తున్నాను’ అనడం చప్పట్లు కొట్టించింది. ఈ కథని రాయకూడదు. అనుభవించాలి. ఎందుకంటే... ఈ సినిమాని దర్శకుడు తీయలేదు, తీయగా మలిచాడు కాబట్టి. విశేషాలు: నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉండటానికి అనువైన చిన్న హోటల్ కూడా లేని పల్లెటూళ్లో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న అపార్ట్‌మెంట్‌ని పూర్తిచేసి, అన్ని ఫ్లాట్లూ అద్దెకు తీసుకుని, వంటవాళ్లని, సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని మరీ షూటింగ్ చేయడం గొప్ప విషయం. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా దర్శకుడికి వెన్నులో డిస్కు స్లిప్ అయితే ముప్ఫై రోజుల పాటు మానిటర్ పక్కనే బెడ్‌మీద పడుకుని డెరైక్షన్ చేయడం ఇంకా గొప్ప విషయం. షూటింగ్ జరిగిన ఏడాది తర్వాత, గుజరాత్‌లోని కచ్ దగ్గర, భుజ్ గ్రామ సమీపంలో భూకంపం వచ్చి అక్కడి జనం ఆస్తి, ధన, ప్రాణ నష్టాలకు గురైతే... ‘లగాన్’ యూనిట్ అంతా కలిసి తమ తమ వేతనాల్లోంచి ఆ ప్రాంతానికి అండగా నిలబడటం మరో గొప్ప విషయం. ఈ చిత్రం పేరుకు తగ్గట్టే ఆమిర్‌ఖాన్ పదిహేనేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పి, పన్ను చెల్లించి, ఈ చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేసిన కిరణ్‌రావుని రెండో వివాహం చేసుకోవడం ఓ విచిత్రం. ఆ గొడవల్లో ఆమిర్ దాదాపు నాలుగేళ్లు వృత్తికి దూరంగా ఉండాల్సి రావడం బాధాకరం. ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఫిల్మ్ ఇన్ ఫారిన్ ల్యాంగ్వేజ్ కేటగిరీకి ఎంపికైన మూడవ భారతీయ చిత్రం ‘లగాన్’. వసూళ్లు, అవార్డులు, విమర్శకుల ప్రశంసలు అన్నీ అమితంగా దక్కిన మిలీనియం భారతీయ చిత్రాల్లో ‘లగాన్’ తొలి రెండు, మూడు స్థానాల్లో ఉంటుంది. గ్రేసీసింగ్, రేచెల్షెల్లీ ఇద్దరూ రాధ, ఎలిజబెత్ పాత్రల్లో అద్భుతంగా రాణించారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం ఈ చిత్రానికి ఆయువు పట్టు కావడం మరింత గొప్పగా అనిపించే విషయం. ఈ చిత్రం డీవీడీ అమ్మకాలు 1975లో విడుదలైన ‘షోలే’ అమ్మకాల రికార్డుల్ని బద్దలుకొట్టాయి. నటుడిగా కెరీర్ ప్రారంభించిన అశుతోష్ గోవారికర్ ఈ చిత్రంతో దర్శకుడు, రచయిత అయ్యాడు. నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆమిర్‌ఖాన్ ‘లగాన్’తో నిర్మాత అయ్యాడు. ఆ విజయం ఇచ్చిన ఊపుతో తర్వాత దర్శకుడూ అయ్యాడు. అదే ఊపుతో అశుతోష్ గోవారికర్ నిర్మాత అయ్యాడు. ఒక ‘సినిమా’ జీవితాల్ని మారుస్తుంది. అదే ‘లగాన్’. ముస్లిముల్ని, హిందువుల్ని విభజించి పాలించిన తెల్లవారి కుతంత్రం క్రికెట్ ఆటలో కళ్లకు కట్టినట్టు చూపాడు దర్శకుడు. మళ్లీ వారిని ఒకటి చేసి, తెల్లవారిని ఓడించిన భువన్ ఆ క్షణంలో గాంధీ మహాత్ముడిలా కనిపిస్తాడు. నిజంగా ఈ కథ జరిగుంటే భారతదేశమంతా క్రికెట్ ఆడేసేదేమో - భువన్ జాతిపిత అయ్యుండేవాడేమో అనిపిస్తుంది. నిజంగానే క్రికెట్ ఇవాళ మతం అయ్యిందిగా. ‘అనగ అనగ రాగమతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు’ అన్నట్టు తీయగా, తీయగా ఒక్కో తపన కలిగిన దర్శకుడి జీవితంలో ముందో వెనకో మధ్యలోనో ఒక్క సినిమా ‘లగాన్’ అవుతుంది. ఈ చిత్రం విడుదలైన రోజే స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో తెరకెక్కిన ప్రేమకథ ‘గదర్... ఏక్ ప్రేమ్ కథ’ విడుదలైంది. ఒకే నేపథ్యం ఉన్న కథలు కాబట్టి జనం పోటీగా భావించారు. పైగా ఆమిర్‌ఖాన్, సన్నీడియోల్ హీరోలు, నిర్మాతలు అవ్వడం వలన దాయాదుల పోరు (హిందు, ముస్లింలు)గా అభివర్ణించారు. కానీ ప్రేక్షకులు మాత్రం..? వచ్చేవారం కలుద్దాం... ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’ చిత్ర విశేషాలతో! - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
అలా వచ్చి... ఇలా హిట్టిచ్చాడు...
దేడ్ కహానీ ఒకటిన్నర దశాబ్ద కాలంలో బాలీవుడ్ గమనం... ప్రపంచ సాంకేతిక చరిత్రని తిరగరాసిన మిలీనియమ్ సంవత్సరం (2000)... భారతీయ సినిమాని, ముఖ్యంగా బాలీవుడ్ సినిమా చరిత్రని కూడా తిరగ రాసింది. సమాజం ఏ ఇరవై ఏళ్లకో ఒకసారి ఎదిగే స్థాయి నుంచి ప్రతి ఇరవై రోజులకి కొత్త కొత్త విషయాలతో ఎదగడం ప్రారంభించింది 2000 నుంచే. దుకే ఈ కాలమే 2000 కాలం నుంచి ఇవాల్టి దాకా హిందీ సినిమాలలో వచ్చిన మార్పులు, వాటి విశేషాలు, మారుతున్న ప్రేక్షకుడి ధోరణి, దానికనుగుణంగా మారుతున్న సినిమా - వీటి సమాహారం. ఈ శీర్షికలో ఈ వారం సినిమా ‘కహో న ప్యార్ హై’పదిహేనేళ్ల క్రితం ఆరువేళ్ల అందగాడిని చూసి యువత భారతదేశంలోని సినీ ప్రేమికులు మనసు పారేసుకున్నారు. తెర మీద... ‘‘రోహిత్, రోహిత్’’ అని కొన్ని వేల మంది ప్రజలు అరుస్తుంటే, యేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి కూడా ఒక ఉత్కంఠ, ఒక ఉద్వేగం, బిల్డప్ షాట్స్ - పాట హమ్మింగ్- మెస్మరైజింగ్ ఫేస్ - ఏ స్టార్ ఈజ్ బోర్న్- పేరు: హృతిక్ రోషన్. తండ్రి: రాకేష్ రోషన్ - కొడుకు తొలి సినిమాకి కథ, నిర్మాత, దర్శకుడు. బాబాయ్: రాజేష్ రోషన్ - అన్న కొడుకు తొలి సినిమాకి సంగీత దర్శకుడు. సినిమా: కహో నా... ప్యార్హై కుటుంబమంతా కలిసి కష్టపడి ప్రేక్షక దేవుళ్ల ఆశీస్సులు, మెప్పులు పొందిన సూపర్ హిట్ మర్షియల్ సినిమా. క్లుప్తంగా కథ: హిత్, అతని తమ్ముడు అమిత్ ఒక మధ్యతరగతి ఇంట్లో పేయింగ్ గెస్టులు. వారికి తల్లిదండ్రులు లేరు. తమ్ముడి ఆలనా పాలనా అన్నే చూసుకుంటుంటాడు. తమ్ముడు తెగ మోసేసినా ఆ అన్న అలగడు. అభిమానంగా స్వీకరిస్తాడు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం. మంచి అన్నకి చిలిపి తమ్ముడు. స్టార్ సింగర్ కావాలని రోహిత్ కల. ఆ కలతోనే సినిమా మొదలౌతుంది. రోహిత్ కార్ షోరూమ్‌లో సేల్స్‌మన్. అందమైన సోనియా అనే అమ్మాయిని మొదటిసారి ట్రాఫిక్‌లో చూస్తాడు. బానే ఉందనుకుంటాడు. తర్వాత... సోనియా తండ్రి ఆమెకు పుట్టిన రోజు కానుకగా కారు కొంటాడు. ఆ కారుని సోనియా బర్త్‌డే రోజు ఇంటికి తెమ్మని రోహిత్‌కి చెబుతాడు. కూతురు ‘నా పుట్టినరోజు కానుకేది’ అనడిగితే ‘తలుపు తియ్యి’ అంటాడు. తలుపు తీస్తే ఎదురుగా హీరో. ఒక్క క్షణం ఆమెకర్థం కాదు. ‘బహుమతి ఎలా ఉంద’ంటాడు తండ్రి. ‘కలర్ బావుంది, గిఫ్ట్ బావుంది’ హీరోని కొంటెగా చూస్తూ - తండ్రితో. కారు తాళం చూపిస్తాడు హీరో- లోపల్నించి తండ్రి ‘నడిపి చూడు ఇంకా బావుంటుంది’ అంటాడు. ‘ఓ నిన్ను తాళంతో నడపచ్చా’ అంటుంది. ఆమె కొంటెతనం అర్థమై, కారు చూపిస్తాడు హీరో. ఇందులో సరసం ఉంది. వెగటుతనం లేదు. అలా వాళ్ల మధ్య పరిచయం స్నేహమై, ప్రేమై తండ్రికి తెలిసి, అతనితో మాట్లాడతాను రమ్మంటాడు. డ్రగ్స్ ముఠాని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న కమీషనర్ని విలన్లు హత్య చేయడం హీరో చూస్తాడు. హీరోని వాళ్లు వెంటపడి వెంటపడి చంపుతారు. విశ్రాంతి... ఇంటర్వెల్‌కే హీరో చనిపోతాడు. ప్రేక్షకులూ, హీరోయినూ కలిసి గాఢంగా ప్రేమించేసిన హీరో చనిపోతాడు. సినిమాటిక్‌గా సెకండాఫ్‌లో బతికొస్తాడులే అనుకుంటాం. సినిమా అయిపోయినా రోహిత్ బతకడు. రాజ్ అనే మరో హృతిక్ రోషన్ సెకండాఫ్ కథ నడిపిస్తాడు. రోహిత్‌ను హత్య చేసిన దుర్మార్గుల పని పడతాడు. రోహిత్ కలగన్న పెర్ఫార్మెన్స్ ఇస్తాడు రాజ్. రోహిత్ ప్రేయసి సోనియా మనసు గెలుస్తాడు. రోహిత్ తమ్ముడిని కూడా న్యూజిలాండ్ తీసుకెళ్లిపోతాడు. రెండు రకాల స్వభావాలున్న పాత్రలు రెండూ ఒకే హీరో ఒకే సినిమాలో చేయాలంటే, అదీ తన మొదటి సినిమాలోనే చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఆ గట్స్తోటే హృతిక్‌రోషన్ హీరో అయ్యాడు. ఈ సినిమాలో డైలాగులాగే ‘‘ఏక్ బాత్ బోలూ...’’ మిలీనియమ్‌లో మొదటి సూపర్‌హిట్ బాలీవుడ్ సినిమా ‘‘కహోనా... ప్యార్హై...’’ ‘‘చాంద్సెతారే పూల్ అవుర్ కుష్బూ’’ పాట, ‘‘కహోనా... ప్యార్హై’’ టైటిల్ సాంగ్ పెద్ద హిట్. ఇక... సినిమాకు ముందు విషయానికొస్తే... తండ్రి రాకేష్ రోషన్ దీనికి ముందు తీసిన భారీ చిత్రం ‘‘కోయ్లా’’కి హృతిక్ సహాయ దర్శకుడు. కండలవీరుడు సల్మాన్‌ఖాన్ సలహాలతో తన శరీరాకృతిని సర్వాంగ సుందరంగా మార్చుకున్నాడు హృతిక్. యువతరం మనసు కొల్లగొట్టాడు. బాలీవుడ్లో డ్యాన్స్ చేసే హీరోలు లేరని గుర్తించి సౌత్‌లో లాగ చాలా కష్టమైన డ్యాన్స్‌లు సునాయాసంగా చేశాడు. బాక్సాఫీసుని బద్దలు కొట్టాడు. చిత్రానికి హీరోయిన్గా ముందు కరీనాకపూర్‌ని ఎంచుకుని కొంత షూటింగ్ చేశారు. రషెస్ చూశాక, కొత్తమ్మాయి అమీషా పటేల్‌తో రీషూట్ చేశారు. అమితాబ్ తర్వాత ఖాన్లు ఏలుతున్న బాలీవుడ్‌కి నాన్ఖాన్ సూపర్‌స్టార్‌గా, ప్రత్యామ్నాయంగా ఎదిగాడు హృతిక్. సవరించిన ద్రవ్యోల్బణ రేటు ప్రకారం బాలీవుడ్ హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో ఇవాళ్టికీ పదకొండో చిత్రంగా నిలిచింది కహోనా...ప్యార్హై. చిత్రంలో హృతిక్ తమ్ముడు అమిత్‌గా నటించిన బాలనటుడు అభిషేక్ శర్మ ఇవాళ హిందీ బుల్లితెర మీద పెద్దనటుడు. సినిమా మొత్తం హృతిక్ చేతికున్న ఆరోవేలు కనపడకుండా సినిమా తీశారు రాకేష్ రోషన్. ఫస్టాఫ్ షిప్‌లోనూ, ఐలాండ్లోను తీసి, సెకండాఫ్ న్యూజిలాండ్‌లోనూ, ముంబైలోనూ తీయడం వల్ల సినిమాకి ఎక్కడలేని రిచ్‌నెస్ వచ్చింది. అయిదు పదుల వయసులో కూడా 2000వ సంవత్సరపు ప్రేక్షకుడి నాడికి పట్టుకోవడం అసాధ్యం కాదని, షారుఖ్‌ఖాన్, మాధురీదీక్షిత్ లాంటి అగ్రతారలతో తీసిన కోయ్లా డిసాస్టర్ అయ్యాక కూడా ఆ దర్శకుడు బౌన్స్ బ్యాక్ అవ్వచ్చని కహోనాప్యార్హైతో రచయితగా, దర్శకుడిగా నిరూపించారు నిన్నటి తరం నటుడు రాకేష్ రోషన్. క్రియేటివిటీ డివైన్ మాత్రమే కాదు, వైన్లాంటిది కూడా. పాతబడిన కొద్దీ రుచిలో కిక్ పెరుగుతుంటుంది. సానబెట్టిన కొద్దీ రాయి వజ్రంగా మారినట్టు. మళ్లీ వచ్చేవారం మరో సూపర్‌హిట్ బాలీవుడ్ మూవీతో కలుద్దాం... హ్యాపీ సండే, ఫన్డే. - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు