ప్రతి మదిలో రగిలిన క్రీడాస్ఫూర్తి! | Chak De India | Sakshi
Sakshi News home page

ప్రతి మదిలో రగిలిన క్రీడాస్ఫూర్తి!

Published Sun, Nov 29 2015 12:20 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ప్రతి మదిలో రగిలిన క్రీడాస్ఫూర్తి! - Sakshi

ప్రతి మదిలో రగిలిన క్రీడాస్ఫూర్తి!

దేడ్ కహానీ - చక్ దే ఇండియా
నిద్రాణమైన జాతిని, నిస్తేజమైన జీవితాల్ని ఉత్తేజితుల్ని, చైతన్యవంతుల్ని చేసిన చిత్రమిది. అందుకే సూపర్‌హిట్ అయ్యింది. మిలీనియమ్‌లో వచ్చిన చిత్రాల్లో మణిపూసలా నిలిచింది. ప్రేక్షకులకే కాదు... యావత్ సమాజానికే ప్రేరణనిచ్చింది.

 
హాకీ మ్యాచ్ చూడ్డానికి బోరు. అందులోనూ మహిళల హాకీ. మ్యాచ్ అసలు ఎక్కడాడతారో, ఎప్పుడు జరుగుతాయో కూడా తెలీదు. ఇది సగటు భారతీయుడిగా నా నాలెడ్జ్, నా ఇంటరెస్ట్. 1983 నుంచి ఇండియాలో మగాళ్ల ఆట అంటే క్రికెట్టే. 1990ల నుంచి ప్రపంచంలో ఆడవాళ్ల ఆట అంటే టెన్నిస్సే. వేరే ఆటలుంటాయని, అవి కూడా ఆడుతుంటారని అప్పుడప్పుడూ కామన్వెల్త్, ఆసియా గేమ్స్, ఒలింపిక్స్ లాంటివి జరిగినప్పుడు న్యూస్‌పేపర్‌లో చదవడం...

ఏ దేశానికెన్ని పతకాలు వచ్చాయో పట్టీ మాత్రం చూసేసి, ఇండియాని తక్కువ స్థానంలో చూడడం, ఆ తక్కువ పతకాలు తెచ్చిన ఆటగాళ్లని కూడా తక్కువ చేసి చూడడం అలవాటై పోయింది. అలా ఎదిగేశాం. అలాగే అన్ని ఆటల్నీ వదిలేశాం.
 
ఇలాంటి భావ సంచయం ఉన్న నాలాంటి ప్రేక్షకుడు, అందులోనూ క్రికెట్ మతం పుచ్చుకున్న ఉన్మాది... హాకీ ఆటే ప్రధానంగా తీసిన సినిమా చూడ్డానికి ఏ మాత్రమైనా ఆసక్తి చూపిస్తాడా? అయినా నేను ‘చక్ దే ఇండియా’ సినిమా చూడ్డానికి వెళ్లాను. దానికి కారణం... అది యశ్‌రాజ్ ఫిలిమ్స్‌వాళ్లు షారుఖ్‌ఖాన్ హీరోగా, ఆదిత్యచోప్రా నిర్మాతగా, షిమిత్ అమీన్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ తీయడమే.

అయితే సినిమా మాత్రం భారత హాకీ టీమ్‌కి సంబంధించి నది కాబట్టి కాస్త అయిష్టంగానే వెళ్లాను. ‘లగాన్’ చూసిన కళ్లతో హాకీ ఆటని చూడగలనా? అనుకున్నాను.
 అప్పటికి నాకు 33 ఏళ్లు. జీవితంలో ఎప్పుడూ ఒక్క హాకీ మ్యాచ్ చూసిన పాపాన పోలేదు. అందుకే ఆ సినిమాను చూడ్డానికి అంత కష్టంగా వెళ్లాను. కానీ ‘చక్ దే ఇండియా’ సినిమా చూశాక మాత్రం... జీవితాంతం హాకీ మ్యాచెస్‌ని వదలకుండా చూసి తీరాలని గట్టిగా నిశ్చయించుకున్నాను.
 
భారతదేశ పురుషాహంకార సమాజంలో ఆడవారు ఆటుపోట్లు ఎదుర్కోవడానికే గానీ ఆటలాడడానికి పనికి రారు అన్న భావన చాలామందిలో ఉంది. అందరూ పిచ్చిగా అభిమానించే క్రికెట్‌లోనే మహిళల క్రికెట్‌కి ఆదరణ లేని భారతీయ సమాజంలో... ఇతర ఆటలకి విలువ, ఆ ఆటగాళ్లకి గుర్తింపు లేని రోజుల్లో... ఆడవాళ్ల హాకీని ప్రధానంగా చూపిస్తూ ‘చక్ దే ఇండియా’ తీశారు. ఆ ఆటను ఎవ్వరూ ఎలా పట్టించుకోవడం లేదో, అదే కథగా తీసి చూపించారు.
 
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ కొన్ని పాత్రల్లో ఎంతో బాగా ఇమిడిపోతాడు.  అలా అతడు అద్భుతంగా ఇమిడిపోయిన వాటిలో మొదటిది ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ అయితే, రెండోది ‘చక్ దే ఇండియా’నే.
 
మన జాతీయ క్రీడ హాకీ. కానీ దానికి మన దేశంలోనే ఆదరణ కరువైపోయింది. ఆ నిరాదరణ మహిళల హాకీని పూర్తిగా చంపేయబోయింది. అలాంటి సమయంలో హాకీ సమాఖ్య... ఒక భారత పురుషుల హాకీ టీమ్ మాజీ కెప్టెన్‌ని మహిళల టీమ్‌కి కోచ్‌గా నియమిస్తుంది. అతని పేరు కబీర్‌ఖాన్.
 కబీర్‌ఖాన్ ఇస్లాం మతస్థుడు.

భారత హాకీ కెప్టెన్‌గా ప్రపంచ కప్ ఫైనల్‌లో పెనాల్టీ కార్నర్ గోల్‌గా మలచలేక విఫలమౌతాడు. దాంతో పాకిస్థాన్ గెలుస్తుంది. కబీర్‌ఖాన్ పాక్ ఆటగాళ్లని కంగ్రాట్యులేట్ చేస్తాడు. అది ఓ జర్నలిస్టు ఫొటో తీసి కబీర్‌ఖాన్‌ని దేశద్రోహిగా, పాకిస్థాన్‌కి అమ్ముడు పోయినవాడిగా చిత్రీకరిస్తాడు. దాంతో కబీర్‌ఖాన్ ఇల్లు వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది.
 
మళ్లీ ఏడేళ్ల తర్వాత ఒక పాత మిత్రుడి ప్రోత్సాహంతో హాకీ ఆటకు చేరువవు తాడు కబీర్. భారత మహిళల హాకీ టీమ్‌ని ప్రపంచకప్‌కి పంపించే ముందు కోచ్‌గా ఎవ్వరూ ముందుకు రాని సమయంలో... తన దేశభక్తిని నిరూ పించుకునే అవకాశంగా దాన్ని భావించి, కోచ్ పదవిని చేపడతాడు కబీర్‌ఖాన్. పదహారు మంది మహిళలున్న భారత హాకీ జట్టును ముందుకు నడిపించే బాధ్యతను నెత్తిన వేసుకుంటాడు. ప్రపంచకప్ గెలిపించి మహిళల హాకీకి పునరుజ్జీవనం తేవడంతో పాటు తన మీదున్న మచ్చని పోగొట్టుకుంటాడు. కథ కంచికి, కబీర్‌ఖాన్ సొంత ఇంటికి చేరుకోవడంతో సుఖాంతమవుతుంది.
 
జైదీప్ సాహ్ని అనే కథ, స్క్రీన్‌ప్లే, మాటల రచయిత 2002లో కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల హాకీ టీమ్ గెలిచిందన్న చిన్న ఆర్టికల్‌ను చదివాడు. ఆ నేపథ్యంలో సినిమా చేయాలనుకుని మహరాజ్ కృష్ణన్ కౌశిక్ అనే అప్పటి కోచ్‌ని కలిసి తాను అనుకున్న కథ చెప్పార్ట. ఆయన... 1982 ఏషియన్ గేమ్స్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయిన మీర్ రంజన్ నేగి అనే హాకీ ప్లేయర్‌ని పరిచయం చేశాడు.

తన వల్లే పాక్ చేతిలో భారత్ ఓడిపోయిందని ఆరోపణలు ఎదుర్కొన్నాడు మీర్. అలా ఒక విన్నింగ్, ఇన్‌స్పిరేషన్ కథలో ఒక దేశద్రోహం, దేశభక్తి అనే అంశాలు కలగలసి సినిమా స్కోపుకి స్పాన్‌ని బాగా పెంచాయి.
 
పదహారు మంది వివిధ రాష్ట్రాల అమ్మాయిలు, వివిధ ఆకారాలు, ఆహారాలు, అలవాట్లు, భాషలు, అభిప్రాయాలు ఉన్నవాళ్లు - ఒకసారి జీవితంలో దారుణంగా ఓడిపోయిన మనిషి గెడైన్స్‌లో గెలవడానికి కష్ట పడడమే ఈ చిత్ర కథ. మూడు కొప్పులు ఒక దగ్గరుంటే ప్రళయం అన్న నానుడిని తుడిచి పెట్టేలా పదహారు కొప్పులు కలిసి ప్రపంచ కప్పుని గెలిచి, భారత జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగిరేలా చేయడం చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.
 
సిక్కు జవాన్లు శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు అడవి దారిలో, జలాశయాలు దాటడానికి పెద్ద పెద్ద దుంగల్ని మోయాల్సి వస్తుంది. ఆ సమయంలో ఇన్‌స్పిరేషన్ కోసం అరిచే అరుపు ‘చక్ దే’. ప్రపంచకప్పు బ్రిడ్జి దూలాల కన్నా పెనుభారం. దేశ గౌరవం పెంచడం ప్రపంచకప్పు గెలవడం కన్నా బరువైనది. అందుకే అంత కష్టమైన పనిని క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా పదహారు మంది అమ్మాయిలు నెరవేర్చాలి కాబట్టి ఈ చిత్రానికి ‘చక్ దే ఇండియా’ అని టైటిల్ పెట్టారు.
 
ఇందులో ఆడవారి మధ్య సహజంగా ఉండే ఈర్ష్య, అసూయలు ఉంటాయి. పోలికలు ఉంటాయి. అన్ని సహజమైన కథావస్తువులతో పాటు మామూలు మనిషిని, నిద్రాణమైన జాతిని, నిస్తేజమైన జీవితాల్ని, ఉత్తేజితుల్ని, చైతన్యవంతుల్ని చేసే పవర్‌ఫుల్ స్ఫూర్తి... ప్రధాన కథావస్తువుగా ఉంటుంది. ఈ చిత్రం సూపర్‌హిట్ అవ్వడానికి ఇదే కారణం. మిగిలిన హంగులన్నీ అందంగా అద్దిన అలంకారాలే. మిలీనియమ్‌లో ఇలాంటి కథలు ప్రేక్షకులకే కాదు, సమాజానికే ప్రేరణ.

ఇది ఒక స్పోర్ట్స్ మూవీ కాదు. స్పోర్టివ్ స్పిరిట్‌కి సంబంధించిన మూవీ. ‘దిల్‌వాలే దుల్హనియా’ చిత్రంలో యువతని ప్రేమ మత్తులో ముంచిన ఆదిత్యచోప్రా తానే కనిపెట్టిన విరుగుడు మందు... ‘చక్ దే ఇండియా’ చిత్రం. ‘లగాన్’ జరిగిపోయిన కథ. చరిత్ర. ‘చక్ దే’ నడుస్తున్న వర్తమానం. ఇది మనం వెళ్తున్న దారి. చేరాల్సిన గమ్యం.
 
స్త్రీకి, పురుషుడికి మధ్య సున్నితమైన ఇగోయిస్టిక్ తేడాని... సక్సెస్, కెరీర్, డ్రీమ్, గోల్ లాంటి వాటిని... హాకీకి క్రికెట్‌కి మధ్య ఉన్న ఇగోని కలిపి ప్రీతి అనే అమ్మాయి ప్రేమకథలో మిళితం చేయడం అద్భుతమైన ఆలోచన. ఈ ఒక్క కథే పది వాల్యూమ్స్ గ్రంథం. అది మాత్రమే కాదు. ప్రతి సీన్‌లోనూ ఎంతో జాగ్రత్త, పకడ్బందీ అల్లిక కనిపిస్తుంది.
 
‘చక్ దే ఇండియన్ సినిమా.’ చేతనైతే ప్రేరణని కమర్షియల్ కథావస్తువుగా చేద్దాం. ప్రేరణ, స్ఫూర్తి లాంటి మంచి అంశాలు... దురదృష్టవశాత్తూ అవార్డు చిత్రాల కథావస్తువులు మాత్రమే. దాన్ని మార్చడానికి ప్రయత్నించి, ఈ చిత్రాన్ని నిర్మించిన ఆదిత్యచోప్రాకి శత సహస్ర శుభాభినందనలు. ఆయన ప్రయత్నానికి అందమైన రూపమిచ్చిన దర్శకుడికి హ్యాట్సాఫ్!                              - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement