Chak De India
-
ప్రియుడిని పెళ్లాడిన బాలీవుడ్ నటి.. ఫోటోలు వైరల్
బాలీవుడ్లో ఇప్పుడంతా పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నట్లు కనిపిస్తుంది. బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేసి వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తాజాగా 'చక్‌దే ఇండియా'ఫేం తాన్యా అబ్రోల్ బాయ్‌ఫ్రెండ్‌ని పెళ్లాడింది. ఇరు కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం చంఢీగర్‌లో ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ కాగా పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్ల నుంచి నూతన జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఓ పార్టీలో కలిసిన తాన్యా-ఆశిష్‌లు గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నారు. తమ రిలేషన్షిప్ గురించి తాన్యా ఓ సందర్భంలో మాట్లాడుతూ.. 'ఆశిష్ నాకు చాలా మంచి ఫ్రెండ్. కానీ తను ఇంట్రోవర్ట్. ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. దీంతో తన మనసులో ఏముందో తెలుసుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఓసారి తెలిసిన అబ్బాయితో డేట్‌కు వెళ్తున్నా అని చెప్పగానే ఆశిష్ ముఖం మాడిపోయింది. నిజంగానే వెళ్తున్నావా? నువ్వు ఎక్కడికీ వెళ్లకు. మనం ఇద్దరం డేట్‌కు వెళదాం అంటూ క్యూట్‌గా ప్రపోజ్ చేశాడు. అప్పటి నుంచి మా ప్రేమ ప్రయాణం పెళ్లిదాకా వచ్చింది' అంటూ తాన్యా చెప్పుకొచ్చింది. కాగా తాన్యా 'చక్ దే ఇండియా' సినిమాతో పాపులర్ అయ్యింది. రీసెంట్‌గానే ఈ సినిమాలోని చిత్రాశి రావత్ కూడా తన బాయ్ ఫ్రెండ్, నటుడు ధ్రువ్ ఆదిత్యతో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. -
ప్రియుడిని పెళ్లాడిన నటి, ఫోటోలు వైరల్
బాలీవుడ్ నటి చిత్రాశి రావత్ పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు, నటుడు, వాయిస్ ఆర్టిస్ట్ ధృవాదిత్య భగ్వనానీని పెళ్లాడింది. ఛత్తీస్‌ఘడ్‌లో శనివారం ఘనంగా జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు హాజరయ్యారు. సోషల్ మీడియా ద్వారా తన పెళ్లి సందడిని అభిమానులతో పంచుకుంటోంది నటి. ప్రస్తుతం వీరి హల్దీ, మెహందీ, పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా చిత్రాశి రావత్ షారుక్ ఖాన్ 'చక్ దే ఇండియా' సినిమాలో హాకీ ప్లేయర్ కోమల్గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఆమె తన పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన ధ్రువ్‌తో బిలాస్పూర్లో మా పెళ్లి జరగబోతోంది. డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకని సింపుల్‌గా పెళ్లి చేసుకుందామనుకుంటున్నాం అని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by VidyaMMalavade (@vidyamalavade) చదవండి: కె.విశ్వనాథ్‌కు అది చాలా సెంటిమెంట్ -
ఆటలతో ఆకట్టుకున్న హిట్ సినిమాలివే!
కోడి రామ్మూర్తి బయోపిక్ రానుంది. పి.వి.సింధు ఆటను బిగ్ స్క్రీన్ మీద చూస్తాం. పుల్లెల గోపిచంద్ బయోపిక్‌లో ఆయన్ను పోలిన నటుడు ఎవరో? ఆటను సినిమాగా చెప్పడం కూడా పెద్ద ఆట. బాల్ వెళ్లి సూటిగా తాకినట్టుగా ప్రేక్షకుడికి తాకితేనే హిట్టు. లేకుంటే అంతే. చాలాకాలం స్పోర్ట్స్‌ను పట్టించుకోని ఇండియన్ సినిమా నేడు వరుస పెట్టి స్పోర్ట్స్ మూవీలు తీస్తోంది. ఒలింపిక్స్ ఇచ్చే ఉత్సాహంతో మరిన్ని తీయనుంది కూడా. అసలు ఇంతకు ముందు ఏం స్పోర్ట్స్ మూవీస్ వచ్చాయి.. ఇక మీదట ఏం రానున్నాయి మనకు తెలియాలి... ఎస్... తెలియాలి... జమీందారు కూతురైన హీరోయిన్– బంగ్లా లాన్లో బాడ్మింటన్ బ్యాట్ పట్టుకుని, ఫ్రెండ్స్‌తో రెండు బాల్స్ ఆడి, అప్పుడే కారులో వచ్చిన తండ్రి వైపు పరిగెత్తుకుంటూ వచ్చి ‘డాడీ’ అనడం వరకే మన సినిమాల్లో ఆటలు కనిపించేవి. సినిమాలో ఆట ఎప్పుడైనా ఒక భాగమే తప్ప ఆటే సినిమా కావడం ఏమిటి ఎవరు చూస్తారు అని మన వాళ్లు ఆ జానర్‌ని ఔట్ చేసి కోర్ట్ బయట ఎప్పుడో కూచోబెట్టారు. కాని ఆ రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు ఆటే కథ. ఆటే క్లయిమాక్స్. ఆటే హీరో. ఆటగాడే హీరో. నీవు లేని నేను లేను శోభన్‌బాబు నటించిన ‘మంచి మనుషులు’లో స్కేటింగ్ కనిపిస్తుంది. ఆ తర్వాత ‘గంగ–మంగ’ సినిమాలో శోభన్‌బాబు, వాణిశ్రీ ‘గాలిలో పైరగాలిలో’ అని పాట స్కేటింగ్ చేస్తారు. ‘గండికోట రహస్యం’ సినిమాలో ఎన్.టి.ఆర్ కబడ్డీ ఆడటం, ‘యుగపురుషుడు’లో కరాటే చేయడం తప్ప ఆటల ప్రస్తావన మనకు లేదు. విలువిద్య ఉంది కాని సినిమా విలువిద్యలో ఒకరు ఆగ్నేయాస్త్రం వేస్తే ఒకరు వరుణాస్త్రం వేస్తారు. రెండు ఆకాశంలో గంటసేపు ప్రయాణించి ఢీకొంటాయి. ఇలాంటివి ఒలింపిక్స్ వారు ఒప్పుకోరు. కాలం మారి చిరంజీవి వచ్చి ‘ఇంటిగుట్టు’లో మిక్స్డ్ కబడ్డీ ఆడాడు నళినితో. ఆ తర్వాత ‘విజేత’లో ఫుట్‌బాల్ గోల్ కీపర్‌గా కనిపించాడు. మెల్లగా ఆటల బంతి దొర్లడం మొదలెట్టింది. ఆట మార్చిన అశ్వని 1991లో తెలుగులో ‘అశ్వని’ వచ్చింది. జాతీయ స్థాయిలో పరుగుల రాణిగా నిలిచిన అశ్వని నాచప్ప జీవితం స్ఫూర్తితో ఆమెనే హీరోయిన్గా పెట్టి ‘ఉషాకిరణ్ మూవీస్’ తీసిన ఈ సినిమా ఒక సంచలనం అని చెప్పాలి తెలుగులో. ఒక పేదింటి అమ్మాయి కూడా క్రీడాకారిణి కావచ్చు అని చెప్పిన కథ ఇది. ఆట నేపథ్యంలో పూర్తి సినిమా తీయవచ్చని నిరూపించింది. కాని ఆ స్థాయి కథ లేదా ఆ వాతావరణం ఏర్పడలేక పోయింది. పవన్ కల్యాణ్ ‘తమ్ముడు’ ఆ తర్వాత కిక్ బాక్సింగ్‌ని నేపథ్యంగా తీసుకుంది. పూరి జగన్నాథ్ వచ్చి ‘అమ్మా నాన్న తమిళమ్మాయి’లో కూడా అదే కిక్ బాక్సింగ్‌ని తీసుకున్నాడు. హీరో పంచ్ విసిరే ఆటలే ఆటలుగా మనకు ఉన్నాయి. ఎందుకంటే ఈత కొట్టే హీరో కంటే పంచ్ కొట్టే హీరోకు హిట్ కొట్టే చాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొండారెడ్డి బురుజు దగ్గర ‘ఒక్కడు’ 2003లో వచ్చిన ‘ఒక్కడు’ సినిమా ఒక సూపర్ డూపర్ హిట్ కథకు ఆటను నేపథ్యంగా తీసుకోవచ్చని మరోసారి గట్టిగా ఇండస్ట్రీకి చెప్పింది. ఇందులో మహేశ్ బాబు కబడ్డీ ప్లేయర్‌గా కనిపిస్తాడు. దీనికి కొద్దిగా ముందు వచ్చిన శ్రీహరి ‘భద్రాచలం’ తైక్వాన్డును కథగా తీసుకున్నప్పటికీ పూర్తి విజయం మాత్రం ‘ఒక్కడు’ సొంతం చేసుకుంది. ఆ తర్వాత రెగ్యులర్‌గానే స్పోర్ట్స్ కథలు కనిపిస్తూ వచ్చాయి. ‘బీమిలి కబడ్డీ జట్టు’ (కబడ్డీ), ‘గోల్కొండ్ హైస్కూల్’ (క్రికెట్), ప్రకాష్ రాజ్ ‘ధోని’ (క్రికెట్), ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ (అథ్లెట్), ‘సై’ (రగ్బీ)... ఇవన్నీ ఆటలను చూపినవే. హీరో నాని క్రికెట్ నేపథ్యంలో ‘జెర్సీ’ చేసి పెద్ద హిట్ అందుకుంటే నాగ చైతన్య కూడా అదే క్రికెట్ నేపథ్యంలో ‘మజిలీ’ చేసి విజయం సాధించాడు. విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రెడ్’లో క్రికెట్, సందీప్ కిషన్ ‘ఏ1ఎక్స్‌ప్రెస్’లో హాకీ ఆటలు ప్రేక్షకుల్ని గ్రౌండ్స్‌లోకి తీసుకెళ్లాయి. అన్నింటికి మించి మహిళా బాక్సింగ్‌ను తీసుకుని వెంకటేశ్ హీరోగా, రితికా మోహన్ సింగ్ హీరోయిన్గా వచ్చిన ‘గురు’, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్గా మహిళా క్రికెట్‌ను తీసుకుని వచ్చిన ‘కౌసల్యా క్రిష్ణమూర్తి’, మహిళా ఫుట్‌బాల్‌ను తీసుకుని విజయ్ హీరోగా వచ్చిన ‘బిగిల్’ క్రీడల్లోనే కాదు సినిమాల్లో కూడా మహిళల విజయాన్ని చూపించాయి. వరుస కట్టిన సినిమాలు ఇక మీదట కూడ బోలెడు స్పోర్ట్స్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ రానుంది. కీర్తి సురేశ్ హీరోయిన్గా ‘గుడ్‌లక్ సఖీ’ (షూటింగ్), నాగ శౌర్య హీరోగా ‘లక్ష్య’ (విలువిద్య) రానున్నాయి. ఇవి కాకుండా కోడి రామ్మూర్తి, పి.వి.సింధు, పుల్లెల గోపీచంద్, కరణం మల్లీశ్వరి, విశ్వనాథన్ ఆనంద్‌ల బయోపిక్‌లు వరుసలో ఉన్నాయి. ఇక తమిళం నుంచి డబ్ అయిన తాజా సినిమా ‘సార్పట్టా’ కాలం వెనక్కు వెళ్లి మన దేశీయులు ఆడిన బాక్సింగ్‌లో పల్లె పౌరుషాలు పట్టుదలలు ఏ విధంగా ఉంటుందో చూపింది. అసలు గతాన్ని తవ్వుకుంటూ వెళితే ఎన్ని స్పోర్ట్స్ డ్రామాలు దొరుకుతాయో కదా. ఓడటం తెలిసినవాడే గెలవడం నేరుస్తాడు. ఆటల్లో ఉంటేనే ఓడటం గెలవడం ఓడినా గెలిచినా సాధన కొనసాగించడం తెలుస్తాయి. మనిషిని మానసికంగా శారీరకంగా తీర్చిదిద్దడంలో ఆటను మించింది లేదు. ఆటలో ఉండే ఉద్వేగం కూడా మనిషిని ఆకర్షిస్తుంది. సెల్‌ఫోన్‌ను అంటుకుపోతున్న నేటి తరాన్ని క్రీడామైదానం వైపు తరమాలంటే బయట, బడులలో, సినిమాల్లో ఎంత క్రీడా వాతావరణం కనిపిస్తే అంత మేలు. క్రీడలకు జయం. ఒలింపిక్స్‌లో ఉన్న భారతీయులకు జయం. ఈ ఒలింపిక్స్ జరిగినన్నాళ్లు అంతటా క్రీడా వాతావరణమే ఉంటుంది. ఒకవైపు ఆటలూ చూడొచ్చు. చూడని స్పోర్ట్స్ సినిమాలనూ చూడొచ్చు. నిజంగా ఇది క్రీడా వీక్షణ సమయమే. ‘లగాన్’ నుంచి సిక్సర్లే 2001లో ఏ ముహూర్తాన బాలీవుడ్లో ‘లగాన్’ వచ్చిందో అక్కడ స్పోర్ట్స్ సినిమాలు హిట్ మీద హిట్ కొడుతూనే ఉన్నాయి. బ్రిటిష్ కాలమేంటి... అక్కడ పన్ను పెంచడమేంటి... దానిని ఎదుర్కొనడానికి పల్లెటూరివాళ్లు బ్రిటిష్ వారితో క్రికెట్ ఆడటం ఏంటి... అసలా కథను తీయడం ఎలా సాధ్యం. దర్శకుడు అశితోష్ గొవారికర్ తీశాడు. సినిమా దేశాన్నే కాదు ప్రపంచాన్నే ఆకర్షించింది. మన తెలుగువాడు నగేశ్ కుకునూర్ మూగ, చెవిటి ఆటగాడి కథను తీసుకుని అద్భుతంగా తీసిన ‘ఇక్బాల్’ ఒక గ్రామీణ క్రికెట్ బౌలర్ కథను చెప్పింది. ఆ తర్వాత మహిళా హాకీని తీసుకు షారూక్ ఖాన్ ‘చక్‌దే ఇండియా’ తీస్తే సూపర్‌డూపర్ హిట్ అయ్యింది. వయసు మీరిన కోచ్ పాత్రలో షారూక్ కనిపించడానికి సిద్ధమయ్యి మరీ హిట్ కొట్టాడు. పరుగుల నేపథ్యంలో ఇర్ఫాన్ ఖాన్ హీరోగా ‘పాన్‌సింగ్ తోమార్’, మిల్కా సింగ్ ఆత్మ కథ ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీ కోమ్’, ‘ధోని’, ‘సైనా’, ‘సుల్తాన్’... ఇవన్నీ ఉద్వేగపూరిత క్రీడా అనుభవాన్ని ఇచ్చాయి. మహిళా కుస్తీ నేపథ్యంలో ఆమిర్ ఖాన్ ‘దంగల్’ రికార్డుల చరిత్రను తిరగరాసింది. ఇక 1983 వరల్డ్ కప్ నేపథ్యలో ‘1983’ రానుంది. ఫర్హాన్ ఖాన్ బాక్సర్‌గా ‘తూఫాన్’ తాజాగా విడుదలైంది. మిథాలి రాజ్ బయోపిక్ ‘శభాష్ మితూ’ వరుసలో ఉంది. ‘మైదాన్’ (ఫుట్‌బాల్) కూడా. -
అప్పుడు హాకీ.. ఇప్పుడు ఫుట్‌బాల్
దాదాపు పదేళ్ల కిత్రం బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హాకీ టీమ్ కోచ్‌గా నటించిన చిత్రం ‘చక్ దే ఇండియా’. ఆ టీమ్‌లో సెంటర్ ఫార్వార్డ్ ప్లేయర్ ప్రీతీ సబర్వాల్ గా నటించారు సాగరిక ఘాట్జే. ఇంతకీ ఈమె ఎవరో తెలుసు కదా. ఫేమస్ క్రికెట్ ప్లేయర్ జహీర్ ఖాన్ సతీమణి. ఇప్పుడు సాగరిక గురించి ఎందుకంటే.. అప్పుడు హాకీ ప్లేయర్‌గా నటించిన ఆమె ఇప్పుడు ‘మాన్సూన్ ఫుట్‌బాల్’ చిత్రంలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా నటించనున్నారు. మిలింద్ ఉకే దర్శకత్వం వహించనున్నారు. జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. కొందరు హౌస్‌వైఫ్‌లు కలిసి ఓ ఫుట్‌బాల్ టీమ్‌గా ఏర్పడే కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. -
ప్రతి మదిలో రగిలిన క్రీడాస్ఫూర్తి!
దేడ్ కహానీ - చక్ దే ఇండియా నిద్రాణమైన జాతిని, నిస్తేజమైన జీవితాల్ని ఉత్తేజితుల్ని, చైతన్యవంతుల్ని చేసిన చిత్రమిది. అందుకే సూపర్‌హిట్ అయ్యింది. మిలీనియమ్‌లో వచ్చిన చిత్రాల్లో మణిపూసలా నిలిచింది. ప్రేక్షకులకే కాదు... యావత్ సమాజానికే ప్రేరణనిచ్చింది. హాకీ మ్యాచ్ చూడ్డానికి బోరు. అందులోనూ మహిళల హాకీ. మ్యాచ్ అసలు ఎక్కడాడతారో, ఎప్పుడు జరుగుతాయో కూడా తెలీదు. ఇది సగటు భారతీయుడిగా నా నాలెడ్జ్, నా ఇంటరెస్ట్. 1983 నుంచి ఇండియాలో మగాళ్ల ఆట అంటే క్రికెట్టే. 1990ల నుంచి ప్రపంచంలో ఆడవాళ్ల ఆట అంటే టెన్నిస్సే. వేరే ఆటలుంటాయని, అవి కూడా ఆడుతుంటారని అప్పుడప్పుడూ కామన్వెల్త్, ఆసియా గేమ్స్, ఒలింపిక్స్ లాంటివి జరిగినప్పుడు న్యూస్పేపర్లో చదవడం... ఏ దేశానికెన్ని పతకాలు వచ్చాయో పట్టీ మాత్రం చూసేసి, ఇండియాని తక్కువ స్థానంలో చూడడం, ఆ తక్కువ పతకాలు తెచ్చిన ఆటగాళ్లని కూడా తక్కువ చేసి చూడడం అలవాటై పోయింది. అలా ఎదిగేశాం. అలాగే అన్ని ఆటల్నీ వదిలేశాం. ఇలాంటి భావ సంచయం ఉన్న నాలాంటి ప్రేక్షకుడు, అందులోనూ క్రికెట్ మతం పుచ్చుకున్న ఉన్మాది... హాకీ ఆటే ప్రధానంగా తీసిన సినిమా చూడ్డానికి ఏ మాత్రమైనా ఆసక్తి చూపిస్తాడా? అయినా నేను ‘చక్ దే ఇండియా’ సినిమా చూడ్డానికి వెళ్లాను. దానికి కారణం... అది యశ్‌రాజ్ ఫిలిమ్స్వాళ్లు షారుఖ్‌ఖాన్ హీరోగా, ఆదిత్యచోప్రా నిర్మాతగా, షిమిత్ అమీన్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ తీయడమే. అయితే సినిమా మాత్రం భారత హాకీ టీమ్‌కి సంబంధించి నది కాబట్టి కాస్త అయిష్టంగానే వెళ్లాను. ‘లగాన్’ చూసిన కళ్లతో హాకీ ఆటని చూడగలనా? అనుకున్నాను. అప్పటికి నాకు 33 ఏళ్లు. జీవితంలో ఎప్పుడూ ఒక్క హాకీ మ్యాచ్ చూసిన పాపాన పోలేదు. అందుకే ఆ సినిమాను చూడ్డానికి అంత కష్టంగా వెళ్లాను. కానీ ‘చక్ దే ఇండియా’ సినిమా చూశాక మాత్రం... జీవితాంతం హాకీ మ్యాచెస్‌ని వదలకుండా చూసి తీరాలని గట్టిగా నిశ్చయించుకున్నాను. భారతదేశ పురుషాహంకార సమాజంలో ఆడవారు ఆటుపోట్లు ఎదుర్కోవడానికే గానీ ఆటలాడడానికి పనికి రారు అన్న భావన చాలామందిలో ఉంది. అందరూ పిచ్చిగా అభిమానించే క్రికెట్లోనే మహిళల క్రికెట్‌కి ఆదరణ లేని భారతీయ సమాజంలో... ఇతర ఆటలకి విలువ, ఆ ఆటగాళ్లకి గుర్తింపు లేని రోజుల్లో... ఆడవాళ్ల హాకీని ప్రధానంగా చూపిస్తూ ‘చక్ దే ఇండియా’ తీశారు. ఆ ఆటను ఎవ్వరూ ఎలా పట్టించుకోవడం లేదో, అదే కథగా తీసి చూపించారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ కొన్ని పాత్రల్లో ఎంతో బాగా ఇమిడిపోతాడు. అలా అతడు అద్భుతంగా ఇమిడిపోయిన వాటిలో మొదటిది ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ అయితే, రెండోది ‘చక్ దే ఇండియా’నే. మన జాతీయ క్రీడ హాకీ. కానీ దానికి మన దేశంలోనే ఆదరణ కరువైపోయింది. ఆ నిరాదరణ మహిళల హాకీని పూర్తిగా చంపేయబోయింది. అలాంటి సమయంలో హాకీ సమాఖ్య... ఒక భారత పురుషుల హాకీ టీమ్ మాజీ కెప్టెన్‌ని మహిళల టీమ్‌కి కోచ్‌గా నియమిస్తుంది. అతని పేరు కబీర్‌ఖాన్. కబీర్‌ఖాన్ ఇస్లాం మతస్థుడు. భారత హాకీ కెప్టెన్‌గా ప్రపంచ కప్ ఫైనల్లో పెనాల్టీ కార్నర్ గోల్‌గా మలచలేక విఫలమౌతాడు. దాంతో పాకిస్థాన్ గెలుస్తుంది. కబీర్‌ఖాన్ పాక్ ఆటగాళ్లని కంగ్రాట్యులేట్ చేస్తాడు. అది ఓ జర్నలిస్టు ఫొటో తీసి కబీర్ఖాన్ని దేశద్రోహిగా, పాకిస్థాన్‌కి అమ్ముడు పోయినవాడిగా చిత్రీకరిస్తాడు. దాంతో కబీర్‌ఖాన్ ఇల్లు వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. మళ్లీ ఏడేళ్ల తర్వాత ఒక పాత మిత్రుడి ప్రోత్సాహంతో హాకీ ఆటకు చేరువవు తాడు కబీర్. భారత మహిళల హాకీ టీమ్‌ని ప్రపంచకప్‌కి పంపించే ముందు కోచ్‌గా ఎవ్వరూ ముందుకు రాని సమయంలో... తన దేశభక్తిని నిరూ పించుకునే అవకాశంగా దాన్ని భావించి, కోచ్ పదవిని చేపడతాడు కబీర్‌ఖాన్. పదహారు మంది మహిళలున్న భారత హాకీ జట్టును ముందుకు నడిపించే బాధ్యతను నెత్తిన వేసుకుంటాడు. ప్రపంచకప్ గెలిపించి మహిళల హాకీకి పునరుజ్జీవనం తేవడంతో పాటు తన మీదున్న మచ్చని పోగొట్టుకుంటాడు. కథ కంచికి, కబీర్‌ఖాన్ సొంత ఇంటికి చేరుకోవడంతో సుఖాంతమవుతుంది. జైదీప్ సాహ్ని అనే కథ, స్క్రీన్‌ప్లే, మాటల రచయిత 2002లో కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల హాకీ టీమ్ గెలిచిందన్న చిన్న ఆర్టికల్‌ను చదివాడు. ఆ నేపథ్యంలో సినిమా చేయాలనుకుని మహరాజ్ కృష్ణన్ కౌశిక్ అనే అప్పటి కోచ్‌ని కలిసి తాను అనుకున్న కథ చెప్పార్ట. ఆయన... 1982 ఏషియన్ గేమ్స్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయిన మీర్ రంజన్ నేగి అనే హాకీ ప్లేయర్‌ని పరిచయం చేశాడు. తన వల్లే పాక్ చేతిలో భారత్ ఓడిపోయిందని ఆరోపణలు ఎదుర్కొన్నాడు మీర్. అలా ఒక విన్నింగ్, ఇన్స్పిరేషన్ కథలో ఒక దేశద్రోహం, దేశభక్తి అనే అంశాలు కలగలసి సినిమా స్కోపుకి స్పాన్‌ని బాగా పెంచాయి. పదహారు మంది వివిధ రాష్ట్రాల అమ్మాయిలు, వివిధ ఆకారాలు, ఆహారాలు, అలవాట్లు, భాషలు, అభిప్రాయాలు ఉన్నవాళ్లు - ఒకసారి జీవితంలో దారుణంగా ఓడిపోయిన మనిషి గెడైన్స్‌లో గెలవడానికి కష్ట పడడమే ఈ చిత్ర కథ. మూడు కొప్పులు ఒక దగ్గరుంటే ప్రళయం అన్న నానుడిని తుడిచి పెట్టేలా పదహారు కొప్పులు కలిసి ప్రపంచ కప్పుని గెలిచి, భారత జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగిరేలా చేయడం చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సిక్కు జవాన్లు శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు అడవి దారిలో, జలాశయాలు దాటడానికి పెద్ద పెద్ద దుంగల్ని మోయాల్సి వస్తుంది. ఆ సమయంలో ఇన్స్పిరేషన్ కోసం అరిచే అరుపు ‘చక్ దే’. ప్రపంచకప్పు బ్రిడ్జి దూలాల కన్నా పెనుభారం. దేశ గౌరవం పెంచడం ప్రపంచకప్పు గెలవడం కన్నా బరువైనది. అందుకే అంత కష్టమైన పనిని క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా పదహారు మంది అమ్మాయిలు నెరవేర్చాలి కాబట్టి ఈ చిత్రానికి ‘చక్ దే ఇండియా’ అని టైటిల్ పెట్టారు. ఇందులో ఆడవారి మధ్య సహజంగా ఉండే ఈర్ష్య, అసూయలు ఉంటాయి. పోలికలు ఉంటాయి. అన్ని సహజమైన కథావస్తువులతో పాటు మామూలు మనిషిని, నిద్రాణమైన జాతిని, నిస్తేజమైన జీవితాల్ని, ఉత్తేజితుల్ని, చైతన్యవంతుల్ని చేసే పవర్ఫుల్ స్ఫూర్తి... ప్రధాన కథావస్తువుగా ఉంటుంది. ఈ చిత్రం సూపర్‌హిట్ అవ్వడానికి ఇదే కారణం. మిగిలిన హంగులన్నీ అందంగా అద్దిన అలంకారాలే. మిలీనియమ్‌లో ఇలాంటి కథలు ప్రేక్షకులకే కాదు, సమాజానికే ప్రేరణ. ఇది ఒక స్పోర్ట్స్ మూవీ కాదు. స్పోర్టివ్ స్పిరిట్‌కి సంబంధించిన మూవీ. ‘దిల్వాలే దుల్హనియా’ చిత్రంలో యువతని ప్రేమ మత్తులో ముంచిన ఆదిత్యచోప్రా తానే కనిపెట్టిన విరుగుడు మందు... ‘చక్ దే ఇండియా’ చిత్రం. ‘లగాన్’ జరిగిపోయిన కథ. చరిత్ర. ‘చక్ దే’ నడుస్తున్న వర్తమానం. ఇది మనం వెళ్తున్న దారి. చేరాల్సిన గమ్యం. స్త్రీకి, పురుషుడికి మధ్య సున్నితమైన ఇగోయిస్టిక్ తేడాని... సక్సెస్, కెరీర్, డ్రీమ్, గోల్ లాంటి వాటిని... హాకీకి క్రికెట్‌కి మధ్య ఉన్న ఇగోని కలిపి ప్రీతి అనే అమ్మాయి ప్రేమకథలో మిళితం చేయడం అద్భుతమైన ఆలోచన. ఈ ఒక్క కథే పది వాల్యూమ్స్ గ్రంథం. అది మాత్రమే కాదు. ప్రతి సీన్లోనూ ఎంతో జాగ్రత్త, పకడ్బందీ అల్లిక కనిపిస్తుంది. ‘చక్ దే ఇండియన్ సినిమా.’ చేతనైతే ప్రేరణని కమర్షియల్ కథావస్తువుగా చేద్దాం. ప్రేరణ, స్ఫూర్తి లాంటి మంచి అంశాలు... దురదృష్టవశాత్తూ అవార్డు చిత్రాల కథావస్తువులు మాత్రమే. దాన్ని మార్చడానికి ప్రయత్నించి, ఈ చిత్రాన్ని నిర్మించిన ఆదిత్యచోప్రాకి శత సహస్ర శుభాభినందనలు. ఆయన ప్రయత్నానికి అందమైన రూపమిచ్చిన దర్శకుడికి హ్యాట్సాఫ్! - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు