ఆటలతో ఆకట్టుకున్న హిట్‌ సినిమాలివే! | Sports Movies About Film Industry in India | Sakshi
Sakshi News home page

Sports Moives: సూపర్‌ సక్సెస్‌ అయిన స్పోర్ట్స్‌ మూవీస్‌ ఇవే!

Published Sun, Jul 25 2021 1:08 AM | Last Updated on Wed, Mar 2 2022 7:01 PM

Sports Movies About Film Industry in India - Sakshi

కోడి రామ్మూర్తి బయోపిక్‌ రానుంది. పి.వి.సింధు ఆటను బిగ్‌ స్క్రీన్‌ మీద చూస్తాం. పుల్లెల గోపిచంద్‌ బయోపిక్‌లో ఆయన్ను పోలిన నటుడు ఎవరో? ఆటను సినిమాగా చెప్పడం కూడా పెద్ద ఆట. బాల్‌ వెళ్లి సూటిగా తాకినట్టుగా ప్రేక్షకుడికి తాకితేనే హిట్టు. లేకుంటే అంతే. చాలాకాలం స్పోర్ట్స్‌ను పట్టించుకోని ఇండియన్‌ సినిమా నేడు వరుస పెట్టి స్పోర్ట్స్‌ మూవీలు తీస్తోంది. ఒలింపిక్స్‌ ఇచ్చే ఉత్సాహంతో మరిన్ని తీయనుంది కూడా. అసలు ఇంతకు ముందు ఏం స్పోర్ట్స్‌ మూవీస్‌ వచ్చాయి.. ఇక మీదట ఏం రానున్నాయి మనకు తెలియాలి...

ఎస్‌... తెలియాలి...
జమీందారు కూతురైన హీరోయిన్‌– బంగ్లా లాన్‌లో బాడ్మింటన్‌ బ్యాట్‌ పట్టుకుని, ఫ్రెండ్స్‌తో రెండు బాల్స్‌ ఆడి, అప్పుడే కారులో వచ్చిన తండ్రి వైపు పరిగెత్తుకుంటూ వచ్చి ‘డాడీ’ అనడం వరకే మన సినిమాల్లో ఆటలు కనిపించేవి. సినిమాలో ఆట ఎప్పుడైనా ఒక భాగమే తప్ప ఆటే సినిమా కావడం ఏమిటి ఎవరు చూస్తారు అని మన వాళ్లు ఆ జానర్‌ని ఔట్‌ చేసి కోర్ట్‌ బయట ఎప్పుడో కూచోబెట్టారు. కాని ఆ రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు ఆటే కథ. ఆటే క్లయిమాక్స్‌. ఆటే హీరో. ఆటగాడే హీరో.

నీవు లేని నేను లేను
శోభన్‌బాబు నటించిన ‘మంచి మనుషులు’లో స్కేటింగ్‌ కనిపిస్తుంది. ఆ తర్వాత ‘గంగ–మంగ’ సినిమాలో శోభన్‌బాబు, వాణిశ్రీ ‘గాలిలో పైరగాలిలో’ అని పాట స్కేటింగ్‌ చేస్తారు. ‘గండికోట రహస్యం’ సినిమాలో ఎన్‌.టి.ఆర్‌ కబడ్డీ ఆడటం, ‘యుగపురుషుడు’లో కరాటే చేయడం తప్ప ఆటల ప్రస్తావన మనకు లేదు. విలువిద్య ఉంది కాని సినిమా విలువిద్యలో ఒకరు ఆగ్నేయాస్త్రం వేస్తే ఒకరు వరుణాస్త్రం వేస్తారు. రెండు ఆకాశంలో గంటసేపు ప్రయాణించి ఢీకొంటాయి. ఇలాంటివి ఒలింపిక్స్‌ వారు ఒప్పుకోరు. కాలం మారి చిరంజీవి వచ్చి ‘ఇంటిగుట్టు’లో మిక్స్‌డ్‌ కబడ్డీ ఆడాడు నళినితో. ఆ తర్వాత ‘విజేత’లో ఫుట్‌బాల్‌ గోల్‌ కీపర్‌గా కనిపించాడు. మెల్లగా ఆటల బంతి దొర్లడం మొదలెట్టింది.

ఆట మార్చిన అశ్వని
1991లో తెలుగులో ‘అశ్వని’ వచ్చింది. జాతీయ స్థాయిలో పరుగుల రాణిగా నిలిచిన అశ్వని నాచప్ప జీవితం స్ఫూర్తితో ఆమెనే హీరోయిన్‌గా పెట్టి ‘ఉషాకిరణ్‌ మూవీస్‌’ తీసిన ఈ సినిమా ఒక సంచలనం అని చెప్పాలి తెలుగులో. ఒక పేదింటి అమ్మాయి కూడా క్రీడాకారిణి కావచ్చు అని చెప్పిన కథ ఇది. ఆట నేపథ్యంలో పూర్తి సినిమా తీయవచ్చని నిరూపించింది. కాని ఆ స్థాయి కథ లేదా ఆ వాతావరణం ఏర్పడలేక పోయింది. పవన్‌ కల్యాణ్‌ ‘తమ్ముడు’ ఆ తర్వాత కిక్‌ బాక్సింగ్‌ని నేపథ్యంగా తీసుకుంది. పూరి జగన్నాథ్‌ వచ్చి ‘అమ్మా నాన్న తమిళమ్మాయి’లో కూడా అదే కిక్‌ బాక్సింగ్‌ని తీసుకున్నాడు. హీరో పంచ్‌ విసిరే ఆటలే ఆటలుగా మనకు ఉన్నాయి. ఎందుకంటే ఈత కొట్టే హీరో కంటే పంచ్‌ కొట్టే హీరోకు హిట్‌ కొట్టే చాన్సెస్‌ ఎక్కువ ఉంటాయి.

కొండారెడ్డి బురుజు దగ్గర ‘ఒక్కడు’
2003లో వచ్చిన ‘ఒక్కడు’ సినిమా ఒక సూపర్‌ డూపర్‌ హిట్‌ కథకు ఆటను నేపథ్యంగా తీసుకోవచ్చని మరోసారి గట్టిగా ఇండస్ట్రీకి చెప్పింది. ఇందులో మహేశ్‌ బాబు కబడ్డీ ప్లేయర్‌గా కనిపిస్తాడు. దీనికి కొద్దిగా ముందు వచ్చిన శ్రీహరి ‘భద్రాచలం’ తైక్వాన్‌డును కథగా తీసుకున్నప్పటికీ పూర్తి విజయం మాత్రం ‘ఒక్కడు’ సొంతం చేసుకుంది. ఆ తర్వాత రెగ్యులర్‌గానే స్పోర్ట్స్‌ కథలు కనిపిస్తూ వచ్చాయి. ‘బీమిలి కబడ్డీ జట్టు’ (కబడ్డీ), ‘గోల్కొండ్‌ హైస్కూల్‌’ (క్రికెట్‌), ప్రకాష్‌ రాజ్‌ ‘ధోని’ (క్రికెట్‌), ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ (అథ్లెట్‌), ‘సై’ (రగ్బీ)... ఇవన్నీ ఆటలను చూపినవే.


హీరో నాని క్రికెట్‌ నేపథ్యంలో ‘జెర్సీ’ చేసి పెద్ద హిట్‌ అందుకుంటే నాగ చైతన్య కూడా అదే క్రికెట్‌ నేపథ్యంలో ‘మజిలీ’ చేసి విజయం సాధించాడు. విజయ్‌ దేవరకొండ ‘డియర్‌ కామ్రెడ్‌’లో క్రికెట్, సందీప్‌ కిషన్‌ ‘ఏ1ఎక్స్‌ప్రెస్‌’లో హాకీ ఆటలు ప్రేక్షకుల్ని గ్రౌండ్స్‌లోకి తీసుకెళ్లాయి. అన్నింటికి మించి మహిళా బాక్సింగ్‌ను తీసుకుని వెంకటేశ్‌ హీరోగా, రితికా మోహన్‌ సింగ్‌ హీరోయిన్‌గా వచ్చిన ‘గురు’, ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్‌గా మహిళా క్రికెట్‌ను తీసుకుని వచ్చిన ‘కౌసల్యా క్రిష్ణమూర్తి’, మహిళా ఫుట్‌బాల్‌ను తీసుకుని విజయ్‌ హీరోగా వచ్చిన ‘బిగిల్‌’ క్రీడల్లోనే కాదు సినిమాల్లో కూడా మహిళల విజయాన్ని చూపించాయి.


వరుస కట్టిన సినిమాలు
ఇక మీదట కూడ బోలెడు స్పోర్ట్స్‌ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. బాక్సింగ్‌ నేపథ్యంలో విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘లైగర్‌’ రానుంది. కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా ‘గుడ్‌లక్‌ సఖీ’ (షూటింగ్‌), నాగ శౌర్య హీరోగా ‘లక్ష్య’ (విలువిద్య) రానున్నాయి. ఇవి కాకుండా కోడి రామ్మూర్తి, పి.వి.సింధు, పుల్లెల గోపీచంద్, కరణం మల్లీశ్వరి, విశ్వనాథన్‌ ఆనంద్‌ల బయోపిక్‌లు వరుసలో ఉన్నాయి. ఇక తమిళం నుంచి డబ్‌ అయిన తాజా సినిమా ‘సార్పట్టా’ కాలం వెనక్కు వెళ్లి మన దేశీయులు ఆడిన బాక్సింగ్‌లో పల్లె పౌరుషాలు పట్టుదలలు ఏ విధంగా ఉంటుందో చూపింది. అసలు గతాన్ని తవ్వుకుంటూ వెళితే ఎన్ని స్పోర్ట్స్‌ డ్రామాలు దొరుకుతాయో కదా.

ఓడటం తెలిసినవాడే గెలవడం నేరుస్తాడు. ఆటల్లో ఉంటేనే ఓడటం గెలవడం ఓడినా గెలిచినా సాధన కొనసాగించడం తెలుస్తాయి. మనిషిని మానసికంగా శారీరకంగా తీర్చిదిద్దడంలో ఆటను మించింది లేదు. ఆటలో ఉండే ఉద్వేగం కూడా మనిషిని ఆకర్షిస్తుంది. సెల్‌ఫోన్‌ను అంటుకుపోతున్న నేటి తరాన్ని క్రీడామైదానం వైపు తరమాలంటే బయట, బడులలో, సినిమాల్లో ఎంత క్రీడా వాతావరణం కనిపిస్తే అంత మేలు. క్రీడలకు జయం. ఒలింపిక్స్‌లో ఉన్న భారతీయులకు జయం. ఈ ఒలింపిక్స్‌ జరిగినన్నాళ్లు అంతటా క్రీడా వాతావరణమే ఉంటుంది. ఒకవైపు ఆటలూ చూడొచ్చు. చూడని స్పోర్ట్స్‌ సినిమాలనూ చూడొచ్చు. నిజంగా ఇది క్రీడా వీక్షణ సమయమే.

‘లగాన్‌’ నుంచి సిక్సర్లే
2001లో ఏ ముహూర్తాన బాలీవుడ్‌లో ‘లగాన్‌’ వచ్చిందో అక్కడ స్పోర్ట్స్‌ సినిమాలు హిట్‌ మీద హిట్‌ కొడుతూనే ఉన్నాయి. బ్రిటిష్‌ కాలమేంటి... అక్కడ పన్ను పెంచడమేంటి... దానిని ఎదుర్కొనడానికి పల్లెటూరివాళ్లు బ్రిటిష్‌ వారితో క్రికెట్‌ ఆడటం ఏంటి... అసలా కథను తీయడం ఎలా సాధ్యం. దర్శకుడు అశితోష్‌ గొవారికర్‌ తీశాడు. సినిమా దేశాన్నే కాదు ప్రపంచాన్నే ఆకర్షించింది. మన తెలుగువాడు నగేశ్‌ కుకునూర్‌ మూగ, చెవిటి ఆటగాడి కథను తీసుకుని అద్భుతంగా తీసిన ‘ఇక్బాల్‌’ ఒక గ్రామీణ క్రికెట్‌ బౌలర్‌ కథను చెప్పింది.

ఆ తర్వాత మహిళా హాకీని తీసుకు షారూక్‌ ఖాన్‌ ‘చక్‌దే ఇండియా’ తీస్తే సూపర్‌డూపర్‌ హిట్‌ అయ్యింది. వయసు మీరిన కోచ్‌ పాత్రలో షారూక్‌ కనిపించడానికి సిద్ధమయ్యి మరీ హిట్‌ కొట్టాడు. పరుగుల నేపథ్యంలో ఇర్ఫాన్‌ ఖాన్‌ హీరోగా ‘పాన్‌సింగ్‌ తోమార్‌’, మిల్కా సింగ్‌ ఆత్మ కథ ‘భాగ్‌ మిల్కా భాగ్‌’, ‘మేరీ కోమ్‌’, ‘ధోని’, ‘సైనా’, ‘సుల్తాన్‌’... ఇవన్నీ ఉద్వేగపూరిత క్రీడా అనుభవాన్ని ఇచ్చాయి.  మహిళా కుస్తీ నేపథ్యంలో ఆమిర్‌ ఖాన్‌ ‘దంగల్‌’ రికార్డుల చరిత్రను తిరగరాసింది. ఇక 1983 వరల్డ్‌ కప్‌ నేపథ్యలో ‘1983’ రానుంది.  ఫర్హాన్‌ ఖాన్‌ బాక్సర్‌గా ‘తూఫాన్‌’ తాజాగా విడుదలైంది. మిథాలి రాజ్‌ బయోపిక్‌ ‘శభాష్‌ మితూ’ వరుసలో ఉంది. ‘మైదాన్‌’ (ఫుట్‌బాల్‌) కూడా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement