భారత్‌ సినిమాలపై పాక్‌ ప్రముఖ హీరో రియాక్షన్‌ | Actor Faysal Quraishi Calls For Indian Films Release In Pakistan, See Deets Inside - Sakshi
Sakshi News home page

పాకిస్థాన్‌పై భారత్‌ సినిమాల ఎఫెక్ట్‌.. హెచ్చరిస్తున్న పాక్‌ ప్రముఖ నటుడు

Jan 1 2024 12:53 PM | Updated on Jan 1 2024 1:52 PM

Actor Qureshi Calls For Indian Films Release In Pakistan - Sakshi

పాకిస్థాన్‌లో భారతీయ సినిమాలను విడుదల చేయాలని ప్రముఖ నటుడు, నిర్మాత ఫైసల్ ఖురేషీ అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. స్థానిక సినిమా ఎగ్జిబిషన్ రంగాన్ని పునరుజ్జీవింపజేసేందుకు ఆ దేశంలో భారతీయ చిత్రాలను విడుదల చేయాలని పాక్ అగ్రనటులు, నిర్మాతల్లో ఒకరైన ఫైసల్ ఖురేషీ పేర్కొన్నాడు. పాకిస్థాన్‌ సినిమా ఇండస్ట్రీలో అనేక హిట్ సీరియల్స్‌తో పాటు ఎన్నో సినిమాల్లో ఆయన నటించాడు. ఎన్నో బ్లాక్‌బస్టర్ సిరీస్‌లను ఖురేషీ నిర్మించాడు.

పాక్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇలా అన్నాడు. ' పాకిస్తాన్‌లో సినిమా మనుగడ ఉండాలంటే భారతీయ చిత్రాల ప్రదర్శనపై నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలి. నేను కూడా పాకిస్థానీనే.. దేశభక్తుడిని కూడా. కానీ, మీరు పాకిస్తానీ సినిమాలను నడపాలనుకుంటే... ముందుగా భారతీయ చిత్రాలను ప్రదర్శించడం చాలా ముఖ్యం. పాకిస్థాన్ ప్రేక్షకులు కూడా భారతీయ సినిమాలను చూడాలనుకుంటున్నారు. ఈ విషయం అందరికీ తెలుసు. భారత్‌తో  సంబంధాలను మెరుగుపరిచేందుకు కృషి చేద్దాం.' అని ఆయన అన్నారు.

(ఇదీ చదవండి: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు)

2019 చివరి నుంచి  పాకిస్తాన్‌లోని థియేటర్‌లలో భారతీయ చిత్రాల ప్రదర్శన పూర్తిగా నిషేధించబడింది. కానీ సినీ ప్రియులు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి విభిన్న స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో భారత్‌ సినిమాలను చూస్తున్నారని ఆయన గుర్తుచేశారు. 'పాకిస్థాన్‌లో భారతీయ చిత్రాలపై నిషేధం లేకుంటే, పాకిస్థానీ చలనచిత్ర- నాటక పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెంది ఉండేది. భారతీయ స్ట్రీమింగ్ పోర్టల్‌తో పాటు కొన్ని ఛానెల్‌లలో పాకిస్తానీ కంటెంట్‌ను కూడా మరింతగా ప్రదర్శించేందుకు అవకాశం ఉండేది. భారత్‌ సినిమాలు పాక్‌లో ప్రదర్శిస్తే.. వినోద వ్యాపారం ద్వారా సంవత్సరానికి రూ. 6000 కోట్లకు పైగానే ఆర్జించేది.

మన సినిమాలు, సీరియల్స్ భారత్‌ ఆన్‌లైన్ పోర్టల్‌లలో ప్రదర్శించబడుతున్నాయి. మన ప్రజలు గతంలో భారతీయ సినిమాలను చూడటానికి థియేటర్‌లకు వెళ్లేవారు, ఇది మన పరిశ్రమకు విలువైన ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. కానీ ఇప్పుడు మన ఆదాయ మార్గాలను మనమే మూసివేయబడటం విచిత్రంగా ఉంది. పాక్‌లోని సినిమా థియేటర్లలో భారతీయ సినిమాలను ప్రదర్శించడానికి అనుమతి ఇచ్చేంత వరకు సినీ పరిశ్రమ అభివృద్ధి చెందదని ఆయన తేల్చిచెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement