Independence Day 2023: Here List Of Top 9 Indian Freedom Fighters Biopic Movies - Sakshi
Sakshi News home page

77th INDEPENDENCE DAY: ప్రతి భారతీయుడిలో దేశభక్తిని రగిలించే సినిమాలు ఇవే.. ఓటీటీ వివరాలు

Published Fri, Aug 11 2023 4:49 PM | Last Updated on Tue, Aug 15 2023 6:56 AM

Indian Freedom Fighters Biopic Movies - Sakshi

సినిమా అనేది వినోదాన్ని మాత్రమే కాదు పంచుతుందనుకుంటే పొరపాటే.. కొన్ని సనిమాలు యువకుల్లో దేశభక్తిని రగిలించింది. అందుకు తగినట్లుగానే కొందరు హీరోలు,దర్శకులు కథలను ఎంచుకుంటుంటారు. ఇలా వారు భారీ విజయాలను కూడా సొంతం చేసుకున్నారు. మన హీరోలు స్వాతంత్ర సమర యోధులుగా, దేశాన్ని రక్షించే వీరులుగా కనిపించి ఆకట్టుకున్నారు. అలాంటి సినిమాలపై 77వ స్వాతంత్య్రం సందర్భంగంగా కొన్నింటిపై ఫోకస్ చేయండి.

గాంధీ (1982)
1982లో వచ్చిన గాంధీ సినిమా రిచర్డ్ అటెన్ బరో తీశారు. అస్కార్ అవార్డు పొందిన సినిమా ఇది. బెన్ కింగ్ స్లే గాంధీగా నటించారు. భారత స్వతంత్ర పోరాటాన్ని, గాంధీ జీవితాన్ని తెరకెక్కించిన మొదటి సినిమా ఇదే. గాంధీజీ పై చాలా సినిమాలు వచ్చాయి. కానీ 1982లో తెరకెక్కిన గాంధీ సినిమా మాత్రం ప్రత్యేకం. అయితే దానికి ప్రత్యేకమయిన కారణం కూడా ఉంది. ఈ సినిమాను రూపొందించింది ఇంగ్లాండ్‌లో పుట్టిపెరిగిన రిచర్డ్ అటెన్‌బరో అనే ఫిల్మ్ మేకర్. ఆ సినిమాకి ఆయనే ప్రొడ్యూసర్ కూడా.

ఇక ఆ సినిమాలో గాంధీగా నటించింది కూడా బ్రిటిష్ యాక్టర్ అయిన బెన్ కింగ్స్‌లే. ఇలా ఏ దేశం పై అయితే గాంధీజీ తన పోరాటాన్ని సాగించారో వాళ్ళే మళ్ళీ ఆయనపై సినిమా తియ్యడం, దాన్ని ఇంగ్లాండ్‌లో కూడా రిలీజ్ చేస్తే అక్కడ అది ఘనవిజయం సాధించడం అనేది సామాన్యమయిన విషయం కాదు. పైగా ఆ సినిమాలో గాంధీజీ పాత్రను అద్బుతంగా పోషించిన బెన్ కింగ్స్‌లే కి అకాడెమీ  అవార్డు కూడా వచ్చింది.

అంటే గాంధీజీ జీవితంలో ఉన్న సారాంశం ఎంత గొప్పది అనేది ఆ సినిమాలో చూపించడం వల్ల, అది అందరి మనసులకు హత్తుకోవడం వల్ల ఆ విజయం సాధ్యమయింది.  భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని 582 సినిమా థియేటర్లలో ఆగష్ట్రు 14వ తేదీ నుంచి 24 వరకు 'గాంధీ' చిత్రాన్ని విద్యార్థులకు ఉచితంగా ప్రదర్శించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. 

డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ (2000)
భీంరావ్ రాంజీ అంబేడ్కర్ పాత్రలో మమ్ముట్టి రోల్‌  ఔట్‌స్టాండింగ్‌ అనే చెప్పవచ్చు. 2000 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా జబ్బర్ పటేల్ దర్శకత్వం వహించారు.  ఈ చిత్రం మొదట ఆంగ్లంలో నిర్మించబడింది. తరువాత ప్రాంతీయ భాషలలోకి డబ్ చేయబడింది. ఈ చిత్రంలో మమ్ముట్టి డాక్టర్ అంబేడ్కర్‌ పాత్రను పోషించారు. అతని నటనకు జాతీయ అవార్డును గెలుచుకున్నారు.

భారత రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు అంబేద్కర్ యొక్క పోరాటాలను దృశ్యమానం చేసిన జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్రం, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్మించాలని పిలుపునిచ్చింది. నిర్మాణాన్ని ప్రభుత్వ యాజమాన్యంలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించింది. డాక్టర్ అంబేద్కర్‌గా మమ్ముట్టి  నటన మనసుకు హత్తుకునేలా ఉంటుంది. 

ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ (2002)
హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ తోటి సభ్యులతో కలిసి భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన విప్లవకారుడు భగత్ సింగ్ గురించి 2002లో ఈ చిత్రం విడుదల అయింది. ఇందులో అజయ్ దేవగన్ టైటిల్ క్యారెక్టర్‌తో పాటు సుశాంత్ సింగ్ కూడా ఉన్నారు. ఈ సినిమాలో భారత స్వాతంత్రం కోసం పోరాడిన భగత్ సింగ్ జీవిత చరిత్రను పూర్తిగా చూపించారు. 1931 మార్చి 24న అధికారిక విచారణకు ముందు జలియన్ వాలాబాగ్ మారణకాండను చూపినప్పటి నుంచి భగత్ సింగ్ ని ఉరి తీసే వరకు ఈ సినిమాలో చూయించారు. కేవలం 23 ఏళ్ల వయసులోనే దేశం కోసం ఉరికంబానికి ఎలా ఎక్కాడో తెలిపే చిత్రమే  ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. 

లగాన్‌ (2001)
బ్రిటీషు పాలనలో భూమి పన్ను రద్దుకు వ్యతిరేకంగా ఓ గ్రామ ప్రజలు క్రికెట్ ఆడటానికి నిర్ణయించుకుంటారు. అప్పటివరకూ అలవాటు లేని ఆట అది. పన్ను భారం తగ్గాలంటే ఆడి గెలవాల్సిందే. ఆడారు.. గెలిచారు. ఆమిర్ ఖాన్ నటించిన ఈ ‘లగాన్’ చిత్రకథను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. 2001లో ఈ సినిమా విడుదలైంది. అప్పట్లో ఎందరిలోనే దేశభక్తిని రగిలించిన సినిమా ఇది. ఇప్పటికి ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు దాటినా ఏ మాత్రం క్రేజ్‌ తగ్గలేదు. నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు.


నేతాజీ సుభాష్ చంద్రబోస్ (2004)
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం ఆధారంగా వచ్చిన Netaji Subhas Chandra Bose: The Forgotten Hero  హిందీ చిత్రం 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియన్ ఎపిక్ బయోగ్రాఫికల్ వార్‌ని సినిమాగా తెరకెక్కించింది. ఇందులో నేతాజీగా సచిన్ ఖేడేకర్ కరెక్ట్‌గా సెట్‌ అయ్యారు. బ్రిటీష్ ఇండియాలో మహాత్మా గాంధీతో రాజకీయ విబేధాల తర్వాత, బోస్ అరెస్టు, విడుదలయ్యాక జరిగిన కథను వివరించారు. ఈ చిత్రానికి ఇండియన్ ఆడియెన్స్ నుంచి విశేష  ఆదరణ దక్కింది. సినిమాకు నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డును కూడా దక్కింది.

అలాగే 70వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంయుక్తంగా సమర్పించిన ఇండిపెండెన్స్ డే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆగష్టు 14, 2016న ఈ చిత్రాన్ని ప్రదర్శించడం విశేషం. ఈ సినిమాకు  శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ దర్శకత్వం వహించారు. ఎమ్‌ ఎక్స్‌ ప్లేయర్‌,యూట్యూబ్‌లో ఈ సినిమా ఉంది.

సర్దార్‌ (1993)
1993లో ఈ చిత్రం విడుదలైంది. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలను ఇండియన్‌ ఆఫ్‌ యూనియన్‌లో చేరేలా శ్రమించిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జీవితం ఆధారంగా నిర్మించిందే ఈ చిత్రం. ఈ సినిమాలో పరేష్‌ రావల్‌ సర్దార్‌గా నటించారు. ఈ సినిమాలో క్విట్‌ ఇండియా ఉద్యమంలో జరిగిన అల్లర్లతో పాటు నెహ్రుతో సర్దార్‌కు ఉన్న విబేధాలను చూపుతుంది. సర్దార్ లాంటి వ్యక్తి లేకుండా ఉండి ఉంటే భారత్‌ ఇప్పటికి కూడా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేదని చెప్పవచ్చు. యూట్యూబ్‌లో ఈ సినిమాను చూడొచ్చు

కేసరి (2019)
కేసరి 2019లో విడుదలైన బాలీవుడ్‌ సినిమా. 1897న భారత్‌లోకి సుమారు 10 వేలకు పైగా ఆఫ్ఘన్‌ దళాలు ఒక్కసారిగా చొచ్చుకొని వస్తారు. అప్పుడు వారందరినీ కేవలం 21 మంది సిక్కులు మాత్రమే ఎలా  అడ్డుకున్నారు. అనేది ఈ సినిమాలో చూపిస్తారు .ఈ దళాల మధ్య 30 గంటల పాటు జరిగిన భీకర పోరాట సన్నివేశాలు మెప్పిస్తాయి. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా, సుమీత్ సింగ్ బస్రా, రాకేష్ శర్మ, మీర్ సర్వర్, అశ్వథ్ భట్, రామ్ అవానా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. 

మంగళ్ పాండే: ది రైజింగ్ (2005)
మంగళ్ పాండే జీవితం ఆధారంగా  2005లో కేతన్ మెహతా దర్శకత్వంలో మంగళ్ పాండే: ది రైజింగ్ మూవీ వచ్చింది. ఇందులో ఆమీర్ ఖాన్ లీడ్ రోల్‌లో నటించారు. మంగళ్ పాండే ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో జులై 19, 1827న జన్మించారు. పాండే బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన 34వ బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీలో రెజిమెంట్‌లో సిపాయిగా చేరారు. అప్పట్లో అతను తన అసాధారణమైన ప్రతిభ, తెగువతో సైనిక దళ నాయకుడిగా ఎదిగారు. అయితే ఆ కాలంలో బ్రిటిష్ వారు అందించిన తుపాకీ తూటాలను సిపాయిల వీసమెత్తు నచ్చలేదు.

ఈ గుండ్లకు ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసేవారు. వాటిని పేల్చాలంటే సిపాయిలు నోటితో కొరికి తొక్క తీయాల్సి ఉంటుంది. హిందువులు, ముస్లింల మత విశ్వాసాలకు ఇది విరుద్ధమని భావించిన సిపాయిలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. బ్రిటీషర్లు మొదట జంతువుల కొవ్వును ఉపయోగించలేదని చెప్పారు. కానీ అది కోవ్వేనని పాండే, ఇతర సైనికుల్లో సందేహాలు మరింత బలపడ్డాయి. ఆ సందేహాలే చివరికి బ్రిటిష్ రాజ్యాధిపత్యంపై తిరుగుబాటుకు ఎలా దారితీసింది. పాండే ఉరి శిక్ష సమయంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు.ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. 

మణికర్ణిక (2019)
 2019లో వచ్చిన ఈ సినిమా ఝాన్సీ లక్ష్మీ భాయ్‌ జీవిత చరిత్ర ఆదారంగా బాలీవుడ్‌లో తెరకెక్కించారు. ఇందులో కంగనా రనౌత్‌ ఝాన్సీగా తన నటనతో భారతీయులను మెప్పించింది.1828లో వారణాసిలో తన పుట్టుకతో కథ మొదలౌతుంది. పరాక్రమానికి  మారుపేరుగా  లక్ష్మీ భాయ్‌ జీవిత చరిత్ర ఉంటుంది. ఝాన్సీ రాజు అయిన గంగాధర్‌ రావుతో ఆమెకు వివాహం అవుతుంది. రాజ్యం గంగాధర్‌ అన్న అయిన సధాశివ్‌ బ్రిటీష్‌ వారితో కలిసి కుట్ర పన్నుతాడు. అందులో భాగంగా గంగాధర్‌ రావును బ్రిటీష్‌ వారు చంపేస్తారు. తన భర్తకు ఇచ్చిన మాట కోసం ఝాన్సీ లక్ష్మీ భాయ్‌గా రాజ్యాధికారం అందుకుంటుంది. ఈ క్రమంలో తెల్లవారిపై ఆమె చేసిన దండయాత్ర ఎలా ఉంటుందో చె​​ప్పేదే మణికర్ణిక చిత్రం. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement