భారతదేశం తన 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నేడు (ఆగస్టు 15)న జరుపుకుంటుంది. భారతదేశం బ్రిటీష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం పొంది 76 సంవత్సరాలు పూర్తవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు వైభవంగా జరుపుకుంటున్నారు. దాదాపు రెండు శతాబ్దాల తర్వాత బ్రిటీష్ వారి నుంచి విముక్తిని సాధించిపెట్టిన నాయకులు, ఇందుకు తమ ప్రాణాలను అర్పించిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు గుర్తు చేసుకుంటున్నారు. అలా కొన్ని పాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి.
'తేరి మిట్టీ' -కేసరి
కొన్ని పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి పాటల్లో తేరి మిట్టి మే మిల్ జవాన్ సాంగ్ ఒక్కటి. ఈ పాట విన్నప్పుడల్లా మనస్సు ఉప్పొంగుతుంది. గీత రచయిత మనోజ్ ముంతాషిర్ ఎంతో గొప్పగా రచించారు. ఈ పాట విన్న తర్వాత అందరిలో దేశభక్తి భావం రాకుండా ఉండదు. ఈ పాటను 1బిలియన్‌కు పైగా వీక్షించారు.
'మేమే ఇండియన్స్' - ఖడ్గం
కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బింద్రే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన దేశభక్తి మూవీ 'ఖడ్గం'. నేటి తరానికి దేశ భక్తి అంటే ఏంటో తెరపై చూపించిన సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన 'మేమే ఇండియన్స్' పాట ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాట ఎప్పుడు విన్నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. చంద్రబోస్ రాసిన ఈ గీతాన్ని సింగర్ హనీ ఆలపించారు.
'ఎత్తరా జెండా' - RRR
విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన పీరియాడిక్ మూవీ 'ఆర్.ఆర్.ఆర్'. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఎండ్ క్రెడిట్స్ పడే సమయంలో 'నెత్తురు మరిగితే ఎత్తరా జెండా' అనే పాట వస్తుంది. దేశభక్తిని చాటిచెప్పే ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు పలువురు స్వాతంత్ర్య సమరయోధుల గెటప్స్‌లో కనిపిస్తారు. ఎమ్ఎమ్ కీరవాణి స్వరపరిచిన ఈ సెలబ్రేషన్ సాంగ్‌కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. విశాల్ మిశ్రా, పృథ్వీ చంద్ర, సాహితి చాగంటి, హారిక నారాయణ్ కలిసి ఆలపించారు.
'దేశం మనదే తేజం మనదే' - జై
తేజ దర్శకత్వంలో నవదీప్ హీరోగా నటించిన చిత్రం 'జై'. ఈ సినిమాలో అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన 'దేశం మనదే తేజం మనదే' సాంగ్ ఎవర్ గ్రీన్ దేశభక్తి గీతంగా నిలిచింది. బేబీ ప్రెట్టీ, శ్రీనివాస్ కలిసి పాడిన ఈ పాటకు కులశేఖర్ సాహిత్యం సమకూర్చారు.
'పాడవోయి భారతీయుడా' -వెలుగు నీడలు
'పాడవోయి భారతీయుడా.. ఆడి పాడవోయి విజయ గీతికా' అంటూ మహాకవి శ్రీ శ్రీ రాసిన దేశభక్తి గీతం ప్రతి యేడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున మార్మోగుతూనే ఉంది. ఈ పాట వచ్చిన 13 ఏళ్ల తరువాత అక్కినేని నాగేశ్వరరావు 'వెలుగు నీడలు' చిత్రంలో పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచిన ఈ పాటను పి.సుశీల , ఘంటసాల పాడారు. ఈ పాట వచ్చి 60 సంవత్సరాలు గడిచినా నేటికీ క్లాసిక్ దేశభక్తి గీతాల్లో ఎప్పటికీ ట్రెండింగ్‌లో ఉంటుంది.
'పుణ్యభూమి నాదేశం' -మేజర్ చంద్రకాంత్
ఇక ఎన్టీఆర్ క్లాసిక్ హిట్స్ అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేపాట. మేజర్ చంద్రకాంత్ మూవీలోని 'పుణ్యభూమి నాదేశం నమో నమామి'. దేశం కోసం ప్రాణం అర్పించిన ఎందరో మహానుభావున త్యాగాలను గుర్తు చేస్తూ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈపాటకు కీరవాణి స్వరాలను సమకూర్చారు.
'వినరా.. వినరా' రోజా
ఏ.ఆర్ రెహమాన్ దేశభక్తి గీతాలు యూత్‌లో దేశభక్తిని రగిల్చాయి. రోజా చిత్రంలో వినరా.. వినరా.. దేశం మనదేరా అంటూ రాజశ్రీ రాసిన పాటతోపాటు.. మా తేఝే సలాం వందేమాతరం అంటూ రెహమాన్ పాడిన పాట సంచలనం అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment