ధైర్యమే ఆయుధం | Upcoming Lady Oriented Movies update in Tollywood | Sakshi
Sakshi News home page

ధైర్యమే ఆయుధం

Published Mon, Mar 3 2025 10:51 AM | Last Updated on Mon, Mar 3 2025 10:51 AM

Upcoming Lady Oriented Movies update in Tollywood

భర్త కోసం ఒకరు... మార్పు కోసం మరొకరు... ఊరి కోసం ఇంకొకరు... ఇలా సమాజంతో, వ్యతిరేక పరిస్థితులతో ధైర్యాన్నే ఆయుధంగా చేసుకుని పోరాటానికి నడుం బిగించారు కొందరు తారలు. తమ హక్కులు, లక్ష్యాల కోసం సిల్వర్‌ స్క్రీన్‌పై తగ్గేదే లే అంటూ విజృంభించారు.. పోరాటానికి ‘సై’ అని కొందరు నటీమణులు చేసిన ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.

క్రిమినల్‌... లెజెండ్‌ 
‘అరుంధతి, రుద్రమదేవి’ వంటి ఉమెన్‌ సెంట్రిక్‌ మూవీస్‌లో అనుష్క యాక్షన్‌ టాలెంట్‌ని ఆడియన్స్‌ చూశారు. కొంత గ్యాప్‌ తర్వాత అనుష్క నటిస్తున్న ఈ తరహా చిత్రం ‘ఘాటి’. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 18న విడుదల కానుంది. ఓ వ్యాపారంలో ఎదుగుతున్న మహిళను కొందరు వ్యక్తులు ఓ కుట్రలో ఇరికించి, క్రిమినల్‌గా చిత్రీకరిస్తారు. ఆ సమస్యల నుంచి ఆమె బయటపడి, తనను ఇబ్బంది పెట్టినవారికి ఎలా బుద్ధి చెప్పింది? ఆ వ్యాపార సామ్రాజ్యానికి ఓ లెజెండ్‌గా ఆమె ఎలా ఎదిగింది? అన్నదే ‘ఘాటి’ సినిమా కథ అని టాక్‌.

మా ఇంటి బంగారం 
కుటుంబాన్ని చక్కబెట్టే ఓ గృహిణి గన్‌ పట్టిందంటే అందుకు కొన్ని అసాధారణ పరిస్థితులే కారణమై ఉంటాయి. మరి... ఆమె ఎందుకు గన్‌ పట్టుకుందో ‘మా ఇంటి బంగారం’ సినిమాలో చూడాలి. ఈ సినిమాలో గృహిణిగా నటిస్తున్నారు సమంత. తన నిర్మాణ సంస్థ ట్రా లా లా పిక్చర్స్‌పై సమంత నిర్మిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. గత ఏడాది తన బర్త్‌ డే (ఏప్రిల్‌ 28) సందర్భంగా ‘మా ఇంటి బంగారం’ను ప్రకటించారు. ఆ తర్వాత ఈ మూవీపై అప్‌డేట్‌ రాలేదు. అలాగే ‘ట్రా లా లా’లోనే ఓ హారర్‌–కామెడీ ఫిల్మ్‌ రూపొందుతోందని తెలిసింది. ఈ చిత్రంలో సమంత గెస్ట్‌ రోల్‌ చేశారని సమాచారం. 

భర్త కోసం... 
ఆల్మోస్ట్‌ అందరూ మహిళలే ఉన్న ఓ నిర్మాణ సంస్థ నిర్మించిన చిత్రం ‘ది ఐ’. ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ లీడ్‌ రోల్‌లో నటించారు. డాఫ్నే ష్మోన్‌ దర్శకత్వంలో రూపొందిన అంతర్జాతీయ చిత్రం ఇది. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. వేరే దేశంలో ఉన్న తన భర్త మరణ వార్త విని షాక్‌ అయిన ఓ మహిళ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తుంది. అక్కడ ఆమెకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఓ దశలో భర్త బతికే ఉన్నాడనే అనుమానం కూడా ఆమెకు వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనే అంశాల నేపథ్యంలో ‘ది ఐ’ ఉంటుందని సమాచారం.

వీరోచిత పోరాటం 
ఓ ఊరి సంరక్షణ కోసం దుష్ట శక్తులతో శివ శక్తి అనే నాగసాధువు ఎలాంటి వీరోచిత పోరాటం చేసిందనే ఇతివృత్తంతో రూపొందుతున్న సినిమా ‘ఓదెల 2’.  ఈ చిత్రంలో నాగ సాధువుగా నటిస్తున్నారు తమన్నా. దర్శక–నిర్మాత సంపత్‌ నంది పర్యవేక్షణలో అశోక్‌ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది.   

బ్యాగ్‌లో బాంబు 
ఓ అమ్మాయి తన హ్యాండ్‌ బ్యాగ్‌లో కత్తి, బాంబు, తుపాకీలు పెట్టుకుని తిరుగుతుంటుంది. ఎందుకనేది థియేటర్స్‌లో ‘రివాల్వర్‌ రీటా’ మూవీ చూసి తెలుసుకోవాలి. కీర్తీ సురేష్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్‌ ఫిల్మ్‌ ‘రివాల్వర్‌ రీటా’. జేకే చంద్రు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. 

స్టూడెంట్‌ స్టోరీ 
రష్మికా మందన్నా తొలిసారి చేస్తున్న ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’. ప్రేమలో పడకూదనుకుంటూనే ప్రేమలో పడే ఓ కాలేజీ స్టూడెంట్‌ కథగా ఈ సినిమా కథనం ఉంటుందని తెలిసింది. ఈ చిత్రంలో కాలేజ్‌ స్టూడెంట్‌గా నటిస్తున్నారు రష్మికా మందన్నా. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో రూపొందు తున్న ఈ సినిమా రిలీజ్‌పై త్వరలో ఓ ప్రకటన రానుంది. అలాగే ‘రెయిన్‌ బో’ అనే మరో లేడీ ఓరియంటెడ్‌ ఫిల్మ్‌కూ రష్మిక గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మూవీపై తాజా అప్‌డేట్‌ రావాల్సి ఉంది. 

సుబ్బు సాహసం 
అనుపమా పరమేశ్వరన్, దర్శనా రాజేంద్రన్, సంగీత... ఇలా ముగ్గురు హీరోయిన్లు నటించిన చిత్రం ‘పరదా’. ఊరి సంప్రదాయం, కట్టుబాట్ల కోసం సుబ్బు (అనుపమ) చేసిన సాహసోపేతమైన ప్రయాణమే ‘పరదా’. ఈ చిత్రంలోని మెయిన్‌ హీరోయిన్‌ రోల్‌లో అనుపమా పరమేశ్వరన్‌ నటించారు. ఈ సినిమాతో ఓ సామాజిక అంశాన్ని బలంగా చెప్పబోతున్నారట ఈ చిత్రదర్శకుడు ప్రవీణ్‌ కాండ్రేగుల. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్‌ కానుంది. అలాగే ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ అనే  కోర్టు రూమ్‌ డ్రామాలోనూ, ‘లాక్‌ డౌన్‌’ అనే మరో ఉమెన్‌ సెంట్రిక్‌ చిత్రంలోనూ అనుపమ నటించారు. 

నెగటివిటీ తగ్గాలంటే... 
సమాజంలోని నెగటివిటీని తగ్గించాలకుని ఓ యువతి తనదైన శైలిలో ఏం చేసింది? అనే అంశంతో ఓ ఉమెన్‌ సెంట్రిక్‌ మూవీ నిర్మాణంలో ఉంది. సామాజిక, రాజకీయ అంశాల మేళవింపుతో రానున్న ఈ సినిమాలో హీరోయిన్‌ సంయుక్త లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. కేఎస్‌సీ యోగేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంయుక్త కూడా ఓ నిర్మాత. ఆమెకు నిర్మాతకు ఇదే తొలి చిత్రం కావడం ఓ విశేషం. 

సతీ లీలావతి 
‘హ్యపీబర్త్‌ డే’ తర్వాత హీరోయిన్‌ లావణ్యా త్రిపాఠి సైన్‌ చేసిన మరో ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘సతీ లీలావతి’. తాతినేని సత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం ఆరంభమైంది. కథాంశం గురించి పూర్తి వివరాలు రావాల్సి ఉంది.

బూమరాంగ్‌ 
అనూ ఇమ్మాన్యుయేల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన హారర్‌ అండ్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీ ‘బూమరాంగ్‌’. ఇందులో శివ కందుకూరి కీలక పాత్రధారి. ఆండ్రూ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఓ సైకో కిల్లర్‌ నుంచి ఒక యువతి ఎలా తప్పించుకుంది? అనే అంశంతో ఈ చిత్రం రూపొందుతోందని టాక్‌.

సత్యభామ కథ 
పెళ్లైన ఓ అమ్మాయి తన సమస్యలను తానే ఏ విధంగా పరిష్కరించుకుంది? అనే అంశంతో రూపొందుతున్న సినిమా ‘శివంగి’. ఈ మూవీలో సత్యభామగా ఆనంది, పోలీసాఫీసర్‌గా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ నటించారు. దేవరాజ్‌ భరణీధరన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. అలాగే ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘గరివిడి లక్ష్మి’ సినిమాలో ఆనంది టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నారు.

మహిళలు ఎదగాలి 
మహిళలను గౌరవించాలి, అన్ని రంగాల్లో ఆడపిల్లలు ఎదిగేందుకు సహకరించాలి, సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించాలనే అంశాల ఇతివృత్తంగా రూపొందిన చిత్రం ‘నారీ’. ఈ సినిమాలో ఆమని ఓ లీడ్‌ రోల్‌ చేశారు. సూర్య వంటిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్‌  కానుంది.  ఇవే కాదు... ఇంకా మరికొన్ని ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్స్‌ నిర్మాణంలో ఉన్నాయి.  – ముసిమి శివాంజనేయులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement