
బెంగళూరులో జరుగుతున్న చలన చిత్రోత్సవంలో అనేక మంది శాండల్‌వుడ్ నటీనటులు పాల్గొనకపోవడంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా విధానసౌధలో జరిగిన కార్యక్రమంలో ఇండస్ట్రీ ప్రముఖలపై ఆయన భగ్గుమన్నారు. కన్నడ భూమి, భాష గురించి నటీనటులు స్పందించకుంటే మీ నట్లు బోల్ట్‌లను టైట్ చేస్తామని సినీ ప్రముఖులను హెచ్చరించారు. దీంతో నెట్టింట పెద్ద దుమారం రేగింది.
అయితే, తన వ్యాఖ్యలను కొంత సమయం తర్వాత డీకే సమర్థించుకున్నారు. 'సినిమా ప్రముఖులు ఏమికావాలంటే అది చేసుకోనీ, నాకు తెలియదు. నా మాటల్లో నిజాలున్నాయి. ధర్నాలు చేసినా ఫర్వాలేదు. రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరూ మద్దతు ఇవ్వడం లేదు. మన నీరు, మన హక్కు పోరాటంలో సినిమా వాళ్లెవరూ పాల్గొనలేదు' అని ఆయన ఆరోపించారు. మేకెదాటు పాదయాత్రలో ప్రేమ్, దునియా విజయ్, సాధుకోకిల పాల్గొన్న సమయంలో బీజేపీ ప్రభుత్వం కేసులు వేసిందని డీకే శివకుమార్ ఆరోపించారు. కాగా, కుంభమేళాలో స్నానం చేయడంపై సొంత పార్టీ నాయకులు విమర్శించారని ప్రశ్నించగా, అక్కడి నీటికి కులం, మతం ఉందా, ఏ పార్టీకై నా చెందిందా అని మండిపడ్డారు.
అధికార దర్పం: ఫిల్మ్ చాంబర్
డిప్యూటీ సీఎం ప్రకటనను కర్ణాటక ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు నరసింహలు ఖండించారు. అయన అధికార దర్పంతో అలా మాట్లాడి ఉండవచ్చని అన్నారు. బెంగళూరులో జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో కన్నడ కళాకారులందరూ పాల్గొనవలసి ఉంది. ఆహ్వానం అందని కారణంగా కొందరు పాల్గొనలేదని చెప్పారు.
మీకు సాధ్యమా: అశోక్
సినిమా రంగం, నటులపై డీకే శివకుమార్ మాటలను బీజేపీ పక్ష నాయకుడు ఆర్ అశోక్ ఖండించారు. మీరు చెప్పేది సాధ్యమా, ముందు మీ మంత్రి రాజణ్ణకు నట్లు బోల్టులను బిగించాలని హేళన చేశారు. కిచ్చ సుదీప్, కేజీఎఫ్ యశ్, దర్శన్ నట్లు బోల్టులను బిర్రు చేయడం మీకు సాధ్యమా అంటూ ప్రశ్నించారు. కన్నడ సినిమా రంగాన్ని అవమానించారని, క్షమాపణలు చెప్పాలని డీకే శివకుమార్‌ను అశోక్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment