International Women's Day: సినీ మేడమ్స్ | International Women Day: lady superstars of telugu cinema | Sakshi
Sakshi News home page

International Women's Day: సినీ మేడమ్స్

Published Sun, Mar 2 2025 8:16 AM | Last Updated on Sun, Mar 2 2025 8:34 AM

International Women Day: lady superstars of telugu cinema

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం

కథానాయికలు(Heroines) కనిపిస్తేనే వెండితెరకు నిండుదనం. సినిమాల ఘనవిజయాల్లో వారి పాత్ర గణనీయం దర్శకత్వం, రచన, నిర్మాణ నిర్వహణ, సినిమాటోగ్రఫీ.. వంటి తెరవెనుక పాత్రల్లోనూ కొందరు మహిళలు రాణిస్తున్నారు. తెరపైనా, తెరవెనుకా రాణించే సినీ మేడమ్స్‌ ముచ్చట్లు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) సందర్భంగా...

దీపిక కొండి
మన సమాజంలో పురుషాధిక్యత, లింగ వివక్ష, అసమానతలు వంటి రకరకాల అవరోధాలు మహిళల అభివృద్ధికి సవాలుగా నిలుస్తున్నాయి. ఈ సమస్యలు అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. వెండితెరపై కథానాయికలుగా మహిళలు వెలుగొందే సినీరంగం కూడా ఈ సామాజిక రుగ్మతలకు అతీతం కాదు. ఎన్ని సమస్యలు ఉన్నా, ఏటికి ఎదురీదుతూ ఎప్పటికప్పుడు తమ సత్తా చాటుకుంటున్న మహిళలు కూడా సినీరంగంలో ఉన్నారు. వారే నేటితరాలకు స్ఫూర్తి ప్రదాతలు. తాజాగా ఆర్మాక్స్‌ మీడియా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని మహిళా ప్రాతినిధ్యంపై ఓ వుమానియా! 2024 నివేదిక విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, సినిమాలను ప్రేమించి, సినిమాల కోసం పనిచేసే సినీ మేడమ్స్‌ గురించిన ప్రత్యేక కథనం..

‘ఓ వుమానియా!’... భారతీయ చలన చిత్రపరిశ్రమలోని మహిళా ప్రాతినిధ్యంపై వెలువడిన నివేదిక. గత నాలుగేళ్లుగా ప్రముఖ మీడియా కన్సల్టింగ్‌ సంస్థ ‘ఆర్మాక్స్‌ మీడియా’ ఏటా ఈ నివేదికను విడుదల చేస్తూ వస్తోంది. ఈ నివేదికను ఫిల్మ్‌ కంపానియన్‌ స్టూడియోస్‌ వీడియో రూపంలో నిర్మించగా, ప్రముఖ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ‘అమెజాన్‌ ప్రైమ్‌’ విడుదల చేసింది. తాజాగా ‘ఓ ఉమానియా–2024’ నివేదిక ప్రస్తుత ధోరణులపై మరింత లోతైన వివరాలను అందించింది. సినిమా నిర్మాణం, సినీ నిర్మాణ సంస్థల్లోని కార్పొరేట్‌ నాయకత్వం, మార్కెటింగ్‌ వంటి కీలక రంగాలలో మహిళా ప్రాతినిధ్యంలోని అసమానతలను గుర్తించింది.

2023లో మొత్తం తొమ్మిది (తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ) భారతీయ భాషలలో విడుదల చేసిన 169 సినిమాలు, సిరీస్‌లను విశ్లేషించింది. వీటిని మళ్లీ థియేట్రికల్‌ సినిమాలు (70), డిజిటల్‌ స్ట్రీమింగ్‌ సినిమాలు (30), సిరీస్‌(69)లుగా విభజించింది.

ఇందులో మన దక్షిణాది నుంచి లియో, జవాన్, ఆదిపురుష్, వాల్తేరు వీరయ్య, పొన్నియిన్‌ సెల్వన్‌ 2, భగవంత్‌ కేసరి, 2018, దసరా, విరూపాక్ష, సార్, హాయ్‌ నాన్న, భోళాశంకర్, మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి, ఇంటింటి రామాయణం సహా పలు సినిమాలు ఎంపికయ్యాయి. బాలీవుడ్‌ నుంచి జైలర్, ఓ మై డాడ్‌ 2, మిషన్‌ మజ్ను, ది ఆర్చీస్, లస్ట్‌ స్టోరీస్‌ 2 వంటి పలు చిత్రాలున్నాయి. స్వీట్‌ కారం కాఫీ, మోడర్న్‌ లవ్‌ చెన్నై, షైతాన్, దూత, సేవ్‌ ది టైగర్స్, కుమారి శ్రీమతి సిరీస్‌లు సిరీస్‌ విభాగంలో సెలెక్ట్‌ అయి, మంచి మార్కులు సాధించాయి.  

ట్రైలర్‌ టాక్‌టైమ్‌
‘ఓ వుమానియా’  నివేదిక ప్రకారం, మహిళలు ట్రైలర్లలో 29 శాతం టాక్‌టైమ్‌కు పరిమితమయ్యారు. గత రెండేళ్లలో ఇది నామమాత్రంగా పెరిగినప్పటికీ, ఓటీటీ స్ట్రీమింగ్‌ సినిమాలు ప్రమోషనల్‌ ట్రైలర్లలో మహిళలకు ఎక్కువ టాక్‌టైమ్‌ కేటాయించే ధోరణిని చూపిస్తున్నాయి. వీటిల్లో కొన్ని 55 శాతం ట్రైలర్‌ టాక్‌టైమ్‌తో అగ్రస్థానంలో ఉన్నాయి.

తెలుగు: బూ, హాయ్‌ నాన్న;  హిందీ: మేడ్‌ ఇన్‌ హెవెన్‌ సీజన్‌ 2, వెడ్డింగ్‌.కాన్, సాస్‌ బహు ఔర్‌ ఫ్లెమింగో, జానే జాన్, రెయిన్‌బో రిష్ట, తాలీ; మరాఠీ: జిమ్మ; తమిళం: స్వీట్‌ కారమ్‌ కాఫీ

పాత బెచ్‌డెల్‌ పరీక్ష
సినిమాల్లో స్త్రీలను ఎలా ప్రదర్శిస్తున్నారో కొలిచే కొలమానం ‘బెచ్‌డెల్‌’ పరీక్ష. దీనిని 1985లో కార్టూనిస్ట్‌ అలిసన్‌ బెచ్‌డెల్‌ రూపొందించారు. అప్పటి నుంచి దశాబ్దాలుగా ఈ పరీక్షను చిత్రపరిశ్రమలో లింగవివక్షపై అంతర్జాతీయ కొలమానంగా పరిగణించారు. ఒక సినిమాలో కనీసం ప్రతి రెండు సన్నివేశాల్లో ఇద్దరు పేరున్న మహిళలు మాట్లాడుతుంటే, ఆ సినిమా బెచ్‌డెల్‌ టెస్ట్‌లో నెగ్గినట్లు పరిగణిస్తారు. అయితే, సినిమాల కంటే సిరీస్‌లకు ఎక్కువ రన్‌టైమ్‌ ఉంటుంది. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని, ఆ ప్రమాణాన్ని ప్రస్తుతం సిరీస్‌లకు రెండు నుంచి మూడు సన్నివేశాలుగా మార్చారు.

నవరత్నాలు
చలనచిత్ర పరిశ్రమలోని మొత్తం తొమ్మిది విభాగాల్లో పనిచేసే మహిళల స్థితిగతులను ఈ నివేదిక విశ్లేషించింది. దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, రైటింగ్, ప్రొడక్షన్, డిజైనింగ్, సంగీతం వంటి కీలక విభాగాలలో 15 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. దీన్ని ఓటీటీ, థియేట్రికల్‌గా విభజిస్తే థియేట్రికల్‌కు 6 శాతం మాత్రమే! దక్షిణాదిలో ఈ సంఖ్య చాలా తక్కువ. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య ఒక శాతం తగ్గింది. ఓటీటీలో మాత్రం పరిస్థితి మెరుగ్గా ఉంది. స్ట్రీమింగ్‌ సినిమాలు, సిరీస్‌ రెండింటిలోనూ 20 శాతం కంటే ఎక్కువ స్థానాల్లో మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. 18 శాతం కంటే ఎక్కువగా మహిళా నాయకత్వం ఉన్న విభాగాలలో ఎడిటింగ్‌ ముందంజలో ఉంది. డైరెక్టర్‌ స్థానాల్లో 8 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు, గత సంవత్సరంతో పోలిస్తే ఇది కొంచెం తగ్గింది.

టూల్‌కిట్‌ టెస్ట్‌
మహిళల ప్రాతినిధ్యంపై ప్రశ్నావళి
నాలుగు భిన్నమైన ప్రశ్నలతో తయారుచేసిన ఒక టూల్‌కిట్‌ను కూడా ఈ నివేదిక విడుదల చేసింది. ఈ టూల్‌కిట్‌ ఆధారంగా విశ్లేషించిన స్ట్రీమింగ్‌ సినిమాల్లో కేవలం 31శాతం మాత్రమే లింగ సమానత్వ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయి. వీటిలో సిరీస్‌లు ముందంజలో ఉన్నాయి, వాటిలో 45 శాతం పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయి. సినిమాలు, సిరీస్‌లు తదితరమైన వాటి నిర్మాణంలో వివిధ విభాగాలకు మహిళలు నాయకత్వం వహించినప్పుడు వాటిలో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం లభించిందని, అవి బాగా విజయవంతమయ్యాయని ఈ నివేదిక వెల్లడించింది. థియేట్రికల్‌ సినిమాల్లో 18 శాతం మాత్రమే మహిళల నాయకత్వంలో రూపొందాయి.

  1. పురుషులు లేని సంభాషణ, డైలాగ్‌ కనీసం ఒకటైనా ఉందా? కథానాయకుడితో ప్రేమ లేదా కుటుంబ సంబంధం లేని పాత్రను పోషించిన ఒక మహిళా పాత్ర ఉందా?

  2. 2. షో/సినిమా కథకు కీలకమైన ఆర్థిక, గృహసంబంధ, సామాజిక నిర్ణయాలను తీసుకోవడంలో, కనీసం ఒక్కరైనా చురుకైన మహిళ పాత్రను పోషిస్తున్నారా? 

  3. కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు, సిరీస్‌లలో పురుష పాత్రలపై వ్యతిరేక దృక్పథాన్ని వ్యక్తపరచే అంశం ఉందా?

  4. షో/సినిమా స్త్రీలను లైంగికంగా చిత్రీకరించడం లేదా మహిళలపై హింసను సాధారణంగా లేదా ఆమోదయోగ్యంగా చిత్రీకరిస్తుందా?

మొదటి మూడు ప్రశ్నలకు సానుకూల సమాధానం ‘అవును’, అయితే నాల్గవ ప్రశ్నకు అది ‘లేదు’ అని సమాధానాలు వచ్చినట్లయితేనే, తమ సినిమాలో లేదా సిరీస్‌లో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం దక్కుతున్నట్లు నిర్మాతలు ఎవరికి వారే తేల్చుకోవచ్చు. అందుకు ఈ ప్రశ్నావళి ఉపయోగపడుతుంది.

మహిళా జట్టు సినిమాల హిట్టు
పూర్తి మహిళా బృందంతో చిత్రీకరించిన తొలిచిత్రం ‘ది మైడెన్‌’. 2018లో అలెక్స్‌ హూమ్స్‌ రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాను విక్టోరియా గ్రెగరీ ‘న్యూ బ్లాక్‌ ఫిల్మ్స్‌’ నిర్మించింది. ఇందులో ఒక అమ్మాయి సెకండ్‌ హ్యాండ్‌ నౌకను కొని, నౌకాయానం నేర్చుకొని, రేసులో ఎలా గెలుస్తుందో చూపించారు. ఇదేవిధంగా మహిళలు ప్రధానంగా, ఎక్కువ సంఖ్యలో ఉండి ఎన్నో సినిమాలు తీశారు. వాటిల్లో ముఖ్యమైనవి, చెప్పుకోదగినవి ‘ది వుమెన్‌’. 1939లో విడుదలైన ఈ సినిమాలో ఒక్క పురుషుడు కూడా కనిపించడు. మొత్తం 130 మంది మహిళలు ఇందులో నటించారు.

అలాగే ‘స్టీల్‌ మాగ్నోలియాస్‌’ సినిమాలో లూసియానా పట్టణంలోని ఒక స్త్రీల బృందం జీవితం, ప్రేమను చూపిస్తుంది. ‘ఎ లీగ్‌ ఆఫ్‌ దేర్‌ ఓన్‌’ ఇదొక బేస్‌బాల్‌ బృందం కథ. తక్కువ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఎంతోమంది చేత కంటతడి పెట్టిస్తుంది. 1993లో విడుదలైన ‘ది జాయ్‌ లక్‌ క్లబ్‌’ సినిమా చైనీస్‌ మహిళల వలసలు, తల్లుల మధ్య సంబంధాలను అద్భుతంగా చిత్రీకరించింది. 2018లో విడుదలైన ‘ఓసెన్స్‌ 8’ చిత్రం, మహిళలు దోపిడీలు చేస్తే ఎలా ఉంటుందో కాస్త నవ్విస్తూనే అందరినీ ఆశ్చర్యపరచేలా చూపించింది.

తెలుగు తెర మెరుపులు..
మహానటి సావిత్రి
మహానటి సావిత్రి గొప్ప నటిగానే కాకుండా, దర్శకురాలిగానూ పేరు సంపాదించుకున్నారు. హీరోయిన్‌గా కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడే ఆమె దర్శకత్వంలో ప్రయోగం చేశారు. సావిత్రి దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘చిన్నారి పాపలు’. 1968లో ‘శ్రీమాతా పిక్చర్స్‌’ నిర్మాణ సంస్థ విడుదల చేసిన ఈ చిత్రానికి సావిత్రి స్వయంగా కథారచన చేశారు. వాణిజ్యపరంగా ఇది విఫలమైనప్పటికీ, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘మాతృదేవత’, ‘వింత సంసారం’ వంటి సినిమాలకు కూడా ఆమె దర్శకత్వం వహించారు. 

బహుముఖ ప్రజ్ఞశాలి భానుమతి 
తెరపై కథానాయికగానే కాదు, తెర వెనుక అనేక విభాగాల్లోనూ పనిచేసిన నటి భానుమతి రామకృష్ణ. ‘చండీరాణి’ సినిమాతో డైరెక్టర్‌గా మారిన ఆమె, ‘నాలో నేను’ అనే పుస్తకంతో పాటు, మరెన్నో పాటలకు రచన, గాత్రం అందించారు. భర్త రామకృష్ణతో కలసి చిత్ర నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు. కళారంగంలో ఆమె చేసిన కృషికి జాతీయ చలనచిత్ర అవార్డుతోపాటు, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. 

రికార్డు నెలకొల్పిన విజయనిర్మల  
సినీ ప్రపంచంలోకి ఒంటరిగా అడుగుపెట్టి, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహిళ విజయనిర్మల. కేవలం నటిగానే కాదు, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై తన పేరుకు తగ్గట్లుగానే ఎన్నో విజయాలు సాధించారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి, గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్ట్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. 

సినీ సీతమ్మ అంజలీదేవి
సీతాదేవి అనగానే ఠక్కుమని గుర్తొచ్చే నటి అంజలీదేవి. అభినయ సీతమ్మగా పాపులర్‌ అయిన ఆమె నటిగా, డ్యాన్సర్‌గానే కాదు, నిర్మాతగానూ చేశారు. తన భర్త ఆదినారాయణరావుతో కలసి నెలకొల్పిన ‘అంజలీ పిక్చర్స్‌’ నిర్మాణ సంస్థ ద్వారా ‘భక్త తుకారం’, ‘చండీప్రియ’ సహా మొత్తం 27 సినిమాలను నిర్మించారు. 

కృష్ణవేణి 
ఎన్టీఆర్‌లాంటి మహానటుడిని చిత్రసీమకు పరిచయం చేసిన, ప్రముఖ నిర్మాత చిత్తజల్లు కృష్ణవేణి బాలనటిగా రంగప్రవేశం చేశారు. ఇటీవల మరణించిన ఆమె, మీర్జాపురం రాజావారితో వివాహం అనంతరం ‘జయా పిక్చర్స్‌’ బాధ్యతలనూ తీసుకున్నారు. తర్వాత ‘శోభనాచల స్టూడియోస్‌’గా పేరు మార్చి ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఆమె కుమార్తె అనురాధ కూడా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 17 సినిమాలు నిర్మించి, అత్యధిక చిత్రాలను నిర్మించిన మహిళా నిర్మాతగా లిమ్కా బుక్‌ రికార్డ్స్‌ సాధించారు. కృష్ణవేణి తన 98 ఏళ్ల వయసులో 2022లో ‘సాక్షి ఎక్సలెన్స్‌’ అవార్డుల్లో భాగంగా  ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు.  

మరెందరో!
నటి జీవితా రాజశేఖర్‌ ‘శేషు’ సినిమాతో దర్శకురాలిగా మారి, ‘సత్యమేవజయతే’, ‘మహంకాళి’ వంటి సినిమాలను రూపొందించారు. సూపర్‌స్టార్‌ కృష్ణ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంజుల ఘట్టమనేని ‘మనసుకు నచ్చింది’ సినిమాకు దర్శకత్వం వహించారు. మరెన్నో సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. తొలి చిత్రం ‘ఆంధ్రా అందగాడు’ సినిమాతో విమర్శలు అందుకున్న సుధ కొంగర, తాజాగా ఆకాశమే హద్దు అనిపించారు.

‘ద్రోహి’, ‘గురు’ చిత్రాలతో పాటు, ‘ఆకాశమే నీ హద్దు రా’ సినిమాతో వరుస విజయాలు అందుకున్నారు. ‘అలా మొదలైంది’ చిత్రంతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన నందినిరెడ్డి, ‘కళ్యాణ వైభోగమే’, ‘ఓ బేబీ’ మరెన్నో విజయవంతమైన చిత్రాలను చిత్రీకరించారు. దశాబ్దంపాటు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచే సి, తొలిచిత్రం ‘పెళ్లి సందడి’తో విజయం సాధించారు డైరెక్టర్‌ గౌరీ రోణంకి.  

నిర్మాణ రారాణులు
సినీ ప్రపంచంలో నిర్మాతలుగా రాణిస్తున్న రాణులు కూడా లేకపోలేదు. దిల్‌రాజు కుమార్తె హన్షితా రెడ్డి, తండ్రి బాటలోనే సుమారు 50కి పైగా సినిమాలు నిర్మించారు. మెగా కుటుంబం నుంచి వచ్చిన నిహారిక కొణిదెల కూడా ఇటు ప్రొడక్షన్‌ రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. పలు వెబ్‌ సిరీస్‌లు, షార్ట్‌ ఫిల్మ్స్‌ నిర్మించారు. చిన్న సినిమాలే కాదు, భారీ బడ్జెట్‌ చిత్రాలను నిర్మించారు, నిర్మాత అశ్వనీ దత్‌ కూతుర్లు అయిన స్వప్న దత్, ప్రియాంక దత్‌. అన్నపూర్ణ స్టూడియోస్‌ సీఈఓ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సుప్రియ యార్లగడ్డ కూడా ఎన్నో చిత్రాలను నిర్మించింది. వీరితో పాటు నటి సమంత ‘ట్రలాలా మూవింగ్‌ పిక్చర్స్‌’ , నయనతార ‘రౌడీ పిక్చర్స్‌’, జ్యోతికలు వివిధ ప్రొడక్షన్‌ హౌస్‌లు స్థాపించి, తమదైన రీతిలో రాణిస్తున్నారు. 

చిత్రపరిశ్రమలో వైవిధ్యం, స్త్రీ పురుష సమానత్వం ఉన్నట్లయితే, సమాజంలో సానుకూల మార్పులకు అవి దోహదపడతాయి. వినోదరంగంలో మహిళలకు మరిన్ని అవకాశాలను సృష్టిస్తూ, వైవిధ్యభరితమైన, సమ్మిళితమైన, సమానమైన పరిస్థితులను కల్పించాలి. ప్రతి ఒక్కరూ స్త్రీలను చూసేలా, వినగలిగేలా, సానుకూలంగా చెప్పుకునేలా చేయాలి. అప్పుడే సినిమా బతుకుతూ, మరెందరినో బతికిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement