సినిమా తారలకు డబ్బింగ్ చెబుతారని మనకు తెలిసిందే. సాధారణంగా మగవారికి మేల్ వాయిస్ ఆడవారికి ఫిమేల్ వాయిస్ ఆర్టిస్ట్‌లు ఉంటారు. కానీ, అమ్మాయిలకు అబ్బాయి డబ్బింగ్ చెబితే..! ఆశ్చర్యమనిపించక మానదు...
ఎంబీబీఎస్ చేసిన ఆద్య హనుమంత్ ఇప్పటి వరకు సమంత (Samantha), సాయిపల్లవి, అవికాగోర్.. ఇలా తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ సినిమా హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పాడు. ఇప్పటి వరకు 175 సినిమాలలకు డబ్బింగ్ చెప్పిన ఆద్య హనుమంత్ తెలంగాణలోని మహబూబ్‌నగర్ వాసి. కర్ణాటకలోని రాయచూరులో ఉంటున్న ఆద్య హనుమంత్‌కి ఇలాంటి క్రేజీ వాయిస్ ఎలా అబ్బిందో, సినిమాలకు స్పెషల్ వాయిస్ ఆర్టిస్ట్ (Voice Artist)గా ఎలా మారారో అతని మాటల్లోనే తెలుసుకుందాం..
నా వయసు ఇప్పుడు 22 ఏళ్లు. పదమూడేళ్ల వయసు నుంచి డబ్బింగ్ చెబుతున్నాను. స్కూల్ ఏజ్‌లో ఉన్నప్పుడు నా వాయిస్ బాగుంటుందని సీరియల్స్‌లోని చైల్డ్ ఆర్టిస్టులకు డబ్బింగ్ చెప్పించేవారు. తర్వాత్తర్వాత హీరోయిన్లకు నా వాయిస్ కనెక్ట్ అయ్యింది.
నాలుగు భాషల్లో...
సాధారణంగా ఇతర భాషల్లోని డబ్బింగ్ ఆర్టిస్టులు మన దగ్గర ఫేమస్‌గా ఉంటారు. నేను మాత్రం తెలంగాణ నుంచి తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. సమంత, సాయిపల్లవి, ఐశ్వర్య, అవికా... ఇలా ప్రముఖ హీరోయిన్లందరికీ డబ్బింగ్ చెప్పాను.
ఒక పూట తిండి అయినా మానేస్తా!
నా గొంతు అమ్మాయిల మాదిరి ఉంటుందని, మరింత స్పెషల్‌గా ఉంటుందని అంతా అంటుంటారు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. అదంతా దేవుడి దయ. ఇష్టమైన పని కావడంతో డబ్బింగ్, చదువు రెండింటినీ ప్రేమిస్తాను. కష్టంగా ఉన్నా ఒక పూట తిండి అయినా మానేస్తాను. కానీ, చదువుతోపాటు డబ్బింగ్ కూడా నాకు ప్రాణమే. ఎప్పుడు ఈ గొంతు మారబోతుందో చెప్పలేను. కానీ, ప్రేక్షకులు ఎంత కాలం కోరుకుంటే అంతకాలం డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతాను. ప్రత్యేకించి ప్రాక్టీస్ ఏమీ ఉండదు. డైలాగ్ మాడ్యులేషన్ మాత్రం పలికిస్తాను. అది అందరినీ ఆకట్టుకుంటుంది.
వెక్కిరించారు...
‘ఆడపిల్లలా ఆ గొంతేంటి?’ అని వేళాకోలం అడినవారు ఉన్నారు. మొహమ్మీదనే చులకనగా మాట్లాడిన వారూ ఉన్నారు. కానీ, మా అమ్మ ఒకసారి చెప్పింది. ‘దేవుడు, నీకు మాత్రమే ఇంత ప్రత్యేకత ఎందుకిచ్చాడో గమనించు. మనం చేయాలనుకున్న పని సాధారణంగా ఉండకూడదు. ఎంత రిస్క్ అయినా ఒక్క అడుగు ముందుకే వేసి చూడు’ అని చెప్పేది. ఆ మాటలు నాకు ఈ రోజు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువస్తున్నాయి.
చాలా మంది తమ సమస్యలను నాతో చెప్పుకోవడానికి ఇష్టపడుతుండేవారు. దీంతో ఎంబీబీఎస్‌లో ఉన్నప్పుడు సైకియాట్రీ ఎంచుకోవాలనుకున్నాను. సైకియాట్రీలో పీజీ చేస్తున్నాను. మెడికల్, సినీ ఫీల్డ్‌ని రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ప్రయాణించాలనుకుంటున్నాను. శని, ఆదివారాలు డబ్బింగ్‌కి ఎంచుకుంటున్నాను. మిగతా రోజుల్లో చదువు, సంగీతానికి ప్రాధాన్యత ఇస్తాను. యూనివర్శిటీ ప్రొఫెసర్లు నాకు చాలా సపోర్ట్ చేస్తుంటారు.
వెలుగులోకి తెచ్చిన సోషల్ మీడియా...
సోషల్ మీడియా అనగానే అప్‌కమింగ్ స్టార్స్ అందరూ అక్కడే ఉంటారు. దీంతో నేనూ ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా ఉంటూ వచ్చాను. ‘ఇట్లు మీ సీతా మహాలక్ష్మి’ అనే పేజీ ప్రారంభించాను. సోషల్‌మీడియా ద్వారా ఎంతో మంది నాకు స్నేహితులయ్యారు. తెలుగు నుంచి తమిళ్, కన్నడ నుంచి తెలుగు ప్రముఖుల కవిత్వాలను అనువాదం చేస్తుంటాను.
సోషల్ మీడియా ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో సీతానగరంలోని ఓ కుటుంబానికి నాకు స్నేహం కుదిరింది. దీంతో సంక్రాంతి పండగకు సీతానగరం వచ్చేశాను. గోదావరి అందం, వారి పలకరింపులు, ఆప్యాయత, పిండివంటలు ఆస్వాదిస్తున్నాను. ఎప్పటికీ వాయిస్ ఇలాగే ఉంటుంది అని చెప్పలేను. ఇప్పటికైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. కర్నాటకలో ఉన్నా నాకు మాత్రం తెలుగు ఇండస్ట్రీనే బాగా సపోర్ట్ చేసింది. మంచి గుర్తింపు వచ్చింది’’ అని చెబుతాడు ఈ ఫిమేల్ వాయిస్ ఆర్టిస్ట్.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment