
‘‘సాధారణంగా హీరో లేదా హీరోయిన్లకు తాము నటించిన సినిమా హిట్ అయితేనే అభిమానం, ప్రేమ చూపేవారు ఎక్కువ ఉంటారు. కానీ, గత రెండేళ్లుగా నేను ఒక్క తమిళ సినిమా కూడా చేయలేదు. పైగా ఇటీవల నా ఖాతాలో ఏ హిట్ మూవీ లేదు. అయినా నాపై మీ (అభిమానులను ఉద్దేశించి) ప్రేమ, అభిమానం ఏమాత్రం తగ్గలేదు. మీ అభిమానం, ప్రేమ చూస్తుంటే మాటలు రావడం లేదు. మీ నుంచి ఈ స్థాయిలో ప్రేమాభిమానాలు పొందేందుకు నేను ఏం చేశానో కూడా అర్థం కావడం లేదు.
ఏది ఏమైనా మీరు లేకుండా నేను లేను... మీ వల్లే ఈ స్థాయిలో ఉన్నాను’’ అని సమంత అన్నారు. స్ఫూర్తిదాయక పాత్రల్లో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తున్నందుకు ‘కె. బాలచందర్ హాల్ ఆఫ్ ఫేమ్’ అవార్డుతో చెన్నైలో జరిగిన ‘బిహైండ్‌వుడ్స్ అవార్డ్స్’ వేడుకలో సమంతను సత్కరించారు నిర్వాహకులు. ఈ వేదికపై సమంత మాట్లాడుతూ–‘‘కె. బాలచందర్ సార్ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన సినిమాల్లో మహిళల పాత్రలు ఎంతో సహజంగా ఉంటాయి.
ఆయన నుంచి నేనెంతో స్ఫూర్తి పొందాను. అలాంటి బాలచందర్ సార్ అవార్డుని అందుకోవడంతో నా జీవితం పరిపూర్ణం అయినట్లు భావిస్తున్నాను. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసినవారికి కృతజ్ఞతలు’’ అని తెలిపారు. ఈ అవార్డు మాత్రమే కాదు... ‘సిటాడెల్: హనీ బన్నీ’ టీవీ సిరీస్‌కిగాను ఉత్తమ నటి అవార్డును కూడా సమంతకు ప్రదానం చేశారు. ఇదిలా ఉంటే... 2022లో విడుదలైన ‘కాత్తు వాక్కుల రెందు కాదల్’ తర్వాత ఆమె తమిళంలో ఏప్రాజెక్ట్‌కు ఓకే చెప్పలేదు.
అలాగే తెలుగులో ‘ఖుషి’ (2023) సినిమా తర్వాత మరో చిత్రంలో నటించలేదు సమంత. ప్రస్తుతం ఆమె ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. అలాగే తన సొంత నిర్మాణ సంస్థ ‘త్రలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై సమంత నిర్మిస్తున్న తొలి చిత్రం ‘శుభం’ షూటింగ్ పూర్తయింది.
Comments
Please login to add a commentAdd a comment