బాలీవుడ్‌ కాలింగ్‌ | South Indian Actresses Making Bollywood Debut | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ కాలింగ్‌

Published Sun, Jun 9 2024 12:07 AM | Last Updated on Sun, Jun 9 2024 12:07 AM

South Indian Actresses Making Bollywood Debut

ప్రతి ఏడాది బాలీవుడ్‌ తారలు కొంతమంది టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుంటారు. అలాగే దక్షిణాది హీరోయిన్లు కూడా బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుంటారు. ఈ ఏడాది కొందరు సౌత్‌ హీరోయిన్లను బాలీవుడ్‌ పిలిచింది. బాలీవుడ్‌ నుంచి కాల్‌ అందుకుని, ప్రస్తుతం అక్కడ సినిమాలు చేస్తున్న దక్షిణాది కథానాయికల గురించి తెలుసుకుందాం. 

కెరీర్‌లో యాభైకి పైగా సినిమాల్లో నటించి, దక్షిణాదిన స్టార్‌ హీరోయిన్‌ జాబితాలో చేరిపోయారు సమంత. హిందీలో ‘ఫ్యామిలీ మేన్‌’ సీజన్‌ 2 వెబ్‌ సిరీస్‌లో చేసిన రాజ్యలక్ష్మి పాత్రతో ఉత్తరాదిన కూడా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇదే జోష్‌లో ఇండియన్‌ వెర్షన్‌ ‘సిటాడెల్‌’ వెబ్‌ సిరీస్‌ను కూడా పూర్తి చేశారామె. వరుణ్‌ ధావన్‌ హీరోగా నటించిన ఈ హిందీ సిరీస్‌ త్వరలోనే స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.

ఇలా హిందీలో రెండు వెబ్‌ సిరీస్‌లు చేసిన సమంత ఇంకా అక్కడ ఒక్క సినిమా కూడా చేయలేదు. గతంలో రణ్‌వీర్‌ సింగ్, విక్కీ కౌశల్, రాజ్‌కుమార్‌ రావుల సినిమాల్లో సమంత హీరోయిన్‌గా నటిస్తారనే ప్రచారం సాగింది. కానీ అప్పట్లో ఆమె అనారోగ్య పరిస్థితుల కారణంగా కుదర్లేదట. ఇప్పుడు ఆ సమయం వచ్చిందట. ఓ హిందీ చిత్రం కోసం సమంత ఇటీవల కథ  విన్నారని బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. సో... హిందీలో సమంత నటించే తొలి చిత్రంపై స్పష్టత రావడానికి కొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.

కాస్త ఆలస్యంగా... 
దక్షిణాదిలో అగ్ర కథానాయికల్లో కీర్తీ సురేష్‌ ఒకరు. నటిగా సౌత్‌లో తన సత్తా ఏంటో సిల్వర్‌ స్క్రీన్‌పై చూపించిన కీర్తీ సురేష్‌ బాలీవుడ్‌లోనూ టాప్‌ హీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నట్లున్నారు. ఈ క్రమంలోనే హిందీ చిత్రం ‘బేబీ జాన్‌’కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వరుణ్‌ ధావన్‌ హీరోగా నటించిన ఈ సినిమాలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటించారు. హిందీలో కీర్తీకి ఇది తొలి చిత్రం కాగా ఈ చిత్రదర్శకుడు కాలీస్‌ (తమిళ డైరెక్టర్‌)కు కూడా హిందీలో ఇదే తొలి చిత్రం. తమిళంలో అట్లీ దర్శకత్వం వహించిన ‘తేరీ’ సినిమాకు హిందీ రీమేక్‌గా ‘బేబీ జాన్‌’ తెరకెక్కింది.

జ్యోతిదేశ్‌ పాండే, మురాద్‌ ఖేతనీ, అట్లీ, ప్రియా అట్లీ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను మే 31న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ వాయిదా పడింది. కొత్త తేదీ పై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే కీర్తీ సురేష్, రాధికా ఆప్టే లీడ్‌ రోల్స్‌లో హిందీలో ఓ యాక్షన్‌ వెబ్‌ సిరీస్‌ కూడా రూపొందుతోంది. ఇదిలా ఉంటే... ‘బేబీ జాన్‌’ చిత్రానికన్నా ముందే కీర్తీకి బాలీవుడ్‌ ఆఫర్‌ వచ్చింది. అజయ్‌ దేవగన్‌ హీరోగా నటించిన హిందీ చిత్రం ‘మైదాన్‌’లో ముందు హీరో యిన్‌గా కీర్తీ సురేష్‌ను తీసుకున్నారు ఈ చిత్రదర్శకుడు అమిత్‌ శర్మ. కానీ ఆ తర్వాత కీర్తీ సురేష్‌ ఈ ్రపాజెక్ట్‌ నుంచి తప్పుకోగా, ప్రియమణి నటించారు. ‘మైదాన్‌’ ఈ ఏడాది ఏప్రిల్‌ 10న రిలీజైంది. ఇలా కీర్తీ సురేష్‌ బాలీవుడ్‌ ఎంట్రీ కాస్త ఆలస్యమైంది. 

ఏక్‌ దిన్‌ 
హీరోయిన్‌ సాయి పల్లవికి సౌత్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఈ క్రేజ్‌ను బాలీవుడ్‌లోనూ రిపీట్‌ చేయాలనుకుంటున్నారీ బ్యూటీ. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ తనయుడు జునైద్‌ ఖాన్‌ నటించిన చిత్రం ‘ఏక్‌ దిన్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌)లో నటించారు సాయి పల్లవి. హిందీలో సాయి పల్లవి నటించిన తొలి చిత్రం ఇదే. ఈ సినిమా మేజర్‌ షూటింగ్‌ జపాన్‌లో జరిగింది. ఆమిర్‌ ఖాన్‌ ఓ నిర్మాతగా ఉన్న ఈ ‘ఏక్‌ దిన్‌’ సినిమా చిత్రీకరణ పూర్తయింది.

ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. దక్షిణాది భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట ఆమిర్‌ ఖాన్‌. మరోవైపు మరో హిందీ చిత్రం ‘రామాయణ్‌’లో  సాయి పల్లవి నటిస్తున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్నారు. సీతారాములుగా సాయి పల్లవి, రణ్‌బీర్‌ నటిస్తున్న ఈ భారీ చిత్రానికి నితీష్‌ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. యశ్, నమిత్‌ మల్హోత్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2025 చివర్లో ఈ సినిమా తొలి భాగాన్ని విడుదల చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారని బాలీవుడ్‌ టాక్‌. 

కబురొచ్చింది 
ప్రస్తుతం తెలుగులో ట్రెండింగ్‌ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. నటన పరంగా ఈ బ్యూటీకి ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. అందువల్లే రవితేజ ‘ధమాకా’, మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించగలిగారు. తాజాగా శ్రీలీలకు బాలీవుడ్‌ నుంచి కబురొచ్చిందని టాక్‌. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ తనయుడు ఇబ్రహీం ఆలీఖాన్‌ హీరోగా ‘దిలేర్‌’ అనే సినిమా రూపొందుతోంది. కృణాల్‌ దేశ్‌ముఖ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ ఫిల్మ్‌లో ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉందట. ఓ హీరోయిన్‌ పాత్ర కోసం మేకర్స్‌ శ్రీలీలను సంప్రదించారని సమాచారం. కథ నచ్చడంతో శ్రీలీల కూడా ఓకే చెప్పారని వినికిడి. అదే నిజమైతే శ్రీలీలకు ఇదే తొలి హిందీ చిత్రం అవుతుంది. 


 కేరాఫ్‌ మహారాజ్ఞి 
‘బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్‌’ వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు సంయుక్తా మీనన్‌. అలాగే మలయాళ, తమిళ, కన్నడ చిత్రాల్లోనూ హీరోయిన్‌గా నటించి పాపులర్‌ అయ్యారామె. ఇప్పుడు బాలీవుడ్‌ ఎంట్రీకీ రెడీ అయ్యారు. కానీ హీరోయిన్‌గా కాదు... ఓ లీడ్‌ రోల్‌లో... కాజోల్, ప్రభుదేవా లీడ్‌ రోల్స్‌లో ‘మహారాజ్ఞి: క్వీన్‌ ఆఫ్‌ క్వీన్స్‌’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చరణ్‌తేజ్‌ ఉప్పలపాటి ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీకి దర్శకుడు.

ఈ సినిమాలో సంయుక్తా మీనన్‌ ఓ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కాజోల్‌కు చెల్లి పాత్రలో కనిపిస్తారట సంయుక్త. నసీరుద్దీన్‌ షా, ఆదిత్య సీల్, చాయా కదమ్‌ వంటివారు ఈ సినిమాలోని ఇతర లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. వెంకట అనీష్, హర్మాన్‌ బవేజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 
ఇలా బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న దక్షిణాది కథానాయికల జాబితాలో మరికొంతమంది ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement