
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం చావా ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
సినిమా అనేది మన జీవిత ప్రతిబింబం. మన జీవితంలో ఎన్నో రకాల భావావేశాలు, వాటికి కారణమైన కథనాలు ఎన్ని ఉంటాయో వాటన్నిటినీ మళ్లీ నాటకీయంగా రూపకల్పన చేసి, నటీనటులను అవే కథనాలలో నటింపజేసి మన జీవితాన్ని మనకే అద్దంలో చూపించే మహా ప్రయత్నమే సినిమా. చిన్నప్పుడు బామ్మ ఒళ్లో చందమామను చూస్తూ చెప్పే కథలు చక్కగా ఎందుకు వింటామో తెలుసా... ఎక్కువగా చరిత్రలోని కథనాలే ఆవిడ మనకి చెప్పారు కాబట్టి. మన చరిత్రలో మన పూర్వీకుల వీరత్వం ఉంది. ఆ వీరత్వం మాటున బోలెడంతపోరాటం ఉంది.
ఆపోరాటం వెనక దాగి ఉన్న పట్టుదలతో కూడిన త్యాగం ఉంది. ఆ త్యాగంలో కనబడని బాధ, కనిపించే ఆనందంలాంటివి ఎన్నో ఉన్నాయి. అటువంటిపోరాటాలను అడపా దడపా నేటి దర్శకులు సినిమాల రూపంలో మన ముందుకు తీసుకువస్తున్నారు. ఆ కోవకు చెందినదే ‘చావా’ చిత్రం. ఛత్రపతి శివాజీ పేరు చాలా మందికి తెలుసు. కానీ శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ గురించి అందరికీ తెలియజేసేలా ఈ సినిమా ఉంటుంది. సినిమా ఆరంభంలోనే నాటి మొఘలు సామ్రాజ్యానికి చెందిన ఔరంగజేబుకు ఓ వార్త అందుతుంది. భారతదేశం మూలమూలలా కబళించిన మొఘలులు మరాఠాల ప్రాంతంలో మాత్రం అడుగు కూడా పెట్టలేక΄ోతారు. దానికి కారణం ఛత్రపతి శివాజీ. ఆయన ఇక లేరన్న వార్త ఔరంగజేబుకు అమృతంలా అందుతుంది.
వార్త విన్న ఆనందం ఆస్వాదించేలోపే శివాజీ కొడుకు శంభాలా గురించి కూడా ఔరంగజేబుకు తెలుస్తుంది. దాంతో ఔరంగజేబు తన కిరీటాన్ని తీసేసి, శంభాలాను చంపిన తర్వాతే తాను మళ్లీ కిరీటాన్ని పెట్టుకుంటానని ప్రతిన బూనుతాడు. ఆ తర్వాత శంభాలాని ఔరంగజేబు కుట్రతో ఎంత దారుణంగా చంపుతాడనేదే ఈ సినిమా. లక్ష్మణ్ ఉఠేకర్ ఈ సినిమాకి దర్శకుడు. ప్రముఖ వర్ధమాన నటుడు విక్కీ కౌశల్ శంభాలాపాత్రలో ఒదిగి΄ోయారు. ఏసుబాయిపాత్రలో రష్మికా మందన్నా కూడా అద్భుతంగా ఒదిగి΄ోయారు. అలాగే ఔరంగజేబుపాత్రలో అక్షయ్ ఖన్నా జీవించారు. ఇక సినిమా పరంగా ప్రతి క్షణం ప్రేక్షకుడిని ఉద్వేగపరుస్తూ చివర్లో కన్నీటితో సాగనంపుతారు దర్శకుడు. అయితే ఇది కథాపరంగా మాత్రమే సుమా.
గడిచిన పదేళ్లలో ‘బాహుబలి’తో ప్రపంచ ఖ్యాతిని మూటగట్టుకున్న మన టాలీవుడ్ గురించే ప్రేక్షకులు మాట్లాడుకుంటున్న ఈ తరుణంలో ‘చావా’ సినిమా మాత్రం దాదాపుగా అడుగంటిన బాలీవుడ్ ఖ్యాతిని ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ లేపిందనే చెప్పాలి. ఈ సినిమా విడుదలకు ముందు తర్వాత కూడా ఎన్నో సంచలనాలకు దారి తీసిందన్న విషయం మనకు తెలుసు. ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమ్ అవుతున్న ఈ ‘చావా’ ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా, కాదు కాదు చూసి తెలుసుకోవాల్సిన చరిత్ర. తప్పనిసరిగా చూడాల్సిన చిత్రం. – హరికృష్ణ ఇంటూరు