
ఆదర్శ్ గౌరవ్ (Adarsh Gourav).. సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలెగావ్ సినిమాతో ఇటీవలే ప్రేక్షకులను అలరించాడు. ద వైట్ టైగర్ సినిమాతో విశేష ఆదరణ సంపాదించుకున్న ఇతడు హిందీలో దాదాపు 9 సినిమాలవరకు చేశాడు. హాస్టల్ డేజ్, గన్స్ అండ్ గులాబ్స్ వంటి వెబ్ సిరీస్‌లలోనూ మెప్పించాడు. తెలుగు వెండితెరకు పరిచయం కావాలని చాలాకాలంగా కలలు కంటున్నాడు. కానీ దారి తెలియక బాలీవుడ్‌లోనే ఆగిపోయాడు.
టాలీవుడ్‌లో కనిపించాలన్నది ఆశ
అలాంటి సమయంలో సమంత సాయం చేసిందని, తన ఒత్తిడి వల్లే తెలుగులో ప్రయత్నాలు చేసి ప్రాజెక్ట్ దక్కించుకున్నానంటున్నాడు. ఆదర్శ్ గౌరవ్ మాట్లాడుతూ.. నా మాతృ భాష తెలుగు. తెలుగు సినిమాల్లో (Tollywood) పని చేయాలని ఎంతోకాలంగా అనుకుంటున్నాను. కానీ ఎవర్ని సంప్రదించాలి? ఎలా అవకాశాలు తెచ్చుకోవాలన్నది నాకేమీ తెలియదు. ఈ విషయంలో నేను సమంతకు థాంక్స్ చెప్పుకోవాల్సిందే!
సమంత సాయంతో..
సిటాడెల్ సిరీస్ పూర్తయ్యాక ఆ యూనిట్ సెలబ్రేట్ చేసుకున్న పార్టీకి నేనూ వెళ్లాను. అప్పుడు నాకు తెలుగులో పని చేయాలనుందని సమంత (Samantha Ruth Prabhu)కు చెప్పాను. సరే, అలాగైతే టాలీవుడ్‌లో జరిగే ఆడిషన్స్‌కు వెళ్లు అని నొక్కి చెప్పింది. కావాలంటే కొన్ని మీటింగ్స్‌కు నన్ను తీసుకెళ్లేందుకు సాయం చేస్తానంది. తన మేనేజర్ సాయంతో తెలుగులో చాలామందిని కలిశాను. పలువురితో చర్చలు కూడా జరిగాయి.
(చదవండి: కన్నడ స్టార్ యశ్‌తో విభేదాలు.. స్పందించిన సోదరి)
అవన్నీ నిజ జీవితంలో..
అలా ఓ దర్శకుడు పరిచయం అయ్యాడు. ప్రస్తుతం ఆయనతో సినిమా చేస్తున్నాను. ఇది సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. నేను ఎక్కువగా అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోత్వానె, దిబాకర్ బెనర్జీ, జోయా అక్తర్ సినిమాలే ఎక్కువగా చూశాను. అందులో వారు చూపించే పాత్రలు నిజ జీవితంలో నాకు తారసపడినట్లే కనిపిస్తాయి. ఇకపోతే నా చిన్నతనంలో మా ఇంట్లో ఓ కఠిన నియమం ఉండేది. అదేంటంటే.. బయట ఏ భాష అయినా మాట్లాడు, కానీ ఇంట్లోకి వచ్చాక మాత్రం తెలుగు మాత్రమే మాట్లాడాలన్న నిబంధన ఉండేది.
ఇప్పుడర్థమవుతోంది
అప్పుడు నాకర్థం కాలేదు కానీ ఇప్పుడు నాకెంతగానో ఉపయోగపడుతోంది. నాకు చిన్నప్పటినుంచి తెలుగు మాట్లాడే ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఈ ఇండస్ట్రీకి నేను కొత్త, ఇక్కడికి వచ్చి కొన్నాళ్లే అవుతున్నా ఏదో దగ్గరి సంబంధం ఉన్న అనుభూతి వస్తుంది. నాకు ఎవరూ తెలియకపోయినా భాష వల్ల అంతా ఒక్కటే అన్న ఫీలింగ్ వస్తోంది అని చెప్పుకొచ్చాడు. తన తెలుగు సినిమా టైటిల్, దర్శకుడెవరు? వంటి వివరాలు మాత్రం చెప్పలేదు.
చదవండి: 'డ్రాగన్' నా లైఫ్‌లో జరిగిందే.. మనీ అడగాలంటే సిగ్గనిపించింది: డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment