
‘‘సమస్య ఎక్కడైనా ఉంటుంది. ఎలా ఎదుర్కొంటున్నామన్నదే ముఖ్యం. సమస్యలకు భయపడి పారిపోతే ఓడిపోతాం... ధైర్యంగా ఎదుర్కొంటే గెలుస్తాం’’ అంటున్నారు శ్రుతీహాసన్. తన తల్లి సారిక సినిమాలు చేసినప్పటి పరిస్థితులను, ఇప్పుటి పరిస్థితులను పోల్చి కొన్ని విషయాలు చెప్పారు శ్రుతి. ఇంకా ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో శ్రుతీహాసన్ చెప్పిన విషయాలు తెలుసుకుందాం.
∙మీ అమ్మగారి కెరీర్‌ని చూశారు... అప్పటి ఆమె కెరీర్ పరిస్థితులను ఇప్పటి మీ కెరీర్‌తో పోల్చుకున్నప్పుడు ఏమనిపిస్తోంది?
అప్పటి పరిస్థితుల గురించి అమ్మ నాతో చెప్పేవారు. ‘ఈక్వాలిటీ’ విషయంలో అప్పుడు ప్రాబ్లమ్ ఉండేదట. ఉమెన్‌కి చాలా తక్కువప్రాధాన్యం ఉండేదట. అలాగే అప్పట్లో ‘పీరియడ్స్’ గురించి బాహాటంగా మాట్లాడడానికి సిగ్గుపడేవాళ్లు. అసలు బయటకు చెప్పకూడదన్నట్లు ఉండేది. ఇబ్బందిగా ఉన్నా బయటకు చెప్పకుండా షూటింగ్ చేసేవాళ్లు. ఇప్పుడు పీరియడ్స్ ఇబ్బంది గురించి ఓపెన్‌గా చెప్పి, ఆ రోజు పని మానుకునే వీలు ఉంది.
∙మరి... మీ జనరేషన్ హీరోయిన్లతో పోల్చితే అప్పటివారు ఏ విషయంలో హ్యాపీ?
మాటల విషయంలో... అప్పట్లో కాస్త ఓపెన్‌గా మాట్లాడగలిగేవాళ్లు. కానీ ఇప్పుడు ఏం మాట్లాడితే ఏం వస్తుందోనని మాటలకు కత్తెర పెట్టాల్సిన పరిస్థితి. అయితే నేనలా కాదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాను. అది అందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియా వల్ల ఏం మాట్లాడలేకపోతున్నారు. అన్ని కళ్లూ మనల్నే చూస్తున్న ఫీలింగ్. అంతెందుకు? పదిహేనేళ్ల క్రితం నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా లేదు. రిలాక్సింగ్‌గా ఉండేది.
ఇప్పుడు ఫొటోలు తీసేసి, సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఆ ప్రెజర్ చాలా ఉంది. ఈ ఒత్తిడి వల్ల పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు చాలామంది ఎక్కువ జాగ్రత్తగా ఉంటున్నారు. మా అమ్మ జనరేషన్‌లో ఉన్నంత కూల్‌గా ఉండలేని పరిస్థితి. ఇంకా చెప్పాలంటే స్కూల్ పిల్లలకు కూడా తిప్పలు తప్పడంలేదు. ‘అలా ఉన్నావు... ఇలా ఉన్నావు’ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా చిన్నప్పుడే ప్రెజర్ మొదలై పోతోంది. అయితే ఇప్పటి ఈ పరిస్థితిని నేను విమర్శించడంలేదు. మార్పుని స్వీకరించడమే.
∙ఇండస్ట్రీలో ‘క్యాస్టింగ్ కౌచ్’ ఎదుర్కొన్న నటీమణులు చాలామంది ఉన్నారు... మీకు అలాంటివి?
నాకలాంటి చేదు అనుభవాలు లేవు. ఒకవేళ నాకు నచ్చని పరిస్థితి ఎదురైందంటే నిర్మొహమాటంగా చెప్పేస్తాను. నా పాలసీ ఒక్కటే. నేను ఎవరినైనా ఇష్టపడితే టూ హండ్రెడ్ పర్సెంట్ ఇష్టపడతాను... నాకు కంఫర్ట్‌గా ఉన్న చోట ఉంటాను. నాకు నచ్చని చోట ఉండను... నచ్చని మనుషులను నా లైఫ్‌లో నుంచి ఎగ్జిట్ చేసేస్తాను. ఇంకో విషయం ఏంటంటే... మనకు ఏదైనా నచ్చలేదనుకోండి గొడవపడక్కర్లేదు... అరిచి చెప్పక్కర్లేదు. ‘నాకు నచ్చలేదు’ అని కూల్‌గా చెప్పి, సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టేయాలి.
∙మీలా చాలామంది ధైర్యంగా ఉండలేరు... నిర్భయంగా మాట్లాడలేరు... వారికి మీరిచ్చే సలహా?
భయాలు వదలండి. దయచేసి మీ మనసులోని సమస్యలను బయటకు చెప్పండి. మనసులోనే ఉంచుకుంటే ఆరోగ్యం చెడిపోతుంది. మనకు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్లతో షేర్ చేసుకోవాలి. అయితే వారికన్నా కూడా ఒక మంచి కౌన్సెలర్ అవసరం. వాళ్లయితే మన మానసిక స్థితిని బాగా అర్థం చేసుకుని సలహాలు ఇవ్వగలుగుతారు. ఫిజికల్‌గా హెల్దీగా ఉండాలంటే ‘మెంటల్ హెల్త్’ చాలా ముఖ్యం.
∙కమల్‌హాసన్‌గారి కూతురు కావడం వల్లే మీకు ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదురు కాలేదనుకోవచ్చా?
బ్యాక్‌గ్రౌండ్ అనేది ప్లస్సే... కాదనడంలేదు. నాన్నగారి పేరు నాకు హెల్ప్ అయింది. అయితే శ్రుతీహాసన్ అంటే కమల్‌హాసన్ కూతురు అనే విషయాన్ని మరచిపోయేలా చేయాలి. అప్పుడే నేను సక్సెస్ అయినట్లు. నా వర్క్‌తో నేను నిరూపించుకుని నాకంటూ పేరు తెచ్చుకున్నాను. పని పరమైన ఇబ్బందులు కామన్. అలాంటివి ఎప్పుడూ మా నాన్నగారికి చెప్పలేదు. నేనే సాల్వ్ చేసుకుంటుంటాను.
∙‘మహిళా దినోత్సవం’ జరుపుకుంటారా?
నా ఫ్రెండ్స్‌తో ‘అన్ని రోజులూ మనవే’ అంటుంటాను. ‘మేల్ డే’ అని లేదు. మరి... ‘ఉమెన్స్ డే’ ఎందుకు? అంటే... ఇంకా స్త్రీ వెనకబడి ఉన్నట్లేనా? అలాగే ‘ఉమెన్ ఓరియంటెడ్’ సినిమా అంటారు. ‘మేల్ ఓరియంటెడ్’ మూవీ అనరు. ముందు ఈ తేడా పోవాలి. మహిళా దినోత్సవం అనేది ప్రత్యేకంగా లేని రోజున ఉమెన్ ఎదిగినట్లు లెక్క.
సినిమా ఇండస్ట్రీలో టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌లో మహిళలు తక్కువగా ఉండటానికి కారణం?
ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు మహిళల శాతం ఎక్కువే ఉంది. లేడీ టెక్నీషియన్స్ ఇంకా పెరుగుతారు. అంతెందుకు? నేను ఈ మధ్య లీడ్ రోల్ చేసిన ‘ది ఐ’ మూవీకి డైరెక్టర్,ప్రొడ్యూసర్, ఇంకా ఇతర విభాగాల్లో మహిళలే ఎక్కువ. ఆ విధంగా ఈ సినిమా నాకు స్పెషల్.