
‘‘మీ విలువ మీరు తెలుసుకోండి... మీకు నచ్చినట్లు మీరు బతకండి’’ అంటున్నారు నదియా. హీరోయిన్‌గా 1980–1990లలో విజయవంతమైన కెరీర్‌ని చూసిన నదియా బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని, అమెరికాలో సెటిలయ్యారు. 1994లో సినిమాలకు దూరమై, 2004లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సిల్వర్ స్క్రీన్‌కి వచ్చారు. ‘కారవాన్’ వాహన సౌకర్యాలు లేని రోజులను, ఇప్పుడు ఆ సౌకర్యాలు ఉన్న రోజులనూ చూస్తున్నారు నదియా. ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి’కి నదియా ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలోని విశేషాలు తెలుసుకుందాం.
‘‘నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులెత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఈ ఫొటోను షేర్ చేసి, చిరంజీవి పేర్కొన్నారు
⇒ టీనేజ్‌లో హీరోయిన్ అయిన మీకు అప్పటి షూటింగ్ వాతావరణం, అంతమంది వ్యక్తులతో పని చేయడం వంటివి ఇబ్బందిగా అనిపించేదా?
మలయాళంలో నా తొలి సినిమా ‘నోకెత్త దూరత్తు కన్నుమ్ నాట్టు’ (1984). ఈ సినిమా తమిళంలో ‘పూవే పూచ్చూడవా’గా రీమేక్ అయింది. తమిళంలోనూ నేనే నటించాను. తమిళంలో నాకు తొలి సినిమా. ఆల్రెడీ ఒక భాషలో చేసిన సినిమా కావడం ఒక ప్లస్. మలయాళం సినిమా డైరెక్టర్ ఫాజిల్ తమిళంలోనూ చేశారు. అలాగే నాకు తమిళ్ అస్సలు రాకపోవడంతో ఓ ట్యూటర్‌ను పెట్టి, నేర్పించారు. దాంతో ఈజీ అయింది. షూటింగ్ పరంగా ఎలాంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదు. దాంతో భయపడాల్సిన అవసరం రాలేదు. అలాగే ఆ సినిమా హిట్ కావడంతో వెనక్కి తిరిగి చూసుకోనంతగా బిజీ అయ్యాను.
⇒ సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలు నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం అంటారు... ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందనే టాక్ కూడా వినిపిస్తుంటుంది...
నేను నా అనుభవాల గురించి మాట్లాడతాను. నాతో పాటు మా నాన్న షూటింగ్‌కి వచ్చేవారు. ఒక్క నిమిషం కూడా ఆయన నన్ను ఒంటరిగా వదిలిపెట్టేవారు కాదు. ఆయన అంతగాప్రొటెక్ట్ చేయడంతో నాకు ప్రెజర్ ఉండేది కాదు. అలాగే వచ్చిన ప్రతి సినిమా కమిట్ చేయించేసి, నాతో ఓవర్ వర్క్ చేయించలేదు. వర్క్‌ని ఎంజాయ్ చెయ్ అన్నారు. నా పక్కన ఓ గైడింగ్ ఫోర్స్ (తండ్రిని ఉద్దేశించి) ఉండటంతో నాకెప్పుడూ ‘అన్‌సేఫ్’ అనిపించలేదు.
⇒షూటింగ్ స్పాట్‌లో స్టార్స్‌కి ఏర్పాటు చేసే ‘కారవాన్’ వాహన సౌకర్యం అప్పట్లో లేదు. పల్లెల్లో షూటింగ్స్ చేసినప్పుడు కాస్ట్యూమ్స్ మార్చుకోవడానికి, ఇతర వ్యక్తిగత విషయాలకూ పడిన ఇబ్బందుల గురించి?
మాకు బోలెడంత ప్రేమ దక్కేది. విలేజెస్‌లో ఎవరో ఒకరింట్లో కాస్ట్యూమ్స్ మార్చుకునేంత అభిమానం మా మీద ఉండేది. ‘ఏం ఫర్వాలేదు. మీ ఇల్లులా అనుకోండి’ అనేవాళ్లు. ఎలాంటి భయాలూ ఉండేవి కావు. ఇప్పడున్నన్ని సౌకర్యాలు లేకపోయినా హ్యాపీగానే ఉండేది.
⇒ అప్పట్లో సౌకర్యం లేకపోయినా హ్యాపీగానే గడిచిందన్నారు... సో.. ఇప్పుడు కారవాన్ తదితర సౌకర్యాలు పొందుతున్న నటీమణుల లైఫ్ ఇంకా హ్యాపీ అనుకోవచ్చా...
మాతో పోల్చుకుంటే ఇప్పటి అమ్మాయిలు హ్యాపీ కాదు. అన్ని సౌకర్యాలతో పాటు సమస్యలూ ఎక్కువే. ప్రతి క్షణం ఎవరో ఒకరు మనల్ని గమనిస్తున్న ఫీలింగ్. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ వల్ల పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఈ జనరేషన్‌కి ఆ ప్రెజర్ ఎక్కువ.
⇒మరి... ఈ ప్రెజర్‌ని ఎలా అధిగమించాలి?
ప్రపంచం మారిపోయింది. మనమూ అందుకు తగ్గట్టు మారాలి. పరిస్థితులు ఇలా ఉన్నాయేంటని భయపడకుండా మన జాగ్రత్తల్లో మనం ఉండటమే.
⇒ నెగటివిటీ ఎక్కువ శాతం ఉన్న ఈ మోడ్రన్ వరల్డ్‌లో అమ్మాయిలు తమ లైఫ్‌ని ఎలా లీడ్ చేయాలంటారు?
ధైర్యంగా, గర్వంగా బతకాలి. ఎందుకంటే ఆ దేవుడు సృష్టించిన ప్రత్యేకౖమైనమనుషులం మనం. ఎక్కడ ఉన్నా మనం సౌకర్యంగా ఉండటం మనకు ముఖ్యం. సౌకర్యం అంటే లగర్జీస్ కాదు. మనకు నచ్చినట్లుగా మనం ఉండటం. అలాగే మనం అనుకున్నది నిర్మొహమాటంగా చెప్పాలి. మన విలువని మనం తెలుసుకోవాలి. మనం మన గురించి ఏమనుకుంటున్నామో అదే మనం. తక్కువగా అనుకుంటే తక్కువగా... ఉన్నతంగా అనుకుంటే ఉన్నతంగా. అందుకే మన గురించి మనం ఉన్నతంగా అనుకోవాలి. ఆత్మవిశ్వాసంతో బతకాలి.
⇒ఇద్దరు అమ్మాయిల తల్లిగా మీ పిల్లలకు ఈ విషయాలు చెబుతుంటారా?
చెబుతాం. మా అమ్మాయిలకు బాగా స్వేచ్ఛ ఇస్తాం. వాళ్ల ఇష్టాలను కాదనం. వద్దని చెప్పాల్సి వస్తే ఎందుకు వద్దో చెబుతాం. ఎంత జాగ్రత్తగా ఉండాలో వివరిస్తాం. ఒకప్పుడు పెద్దలు చెప్పిన మాటలను పిల్లలు వినేవాళ్లు. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిన ఈ కాలంలో పిల్లలు చెప్పేది కూడా పెద్దలు వినాలి. మేం మా పిల్లలతో బాగా కమ్యూనికేట్ అవుతాం. మా పిల్లలకే కాదు... ఎవరికైనా నేను చెప్పేదేంటంటే... ధైర్యంగా బతకాలి... ప్రశాంతంగా
ఉండాలి.
నా జీవితం హ్యాపీ
నా జీవితం మొత్తం సాఫీ. హీరోయిన్‌గా బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని, మా ఆయనతో అమెరికాలో సెటిలయ్యాను. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ లైఫ్‌ని పరిపూర్ణంగా ఆస్వాదించాను. చాలా గ్యాప్ తర్వాత సినిమాలకు చాన్స్ వచ్చింది. ‘నటిగా నీ పూర్తి ప్రతిభని నువ్వు వినియోగించుకోలేదు.. సినిమాలు కంటిన్యూ చెయ్’ అని మా ఆయన, ‘మళ్లీ యాక్ట్ చెయ్ అమ్మా’ అని పిల్లలు అన్నారు. వచ్చాను.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్నాను.