
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనేది సామెత. చిత్ర పరిశ్రమలో ఈ సామెత బాగా వర్తిస్తుంది. ప్రత్యేకించి హీరోయిన్ల విషయంలో.. క్రేజ్ ఉన్నప్పుడే వరుసగా సినిమాలు చేసి, అటు ప్రేక్షకుల్ని అలరించడంతో పాటు ఇటు బ్యాంక్ బ్యాలెన్స్‌లు పెంచుకోవాలి. ఇందుకు కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా ట్రెండ్‌కి తగ్గట్టుగా కెరీర్‌ని మలచుకుంటూ స్పెషల్ సాంగ్స్‌కి కూడా సై అంటున్నారు పలువురు కథానాయికలు.
పైగా ప్రత్యేక పాటల్లో నటించే వారికి పారితోషికం కూడా భారీగా ఇస్తుండటంతో స్పెషల్ సాంగ్స్‌లో నర్తించేందుకు హీరోయిన్లు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రస్తుతం పూజా హెగ్డే, శ్రియ, నేహా శెట్టి, కేతికా శర్మ, రెబా మోనికా జాన్, చంద్రికా రవి వంటి హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్‌లో నటిస్తున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.
రెట్రోకి హైలైట్
‘ఇష్టం’ (2001) సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు శ్రియా శరణ్. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, ప్రభాస్, పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్... ఇలా పలువురు హీరోలకి జోడీగా నటించి, స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు శ్రియ. ప్రస్తుతం హీరోయిన్‌గా అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్, స్పెషల్ సాంగ్స్‌పై దృష్టి పెట్టారు శ్రియ. ప్రత్యేక పాటల్లో నర్తించడం ఆమెకు కొత్త కాదు. రామ్‌ని హీరోగా, ఇలియానాని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన ‘దేవదాసు’ (2006) సినిమాలో తొలిసారి ప్రత్యేక పాటలో చిందేశారు శ్రియ.
ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ‘మున్నా’ (2007), వెంకటేశ్ కథానాయకుడిగా నటించిన ‘తులసి’ (2007), పవన్ కల్యాణ్ హీరోగా చేసిన ‘పులి’, సందీప్ కిషన్, సాయిదుర్గా తేజ్ నటించిన ‘నక్షత్రం’ (2017) వంటి తెలుగు సినిమాలతో పాటు పలు తమిళ, హిందీ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన శ్రియ తాజాగా ‘రెట్రో’ సినిమాలో ప్రత్యేక పాటలో సందడి చేయనున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొదుతున్న ఈ సినిమాలో సూర్యకి జంటగా పూజా హెగ్డే నటించారు.
సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌లో సూర్యతో కాలు కదిపారు శ్రియ. గోవాలో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో సూర్య, శ్రియలపై ఈ పాట చిత్రీకరించారు మేకర్స్. సూర్య, జ్యోతిక, కార్తికేయ సంతానం నిర్మించిన ఈ మూవీ మే 1న విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ సొంతం చేసుకుంది.
ముచ్చటగా మూడోసారి
నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ (2014) సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు పూజా హెగ్డే. ప్రభాస్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, వరుణ్ తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అఖిల్ వంటి హీరోలకి జోడీగా నటించి, తెలుగులో ఓ వెలుగు వెలిగిన ఆమె ప్రస్తుతం తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ బ్యూటీ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో నర్తించారు.
రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’ (2018) సినిమాలోని ‘జిల్ జిల్ జిగేల్ రాణి...’ పూజా చేసిన తొలి స్పెషల్ సాంగ్. ఈ పాటలో రామ్‌చరణ్, పూజా హెగ్డే మాస్ డ్యాన్సులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ‘ఎఫ్ 3’ (2022) సినిమాలో ‘అధ్యక్షా... లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా...’ అనే సాంగ్‌లో రెండోసారి చిందేసిన పూజ ముచ్చటగా మూడోసారి ‘కూలీ’లో ఓ స్పెషల్ సాంగ్ చేశారు.
రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొదిన చిత్రం ‘కూలీ’. అనిరు«ధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీలోని ప్రత్యేక పాట చాలా వెరీ వెరీ స్పెషల్‌గా ఉంటుందట. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతీహాసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సన్న్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ‘కూలీ’ నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించలేదు.
అది దా సర్‌ప్రైజ్
అది దా సర్‌ప్రైజ్ అంటున్నారు కేతికా శర్మ. ఆకాశ్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయమయ్యారు కేతిక. 2021 అక్టోబరు 21న విడుదలైన ఈ మూవీలో ఈ అమ్మడు అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ‘లక్ష్య, రంగరంగ వైభవంగా, బ్రో’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన కేతికా శర్మ తొలిసారి ‘రాబిన్‌హుడ్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. ‘భీష్మ’ (2020) వంటి హిట్ మూవీ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రూపొదిన ద్వితీయ చిత్రం ‘రాబిన్‌హుడ్’.
శ్రీలీల హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాలో ‘అది దా సర్‌ప్రైజ్...’ అంటూ సాగే ప్రత్యేక పాటలో కేతికా శర్మ సందడి చేశారు. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించిన ఈ పాటని ఇటీవలే విడుదల చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటని నీతి మోహన్, అనురాగ్ కులకర్ణి పాడగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది.
నా ముద్దుపేరు స్వాతి రెడ్డి
శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘సామజవర గమన’ (2023) సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు రెబా మోనికా జాన్. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ బ్యూటీ క్రేజ్ ఓ రేంజ్‌కి వెళ్లింది. ప్రస్తుతం ఆమె ‘మృత్యుంజయ్’ మూవీలో శ్రీవిష్ణుతో రెండోసారి జోడీగా నటిస్తున్నారు. ఓ వైపు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ బ్యూటీ మరోవైపు ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’.
కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంకా జవాల్కర్, మురళీధర్ గౌడ్, డైరెక్టర్ కేవీ అనుదీప్ కీలక పాత్రలు పోషించారు. ‘మ్యాడ్’కి (2023) సీక్వెల్‌గా రూపొదిన ‘మ్యాడ్ స్క్వేర్’లో రెబా మోనికా జాన్ ప్రత్యేక గీతంలో సందడి చేయనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
‘నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి... నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండుగడ్డి...’ అంటూ సాగే ఈ పాటలో హుషారైన స్టెప్పులు వేశారు రెబా. సురేష్ గంగుల సాహిత్యం అందించిన ఈ పాటని స్వాతి రెడ్డి, భీమ్స్ ఆలపించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది.
మొదటి సారి...
ఆకాశ్ పూరి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘మెహబూబా’ (2018) సినిమా ద్వారా హీరోయిన్‌గా తెలుగుకి పరిచయం అయ్యారు కన్నడ బ్యూటీ నేహా శెట్టి. ఆ సినిమా తర్వాత ‘గల్లీ రౌడీ, డీజే టిల్లు, బెదురులంక 2012, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వంటి సినిమాల్లో నటించి, మెప్పించారామె. సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా నటించిన ‘డీజే టిల్లు’ (2022) సినిమాలో రాధిక పాత్రతో కుర్రకారు మనసులు దోచేశారీ బ్యూటీ. ఈ మూవీలో ఆమె నటన, గ్లామర్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఇదిలా ఉంటే నేహా శెట్టి తొలిసారి ఓ ప్రత్యేక పాటలో చిందేశారు. పవన్ కల్యాణ్ హీరోగా ‘సాహో’ మూవీ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా మోహన్, శ్రియా రెడ్డి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటలో పవన్ కల్యాణ్‌తో కలిసి చిందేశారట నేహా శెట్టి. థాయ్‌ల్యాండ్‌లో ఈ పాటని చిత్రీకరించారని సమాచారం. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరులో రిలీజ్ కానుందని ఫిల్మ్‌నగర్ టాక్.
టచ్‌లో ఉండు ఓ రబ్బీ...
తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా నటించిన చంద్రికా రవి ఓ స్పెషల్ సాంగ్‌తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. 2019లో విడుదలైన ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమాలో ఓ ప్రత్యేక పాట ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారీ బ్యూటీ. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీర సింహారెడ్డి’ (2023) మూవీలో ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే...’ అనే స్పెషల్ సాంగ్‌లో తనదైన గ్లామర్, డ్యాన్సులతో ప్రేక్షకులను ఫిదా చేశారు చంద్రిక.
తాజాగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేశారామె. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన ద్వితీయ చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. దర్శక ద్వయం నితిన్, భరత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపికా పిల్లి కథానాయికగా నటించారు. యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొదిన ఈ మూవీలో ‘టచ్‌లో ఉండు ఓ రబ్బీ... ఓ రబ్బీ...’ అంటూ చిందేశారు చంద్రిక.
ఈ పాటకి చంద్రబోస్ మాస్ లిరిక్స్ అందించగా, లక్ష్మీ దాస, పి. రఘు పాడారు. రధన్ తనదైన హుషారైన సంగీతం అందించారు. శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్‌పై రూపొదిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఏప్రిల్ 11న విడుదల కానుంది.
చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటలో చిరంజీవితో కలిసి ఊర్వశీ రౌతేలా చిందేయనున్నారని టాక్. ‘వాల్తేరు వీరయ్య’ (2023) సినిమాలో ‘వేర్ ఈజ్ ద పార్టీ...’ అనే ప్రత్యేక పాటలో చిరంజీవి– ఊర్వశీ రౌతేలా తమదైన స్టెప్పులతో అలరించిన సంగతి తెలిసిందే.
ఈ పాట సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ‘విశ్వంభర’లోనూ చిరంజీవితో కలిసి స్పెషల్ సాంగ్‌లో ఊర్వశి మెరవనున్నారట. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్న ఈ మూవీ ఈ వేసవిలో విడుదల కానుందని టాక్. ఇదిలా ఉంటే... బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన హిందీ చిత్రం ‘జాట్’. ఈ మూవీలో రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా ఇతర కీలక పాత్రధారులు.
తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటలో హీరోయిన్ నిధీ అగర్వాల్ మెరవనున్నారని టాక్. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. కాగా ‘విశ్వంభర’లో ఊర్వశీ రౌతేలా, ‘జాట్’లో నిధీ అగర్వాల్ స్పెషల్ సాంగ్స్ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
వీరే కాదు.. మరి కొందరు హీరోయిన్లు కూడా ప్రత్యేక పాటల్లో సందడి చేయనున్నారు. – డేరంగుల జగన్ మోహన్
Comments
Please login to add a commentAdd a comment