పూజా హెగ్డే ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయ్యింది. కోలీవుడ్‌లో ముఖముడి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. జీవ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం ఆమెకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఆ తరువాత లక్కీగా టాలీవుడ్ ఆహ్వానించింది. అక్కడ కూడా తొలి ఒకటి, రెండు చిత్రాలు అంతంత మాత్రమే ఆడిన తరువాత నటించిన చిత్రాలు వరుసగా సక్సెస్ కావడంతో పూజాహెగ్డే స్థాయి పెరిగిపోయింది. అయితే అల వైకుంఠపురంలో వంటి సూపర్‌హిట్ చిత్రం తరువాత పూజాహెగ్డేకు తెలుగులో వరుసగా రెండు ప్లాపులు ఎదురయ్యాయి.
ఇక పదేళ్ల తరువాత తమిళంలో విజయ్‌తో జతకట్టిన బీస్ట్ చిత్రం కూడా ప్లాప్ కావడంతో కోలీవుడ్‌లో సక్సెస్ అందుకోవాలనే కోరిక అందని ద్రాక్షగానే మారింది. అదేవిధంగా బాలీవుడ్ ఆఫర్లు వస్తున్నా అక్కడ సక్సెస్‌లు ఎండమావిగానే మారుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో మహేష్‌బాబు సరసన ఓ చిత్రంలోనూ, హిందీలో సల్మాన్‌ఖాన్‌కు జంటగా కిసీకా బాయ్ కీసికా జాన్ అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఈ రెండు చిత్రాలపై చాలా ఆశలు పెట్టుకుంది. కాగా ఇటీవల ఎదురైన అపజయాల గురించి ఓ భేటీలో పూజహెగ్డే పేర్కొంటూ అన్ని చిత్రాల్లోనూ కష్టపడి నటిస్తామని, అయితే వాటి జయాపజయాల తాము నిర్ణయించలేమని పేర్కొంది.
చిత్రాల జయాపజయాలు అనేవి అభిమానుల చేతుల్లోనే ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తాను ఇప్పటి వరకు పలు వైవిధ్య పాత్రల్లో నటించానని ఇది తనకు సంతృప్తిని కలిగించే విషయం అని పేర్కొంది. పాత్రకు తగ్గట్టుగా నటించడానికి తాను శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని చెప్పింది. పక్కింటి అమ్మాయిగా ఉండగలనని, అదే విధంగా మోడ్రన్ గాళ్‌గానూ మెప్పించగలనని చెప్పింది. అదే విధంగా చారిత్రక కథా పాత్రల్లోనూ తాను నటించగలనని స్పష్టం చేసింది. తనకు దైవభక్తి పెద్దగా లేదని, అయితే మనలను ఏదో ఒక శక్తి ముందు నడిపిస్తుందన్నది మాత్రం నమ్ముతానని పూజాహెగ్డే పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment