నటి పూజాహెగ్డే గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. బాలీవుడ్‌లో నటిగా ప్రారంభించి ఆ తరువాత తెలుగు, తమిళ భాషల్లో నటించి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో అత్యధిక పారితోషికం డిమాండ్ చేస్తున్న క్రేజీ హీరోయిన్‌గా రాణిస్తోంది. అయితే హిందీ, తమిళ భాషల్లో ఇప్పటి వరకు సరైన హిట్ పడలేదు. తమిళంలో 10 ఏళ్ల క్రితం నటించిన ముఖముడి, ఇటీవల విజయ్ సరసన నటించిన చిత్రం బీస్ట్ పూజాహెగ్డేకు పూర్తిగా నిరాశపరిచిందనే చెప్పాలి. ఆ విధంగా ఇక్కడ ఆమెకు కలిసి రాలేదు.
ఇక తెలుగులో ఆ మధ్య వరుసగా రెండు చిత్రాలు ఫ్లాప్ అయినా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం మహేష్‌బాబు సరసన భారీ చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా హిందీలో సల్మాన్‌ఖాన్‌తో జతకట్టిన కిసికి భాయ్ కిస్‌కి జాన్ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఇది తమిళంలో అజిత్ కథానాయకుడుగా నటించిన వీరం చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. కాగా పూజాహెగ్డే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తనకు సక్సెస్ ఒక రాత్రిలో వచ్చింది కాదని పేర్కొంది.
తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న తొలి రోజుల్లో భాష రాకపోవడంతో చాలా కష్టపడ్డానని చెప్పింది. అప్పుడు సంభాషణలను సహాయదర్శకులను ముందుగా చెప్పమని ఆ తరువాత తాను మాట్లాడే ప్రయత్నం చేసినట్లు తెలిపింది. ఇటీవల తాను నటించిన చిత్రాలు సరిగా ఆడకపోవడంతో ఒక ఏడాది పాటు అవకాశాలు రాకపోవడంతో ఇంట్లోనే కూర్చొన్నానని చెప్పింది.
అలాంటిది మళ్లీ అనూహ్యంగా కొత్త చిత్రాలు అవకాశాలు వస్తుండడంతో బిజీగా ఉన్నానని పేర్కొంది. ప్రస్తుతం నటిగా మంచి స్థాయిలో ఉన్న ఆరంభ కాలంలో పడ్డ కష్టాలను మరచిపోలేదని చెప్పింది. తనకు డ్రీమ్ ప్రాజెక్టులు చాలా ఉన్నాయని ముఖ్యంగా మహిళల్లోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కథా పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నట్లు పూజాహెగ్డే పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment