
విలన్స్‌గా స్టార్ హీరోలు
కెరీర్ ప్రారంభంలో విలన్‌గా చేసి, ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకున్న హీరోలు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. కానీ హీరోగా సక్సెస్ అయిన తర్వాత కూడా విలన్ రోల్స్‌ను ప్రయత్నిస్తున్నారు కొందరు హీరోలు. ‘ఇదిదా సర్‌ప్రైజ్’ అంటూ ఇలా తమ నెగటివ్ షేడ్స్ ట్యాలెంట్‌తో ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేసిన, సర్‌ప్రైజ్ చేయనున్న కొందరు హీరోల గురించి ఓ లుక్ వేద్దాం.
కూలీకి విలన్?
సిల్వర్ స్క్రీన్‌పై నాగార్జున నెగటివ్ రోల్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి ఆడియన్స్‌లో తప్పక ఉంటుంది. పూర్తి స్థాయి గ్రే షేడ్స్ క్యారెక్టర్‌లో నాగార్జునను స్క్రీన్‌పై చూడాలని కొందరు ఆడియన్స్ కోరుకుంటున్నారు. ఆ తరుణం ఆసన్నమైందని, రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలో నాగార్జున నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నారనే టాక్ కోలీవుడ్‌లో ప్రచారంలోకి వచ్చింది. ‘కూలీ’ సినిమా చిత్రీకరణప్రారంభమైనప్పుడు నాగార్జున ఓ వ్యక్తిని క్రూరంగా కత్తితో చంపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ నెగటివ్ షేడ్స్‌లో ఉంటుందనే వార్తలకు ఈ వీడియో రూపంలో బలం చేకూరినట్లయింది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించింది. శ్రుతీహాసన్, ఉపేంద్ర, సత్యరాజ్ ఇతర కీలకపాత్రల్లో నటించారు. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ‘కూలీ’ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీపై ఓ స్పష్టత రానుంది.
బ్రహ్మ రాక్షస
హీరోగా ప్రభాస్ కటౌట్‌కి ఉన్న బాక్సాఫీస్ స్టామినా ఏంటో ఆడియన్స్ చూశారు. మరి... ప్రభాస్‌లాంటి కటౌట్ ఉన్న హీరో క్యారెక్టర్‌లో నెగటివ్ షేడ్స్ ఉంటే ఎలా ఉంటుందో ‘బిల్లా’ సినిమాలో శాంపిల్‌గా ఆడియన్స్ చూశారు. కానీ ఈ డోస్‌ను ఇంకాస్త పెంచి ‘బ్రహ్మ రాక్షస’ సినిమాతో ఆడియన్స్‌ని తన నెగటివ్ షేడ్ యాక్టింగ్ స్కిల్‌తో సర్‌ప్రైజ్ చేయాలని ప్రభాస్ భావిస్తున్నారట. ప్రభాస్ మెయిన్ లీడ్ రోల్‌లో ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘బ్రహ్మ రాక్షస’ అనే మూవీ రానుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్‌లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజా సాబ్, ఫౌజి’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ మూవీ చేస్తారు. ఈ ‘స్పిరిట్’ మూవీ చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే... ప్రశాంత్ వర్మతో ‘బ్రహ్మ రాక్షస’ సినిమాను టేకాఫ్ చేస్తారు ప్రభాస్. ఈ లోపు రిషబ్ శెట్టితో ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ను పూర్తి చేస్తారు ప్రశాంత్ వర్మ. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభాస్–ప్రశాంత్ వర్మ కాంబోలోని మూవీ 2026 చివర్లో లేదా 2027ప్రారంభంలో మొదలు కానున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ ‘బ్రహ్మ రాక్షస’ సినిమాను తొలుత రణ్‌వీర్ సింగ్‌తో చేయాలనుకున్నారు ప్రశాంత్ వర్మ. కానీ కొన్ని కారణాల వల్ల రణ్‌వీర్ సింగ్ ఈప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
బాలీవుడ్ వార్
‘టెంపర్, జై లవకుశ’ వంటి చిత్రాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్‌లో ఎన్టీఆర్ స్క్రీన్‌పై ఎంత రెచ్చిపోయారో ఆడియన్స్ చూశారు. కాగా ఎన్టీఆర్‌లోని నెగటివ్ షేడ్ యాంగిల్ ఈసారి నార్త్ ఆడియన్స్‌కు కూడా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనుందని తెలిసింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్‌లో హిందీలో ‘వార్ 2’ అనే మూవీ రానుంది. ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ‘వార్ 2’ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్‌లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని బాలీవుడ్ సమాచారం. ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఏజెంట్ వీరేంద్ర నాథ్‌పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారని, ఆయన క్యారెక్టర్‌లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని టాక్. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఆగస్టు 14న ‘వార్ 2’ సినిమాను రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
తొలిసారిగా విలన్‌గా...
సిల్వర్ స్క్రీన్‌పై బ్లాక్ బస్టర్ హీరోస్‌లో అల్లు అర్జున్ ఒకరు. కాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘ఆర్య 2’ చిత్రంలో ఆయన క్యారెక్టర్‌లో కాస్త గ్రే షేడ్స్ ఉంటాయి. ఆ తర్వాత ‘పుష్ప’ వంటి ఎగ్రెసివ్ ఎనర్జీ ఉన్న క్యారెక్టర్స్ చేశారు కానీ, పూర్తి స్థాయి గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ను అల్లు అర్జున్ చేయలేదు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందట. అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్‌లో ఓ భారీ బడ్జెట్ మూవీ రానుందనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మూవీలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నారని, ఈ రెండు రోల్స్‌లో ఓ రోల్‌లో నెగటివ్ షేడ్స్ ఉంటుందని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనుందట. ఈ వేసవిలో చిత్రీకరణనుప్రారంభించి, 2026 చివర్లో ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని భోగట్టా. ఈ చిత్రంపై పూర్తి స్థాయి సమాచారం అందాల్సి ఉంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
బ్లాక్ స్వార్డ్
హీరోగా తెలుగు స్క్రీన్‌పై సక్సెస్ అయ్యారు మంచు మనోజ్. ఇప్పుడు విలన్‌గా కనిపించనున్నారు. ‘హను–మాన్’ ఫేమ్ తేజ సజ్జా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ ఈ మైథలాజికల్ అండ్ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్‌ను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సూపర్ యోధపాత్రలో తేజ సజ్జా నటిస్తుండగా, బ్లాక్ స్వార్డ్‌పాత్రలో మంచు మనోజ్ విలన్‌గా కనిపిస్తారు. ఇక ‘మిరాయ్’ చిత్రం ఆగస్టు 1న విడుదల కానుంది.
ఈ హీరోలే కాదు... ఇంకొందరు స్టార్స్ కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్‌కి సై అన్నారు. – ముసిమి శివాంజనేయులు
కోలీవుడ్ హీరోలు కూడా వీలైనప్పుడు విలన్ రోల్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో మెయిన్ విలన్‌గా కమల్‌హాసన్ నటించారు. కమల్‌హాసన్ హీరోగా చేసిన ‘విక్రమ్’ మూవీ క్లైమాక్స్‌లో రోలెక్స్‌గా విలన్‌పాత్రలో కనిపించారు సూర్య. ఇక సూర్య హీరోగా చేసిన ‘కంగువ’ మూవీలో కార్తీ విలన్‌గా కనిపించారు. కార్తీ హీరోగా చేసిన ‘ఖైదీ’ సినిమాలో తమిళ యువ నటుడు అర్జున్ దాస్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో కనిపించారు. కమల్‌హాసన్ ‘విక్రమ్’, కార్తీ ‘ఖైదీ’ చిత్రాల దర్శకుడు లోకేశ్ కనగరాజ్ నేతృత్వంలోని ‘లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంలోనివే. సో... ‘ఖైదీ 2’ చిత్రంలో సూర్య విలన్‌గా నటించే చాన్సెస్ ఉన్నాయి.
⇒ ఇంకా శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ‘పరాశక్తి’ సినిమా కోసం తొలిసారిగా విలన్‌గా స్క్రీన్‌పై కనిపించనున్నారు రవి మోహన్ (ఇటీవల ‘జయం’ రవి తన పేరును రవి మోహన్‌గా మార్చుకున్నారు). సుధ కొంగర దర్శకత్వంలోని ఈ మూవీ వచ్చే ఏడాదిప్రారంభంలో రిలీజ్ కానుందని తెలిసింది. ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇడ్లీ కడై’లో అరుణ్ విజయ్ విలన్‌గా చేస్తున్నారన్న వార్తలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఇంకా వీలైనప్పుడల్లా విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, మాధవన్ వంటి యాక్టర్స్ కూడా విలన్ రోల్స్ చేస్తున్నారు. ఇలా ఇంకొంతమంది ఉన్నారు.
⇒ బాలీవుడ్ హీరోలు కూడా విలన్ రోల్స్ చేస్తున్నారు. షారుక్ ఖాన్ హీరోగా చేయ నున్న నెక్ట్స్ మూవీ ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్)లో అభిషేక్ బచ్చన్ తొలిసారి నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నారు. రణ్‌బీర్ కపూర్ హీరోగా చేస్తున్న ‘రామాయణ’ సినిమాలో ‘కేజీఎఫ్’ హీరో యశ్ రావణుడిపాత్ర చేస్తున్నారు. గత ఏడాది విడుదలైన అజయ్ దేవగన్ ‘సింగమ్ ఎగైన్’లో అర్జున్ కపూర్ విలన్‌గా చేశారు. ఇంకా బాలీవుడ్‌లో హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తున్న సంజయ్ దత్, బాబీ డియోల్ (హరిహర వీరమల్లు), ఇమ్రాన్ హష్మి (ఓజీ, జీ 2), జిమ్ సర్ఫ్ (కుబేర), సోహైల్ ఖాన్ (అర్జున్ సన్నాఫ్ వైజయంతి), దివ్యేందు (పెద్ది) వంటి వారు తెలుగు సినిమాల్లో విలన్ రోల్స్ చేస్తున్నారు. ఇలా ఇంకొందరు ఉన్నారు.
⇒ కథ నచ్చితే నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేసేందుకు హీరోయిన్స్ సైతం వెనకాడటం లేదు. ఈ విషయంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ ముందుంటారు. హీరోయిన్‌గా చేస్తూనే ఎక్కువగా విలన్ రోల్స్ చేస్తుంటారామె. ఇక వెంకటేశ్ ‘సైంధవ్’లో ఆండ్రియా, విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ‘వెన్నెల’ కిశోర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’లో అనన్య నాగళ్ల, అజిత్ ‘విడాముయర్చి’ లో రెజీనా, రణ్‌బీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్ర’లో మౌనీ రాయ్, ‘పొన్నియిన్ సెల్వన్’లో ఐశ్వర్యా రాయ్ వంటి వారు కెరీర్‌లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్న సమయంలోనే నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు. ఇలా మరికొంతమంది ఉన్నారు.