ఈ జోడీ పర్‌ఫెక్ట్! | Tamasha fails to meet the successful storytelling of Jab We Met | Sakshi
Sakshi News home page

ఈ జోడీ పర్‌ఫెక్ట్!

Published Sat, Dec 5 2015 11:37 PM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

ఈ జోడీ పర్‌ఫెక్ట్!

ఈ జోడీ పర్‌ఫెక్ట్!

దేడ్ కహానీ - జబ్ వియ్ మెట్
చేపపిల్ల... నీళ్లల్లో ఈదుతున్నంతసేపూ నోటి దవడలు ఆడిస్తూనే ఉంటుంది. నీళ్లు తాగకుండా ఆక్సిజన్ తీసుకునే ప్రక్రియ అది. దాని జీవనాధారం. అలాగే ఓ చేప కళ్లున్న ఆడపిల్ల, చలాకీగా ఇరవై నాలుగ్గం టలూ తన పెదాలని ఆడిస్తూనే ఉంటుంది. ఎదుటి వాడి మనోభావాలతో సంబంధం లేదు. అలా మాట్లాడుతూనే ఉంటుంది. చివరికి నిద్రలో కూడా. ఆమే... గీత్ సింగ్. అమాయకమైన పల్లె టూరి అమ్మాయి. ముంబైలో ట్రైన్ ఎక్కుతుంది.

పరిగెడుతున్న ట్రైన్ లోపల కెమెరా పెట్టి, ఖాళీ డోరు షాటు, కదులు తున్న ట్రైనుని చూపిస్తూ, గట్టిగా గీత్ గొంతు, మాటలు మాత్రమే వినపడేలా కొంత దూరం నడిపించి, తర్వాతే ఆమె రూపాన్ని ప్రేక్షకులకి పరిచయం చేస్తాడు దర్శకుడు. ఒక వాగుడుకాయ్ క్యారెక్టర్‌కి ఇంతకంటే అందమైన, అర్థవంతమైన పరిచయం వేరేది ఉండదు.
 
ఇలా గీత్‌ని పరిచయం చేయడానికి ముందే ముంబైలో ఒక గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ వారసుడు ఆదిత్య కశ్యప్‌ని చాలా నిరాశగా, నిస్పృహగా, జీవితంలో ఓడిపోయి, అదీ తల్లి వేరే వ్యక్తిని ప్రేమించి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోతే, ఆ రిఫ్లెక్షను తనని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మీద పడి, ఆమె పెళ్లి క్యాన్సిల్ చేసేస్తే, మూగ బోయినవాడిగా చూపిస్తాడు దర్శకుడు. గమ్యం తెలీక, ఎలా ఉన్నవాడు అలా ఇల్లొదిలి రెలైక్కి కూర్చుంటాడు. అలాంటి వాడికి కో-ప్యాసింజర్ గీత్. అడిగినా అడక్కపోయినా, విసుక్కున్నా, లేచి వెళ్లి ఇంకో దగ్గర కూర్చున్నా ఆమె ధోరణి ఆమెదే. ఆ ఇద్దరూ కలిసి చేసే రైలు ప్రయాణం, దాని కొనసాగింపుగా చేసే జీవిత ప్రయాణమే ‘జబ్ వియ్ మెట్’ సినిమా మొదటి భాగం.
 
నిరాశా నిస్పృహల్లో ఉన్న ఆదిత్యని తన సెలయేటి ప్రవాహం లాంటి మాటల నుంచి ప్రసరించిన తరంగాల కరెంటుతో చైతన్యవంతుణ్ని చేస్తుంది గీత్. అద్భుతమైన సీన్ ఏంటంటే, తండ్రి మరణానికి కారణం తన తల్లి వేరే వ్యక్తిని ప్రేమించి వెళ్లిపోవడం అని, సమాజం తల్లి మీద వేసిన నిందని కొడుకుగా తనూ వేసి ఆమెపై కోపం పెంచుకున్న కశ్యప్‌కి గీత్, తల్లి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం నేర్పిస్తుంది. తల్లి కూడా ఒక మనిషే అని, ఆమె ప్రేమలో తప్పు లేదని, కొడుకుగా ఆమెని అర్థం చేసుకోవాలే తప్ప, సమాజం దృష్టి నుంచి ఆమెని చూడకూడదని చెప్తుంది.
 
ఇలాంటి తల్లుల్ని నిజ జీవితంలో చూసే ఉంటాం, సమాజంలాగ వాళ్లని చెడుగా తిట్టే ఉంటాం - గీత్‌లా వాళ్లని మనుషులుగా భావించమని చెప్పేవాళ్లు మనకుండకపోవచ్చు. జబ్ వియ్ మెట్ గీత్... వుయ్ లెర్న్ హౌ టు లీడ్ లైఫ్ అండ్ హౌ టు ట్రీట్ అదర్స్.
 సరే, అలాంటి గీత్‌ని ఆమె ఇంట్లోంచి తెల్లారుఝామున తీసుకొచ్చి ఆమె ప్రేమించిన అన్షుమన్ దగ్గర వదిలి వెళ్లిపోతాడు కశ్యప్.

ఆమె అడుగుతుంది - మా ఇంట్లోవాళ్లకి తెలీకుండా ఇలా వెళ్లిపోతున్నాను నన్ను క్షమిస్తారా అని! ఆదిత్య చెప్తాడు - మా అమ్మని నీవల్ల నేను అర్థం చేసుకున్నాను, నిన్ను కూడా మీవాళ్లు కొన్నాళ్లకి అర్థం చేసుకుంటారని. అన్షుమన్‌ని కలవకుండానే గీత్‌ని దింపేసి వెళ్లిపోతాడు కశ్యప్ - ఇక్కడ విశ్రాంతి. జీవితాన్ని ఎలా చూడాలో, ఆ క్షణాన్ని ఎలా ఆస్వాదించాలో గీత్ ఆదిత్యకే కాకుండా ఆడియెన్స్ అందరికీ చెప్తుంది. అందుకే ఫస్ట్ హాఫ్ చాలా బావుంటుంది. అందుకే ఫస్ట్ హాఫ్ గురించి ఎక్కువ రాశాను.
 
ద్వితీయార్ధంలో ఆదిత్య చాలా యాక్టివ్ అయిపోతాడు. కానీ గీత్ మాత్రం జీవితంలో ఓడిపోయి కాన్ఫిడెన్స్ కోల్పోయి డీలా పడిపోతుంది. అది తెలిసి ఆమెలో తన చైతన్యంతో కరెంట్ ప్రవహించేట్టు చేసి ఆమెని మామూలుగా తన కుటుంబంతో కలిపే ప్రయత్నం చేస్తాడు ఆదిత్య. ఆ క్రమంలో వాళ్లిద్దరూ ఒకటవ్వడమే కథ.
 
ప్రథమార్ధంలో ఉత్తుంగ తరంగం లాంటి గీత్‌గా మెప్పించిన కరీనా కపూర్ నీరసించడం, నీరస పాత్రలో బాగా మెప్పించిన షాహిద్ కపూర్ ద్వితీయార్ధంలో ఉత్తుంగ తరంగంలా ఎగసి పడలేకపోవడం చూస్తే... సినిమాని కొంచెం పడేసిన ఫీలింగ్ వస్తుంది. కానీ, గీత్ ప్రేమించిన అన్షుమన్‌ని కుటుంబ సభ్యులు స్నేహితుడనుకుని, ఆదిత్యని అల్లుడనుకునే సన్నివేశాలు బాగా నవ్వు తెప్పిస్తాయి.

ఆ ఇంటి సీన్లే సెకండ్ హాఫ్‌కి సేవింగ్ ఫ్యాక్టర్. ఒక విధంగా శ్రీను వైట్లగారి సినిమాల ఫార్మాట్ నుంచే ఈ చిత్ర రూపకల్పన జరిగినట్టు ఉంటుంది. ఆ ఇంటి సీన్లు తెలుగులో చాలా సినిమాలకి ముడి సరుకు. షాహిద్, కరీనాలు అప్పటికే ప్రేమికులుగా పాపులర్ అవ్వడం వల్ల కెమిస్ట్రీ మరింత బాగా పండినట్టు ఉంటుంది. కానీ, ఇదే ‘దిల్‌వాలే దుల్హనియా’ టైమ్‌లో షారుఖ్, కాజోల్ లాంటి జంట చేసుంటే...

ఇది కూడా వాటిలాగే ఒక కల్ట్ ఫిల్మ్ అవ్వగలిగే కథ, కథనం ఉన్నాయి ఇందులో. అందుకే ఈ సినిమా బాలీవుడ్‌లో కమర్షియల్ హిట్‌గా నిలిచింది. 2007 అక్టోబర్‌లో రిలీజైన ఈ సినిమా 2010లో హాలీవుడ్‌లో ‘లీప్ ఇయర్’ అనే సినిమాకి ప్రేరణ కావడం భారతీయ సినిమా గర్వించదగ్గ అంశమే. విచిత్రం ఏంటంటే ఈ చిత్రం చివరి షెడ్యూల్‌కి వచ్చేసరికి షాహిద్, కరీనాలు నిజ జీవితంలో విడిపోయారు. మీడియా అంతా అది ఈ చిత్రం తాలూకు పబ్లిసిటీ స్టంట్ అని అభివర్ణించింది. కానీ తర్వాత అది నిజమని రుజువైంది.
 
ఈ సినిమా టైటిల్‌ని ‘పంజాబ్ మెయిల్’ అని పెట్టాలా, ‘ఇష్క్ వయా భటిండా’ అని పెట్టాలా ‘జబ్ వియ్ మెట్’ అని పెట్టాలా తేల్చుకోలేక పబ్లిక్ ఓటింగ్ పెడితే జబ్ వియ్ మెట్ గెలిచింది. అలాగే రిలీజయ్యాక ప్రేక్షకుల మన్ననలూ గెలిచింది. కాసుల వర్షమూ రూపాయికి మూడు రూపాయల చొప్పున గెలుచుకొంది.
 
ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన మరో ముఖ్య అంశం... ప్రీతమ్ సంగీతం. ఆసాంతం ఆకట్టుకొంటుంది. నటరాజన్ సుబ్రమణియన్ కెమెరా పనితనం కూడా చాలా బావుంటుంది. శ్రేయాఘోషల్‌కి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ గాను, సరోజ్‌ఖాన్‌కి బెస్ట్ కొరియోగ్రాఫర్ గాను, నేషనల్ అవార్డులను తేవడంతో పాటు కరీనా కపూర్‌కి ఉత్తమ నటిగా ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రైవేటు అవార్డుల్ని తెచ్చిపెట్టింది ఈ చిత్రం.
 
దర్శకుడు ఇంతియాజ్ అలీ రెండో చిత్రం ఇది. ఈ చిత్రం సక్సెస్ ఇచ్చిన ఊపుతో తర్వాత చాలా మంచి చిత్రాలు తీశాడు. ఇంతియాజ్ కథ కన్నా పాత్రకి, పాత్రల రూపకల్పనకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. వాటి ద్వారా జీవితాన్ని, భావోద్వేగాల్ని  అద్భుతంగా ఆవిష్కరిస్తాడు. ప్రేమని చాలా సున్నితంగా ప్రస్తావిస్తాడు. సీన్స్‌ని సుతిమెత్తటి పూవుల్లా ప్యాంపర్ చేస్తాడు. అందుకే మంచి దర్శకుడిగా ఎదిగాడు. రైలు ప్రయాణం ఆధారంగా తీసిన ఈ చిత్రంతో కెరీర్‌లో, జీవితంలో సక్సెస్ అందుకున్నాడు. తిన్నగా హైవే ఎక్కేశాడు. ఇక పక్కదారి పట్టడనే భావిద్దాం. మరిన్ని మంచి సినిమాలు తీస్తాడని, మనకు చూపిస్తాడనీ ఆశిస్తాం.
 - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement