Kareena
-
పనామా జాబితాలో బాలీవుడ్ తారలు
సైఫ్, కరీనాలతో పాటు కరిష్మా కపూర్ కూడా * పత్రాల్లో వీడియోకాన్ వేణుగోపాల్ ధూత్ పేరు * మరో సీఏ, ఆస్ట్రేలియా మైనింగ్ వ్యాపారి కూతురుకూ విదేశీ కంపెనీలు * తాజా జాబితాలో కొందరు మధ్యతరగతి వ్యాపారులు న్యూఢిల్లీ: పనామా పేపర్స్ తాజా జాబితాలో మరో ముగ్గురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకొచ్చాయి. సైఫ్ అలీఖాన్, ఆయన భార్య కరీనా కపూర్, కరిష్మా కపూర్‌తోపాటు వీడియోకాన్ గ్రూపు అధినేత వేణుగోపాల్ ధూత్‌లు విదేశీ కంపెనీలతో జతకట్టినట్లు తెలిసింది. ముంబైలోని ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్, ఓ టైర్ల కంపెనీ ఓనర్, వస్త్ర దుకాణ యజమాని, ఆస్ట్రేలియా మైనింగ్ వ్యాపారి కూతురు, వస్త్ర ఎగుమతి దారుడు, ఇంజనీరింగ్ కంపెనీ యజమానితోపాటు పలువురు పారిశ్రామికవేత్తల పేర్లు గురువారం విడుదల చేసిన జాబితాలో ఉన్నాయి. సైఫ్, కరీనా, కరిష్మా, వేణుగోపాల్ ధూత్ 2010లో ఐపీఎల్ పుణె ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు పుణెలోని ప్రముఖ రియల్ఎస్టేట్ సంస్థ చోర్డియా గ్రూపు, వీడియోకాన్ గ్రూపు అధినేత వేణుగోపాల్ అవధూతతోపాటు పలువురు బాలీవుడ్ నటులు ఓ కన్సార్షియం (పీ-విజన్ స్పోర్ట్స్)గా ఏర్పడ్డారు. ఈ కన్సార్షియంలో సైఫ్‌కు 9 శాతం, కరీనా, కరిష్మాలకు చెరో 4.5శాతం వాటాలుండగా.. ధూత్‌కు 25 శాతం, చోర్డియా కుటుంబానికి 33 శాతంతోపాటు బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్కు చెందిన అబ్డ్యురేట్ లిమిటెడ్ కంపెనీకి 15 శాతం వాటా ఉందని తేలింది. వేలంలో పుణె ఫ్రాంచైజీ దక్కకపోవటంతో.. ‘పీ-విజన్ స్పోర్ట్స్’ కంపెనీని వెంటనే మూసేశారని పేపర్స్‌లో వెల్లడైంది. అయితే.. ఈ కన్సార్షియంలో 25 శాతం వాటా తీసుకున్న మాట వాస్తవమేనని అయితే.. అబ్డ్యురేట్ లిమిటెడ్ సంగతి తనకు తెలియదని ధూత్ వ్లెడించారు. ఫొన్సెకాతో ‘కోనేరు’ ఉత్తరప్రత్యుత్తరాలు పనామాకు చెందిన మొసాక్ ఫోన్సెకాతో ట్రైమెక్స్ గ్రూపునకు చెందిన తెలుగు వ్యాపారవేత్త కోనేరు మధు (దుబాయ్ కేంద్రంగా పలు కంపెనీలు నడుపుతున్నారు) ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినట్లు తాజా పత్రాల్లో వెల్లడయింది. ఈ కంపెనీ సహకారంతో బీవీఐలో 12 కంపెనీలను కోనేరు రిజిస్టర్ చేశారు. కాగా, 2012లో హైదరాబాద్‌లో దాఖలైన ఎమ్మార్ కేసుకు సంబంధించిన (కేసు నమోదు, బెయిల్ వంటి) వివరాలను కూడా ఫోన్సెకా ప్రతినిధులకు ఎప్పటికప్పుడు మధు వెల్లడించినట్లు ఈ లేఖల్లో ఉంది. దీనిపై మధు తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ‘మధు నిబంధనలను పాటించే వ్యక్తి. ఆయన చట్టబద్ధంగానే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు’ అని పేర్కొన్నారు. లోకేశ్ శర్మ, టీసీఎం గ్రూపు తాజా జాబితాలో ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ట్వంటీఫస్ట్ సెంచరీ మీడియా (టీసీఎం) గ్రూపు చైర్మన్ లోకేశ్ శర్మ పేరు కూడా ఉంది. లోకేశ్‌కు బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ (బీవీఐ)లో మూడు కంపెనీలున్నాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. అయితే డీడీసీఏ వివాదంలో జైట్లీతోపాటు టీసీఎం యజమాని లోకేశ్‌పైనా ఆప్ విమర్శలు చేసింది. కాగా, ఢిల్లీకి చెందిన ఉదయ్ ప్రతాప్ సింగ్‌కు బీవీఐలో స్టీల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనే కంపెనీలో వాటాలున్నట్లు వెల్లడైంది. ఢిల్లీ వ్యాపారి అలోక్ భాటియా, ఆయన భార్య సిల్వియా భాటియాలకు రెండు కంపెనీలున్నాయి. ఆస్ట్రేలియా మైనింగ్ వ్యాపారి కూతురైన సిల్వియా.. ఈ కంపెనీల్లో వచ్చిన లాభాలను కోల్ పీటీవై లిమిటెడ్ (ఆస్ట్రేలియా)కు బదిలీ చేసినట్లు వెల్లడైంది. పురుషుల ఫ్యాషన్ దిగ్గజం జేఎం కంపెనీ యజమాని జానీ మంగ్లానీకి బీవీఐతోపాటు సిప్రస్లోనూ పలుకంపెనీలున్నాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. అయితే.. దీనిపై మంగ్లానీ స్పందిస్తూ.. ‘నేను సింగపూర్‌లో ఉంటున్నాను. నాకు ఏ కంపనీల గురించీ తెలియదు. నా వ్యాపారం (వస్త్ర) నేను చేసుకుంటున్నాను. సింగపూరియన్లను వదిలిపెట్టి అవినీతికి పాల్పడుతున్న భారతీయులు, అక్రమ మార్గాల్లో సంపాదిస్తున్న వారిపై గురిపెట్టండి’ అనిసూచించారు. ఆన్లైన్ రిటైలర్ మింత్రా.కామ్ మాజీ వైస్‌ప్రెసిడెంట్ నిష్ భుటానీకీ బీవీఐలో ఆర్ట్స్ అలయెన్స్ మీడియా లిమిటెడ్ కంపెనీలో వాటాలున్నాయి. ఢిల్లీ వ్యాపారవేత్త వినయ్ కృష్ణన్ చౌదరీకి బీవీఐ కేంద్రంగా పనిచేసే రెండు కంపెనీల్లో భాగస్వామ్యం ఉండగా. ముంబైకి చెందిన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ దిలీప్ జయంతీలాల్ ఠక్కర్‌కు బహమాస్‌లో కన్సు కార్పొరేషన్ కంపెనీ ఉందని వెల్లడైంది. ఫొన్సెకా కంపెనీల్లో మూడోవంతు చైనావే మొసాక్ ఫొన్సెకా వ్యాపారంలో మూడోవంతు చైనా కంపెనీలేనని ఇంటర్నేషనల్ ఐసీఐజే వెల్లడించింది. ఎంఎఫ్ సలహాతో నడుస్తున్న వాటిలో 16,300 కంపెనీలు చైనా, హాంకాంగ్ దేశస్తులవేనని తెలిపింది. మరోవైపు, బ్యాంకులు షెల్ కంపెనీల యజమానులను సులభంగా గుర్తించేలా కొత్త నిబంధనలు తీసుకురావాలని అమెరికా భావిస్తోంది. వీటి ద్వారా బ్యాంకింగ్ రంగంలోని లొసుగులను గుర్తించి.. జాగ్రత్తపడొచ్చని భావిస్తోంది. మరోవైపు, పనామా పేపర్స్ వివాదంలో యూఈఎఫ్ఏ కార్యాలయాల్లో సిట్జర్లాండ్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ‘పనామా’పై న్యాయ విచారణకు డిమాండ్ పనామా పేపర్స్ వివాదంలో వెల్లడవుతున్న భారతీయుల పేర్లపై న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్, ఆప్ డిమాండ్ చేశాయి. అయితే.. విదేశాల్లో అక్రమంగా కంపెనీలున్న వారు ఇకపై నిద్రలేని రాత్రులు గడపాల్సిందేనని అరుణ్‌జైట్లీ అన్నారు. కాగా, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ కుమారుడు, బీజేపీ ఎంపీ అభిషేక్ సింగ్‌కూ విదేశీ కంపెనీల్లో వాటాలున్నాయని.. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. వీటిని అభిషేక్ ఖండించారు. పనామా జాబితాలో వెల్లడైన 500 మంది భారతీయుల ఆస్తులు దర్యాప్తు చేసేందుకు కేంద్రం వివిధ విభాగాల అధికారులతో ఏర్పాటుచేసిన దర్యాప్తు బృందం గురువారం ఢిల్లీలో సమావేశమైంది. సామాన్యులకూ కంపెనీలు చెన్నైలోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన షణ్ముగ సుందరపాండియన్కు పనాసియా స్టార్ లిమిటెడ్, విర్ ఫ్యాషన్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే రెండు కంపెనీలున్నట్లు తేలింది. సుందరపాండియన్ సోదరుడు చెన్నైలో జర్నలిస్టుగా ఉన్నారు. కేరళలోని కొబ్బరికాయల చిరు వ్యాపారైన దినేశ్ పరమేశ్వరన్ నాయర్‌కు ఓ విదేశీ కంపెనీలో భాగస్వామ్యం ఉందని తేలింది. -
ఆ చిన్ని గుండెకు ఎంత ధైర్యమో...
అదో దట్టమైన అడవి.. భయంకరమైన ఎలుగుబంట్లకు, తోడేళ్లకు నిలయం. ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెల్సియస్. రాత్రిపూట పరిస్థితి మరింత దిగజారుతుంది. అలాంటి భయంకరమైన అడవిలో మనుషులెవరైనా తప్పిపోతే..? ప్రత్యేకించి ముక్కుపచ్చలారని నాలుగేళ్ల చిన్నారి తప్పిపోతే..? తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది కదూ! కానీ, ఇది నిజంగానే జరిగింది. నాన్నను వెదుకుతూ వెళ్లిన ఓ చిన్నారి అడవిలో దారితప్పింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 రోజులు ఆ కీకారణ్యంలోనే ధైర్యంగా గడిపింది! సైబీరియాలోని మారుమూల ప్రాంతంలో ‘సఖా రిపబ్లిక్’ అనే చిన్న గ్రామం దట్టమైన అడవికి సమీపంలో ఉంటుంది. ‘కరీనా’ తండ్రి పక్కనే ఉన్న మరో పల్లెలో ఉంటాడు. 2014, జులై 29 తేదీన చిన్నారి కరీనా తన పెంపుడుకుక్క పప్పీతో కలిసి బయల్దేరింది. ఆ సమయంలో తండ్రి అడవిలోకి వెళ్లాడు. ఎంత నడిచినా.. నాన్న ఉండే గ్రామం రావడం లేదు. చాలా దూరం వెళుతోంది. తోడుగా కుక్కపిల్ల తప్ప మరెవరూ లేరు. అప్పుడు అర్థమైంది కరీనాకి. తాను దారి తప్పానని. అయితే.. కరీనా భయపడలేదు, ఏడవలేదు. రాత్రి అయింది. అమ్మ ఒడిలో వెచ్చగా నిద్రపోవాల్సిన సమయం. దూరంగా ఎలుగుబంట్ల గాండ్రింపులు, తోడేళ్లు, నక్కల ఊలలు వినిపిస్తున్నాయి. ఎముకలు కొరికే చలి మొదలైంది. చలిని తట్టుకునేందుకు గడ్డి మొక్కల మధ్యలో చేరింది. పప్పీని హత్తుకుని నిద్రపోయింది. నాలుగురోజుల తరువాత..! కరీనా తండ్రి- తల్లి ఉండే గ్రామాలు మరీ మారుమూలవి. సెల్‌ఫోన్ సిగ్నల్స్ కూడా రావు. కరీనా తండ్రి వద్దకు చేరలేదన్న విషయాన్ని నాలుగురోజుల తరువాత గానీ గుర్తించలేదు ఆమె తల్లి. కరీనా కోసం తల్లిదండ్రులు చుట్టు పక్కల పల్లెల్లో వెదికారు. ఫలితం లేదు. ఒకవేళ పాప అడవిలోకి వెళ్లి ఉంటుందా? అన్న అనుమానం కలిగింది. దారితప్పి పక్క ఊరుకు వెళ్లి ఉంటుందని ఇంతకాలం తనకు తాను సర్ది చెప్పుకున్న తల్లి మనసు ఎందుకో కీడు శంకించడం మొదలు పెట్టింది. తన బంగారు తల్లికి ఏదైనా ఆపద ఎదురైందా? తాను తినిపించనిదే ముద్దయినా తినని పసి హృదయం క్రూరమృగాల మధ్య క్షేమంగానే ఉందా? ఏం తింటుందో? ఎలా ఉంటుందో? అన్న ఆలోచనలతో దుఃఖం పొంగుకొస్తోంది. ఆ తల్లి శోకాన్ని ఆపడం ఎవరి వల్లా కావడం లేదు. ఇంక లాభం లేదనుకున్న కరీనా తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గాలింపు మొదలు: విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. పాప కోసం అడవిని జల్లెడ పట్టడం మొదలు పెట్టారు. అడవిలో కాలిబాటన చాలాదూరం వెళ్లిన పోలీసులకు నిరాశే ఎదురైంది. రెండు, మూడురోజులు గడిచినా పాపకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. హెలికాప్టర్లను రంగంలోకి దించారు. కెమెరా డ్రోన్లతో లోయలు, కొండలు అణువణువూ గాలించారు. ఎక్కడా పాప జాడ దొరకలేదు. 10 రోజులు గడిచాయి. అటు పోలీసుల్లో, ఇటు ప్రజల్లో కరీనా బతికి ఉంటుందన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. కరీనా తల్లి మాత్రం తన చిన్నారికి ఎలాంటి ఆపద రాకూడదని అనుక్షణం దేవుడిని వేడుకుంటోంది. ఎలా బతికింది? కరీనా చెప్పిన దాని ప్రకారం.. అడవిలో ఆమె ఏమాత్రం భయపడలేదు. ఆకలేస్తే.. అడవిలో దొరికిన పండ్లను తినేది. వాగులు, వంకల్లో నీటిని తాగి దాహం తీర్చుకునేది. సాయంత్రం చలిని తప్పించుకునేందుకు పప్పీని ఒళ్లో పెట్టుకుని నిద్రపోయేది. అమ్మానాన్నలు కనిపించడం లేదన్న బెంగ తప్ప మరే విషయం తనని భయపెట్టలేదని ముద్దు మాటలతో చెప్పింది. కుక్కపిల్లే దారి చూపింది..! 11వ రోజు కరీనాకు తోడుగా ఉన్న పప్పీ ఇంటికి వచ్చింది. అంతే కరీనా తల్లిదండ్రులు, పోలీసుల్లో ఆశలు చిగురించాయి. వారిని వెంటబెట్టుకుని తిరిగి అడవిలోకి దారి తీసింది పప్పీ. అలా అడవిలో కిలోమీటర్ల దూరం పరిగెత్తిన పోలీసులకు దూరంగా ఒక గడ్డిమొక్కల మధ్యన పడుకున్న కరీనా కనిపించింది. అందరి కళ్లల్లో ఆనందం! కరీనా బతికే ఉంది. క్షేమంగా ఉంది. వెంటనే పాపను ఎత్తుకున్న పోలీసులు తల్లికి అందించారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కరీనాను పరీక్షించిన వైద్యులు ఒంటిపై దోమకాట్లు తప్ప పాపకు ఎలాంటి అనారోగ్యం లేదని తేల్చారు. పాప ధైర్యమే ఆమెను బతికించిందని చెప్పారు. పాప ఎక్కువసమయం గడ్డి మధ్య ఉండటం వల్ల హెలికాప్టర్లు, డ్రోన్ల కంటికి చిక్కలేదు. ఏదేమైనా కరీనా క్షేమంగా రావడంతో అంతా సంతోషించారు. -
ఈ జోడీ పర్ఫెక్ట్!
దేడ్ కహానీ - జబ్ వియ్ మెట్ చేపపిల్ల... నీళ్లల్లో ఈదుతున్నంతసేపూ నోటి దవడలు ఆడిస్తూనే ఉంటుంది. నీళ్లు తాగకుండా ఆక్సిజన్ తీసుకునే ప్రక్రియ అది. దాని జీవనాధారం. అలాగే ఓ చేప కళ్లున్న ఆడపిల్ల, చలాకీగా ఇరవై నాలుగ్గం టలూ తన పెదాలని ఆడిస్తూనే ఉంటుంది. ఎదుటి వాడి మనోభావాలతో సంబంధం లేదు. అలా మాట్లాడుతూనే ఉంటుంది. చివరికి నిద్రలో కూడా. ఆమే... గీత్ సింగ్. అమాయకమైన పల్లె టూరి అమ్మాయి. ముంబైలో ట్రైన్ ఎక్కుతుంది. పరిగెడుతున్న ట్రైన్ లోపల కెమెరా పెట్టి, ఖాళీ డోరు షాటు, కదులు తున్న ట్రైనుని చూపిస్తూ, గట్టిగా గీత్ గొంతు, మాటలు మాత్రమే వినపడేలా కొంత దూరం నడిపించి, తర్వాతే ఆమె రూపాన్ని ప్రేక్షకులకి పరిచయం చేస్తాడు దర్శకుడు. ఒక వాగుడుకాయ్ క్యారెక్టర్‌కి ఇంతకంటే అందమైన, అర్థవంతమైన పరిచయం వేరేది ఉండదు. ఇలా గీత్‌ని పరిచయం చేయడానికి ముందే ముంబైలో ఒక గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ వారసుడు ఆదిత్య కశ్యప్‌ని చాలా నిరాశగా, నిస్పృహగా, జీవితంలో ఓడిపోయి, అదీ తల్లి వేరే వ్యక్తిని ప్రేమించి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోతే, ఆ రిఫ్లెక్షను తనని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మీద పడి, ఆమె పెళ్లి క్యాన్సిల్ చేసేస్తే, మూగ బోయినవాడిగా చూపిస్తాడు దర్శకుడు. గమ్యం తెలీక, ఎలా ఉన్నవాడు అలా ఇల్లొదిలి రెలైక్కి కూర్చుంటాడు. అలాంటి వాడికి కో-ప్యాసింజర్ గీత్. అడిగినా అడక్కపోయినా, విసుక్కున్నా, లేచి వెళ్లి ఇంకో దగ్గర కూర్చున్నా ఆమె ధోరణి ఆమెదే. ఆ ఇద్దరూ కలిసి చేసే రైలు ప్రయాణం, దాని కొనసాగింపుగా చేసే జీవిత ప్రయాణమే ‘జబ్ వియ్ మెట్’ సినిమా మొదటి భాగం. నిరాశా నిస్పృహల్లో ఉన్న ఆదిత్యని తన సెలయేటి ప్రవాహం లాంటి మాటల నుంచి ప్రసరించిన తరంగాల కరెంటుతో చైతన్యవంతుణ్ని చేస్తుంది గీత్. అద్భుతమైన సీన్ ఏంటంటే, తండ్రి మరణానికి కారణం తన తల్లి వేరే వ్యక్తిని ప్రేమించి వెళ్లిపోవడం అని, సమాజం తల్లి మీద వేసిన నిందని కొడుకుగా తనూ వేసి ఆమెపై కోపం పెంచుకున్న కశ్యప్‌కి గీత్, తల్లి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం నేర్పిస్తుంది. తల్లి కూడా ఒక మనిషే అని, ఆమె ప్రేమలో తప్పు లేదని, కొడుకుగా ఆమెని అర్థం చేసుకోవాలే తప్ప, సమాజం దృష్టి నుంచి ఆమెని చూడకూడదని చెప్తుంది. ఇలాంటి తల్లుల్ని నిజ జీవితంలో చూసే ఉంటాం, సమాజంలాగ వాళ్లని చెడుగా తిట్టే ఉంటాం - గీత్‌లా వాళ్లని మనుషులుగా భావించమని చెప్పేవాళ్లు మనకుండకపోవచ్చు. జబ్ వియ్ మెట్ గీత్... వుయ్ లెర్న్ హౌ టు లీడ్ లైఫ్ అండ్ హౌ టు ట్రీట్ అదర్స్. సరే, అలాంటి గీత్‌ని ఆమె ఇంట్లోంచి తెల్లారుఝామున తీసుకొచ్చి ఆమె ప్రేమించిన అన్షుమన్ దగ్గర వదిలి వెళ్లిపోతాడు కశ్యప్. ఆమె అడుగుతుంది - మా ఇంట్లోవాళ్లకి తెలీకుండా ఇలా వెళ్లిపోతున్నాను నన్ను క్షమిస్తారా అని! ఆదిత్య చెప్తాడు - మా అమ్మని నీవల్ల నేను అర్థం చేసుకున్నాను, నిన్ను కూడా మీవాళ్లు కొన్నాళ్లకి అర్థం చేసుకుంటారని. అన్షుమన్‌ని కలవకుండానే గీత్‌ని దింపేసి వెళ్లిపోతాడు కశ్యప్ - ఇక్కడ విశ్రాంతి. జీవితాన్ని ఎలా చూడాలో, ఆ క్షణాన్ని ఎలా ఆస్వాదించాలో గీత్ ఆదిత్యకే కాకుండా ఆడియెన్స్ అందరికీ చెప్తుంది. అందుకే ఫస్ట్ హాఫ్ చాలా బావుంటుంది. అందుకే ఫస్ట్ హాఫ్ గురించి ఎక్కువ రాశాను. ద్వితీయార్ధంలో ఆదిత్య చాలా యాక్టివ్ అయిపోతాడు. కానీ గీత్ మాత్రం జీవితంలో ఓడిపోయి కాన్ఫిడెన్స్ కోల్పోయి డీలా పడిపోతుంది. అది తెలిసి ఆమెలో తన చైతన్యంతో కరెంట్ ప్రవహించేట్టు చేసి ఆమెని మామూలుగా తన కుటుంబంతో కలిపే ప్రయత్నం చేస్తాడు ఆదిత్య. ఆ క్రమంలో వాళ్లిద్దరూ ఒకటవ్వడమే కథ. ప్రథమార్ధంలో ఉత్తుంగ తరంగం లాంటి గీత్‌గా మెప్పించిన కరీనా కపూర్ నీరసించడం, నీరస పాత్రలో బాగా మెప్పించిన షాహిద్ కపూర్ ద్వితీయార్ధంలో ఉత్తుంగ తరంగంలా ఎగసి పడలేకపోవడం చూస్తే... సినిమాని కొంచెం పడేసిన ఫీలింగ్ వస్తుంది. కానీ, గీత్ ప్రేమించిన అన్షుమన్‌ని కుటుంబ సభ్యులు స్నేహితుడనుకుని, ఆదిత్యని అల్లుడనుకునే సన్నివేశాలు బాగా నవ్వు తెప్పిస్తాయి. ఆ ఇంటి సీన్లే సెకండ్ హాఫ్‌కి సేవింగ్ ఫ్యాక్టర్. ఒక విధంగా శ్రీను వైట్లగారి సినిమాల ఫార్మాట్ నుంచే ఈ చిత్ర రూపకల్పన జరిగినట్టు ఉంటుంది. ఆ ఇంటి సీన్లు తెలుగులో చాలా సినిమాలకి ముడి సరుకు. షాహిద్, కరీనాలు అప్పటికే ప్రేమికులుగా పాపులర్ అవ్వడం వల్ల కెమిస్ట్రీ మరింత బాగా పండినట్టు ఉంటుంది. కానీ, ఇదే ‘దిల్వాలే దుల్హనియా’ టైమ్‌లో షారుఖ్, కాజోల్ లాంటి జంట చేసుంటే... ఇది కూడా వాటిలాగే ఒక కల్ట్ ఫిల్మ్ అవ్వగలిగే కథ, కథనం ఉన్నాయి ఇందులో. అందుకే ఈ సినిమా బాలీవుడ్లో కమర్షియల్ హిట్‌గా నిలిచింది. 2007 అక్టోబర్‌లో రిలీజైన ఈ సినిమా 2010లో హాలీవుడ్లో ‘లీప్ ఇయర్’ అనే సినిమాకి ప్రేరణ కావడం భారతీయ సినిమా గర్వించదగ్గ అంశమే. విచిత్రం ఏంటంటే ఈ చిత్రం చివరి షెడ్యూల్‌కి వచ్చేసరికి షాహిద్, కరీనాలు నిజ జీవితంలో విడిపోయారు. మీడియా అంతా అది ఈ చిత్రం తాలూకు పబ్లిసిటీ స్టంట్ అని అభివర్ణించింది. కానీ తర్వాత అది నిజమని రుజువైంది. ఈ సినిమా టైటిల్‌ని ‘పంజాబ్ మెయిల్’ అని పెట్టాలా, ‘ఇష్క్ వయా భటిండా’ అని పెట్టాలా ‘జబ్ వియ్ మెట్’ అని పెట్టాలా తేల్చుకోలేక పబ్లిక్ ఓటింగ్ పెడితే జబ్ వియ్ మెట్ గెలిచింది. అలాగే రిలీజయ్యాక ప్రేక్షకుల మన్ననలూ గెలిచింది. కాసుల వర్షమూ రూపాయికి మూడు రూపాయల చొప్పున గెలుచుకొంది. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన మరో ముఖ్య అంశం... ప్రీతమ్ సంగీతం. ఆసాంతం ఆకట్టుకొంటుంది. నటరాజన్ సుబ్రమణియన్ కెమెరా పనితనం కూడా చాలా బావుంటుంది. శ్రేయాఘోషల్కి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ గాను, సరోజ్ఖాన్కి బెస్ట్ కొరియోగ్రాఫర్ గాను, నేషనల్ అవార్డులను తేవడంతో పాటు కరీనా కపూర్‌కి ఉత్తమ నటిగా ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రైవేటు అవార్డుల్ని తెచ్చిపెట్టింది ఈ చిత్రం. దర్శకుడు ఇంతియాజ్ అలీ రెండో చిత్రం ఇది. ఈ చిత్రం సక్సెస్ ఇచ్చిన ఊపుతో తర్వాత చాలా మంచి చిత్రాలు తీశాడు. ఇంతియాజ్ కథ కన్నా పాత్రకి, పాత్రల రూపకల్పనకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. వాటి ద్వారా జీవితాన్ని, భావోద్వేగాల్ని అద్భుతంగా ఆవిష్కరిస్తాడు. ప్రేమని చాలా సున్నితంగా ప్రస్తావిస్తాడు. సీన్స్‌ని సుతిమెత్తటి పూవుల్లా ప్యాంపర్ చేస్తాడు. అందుకే మంచి దర్శకుడిగా ఎదిగాడు. రైలు ప్రయాణం ఆధారంగా తీసిన ఈ చిత్రంతో కెరీర్లో, జీవితంలో సక్సెస్ అందుకున్నాడు. తిన్నగా హైవే ఎక్కేశాడు. ఇక పక్కదారి పట్టడనే భావిద్దాం. మరిన్ని మంచి సినిమాలు తీస్తాడని, మనకు చూపిస్తాడనీ ఆశిస్తాం. - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
ఆ పెళ్లికి బెబో హాజరవుతుందట!
గాసిప్ కొందరు ప్రేమికులు విడిపోయాక... ఇక ఎప్పటికీ కలుసుకోరు. కొందరు విడిపోయినా... ఒకరికొకరు కలుసుకోక పోయినా ‘నీ సుఖమే నే కోరుకున్నా’ అని మౌనంగా పాటలు పాడుకుంటారు. కొందరు ప్రేమికులు మాత్రం... వీడిపోయాక మంచి స్నేహితులుగా మిగిలిపోతారు. ఒన్స్ అపాన్ ఏ టైమ్... చాక్లెట్ బాయ్ షాహీద్ కపూర్, కరీనాకపూర్‌లు జగమెరిగిన ప్రేమికులన్నది తెలిసింది. ఆ తరువాత ఏమైందో ఏమోగానీ... ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఇద్దరి మధ్య మాటలు లేని పరిస్థితి ఏర్పడింది. ఆ తరవాత ఇద్దరూ సినిమాల్లో బిజీ అయిపోయారు. అయితే కాలం స్నేహితులుగా మళ్లీ వారిని దగ్గర చేసింది. ఒకప్పుడు వాళ్లు ప్రేమికులు కావచ్చునేమోగానీ, ఇప్పుడు మాత్రం మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి ‘ ఉడ్తా పంజాబ్’ సినిమాలో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది సరే, ఇంతకీ కరీనా షాహిద్ పెళ్లికి హాజరు కానుందా? హాజరు కావడమేమిటి... షాహిద్ కుటుంబంలోని వ్యక్తిలాగే పెళ్లి పనుల్లో చురుగ్గా పాల్గొంటుందని విశ్వసనీయ వర్గాలు చెబుతు న్నాయి. చూద్దాం మరి ఏంజరగనుందో! -
హమ్ తుమ్.. ఏక్ కమ్రే మే బంద్ హో!
ఆలూ, మగల మధ్య చిన్న చిన్న అలకలు, గొడవలు సహజమే. ఇవన్నీ లేని సంసారం బాగానే ఉన్నా, ఇవన్నీ ఉంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే, గొడవపడిన తర్వాత మళ్లీ మామూలుగా మాట్లాడుకోవడం, అలక తీరిన తర్వాత చెప్పుకునే కబుర్లు చాలా చాలా బాగుంటాయి. ఈ అనుభూతి ఎలా ఉంటుందో భార్యా, భర్తలకు బాగా తెలుస్తుంది. అర్జున్ కపూర్‌లాంటి పెళ్లి కాని వాళ్లకు ఏం తెలుస్తుంది? పైగా, తనకన్నా సీనియర్ అయిన కరీనా కపూర్‌కి భర్తగా నటించాలంటే? ఇంకేమన్నా ఉందా? సరే.. ఇతగాడి సంగతి పక్కన పెడితే పెళ్లయిన కరీనా కపూర్‌కి కూడా భార్యా భర్తల మధ్య వచ్చే అలకలు గురించి పెద్దగా తెలియదట. ఎందుకంటే, సైఫ్ అలీఖాన్, ఆమె చాలా కూల్‌గా ఉంటారట. మరి.. అర్జున్, కరీనా సినిమాలో గొడవపడేట్లు నటించాలంటే కొంత అనుభవం కావాలి కదా? అందుకే చిత్రదర్శకుడు ఆర్. బాల్కీ ఈ ఇద్దర్నీ ఓ గదిలో బంధించేశారు. రోజంతా ఒకే గదిలో బంధీలుగా ఉండి, ఇద్దరూ చిరు కోపాలు, అలకలు ప్రదర్శించుకోవాలన్న మాట. పెద్ద పెద్ద గొడవలు కూడా పడాలి. అప్పుడే షూటింగ్లో సరిగ్గా చేయగలుగుతారన్నది బాల్కీ అభిప్రాయం. దాదాపు ఐదు రోజుల పాటు వీళ్లిద్దరూ ఇలా గదిలో బంధీలుగా ఉంటారట. -
ప్రధాని మోడీతో కరీనా, సైఫ్ సెల్ఫీ ఫోటో!
ముంబై: బాలీవుడ్ తారలు కరీనాకపూర్, సైఫ్ ఆలీ ఖాన్, సోనమ్ కపూర్, శ్రద్ధాకపూర్, ఆదిత్య రాయ్ కపూర్, సోను నిగమ్ లు ప్రధాని నరేంద్రమోడీతో ఫోటోలు తీయించుకోవడానికి పోటి పడ్డారు. సర్ హర్కిసన్ దాస్ నరోత్తమ్ దాస్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ అండ్ రీసెర్చీ సెంటర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బాలీవుడ్ తారలు హాజరయ్యారు. కార్యక్రమం తర్వాత బాలీవుడ్ తారలందరూ ఫోటోలు తీయించుకుని.. ట్విటర్ లో పోస్ట్ చేసి తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. -
మా అమ్మ కొట్టలేదు
ఒక చెంప దెబ్బ షాట్‌ను సరిగ్గా తీయడం కోసం 200 టేక్‌లు తీసుకున్నానని ‘లేకర్ హం దివానా దిల్’ సినిమాతో బాలీవుడ్లో అడుగిడుతున్న అర్మాన్‌జైన్ చెప్పాడు. ‘మా అమ్మ రీమా నన్ను ఏనాడూ కొట్టలేదు. అందువల్లనే ఆ సీన్‌ను పండించడానికి అన్ని టేక్‌లు తీసుకోవాల్సి వచ్చింది’ అని రాజ్‌కపూర్ మనవడైన అర్మాన్ తన మనసులో మాట బయటపెట్టాడు. ‘నేను అసలు అల్లరే చేసేవాడిని కాదు. ఒకవేళ ఎప్పుడైనా ఆమెను సతాయిస్తే వెంటనే ఓ గదిలో బంధించేది. అంతేతప్ప ఏనాడూ నాపైకి చేయెత్తలేదు. ఈ సినిమాలో నా తల్లి పాత్రధారి అనిత నన్ను తొలిసారిగా కొట్టింది. దీంతో దిగ్భ్రాంతికి గురయ్యా’ అని అన్నాడు. కపూర్ల కుటుంబానికి చెందిన ఈ నటవారసుడు తన బంధువులైన రణ్‌బీర్, కరిష్మా, కరీనా కపూర్ల సహాయం ఏనాడూ తీసుకోలేదు. అయినప్పటికీ తొలి సినిమా ద్వారా భారీ హిట్ ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్నాడు. అరిఫ్ అలీ దర్శకత్వంలో రూపొందిన ‘లేకర్ హం దివానా దిల్’ సినిమాలో అర్మాన్ సరసన దీక్షాసేథ్ నటించింది. ఈ సినిమాకు కరీనా భర్త సైఫ్ అలీఖాన్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా శుక్రవారం విడుద ల కానుంది. ‘సైఫ్ సినిమాలో నాకు ఓ అవకాశం దొరికింది. మా సోదరులు ఎవరైనా కలిస్తే సినిమాల గురించే మాట్లాడుకుంటామని అంతా అనుకుంటారు. అయితే అది సరికాదు. సినిమాలు మినహా అన్ని విషయాలు మాట్లాడుకుంటాం. మా ఇంట్లో ఏ ఒక్కరికీ చెప్పకుండానే ‘లేకర్ హం దివానా దిల్’ సినిమా ఆడిషన్లో పాల్గొన్నా. ఈ సినిమాకోసం ఆరిఫ్ నన్ను ఎంపిక చేసిన తర్వాత ఈ విషయాన్ని దీదీ (కరీనాక పూర్) తెలియజేశా’ అని అన్నాడు.