ఆ చిన్ని గుండెకు ఎంత ధైర్యమో...
అదో దట్టమైన అడవి.. భయంకరమైన ఎలుగుబంట్లకు, తోడేళ్లకు నిలయం. ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెల్సియస్. రాత్రిపూట పరిస్థితి మరింత దిగజారుతుంది. అలాంటి భయంకరమైన అడవిలో మనుషులెవరైనా తప్పిపోతే..? ప్రత్యేకించి ముక్కుపచ్చలారని నాలుగేళ్ల చిన్నారి తప్పిపోతే..? తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది కదూ! కానీ, ఇది నిజంగానే జరిగింది. నాన్నను వెదుకుతూ వెళ్లిన ఓ చిన్నారి అడవిలో దారితప్పింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 రోజులు ఆ కీకారణ్యంలోనే ధైర్యంగా గడిపింది!
సైబీరియాలోని మారుమూల ప్రాంతంలో ‘సఖా రిపబ్లిక్’ అనే చిన్న గ్రామం దట్టమైన అడవికి సమీపంలో ఉంటుంది. ‘కరీనా’ తండ్రి పక్కనే ఉన్న మరో పల్లెలో ఉంటాడు. 2014, జులై 29 తేదీన చిన్నారి కరీనా తన పెంపుడుకుక్క పప్పీతో కలిసి బయల్దేరింది. ఆ సమయంలో తండ్రి అడవిలోకి వెళ్లాడు. ఎంత నడిచినా.. నాన్న ఉండే గ్రామం రావడం లేదు. చాలా దూరం వెళుతోంది. తోడుగా కుక్కపిల్ల తప్ప మరెవరూ లేరు. అప్పుడు అర్థమైంది కరీనాకి. తాను దారి తప్పానని. అయితే.. కరీనా భయపడలేదు, ఏడవలేదు. రాత్రి అయింది. అమ్మ ఒడిలో వెచ్చగా నిద్రపోవాల్సిన సమయం. దూరంగా ఎలుగుబంట్ల గాండ్రింపులు, తోడేళ్లు, నక్కల ఊలలు వినిపిస్తున్నాయి. ఎముకలు కొరికే చలి మొదలైంది. చలిని తట్టుకునేందుకు గడ్డి మొక్కల మధ్యలో చేరింది. పప్పీని హత్తుకుని నిద్రపోయింది.
నాలుగురోజుల తరువాత..!
కరీనా తండ్రి- తల్లి ఉండే గ్రామాలు మరీ మారుమూలవి. సెల్‌ఫోన్ సిగ్నల్స్ కూడా రావు. కరీనా తండ్రి వద్దకు చేరలేదన్న విషయాన్ని నాలుగురోజుల తరువాత గానీ గుర్తించలేదు ఆమె తల్లి. కరీనా కోసం తల్లిదండ్రులు చుట్టు పక్కల పల్లెల్లో వెదికారు. ఫలితం లేదు. ఒకవేళ పాప అడవిలోకి వెళ్లి ఉంటుందా? అన్న అనుమానం కలిగింది. దారితప్పి పక్క ఊరుకు వెళ్లి ఉంటుందని ఇంతకాలం తనకు తాను సర్ది చెప్పుకున్న తల్లి మనసు ఎందుకో కీడు శంకించడం మొదలు పెట్టింది. తన బంగారు తల్లికి ఏదైనా ఆపద ఎదురైందా? తాను తినిపించనిదే ముద్దయినా తినని పసి హృదయం క్రూరమృగాల మధ్య క్షేమంగానే ఉందా? ఏం తింటుందో? ఎలా ఉంటుందో? అన్న ఆలోచనలతో దుఃఖం పొంగుకొస్తోంది. ఆ తల్లి శోకాన్ని ఆపడం ఎవరి వల్లా కావడం లేదు. ఇంక లాభం లేదనుకున్న కరీనా తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
గాలింపు మొదలు:
విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. పాప కోసం అడవిని జల్లెడ పట్టడం మొదలు పెట్టారు. అడవిలో కాలిబాటన చాలాదూరం వెళ్లిన పోలీసులకు నిరాశే ఎదురైంది. రెండు, మూడురోజులు గడిచినా పాపకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. హెలికాప్టర్లను రంగంలోకి దించారు. కెమెరా డ్రోన్లతో లోయలు, కొండలు అణువణువూ గాలించారు. ఎక్కడా పాప జాడ దొరకలేదు. 10 రోజులు గడిచాయి. అటు పోలీసుల్లో, ఇటు ప్రజల్లో కరీనా బతికి ఉంటుందన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. కరీనా తల్లి మాత్రం తన చిన్నారికి ఎలాంటి ఆపద రాకూడదని అనుక్షణం దేవుడిని వేడుకుంటోంది.
ఎలా బతికింది?
కరీనా చెప్పిన దాని ప్రకారం.. అడవిలో ఆమె ఏమాత్రం భయపడలేదు. ఆకలేస్తే.. అడవిలో దొరికిన పండ్లను తినేది. వాగులు, వంకల్లో నీటిని తాగి దాహం తీర్చుకునేది. సాయంత్రం చలిని తప్పించుకునేందుకు పప్పీని ఒళ్లో పెట్టుకుని నిద్రపోయేది. అమ్మానాన్నలు కనిపించడం లేదన్న బెంగ తప్ప మరే విషయం తనని భయపెట్టలేదని ముద్దు మాటలతో చెప్పింది.
కుక్కపిల్లే దారి చూపింది..!
11వ రోజు కరీనాకు తోడుగా ఉన్న పప్పీ ఇంటికి వచ్చింది. అంతే కరీనా తల్లిదండ్రులు, పోలీసుల్లో ఆశలు చిగురించాయి. వారిని వెంటబెట్టుకుని తిరిగి అడవిలోకి దారి తీసింది పప్పీ. అలా అడవిలో కిలోమీటర్ల దూరం పరిగెత్తిన పోలీసులకు దూరంగా ఒక గడ్డిమొక్కల మధ్యన పడుకున్న కరీనా కనిపించింది. అందరి కళ్లల్లో ఆనందం! కరీనా బతికే ఉంది. క్షేమంగా ఉంది. వెంటనే పాపను ఎత్తుకున్న పోలీసులు తల్లికి అందించారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కరీనాను పరీక్షించిన వైద్యులు ఒంటిపై దోమకాట్లు తప్ప పాపకు ఎలాంటి అనారోగ్యం లేదని తేల్చారు. పాప ధైర్యమే ఆమెను బతికించిందని చెప్పారు. పాప ఎక్కువసమయం గడ్డి మధ్య ఉండటం వల్ల హెలికాప్టర్లు, డ్రోన్ల కంటికి చిక్కలేదు. ఏదేమైనా కరీనా క్షేమంగా రావడంతో అంతా సంతోషించారు.