చుంచులూరు వద్ద వాహనం ఢీకొనడంతో మృతి చెందిన దుప్పి (ఫైల్)
సాక్షి,ఆత్మకూరు(నెల్లూరు): జిల్లాలోని సీతారామపురం నుంచి రాపూరు వరకు విస్తరించిన నల్లమల, వెలగొండ, పెంచలనరసింహ అభయారణ్యాలు ఉన్నాయి. 28 శాతానికిపైగా అడవులు, దక్షిణ, పడమర ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఇటు నెల్లూరు, అటు వైఎస్సార్ జిల్లా సరిహద్దులుగా పెంచల నరసింహ అభయారణ్యం విస్తరించి ఉంది. మర్రిపాడు, అనంతసాగరం, సోమశిల ప్రాంతాలు ఈ అభయారణ్యం పరిధిలోకి వస్తాయి. ఈ అటవీ ప్రాంతాల్లో అనేక రకాల వన్యప్రాణులు ఉన్నాయి. అయితే గుట్టుచప్పుడు కాకుండా కొన్ని ప్రాణులు వేటగాళ్లకు బలవుతుంటే.. మరికొన్ని జనారణ్యంలోకి వచ్చి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నాయి.
అరుదైన వన్యప్రాణులు అంతరించి పోయే ప్రమాదం ఏర్పడనుంది. జిల్లాలో ఈ అటవీ ప్రాంతాల మధ్య ఉండే నెల్లూరు– ముంబయి, నకిరేకల్– ఏర్పేడు జాతీయ రహదారితో పాటు ఇతర ప్రధాన రహదారులు ఉన్నాయి. ఆయా రోడ్లపై రాత్రి పూట కూడా వాహనాలు తిరుగుతున్నాయి. కొన్ని వన్యప్రాణులు దారి తప్పి.. మరికొన్ని దాహార్తిని తీర్చుకునేందుకు జనారణ్యంలోకి వస్తున్నాయి. ఆత్మకూరు అటవీ రేంజ్ పరిధిలోని మర్రిపాడు, అనంతసాగరం, చేజర్ల, ఏఎస్‌పేట తదితర మండలాల పరిధిలో జింకలు, దుప్పిలు రోడ్డుపైకి వచ్చి వాహనాల ప్రమాదంలో గాయపడిన ఘటనలు ఎన్నో జరిగాయి. ఇటీవల రెండు జింకలు తీవ్రంగా గాయపడడంతో ప్రయాణికుల ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, సిబ్బంది సంరక్షించేందుకు చికిత్స చేసినా ఫలితం దక్కలేదు.
గతేడాది గుర్తుతెలియని వాహనం ఢీకొని బూదవాడ వద్ద మృతి చెందిన చిరుత (ఫైల్)
కొరవడిన భద్రత
ఆత్మకూరులోని ఇంజినీరింగ్ కళాశాల, చేజర్ల మండలం చిత్తలూరు వద్ద ఏడాది వ్యవధిలో రెండు చిరుతలతో పాటు ఓ అడవి పంది, జింక, దుప్పులు కలిపి 9 మృతి చెందాయి. గతేడాది ప్రారంభంలో బూదవాడ సమీపంలో కృష్ణాపురం మార్గంలో ఓ చిరుత పులి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందింది. అది జరిగిన మరో రెండు నెలలకే ఓ చిరుతపులి పులి పిల్ల వాహనం ఢీకొనడంతో మత్యువాత పడింది. సంగం మండలంలోని ఓ గ్రామంలో జింక దాహార్తి తీర్చుకొనేందుకు ఓ ఇంట్లోకి రావడంతో స్థానికులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. నందవరం, చుంచులూరు పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారి దాటుతూ గుర్తుతెలియని వాహనాలు ఢీకొనడంతో రెండు జింకలు మృతి చెందాయి. 15 రోజుల క్రితం సోమశిల జలాశయం వద్దకు నీరు తాగేందుకు వచ్చి ఓ జింక నీటిలో పడి మృతి చెందింది. ఇలా పలు వన్య ప్రాణులు ప్రాణాలు కోల్పోయాయి.
ఈ చర్యలు చేపడితే...
జాతీయ రహదారులు సమీపంలోని అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంరక్షణ కోసం సరైన చర్యలు చేపడితే వాటిని కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది. అడవి నుంచి రహదారిపైకి వచ్చే మార్గాలను గుర్తించి వాటిని వెంటనే రహదారిపైకి రాకుండా ఆ ప్రాంతాల్లో ఫెన్సింగ్ లేదా కంప వేసి వాటిని అడవులకే పరిమితం చేయొచ్చు. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో తిరిగే సమయంలో దాహార్తి తీర్చుకునేందుకు జంతువులు వచ్చే ప్రాంతాలను గుర్తించి అక్కడ తాగునీరు లభ్యమయ్యేలా గట్టి చర్యలు చేపట్టాలి. ఉపాధి హామీ పథకం ద్వారా అటవీ ప్రాంతం నుంచి రహదారులపైకి వచ్చే చిన్నపాటి దారులను మూసివేసేలా మొక్కలు పెంచాలి. దీనికి తోడు వేటగాళ్ల బారిన పడకుండా అటవీశాఖ వాచర్లు తరచూ ఈ ప్రాంతాల్లో తిరుగుతుంటే అనుమానాస్పద వ్యక్తులను వారు ఏర్పాటు చేసిన ఉచ్చులను గుర్తించి తొలగించేలా చూడాలి. తద్వారా వన్యప్రాణాలను కాపాడుకోవచ్చు.
సిబ్బందికి గట్టి సూచనలు
ఇటీవల కొన్ని వన్యప్రాణులు గుర్తుతెలియని వాహనాలు ఢీకొని మృతి చెందిన విషయం వాస్తవమే. ఒకటి, రెండు జింకలను గాయపడిన సమయంలో గుర్తించి చికిత్స చేసి అటవీ ప్రాంతంలో వదిలేశాం. అయితే కొన్ని దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సిబ్బందికి గట్టి సూచనలు ఇచ్చి అటవీ ప్రాంతంలో పలు చోట్ల తాగునీరు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల వర్షాలు కురవడం కొంత మేలైంది. దీంతో వన్యప్రాణులు రహదారులపై రావడం తగ్గుతుంది. – హరిబాబు, రేంజర్, ఆత్మకూరు
అరణ్యంలో స్వేచ్ఛగా సంచరించే వన్యప్రాణులు దారి తప్పో.. దాహార్తి తీర్చుకునేందుకు జనారణ్యంలోకి వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాయి. రాత్రి పూట రహదారులపైకి రావడంతో వాహనాలు ఢీకొని మృత్యువు పాలవుతున్నాయి. జిల్లా అటవీ ప్రాంతంలో అరుదుగా కనిపించే చిరుతలు సైతం ఇటీవల ప్రాణాలు కోల్పోయాయి. దుప్పిలు, జింకలు, అడవి పందులు అయితే లెక్కలేనన్ని మృత్యువాత పడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment