మనిషికి, మృగానికి మధ్య పెరుగుతున్న ఘర్షణలు | Tigers Increasing In India But Concern On Tigers Leopards Attacking People | Sakshi
Sakshi News home page

మనిషికి, మృగానికి మధ్య పెరుగుతున్న ఘర్షణలు

Published Thu, Jan 19 2023 9:20 AM | Last Updated on Thu, Jan 19 2023 11:43 AM

Tigers Increasing In India But Concern On Tigers Leopards Attacking People - Sakshi

కంచర్ల యాదగిరిరెడ్డి 
దేశంలో ఒక పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంటే.. మరోపక్క పోడు వ్యవసాయం, ఇతరత్రా కారణాలతో అటవీ ప్రాంతం కుంచించుకుపోవడం కొత్త సమస్య తెచ్చిపెడుతోంది. మనిషికీ, వన్య మృగానికీ మధ్య ఘర్షణకు దారితీస్తోంది. పులులు అడవులను దాటి సమీపంలోని గ్రామాలు, పట్టణాల్లో ప్రవేశించడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది.  

పదేళ్లలో 100% పెరుగుదల 
దేశంలో గత పదేళ్ల కాలంలో చిరుతలు, పెద్ద పులుల సంఖ్య అనూహ్యంగా 100 శాతం పెరిగిందని తాజాగా చేపట్టిన గణన ద్వారా వెల్లడైంది. దాదాపు నాలుగు వేల మంది అటవీ శాఖ సిబ్బంది 54 టైగర్‌ రిజర్వు ప్రాంతాల్లోని 14,500 చదరపు కి.మీ. మేర అడవుల్ని గాలించి మరీ 4,500 పైచిలుకు పెద్ద పులులు, 2,300 చిరుతలు ఉన్నాయని లెక్క తేల్చారు. దేశంలో మిజోరం మినహా అన్ని రాష్ట్రాల్లో పులుల జాడ కనిపించడం విశేషం.

వన్యమృగ సంరక్షణ చరిత్రలో ఇది గుర్తుంచుకోదగిన విశేషమని కజిరంగ నేషనల్‌ పార్క్‌ డివిజనల్‌ ఫారెస్ట్‌ అధికారి రమేశ్‌ గగోయ్‌ అన్నారు. ప్రస్తుతం అక్కడ అనేక రకాల వందల కొద్దీ జంతువులతో పాటు 125కు పైగా పులులు ఉన్నాయి. పులుల సంఖ్య పెరగడం శుభసూచకమే అయినా మనుషులకు, మృగాలకు మధ్య కొనసాగుతున్న ఘర్షణ దేశంలో కొన్నిచోట్ల రక్తసిక్తం కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.   

పులుల దాడుల నేపథ్యంలో వాటి నుంచి రక్షణ కోసం ఒకరకంగా యుద్ధమే చేయాల్సి వస్తోంది. గత ఏడాది మనుషులకు, వన్య మృగాలకు మధ్య ఘర్షణలకు సంబంధించిన ఘటనలు దాదాపు 500కు పైగా నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల సరిహద్దుల్లో 33,309 హెక్టార్లకు విస్తరించి ఉన్న అటవీ ప్రాంతం పెద్ద పులులకు ఆవాసంగా మారింది. ఆ ప్రమాదకరమైన ప్రదేశాలకు ప్రజలను దూరంగా ఉంచడంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో మనిషి రక్తం మరిగిన ఓ పులి మహారాష్ట్ర నాసిక్‌ జిల్లాలో నెల వ్యవధిలోనే 8 మందిని చంపి తిని కనిపించకుండా పోయిన ఘటన ఆ రాష్ట్ర అధికారయంత్రాంగానికి నిద్ర లేకుండా చేసింది.

మరో పులి చంద్రాపూర్‌ జిల్లాలో ఆరుగురిని బలితీసుకుంది. కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఇటీవల పులి ఐదుగురిపై దాడి చేసిచంపింది. తాజాగా గురువారం కేరళలోని వయనాడ్‌ జిల్లాలో ఓ రైతుపై అతని ఇంటి వద్దనే దాడి చేసిన పులి తీవ్రంగా గాయపరచడం కలకలం రేపింది. ఆ తర్వాత అతను చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించాడు. గతేడాది మహారాష్ట్రలో 105 మంది పులుల చేతిలో హతమయ్యారని అటవీ శాఖ మంత్రి ఎం.సుధీర్‌ శాసనసభకు చెప్పారు. అంతకుముందు 2020–21లో 86 మంది, 2019–20లో 80 మంది, 2018–19లో 47 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన వివరించారు.  

తెలంగాణలో వారం వ్యవధిలో ఇద్దరు
తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రంభీం జిల్లా వాంకిడి ప్రాంతంలో సంచరి స్తున్న పులి వారం వ్యవధిలోనే ఇద్దరిని బలి తీసుకుంది. గతేడాది ఆ ప్రాంతంలో సంచరిస్తున్న పులులు 170 పశువులపై దాడి చేసి హతమార్చా యి. ‘మేము అటవీ ప్రాంతాల పరిసరాలకు వెళ్లకుండా ఉండలేము. ఎందుకంటే అక్కడ పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్నాం. వెళితే ప్రమాదమని తెలిసినా వెళ్లక తప్పడం లేదు..’అని కుమ్రంభీం జిల్లా దిగడ గ్రామానికి చెందిన కళావతి వాపోయారు.  

పులులు ఎక్కువ ఉన్న చోట్లే.. 
పులులు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లోనే ఘర్షణలు ఎక్కువగా జరుగుతున్నాయని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల ఓ నివేదికలో వెల్లడించింది. తగ్గిపోతున్న అడవుల్లో పులుల సంఖ్య పెరగడంతో అవి జనావాసాలకు రావడం అధికమైంది. ధ్వని కాలుష్యంతో పాటు దీపాల వెలుగులు, గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణాల వాతావరణం వంటి అంశాల వల్ల ఏర్పడే గందరగోళంతోనే ఇతర జంతువుల లాగే పెద్ద పులులు

భయాందోళనలతో దాడులు చేయడం,
చంపడం వంటివి చేస్తున్నాయని ఆ నివేదిక వివరించింది. పులులు ఉన్నాయని తెలిసినా మనుషులు పోడు వ్యవసాయం, ఇతరత్రా అవసరాల కోసం అటవీ ప్రాంతాల పరిసరాలకు వెళ్లక తప్పడం లేదు. గత ఏడాది నవంబర్‌ 15న కుమ్రంభీం జిల్లా వాంకిడి సమీపంలో పత్తి చేనుకు కాపలా కాస్తున్న సీడాం భీము (69)ని పెద్ద పులి దాడి చేసి చంపేసింది. అదే జిల్లా దహేగం మండలం దిగిడ గ్రామానికి చెందిన 19 ఏళ్ల విఘ్నేష్‌పై దాడి చేసి చంపింది.  

ఏటా 20 శాతంపెరుగుదల 
పులుల సంఖ్య పెరుగుతున్న ప్రాంతాల్లో సాధారణంగా ఈ పెరుగుదల ఏడాదికి 20% కంటే ఎక్కువగా ఉందని కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) ఇటీవల పార్లమెంట్‌కు సమరి్పంచిన నివేదికలో తెలిపింది. నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ, వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అఫ్‌ ఇండియా 2020 వెల్లడించిన నివేదికను బట్టి చూస్తే 2016–20 మధ్య దేశవ్యాప్తంగా పులుల స్వా«దీనంలో ఉన్న ప్రదేశం 10 వేల చ.కి.మీ. మేర కుంచించుకుపోయింది. ఒక్క యూపీలోనే గత పదేళ్లలో అటవీ ప్రాంతం వంద చ.కి.మీ. మేర హరించుకుపోయిందని ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది.

పులులు పెరుగుతున్న చోట అటవీ భూములు కుంచించుకుపోకుండా చూడాలని ఫారెస్ట్‌ సర్వే అఫ్‌ ఇండియా గత అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. కాగా, పులులు, ఇతర వన్యప్రాణులు రోడ్లు, రైల్వే ట్రాక్‌లపైకి చేరి చనిపోతున్నాయని ఎఫ్‌ఎస్‌ఐ ఆందోళన వ్యక్తం చేసింది. 2017–18 నుంచి 2020–21 మధ్య దేశవ్యాప్తంగా 63 వేల వన్యప్రాణులు రైళ్ల కింద పడి మరణించాయని, వాటిలో నాలుగు సింహాలు, 73 ఏనుగులు సహా 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద ఉన్న జంతువులు ఉన్నట్లు కాగ్‌ తెలిపింది. 

తెలుగు రాష్ట్రాల్లో100
దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలకు తీసిపోని విధంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పులుల సంఖ్య 100కు పెరిగింది. 2014లో వీటి సంఖ్య 46 మాత్రమే. తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, ఏపీలోని ఉభయగోదావరి, కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల అటవీ ప్రాంతాలే మొదటి నుంచి పెద్ద పులులకు ఆవాసాలుగా పేరొందాయి. పులుల సంఖ్య పెరుగుతున్న కారణంగానే కేంద్ర ప్రభుత్వం 1983లోనే ఉమ్మడి ఏపీ ఐదు జిల్లాల పరిధిలో పది వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతాల్లో నాగార్జునసాగర్‌– శ్రీశైలం టైగర్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేసింది.

అయితే అడవుల్లోకి నక్సలైట్ల ప్రవేశంతో 2005 వరకూ పులుల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వచ్చిది. ఆ తర్వాత నక్సలైట్ల ఉద్యమం తగ్గుముఖం పట్టడంతో 2008 నుంచి పులుల సంఖ్య పెరగడం ప్రారంభమైంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు పరిధిలో కాగజ్‌నగర్, చెన్నూరు, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ఖానాపూర్‌ ఫారెస్ట్‌ డివిజన్లలో పులుల సంచారం అధికమైంది. ప్రస్తుతం అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ (ఏటీఆర్‌) పెద్ద పులుల అభయారణ్యంగా పేరుగాంచింది.  

►దేశంలో పెద్ద పులులు 4,500 పైచిలుకు..

►దేశంలో చిరుతలు 2,300

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement