Kancharla Yadagiri Reddy
-
మాకిచ్చే జీతానికి ఈ మాత్రం పని చేస్తే చాల్లే..!: సర్వే
ఆఫీసులో ఎంత కష్టపడ్డా... శాలరీ పెరిగేది మాత్రం అత్తెసరుగానే.. ఎంత గొడ్డు చాకిరీ చేసినా... లభించే గుర్తింపు అంతంతే.. వేతనంతో పాటు ఇంకేదైనా అలవెన్స్ రూపంలో నగదు ఇస్తే బాగుంటుంది.. రోజూ ఆఫీసుకు రావాలా? వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ రోజులుంటే బాగుండు.. మీకు ఈ మధ్యకాలంలో ఇలాగే అనిపిస్తోందా? పైన చెప్పుకున్న నాలుగు అంశాల్లో ఏదో ఒకటి మీకు వర్తిస్తుందా? అలాగైతే మీరు ఒంటరి వారేమీ కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులు ఇదే విధమైన భావనలతో ఉన్నారు. కోవిడ్ భయం ముగిసి అన్నిరకాల ఉద్యోగులు మళ్లీ పూర్తిస్థాయిలో అఫీసులకు వెళ్లాల్సి వస్తున్న ఈ సమయంలో వారి మనోభావాలు తెలుసుకునేందుకు అంతర్జాతీయ సర్వే సంస్థ ‘గాలప్’ఓ అధ్యయనం నిర్వహించింది. (వైట్‌హౌస్ స్టేట్ డిన్నర్: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?) కంపెనీలు, ఉద్యోగుల మధ్య సంబంధాలేమైనా బలపడ్డాయా? ఉద్యోగుల సంక్షేమానికి ఏం చేస్తున్నారు? పనిచేసే చోట ఒత్తిడి ఏ స్థాయిలో ఉంది? వంటి అనేక అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ వదిలిపెట్టి ఆఫీసులకు వస్తున్నవారిలో వివిధ కారణాలతో నెలకొన్న ఆందోళన, ఒత్తిడి తగ్గించడంపై కంపెనీలు దృష్టి పెట్టాయని తేల్చింది. ఉద్యోగుల్లో కోవిడ్ భయాలు ఇంకా కొనసాగుతున్న సమయంలో కంపెనీలు వారిని ఆఫీసులకు రమ్మనడం మాత్రమే కాకుండా, వారి యోగక్షేమాలు కనుక్కునేందుకు, అవసరమైన సాయం చేసేందుకూ ముందుకొచ్చాయని గాలప్ అధ్యయనం పేర్కొంది. (టీసీఎస్‌లో రూ.100 కోట్ల స్కాం: ఇదిగో క్లారిటీ ) ఉద్యోగుల బాగోగులపై కంపెనీల దృష్టి మూడేళ్ల క్రితం 2020 జనవరిలో మొదలైన కోవిడ్ మహమ్మారి రెండేళ్ల పాటు ప్రపంచాన్ని అట్టుడికించిందంటే అతిశయోక్తి కాదు. ఆఫీసులు మాత్రమే కాదు కరోనాతో సామాన్యుడి జీవితం దాదాపుగా స్తంభించిపోయింది. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు పరిమితమయ్యారు. అయితే టీకాలు వేయడం మొదలైన తరువాత 2021 ఆఖరుకు పరిస్థితిలో కొంత మెరుగుదల కనిపించి, 2022 మార్చికల్లా పరిస్థితులు సాధారణమయ్యాయి. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ తగ్గించే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే ఉద్యోగుల్లో ఆందోళన మునుపెన్నడూ లేనంత ఉచ్ఛస్థితిలో ఉందని, కోవిడ్ భయాలు తొలగినా ద్రవ్యోల్బణం, అర్థ వ్యవస్థ మందగమనం, భవిష్యత్తుపై చింత వంటి అంశాలు ఇందుకు కారణమయ్యాయని గాలప్ అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలోనే కంపెనీలు గత ఏడాదిలో ఉద్యోగుల ఆందోళనను, వారిలో ఒత్తిడిని తగ్గించేందుకు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చాయి. కంపెనీలు ఉద్యోగుల బాగోగులు చూసుకునే ప్రయత్నం చేయడం గత ఏడాది పతాక స్థాయిలో ఉన్నట్టు గాలప్ చెబుతోంది. 2009 నుంచి తాము ఈ ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ సమాచారాన్ని నమోదు చేస్తున్నామని, 2022లో అది రికార్డు స్థాయిలో 23 శాతానికి చేరిందని తెలిపింది. కోవిడ్ ముందునాటి పరిస్థితితో పోలిస్తే భారత్ సహా దక్షిణాసియా దేశాల్లో ఉద్యోగుల బాగోగులు చూసుకునే అంశం 33 శాతానికి చేరింది. (ఉద్యోగులతో సంప్రదింపులు జరపడం ఆధారంగా ఈ అంచనాకొచ్చారు) (ఇటలీలో లగ్జరీ విల్లా: రూ.40 లక్షల అద్దె సంపాదన, ఎవరీ సూపర్‌స్టార్?) కొనసాగుతున్న క్వైట్.. లౌడ్ క్విట్టింగ్.. మీరెలా ఉన్నారని కంపెనీ తరచూ అడుగుతూంటే ఉద్యోగులు సంతోషంగా మరింత కష్టపడతారని అనుకుంటాం కానీ, గాలప్ సర్వే ఫలితాలు దీనికి భిన్నంగానే కనిపించాయి. ఎందుకంటే చాలామంది ఉద్యోగులు క్వైట్ క్విట్టింగ్... అంటే ఆఫీసుకు రావడం.. అప్పగించిన పనిని పూర్తి చేయడం. ఎప్పుడు టైమ్ అవుతుందా.. అని కాచుకు కూర్చొని ఇంటికెళ్లిపోవడం చేస్తున్నారని సర్వే తెలిపింది. వీరు తాము పనిచేస్తున కంపెనీతో ఎలాంటి మానసికమైన సంబంధాన్ని కూడా కలిగిలేరని తెలిపింది. నామ్ కే వాస్తే పని మాత్రం చేస్తున్నారు. అంతే. ఇలా క్వైట్ క్విట్టింగ్ చేస్తున్న ఉద్యోగులు ఎక్కువగా ఉండగా.. కొంతమంది లౌడ్ క్విట్టింగ్‌కు పాల్పడుతున్నారు. అంటే.. తరచూ గ్రూప్ లీడర్లు లేదా సెక్షన్ హెడ్లతో విభేదించడం, కంపెనీ ప్రయోజనాలకు భిన్నంగా పనిచేయడం చేస్తున్నారు. తమకు తగ్గ పని చేయనందుకు కంపెనీ పట్టించుకోవడం లేదని వీరు భావిస్తున్నారు. క్వైట్ క్విట్టర్లు సరిగా పనిచేస్తే.. క్వైట్ క్విట్టర్లు.. తమకు అప్పగించిన పనికి మించి వీసమెత్తు ఎక్కువ చేసేందుకు ఇష్టపడరు. మాకిచ్చే జీతానికి ఈ మాత్రం చేస్తే చాల్లే అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. దీనర్థం.. వారు మరింత ఎక్కువ ఉత్పాదకత సాధించగల సామర్థ్యం ఉన్నవారే. కానీ.. వేతనం, సౌకర్యాలు, నైతిక మద్దతు వంటి అనేక కారణాల వల్ల నిరాసక్తంగా వ్యవహరిస్తున్నారని ఈ సర్వే తేల్చింది. ఒకవేళ వీరు కూడా ఉత్సాహంగా పనిచేస్తే... అది ఉత్పాదకతపై ప్రభావం చూపుతుంది. గాలప్ అంచనాల ప్రకారం క్వైట్ క్విట్టర్లు మనసుపెట్టి పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం వల్ల ఏటా దాదాపు 8.8 లక్షల కోట్ల డాలర్ల నష్టం జరుగుతోంది. ఇది ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో దాదాపుగా తొమ్మిది శాతం. ఒత్తిడి...పైపైకి! కోవిడ్ భయాలు తొలగిపోయినప్పటికీ గత ఏడాది ఉద్యోగులు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొన్నారని గాలప్ సర్వే తెలిపింది. కోవిడ్ తీవ్రస్థాయిలో ఉన్నప్పటి మాదిరిగానే 2022లోనూ ఉద్యోగుల్లో సుమారు 44 శాతం మంది తాము తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నట్లు ఈ సర్వేలో తెలిపారు. చైనా, అమెరికా, కెనడాల్లో ఇది మరింత తీవ్రంగా ఉన్నట్లు స్పష్టమైంది. తూర్పు ఆసియా ప్రాంతంలో ఆఫీసులకు దూరంగా ఉంటూ పనిచేస్తున్న వారు, యువకులు 60 నుంచి 61 శాతం మంది రోజూ ఒత్తిడికి గురైనట్లు సర్వే వివరించింది. ఈ ఒత్తిడి పనికి సంబంధించింది మాత్రమే కాకుండా.. కుటుంబ ఆరోగ్య సమస్యలు, ద్రవ్యోల్బణం వంటి వాటివల్ల కూడా కావచ్చునని అంచనా. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే. ఉద్యోగుల యోగక్షేమాలు కనుక్కునేందుకు ప్రయత్నించిన కంపెనీల్లో ఈ ఒత్తిడి తక్కువగా ఉండటం!. ఉద్యోగులకు స్వేచ్ఛ ఇవ్వడమే మంచిది.. కోవిడ్ తదనంతర పరిస్థితుల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ మేలా? లేక ఆఫీసుకు రావాలా? ఈ రెండూ కాకుండా హైబ్రిడ్ పద్ధతుల్లో పనిచేయించుకోవాలా? అన్న అంశాలపై ఇప్పటికే చర్చ చాలానే జరిగింది కానీ.. ఈ విషయాల్లో ఉద్యోగులకు స్వేచ్ఛనివ్వడం అన్నింటి కంటే మేలైన పద్ధతని గాలప్ చెబుతోంది. అంతేకాదు... తరచూ మాట్లాడుతుండటం, వారికి అవసరమైన పనులు సులువుగా చేసి పెట్టగలగడం వంటివి ఉద్యోగులకు కంపెనీపై ఉన్న అభిప్రాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగలవని ఈ సర్వే తెలిపింది. పనిచేసే చోటుకు కాకుండా... పరిస్థితులు, వాతావరణానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా ఉద్యోగుల్లో ఒత్తిడిని తగ్గించవచ్చునని గాలప్ సూచిస్తోంది. మెరుగైన ఉద్యోగానికి మంచి సమయం 2022లో కొత్త ఉద్యోగం చూసుకునేందుకు లేదా ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి మెరుగైంది చూసుకునేందుకు మంచి సమయం ఇదే అని గాలప్ సర్వేలో పాల్గొన్న వారిలో 53 శాతం మంది అభిప్రాయ పడ్డారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధి కాగా.. 2019 నాటి స్థాయికి దగ్గరగా ఉండటం గమనార్హం. అయితే అమెరికా, కెనడాల్లో మాత్రం ఈ పరిస్థితి లేదని సర్వే తెలిపింది. చేసే ఉద్యోగం పట్ల అసంతృప్తిగా ఉన్న వారు స్వేచ్ఛగా ఉద్యోగాలు వదులుకునే పరిస్థితి 2022లో కనిపించిందని, ఇది కాస్తా ఉద్యోగాల లభ్యతను అధికం చేసిందని గాలప్ విశ్లేషించింది. ఆసక్తికరంగా... సర్వే చేసిన ఉద్యోగుల్లో యాభై శాతం మంది ఉద్యోగం మానేసే ఆలోచన చేశారు. కంపెనీలు ఉద్యోగులను కోల్పోకూడదని అనుకుంటే వారి బాగోగులు మరింత మెరుగ్గా చూసుకోవాల్సిన అవసరముందని గాలప్ తెలిపింది. ఇలా చేసిన కంపెనీల్లో ఉద్యోగం మానేసే ఆలోచన చేసిన వారు గణనీయంగా తక్కువగా ఉండటాన్ని ఇందుకు సాక్ష్యంగా చూపుతోంది. సమస్య వేతనం ఒక్కటే కాదు... ఒత్తిడి, పనిచేసే వాతావరణం లేకపోవడం వంటి అనేక కారణాలతో ఉద్యోగాలు మానేయాలని అనుకున్న వారికి గాలప్ ఒక ప్రశ్న వేసింది. ‘‘పరిస్థితులు మెరుగవ్వాలంటే మీ ఆఫీసులో లేదా మీ కంపెనీలో ఏ చర్యలు తీసుకోవాలి?’’అన్న ప్రశ్నకు వచ్చిన సమాధానాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. దాదాపు 85 శాతం మంది కేవలం వేతనాలు, ఆర్థిక లాభాలు కాకుండా.. వర్క్/లైఫ్ బ్యాలెన్స్, ఎంగేజ్మెంట్ లేదా ఆఫీసు కల్చర్ వంటి విషయాలను ప్రస్తావించారు. మిగిలిన 15 శాతం మంది సమాధానాలు ఏ కోవకూ చెందనివి కావడం గమనార్హం. ఎంగేజ్మెంట్ లేదా ఆఫీస్ కల్చర్ వర్గంలో మేనేజర్లు మరీ కఠినంగా ఉండరాదని, స్వేచ్ఛగా మాట్లాడే అవకాశమివ్వాలని కొందరు అభిప్రాయపడ్డారు. సొంతంగా పనిచేసుకునేందుకు అవకాశముండాలని, కొత్త విషయాలు నేర్చుకునే సౌకర్యం, తగిన గౌరవం లభించాలని, ప్రమోషన్లలో అందరికీ సమాన అవకాశాలుండాలని మరికొందరు భావించారు. దాదాపు 28 శాతం మంది వేతనాలు, ఇతర లాభాలను ప్రస్తావిస్తే.. ఆఫీసులో మంచి క్యాంటీన్/కేఫటేరియా ఉండాలని కొందరు, పిల్లల సంరక్షణ ఖర్చుల గురించి కొందరు, కంపెనీ ఫలితాలకు తగ్గట్టుగా ఉద్యోగులందరికీ సమానంగా ప్రతిఫలాలు దక్కాలని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. ఆఫీసు వాళ్లు హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని, భోజన సమయం మరింత పెంచాలని పని మధ్యలో సేద తీరేందుకు తగిన ప్రాంతం లేదని ఇంకొందరు భావించారు. - కంచర్ల యాదగిరిరెడ్డి -
చదువులకూ పెద్దన్నే..
అమెరికా సంయుక్త రాష్ట్రాలు..! కొందరికి అగ్రరాజ్యం.. దేశాలకు పెద్దన్న.. మరికొన్నింటికి కుట్రదారు, శత్రువు.. కానీ ప్రపంచం మొత్తం అంగీకరించే ఓ అంశంలో పైచేయి ఆ దేశానిదే.. అదే అత్యుత్తమ ఉన్నత విద్య. రెండు వందలకుపైగా దేశాలున్న ఈ భూమ్మీద ఒక్క అమెరికానే ఎక్కువమంది విదేశీ విద్యార్థులను ఎందుకు ఆకర్షిస్తోందో తెలుసా? రెండు లక్షల మంది.. గత ఏడాది ఒక్క భారతదేశం నుంచే ఉన్నత చదువుల కోసం అమెరికాకు చేరిన విద్యార్థుల సంఖ్య ఇది. గత ఏడాది మొత్తంగా 200 దేశాలకు చెందిన 9.48 లక్షల మందికిపైగా విద్యార్థులు అమెరికాలోని నాలుగు వేలకుపైగా ఉన్న యూనివర్సిటీల్లో చేరడం గమనార్హం. దీనికి ఎన్నో కారణాలు. అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు, విస్తృత అవకాశాలు, వైవిధ్యత, చదువుకోవడంలో రకరకాల వెసులుబాట్లు, అంతర్జాతీయ గుర్తింపు, స్కాలర్షిప్లు.. ఇలా మరెన్నో సానుకూల అంశాలు విద్యార్థులను అమెరికా వైపు ఆకర్శిస్తున్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థలు టాప్! అమెరికా మొత్తమ్మీద ఉన్నత విద్యనందించే సంస్థలు నాలుగు వేలకుపైనే ఉన్నాయి. అత్యాధునిక కృత్రిమ మేధ/మెషీన్ లెర్నింగ్ మొదలుకుని జెనెటిక్ ఇంజనీరింగ్ వరకు.. ఆర్ట్స్, హ్యుమానిటీస్, పొలిటికల్ ఎకానమీ.. ఇలా ఎన్నో రంగాలకు సంబంధించి విస్తృతస్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నా.. ప్రభుత్వ సంస్థల్లో చేరే విద్యార్థులే ఎక్కువని అక్కడి విద్యాశాఖ గణాంకాలు చెప్తున్నాయి. కాలేజీలు, యూనివర్సిటీల్లో అత్యధికం గ్రాడ్యుయేట్, పీహెచ్డీ ప్రోగ్రామ్స్ అందిస్తున్నాయి. కమ్యూనిటీ కాలేజీల్లో రెండేళ్ల కోర్సులుంటాయి. ఇవి సిద్ధాంతాలకు కాకుండా వాస్తవిక జ్ఞానానికి, ఉద్యోగాలకు పనికొచ్చే విషయాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. విదేశీ విద్యార్థుల్లో చాలామంది ఈ కమ్యూనిటీ కాలేజీలు అందించే రకరకాల సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు చేసి.. తర్వాత ఉన్నత విద్య కోసం ఇతర యూనివర్సిటీల్లో చేరుతుంటారు. హార్వర్డ్, యేల్, బ్రౌన్, ప్రిన్స్టన్ వంటి ప్రైవేట్ యూనివర్సిటీలు విద్యార్థుల ఫీజులతోపాటు దాతలు ఇచ్చే విరాళాలతో నడుస్తూంటాయి. ఎన్నో రకాల వెసులుబాట్లతో.. భారత్‌లో ఇంటర్మీడియట్లో చదివే కోర్సులే మీరు భవిష్యత్తులో ఏం కావాలని అనుకుంటున్నారో నిర్ణయిస్తాయి. ఎంపీసీ అయితే ఇంజనీరింగ్.. బైపీసీ అయితే వైద్యం. కానీ అమెరికాలో విభిన్న చదువులకు అవకాశం ఉంటుంది. చాలా యూనివర్సిటీల్లోని నాలుగేళ్ల గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్‌లోనూ రెండేళ్లపాటు హ్యుమానిటీస్, నేచురల్ సైన్సెస్, సోషల్ సైన్స్, గణితం వంటి సబ్జెక్టుల్లో కోర్సు చేయాల్సి ఉంటుంది. ఈ నాలుగేళ్ల కోర్సు సమయంలో ఎప్పుడైనా మీరు ఎంచుకున్న మేజర్ (ప్రధాన సబ్జెక్ట్)ను మార్చుకోవచ్చు. ఇంజనీరింగ్ చేస్తూ కంప్యూటర్ సైన్స్ నుంచి కృత్రిమ మేధకు మారిపోవచ్చు. యూనివర్సిటీలో చేరేటప్పుడు ఫలానా సబ్జెక్టు అని ఎంచుకోవాల్సిన అవసరమూ లేదు. యూనివర్సిటీ అందించే వేర్వేరు కోర్సులను దగ్గరి నుంచి పరిశీలించి.. నచ్చిన అంశాన్ని మేజర్‌గా ఎంచుకోవచ్చు. కచ్చితంగా క్లాస్‌రూమ్‌లకు రావాలన్న నియమం లేదు. ఆన్లైన్ కోర్సులు చేయవచ్చు. ఒకేసారి రెండు డిగ్రీలు చదవవచ్చు. ఒక యూనివర్సిటీ నుంచి ఇంకోదానిలోకి మారి కోర్సులు కొనసాగించేందుకూ అభ్యంతరాలు ఉండవు. గుర్తింపు, ఉద్యోగావకాశాలు అమెరికా యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన వారికి ప్రపంచ దేశాలన్నింటిలోనూ తగిన గుర్తింపు ఉంటుంది. చదువుకునే సమయంలోనే వివిధ దేశాల వారితో కలిసిమెలిసి ఉండే అవకాశం లభిస్తుంది. పేరు ప్రతిష్టలున్న అధ్యాపకులు, నిపుణుల నుంచి నేర్చుకుని ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉండే యూనివర్సిటీల పూర్వ విద్యార్థుల నెట్వర్క్, ఫార్చ్యూన్–500 కంపెనీల్లో అత్యధికం అగ్రరాజ్యంలోనే ఉండటం వంటి కారణాలతోనూ అమెరికాలో చదివిన వారికి మెరుగైన ఉద్యోగావకాశాలు కలిగిస్తాయి. అమెరికాలో చదువు పూర్తయిన తర్వాత మూడేళ్లపాటు ఆ దేశంలోనే పనిచేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్ విద్యార్థులకు ఇది ఎంతో విలువైన వృత్తిపరమైన నైపుణ్యాన్ని అందిస్తుంది. దీన్ని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ (ఓపీటీ) అంటారు. యూనివర్సిటీలు స్వయంగా కెరీర్ సర్వీసులను కూడా అందిస్తాయి. విదేశీ విద్యార్థులకు, కంపెనీలకు మధ్య వారధిగా నిలుస్తాయి. రెజ్యూమ్‌లు ఎలా తయారు చేసుకోవాలన్న చిన్న అంశాల నుంచి కంపెనీలతో కెరీర్ ఫెయిర్లు, మెంటార్షిప్ ప్రోగ్రామ్స్ వరకు సాయం అందిస్తాయి. ఖర్చుల మాటేమిటి? అమెరికా చదువులంటే ఖరీదైనవని చాలామంది అంటూ ఉంటారు. అందులో వాస్తవం కొంతే. జాగ్రత్తగా ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే.. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం బోలెడన్ని స్కాలర్షిప్లు, గ్రాంట్లు అందుబాటులో ఉన్నాయి. దీనికితోడు చదువుకునేటప్పుడే పనిచేసుకునేందుకు అవకాశం కల్పించడం, రుణాలు వంటి మార్గాల ద్వారా విద్యాభ్యాసానికయ్యే ఖర్చులను పొందవచ్చు. ♦ అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి లభించే ఆర్థిక సాయం ప్రధానంగా రెండు రకాలు. ఒకటి మీ అవసరాలను తీర్చేది. రెండోది మీ ప్రతిభకు అనుగుణంగా దక్కేది. కొన్ని స్కాలర్షిప్స్ ట్యూషన్ ఫీజులతోపాటు అక్కడి రోజువారీ ఖర్చులకు కావాల్సిన మొత్తాలను కూడా అందిస్తాయి. కొన్ని స్కాలర్షిప్లు ట్యూషన్ ఫీజు మొత్తం లేదా అందులో కొంత భాగాన్ని చెల్లిస్తాయి. ♦ యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాను ఉదాహరణగా తీసుకుంటే.. విదేశీ విద్యార్థుల కోసం మెరిట్ ఆధారిత స్కాలర్ర్షిప్ లు, క్యాంపస్‌లో ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మీ అవసరాలకు తగిన ఆర్థిక సాయం (నీడ్స్ బేస్డ్ ఫైనాన్షియల్ ఎయిడ్) ఈ యూనివర్సిటీలో లభించదు. ♦ కేవలం గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్‌కు మాత్రమే కాకుండా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్‌కు కూడా కొన్ని కాలేజీలు, విద్యాసంస్థలు ఆర్థిక సాయం అందిస్తాయి. ఈ అంశంపై మీకు సాయం అవసరమనుకుంటే ‘ఎడ్యుకేషన్ యూఎస్ఏ’ విభాగాన్ని సంప్రదించవచ్చు. - కంచర్ల యాదగిరిరెడ్డి -
సైడ్ హసల్.. వేణ్నీళ్లకు చన్నీళ్లు.. చదువు డబ్బు.. ఒక్క జాబ్ కాదు బ్రో!
గత కొన్నేళ్లుగా పెరిగిపోతున్న ఈ ట్రెండ్‌ని సైడ్ హసల్ అని అంటున్నారు. ఒకవైపు సాధారణ ఉద్యోగాలు చేసుకుంటూనే ఇంకోవైపు పెయింటింగ్, టీచింగ్, సోషల్ మీడియా, హాబీల సాయంతో డబ్బులు సంపాదించుకోవడం అన్నమాట. మరీ ముఖ్యంగా ఈ తరం అని చెప్పుకునే జెన్–జీలో ఈ ధోరణి ఎక్కువైందని అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి. డ్రాప్ షిప్పింగ్, అమెజాన్ రీసెల్లింగ్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు, కంటెంట్ క్రియేషన్.. ఇలా సైడ్ హసల్‌కు బోలెడన్ని అవకాశాలు ఉంటున్నాయి. అమెరికాకు చెందిన బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ అంచనాల ప్రకారం గత ఏడాది ఆగస్టు నాటికి ఈ సైడ్ హసల్ అనేది పతాక స్థాయికి చేరింది. ఇతర వయసులవారూ ఈ పని చేస్తున్నా అత్యధికులు మాత్రం జెన్–జీ వారేనని ఈ సంస్థ స్పష్టం చేసింది. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గత ఏడాది ఆగస్టులో నిర్వహించిన మరో అధ్యయనం కూడా జెన్–జీ యువతలో కనీసం 48 శాతం మంది ఏకకాలంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నట్లు పేర్కొంది. పేచెక్స్ సంస్థ లెక్కల ప్రకారం మిలినియల్స్, బేబీ బూమర్లతో పోలిస్తే సైడ్ హసల్ చేస్తున్న జెన్–జీ యువత చాలా ఎక్కువ. భారత్ విషయానికి వస్తే గత ఏడాది డెలాయిట్ జెన్–జీ, మిలినియల్స్పై ఒక సర్వే నిర్వహించింది. దానిలోనూ సైడ్ హసల్ గురించి జెన్–జీని ప్రశ్నించారు. తేలిందేమిటంటే భారత్‌లో సుమారు 51 శాతం మంది సైడ్ హసల్ చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి సగటు కేవలం 32 శాతం మాత్రమే కావడం గమనార్హం. ♦ సుస్మిత వయసు ఇరవై. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అయితే ఆమె దృష్టి మొత్తం చదువుపైనే లేదు. బెంగళూరులోని ఓ స్టార్టప్ కంపెనీలో పార్ట్‌టైమ్ ఉద్యోగమూ చేస్తోంది. నెలకు రూ.27 వేల సంపాదనతో కుటుంబానికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉంటోంది. ♦ కుమార్ చదివేది ఇంటర్మిడియట్. పగలంతా కాలేజీ...సాయంత్రం కాగానే ఫుడ్ డెలివరీ బాయ్! కాలేజీ ఖర్చులతోపాటు తన సొంత ఖర్చులకు కావాల్సినంత సంపాదన ఉంది ఈ పార్ట్‌టైమ్ జాబ్‌లో! ♦ శ్రీధర్ ప్రముఖ ఐటీ కంపెనీ ఉద్యోగి. కోవిడ్ తరువాత ఇంటి నుంచే పని చేస్తున్నాడు. కానీ అతడికి వంటంటే ఇష్టం. ఈ హాబీతో డబ్బులు సంపాదించేస్తున్నాడు శ్రీధర్. వాట్సాప్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటూ డెలివరీ చేస్తున్నాడు. అదనపు సంపాదనే లక్ష్యం.. కోవిడ్ ప్రపంచాన్ని చాలా రకాలుగా మార్చేసింది. సైడ్ హసల్ పెరిగిపోవడం వీటిల్లో ఒకటి. కష్టపడి చదువుకుని ఉద్యోగం సంపాదిస్తే జీవితంలో స్థిరపడిపోయినట్లే అని ఒకప్పుడు అనుకునే వారు. కానీ...ఈ తరం ఈ పాత పద్ధతితో అస్సలు ప్రయోజనం లేదని నిర్ధారించుకుంది. మామూలుగా ఉద్యోగాలు చేసే వారిలో సగం మంది రిటైర్మెంట్ తరువాత కనీసం సొంతిల్లు కూడా లేని పరిస్థితిలో ఉన్నారన్న అంచనాలు వీరి ఆలోచనలను ప్రభావితం చేశాయి. అందుకే వీలైనంత వేగంగా అవసరమైనంత డబ్బు సంపాదించాలని వీరు ఒకటికి మించిన ఉద్యోగాలు చేస్తున్నారు. డెలాయెట్ సర్వేలోనూ ఈ విషయం స్పష్టమైంది. జీవన వ్యయం (కాస్ట్ ఆఫ్ లివింగ్) పెరిగిపోతుండటం తమ సైడ్ హసల్‌కు ఒక కారణమని సర్వేలో పాల్గొన్న వారిలో 33% మంది అభిప్రాయపడ్డారు. కేవలం తమ ఖర్చుల కోసమే దాదాపు 40% జెన్–జీ యువత కనీసం రెండు ఉద్యోగాలు చేస్తోందని కంతార్ అనే డేటా అనలిటిక్స్ సంస్థ సర్వే తెలిపింది. ఇష్టమైన హాబీల కోసం.. తమ హాబీలను కొనసాగించాలనే ఆకాంక్ష జెన్–జీలో సైడ్ హసల్ పెరిగిపోయేందుకు ఇంకో కారణంగా కన్పిస్తోంది. వర్క్ ఫ్రం హోం, రిమోట్ వర్కింగ్, స్టెకేషన్ వంటి వాటివల్ల ఈ తరానికి ఈ తరహా వెసులుబాటు లభిస్తోంది. దీంతో జెన్–జీ తరానికి చెందిన కొంతమంది తమ సొంత ఆలోచనలతో వ్యాపారాలు, స్టార్టప్‌లు మొదలుపెట్టి రాణిస్తున్నారు. యజమానులుగా ఉండాలనే కోరికతో.. జెన్–జీ యువత సైడ్ హసల్ మొదలుపెట్టేందుకు ఇంకో కారణం తమకు తాము యజమానులుగా ఉండాలన్న కోరిక. కంపెనీల్లో సాధారణ ఉద్యోగాలు చేస్తూంటే నిర్దిష్ట సమయాల్లో పనిచేయాల్సి ఉంటుందని దీనివల్ల తమ ఆకాంక్షలు నెరవేరడం లేదని యువత భావిస్తోంది. ఇలా కాకుండా తమకు నచ్చినట్లు ఉంటూనే అవసరమైనప్పుడు లేదా తీరిక సమయాల్లో మాత్రమే ఫ్రీలాన్సింగ్ తరహాలో పనిచేసేందుకు యువత ఇష్టపడుతోంది. ఒకానొక అంతర్జాతీయ సర్వే ప్రకారం జెన్–జీ యువతలో 67 శాతం మంది ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు లేదా చేయాలని అనుకుంటున్నారు. సాధారణ ఉద్యోగాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న యువతరం 20 శాతం వరకు ఉన్నారు. సుమారు 62 శాతం యువత సొంతంగా వ్యాపారాలు కలిగి ఉన్నారు. జెన్–జీ అంటే ఎవరు? 1996 నుంచి 2010 మధ్యకాలంలో పుట్టిన వారిని జెనరేషన్–జెడ్ (జెన్–జీ) అని పిలుస్తారు. 1980– 1995 మధ్య పుట్టిన వారికి జెన్–వై లేదా మిలినియల్స్ లేదా జెన్–నెక్స్ట్ అని పేరు. 1883 నుంచి 1900 మధ్య పుట్టిన వారిని లాస్ట్ జనరేషన్ అని, 1901 – 1925 మధ్యపుట్టిన వారిని ద గ్రేట్ జనరేషన్ అని పిలుస్తారు. తర్వాతి కాలం అంటే 1928– 1945 తరం పేరు సైలెంట్ జనరేషన్. 1946– 1964 మధ్య పుట్టిన వారిని బేబీ బూమర్స్ అని, 1965– 1980 మధ్య కాలంలో పుట్టిన వారిని జనరేషన్–ఎక్స్ అని పిలుస్తారు. ఇక జెన్–జీ తర్వాతి కాలంలో అంటే 2011– 2025 మధ్య పుట్టిన వారు జెన్–ఆల్ఫా కిందకి వస్తారు. సామాజిక బాధ్యతపైనా దృష్టి ♦ జెన్–జీ యువత కేవలం తమ సంపాదన, బాగోగులపై మాత్రమే దృష్టి పెట్టకుండా ఆ క్రమంలో సమాజానికి ఉపయోగపడే పనులూ చేయాలని అనుకుంటోందని ఈ రంగంలో పనిచేస్తున్న నిపుణులు చెపుతున్నారు. కూడు, గుడ్డ, నీడ వంటి ప్రాథమిక అవసరాలను తీర్చుకున్న తరువాత యువత సమాజంపై తమ ప్రభావాన్ని చూపేలా వినూత్నమైన పనులు చేపడుతున్నారని వీరంటున్నారు. సోషల్ మీడియా ఊతం.. ♦ యువత సైడ్ హసల్‌కు సామాజిక మాధ్య మాలు బాగా ఉపయోగపడుతున్నాయి టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా లక్షలకు లక్షలు గడిస్తున్న వారి గురించి మనం తరచూ వింటూనే ఉన్నాము. సైడ్ హసల్ చేస్తున్న యువతలో 72 శాతం మంది నెలకు సుమారు రూ.40 వేల నుంచి రూ.80 వేల వరకూ సంపాదిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ అమెరికా సర్వే తెలిపింది. కొత్త కొత్త నైపుణ్యాలను అలవర్చుకునేందుకు ఉడెమి, కోర్సెరా వంటి ఆన్లైన్ సంస్థలు అవకాశం కలి్పస్తుండటంతో యువత వాటిని వేగంగా అందిపుచ్చుకుంటోంది. స్వాగతిస్తున్న కంపెనీలు ♦ చాలా కంపెనీలు ఉద్యోగుల్లో ఈ కొత్త ధోరణికి అలవాటు పడుతున్నాయి. ఆహ్వనిస్తున్నాయి కూడా. యువత ఎక్కువ సంఖ్యలో సైడ్ హసల్ చేస్తున్న నేపథ్యంలో కొన్ని కంపెనీలు వారి ఇష్టాఇష్టాలకు తగ్గట్టుగా తమని తాము మార్చుకుంటున్నాయి. సైడ్ హసల్ ద్వారా ఉద్యోగులు నేర్చుకుంటున్న కొత్త కొత్త నైపుణ్యాలు తమకు ఉపయోగపడవచ్చునని కంపెనీలు భావిస్తున్నాయి. భారత్‌లో పాపులర్ సైడ్ హసల్స్... ♦ కంటెంట్ రైటింగ్ ♦ ఆయా రంగాలకు సంబంధించి ఫ్రీలాన్సింగ్ ♦ వర్చువల్ అసిస్టెంట్ ♦ ఆన్లైన్ ట్యూటరింగ్ ♦ఇన్ఫ్లుయెన్సర్ ♦ సోషల్ మీడియా మార్కెటింగ్ ♦ ఫొటోగ్రఫీ.. వ్లాగింగ్ ♦అఫిలియేట్ మార్కెటింగ్ ♦ గ్రాఫిక్ డిజైనింగ్.. ఫుడ్ డెలివరీ ♦ గ్రాసరీస్ డెలివరీ ♦ కొరియర్ బాయ్స్ - కంచర్ల యాదగిరిరెడ్డి -
‘అట్టడుగు’కు చేరేలా అంతరాలు తగ్గేలా..
ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే ఆఫీసులో పనులు చక్కబెట్టుకోవచ్చు.. సంగీతం, సినిమాల వంటి వినోదమూ దొరుకుతుంది. మరి ఇంటర్నెట్ కారణంగా కూలీల జీవితాల్లో వెలుగులు నిండుతాయని, వారి ఆరోగ్యం బాగుపడుతుందని ఎంత మందికి తెలుసు? అట్టడుగు వర్గాల వారికి చదువు అవకాశాలతోపావారిజీవితాలు బాగుపడతాయనీఎందరికి తెలుసు? కొన్ని సంస్థలు, ప్రభుత్వాల కృషితో ఇంటర్నెట్ విషయంలో ధనికులు– పేదలు, విద్యావంతులు– అత్తెసరు చదువరుల మధ్యఇప్పుడు అంతరం తగ్గుతోంది! 2025 నాటికి ఇది మరింత తగ్గనుంది! ఇందుకు బాటలు వేస్తున్న ‘ఎడిసన్ అలయన్స్’గురించి ఈ ప్రత్యేక కథనం.. ప్రపంచ జనాభా సుమారు 800 కోట్లు! వీరిలో 270 కోట్ల మందికి ఇంటర్నెట్ అందుబాటులో లేదు. దీనికి కారణాలెన్నో. ఈ పరిస్థితిని మార్చేందుకు 2021లో ఓ పెద్ద ప్రయత్నమే మొదలైంది. అదే ‘ఎడిసన్ అలయన్స్ (ఎసెన్షియల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వి సెస్ నెట్వర్క్ అలయన్స్’. 2025 నాటికి అదనంగా కనీసం వంద కోట్ల మందిని ఇంటర్నెట్ సూపర్ హైవేలోకి చేర్చాలన్నదే దీని లక్ష్యం. ఏదో వినోదం పంచేందుకు ఈ ప్రయత్నం జరగడం లేదు. ఆరోగ్యం, విద్య, ఆర్థిక సేవలు సమాజంలోని అట్టడుగు వర్గాల వారికీ చేరాలన్న ఉదాత్త లక్ష్యాన్ని ఈ అలయన్స్ తన భుజాలపైన వేసుకుంది. ఆరోగ్యం, విద్య, బ్యాంకింగ్, రుణాల వంటి ఆర్థిక సేవలు అందుబాటులోకి వస్తే వారి జీవితాలు మారిపోతాయని భావించింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలోని ఆసక్తికరమైన అంశం.. ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలూ భాగస్వాములు కావడం. పేద దేశాలు, లేదా డిజిటల్ సేవలు అందుబాటులో లేనివారికి వాటిని సులువుగా అందించడం, వాడుకునేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వడం వంటివి ఈ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్నాయి. సూటిగా చెప్పాలంటే ఇంటర్నెట్ సౌకర్యం చౌకగా అందించేందుకు, డిజిటల్ నైపుణ్యాలను నే ర్పించేందుకు, విద్య, వైద్యం అందించేందుకు జరుగుతున్న కృషి ఇది. రెండేళ్ల క్రితం మొదలైన ఎడిసన్ అలయన్స్ ఇప్పటివరకూ సాధించిందేమిటన్న దానిపై వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ఇటీవలే ఒక నివేదికను విడుదల చేసింది. రానున్న రెండేళ్లలో సాధించాలనుకుంటున్న లక్ష్యాలను సమీక్షించింది. లక్ష్యంలో ఇప్పటికే సగం.. 2021 జనవరిలో ప్రారంభమైన ఎడిసన్ అలయన్స్ తన భాగస్వాముల సాయంతో ఇప్పటివరకు సుమారు 45.4 కోట్ల మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపిందని వరల్ఎకనమిక్ ఫోరమ్ విడుదల చేసిన తాజా నివేదిక తెలిపింది. మొత్తం 90 దేశాల్లో 250కిపైగా కార్యక్రమాలు మొదలయ్యాయి. 2021లో మొత్తం 140 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్ కానీ, రుణ వసతి గానీ లేకపోయింది. ఎడిసన్ అలయన్స్ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటివరకూ కనీసం 28 కోట్ల మందికి ఈ–బ్యాంకింగ్, మొబైల్ వ్యాలెట్స్, ఎల్రక్టానిక్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. అలాగే సుమారు తొమ్మిది కోట్ల మంది ఆరోగ్యాన్ని డిజిటల్ ఆరోగ్య సేవల రూపంలో పరిరక్షించడం సాధ్యమైంది. టెలిహెల్త్, టెలిమెడిసిన్ వంటి టెక్నాలజీల సాయంతో వేర్వేరు ఆరోగ్య సమస్యలకు చికిత్స అందిస్తున్నారు. విద్య విషయానికొస్తే 2021లో ప్రపంచవ్యాప్తంగా 24.4 కోట్ల మంది (ఆరు నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులు) పాఠశాలలకు దూరం కాగా.. ఎడిసన్ అలయన్స్ భాగస్వాములు ఆన్లైన్ విద్య, రిమోట్ లెర్నింగ్ సొల్యూషన్స్ సాయంతో కోటీ 18 లక్షల మందికి విద్యను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ఉద్యోగం చేసేందుకు అవసరమైన నైపుణ్యాలపైనా శిక్షణ ఇవ్వడం గమనార్హం. ఎంతమందికి.. ఏయే రకంగా? ఎడిసన్ అలయన్స్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి డిజిటల్ టెక్నాలజీ లాభాలు అందాయనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. డిజిటల్ రంగం మౌలిక సదుపాయాల కల్పనకు పెట్టిన ఖర్చుతోనే 6.4 కోట్ల మందికి లబ్ధి చేకూరిందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నివేదిక చెబుతోంది. అయితే 250 మంది భాగస్వాముల్లో మూడొంతుల మంది ఆన్లైన్ విద్యపై దృష్టిపెట్టినా దీనివల్ల బాగుపడిన వారి సంఖ్య కొంచెం తక్కువగానే ఉంది. నాణ్యమైన ఆన్లైన్ విద్యకు అవసరమైన వనరులు లేకపోవడం దీనికి కారణంగా చెప్తున్నారు. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్, ఇంటర్నెట్ ఆధారిత పరికరాలు, ఆన్లైన్ సర్వి సుల ఖర్చులు తగ్గడం 12.8 కోట్ల మందికి ఉపయోగపడింది. దాదాపు 27 కోట్ల మందికి కనెక్టివిటీ లేదా డిజిటల్ సేవలు లభించడం మొదలైంది. ముందున్న సవాళ్లు.. ఇంకో మూడేళ్లలో 55 కోట్ల మందికి డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఎడిసన్ అలయన్స్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగస్వాములు కావాల్సిందిగా మరిన్ని కంపెనీలను ఆహా్వనిస్తోంది. ప్రస్తుత భాగస్వాముల్లో కేవలం 12 శాతం మంది మాత్రమే 50 శాతం మేర లక్ష్యాన్ని అందుకోవడంపై అలయన్స్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సగం మంది భాగస్వాములు లక్ష్యంలో 20 శాతాన్ని మాత్రమే చేరుకోవడంపై అసంతృప్తిగా ఉంది. వచ్చే రెండేళ్లలో పాత, కొత్త భాగస్వాములు వేగంగా లక్ష్యాల సాధనకు పూనుకోవాలని కోరింది. పర్వత ప్రాంతాలకు అపోలో ఆరోగ్య సేవలు ప్రఖ్యాత వైద్యసేవల సంస్థ అపోలో హాస్పిటల్స్, అపోలో టెలిహెల్త్ సర్వి సులను ఎడిసన్ అలయన్స్‌లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ వంటి పర్వత ప్రాంతాల్లో అందిస్తోంది. ఆ రాష్ట్రంలో వైద్యసేవలు, నిపుణుల కొరత ఎక్కువగా ఉండటంతో.. ఆ సమస్యను అధిగమించేందుకు డిజిటల్ టెక్నాలజీల సాయం తీసుకుంటున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నాలుగు కీలక ప్రాంతాల్లో టెలిమెడిసిన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 2021 జూలై నాటికి 22,727 టెలికన్సల్టేషన్లు అందించారు. 1,300కుపైగా ఎమర్జెన్సీ కేసులను డిజిటల్ పద్ధతిలోనే ఎదుర్కొని పరిస్థితిని చక్కదిద్దారు. టెలి డిస్పెన్సరీల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండటం ఒక విశేషమైతే.. రక్తహీనత, అసాంక్రమిక వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 4,000 మందితో విస్తృత ప్రయత్నం జరుగుతుండటం ఇంకో విశేషం. ‘‘ఎడిసన్ అలయన్స్‌లో భాగస్వామి అయిన మేం మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఐదు డిజిటల్ డిస్పెన్సరీలు ప్రారంభించాం. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాం. వ్యాధుల నివారణ, నిర్దిష్ట సమస్యలపై టెలికన్సల్టేషన్ సర్వి సులు కూడా అందిస్తున్నాం’’అని అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ శోభన కామినేని చెప్పారు. అగ్రరాజ్యంలో వెరిజాన్ సేవలు అమెరికా టెక్ దిగ్గజ సంస్థ వెరిజాన్ ఆ దేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని విద్యార్థులకు ఎడిసన్ అలయన్స్‌లో భాగంగా కనెక్షన్లు అందించే ప్రయత్నం చేస్తోంది. అమెరికాలో లక్షల మంది విద్యార్థులకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుబాటులో లేదని.. ఈ కాలపు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు తగ్గట్టుగా నైపుణ్యాలు లేక విద్యార్థులు నష్టపోతున్నారని వెరిజాన్ గుర్తించింది. దీనిని అధిగమించేందుకు వెరిజాన్ ఇన్నోవేటివ్ లెర్నింగ్ సాయంతో స్కూల్ డిస్ట్రిక్స్‌లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఉపాధ్యాయులు, విద్యార్థులకు కూడా టెక్నాలజీ వినియోగంలో శిక్షణ ఇస్తోంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ (స్టెమ్) రంగాలకు సంబంధించిన శిక్షణ కూడా ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. 2021–22లో ఆ దేశవ్యాప్తంగా సుమారు 500 పాఠశాల్లో 6.5 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారని అంచనా. ఈ కార్యక్రమం కోసం వెరిజాన్ వందకోట్ల డాలర్లకుపైగా ఖర్చు పెడుతోంది. - కంచర్ల యాదగిరిరెడ్డి -
మనిషికి, మృగానికి మధ్య పెరుగుతున్న ఘర్షణలు
కంచర్ల యాదగిరిరెడ్డి దేశంలో ఒక పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంటే.. మరోపక్క పోడు వ్యవసాయం, ఇతరత్రా కారణాలతో అటవీ ప్రాంతం కుంచించుకుపోవడం కొత్త సమస్య తెచ్చిపెడుతోంది. మనిషికీ, వన్య మృగానికీ మధ్య ఘర్షణకు దారితీస్తోంది. పులులు అడవులను దాటి సమీపంలోని గ్రామాలు, పట్టణాల్లో ప్రవేశించడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. పదేళ్లలో 100% పెరుగుదల దేశంలో గత పదేళ్ల కాలంలో చిరుతలు, పెద్ద పులుల సంఖ్య అనూహ్యంగా 100 శాతం పెరిగిందని తాజాగా చేపట్టిన గణన ద్వారా వెల్లడైంది. దాదాపు నాలుగు వేల మంది అటవీ శాఖ సిబ్బంది 54 టైగర్ రిజర్వు ప్రాంతాల్లోని 14,500 చదరపు కి.మీ. మేర అడవుల్ని గాలించి మరీ 4,500 పైచిలుకు పెద్ద పులులు, 2,300 చిరుతలు ఉన్నాయని లెక్క తేల్చారు. దేశంలో మిజోరం మినహా అన్ని రాష్ట్రాల్లో పులుల జాడ కనిపించడం విశేషం. వన్యమృగ సంరక్షణ చరిత్రలో ఇది గుర్తుంచుకోదగిన విశేషమని కజిరంగ నేషనల్ పార్క్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి రమేశ్ గగోయ్ అన్నారు. ప్రస్తుతం అక్కడ అనేక రకాల వందల కొద్దీ జంతువులతో పాటు 125కు పైగా పులులు ఉన్నాయి. పులుల సంఖ్య పెరగడం శుభసూచకమే అయినా మనుషులకు, మృగాలకు మధ్య కొనసాగుతున్న ఘర్షణ దేశంలో కొన్నిచోట్ల రక్తసిక్తం కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పులుల దాడుల నేపథ్యంలో వాటి నుంచి రక్షణ కోసం ఒకరకంగా యుద్ధమే చేయాల్సి వస్తోంది. గత ఏడాది మనుషులకు, వన్య మృగాలకు మధ్య ఘర్షణలకు సంబంధించిన ఘటనలు దాదాపు 500కు పైగా నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల సరిహద్దుల్లో 33,309 హెక్టార్లకు విస్తరించి ఉన్న అటవీ ప్రాంతం పెద్ద పులులకు ఆవాసంగా మారింది. ఆ ప్రమాదకరమైన ప్రదేశాలకు ప్రజలను దూరంగా ఉంచడంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో మనిషి రక్తం మరిగిన ఓ పులి మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో నెల వ్యవధిలోనే 8 మందిని చంపి తిని కనిపించకుండా పోయిన ఘటన ఆ రాష్ట్ర అధికారయంత్రాంగానికి నిద్ర లేకుండా చేసింది. మరో పులి చంద్రాపూర్ జిల్లాలో ఆరుగురిని బలితీసుకుంది. కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఇటీవల పులి ఐదుగురిపై దాడి చేసిచంపింది. తాజాగా గురువారం కేరళలోని వయనాడ్ జిల్లాలో ఓ రైతుపై అతని ఇంటి వద్దనే దాడి చేసిన పులి తీవ్రంగా గాయపరచడం కలకలం రేపింది. ఆ తర్వాత అతను చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించాడు. గతేడాది మహారాష్ట్రలో 105 మంది పులుల చేతిలో హతమయ్యారని అటవీ శాఖ మంత్రి ఎం.సుధీర్ శాసనసభకు చెప్పారు. అంతకుముందు 2020–21లో 86 మంది, 2019–20లో 80 మంది, 2018–19లో 47 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన వివరించారు. తెలంగాణలో వారం వ్యవధిలో ఇద్దరు తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రంభీం జిల్లా వాంకిడి ప్రాంతంలో సంచరి స్తున్న పులి వారం వ్యవధిలోనే ఇద్దరిని బలి తీసుకుంది. గతేడాది ఆ ప్రాంతంలో సంచరిస్తున్న పులులు 170 పశువులపై దాడి చేసి హతమార్చా యి. ‘మేము అటవీ ప్రాంతాల పరిసరాలకు వెళ్లకుండా ఉండలేము. ఎందుకంటే అక్కడ పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్నాం. వెళితే ప్రమాదమని తెలిసినా వెళ్లక తప్పడం లేదు..’అని కుమ్రంభీం జిల్లా దిగడ గ్రామానికి చెందిన కళావతి వాపోయారు. పులులు ఎక్కువ ఉన్న చోట్లే.. పులులు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లోనే ఘర్షణలు ఎక్కువగా జరుగుతున్నాయని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల ఓ నివేదికలో వెల్లడించింది. తగ్గిపోతున్న అడవుల్లో పులుల సంఖ్య పెరగడంతో అవి జనావాసాలకు రావడం అధికమైంది. ధ్వని కాలుష్యంతో పాటు దీపాల వెలుగులు, గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణాల వాతావరణం వంటి అంశాల వల్ల ఏర్పడే గందరగోళంతోనే ఇతర జంతువుల లాగే పెద్ద పులులు భయాందోళనలతో దాడులు చేయడం, చంపడం వంటివి చేస్తున్నాయని ఆ నివేదిక వివరించింది. పులులు ఉన్నాయని తెలిసినా మనుషులు పోడు వ్యవసాయం, ఇతరత్రా అవసరాల కోసం అటవీ ప్రాంతాల పరిసరాలకు వెళ్లక తప్పడం లేదు. గత ఏడాది నవంబర్ 15న కుమ్రంభీం జిల్లా వాంకిడి సమీపంలో పత్తి చేనుకు కాపలా కాస్తున్న సీడాం భీము (69)ని పెద్ద పులి దాడి చేసి చంపేసింది. అదే జిల్లా దహేగం మండలం దిగిడ గ్రామానికి చెందిన 19 ఏళ్ల విఘ్నేష్‌పై దాడి చేసి చంపింది. ఏటా 20 శాతంపెరుగుదల పులుల సంఖ్య పెరుగుతున్న ప్రాంతాల్లో సాధారణంగా ఈ పెరుగుదల ఏడాదికి 20% కంటే ఎక్కువగా ఉందని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ఇటీవల పార్లమెంట్‌కు సమరి్పంచిన నివేదికలో తెలిపింది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా 2020 వెల్లడించిన నివేదికను బట్టి చూస్తే 2016–20 మధ్య దేశవ్యాప్తంగా పులుల స్వా«దీనంలో ఉన్న ప్రదేశం 10 వేల చ.కి.మీ. మేర కుంచించుకుపోయింది. ఒక్క యూపీలోనే గత పదేళ్లలో అటవీ ప్రాంతం వంద చ.కి.మీ. మేర హరించుకుపోయిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. పులులు పెరుగుతున్న చోట అటవీ భూములు కుంచించుకుపోకుండా చూడాలని ఫారెస్ట్ సర్వే అఫ్ ఇండియా గత అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. కాగా, పులులు, ఇతర వన్యప్రాణులు రోడ్లు, రైల్వే ట్రాక్‌లపైకి చేరి చనిపోతున్నాయని ఎఫ్ఎస్ఐ ఆందోళన వ్యక్తం చేసింది. 2017–18 నుంచి 2020–21 మధ్య దేశవ్యాప్తంగా 63 వేల వన్యప్రాణులు రైళ్ల కింద పడి మరణించాయని, వాటిలో నాలుగు సింహాలు, 73 ఏనుగులు సహా 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద ఉన్న జంతువులు ఉన్నట్లు కాగ్ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో100 దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలకు తీసిపోని విధంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పులుల సంఖ్య 100కు పెరిగింది. 2014లో వీటి సంఖ్య 46 మాత్రమే. తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, ఏపీలోని ఉభయగోదావరి, కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల అటవీ ప్రాంతాలే మొదటి నుంచి పెద్ద పులులకు ఆవాసాలుగా పేరొందాయి. పులుల సంఖ్య పెరుగుతున్న కారణంగానే కేంద్ర ప్రభుత్వం 1983లోనే ఉమ్మడి ఏపీ ఐదు జిల్లాల పరిధిలో పది వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతాల్లో నాగార్జునసాగర్– శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసింది. అయితే అడవుల్లోకి నక్సలైట్ల ప్రవేశంతో 2005 వరకూ పులుల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వచ్చిది. ఆ తర్వాత నక్సలైట్ల ఉద్యమం తగ్గుముఖం పట్టడంతో 2008 నుంచి పులుల సంఖ్య పెరగడం ప్రారంభమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధిలో కాగజ్‌నగర్, చెన్నూరు, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ఖానాపూర్ ఫారెస్ట్ డివిజన్లలో పులుల సంచారం అధికమైంది. ప్రస్తుతం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) పెద్ద పులుల అభయారణ్యంగా పేరుగాంచింది. ►దేశంలో పెద్ద పులులు 4,500 పైచిలుకు.. ►దేశంలో చిరుతలు 2,300 -
పాత వ్యాధులు.. కొత్త సవాళ్లు! మన దేశంలో పంజా విసురుతున్న మీజిల్స్..
కంచర్ల యాదగిరిరెడ్డి ముంబై, రాంచీ, అహ్మదాబాద్, మళ్లప్పురం, హైదరాబాద్.. ఈ ప్రాంతాలన్నింటా ఇటీవల కొత్తగా కలకలం మొదలైంది. దానికి కారణం తట్టు (మీజిల్స్) వ్యాధి మళ్లీ విజృంభించడమే.. ఈ ఏడాది ఏకంగా 16వేల మంది పిల్లలకు తట్టు వ్యాధి సోకడం వైద్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. టీకాలు వేసుకోకపోవడమే దీనికి కారణమని కొందరు అంటున్నా.. కేవలం ఒక్కసీజన్‌లో దేశంలో ఇంతమందికి మీజిల్స్ సోకడం అసాధారణమని వైద్య నిపుణులు అంటున్నారు. ఒక్క మన దేశంలోనేకాదు.. అమెరికా, బ్రిటన్, పలు యూరప్ దేశాల్లోనూ కొద్దినెలలుగా వైరల్, బ్యాక్టీరియల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. అందులోనూ బాధితులు ఎక్కువగా పిల్లలే. వరుస కోవిడ్ వేవ్‌ల తర్వాత పరిస్థితి చక్కబడుతున్న సమయంలో (చైనా, మరికొన్ని దేశాలు మినహా) ఇతర వైరల్ వ్యాధుల దాడి పెరగడంపై నిపుణులు అనుమానాస్పదంగానే స్పందిస్తున్నారు. దీనికి ప్రత్యేకమైన కారణాలేమైనా ఉన్నాయా అన్నదానిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి కూడా. ముంబైలో మొదలై.. ఈ ఏడాది అక్టోబర్‌లో ముంబైలో పెద్ద సంఖ్యలో తట్టు కేసులు నమోదయ్యాయి. ఆ నెల 26వ తేదీ నాటికి ఇరవై మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు కూడా. తర్వాత రాంచీ, అహ్మదాబాద్, మళ్లప్పురంలో..తాజాగా తెలంగాణలోనూ వందల సంఖ్యలో ఈ వ్యాధి కేసులు నమోదవడం గమనార్హం. ముంబైలో మరణించిన పిల్లల్లో ఒక్కరు మాత్రమే తట్టు నిరోధక టీకా వేసుకున్నట్టు పరీక్షల ద్వారా తెలిసింది. కాకపోతే రెండు డోసులు వేసుకోవాల్సిన టీకా ఒక డోసు మాత్రమే వేసుకున్నట్టు గుర్తించారు. అమెరికాలో పదిరెట్లు ఎక్కువగా.. అమెరికాలో గత మూడు నెలల కాలంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అదుపు చేయలేనంతగా తీవ్రమయ్యాయి. చాలామంది పిల్లలు రెస్పిరేటరీ సైనిటికల్ వైరస్ బారిన పడుతున్నారు. పెద్దల్లో సాధారణ జలుబు మాదిరి లక్షణాలతో కనిపించే ఈ వ్యాధి.. పిల్లల్లో మాత్రం ఆందోళనకర స్థాయికి చేరుతుంది. గత ఏడాది కాలంలో ఈ వ్యాధి కనీసం మూడు సార్లు ప్రభావం చూపిందని న్యూయార్క్‌లోని మైమోనైడ్స్ పీడియాట్రిక్ సీనియర్ వైద్యులు రబియా ఆఘా తెలిపారు. రోగుల తాకిడిని తట్టుకునేందుకు ఐసీయూ వార్డు సామర్థ్యాన్ని రెట్టింపు చేశామని పేర్కొన్నారు. మూడు, నాలుగేళ్ల పిల్లలకు సోకుతున్న ఈ వ్యాధి మామూలుగా తట్టుకోగలిగిన స్థాయిలోనే ఉంటుందని.. ఈసారి మాత్రం లక్షణాలు బాగా తీవ్రంగా కనిపిస్తున్నాయని ఆమె వివరించారు. ఇక గత నెలలో అమెరికాలో ఇన్ఫ్లూయెంజాతో ఆస్పత్రుల్లో చేరినవారి సంఖ్య గత పదేళ్లలోనే అత్యధికమని అక్కడి వైద్య నిపుణులు చెప్తున్నారు. బ్రిటన్‌లో బ్యాక్టీరియా దాడి.. బ్రిటన్‌లో ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా కారణంగా 16 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్‌కు ముందు అంటే 2017 –18 సీజన్లో మాత్రమే ఈస్థాయి ఇన్ఫెక్షన్లు, మరణాలు సంభవించాయని గణాంకాల ద్వారా తెలుస్తోంది. స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియాతో గొంతునొప్పి, టాన్సిలైటిస్ వంటి లక్షణాలు ఉంటాయి. అరుదుగా మాత్రం మెనింజైటిస్ వంటి ప్రాణాలమీదికి వచ్చే ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. అయితే ఈ ఏడాది మరణాల సంఖ్య మాత్రం అసాధారణంగా పెరిగిందని లండన్‌లోని పిల్లల వైద్యుడు రోని చుంగ్ అంటున్నారు. కోవిడ్ లాక్డౌన్లు కారణమా? పిల్లల్లో ఈ ఏడాది వైరల్ వ్యాధులు ఎక్కువగా కనిపిస్తుండటం వెనుక కోవిడ్ సమయంలో విధించిన లాక్డౌన్లు కారణం కావచ్చని కొందరు వైద్య నిపుణులు అంటున్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రపంచదేశాలన్నీ లాక్డౌన్లు విధించాయి. చాలా దేశాల్లో పిల్లలను పాఠశాలలకు, నర్సరీలకు పంపలేదు. వారంతా ఈ ఏడాది మళ్లీ పాఠశాలలకు, నర్సరీలకు వెళుతున్నారు. ఇది ఆర్ఎస్వీ, జలుబు, స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా సమస్యలు విజృంభించేందుకు కారణమవుతోందని అంచనా. ఇక కోవిడ్ సోకిన పిల్లల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం వల్ల కూడా ఈ ఏడాది వ్యాధులు ఎక్కువయ్యేందుకు కారణం కావచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ►కోవిడ్ వచ్చిన తొలి ఏడాది బ్రిటన్‌తోపాటు అమెరికా, జర్మనీ ఆస్ట్రేలియాల్లో శ్వాసకోశ సంబంధిత సమస్యలు బాగా తగ్గిపోయాయని.. ఈ ఏడాది మళ్లీ అధిక సంఖ్యలో నమోదవడం చూస్తే కోవిడ్ లాక్డౌన్లను అనుమానించాల్సి వస్తోందని క్వీన్స్ యూనివర్సిటీ వైరాలజిస్ట్ కానర్ బామ్ఫర్డ్ తెలిపారు. జర్మనీలో 2021 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఆర్ఎస్వీ వ్యాధి 2017–2019 మధ్యకాలం కంటే యాభై రెట్లు ఎక్కువగా నమోదైనట్లు.. న్యూజిలాండ్‌లో 2021లోనే ఆర్ఎస్వీ కేసులు ఎక్కువైనట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కోవిడ్‌తో బలహీనతకు రుజువులు లేవు కోవిడ్ సోకితే రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడుతుందని, తర్వాతి కాలంలో వైరల్ సమస్యలు పెరుగుతాయని చెప్పేందుకు ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలేవీ లేవని పిల్లల వైద్య నిపుణురాలు రబియా ఆఘా తెలిపారు. ఈ ఏడాది వ్యాధుల బారినపడ్డ పిల్లలు ఎక్కువగానే ఉన్నా.. వచ్చే ఏడాదికల్లా పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు ఎక్కువని పేర్కొన్నారు. ఏదేమైనా వ్యాధుల నుంచి పిల్లలను రక్షించుకునేందుకు భౌతిక దూరాన్ని పాటించడం, రద్దీ ప్రాంతాల్లో తిరగకపోవడం, మాస్కులు ధరించడం, గాలి, వెలుతురు బాగా ఆడేలా చూడటం అవసరమని అమెరికాకు చెందిన సీడీసీ (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) మళ్లీ హెచ్చరికలు చేయడం మొదలుపెట్టింది. మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది. పొంచి ఉన్న టైఫాయిడ్ ముప్పు భారత్‌లో సమీప భవిష్యత్తులో టైఫాయిడ్ జ్వరాలు విరుచుకుపడే అవకాశమున్నట్టు ప్రముఖ వైరాలజిస్ట్ గగన్‌దీప్ కాంగ్ ఇటీవల హెచ్చరించారు. ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.28 – 1.61 లక్షల మందిని బలితీసుకుంటుండగా.. ఇందులో 40శాతం మరణాలు భారత్‌లో సంభవిస్తున్నవే. ఈ వ్యాధి రక్షణకు టీకా ఉన్నప్పటికీ ఖరీదు ఎక్కువ కావడంతో చాలామంది తీసుకోవడం లేదని.. ఫలితంగా రానున్న పదేళ్లలో మరణాల సంఖ్య రెట్టింపు అవుతుందని, వ్యాధి బారినపడే వారి సంఖ్య ఏకంగా 4.6 కోట్లకు చేరుతుందని ఆమె హెచ్చరించారు. టైఫాయిడ్ టీకాను కూడా సార్వత్రిక టీకా కార్యక్రమంలో చేర్చడం ద్వారా మాత్రమే ఈ ముప్పును ఎదుర్కొనగలమని స్పష్టం చేశారు. టీకా కార్యక్రమాన్ని పటిష్టం చేస్తాం దేశవ్యాప్తంగా తట్టు, ఇతర వ్యాధులు పెరుగుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇవి సీజనల్ వ్యాధులైనప్పటికీ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని ఆయన ఇటీవల హైదరాబాద్‌లో చెప్పారు. టీకాలపై అవగాహన పెంచడానికి, ప్రతి ఒక్కరూ టీకాలు తప్పనిసరిగా తీసుకునేలా చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. -
‘పని’కొచ్చే విద్య కావాలి! ఒక సబ్జెక్ట్‌లో బీటెక్.. సాఫ్ట్వేర్ జాబ్‌లో చేరిపోవడం!
-కంచర్ల యాదగిరిరెడ్డి ♦ ప్రస్తుతం చదివే చదువుకు, చేసే పనికి ఏమైనా సంబంధం ఉంటోందా? ఏదో ఒక సబ్జెక్ట్‌లో బీటెక్ చదవడం.. ఏ మాత్రం సంబంధం లేని సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిపోవడం! ఉద్యోగంలో చేరాక తగిన నైపుణ్యం లేక తడబడుతూ భవిష్యత్‌ను అంధకారం చేసుకోవడం!! ..ఒక్క మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో జరుగుతున్నది ఇదే. ఇక్కడ తప్పు ఎవరిది..? చదివిన చదువుదా, ఉద్యోగాలిస్తున్న కంపెనీలదా అని తరచి చూస్తే.. సమస్య అంతా దశాబ్దాల పాటు నామమాత్రపు మార్పులతో నెట్టుకొస్తున్న విద్యా వ్యవస్థలదే. మరి ఏం చేస్తే బాగుంటుందంటే.. తరగతులను తిరగేయాలని, సిలబస్‌లో సమూలంగా మార్పులు రావాలని అంటున్నారు ప్రొఫెసర్ సంజయ్‌శర్మ. ప్రపంచ ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ అయిన సంజయ్‌శర్మ ‘న్యూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్’ పేరుతో ఈ ఏడాది సెపె్టంబర్లో ఓ విధాన పత్రాన్ని విడుదల చేశారు. అంతేకాదు ఉద్యోగార్హతలు, విద్యా (సిలబస్) విధానాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ఆయన ఓ పోరాటమే ప్రారంభించారు. ఉన్నత విద్యకు– ఉద్యోగ నైపుణ్యానికి మధ్య అంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యకు, ఉద్యోగ నైపుణ్యాలకు మధ్య అంతరం పెరిగిపోతూనే ఉంది. డిగ్రీ లేదా పీజీ పట్టా చేత పట్టుకుని ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోవడం, అక్కడ చేయాల్సిన పనులను సీనియర్లు చెబితే నేర్చుకోవడం, తప్పులు చేస్తూ దిద్దుకుంటూ ముందుకు వెళ్లడంతోనే సరిపోతోంది. ‘‘ప్రపంచంలో 80శాతం మంది ఉద్యోగులది ఇదే పరిస్థితి. అందువల్ల అన్నిరంగాల్లో పరిశోధనలు కుంటుపడుతున్నాయి. అందుబాటులో ఉన్న ఉద్యోగాలతో కాలం వెళ్లదీస్తున్నంత కాలం పరిశోధనల్లో ముందడుగు ఉండదు’’ అని యాపిల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన, మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్ గతంలో పలు సందర్భాలలో ఎత్తిచూపారు. మధ్యతరగతికి భారమవుతున్న ఉన్నత విద్య ఇప్పుడు ఉన్నత విద్య మునుపటిలా చౌక కాదు. బ్యాంకులిచ్చే రుణాలతో చదువుకున్నవారు అప్పులు తీర్చడంతో జీవితాన్ని మొదలుపెడతారు. అమెరికాలో ఉన్నతవిద్యకు అయ్యే ఖర్చు వార్షిక ద్రవ్యోల్బణం కంటే వేగంగా పెరిగిపోతోందని అధ్యక్షుడు బైడెన్ స్వయంగా చెప్పారు. ఈ మధ్యే ఆయన కొన్ని షరతులతో కొందరు విద్యార్థులకు ఫీజు బకాయిలు రద్దు చేశారు. అయినా సరే అమెరికాలో ఇప్పుడు విద్యార్థులపై ఉన్న భారం లక్షా డెబై ఐదు వేల కోట్ల డాలర్లు. రూపాయల్లో చెప్పాలంటే సుమారు కోటిన్నర కోట్లు. చాలా దేశాల్లో ఉన్నత విద్యకు సబ్సిడీలు ఇస్తున్నారు. స్థూల జాతీయోత్పత్తిలో సగటున 2.5 శాతం వరకూ విద్యకు ఖర్చు పెడుతున్నారు. ఇంతఖర్చు చేస్తున్నా ఉద్యోగాలకు తగ్గట్టుగా విద్యను రూపొందించడంపై దృష్టి పెట్టడం లేదు. దీనితో డిగ్రీ/ పీజీ పట్టా పుచ్చుకుని ఉద్యోగాల్లో చేరేవారికి నైపుణ్యాలు ఉండటం లేదని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పలు సందర్భాల్లో ఉటంకించారు. ఈ క్రమంలోనే కంపెనీలు కాలేజీల డిగ్రీలను పక్కనపెట్టేసి ఉద్యోగులకు తమ అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ ఇస్తున్నాయి. ఇదే సమయంలో కొన్ని కంపెనీలు ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలను తగ్గిస్తున్నాయి. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అర్హత అవసరమైన ఉద్యోగాల సంఖ్య 45 శాతం వరకూ తగ్గిపోయినట్టు ఇటీవలి నివేదికలు చెబుతున్నాయి. విద్యా సంస్థలు మాత్రం ఈ సమస్యను గుర్తించడం లేదు. ఎంఐటీ ప్రొఫెసర్ సంజయ్ శర్మ ‘న్యూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్’ పేరిట చేసిన ప్రతిపాదనపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుత సానుకూలతలను కొనసాగిస్తూనే.. ‘న్యూఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్’ ప్రతిపాదిస్తున్న కొత్త పద్ధతి ప్రస్తుత ఉన్నత విద్య విధానంలోని మేలైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. సామాజిక, భావోద్వేగ అభివృద్ధితోపాటు బతికేందుకు అనువైన సంపూర్ణమైన చదువు ప్రస్తుత విద్యావిధానంలోని సావకాశం. ఎట్టి పరిస్థితుల్లో వీటిని కాపాడుకోవాల్సిందే అంటారు సంజయ్ శర్మ. తాము వీటికి మరిన్ని అంశాలను జోడించి కంప్యూటర్ సైన్స్, బిజినెస్ రంగాలకు ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని ప్రతిపాదిస్తున్నామని ఆయన ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ కోసం రాసిన ఒక వ్యాసంలో తెలిపారు. ఈ కొత్త విధానంలో బోధన పద్ధతులతోపాటు నిర్మాణాత్మక బోధన అంశాల్లోనూ మార్పులు చేస్తున్నామన్నారు. మొత్తమ్మీద చూస్తే ఈ కొత్త విధానంలో ‘ఫ్లిప్డ్ క్లాస్రూమ్’ అనేది ఒక అంశం. ప్రస్తుతం తరగతి గదిలో కేవలం ప్రొఫెసర్లు చెప్పే పాఠాలు (సిలబస్‌కు లోబడి) మాత్రమే ఉంటున్నాయి. మొత్తం కోర్సు అవధిలో 95 శాతం ఈ పాఠాలే. మిగతా ఐదు శాతం కంపెనీల్లో ఇంటర్న్íÙప్లు లేదా ప్రాక్టికల్స్ ఉంటాయి. ‘ఫ్లిప్డ్ క్లాస్రూమ్’లో ఏముంటుంది? ఫ్లిప్డ్ క్లాస్రూమ్ ప్రస్తుత విధానానికి భిన్నంగా ఉంటుంది. పాఠాలన్నీ డిజిటల్ రూపంలో ఉంటాయి. విద్యార్థి తనకు కావాల్సిన టైమ్‌లో వాటిని చూసుకోవచ్చు. వాస్తవంగా తరగతి గదిలో ఉద్యోగ సంబంధిత అంశాలపై చర్చలు జరుగుతాయి. నైపుణ్యాల శిక్షణ ఇస్తారు. న్యూఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కోర్సు కూడా నాలుగేళ్లు ఉంటుంది. ఇందులో సెమిస్టర్లకు బదులు 11 ట్రైమిస్టర్లు (త్రైమాసికాలు) ఉంటాయి. ఇందులో నాలుగింటిలో పరిశ్రమకు సంబంధించిన అంశాలను విద్యార్థికి అందజేస్తారు. వీటిని కో–ఆప్స్ అని పిలుస్తున్నారు. పరిశోధనశాలలు, మ్యూజియంలు, ఇతర విశ్వవిద్యాలయాలు, ఐఎంఎఫ్, యునైటెడ్ నేషన్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ కో–ఆప్స్‌లో భాగంగా ఉంటాయి. కంపెనీల ఉద్యోగులు కొందరు తమ ఉద్యోగాలకు తాత్కాలిక విరామమిచ్చి విద్యార్థులతో తమ అనుభవాలను పంచుకుంటారు. ఈ భాగస్వామ్యం వల్ల విద్యార్థికి చాలా లాభాలు ఉంటాయి. పైగా కోర్సు సమయంలోనే విద్యార్థి కొంత ఆదాయం పొందే అవకాశమూ ఏర్పడుతుంది. కో–ఆప్స్ సమయంలో కంపెనీలు విద్యార్థులకు రెమ్యూనరేషన్ చెల్లిస్తాయి. కంపెనీలకు తమకు కావాల్సిన నైపుణ్యాలతో ఉద్యోగార్థులు లభిస్తారు. న్యూఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రతిపాదిస్తున్న కొత్త డిగ్రీలో ఐదారు అంశాలపై క్రెడిట్స్ ఉంటాయి. ఒక్కో అంశానికీ ప్రత్యేకంగా విలువ ఉంటుంది. ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులో లీనియర్ ఆల్జీబ్రా, కంప్యూటేషన్, మెషీన్ లెర్నింగ్‌లతోపాటు నైతిక విలువలు, సామాజిక శా్రస్తాలు కలగలిపి బోధిస్తారు. విద్యార్థులు కోర్సు పూర్తి చేయకపోయినా.. వారు సాధించిన క్రెడిట్లకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కోర్సుకాలం పూర్తయిపోయినా మిగిలిన క్రెడిట్లను ఎప్పుడైనా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. చదువుతూనే.. అప్రెంటిస్‌షిప్.. నిజానికి న్యూఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ప్రతిపాదిస్తున్న కొత్త విద్యావిధానం ఇతర రూపాల్లో కొన్నిచోట్ల అమల్లో ఉంది. ఉదాహరణకు జర్మనీలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సు చదివేవారు కాలేజీలో సగం సమయం మాత్రమే ఉంటారు. తర్వాత సంబంధిత పరిశ్రమలో వారికి ఒకేషనల్ అప్రెంటిస్íÙప్ పేరుతో శిక్షణ అందిస్తారు. అది పూర్తయిన తరువాతే డిగ్రీ లభిస్తుంది. భారత్ విషయానికి వస్తే ఆతిథ్య రంగంలో ఈ రకమైన విధానం అమల్లో ఉంది. ఐహెచ్ఎస్ వంటి సంస్థల్లో కోర్సులు చేసేటప్పుడు కోర్సులో గణనీయమైన సమయం హోటల్స్, రెస్టారెంట్లలో ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది. అమెరికాలోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, మరికొన్ని సంస్థల్లోనూ కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో ఈ రకమైన పద్ధతి అమల్లో ఉంది. ఇప్పుడు శర్మ ప్రతిపాదన అమల్లోకి వస్తే చదవడంతో పాటు నేర్చుకోవాలన్న తపన ఉన్న వారికి ఉద్యోగావకాశాలకు కొదవ ఉండదు. దేశంలో పది మందిలో ఒకరికే నైపుణ్యాలు భారతదేశంలో చదువులకు, ఉద్యోగ నైపుణ్యాలకు మధ్య సంబంధమే లేదని చెప్పాలి. ప్రతి పది మంది పట్టభద్రుల్లో ఒకరికి, ప్రతి ఐదుగురు ఇంజనీర్లలో ఒకరికి, నలుగురు మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లలో ఒకరికి మాత్రమే ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చి చెప్పింది. దేశంలో ఏటా సుమారు కోటీ 30లక్షల మంది ఉద్యోగ మార్కెట్లోకి అడుగుపెడుతుంటే.. వీరిలో అత్యధికులకు నైపుణ్యాలు ఉండటం లేదు. ఎప్పుడో కాలం చెల్లిననాటి ఉద్యోగాలకు తగ్గట్టు విద్యాబోధన ఉండటమే ఈ సమస్యకు ప్రధాన కారణమని ఐఐటీ ఖరగ్‌పూర్ డీన్ జయంత ముఖోపాధ్యాయ స్పష్టం చేశారు. నైపుణ్యాల ఆవశ్యకత గురించి ఐక్యరాజ్యసమితి దాదాపు దశాబ్దకాలంగా చెప్తున్నా భారత్‌లో ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాలు నామమాత్రమే. 2020 నాటి వరల్డ్ ఎకనమిక్ ఫోరం నివేదిక కూడా డేటాసైన్స్, బిగ్ డేటా, మెషీన్ లెరి్నంగ్, ఏఐ, వెబ్ డెవలప్మెంట్, ప్రోగ్రామింగ్ వంటి రేపటి తరం నైపుణ్యాలను ఉద్యోగార్థులకు అందించాలని సూచించడం గమనార్హం. రెండేళ్ల క్రితం విడుదలైన జాతీయ విద్యా విధానం కూడా పిల్లలకు ఆరో తరగతి నుంచే వృత్తి నైపుణ్యాలను అందించాలని.. ఇంటర్న్షిప్స్ ద్వారా విద్యార్థులకు ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలను ముందుగానే అందించాలని సిఫార్సు చేసింది.